ఆశకి ఆనందానికి మధ్య దూరం

Spread the love

దాదాపు 30 సంవత్సరాల క్రితం కోస్తా ఆంధ్ర ప్రాంతం మొత్తం రైతులు వారి పంట పొలాలను, వ్యవసాయ భూములను  చేపల చెరువులుగా మార్చి మార్కెటింగ్ వ్యవస్థలో ఓ సంచలనాన్ని తీసుకొచ్చారు. ఆక్వా ఫిషింగ్ కల్చర్ కి అగ్ర తాంబూలం ఇచ్చారు.

        ఆ కాలంలో చేపల చెరువులను తవ్వడం, చేపలని పెంచడం ఓ పాషన్.

ఉభయగోదావరి, కృష్ణ జిల్లాల్లో ప్రారంభం అయిన ఈ చేపల పెంపకం కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ అంతా ఓ విప్లవంలా కొనసాగింది. ఈ విప్లవాన్ని ‘నీలివిప్లవం’ అని కూడా అంటారు.

 ఆ ప్రాంతంలో రైతులు ఎంతో కష్టపడి ఆరుగాలాలు పండించే వ్యవసాయాన్ని వదిలి చేపల మార్కెట్ ఉద్యమంలో పాత్రధారులుగా మారి ముతక దుస్తులు వదిలిన వీరు,  ఐకానిక్ హై క్లాస్, రిచ్ రైతులుగా దర్శనమిచ్చారు. ప్రపంచ వేదికపై నీలివిప్లవం జెండా ఎగురవేశారు.

 ఇలా వ్యవసాయ భూములు మాయమై సన్నా, చిన్నకారు రైతులంతా  చెరువులు తవ్వడంలో, భూమిని లీజులు తీసుకోవడంలో, బిజీ అయ్యాక, పల్లెటూర్లు కూడా కాంక్రీట్ భవనాలతో, పెద్ద పెద్ద భవంతులతో దర్శనమిచ్చాయి.  అలాగే ప్రతి ఇంటి ముందు హోదాకి తగ్గట్టుగా కార్లు, బుల్లెట్ బండ్లు వచ్చి చేరాయి. విదేశీ ప్రయాణాలు,  విహారయాత్రలతో బిజీ అయిపోయారు రైతులంతా.  డబ్బు వరదలా వచ్చి చేరింది.

    రైతుల జీవితాల్ని తలకిందులు చేస్తూ ఈ ఆక్వా కల్చర్  ఓ మాయా ప్రపంచాన్ని సృష్టించింది. ఉద్యోగస్తులు వారి జీవితాలకు ఇరుసు వంటి ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చేసి ఉన్న కాస్త కూస్తో పొలాన్ని చెరువులుగా తవ్వుకొని ఎందరో రైతులు లాభాలు సాధించినట్లే, అనేక మంది రైతులు నష్టాల పాలయ్యారు.  పెత్తందారీ వ్యవస్థలో భాగమయ్యారా ఈ మధ్యతరగతి జీవితాలు అంటే అదో పెద్ద ప్రశ్నార్ధకమే!!.

 ఈ పరిస్థితులను ఆధారంగా చేసుకుని

 పి. చంద్రశేఖర్ ఆజాద్ గారు రాసిన ‘గట్టుమీద చేప‘  నవల చతుర నవలల పోటీల్లో గెలిచి ఎంతో ప్రాచుర్యం పొందింది. 

       ఈ నవలలో  దుఃఖానికి – ఆనందానికి మధ్య మనిషి చిక్కుకున్నప్పుడు ఏది సుఖాన్నిస్తుందో ఏది సంతోషాన్నిస్తుందో, దుఃఖానికి ఆనందానికి, ఆశకి అత్యాశకి మధ్య భేదం పసిగట్టలేక మధ్య తరగతి జీవితాల్లో వచ్చిన కుదుపుకు వారి జీవన విధానాల్లో వచ్చిన మార్పు  వారిని ఏ గమ్యం చేర్చింది. సామాజికపరంగా కలిగిన మార్పులు ఏమిటి? వివరిస్తూనే అవసరమైన తాత్విక చర్చను తీసుకుని వచ్చి రాసిన నవల ‘గట్టుమీదచేప’

 ఈ కథలో రవీంద్ర ప్రధాన పాత్రగా నడుస్తుంది. ఇంజనీరుగా పనిచేసే రవీంద్ర.

శ్యామ్ ఆక్వా కల్చర్ లో డబ్బు బాగా సంపాదించిన వ్యక్తి.

శ్యామ్ డబ్బు హోదా రవీంద్రకు ఆకర్షణ కలిగిస్తాయి.

డబ్బు ఎవరికి చేదు!? ఈజీ మనీ  మనిషి గమ్యాన్ని నడకను ఎలా మార్చిందో వివరించిన నవల ఈ ‘గట్టుమీద చేప ‘

 “నాకు ఇంత డబ్బు హోదా ఉన్నా కూడా లేని సంతోషం చిన్న జీతంతో నీకు ఎలా వస్తుంది” అని స్నేహితుడు అడిగిన ప్రశ్నకు ఆలోచనల్లో పడతాడు రవీంద్ర.  ఈ నవలకు మూలం ఈ వాక్యం.   కథను ఆసాంతం నడిపించే వాక్యం.

  ఈజీ మనీ కి అలవాటు పడ్డ మనిషి మంచి చెడు ఆలోచనలు కలిగి ఉంటాడా!! అలవాటు లేని, అవసరానికి మించిన ధనం వ్యసనాలకు దారితీస్తుంది. ఆ వ్యసనాలు మనిషిని నిలువునా దహించి వేస్తూ,  ఫాల్స్ ప్రెస్టీజ్ లోకి మనుషులు నెట్టివేయబడతారు గౌరవం, హోదా అంటూ వ్యసనాలకు బానిసలు అయ్యారు. డబ్బు ఉన్న చోట మందు, జూదం మకాం వేస్తాయి.  ఇవన్నీ ఆక్వాకల్చర్ లో భాగమయ్యాయి.  రైతుల జీవితాలను అల్లకల్లోలం చేశాయి లాభపడ్డవారు లాభపడితే, పూర్తిగా నష్టాలపాలై తిరిగి వెనుకటి జీవితంలోకి వెళ్లలేక అనేకమంది ఆత్మహత్యలకు ఈ ఆక్వా కల్చర్ దారితీసింది.

డబ్బు సంపాదించవచ్చు అన్న ఆశతో అనేకమంది తమ వ్యవసాయ భూములను చెరువులుగా మార్చడం జరిగింది.

 ఓ మధ్య తరగతి రైతు చేపల చెరువుని తవ్వించడానికి బ్యాంకులు ఎంత సహకారాన్ని అందించాయో చెబుతూనే అవి అందించిన సహకారంతో నష్టపోయిన వారెందరూ! లాభపడ్డ వారేందరూ! అన్న ప్రశ్న మనకు ఎదురవుతుంది.

 చెరువులు తవ్వించగానే సరిపోతుందా ఆ చెరువుల నిండా ఊరిన నీళ్లు  ఉప్పునీటిగా మార్పు చెంది భూమి అడుగున పొరల్లో మంచినీళ్లు కరువై ఆ ప్రాంతం అంతా నీళ్ల ట్యాంకుల పైనే ఆధారపడ్డాయి. ఆ చేపల పెంపకంలో మెలకువలు గురించి, ఏ కాలంలో ఏ బ్రీడ్ చేపలని పెంచుకోవాలి అలా పెరిగిన చేపలు మార్కెటింగ్ చేయడానికి ఎంత మంది రైతులకు తెలుస్తుంది అనేకమంది రైతులు కష్టపడి సంవత్సరకాలం పెంచిన చేపలను మార్కెట్కు తరలించే అప్పుడు మార్కెట్ శక్తులు గద్దల్లా డబ్బు దండుకునే అందుకు రైతులను ఎలా మోసపుచ్చుతారో. తెలియజేస్తూనే ఆక్వా కల్చర్ లో భాగమైన మందు, పేకాట వంటి వ్యసనాలు కుటుంబాల్ని ఎలా చిన్నాభిన్నం చేశాయో  వివరించారు కథలో.

 దానితోపాటు ఎదిగిన చేపలను మార్కెట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త మనుషుల పరిచయాలు మనుషుల్లో తీసుకొని వచ్చే అనేక మార్పుల గురించి ఈ నవల చర్చిస్తుంది. ఎక్కడైనా ఒక వ్యాపారం మొదలైంది అంటే ఆ వ్యాపారం చుట్టూ అనేక తీగలు అల్లుకున్నట్టు ఓ వ్యవస్థ దాని చుట్టూ అల్లుకుపోతుంది. ఈ ఆక్వా కల్చర్ కూడా గుత్తాధిపత్యం చేతుల్లో చిక్కుకుపోతుంది.

 రవీంద్ర తాను తవ్వించిన చేపల చెరువులో వచ్చిన లాభాలతో సంతోషించక ఇంకా సంపాదించే అవకాశాన్ని వెతుకుతూ నిద్రకు, సౌఖ్యానికి దూరమై ఆలోచనల బేతాళుడిని వెంట మోసుకు తిరుగుతాడు రవీంద్ర. మంచి చెడుల మధ్య విభేదాన్ని గమనిస్తూ మనుషుల్లో వచ్చే వింత వింత మార్పుల్ని గురించి స్పష్టంగా ఈ నవల తెలియజేస్తుంది

 డబ్బుతో మరో ప్రమాదం కుటుంబ వ్యవస్థను దెబ్బతీసింది మనుషుల మధ్య దూరాలు పెరిగి ఎవరికి వారు పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకోవడంలో పోటీ పడతారు.

రవీంద్ర -వసుంధర లు తమ బిడ్డను చూసుకోవడంలో అలసత్వం బిడ్డను సంరక్షించడం అంటే హాస్టల్లో ఉంచి గొప్పగా చదివించడం నలుగురు చెప్పుకునేలాగా హోదాను ప్రదర్శించడం, షేర్ మార్కెట్లో షేర్లు కొనడం కల్చర్ గా భావిస్తూ.. బతకడం వలన వాళ్ళు కోల్పోయిన ప్రశాంతత తిరిగి సంపాదించుకోగలిగేరా అనేది ఈ నవల ముగింపు.

 నాకు తెలిసి ఆక్వాకల్చర్ మీద తెలుగులో వచ్చిన మొదటి నవల ఇది… ఇందులో చేపల పెంపకం దగ్గర నుంచి మొదలుపెడితే ఆ చేపల వల్ల ఎలా మేత వెయ్యాలి. ఎంత పాళ్ళలో వేస్తే ఆ చేపల ఎదుగుదల మంచిగా ఉంటుంది, ఆ చేపలచెరువు వలన కలిగే రోగాలు మనుషుల్ని ఎలా ఇబ్బంది పెడతాయి., ఆ పెంపకంలో ఉండే సమస్యలు సమస్యల చుట్టూ మనుషులు ఎలా బంధించబడతారు.  బంధాలు వీగిపోయే క్షణంలో కూడా ప్రేమ సాన్నిహిత్యము వారిని ఎలా దగ్గరగా చేసి చూపిస్తుంది . ఇవి అన్ని ఈ నవల లో భాగమవుతాయి.   ఆక్వాకల్చర్ నోట్ చేసి చాలా సరళమైన పదాలతో వున్న ఈ నవల అందమైన కవర్ పేజ్ తో రెండవ తారీకు సాయంత్రం పుస్తకావిష్కరణ జరుపుకుంటుంది.

 అభినందనలు చంద్రశేఖర్ ఆజాద్ గారు.

రూపరుక్మిణి. కె

నవల -గట్టుమీద చేప

 రచన-  పి చంద్రశేఖర్ ఆజాద్

 పబ్లికేషన్స్- ఎన్నెల పిట్ట

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *