మనిషి మనుగడే విచిత్రమైనది. కాలంతో పోటీ పడుతూ ఆ కాలాన్నే శాసించాలని ప్రయత్నించే మనిషి. తాను బ్రతికున్న కాలాన్ని కూడా తనకోసం అనుభవించలేనంత తపనతో జీవిస్తాడు.
జీవించాలన్న తపనే లేదు అంటూ జీవితపు పరమార్ధాన్ని వెతుక్కునే ఎన్నో మూగజీవులు మన చుట్టూ, మనలోనూ ఉంటారు. అటువంటి ఒకానొక మనిషి మనసు పడే కలతే “నరుడి బ్రతుకు నటన “ పుస్తకం, ఓ చిన్న నవలిక.
గమ్యాన్ని వెతుకుతూ ఓ 30 ఏళ్ల యువకుడు చేసే ప్రయాణం ఈ నవలిక. అతన్ని ఏ తీరం చేర్చిందో అసలు ఆ ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి చివరి పేజీ దాకా.
ఈ పుస్తకం మొత్తం మీద మాట్లాడేది ఒక్కటే పాత్ర, కానీ వినిపించేది మాత్రం రెండు పాత్రలైతే, కంటికి కనిపించేవి మాత్రం అనేక పాత్రలు మన కళ్ళ ముందు కదిలిపోతూ ఉంటాయి. ఏదో ఒక మూల సహజ, అసహజ ఆలోచనలలో నుండి మనల్ని పలకరిస్తాయి ఇందులోని కొన్ని సన్నివేశాలు.
ఒక మనసున్న మనిషి తన వెంట బరువైన నవ్వుని మోస్తూ తిరగడం అంత తేలిక కాదు. ఆ నవ్వు ఎవరి కోసం మోస్తాడు తన వారి కోసమా!? తనని ప్రేమించే వారి కోసమా!? ఎవరికోసం ఆ ముసుగు తొడుగుతున్నాడు, వేసిన ముసుగు తనకోసం తానైనా అద్దం ముందు నిలబడి తీయగలడా ఈ ముసుగుని.!? అనేది వేల సమాధానాలకు ఒకే ఒక్క ప్రశ్నగా మిగిలిపోతుంది. సమాజం ముందు వేసుకున్న ముసుగు తీయగలడా? తీయగలుగుతామా అలా తీసినప్పుడు బ్రతుకు పరమార్ధాన్ని ఆస్వాదించగలుగుతామా.. ఇలా ఆలోచన కలిగించగలిగింది ఈ నవల.
మనతో మాట్లాడేవి రెండు పాత్రలు. ఒకే పాత్రకి ఉన్న రెండు ముఖాలలాంటివి. నాకు ఎవరూ లేరు అని అనుకునే మనిషి తనలో తాను ఎన్ని బంధాలకు ముడి వేసుకొని ఉంటాడో చెప్పడానికి ప్రయత్నం చేశారు రచయిత కవనమాలి.
విచిత్రమేమంటే మనిషి మనసు ప్రతి పాత్రలో ఇమిడిపోతుంది. తనది కాదంటుంది, తనకు వద్దనుకుంటుంది. కానీ అందులోనే,ఆ పాత్రలోనే ఏదో ఒక మూల దాక్కొని తనని తాను వెతుక్కుంటుంది. అది బాల్యం వీడని చంటి బిడ్డ ముఖంలో కావచ్చు, వెంపర్లాటని వెతుకులాడే శరీర చాపల్యము కావచ్చు, కన్నవారికి కట్టుకున్న వారికి న్యాయం చేయాలన్న దుఃఖపు జీరా కావచ్చు ఏదైనా అంతర్మథన యాత్ర ఈ యాత్రలో యువకుడు అనుకున్న గమ్యాన్ని చేరాడా! అసలు అతని గమ్యం ఏమిటి అతనికి ఎదురైన మనుషులు ఎవరు. వారితో కలిసి చేసే ప్రయాణంలో అతను నేర్చుకున్నది ఏమిటి. అని చెప్పడానికి చక్కని పాత్రలని ఎంచుకున్నారు రచయిత కవనమాలి.
కులాంతర వివాహం చేసుకున్న తమ్ముడిని వెలివేసేది తన గొప్పను ఈ సమాజం ముందు నిలబెట్టుకోవడానికే అని అతని లోపలి మనిషికి తెలిసినా…ఈ సమాజం ముందు తమ్ముడిపై ద్వేషాన్ని వెదజిమ్మి, మరో ముఖంలో మమకారాన్ని వదులుకోలేని అంతరాత్మ అతన్ని నిరంతరం వేంబడిస్తుంటే అతను తొడుక్కునే ముసుగు ఓ నాటకం.
ప్రేమించిన వ్యక్తిని వదులుకుని తల్లిదండ్రుల మెప్పుని పొందిన వాళ్లు జీవితాంతం వేసుకు తిరిగే ముసుగు ఓ నాటకం.
ఎవరినైనా నా అంత బాధ్యతగా మరెవ్వరు వుండరు, నేను ప్రేమించిన అంత బాగా ఎవరు ఎవరిని ప్రేమించరు, ఇంతకంటే కష్టం మీకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు తొడుక్కోవాలని చేసే ప్రయత్నం ఓ నాటకం..
మరణం చెప్పే మంత్రం పశ్చాత్తాపం… అది ఎందరి దగ్గరకి చేరుతుంది. ఆ సమయంలో వారు పడే వేదన నిజంగా తప్పుకి బలి అయిన మనిషిని చేరుతుందా. బ్రతికుండగా అన్ని సక్రమంగా ఉండే వయసులో చేసిన తప్పులు వృద్ధాప్యం కప్పిపుచ్చగలుగుతుందా అప్పుడు వచ్చే మనోవేదన ఓ నాటకం.
ఇలా ఈ పుస్తకంలో అనేక పార్శ్వాలు కలిగిన భిన్న ఆలోచనలన్నీంటిని ఒక సమాహారంగా చేర్చి ఒకరి మనసులోని ఆవేదనగా మార్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు కవనమాలి
సింపుల్ అండ్ క్రిస్పీ టు రీడ్ దిస్ బుక్
~
పుస్తకం పేరు: నరుడి బ్రతుకు నటన
రచయిత: కవనమాలి
తెలుగు కలెక్టివ్ ప్రచురణలు











