రెండు పడవల పైన ప్రయాణం

Spread the love

 ఒక వ్యక్తి తన ప్రయాణ కాలాన్ని జీవితానికి అనువర్తింప చేస్తూ తనకు తానుగా చెప్పుకునే గమనం ఈ కథ.

 ఒక స్త్రీని ముఖ్య పాత్రగా చేసుకుని సాగే కథా గమనం ఈ నవలిక.

     ఎప్పుడు, ఎవరు,ఎవరికి ఎదురవుతారు?

 కాలం వెంట పరుగుపెడుతూ, పోటీ పడుతూ పరిస్థితులకు ఎదురీదడం ఓ సైనికుడి ప్రథమ లక్షణం. ఇక్కడ సైనికుడిగా మనకు మొదట పరిచయం అయ్యే వ్యక్తి “ ప్యాటర్ ఆండ్రేయిచ్”  ఇతనో యుద్ధ వీరుడు, పదిహేడేళ్ల  వయసుకి యుద్ధ విద్యను నేర్చుకోవడానికి ‘ఒరేన్ బర్గ్’ ప్రయాణమయ్యాడు.

   కత్తికి రెండు వైపులా పదునున్నట్టు,  ఓ యుద్ధ వీరుని జీవితంలోకి ప్రేమ వచ్చి చేరుతుంది. యుద్ధంలో ప్రేమ ఉందో, ప్రేమే యుద్దమైందా! అంటే!  తెగిపడిన తలలను, విడిపడిన దేహాలను,  చేరుకోలేని దూరాలలో ఉన్న మనుషులను,  అగాధాల అంతరాలని,  చూపిస్తూ…  దూకుడుగా దూకే ప్రళయంలా కాలంలోని ప్రతి క్షణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ నడుస్తుంది ఈ నవల ప్రయాణం.

   ఒక్కసారి కూర్చుని చదివితే ఎక్కడ ఆస్వాదించలేనేమో అని రోజుకి కొంత, కొంతగా కొసరి కొసరి చదివాను. పేజీల మధ్య పట్టుబడిన పాత్రలలో జీవం వచ్చినట్టు ఆ సంభాషణల మధ్య మనం చేరిపోయామేమో అనిపించింది.

మాషా- నవల అలెగ్జాండర్ పుష్కిన్ 200 ఏళ్ల క్రితం రాసిన అక్షరం నేటికీ ఆనాటి యుద్ధ కాలాన్ని మన కళ్ళముందు తాజాగా నిలిపింది. “నెత్తురోడుతున్న కోట గోడల మధ్య ప్రేమ అనే శీతల గాలులు” ఎలా ఆవరించి ఉన్నాయో చదువుతున్నప్పుడు ఇది అక్షరాల మాయలోని మహత్తో, అనువాదకునికి అందిన అక్షరాల మర్మమో ఏదైతేనేం మనల్ని మాత్రం ఆ కాలానికి తీసుకెళ్లారు.

     కథలోకి వెళ్తే యుద్ధ విద్యను అభ్యసించడానికి వెళ్లిన ప్యాటర్ కు కెప్టెన్ ఇంటనే వసతి దొరకడం, క్యాప్టన్ కూతురు మాషాతో పరిచయం అవడం ఆ వ్యక్తి జీవితంలో యాదృచ్ఛికమే అయి ఉండవచ్చు.

     నిక్కచ్చిగా నిజాయితీగా బ్రతికే ‘ఒరెన్ బర్గ్ ‘ -కెప్టెన్ ప్యాటర్ కి యుద్ధ కౌశలాన్ని నేర్పించే క్రమంలో రాజ్యంలో జరిగే మార్పులు వారి యుద్ధ కౌశలానికి పరీక్ష పెడతాయి.

   ‘ పుగచొవ్ ‘  అనే ఓ సాధారణ వ్యక్తి, నాగరికత చట్టాలకు లోబడి బ్రతకలేక రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు దారునిగా మారి రాజ్యాన్ని ధిక్కరించిన సాహసవంతుడు. అనుచర గణాన్ని నిర్మించుకోగల రాజనీతి తెలిసినవాడు, క్రూరత్వం రాజ్యం పట్ల, ఆ దేశ పాలకుల పట్ల  అతనిలో ఉందేమో కానీ ప్రజల సహకారం మాత్రం అతనికి అనుకూలంగానే ఉందనిపిస్తుంది.

      అటువంటి వ్యక్తి యుద్ధ గాయాల నుండి తప్పించుకునే క్రమంలో యవ్వనవంతుడైన ప్యాటర్ ప్రయాణంలో ఎదురుపడతాడు. ఆ రాత్రికి ఆ ఇద్దరూ కలిసి చేసిన ప్రయాణం ఆ ఇద్దరి జీవితాల్లోనూ గొప్ప మార్పులు తెచ్చిపెడుతుంది.

 ఇక్కడ హీరో ప్యాటర్ వ్యక్తిత్వం ఎంత బలమైన కోట గోడలా నిర్మించబడిందో..,  అందుకు పదిరెట్లు ‘పుగచోవ్’ అనే తిరుగుబాటుదారుడి   వ్యక్తిత్వం సరిసమానమైన భాగాన్ని అందుకోవడం ఈ నవలలో ప్రత్యేకత.

 మనిషి మనసుకి మించిన నిజాయితీ లేదన్నది ఈ కథలోని ముఖ్యంగా మనం చూడగలిగే నియమం.

 ఓ తిరుగుబాటు దారినిగా పుగచోవా నిలబడ్డ ప్రతిసారి ప్రభుత్వాధికారులు తిరుగుబాటుదారునికి మధ్య నలిగిపోయిన యుద్ధ సైనికుడు ప్యాటర్.

     తన మనసుకు మెచ్చిన ప్రేయసి మాషా ని దక్కించుకోగలిగాడా, ప్రభుత్వం మెచ్చిన యుద్ధ సైనికుడుగా పేరు తెచ్చుకున్న ప్యాటర్ తాను రక్షణగా ఉండే కోట యుద్ధంలో శత్రు సైనికులకు చిక్కుబడినప్పుడు, శత్రు శిబిరంగా మారిన క్రమంలో, ఆ తిరుగుబాటుదారులందరి చేతుల్లోనుండి ప్రేమించిన మనిషిని రక్షించుకోవడానికి అతనికి ఉన్న ఆయుధం నిజాయితీ ఎంతవరకు ఉపయోగపడింది అన్నదే ఈ నవలకు బిగి.

 అయితే ఇక్కడ ప్రేమను పొందాలనుకునే ప్రేమికుడిగా తాను నమ్మిన యుద్ధ నియమాల్ని యుద్ధ సైనికుడిగా ప్రభుత్వం పట్ల విధేయతను చూపే సైనికుడిగా తిరుగుబాటుదారుల చేతికి చిక్కుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడమే కాక,  ప్రేయసిని రక్షించుకున్న అతనిని రాజ్యం ఆదరించిందా మరి?!   ఎక్కడైనా శత్రువు చేతికి చిక్కిన ప్రభుత్వ సైనికుడిని ప్రాణాలతో వదిలి పెడుతుందా అటువంటి ప్రాణాన్ని మరి ప్రభుత్వం బ్రతకనిస్తుందా?! అలా శత్రువు ఓ సైనికుడిని ప్రాణాలతో వదిలిపెట్టడాన్ని ప్రభుత్వం అంగీకరిస్తుందా?!

ఇలా ప్రభుత్వాధికారానికి, తిరుగుబాటుదారునికి మధ్య మాషా – ప్యాటర్ లు ఎలా చిక్కుబడ్డారు, ఈ కథ మొత్తంలో మాషా పాత్ర ఎంత కీలకమవుతుందో కథని మలుపు తిప్పే క్రమంలో మాషా ముఖ్య కథగా మారుతుంది.

  ఇలా ఇంట్రెస్టింగ్ గా సాగే కథ ముగింపుకొచ్చేసరికి హడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. అలాగే మాషా కి కోట లోపలికి అంత తేలికగా ఎలా ప్రవేశం దొరికింది అన్న విషయాన్ని అనువాదకుడు పక్కకు పెట్టారా అనిపించినా కథ ఎక్కడ ఆగినట్లు ఉండదు .

   చివరి వరకు మాషా – ప్యాటర్లు కలిసారా? వారి ప్రేమ నిలబడిందా!? ప్రభుత్వం వీరి ప్రేమకు అభిషేకం చేసిందా!  మరణదండన విధించిందా! అన్నది కథలోని మరో ట్విస్ట్.

 ఇలా మొత్తం నవల అంతా ఉత్కంఠంగా సాగే ప్రణయ గాధ ఆనాటి కాలం గుర్రపు బగ్గిల్లో యుద్ధక్షేత్రానికి –  మనిషి మానసిక సంఘర్షణకి మధ్య జరిగే అంతర్యుద్ధానికి వారధిగా రెండు పడవల మీద ప్రయాణంలా  ఈ నవల మనల్ని చదివిస్తుంది.

 మీరు చదివి చూడండి మీ అనుభవాన్ని పంచుకోండి.

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *