కొన్ని ప్రయాణాలు బావుంటాయి మనుషుల మధ్య నడుస్తూనే చుట్టూ పరిసరాల ఆంతర్యాన్ని నాడి పట్టి చూడటం ఆ పరిసరాలతో ముచ్చటించడం అవి చెప్పే కబుర్లు వినడం నా మటుకు నాకు నచ్చుతుంది. ఏది ఏమైనా కాలం చేసే చెల్లుబాటుకు అందరం బంధీలమే.. అలా శ్రీ ఊహ కూడా బందీనే అనుకుంటా..
చరిత్ర పేజీలు తవ్వి తిరగేసి మురిసిపోతూ ఉంటాం, కన్నీటి పర్యంతం అవుతాం, అప్పుడప్పుడు కాలం మరిచిపోయి ఆ సమయానికి చిక్కు పడ్డ ముడులవుతాము. ఎప్పటికప్పుడు అన్వేషణలో పాత్రలవుతాము. ఏది ఏమైనా ఓ కథ చదువుతూనో, నవలికను చదువుతూనో, ఓ బ్రమణ వాతావరణంలోనుండి విభ్రమలకు గురి చేసే అంశాన్నో చూసి వెలికి వచ్చినప్పుడు పడే ఉద్వేగాలని ఇప్పుడు నా చేతుల్లోని బల్కావ్ కథల్లో అక్కడక్కడ చూశాను.
అలా చూడడం వెనక మధుబాబు కథాగమనానికి అలవాటు పడ్డ ఉనికి కనిపించింది, ఖదీర్ బాబు కథల్లోని నడక స్పురించింది, మాంటో కథలు చదువుతున్న క్రమంలో కనిపించే విశ్లేషణ ఆవరించుకుంది. ఇలా చెప్పాలంటే కొన్ని కథల్లో ఆర్జీవి కనిపించాడు. నా మటుకు నాకు ఈ కథలన్నీ ఒక్కో కథలో ఒక్కో విశేషణాన్ని పట్టుకు తెచ్చి మన ముందు నిలబెడతాయి.
బాల్కనీలో నుండి కూడా ప్రపంచాన్ని అనుకున్న కోణంలో చూడాలనుకోవడం, చూడడం మధ్య తరాల అంతరాన్ని చాలా చక్కని అభివ్యక్తితో గోవా వీధుల్ని, అక్కడి ఐస్క్రీమ్ రుచికి పరిచయం చేస్తుంది. ఆ మెండైన రుచి మొగ్గలు విశేషంగా ఆకట్టుకుంటాయి. టేస్ట్ బర్డ్స్ చచ్చిపోకుండా ఉండాలంటే జీవితాన్ని ఎంత నియమ, నిబంధనల మధ్య బందీని చేసుకోవాలో చెప్పిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.
పక్కనున్నోడిని బాగు చేయలేని ధర్మం మనకెందుకు? అని నిలదీసే… ‘చాయనులు’ మనల్ని తప్పక ఆకట్టుకుంటాడు. జీవితపు శకలాల మధ్య “శాంతియుతంగా చంపేశారు ఓ దళితుడిని “ అన్నమాట జర్నలిజంలోని ధర్మాగ్రహాన్ని, రెండు గంటల్లో ఊరు చుట్టుకొచ్చి జేబులో పెట్టుకొని పోయేటి మనసు వ్యధ కనిపిస్తుంది. ‘పరావర్తనంలో’..
ఆది కథలో ఆదివాసీల ఆత్మఘోష వినపడుతుంది. అడవుల్ని ఖాళీ చేయడం వెనక కన్నీటి గాథలు కనిపిస్తాయి, మాయమైన శవాల గుట్టలు కథలుగా వినిపిస్తాయి.
“ తరానా “ చదువుతున్నంతసేపు మాచాలదేవి మన కళ్ళ ముందు నాట్యం చేస్తుంది. అచంచలమైన రాజ భక్తి, అకుంఠిత దీక్ష మనల్ని కట్టి పడేస్తాయి. టైం ట్రావెల్ చేసిన ఫీలింగ్ తప్పక ఉంటుంది.. .
ధూల్పేట ‘విమల్ ‘ జీవితాన్ని ఓ సినిమా చూస్తున్నట్లు చూసి వస్తాము. జార్జి మరణానికి కారణం ఎవరైనా,.. ఇక్కడ మాత్రం విమల్ ‘ఓ హంతకుడు’. అనే విషయాన్ని రీడర్ కి చేరవేయడంలో ఊహ సక్సెస్ అయ్యారు.
ఒంటరి జీవితంలో తోడును వెతుక్కోవడం, ఆ తోడుని తోడ్కోని పోవడంలోని కాన్ఫిడెన్స్ ‘ముడుపు’ కట్టి చూపిస్తుంది.
మనుషులు మనసులు ఒద్దిక కావడానికి ఎంతో సమయం అవసరం లేదు. షారన్ నిజ జీవితాన్ని చూసుకోవడానికి, కొత్త ఆలోచనలు అందుకోవడానికి, వాటిని అమలుపరచడానికి అట్టే సమయం అవసరం లేదని చెప్పే కథ., ఎర్రటి గులాబీల తివాచీ పైన నడవడం ఎంత కష్టమైన అనుభవమో చూపించే ‘బర్కత్’ , జైపూర్ వీధుల్లో పరదా చాటు మిగిలిపోయిన చీకటి జీవితాలు ఇంకొన్ని ఎదురవుతాయి మనకు.
బల్కావ్ అంటే బాల్కనీ అని మనబాల్కనీ నుండి మనల్ని శ్రీ ఊహతో తీసుకుని వెళుతుంది మనమూ కొన్ని ప్రయాణాలు చేసి వస్తాం. బాగుంటుంది.
ఇక్కడ కథల్లో చదివించే లక్షణం బావుంటుంది.
ఊహగారి కథా శైలి ఒక్కో కథలో ఒక్కోలా ఉంది.
ఈ కథలన్నీ మనల్ని ఆకట్టుకుంటాయి..
