చరిత్రలో మిణుగురు పూల వెలుగు

Spread the love

మనసు ఇక్కడే ఉంటుంది మనిషి మాత్రం ఏడేడు లోకాలు చుట్టి వస్తుంది. అలా మనసు కోరుకున్న చోటుకెల్లా వెళ్లడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. ప్రతి ఒక్కరికి ఒ కల ఉంటుంది. చిటికెడు కంటి చెమ్మ కూడా నేల చేరకూడదు అనుకునే వారి కలలు కొందరివైతే, మరికొందరు నేల విడిచి సాము చేయలేము అనుకునే వారి ప్రయాణాలు కొందరివి. అటువంటి ప్రయాణాల్లో ఇది ఒకటి.

        ప్రయాణం అనగానే సాధారణంగా సుదూర తీరాలు, కొండ కోనల్లో సెలయేటి పరవళ్లు, పుణ్యక్షేత్రాలు,గొప్ప గొప్ప నగర నిర్మాణాలు చేయబడిన సందర్శన స్థలాలు, పురాతన కట్టడాలు ఇవన్నీ ఒక్క సెకను కాలంలో మన మనసుని తాకి వెళుతూ ఉంటాయి. ప్రయాణం అన్న తలంపుకే.

        ఇక్కడ ఒకరి జీవిత ప్రయాణాన్ని, ఆ ప్రయాణంలో అందుకున్న,  ఎదురైన, ఎత్తు పల్లాలని గమనింపులోకి తీసుకొని రాసిన పుస్తకం ఇది.   అయితే ఈ ప్రయాణం కాస్త వేరు.  ఈ ప్రయాణం చారిత్రక కాలాన్ని మరియు అందులోని,  ముఖ్య ఘట్టాలని వివరిస్తూ… వాటి ఆధార భూతమైన శాసన నిర్మితాలను వెతుకుతూ వెళ్లే ముళ్ళ దారి ఇది. చెప్పుకున్నంత ఆనందంగానో,  అందంగానో ఈ ప్రయాణం ఉండదు.  చరిత్రకు ఆధారాలు సేకరించడం అనేది ఓ తపస్సుతో చేసే పని. మన చుట్టూ ఉన్నచాలామంది పని ఉద్యోగ ధర్మంగా చేసేవారే ఎక్కువ. అలా కాకుండా చేసే పనిలో నిమగ్నమై, ఆ పనిలో జీవితాన్ని వెతుక్కోవడం.. చేసే పని పట్ల నిబద్దత, వాస్తవాన్ని వెతుకుతూ వెళ్లడమే ఓ తపస్సుగా చేసిన ఓ మహానీయుని జీవితాన్ని మన ముందు నిలబెట్టారు. అడవాల శేషగిరి రాయుడు (అశేరా).

         కథలు,విశ్లేషణలను సమర్థవంతంగా రాయగలిగిన కలం అశేరా ది. అటువంటి కలం ఈ చారిత్రక గమనాన్ని,  అక్షర జ్ఞాపకంగా  మలిచారు. అందుకు కారణమైన ఆర్కియాలజిస్ట్ విజయ్ కుమార్ జావేద్ గారు పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వీరితో ఏర్పడ్డ పరిచయమే  చరిత్రను తవ్వి తీసే పనుల్లో భాగంగా చేసిన ప్రయాణాలను ఈ పుస్తకంగా మలిచారు.

    పురాతన ఆలయాలు, కోట బురుజులు, శిల్ప సౌందర్యం, రాతి కట్టడాల వెనక ఎందరి జీవ చక్రాలు ఈ కాలపు మట్టిలో కలిసిపోయాయో…!!?  అని వెతకడం మామూలు విషయం కాదు నా దృష్టిలో.

     వీరి ప్రయాణం కంబగిరి నరసింహస్వామి దేవస్థానం నుండి మొదలు పెట్టారు. అక్కడ దొరికిన ఓ రాగి నాణాన్ని  పట్టుకొని చరిత్రను వెతకడం వైపు అడుగులు వేశారు. ఈ సందర్భంలోనే అశేర గారికి విజయ్ కుమార్ గారితో పరిచయం అవడం ఆ పరిచయం స్నేహంగా మారడం విజయ్ కుమార్ గారి ప్రత్యేకతలు, వారికి పని పట్ల ఉన్న నిబద్ధత,  చరిత్ర పట్ల వారికి ఉన్న అవగాహన, అర్థమయ్యాక ఎవరైనా ఆయన వెంట కదిలి వెళ్లాల్సిందే అంటారు అశేరా.

        ఆదిమానవుడి నుండి ఆధునిక మానవుడి దాక ఆనవాళ్లను వెతకడంలో ఆనందాన్ని వివరిస్తూ   మనకు చిన్న చిన్న సంఘటనలను కథలుగా అప్పటి ఆ ప్రాంత రాజులు పరిపాలన నాటి సంగతులతో,  నేటి మనుషుల ప్రవర్తన ను జతచేసి చరిత్ర ఆధారాలను వెతకడంలో మానవ సంబంధాల మధ్య ఉన్న చిన్న గీతను పట్టుకొని చరిత్రను వివరిస్తూనే.., బుద్ధి కుశలతతో మెలిగే సందర్భాలని, అదే చరిత్రని వెతుకుతూ వెళ్ళినప్పటి ఎదురుదెబ్బల ఆనవాళ్ళని కలిపి కథలుగా మార్చడం విశేషం ఈ పుస్తకంలో ఉంది.

   నన్ను ఆశ్చర్యం లో ముంచేత్తిన సంఘటనలు ఇందులో చాలానే ఉన్నా.!  అరుదైన విషయం ఒకటి ఉంది. ఆంజనేయునికి కుమారుడు ఉన్నాడని హనుమంతుని కొడుకు పేరు మత్స్య వల్లబడని,  ఆ విగ్రహం అచ్చం ఆంజనేయుని పోలి ఉండడం వలన ఆంజనేయునికి అతని కుమారుడికి తేడా లేకుండా విగ్రహం ఉంటుందని. కేవలం విగ్రహన్ని చూసి వీరిద్దరి మధ్య మార్పు గుర్తించడం ఎలానో పరిశోధనగా చెప్పిన విషయం భలే ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా ఈ గమనింపు నా మనసును పట్టుకు తిరుగుతుంది.

 ఇలాంటిదే మరో సంఘటన అది వేణుగోపాల స్వామి విగ్రహం గురించి చెప్తూ. కృష్ణుడు సత్యాసమేతుడిగా ఉన్నాడని భాగవత కథనాలని జోడించి, వివరాలను పొందుపరచి చరిత్రకు ఎంతవరకు ఈ శిల్ప చాతుర్యంలో, ఎలా ఏ సందర్భంలో నిర్మించబడిందో చెప్పిన తీరు మనసుని ఆకట్టుకుంటుంది.

    బెలూన్ గుహల గురించి చదువుతుంటే చరిత్రను తడిమి చూసుకోవాల్సిన పరిస్థితి ఎంత అవసరమో నేటి జీవన విధానంలో మనుషుల ఆలోచనలకి ఉన్న ద్వైది భావాలను కూడా కలిపి విశ్లేషించి కథల రూపంలో వీరి ప్రయాణాలలోని వెతుకులాటని, కొందరి మనుషుల్లోనే మూర్ఖత్వాన్ని, నిధి నిక్షేపాలు అంటూ చరిత్రను బ్రష్టు పట్టించే కార్యక్రమాలు, మలయాళ ముగ్గు గురించి చెప్పినప్పుడు రీడింగ్ ఎంజాయ్ చేశా. వీరు వెళ్లిన ఆ ప్రాంతం మొత్తంలో వెతుకులాటలోని కష్టానికి ఫలితం దొరక్కపోయినా అసేరా వేణు గానానికి దొరికిన కితాబు మాత్రం భలే ఎత్తు పల్లాల కోనలో వినిపించడం.  ఆ పిల్లనగ్రోవిని వెతుకుతూ జనం రావడం గమ్మత్తైన అనుభవం వీరిది.

     శాసనాలని వెతికి, వాటిని భద్రపరిచేందుకీ గవర్నమెంట్ పరం కావాలి అన్నా, ఆ శాసనాలకు రక్షణ దొరకడం అన్నా, ఎంత కష్టమో “ శాలివాహన “ ఫౌండేషన్ స్టోన్ గురించి చెప్తూ చారిత్రకపరిశోధన విద్యార్థులు పెరగాల్సిన అవసరాన్ని వివరించి చెప్పడం బాగుంది.

 ఘనగిరి పొమ్మంది కనిగిరి రమ్మంది. చదువుతున్నప్పుడు బౌద్ధ ధర్మాన్ని, జైనిజం కి సంబంధించిన అవగాహన లేని వాళ్లు ఆ బౌద్దారామాలలో తవ్వకాలు జరపడం వల్ల వచ్చే నష్టాలే కాదు  విజయ్ కుమార్ సార్ అనుభవ జ్ఞానాన్ని వారికి ఈ వృత్తి పట్ల ఉన్న జిజ్ఞాస ఒకరోజు అక్కడ వారికి దొరికిన నాణాల గురించి తెలిపిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.

       రాయలసీమ ప్రాంతాన్ని ద్రవిడ మూల సంస్కృతి అంటూ అక్కడ స్థానికతను ఎలా ధ్వంసం చేస్తున్నారు అంటూ ఓ కైఫియత్తు కథ చెప్పి రాయలసీమ కరువుని వివరించడం, ఓ ప్రాంత చరిత్రను తెరమరుగు కాకుండా ఉండడానికి ఆ చరిత్ర అవసరాన్ని గుర్తు చేస్తున్నట్లు అనిపించింది.

    ఇక్కడ చెప్పుకున్న కథల్లో చంద్రవదన,  మహియార్ ల అపురూప ప్రేమ కథ అనిపించక మానదు. వాస్తవంగా జరిగిన ఈ సంఘటనగా చూడవచ్చు. నేటికి ఈ చంద్రవదన, మెహియార్ ల సమాధులను ఖాద్రీలో చూడవచ్చు అన్నప్పుడు. నిజమైన ప్రేమలు ఇలా చరిత్రలో మట్టిలో మట్టిలా కలిసిపోయాయేమో అనిపించింది.

    చిత్రదుర్గం పాలె గాళ్ళ గురించి చెప్పిన వివరాలు, ఏదైనా చరిత్రకు ఆనవాళ్ళ మధ్య లభించిన నిధి నిక్షేపాలకు, ప్రభుత్వ నియమాల తోరణాల్లో ఎన్ని రకాల ఆక్షేపణలని ఎదుర్కోవాలో విజయ్ కుమార్ సార్ ప్రయాణం తెలియజేసింది.

     ఒక ప్రత్యేకమైనది మాత్రం కోడేరు శాసనంలో ‘ దొంబర ‘ కులం గురించి ఉందన్న విషయాన్ని నిరూపించుకోవడానికి ఓ సాధారణ వ్యక్తి ప్రయత్నించడం అందుకు వీరి ప్రయాణ ఫలితం మనల్ని తప్పక ఆకట్టుకుంటుంది.

        ఇలా ఈ పుస్తకం మొత్తం ఎక్కువ శాతం రాయలసీమ ప్రాంత చారిత్రిక కట్టడాల శాసన నిర్మితాలు వీరిద్దరి ప్రయాణం అందులోని మర్మాన్ని ప్రతి సన్నివేశపు ప్రయాణాన్ని వివరించి చెప్పి అప్పుడు అక్షర గారు తీసుకున్న ఎత్తుగడ మాత్రం మనల్ని ఆ ప్రాంతానికి చేరువచేసి లాలించి వదులుతుంది.

    అందుకే అంట చెప్పే వ్యక్తుల్లో ఓడుపు ఉంటే ఎలాంటి చరిత్రనైనా రక్తి కట్టించవచ్చు ఈ పుస్తకం చరిత్ర ఆనవాళ్ళకి గుర్తుగా కొత్త తరానికి కొంత గైడ్ లైన్స్ గా ఉపయోగపడుతుంది.

   అభినందనలు అశేరా.

~~

పుస్తకం వివరాలు

 ఎన్నిల పిట్ట ప్రచురణలు

కంబగిరి నుండి శేషగిరి దాకా”

    -ఓ చారిత్రక ప్రయాణం-

 -ఆడవాల శేషగిరి రాయుడు (అశేరా)

Intach life member 7772

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *