చాలా కథలు ఋతువుల్లా వచ్చి పోతూ ఉంటాయి. కొన్ని కథలు మాత్రం మనతో ఓ సెలయేటి సవ్వడి లా…, సముద్రం లోపలి అలజడిగానో మనసు వెంట పరిగెత్తుకొస్తాయి.
అలా ప్రవహించే గాలిలో ఒక్కోసారి సంపెంగ పూల మత్తు చల్లిపోతే,
ఆ పక్కనే చవక చెట్ల మధ్యలో ప్రేమ భావాల వెల్లువెత్తుతుంది , నారింజ రంగు సిరా మరకల మధ్యలో చిక్కుకున్న అక్షరం శరదృతువులా వచ్చి వెళుతుంది.
గొంతు విప్పి పాట పాడే గిటార్ జ్ఞాపకాల తెరలను దించి వెళ్తుంది.
ఇలా సంగీతంలో తడిచిపోతూనే ఉంటామా.!! ఉన్నట్టుండి ఒక్కసారిగా గుర్రపు డెక్కల చప్పుడు గుండె లోతుల్లో నుండి సన్నగా వినిపించడం మొదలవుతుంది.
ఓ నగరానికి జన్నత్ అందం. తెచ్చిపెట్టింది పిడికిళ్లకు మొలిచిన పెన్సిల్లు, అలా కాన్వాస్ అద్దిన పెన్సిళ్లు రాజకీయ కత్తివేటుకి కొట్టుకుపోతూ ఉండటం చూస్తాం, ఉదా రంగు చినుకుల్లో తడిచిన బాల్యం వెంటాడుతుంటే.., చిక్కుముడుల దారులన్నీ విడిపోతూ…, ఏ సముద్రపు అంచుల్లోనూ ఓల్డ్ మాంక్ మీసాల పెద్దాయన వచ్చి మన భుజం తట్టి వెళ్తాడు, వెళ్తూ వెళ్తూ కాగజ్ గా ఫూల్ చేతికి అందిస్తాడు. ఈ కాగితం పూలకేమో వాడిపోవడం కూడా రాదు అనుకునే లోపు రాలిపోయే జీవితంలో రంగుల్ని అద్దుతాయి. యుద్ధంలో బాధ్యులు ఎవరో కంటే బాధితులు ఎవరో వెలికి తీసి చూడమంటాడు.
ఇలా మహి కథలు చదువుతుంటే!, మహి కథలు రాస్తాడా! జీవితంలోని జీవితాన్ని అక్షర ఖైదు చేస్తాడా! అన్న ఆశ్చర్యం కలిగించింది.
చాలాకాలం తర్వాత నే చదువుతున్నది ఓ పుస్తకం అన్న సంగతి మరిచి ఓబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ని మనసులో నింపుకుంటూ వెళ్ళిపోయాను.
అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చూసి, పోయెట్రీని చదివి ఎంత అబ్బురపడ్డానో, ఇక్కడ మహి కథల్లో కూడా కుంచెకి ఎన్ని రంగులు అద్దుకుంటుందో జీవితం కూడా అన్ని రంగులు ఉంటుందని చూపిస్తాడు.
ఇక్కడ ప్రతి రంగులో అతి చిన్న గీతకు కూడా మనకు ఓ అర్థం దొరుకుతున్నట్టే ప్రతి పాత్ర మనపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
మనకు మహి మొదటి కథ ప్రారంభంలోనే మాయమైపోతాడు అంటే కథకుడు మాయమైపోతాడు. ఆ కథలోని పాత్రలన్నీ మనతో మాట్లాడుతూ ఉంటాయి. మాటలను వింటాం నిశ్శబ్దంగా వింటాం.
రంగనాయకి ప్రేమ ఇంకిన కళ్ళల్లో, గాజు కళ్ళ ప్రేమను అద్దుకున్నప్పుడు అంతా ఇంత ఉండదు ప్రేమ జల్ల.
ఇహ నాకు రంజనీపూలు చూస్తే రంగనాయకి గుబాళిస్తుందేమో …!
సిరీల్ గురించి పరిచయం చేస్తూన్నప్పుడు ఇటువంటి ఉడుకు రక్తం ప్రతి ఒక్కరిలో ఎందుకు లేదా అనుకుంటాము, జాతి అంతరాల్ని విభేదించే దొరలబిడ్డని రైలు పట్టాలెక్కించిన వేళ గుల్మోహర్ పూలు కాళ్ళ కింద నలిగి జీసస్ నెత్తురులో తడిచిన పూలు జీవితం మొత్తం వెంట పరిగెత్తుకొస్తాయి.
మహి కథల్లో తండ్రి ప్రేమ కథలు కూతుర్లకు జీవిత పాఠాలుగా వినిపిస్తాడు, తల్లి నీడ లాంటి కొడుకులు ఉంటారు ఓడిపోయిన జీవిత శఖలాల్ని మోసుకెళ్తుంటారు…,
ప్రేమరంగులద్దుకున్న సీతాకోకచిలుకల్ని పరిచయం చేస్తాడు.
ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఒక మాట ఉంది.
మహి కథల్లో ప్రతి పాత్రకి స్వేచ్ఛ ఉంటుంది, ఒక అభిరుచి ఉంటుంది., సొంత ఆలోచనలపై నిలబడే ధైర్యం ఉంటుంది., ఆడ మగ అన్న జెండర్ బేస్ కంటే కూడా ఇక్కడ ఇండివిడ్యూవాలిటీలో ఉండే క్లారిటీ ఉంటుంది. బంధాలు ఉంటాయి., బంధాల మధ్య స్వేచ్ఛ ఉంటుంది. అంతే బాధ్యత ఉంటుంది., స్నేహాలు ఉంటాయి, ఊరి ముచ్చట్లు ఉంటాయి. ఇన్నింటి మధ్యలో…
సూసైడ్ టెండెన్సిల్లో మనసు చిక్కుకున్నప్పుడు మనుషుల అవసరం ఏంటో చెప్తాడు., మానవ సంబంధాలు మాత్రమే ఉండాలంటాడు. మనసు సమాధానం చెప్పుకోలేని సందర్భాలని ఎదుర్కొనే పాత్రల్ని చూసినప్పుడు చలించి పోవడం పాఠకుడికి అప్పజెప్తాడు.
మొత్తానికి మహి తన కథల్లో మనల్ని వదిలెళ్తాడు.
మహి కథలు అన్నీ ఒకేసారి చదివేద్దాం అనుకుంటే మాత్రం ఆ ఎసెన్స్ మిస్ అవుతారు. చాలా నిదానంగా రోజుకొకథని ఒక కప్పు కాఫీ బ్రేక్ తో చదవండి. ఒక్కో కథలోనుండి ఇంకో కథలోకి ప్రవేశం అంత తొందరగా దొరకదు కారణం అతని చెప్పే కథ అంత బలంగా మన చుట్టూ అల్లుకుపోతుంది.
ప్రతి కథలో మలుపులు ఉంటాయి ఆ మలుపుల్లో మళ్లీ కొత్తగా కథలు వస్తాయి, అలా అని మనల్ని కథ మొదలుపెట్టిన దగ్గరకే లాగి ముడి వేసేస్తాడు మళ్లీ మళ్లీ ఆ పాత్రలకి మనం కనెక్ట్ అవుతూనే ఉంటాము.
మహికి కదలని ఎడిట్ చేసుకోవడం బాగా వచ్చు. ఒక పిక్చర్ తీసినప్పుడు మనకు ఎన్ని ఇమేజినరిస్ కనిపిస్తాయో మహి కథలు కూడా మనకు ఇమేజినరీ అందిస్తాయి.
ఆ ఇమేజినరిస్ ని చూస్తూ మనం కథలో ట్రావెల్ చేస్తాము.
మరి మహి కథల్లో వర్గ విభేదాలు లేవా? సమాజంలోని కుళ్ళు కంపు లేదా ? రాజకీయ ప్రలోభాలు లేవా? సమాజ హితం కాని వాటిని ప్రశ్నించ లేదా? ఇవన్నీ ఉంటాయి. అయినా మనల్ని ఒక రకమైన ట్రాన్స్ లో పెట్టి శభాష్ అనిపిస్తాడు. డైరెక్ట్ గా ఏది చెప్పడు కథతోనే చెప్పిస్తాడు. వాడు రైట్ వేలో వెళ్లాడు అనిపిస్తాడు.
Way of your expression, your write-up is a very clear and smooth conflict of life.

కవిత్వమైనా, కథ అయినా మీ విశ్లేషణలోని ఆత్మీయత నాకు నచ్చుతుంది. విశ్లేషణా, ఆత్మీయతా రెండూ కలిపి రాయడం కష్టమే. కానీ, మీరు ఆ విజయం సాధిస్తున్నారు!