మిగిల్చుకున్న పరువు ఏమిటి!?

Spread the love

పరువు ఈ మాట మనుషులు సంఘజీవిగా బతకడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది.?

    ఒక మనిషి బతకడంలో ఈ పరువు పాత్ర ఏమిటి?

 మనిషిని బ్రతికించలేని పరువుకు అర్థం ఉందా?!

     ఆత్మహత్యలు, హత్యలు.. ఈ రెండు కేవలం పరువు పోయిందని జరుగుతున్నప్పుడు.., 

            హత్యో, ఆత్మహత్యో జరిగాక వాళ్లు పోయిందనుకున్నా..,  చెప్పుకుంటున్న ఆ పరువు వారికి కిరీటమై వర్ధిల్లుతుందా!!

      సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెస్తుందా!!

     అలా తెచ్చింది అని చెప్పే ఒక్క సంఘటన కూడా నేనైతే విన్నది, చూసింది లేదు.

        “మా ఇంటి గౌరవం మా ఆడపిల్లలు” అని చెప్పే కుటుంబాలలోనే ఈ హత్యలు జరగడం.,  వాళ్ళ చేతులతో వాళ్లే ఆ ఆడపిల్లల్ని చంపడం.  సంఘంలో సాంప్రదాయాల పేరుతో నిస్సిగ్గుగా బహిరంగ హత్యలు చేసి,  పరువు అనే ఉరితాడుకి వారి ఇంటి ఆడవాళ్ళని వేలాడదీయడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అనుకుంటా.

        నిజజీవితంలో ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనసు కకావికలమైపోతుంది.

 ఏం ఆశించి జరుపుతున్నారు?  ఈ సంస్కృతికి ముగింపు లేదా?  అనే ప్రశ్నలు వెంటపడి వస్తుంట..,  ఆలోచనలు కాలంతోపాటు వెనక్కి వెళ్లాయి.

      ఎప్పుడో చిన్నతనంలో అనుకుంటా దాసరి నారాయణరావు సినిమాలో కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని తల్లిదండ్రులు విషం పెట్టి చంపేయడం చూసినప్పుడు మొదలైన ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు.  వయసు అనుభవంలో ఎందరి నోటి నుండో ఈ మాట వింటూ వచ్చినా అంతుచిక్కని ముళ్లపొదని మెదళ్ళలో పాతేసుకున్న ప్రపంచం మారదని అనిపించింది.

    ఇప్పుడు ఈ పుస్తకంలో సంఘటనను చూసినప్పుడు చట్టం కూడా న్యాయం అందించడంలో విఫలం అయింది అని అనిపించక మానదు. తల్లి ప్రేమ అంటూ ఎన్నోసార్లు చెప్పుకునే మనము, ఈ పరువు విషయానికి వస్తే మాయం అయిపోయే తల్లి ప్రేమను చూడాల్సి రావడం, ఓ విషాదం అయితే అందులో కూడా కూతురు మాట వినలేదని కిరాయి హంతకులతో మీరేమైనా చేసుకోండి దాన్ని!!, అని కని,  పెంచిన ఇరవై ఏళ్ల పిల్లని క్రూర మృగాల చేతికి అందించిన దారుణ సంఘటనలో ఆ బిడ్డ ప్రేమించినందుకు పడ్డ శిక్ష అంటే ఒళ్ళు జలదరిస్తుంది.

పుస్తకం లోపల

        వాస్తవానికి ఒక చక్కని ప్రేమ కథగా మొదలైన జీవితాలు మిట్టు, జెస్సీ లవి,

           యవ్వన తాలూకు మిరుముట్లు గొలిపే వెన్నెల కబుర్లు, కన్నుల బాసలు.,

        స్పర్శ లెరుగని అనురాగాలు, కలగలిసి భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకొని ఒకరికొకరం అంటూ మొదలేసిన అడుగులు.

       పుట్టి పెరిగిన నాటి నుంచి పల్లెటూరు తప్ప ఊరు దాటి ఎరగని పంజాబీ కుర్రాడు ‘మిట్టు’.

 ఇతని ప్రేమ కోసమేనా అన్నట్టు ఏడు సంద్రాలు దాటి కెనడా నుంచి వచ్చి చేరిన ‘జెస్సి’.

    వీరి ప్రేమ రాయబారానికి గుర్తుగా మిగిలిన 200 పైగా ఉత్తరాలు.,

     చెమ్మగిల్లిన కన్నులతో నిరంతరం రక్త మోడుతున్న నిలువుటెత్తు గాయంగా మారిన ప్రేమికుడు.

 ప్రపంచం మొత్తం ఆశ్చర్యం పోయేలా మరణం చవిచూసిన ప్రేమికురాలు.

 ఇలా వీరి ప్రేమ ప్రయాణాన్ని అమరం చేసుకున్నారు పెద్దల అనంగీకారాల, అహంకారాల మధ్య,   వీరి ప్రేమకు స్వేచ్ఛ లేకుండా చేసింది మాత్రం డబ్బు, మనుషుల మూర్ఖత్వము, అధికార దుర్వినియోగమే.. వీటితోపాటు న్యాయస్థానం ముందు పాతికేళ్ళ పోరాటం మరో ఎత్తు.

      వీరిద్దరినీ విడదీసి వీరి ప్రేమను విడదీసి,  ఒంటరిని చేసి వీరి ప్రేమను చంపాలనుకున్న వారికి శిక్ష వేయించడంలో న్యాయం అందని ద్రాక్షగా మారింది. చరిత్రలో చినిగిపోని గాయాన్ని మనందరికీ పంచింది మాత్రం వీరి ప్రేమే.

     ఈ కథను మనకు అందించింది ఝాన్సీ పాపు దేశీ,  మూల కథ, మూల రచయిత “జుపిందర్ జిత్ సింగ్” (జే. జే) గా పిలవబడే ఓ క్రైమ్ రిపోర్టర్. ఇతని అనేక రచనలలో ఈ పుస్తకం ఒకటి. అతని ఉద్యోగ ధర్మంలో అతని ప్రయాణంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ఒక వ్యక్తి జీవిత సత్యాన్ని డాక్యుమెంట్ చేసి చూపాడు ఈ ప్రపంచానికి.

 ఓ రచయితగా, రిపోర్టర్గా   బాధితుడి పక్షాన నిలబడి  అతను వేసిన ప్రశ్న

    “మీ పరువు తిరిగి మీ దగ్గరకు వచ్చిందా”? అంటూ ఈ సమాజాన్ని ప్రశ్నించాడు.

          ఆ ప్రశ్నను అందుకున్న “ఝాన్సీ పాపుదేశి” అనువాద రచయిత మన ముందు మరికొన్ని ప్రశ్నలను నిలబెట్టింది.

     ఒక సామాజిక కోణంలో సాగే ఈ రచన ఎంతో బాధ్యతతో తీసుకొని రాసారు ఆమె అనిపించింది.

     ఈ రాస్తున్న క్రమంలో తాను ఎంతో మనోవేదన అనుభవించి ఉంటుంది. అందుకే ఆవిడ తన ముందుమాటలో ఈ అనువాదం చేసే క్రమంలోనే కొంతకాలం ఆగిపోయా అని చెప్పుకుంటారు.  

       ఈ పుస్తకం చదువుతున్న సమయంలో పాఠకుడికి అనుభవంలోకి వచ్చే నొప్పి తెలియజేస్తుంది., ఆ రచనలోని లోతుని. ఇంతటి దారుణానికి అక్షర రూపం ఇవ్వడం మెచ్చుకోవలసిన విషయమే. చాలా ధైర్యమే ఝాన్సీ కి.

      జరిగిన సంఘటనను కథగా మార్చి చెప్పే అప్పుడు, ఆల్రెడీ రాసిన పుస్తకాన్ని తెలుగులోకి అతి సరళ పదాలతో ట్రాన్స్లేట్ చేయడానికి ఝాన్సీ రచనా కౌశలం బయటపడిందని చెప్పవచ్చు.

      తెలుగు రచయిత మధురాంతకం గారు జీవిత గాధలు చెప్పేటప్పుడు తమ నవలలో ఉపయోగించిన ఎత్తుగడే ఈ నవలలో కూడా నాకు కనిపించింది. ఎవరి పాత్ర వారి గురించి వారే చెప్పుకోవడం. ఫస్ట్ పర్సన్ గా కథ చెప్పడం జుపిందర్ గారు అనుసరించిన పద్ధతిని అనుసరించినా..,  అనువాదంలో వచ్చే అడ్డంకులను సమర్థవంతంగా ఛేదించి ఒక సరళవాక్యంగా మలిచి కథ లోని వ్యక్తుల మనసు లోపలి నొప్పిని పాఠకుడికి మిస్ అవ్వకుండా అందించారు.

        హత్య చేసి దేశం వదిలి వెళ్ళిన వారిని శిక్షించాలంటే రెండు దేశాల మధ్య ఒప్పందాలను నియమాలను దాటి ప్రిజినర్స్   గా మన దేశానికి తీసుకు రావడానికి కష్టపడుతున్న పోలీసు ఆఫీసర్ తో మొదలయ్యే ఈ కథ, పోలీసుల విఫల యత్నంలోని అనేక సమర్ధతల పార్శ్వాలు చెప్పినా… మిట్టు ఇన్ని గాయాలు అనుభవించడానికి కూడా ఈ పోలీసు వ్యవస్థలోని లోపాలు, చట్టాల్లోని లొసుగులే  కారణం అని ధైర్యంగా మన ముందు ఈ అక్షరాలు నిలబడ్డాయి.

         హత్య జరిగిన పాతికేళ్లలో హత్య చేయించిన వాళ్ళకి శిక్ష వేయించాలన్న న్యాయమైన కోరిక కోరికగాని మిగిలిందా ఎన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంలోని గాయాల ఉచ్చు నుండి ఆ ప్రేమికుడు బయటపడ్డాడా పుస్తకం చదివితే మీకు మరో కోణం కనిపించొచ్చు.

          ఒక పబ్లికేషన్ నుండి వచ్చిన అనువాద పుస్తకం “పరువు”ప్రయత్నించండి

                            3జులై 25

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *