చైనా దేశపు గారడీవాడు హన్. గారడీ చేస్తూ పెద్ద కత్తి విసరేసరికి అతని భార్య మెడలో రక్తనాళం తెగిపోయింది. అందరూ ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఆమె తక్షణం చనిపోయింది. అతణ్ణి వెంటనే ఖైదు చేశారు.
ఆ సమయానికక్కడ కంపెనీ డైరక్టరు, హాన్‌కు గారడీలో సాయం చేసేవాడు, గారడీ పనులను గురించి వివరించేవాడు, కాక మూడు వందలకు పై చిల్లర ప్రేక్షకులు ఉన్నారు. వారి వెనుక నొక పోలీసు కూడ ఉన్నాడు. ఇంతమంది చూస్తూ ఉన్నా హత్య ఉద్దేశపూర్వకమా, ఆకస్మిక సంభవమా అన్న విషయం సమస్యగానే ఉండిపోయింది,
హాన్ చేయబూనిన ప్రదర్శన మిది. తలుపు ఎత్తుననున్న ఒక కర్ర పలకకు ముందు తన భార్య నిలబడుతుంది. నాలుగు గజాల దూరం నుంచి పెద్ద పెద్ద కత్తులు పలకమీదకు ఆమెకు చుట్టూ రెండంగుళాల దూరంలో విసురుతాడు. ఒక్కొక్క కత్తీ విసిరి ఒక్కొక్క కేక వేస్తూ ఉంటాడు.
జడ్జీగారు మొదట డైరక్టరు నడిగాడు.
“ఆ ఫీటు చాలా కష్టమయిందంటావా?”
“కాదు, అలవాటయిన వానికంత కష్టము కాదు. కాని సరిగా చేయడానికి నరాల్లో సత్తువ, ఏకాగ్రత కావాలి.”
“సరే, హఠాత్సంభవమే అనుకొన్నా, ఇది సాధారణంగా జరగవలసిన సంఘటన కాదుకదా?”
“ఔను. ఇది అంత అనుకోనిది, అసాధారణమైనది కాకపోతే నేనలాంటి ఫీటు చేయించే ఉండను.”
“ఉద్దేశపూర్వకంగా చేసేడంటారా?”
“అనను. ఎందుకంటే ఇలాంటి ప్రదర్శనం పండ్రెండడుగుల దూరం నుంచి చేసేటప్పుడు వట్టి నైపుణ్యమే గాక సమయానికి సహజంగా స్ఫురించే తెలివికూడ కావాలి. ఈ ప్రదర్శనంలో పొరపాటు జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. ఇప్పుడిట్లు జరగడం బట్టి పొరపాటు కవకాశం ఉందని ఒప్పుకోవలసి వస్తూ ఉంది.”
“ఐతే ఇది పొరపాటనుకుంటావా లేక ఉద్దేశ పూర్వకమనుకొంటావా?”
“చెప్పలేను.”
జడ్జీకి చిక్కు విడలేదు. హత్య జరిగింది కాని ఉద్దేశపూర్వక మౌనో కాదో చెప్పడం కష్టంగా ఉంది. చంపదలచుకొనే చేసి ఉంటే చాలా గడుసుగా చేశాడనుకొన్నాడు జడ్జీ.
తరువాత జడ్జీ చాలా కాలం నుండి హాన్‌కు సహాయకుడుగానున్న వాణ్ణి అడిగాడు.
“సాధారణంగా హాన్ దెలాంటి ప్రవర్తన?”
“చాలా నిక్కచ్చి మనిషి. జూదం కాని, త్రాగుడు కాని, వ్యభిచారం కాని లేదు. క్రిందటేడే క్రైస్తవ మతం పుచ్చుకొన్నాడు. ఇంగ్లీషు నేర్చుకొన్నాడు. ఖాళీ ఉన్నప్పుడు బైబిలు, మతోపన్యాసాలు వంటి గ్రంథాలే చదువుతాడు.”
“అతని భార్య ఎలాంటిది?”
“ఆమె కూడ పొరపొచ్చెంలేని మనిషి. ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చే వాళ్ళంత నీతి నియమాలతో ఉండరు. మీకు తెలిసిందే. హాన్ భార్య అందగత్తె. ఎంతమందో ప్రేమ చూపేవారు కాని ఎన్నడూ వాళ్ళని కన్నెత్తి చూచేది కాదు.”
“ఎలాంటి స్వభావం వారిది ?”
“ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండేవాడు. స్నేహితులంటే ప్రాణమిచ్చేవాడు. ఎన్నడూ ఎవ్వరితోనూ దెబ్బలాడి ఎరుగడు. కాని….” అని ఒక్కక్షణం ఆగి, ఆలోచించుకొని
“ఒక్క సంగతి చెప్పితే హాన్‌కు హాని కలుగుతుందేమో ఐనా నిజం చెప్పెయ్యాలి కాబట్టి చెప్పేస్తున్నాను. ఇతరుల విషయంలో ఇంత మంచితనం నెమ్మదీ చూపే వీళ్ళు, ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు చాలా చిత్రంగా క్రూరంగా ఉండేవారు.”
“ఎందువల్ల?”
“నాకు తెలియదు.”
“నీకు వారిని తెలిసినప్పటినుండీ అలాగే ఉండేవారా?
“కాదు. రెండేండ్ల క్రిందట హాసతి కడుపుతో ఉంది. తొమ్మిది నెలలూ నిండకుండానే బిడ్డ పుట్టి మూడో రోజున చనిపోయింది. దాంతో వారిద్దరికీ భేదాలు పుట్టాయి. చిన్న విషయానికి కూడ పెద్ద జగడం వేసుకొనేవారు. హాసతి ముఖం పాలిపోయేది. ప్రతిసారి జగడంలో కొంతసేపటికి హఠాత్తుగా మౌనంవహించి ఉండిపోయేవాడు. ఎప్పుడూ ఆమెను చెయ్యి చేసుకోలేదు. అది అతని నియమాలకు విరుద్ధం. కాని కళ్ళు భయంకర కోపాన్ని కక్కేవి. అతణ్ణి అప్పుడు చూస్తే భయమేసేది. ఒక రోజున నే నడిగాను. మీ ఇద్దరికీ ఏ మాత్రం సరిపడనప్పుడు విడిపోరాదా అని. ఆమె మీద ప్రేమ నశించినా విడిపోడానికి తగిన కారణాలు లేవన్నాడు. ఆమె కూడ అతణ్ణి క్రమేణా ప్రేమించడం మానేసింది. ఇదంతా అతడే నాతో చెప్పాడు. తన హృదయంలో ఉబికే క్రౌర్యం అణచుకోడానికి, అకారణంగా భార్య నసహ్యించుకోడం మానడానికే కాబోలు బైబిలు, మత గ్రంథాలు చదివేవాడు. ఆమె ఆటగత్తెగా అతణ్ణి చేరింది. ఇప్పుడతణ్ణి వదలి వాళ్ళూపోతే తిరిగి పెండ్లవడం కష్టం. దేశమంతా చాలా కాలం తిరిగి వచ్చిన డాన్నెవరు నమ్ముతారు. ఇద్దరికీ సరిపడకపోయినా ఇందుకనే ఆమె కూడ అతని దగ్గరే ఉందిపోయిందనుకుంటాను.”
“ఈ హత్య గురించి నీ నిజాభిప్రాయమేమిటి?”
“ఉద్దేశ పూర్వకమా, కాదా అనేనా మీ ప్రశ్న?”
“ఔను.”
“ఇది జరిగిన నాటినుండి అనేకవిధాల దీన్ని గూర్చి ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచించినకొద్దీ మరింత అర్థం కావడం లేదు. చాటింపులు చేయించే ఆయనతోను మాట్లాడాను. అతడు కూడ అర్థం కాలేదన్నాడు.”
“సరే ఇది జరిగిన క్షణంలో నీవేమనుకొన్నావు. ఉద్దేశపూర్వక మనుకొన్నావా? లేక పొరపాటనుకొన్నావా?”
“ఔనండి. ఆమెను చంపేశాడనే అనుకొన్నాను.”
“వారిద్దరి మధ్యా జగడాలు నీకు తెలిసినట్లు చాటింపు చేసే ఆయనకు తెలియవుకదా.”
“కావచ్చు. కాని తరువాత నేను కూడ అనుకొన్నాడు. నాకు వారి జగడాలు తెలుసు కాబట్టి చంపేశాడని అనుకొన్నానా అని.”
“ఇది జరగగానే హాన్ ఎలాగున్నాడు?”
“హా, అని అరచాడు. ఆ కేక విని తలెత్తి చూచేసరికి అతని భార్య నోట్లోంచి రక్తం కాలవగట్టి ప్రవహిస్తూ ఉంది. కొన్ని క్షణాలు మాత్రమే నిలబడి ఉంది. తరువాత మోకాళ్ళు ముడుచుకుపోయి, ముందుకు తూలిపోయింది. మెడమీదనున్న కత్తి నేలమీద పడిపోయింది. ఆమెకూడ నేలమీద కుప్పగా కూలిపోయింది. మేమెవ్వరం మాత్రమేమి చేయగలం, చూస్తూ గడ్డకట్టిపోయాం. హాన్ ఏవిధంగా ఉన్నాడో చెప్పలేను. అతని వైపు నేను చూడలేదు. చివరకు హాన్ భార్యను చంపేశాడన్న భావం నా మనస్సులోకి వచ్చినప్పుడతని వైపు చూచాను. కళ్ళు మూసుకొని ఉన్నాయి. చచ్చిన వానికివలె ఆతని ముఖం తెల్లబారిపోయింది. రంగస్థలాధికారి తెరదింపించేశాడు. ఆమె దేహం ఎత్తేసరికి చచ్చి ఉంది. మోకాళ్ళపైబడి హాన్ చాలాసేపు నిశ్శబ్దంగా ప్రార్థన చేశాడు.
“చాలా మారిపోయినట్లగ పడ్డాడా?”
“ఔనండి, చాలా క్రుంగిపోయాడు.”
“సరే, ఇంకేమన్నా నిన్నడగవలసి వుంటే పిలుస్తాను. వెళ్లు.”
జడ్జీ హాన్‌ను పిలిచాడు. తెలివితేటలున్న హాన్ ముఖం దిగాలుపడి వివర్ణంగా ఉంది. నరముల సత్తువ బొత్తిగా తప్పి, అలసిపోయియున్నాడని స్పష్టమౌతుంది. బోనులో కెక్కిన హన్‌తో జడ్జీ, “అప్పుడే డైరక్టర్ని, నీ అసిస్టెంటును పరీక్షించాను. నిన్నిప్పుడు ప్రశ్నించవలసి ఉంది” అన్నాడు. హన్ తలవంచాడు విధేయతా సూచకంగా.
“నీవెప్పుడైనా నీ భార్యను ప్రేమించావేమో చెప్పు.”
“మా పెండ్లినాటి నుండి బిడ్డ పుట్టేవరకు మనస్సాక్షిగా ప్రేమించాను”
“బిడ్డ పుట్టుకతో ఎందుకు మార్పు వచ్చింది?”
“ఆ బిడ్డ నాది కాదని తెలియడం వల్ల.”
“ఎవరి బిడ్డో తెలుసా?”
“నా భార్య మేనత్త కొడుకు.”
“అతణ్ణి నీకు తెలుసా?”
“నాకు బాగా స్నేహితుడు. మమ్మల్ని పెళ్ళిచేసుకోమని చెప్పి నన్ను ప్రోత్సాహించింది అతడే”
“వారిద్దరి స్నేహాలు నీ పెండ్లికి ముందే జరిగి ఉంటాయనుకొంటాను.”
“ఔను. మేము పెండ్లాడిన ఎనిమిది నెలలకు బిడ్డ పుట్టింది.”
“మీ అసిస్టెంటు నెలలునిండే ముందు పుట్టిందని మాత్రమన్నాడు.”
“ఔను, అలాగే నేనందరికి చెప్పాను.”
“అంత త్వరగా బిడ్డ చనిపోయిందెందువల్ల?”
“తల్లే బిడ్డని తన వక్షానికానించి ఊపిరాడనివ్వలేదు.”
“ఆ పని చెయ్యాలనే చేసిందా నీ భార్యః”
“ఆమె నాతో ఆకస్మిక సంభవమంది”
జడ్జి మౌనంగా హన్ ముఖం తేరిపార చూశాడు. హన్ తలెత్తి తరువాత ప్రశ్నకు ఎదురుచూస్తున్నాడు. చూపు మాత్రం నేలమీదే ఉంది.
“తనకూ తన మేనత్త కుమారునికి గల సంబంధం నీ భార్య ఒప్పుకొందా?”
“ఆమె చెప్పనూలేదు. నేనెన్నడూ అడుగనూలేదు. అన్నింటికీ తగిన శిక్షలాగ పడింది బిడ్డ మృత్యువు. నేను ఉదారంగా ప్రవర్తించాలని అనుకొన్నాను కాని….”
“కాని చివరకు ప్రవర్తింపలేకపోయావు.”
“ఔను. బిడ్డ చావు తగినంత శిక్ష కాదనుకొన్నాను. ఒక్కడినే ఉన్నప్పుడు శాంతంగా వితర్కించుకొనేవాడిని కాని ఆమెను చూడగానే మనస్సులో ఏదో దుమారం లేచేది. ఆమె శరీరం కనబడేటప్పటికే నాలో కోపం పొడుచుకొచ్చేది.
“విడాకులివ్వాలనిపించలేదా?”
“చాలసార్లు అనుకొన్నాను కాని నా భార్యతో చెప్పలేదు. నేను వదిలేస్తే బ్రదికేది లేదని నా భార్య అనేది.”
“నిన్ను ప్రేమించిందా?”
“ప్రేమించలేదు.”
“మరెందుకలాగంది?”
“జీవనాధారాన్ని గూర్చి అని ఉంటుంది. వాళ్ళ పెద్దన్న వారి ఇల్లు నాశనం చేశాడు. సర్కసులో తిరిగేవాడి భార్యగా ఉండేదాన్నెవరు పెండ్లాడతారు? ఏదన్నా పనిచేసుకుంటుందా అంటే ఆమె పాదాలు చాలా చిన్నవి.”
“మీ శారీరిక సంబంధమెట్టిది?”
”చాలామంది భార్యాభర్తలకు వంటిదే.”
”నీ భార్యకు నిజంగా నీ మీద మక్కువ ఉందా?”
“నిజంగా ఇష్టముందనుకోను. నాకు భార్యగా ఉండటం కష్టంగానే ఉండి ఉంటుంది. కాని ఓర్చుకొనేది. మగవాడూహింపలేనంత ఓరిమి చూపేది. నా జీవితం క్రమంగా పాడయిపోతూ ఉంటే నిర్దయతో చూసేది. మంచి జీవితం కోసం నేను కొట్టుకొంటూ ఉంటే ఆమె ఎప్పుడూ కాస్త సానుభూతి కూడ చూపలేదు.”
“ఏదో ఒకటి నిశ్చయం చేసుకోలేకపోయావా?”
“నా మనస్సు నిండా ఆదర్శాలుండేవి.”
”ఏమిటా ఆదర్శాలు?”
“ఆమె యెడ నేను తప్పులేకుండా ప్రవర్తించాలని కాని చివరకు సాగిందికాదు.”
“చంపాలని ఎన్నడూ అనుకోలేదా?”
హన్ మాట్లాడలేదు, జడ్జీ తిరిగి అడిగాడు. చాలాసేపు ఆగి హన్ అన్నాడు. “చంపాలనే భావం పుట్టేముందు చాలాసార్లు అదే చచ్చిపోతే బాగుండునని అనుకొనేవాణ్ణి.”
“సరే, శాసనానికి విరుద్ధం కాకపోతే చంపే ఉందువుకదా?
”శాసనం గూర్చి నేనెన్నడూ ఆలోచించలేదు. దానికి భయపడి ఆగనూలేదు. నేనెందుకో ఈ విషయంలో బలహీనుణ్ణి అనుకొనేవాణ్ణి. సజ్జనుడుగా బ్రతకాలని మాత్రం అమితకాంక్ష ఉండేది.
“ఐనా తరువాత చంపాలనుకొన్నావు కదా?”
“చంపాలని నేనెన్నడూ నిశ్చయం చేసుకోలేదు. ఒకసారి మాత్రం అనుకొన్న మాట నిజం.”
“ఆమె చావుకు ముందెంత కాలం క్రితం?”
“ఆ ముందు రాత్రో లేక ఆ ఉదయమో.”
“మీరప్పుడు దెబ్బలాడుకొంటూ ఉన్నారా?”
“ఔను”
“ఎందుకోసం?”
“ఏదో చాలా చిన్న విషయాన్ని గూర్చి.”
“ఆ విషయమేమిటో జ్ఞాపకంతెచ్చుకో.”
“భోజనాన్ని గూర్చి, సమయానికి భోజనం తయారు కాకపోవడం వల్ల కోపం వచ్చింది. ఆ సాయత్రం నా భార్య సోమరిగా కాలం గడపి వంట చేసింది కాదు సమయానికి, నాకు చాలా కోపం వచ్చింది.”
“మామూలు కంటే ఎక్కువ కోపంగా ఉన్నావా?”
“కాదు, కాని తరువాత కోపం ఇంకా పెరిగింది. మామూలుగా ఇలా ఉండేదికాదు. కొన్నాళ్ళనుండి జీవితాన్ని సరిదిద్దుకోడం కోసం తాపత్రయపడుతున్నాను. దిద్దుకోలేకున్నాను. పరుంటే నిద్రపట్టదు. మనస్సు గందరగోళం పరచే ఆలోచనలతో నిండిపోయేది. నాకేమనిపించిందంటే, ఎంత కొట్టుకొన్నా నేను జీవితాన్ని బాగుపరచుకోలేకున్నాను. నా ప్రస్తుత జీవితంలో చెలరేగుతున్న క్రోధాలు చల్లారడం లేదు. ఈ దుఃఖస్థితి, అసహాయ స్థితి పెండ్లివల్లనే కదా కలిగింది. చీకటినుండి నన్ను తప్పించే కాంతికిరణం కోసం తలకొట్టుకొని ప్రయత్నించాను. చివరికా కోరిక కూడ అణగారిపోయింది. కాని ఇంకా బయటపడే ఆశ మినుకుమినుకుమంటూ ఉంది. ఆ ఆశే నశిస్తే నేనూ చచ్చినవానితో సమానమే అనుకొన్నాను. నాటినుండి చెడ్డ ఆలోచన మనస్సులో మెదలసాగింది. “ఆమె చచ్చిపోతే బాగుండును. నేనెందుకు చంపకూడదు?” అని. నేరంవల్ల వచ్చే శిక్షను గూర్చి నేను తలపోయనేలేదు. జైలుకు తప్పక వెళతాను. కాని జైలులో జీవితం ఇంతకంటే ఆధ్వాన్నంగా ఉంటుందా! ఇంకొంచెం మేలుగానే ఉండవచ్చు. కాని చంపితే సమస్య తీరదనే భావం ఎందువల్లో కలిగింది. ఆత్మహత్యలాంటిది. సమస్యను తప్పుకు తిరగడమే ఔతుంది. ఏ దినం బాధ ఆ దినం నేననుభవిస్తూ ఉండవలసిందే కాని తప్పుకు తిరగడానికి మార్గంలేదు. బాధ ననుభవించడమే నా యదార్థ జీవితమైపోయింది.
ఈ విధంగా నా మనస్సు పరుగెత్తుతూ ఉంటే నా బాధకు కారణం నా ప్రక్కనే ఉన్నదన్న మాట మరిచిపోయాను. నిద్రపట్టక పూర్తిగా అలసిపోయి పడి ఉన్నాను. నా మతే పోయినట్లుంది. మనస్సు ఱంపపు కోతననుభవించి మొద్దుబారిపోయింది. భార్యను చంపాలన్న భావం క్రమంగా మాయమైంది. పీడకల పోయిన తరువాత ఉండే దిగులు, శూన్య స్థితి పొందాను. మంచి జీవితంకోసం నా నిశ్చితాలన్నీ జ్ఞాపకానికొచ్చాయి. అవి సాధించలేని బలహీనుణ్ణి అని తెలుసుకొన్నాను. తెల్లారింది. నా భార్యకూడ నిద్రపోలేదని గ్రహించాను.
“లేచాక ఇద్దరూ మామూలుగానే సంచరించారా.”
“ఒకరితో ఒకరం ఒక్కమాట కూడ మాట్లాడుకోలేదు.”
“ఇంతవరకూ వచ్చాక ఎందుకామెను వదిలెయ్యాలనుకోలేదు..?”
“అందువల్ల నా చిక్కులు తీరుతాయనుకోమంటారా? లేదు. అది కూడ సమస్యను తప్పించుకుతిరగడమే ఔతుంది. నా పక్షమున తప్పు లేకుండా, నా భార్య యెడల ప్రవర్తించాలని నిశ్చయించుకొన్నానని చెప్పానుకదా:”
జడ్డివైపు హన్ దీక్షగా చూచాడు. సరే, చెప్పు అన్నట్లు జడ్జీ తల ఊపాడు.
మరునాడు నా ఒళ్ళు చితకపొడిచినట్లయిపోయింది. నా నరాలు తుత్తునియలైపోయాయి. ఊరికే ఉండటం బాధగా ఉంది. బట్టలు వేసుకొని బయటికిపోయి పిచ్చివాడిలాగ ఊరిలో నిర్మానుష్య ప్రదేశాల్లో తిరిగాను. జీవిత సమస్య పరిష్కారం చెయ్యాలి అనే తలంపు నన్ను వదలలేదు. కాని చంపే ఉద్దేశం మరి కలుగలేదు. క్రితం రాత్రి చంపాలనుకొన్నానంతే. నిశ్చయానికి వచ్చానా? అనుకోడానికి, నిశ్చయానికి మధ్య ఒక సముద్రముంది. ఆ సాయంత్రపు గారడీ ఆటను గూర్చి కూడా నేనేమాత్రం ఆలోచించలేదు. అనుకొనే ఉంటే ఆ కత్తి వేటుల ప్రదర్శనం మానేసే ఉందును. దాని బదులు చేయడానికి ఎన్నెన్నో ఫీటులున్నాయి.
సాయంత్రం రంగం మీదకు వంతువచ్చింది. మామూలుకంటే యేమైనా విశేషం జరుగబోతుందని నాకు పిసరంతైనా అనుమానం తట్టలేదు. మామూలు ప్రకారం నా కత్తుల వాడితనం ప్రేక్షకులకు కాగితాలు కోసి, నేల బల్లలమీద కొట్టి చూపించాను. బరువైన చైనా దుస్తులు ధరించి నా భార్య రంగం మీదకు వచ్చి ప్రేక్షకుల్ని మనోహరమైన నవ్వుతో అభినందించి, బల్లకు ముందుగా నిలబడింది. నేనొక కత్తి తీసుకొని మామూలు దూరంలో నిలబడ్డాను. గడచిన రోజు సాయంత్రం తరువాత అప్పుడే మా కళ్ళు మొదటిసారి కలుసుకోవడం. నాడు ఆ ఫీటు చేయబోవడం అపాయకరమని తక్షణం నాకు తోచింది. సరాల్ని వశంలో పెట్టుకోవాలి. నీరసత నా ఎముకలలోని మూలుగులోనికి కూడ ప్రాకిపోయింది. ఇంక నరాలేమివశంలో ఉంటాయి? నా చేతిని నేను నమ్మలేననిపించింది. నన్ను నేను సమాధానపరచుకోవాలని కాస్సేపు కళ్ళు మూసుకొన్నాను. నా వళ్ళంతా వణుకుతున్నట్లు తోచింది.
టైము అయిపోయింది. ఆమె తలవైపు మొదటి కత్తిని విసిరాను. మామూలుకంటే ఒక అంగుళం పైకి వెళ్ళింది. నా భార్య చేతులెత్తింది. ఆమె రెండు చేతుల క్రిందికి రెండు కత్తులు విసిరాను. మొదటి కత్తి నా వ్రేళ్ళను వదిలేసరికి ఏదో వెనక్కి లాగేస్తూ ఉన్నట్లు అనిపించింది. ఇంక కత్తుల లక్ష్యాలు నిర్ణయించుకోలేకపోతున్నాను. అనుకొన్న చోట కత్తి గ్రుచ్చుకున్నదంటే అదృష్టవశాత్తు అయిందన్నమాట.
ఒక కత్తి నా భార్య మెడకు ఎడమ వైపుకు విసిరాను. రెండవది విసరబోయేసరికి ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన చూపు చూచాను. ఆమెనప్పుడే భయభూతం ఆవహించినట్లగపడింది. నా కత్తి క్షణాలలో ఎగిరి వచ్చి తన మెడ కోసేస్తుందని ఆమెకు ముందుగానే తోచిందా? మూర్ఛలో పడిపోతున్నట్లు నా తల దిమ్మెక్కింది. చేతిలోని కత్తిని బలవంతంగా గాలిలోకి ఎక్కడికో గురిపెట్టి విసిరాను “
జాగ్రత్తగా అతణ్ణి తిలకిస్తూ జడ్జీ మౌనం వహించాడు. “చంపేశాను” అన్నభావం హఠాత్తుగా నాకు కల్గింది” అని హాన్ మాట తుంచేసినట్లు చెప్పాడు.
“ఉద్దేశ పూర్వకంగా అనా నీ భావం ?”
“ఔను. ఉద్దేశపూర్వకంగా చేశాననే అనిపించింది హఠాత్తుగా.”
“తరువాత నీ భార్య శవం ప్రక్క మోకరించి ప్రార్ధన చేశావట గదా?”
“ఔను. అప్పటికప్పుడు నాకు తోచిన జిత్తు అది. ప్రతివాళ్ళూ నన్ను క్రైస్తవ మత విశ్వాసినని యెరుగుదురు. ప్రార్థిస్తున్నట్లు నటిస్తూ ఇప్పుడిక దారి ఏమిటా అని ఆలోచిస్తున్నాను.”
“ఐతే ఉద్దేశ పూర్వకంగా చేసేననే నీ నిశ్చతాభిప్రాయమా?”
“ఔను. కాని నే చేసింది హఠాత్సంభవమేనని అందర్నీ నమ్మించవచ్చని తోచింది.”
“ఉద్దేశపూర్వకంగా చేశానని ఎందుకనుకొన్నావు?”
“ఇతమిద్ధని నిర్ణయించే జ్ఞానం నశించి అలాగనుకొన్నాను.”
“హఠాత్సంభవమని నమ్మించగలనని తలంచావా ?”
“ఔను. కాని దీనిని గూర్చి తరువాత ఆలోచించేసరికి నాకే సిగ్గు వేసింది. దుఃఖిస్తూ ఉన్నట్లు నా చేతనైనంతవరకూ నటించాను. తెలివైనవాడెవడైనా అక్కడుంటే నేను నటిస్తున్నానని కనిపెట్టగలడు. “సాయంత్రానికి నన్ను వదిలేస్తారు. హంతకుణ్ణిగా ఋజువు చేసేదేమీ లేదు అని నాలో నచ్చచెప్పుకున్నాను. నా భార్యకు నాకూ చెడిందని అందరకూ తెలుసు కాని ఇది హఠాత్సంభవమని నేను గట్టిగా ఉంటే కాదని ఋజువుచేయగలవారెవరు? జరిగిందంతా మననం చేసుకొన్నాను. హఠాత్సంభవమేనని సులభంగా నచ్చచెప్పవచ్చునని గ్రహించాను. అందులో ఒక విచిత్ర ప్రశ్న నాకే తట్టింది. ఇది హఠాత్సంభవం కాదని నేనే ఎందుకు అనుకుంటున్నాను. ముందు రాత్రి చంపాలనుకొన్నాను. దాన్నిబట్టి ఇప్పుడు జరిగింది ఉద్దేశపూర్వకము కాకూడదా ? చివరకు జరిగిందేమిటో నాకే తెలియదు అన్న స్థితికి వచ్చాను. దాంతో మనస్సుకు శాంతి కలిగింది. గొప్ప ఆనందం కూడా కలిగింది. గట్టిగా అరిచేద్దామనిపించింది.
“హఠాత్సంభవమని అనుకోగలిగావు కాబట్టా?”
“కాదు. ఉద్దేశ పూర్వకమో, కాదో నాకేమీ తెలియడం లేదు. శిక్ష తప్పించుకోడానికి నా మనస్సులో ఉన్నదంతా స్పష్టంగా చెప్పేయడమే మార్గమనుకొన్నాను. హఠాత్సంభవమని చెప్పి మిమ్మల్నీ నన్ను మోసగించడంమాని దైవముఖం చూచి, ఏమి జరిగిందో నాకు తెలియదు అని నిజం చెప్పేద్దామనిపించింది. చేయి పట్టు తప్పిందనీ చెప్పలేను, ఉద్దేశపూర్వకమని ఒప్పుకోనూ లేను. నిజానికి నేరం చేసేననిగాని, చెయ్యలేదనిగాని ఏమీ చెప్పలేను.”
హాన్ మౌనంగా ఉండిపోయాడు. చాలాసేపు జడ్జీ కూడ మౌనంగా ఉన్నాడు. అప్పుడు జడ్జీ నెమ్మదిగా ఆలోచిస్తూ అన్నాడు.
“నీవు చెప్పింది నిజమని నేను నమ్ముతున్నాను. కాని ఇంకో ప్రశ్న. నీ భార్య చావుకి నీకు కాస్తయైనా విచారం లేదా?”
“నాకేమీ లేదు. ఇదివరలో ఆమెనమితంగా ద్వేషించే రోజుల్లో కూడ ఆమె మరణం గూర్చి మాట్లాడడం నాకింత సంతోషప్రదంగా ఉంటుందనుకోలేదు.”
“సరే. బోనుదిగవచ్చు” అన్నాడు జడ్జీ.
తలవంచి నిశ్శబ్దంగా కోర్టులోంచి వెళ్ళిపోయాడు హాన్. విచిత్ర భావావేశంతో కలం అందుకొన్నాడు జడ్జి. తన ముందున్న కేసుకు సంబంధించిన కాగితాల మీద “నిర్దోషి” అని వ్రాశాడు.
