నిప్పు

Spread the love

తాడుని మోచేయితో పట్టుకుని వేలాడుతోంది చొక్కా. మనుషుల ఉనికి ఏమీ లేదు. గదంతా ఎక్కడో ఖాళీగా నిశ్శబ్దంతో వున్నట్టుంది. చెట్లనుంచి ముసురు గాలి కిటికీలోంచి విన్పిస్తోంది. వరండాలో చెప్పుల శబ్దం కొంతసేపు వినిపించి ఆగిపోయింది. ఆ మనిషి బీడీ కాలుస్తూ కుర్చీలో కూర్చుని వున్నాడు. ఏదో విసుగుతనం, జబ్బుఛాయతో అతని మనస్సు మూలుగుతోంది. పదేళ్ళక్రితం ఆత్మహత్య చేసుకోబోయి ఆఖరిక్షణంలో వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు వర్షంలో తడవటం ఇప్పటికీ ఒక గుర్తుగా మిగిలిపోయింది. యిక్కడ యిప్పుడు ఈ కుర్చీలో తను వున్నానన్న స్పృహ ఒక అస్పష్టమైన ఆశ్చర్యానికి లోను చేస్తోంది కానీ ఆ దిగులుతో కూడిన ఆశ్చర్యంతోనే యవ్వనం గడచిపోయింది. చావు నుంచి తాను బతకలేననే విభ్రమతో ఎక్కడెక్కడో తిరిగాడు. రకరకాల బృందాలతో కలిసి జీవించాడు. స్థలంలో వుండడమూ స్థలంలో లేకపోవడమూ రూపంలో వుండడమూ రూపంలో లేకపోవడమూ యివే ఆలోచనలు అతని ఒంటరితనాన్ని చుట్టుముట్టాయి. చదువుకోవాల్సిన ప్రేమించాల్సిన రోజులు అపరాధ భీతితో, చెప్పుకోలేని భయాలతో, అర్థంకాని మానస వైఖరులతో వెళ్ళిపోయాయి. అతన్ని గురించి నాకు మాత్రమే తెలుసు కాబట్టి అతన్ని విన్నప్పుడల్లా కొంచెం బాధా, భయం కలుగుతాయి.

మూడు నాలుగు రోజులుగా తన గురించిన విషయాలన్నీ ఒక ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. స్థలం, మనుగడ, భవిష్యత్తు-స్థూలంగా చెప్పాలంటే జీవించడమూ లేదూ తన అస్తిత్వాన్ని హత్య చేయడమూ. తన మనసు వేదిక మీద వీటిని గురించి ఖచ్చితంగా తేల్చుకోవాల్సిన సమయం యిదే. లేనిపక్షంలో ఏదో కీడు తనవైపు పొంచి వుందనే భీతి అతన్ని హెచ్చరిస్తోంది. గత రెండు రాత్రుల్లో అతనికి తారసపడ్డ ఒక వేశ్యా, ఆమె ముసలి తల్లి, ఒక బాల కళ్ళ బ్రహ్మచారి, మొద్దు బొజ్జతో వున్న ముండల పిచ్చోడూ అతనిలో బుగులుకుని వున్న నిరాశకి మరింత ఆజ్యం పోశారు.

మళ్ళీ బీడీ ఒకటి వెలిగించి కొవ్వొత్తి పైనున్న ద్రవ మైనంకు తోవచూపుతున్నట్టుగా మెత్తని మైనాన్ని అగ్గిపుళ్ళతో తొలగిస్తున్నాడు. కానీ కొంత static గానే వున్నాడు.

“ఇల్లనే instinct లేకపోయింది. instinct లేకపోవడం? అసలు ఈ ఆలోచనే రాబోయే ఏ భయంకర ఉత్పాతాన్నో సూచిస్తోంది. కాని తప్పదు. ఖచ్చితంగా ఇల్లు గురించి ఆలోచించడం యిది తొలిసారి కాని లాభం లేదు, ఏళ్ళు వచ్చేశాయి. ఈ అంకెను చూస్తేనే ఆలోచన ఎటూ పోక స్థంభించిపోతోంది. కానీ రానున్న కాలంలో స్థబ్దతేనన్న ఎరుక కలిగివుండడమూ అంతకన్నా నరకం. అమ్మా నాన్నలు నుంచి వచ్చే ఆస్తి మీద అధికారం లేదూ సహజాతంగా అందరికీ వుండే హక్కు అన్నభావన ఎందుకు కలగడం లేదన్న ప్రశ్న వేసుకోవడం కానీ ఇష్టంలేకుండానే ప్రశ్న వేసుకుంటున్నానన్న స్పృహనీ గుర్తించాను. యింట్లో గానీ, పొలంలో కానీ, తోటలోకానీ అవి నా స్వంతం అన్న భావనతో యిష్టంగా తిరిగిన సందర్భాలేమీ లేవు. అవేవీ నాకు సంబంధించినవి కానట్టుగానే తిరిగాను. కానీ సమయం మించిపోయింది రాను రానూ నేను వెళ్తోన్న దారి కుంచించుకుపోతోందనిపిస్తోంది. అది నన్ను మింగేస్తుందో లేదూ అధోలోకంలోకి విసిరేస్తుందోనన్న భయం రోజురోజుకీ బలపడుతోంది. పధ్నాలుగు వదిహేనేళ్ళ వయస్సప్పుడు మా వూరికెళ్ళినప్పుడు ‘నీవు జీవితంలో బాగుపడవు’ అని నా వైపు దైన్యంగా చూసి హెచ్చరిక చేశాడొక మనిషి అప్పటికి మూడేళ్ళక్రితమే అమ్మనుంచి తప్పించుకుని నాన్న దగ్గరికి వెళ్ళిపోయున్నాను. అలా నన్ను హెచ్చరించిన మనిషి మరో పదేళ్ళకి ఎండోసల్ఫాన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నల్లని శరీర ఛాయ, లోతుకుపోయిన కళ్ళు, అతనిదే అయిన నవ్వు, అప్పుడప్పుడూ కారాకిళ్ళీతో ఎర్రగా వండివుండే నోరూ నాకు బాగా గుర్తు. అతని హెచ్చరికలో వున్న భవిష్యత్ విషాద స్పర్శని యిప్పుడు నేను ఎరుకపర్చుకుంటున్నాను. తన సంభాషణతో తన చుట్టూ వున్న మనుషుల్ని నవ్వించే ఆయనంటే అందరికీ యిష్టం. అతని చావూ, ఆ చావుకు ముందు అతను బతికిన రోజుల తీరూ నాకు ‘ఎందుకో’ గుర్తుండిపోయాయి. రెండేళ్ళ క్రితమే కంపెనీ ఉద్యోగం మానేసాడు. ఉద్యోగంలో చేరమని రెండు మూడుసార్లు కంపెనీ నుండి ఉత్తరాలు వచ్చేయి తర్వాత అవీ రావడం ఆగిపోయింది. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. మాసిన శరీరం పీక్కుపోయిన మేక గడ్డం, ఆ పూట సారాకోసం ఎవళ్ళు పిలిచినా వెళ్ళి వాళ్ళ పనులు చేసిపెట్టడం. కానీ ఇంటివైపు ముఖం తిప్పేవాడు కాదు. అతన్ని ఆ స్థితిలో చూస్తాననుకోలేదు. పణుకుతూ ఒక సాయంత్రంవేళ అతను ఎండోసల్ఫాన్ తీసుకునేటప్పటికి అతని వయస్సు ముప్పయ్ మూడేళ్ళలోపే వుంటాయి. అంతకుముందే అతను రెండు మూడుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశాడు. ఆఖరిసారి-తన దగ్గర డబ్బుల్లేక దొంగతనంగా యింట్లోని సామాన్లు బజార్లో అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో ఎండోసల్ఫాన్ కొనుకున్నాడు. అతను చనిపోయిన కొంతకాలానికీ అతని యింటి పెరడులో ఒక తెగిన ఉరితాడు వేలాడుతుండడం యిప్పటికీ నాకు గుర్తు.

రోజులేమీ బాగాలేవు. ముఖ్యంగా గత వారం దినాల్నుంచి ఏదో అయ్యింది నాకు. అంతా రోతగా చిందర వందరగా వుంది. సిక్‌గా తప్పనిసరి పరిస్థితుల్లో నేను వుంటున్న కలుస్తోన్న మనుషుల అర్థంలేని జీవితాలు నా మీద పడి కుమ్మేస్తున్నాయనిపిస్తోంది. బహుశా నేనూ వాళ్ళకి అలాగే కనిపిస్తూ వుంటాను. యెక్కడో ఏదో జామ్ అయిపోయినట్టే అనిపిస్తోంది. ఒక్కొక్కడూ ఒక్కోలాగా రోజులు వెళ్ళబుచ్చుతుంటాడు. అప్పుడప్పుడూ ఆ బతుకులు వచ్చగా గార పట్టిన కోరలతో మబ్బుగా చూస్తుంటాయి. ఈ రెండు మూడు రోజులూ ఆ కోరల దరిదాపుల్లోనే పనికిపోకుండా చేతిలో పైసలు లేకుండా ఇంకా చెప్పాలంటే అసాంఘికమైన దుర్భలత్వంతో తిరుగుతున్నాను. ఆ కోరల పట్ల అసహ్యమూ ఆసహనమూ ఎంత స్థాయికి వెళ్ళాయంటే అటువంటి వ్యక్తుల రూపాలు పిల్లల కంట ముఖ్యంగా కౌమారదశలో వున్న వాళ్ళకి కనబడకుండా ఏరి పారేయాలన్న ఆలోచనకి తీసుకెళ్ళాయి. నిజమే ‘ఏరివేత’ అన్న ఆలోచన ఎందుకొచ్చిందంటే జీవితేచ్ఛ కృశించిన ఇటువంటి వ్యక్తుల వలన నష్టమే ఎక్కువ. యీ బతుకు పొలంలోంచి అలా ‘ఏరివేత’ కు గురి కావాల్సిన వాళ్ళలో నేనూ ఒఖన్ని. యింటికి యెలాగూ వెళ్ళలేనని తెలుసు ఒక మంచు కొయ్య బలంగా దిగబడినట్టుగా నా అంతరంగం ఒక చీకటి నిర్ణయానికి వచ్చేసి వుంది. నెల రోజుల క్రితం నా సిక్ మనస్తత్వం వల్లో ఏమో కానీ అతనికి ‘బొగ్గుగడియారం’ అని పేరు పెట్టుకున్నాను. గత రాత్రి గది తాళమైనా వుంచకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం వెనుక అతడి నిర్ణయం మరింత స్పష్టమైంది. ఎవరి స్పేస్‌లోకో ఎవరైనా ఎందుకు రానిస్తారు? ఆ మర్నాటి ఉదయం అతని గదికి వెళ్ళి తలుపు తట్టినా తియ్యకపోవడం దుర్భరమైన, తల్లడిల్లే అనుభవమే నాకు, కానీ ఆ బొగ్గు గడియారంతో గడిపిన ఆ వారం రోజుల్లో కొంతగా కొంతైనా చీకటి చేతులు అలా స్థబ్దుగా పడివుండటం కనిపించింది.

ముందురోజుల కన్నా భిన్నంగా ఈ రోజు గాలి బాగా వీస్తోంది. అప్పుడే స్నానం చేసి తలుపుకెదురుగా వీపుగోడకానించి కూర్చున్నాను అతగాడు తలదిండు మీద చెమకలు ఆనించి సిగరెట్టు వెలిగించాడు. అతడు తీరిగ్గా ఆలోచిస్తూ ఏదో చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడన్నమాట. ఆ గదిలో ఆ తల దిండ్లు కూడా ఏదో ఆగంతుక స్పర్శతో నా వైపు చూస్తోన్నట్టు అన్పిస్తోంది. ముప్ఫయ్ రెండేళ్ళపై బడ్డ మనిషి, పెళ్ళికాలేదు. అతగాడు పెళ్ళిచేసుకుంటాడన్న విషయంలో నాకు దుర్భరమైన భావన వుంది అది అతగాడికీ వుండొచ్చు. ఒకరోజు అతగాడు సిగరెట్ పీకలు పడేసీ మట్టి పిడతలోంచి కండోమ్‌ని వేళ్ళతో అంటీముట్టనట్టు పైకి తీసి చూపిస్తూ చిత్రంగా నవ్వుతూ దాన్ని ఆ సిగరెట్ పీకల మధ్యనే పడేయ్యడం నాకింకా గుర్తు. మరోసారి అతగాడు ‘నేనో ముసలి స్త్రీతో సంగమించానని’ చెప్పాడు. మట్టిపిడతలోంచి పైకి తీస్తున్నప్పుడు కనిపించిన ‘సిగరెట్‌నుసీ పీకలూ, బూజూ అంటుకున్న కండోం’ ఈ జీవితంలో వున్న దైన్యస్థితికీ, Lameness కీ లేదూ అర్థరాహిత్యానికీ అంతకన్నా ప్రతీక లేదు. ‘టాల్‌స్టాయ్ కథ స్వామిసెర్గెయేవ్ ఎప్పుడైనా చదివారా మీరు?’ అని అప్పుడప్పుడూ అడుగుతుంటాడు. సెయింట్‌ని స్వామీ అని పిలవడంలో అతని తత్వం తెలుస్తూనే వుంది. అతగాడు పరిచయమైన తొలిరోజుల్లో తన వ్యక్తిగతంగా గీసుకున్న ఒక పెన్సిల్ స్కెచ్‌ని చూపించేడు. స్త్రీ దగ్గరే అతగాడు ఆగిపోయాడనీ, అతని వ్యక్తిత్వం చిదిగిపోయి వుందని అంతకుముందే ఒక నిర్ణయానికి వచ్చి వున్నాను. ఆ చిత్రాన్ని చూసినాక అది మరింత స్పష్టమైంది. సబ్‌కాన్సియస్ ప్రమాదపుటంచులు చెదిరి చిక్కబడుతున్నట్టనిపించింది. ఒక సర్పం, ఒక స్త్రీ కలిసిన చీకటిజీవి అది. సర్పం శిరస్సూ, భుజస్థానాల్లో రెక్కల్లా మొలిచిన శిరోజాలు, చుట్టూరా స్త్రీ ఖండిత శరీరభాగాలు, కాళ్ళూ, నడుమూ యోనీ కలిసిన భాగం, బాహువులూ యిలా ముక్కలు ముక్కలుగా, తనదైన ఒంటరి సైకలాజికల్ ఎటాచ్‌మెంట్‌తో ప్రతిరేఖ మీద మళ్ళీ దిద్దివున్నాడు.

దూరంగా, టార్చిలైట్ వెలిగించిన ముఖంలో ఓడిపోయినట్టుగా ఒక నవ్వు. ఈ నేల మీద ఎన్నో జీవితాలు. ఈ రాత్రి గదినుంచి, ఈ మద్యవు రాత్రి నుంచి చూసుకున్నా అనంత నిశ్శబ్దంలో వ్యాపించి వున్న గృహాలు, నగరాలు, రకరకాల జాతుల మనుషులు దూరంగా ఆకుపచ్చని దుస్తుల్లో తెలుపుజాతి స్త్రీలు నవ్వుతూ ఆడుతూ. ఈ పెనుమూలలో సముద్ర గర్జనలకు దూరంగా చాలా దూరంగా ఈ నియోన్ కాంతి గదిలో ఓ ముప్పయ్ ఐదేళ్ళ మనిషొకడు ఈ ఆత్మ చిత్రాన్ని చూపిస్తో, మద్యం మత్తులో గోడ ధ్వంసం కానట్టుగానే వుంది. ఆ ఖండిత శరీరాంగాలూ, అంతర్‌శకలాలూ, శిరోజాల రెక్కలూ ఒక నల్లని నదిలో సగం మునిగి ఆ నెమ్మది ప్రవాహంతోపాటే కదులుతున్నాయనిపించింది.

ఆ స్కెచ్‌ని షెల్ఫ్‌లోకి విసిరేసి మరోపెగ్ తీసుకున్నాడు..

నా చేతిలోంచి పెన్ తీసుకుని మరొక చిత్రం గీయడం ప్రారంభించేడు.

అతని అంతర్ ప్రపంచం ఎలా కదులుతుందా అని అతని సున్నితమైన ఉబక చేయిని గమనిస్తున్నాను శ్రద్ధగా. ముందుగా పాము తలకాయ గీసాడు తర్వాత ఒకదాని నోట్లోంచి రెండుగా చీలిన ఒక నాలుక అంతవరకు బాగానే వుంది కానీ అతగాడు కాసేపాగి నావైపు ఏదో తెలియజెప్తున్నట్టుగా చూసి నాలుక పక్క ఇంకో నాలుక వేగంగా గీసి నాలుక చీలే చోట ఒక చీలికని పువ్వుగా గీసాడు. జీవితం ఇట్లాగే వుంటుందా… ఆ పువ్వు పేరు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఊరి చెరువులో ఎక్కువగా చూసినట్టు గుర్తు. ఆ రేఖా చిత్రాన్ని ముగించి తనదైన నవ్వును ఆత్మ సంతృప్తితో నవ్వుతూ నా వైపు చూశాడు. సర్పం తలా, రెండుగా చీలిన నాలుకా, రెండో (జత) నాలుక హఠాత్తుగా చీలి పువ్వుగా రూపాంతరం చెందడం వెనుక అంతర్ నీడా, అంతరార్థమూ ఏమైవుంటుంది? అంతరార్థం ఏమైతేనేం మనస్సునీ శరీరాన్నీ బ్రద్దలు చేసుకోనక్కర్లేదనిపించింది. కానీ ఇదొక మారుమూల అంతరంగపు ఛాయ.

కారం, ఉప్పూ కలిపిన ఉల్లిపాయల్ని తింటూ ‘రమణా, ఇది చాలా పవర్ఫుల్ ఫుడ్’ నాకేదో సూచిస్తోన్నట్టుగా చూశాడు.

నాకెందుకో kiss of sphink అనే పెయింటింగ్ గుర్తుకొచ్చింది. గ్రీకు పురాణాల గురించి పెద్దగా తెలియకపోయినా నాలో ఏదో సిక్నెస్ కుదులుతోంది. అందుకే వెంటనే అడిగేశాను.

‘గ్రీకు పురాణాల్లో ఒక కథ వుంది మీకు తెలుసా?”

కొంత ఆసక్తితోటి అతగాడు నా వైపు చూశాడు చెప్పమన్నట్టుగా.

`ఒక గ్రీకు దేశంలో స్పింక్స్ అనే రాక్షసి ఆ దేశ పౌరుల్ని ‘పీడించేది’ స్పింక్స్ అంటే సంగం స్త్రీ, సగం సింహం, పక్షి రెక్కలు కలిసివుండే రాక్షసి. అది దారి పక్కనుండే ఒక బండరాయి మీద కూర్చుని తనకెదురుగా వచ్చే వాళ్ళందరినీ అడ్డగించి ఒక చిక్కు ప్రశ్న వేసేది. జవాబు ‘తెలుసుకోలేని’ వాళ్ళని చంపివేసేది. ఆ ప్రశ్నేంటంటే ఈ భూమి మీద ఏ జంతువు- (విసుగు పుట్టిస్తున్నావురా బాబై నీకెపుడురా చెప్పుకోమంటున్నాడు) పొద్దిటిపూట నాలుగు కాళ్ళమీద, మధ్యాహ్నం పూట రెండుకాళ్ళ మీద సాయంకాలం పూట మూడు కాళ్ళమీద తిరుగుతుంది? మాంసం గిన్నెలో వెతుకుతున్నాడు దేన్నో. సమాధానం చెప్పుకోవాల్సిన ఆగత్యం అతనికింకా హద్దులు దాటి బ్రద్దలవ్వలేదని గ్రహించి కథ చెప్పడం కొనసాగించేను. ‘కానీ ఈడిపస్ అనే అతడు బదులు చెప్పడంతో స్పింక్స్ అహం దెబ్బతిని బండమీద నుండి కిందపడి చచ్చిపోతుంది’ ఈ డిపస్ చెప్పిన పరిష్కారం ఏంటంటే ‘మానవుడు’.

సెక్స్, మెలంకలీ, వయసు ఎముక.

హఠాత్తుగా కనుగుడ్లు తేలేసి చూస్తూ మెత్తని కోడి మెడముక్క నోట్లోకి తీసుకుంటూ ‘రండి భోంచేద్దాం’ అంటూ లేచాడు. గది కూడా ఆగంతుకంగా చూస్తోంది ఒక yellow beam లో నగ్నంగా ఒకడు నడుం వంగి నడుస్తోన్న దృశ్యం. స్పింక్స్ చచ్చిపోడానికి, స్త్రీ అనే సాంగత్వ భావనకూ ఖచ్చితంగా ఏదో హెచ్చరికలా తోస్తోన్న చిక్కు ప్రశ్నకూ లింక్ వున్నట్టే అనిపించి గది మొత్తం sick yellow beam మధ్య తేలుతోంది-వూగుతోన్న ఆ గదిలోంచి తలుపు తెరచిన వెలుతురులో వీధి ద్వారం మీద నిలబడి అతగాడు తన చిన్ననాటి ఫోటోల్ని చూపిస్తుంటాడు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు- అప్పటికింకా కలర్ ఫోటోగ్రఫీ అందుబాట్లోకి రాలేదు. ఎప్పటిదో అమ్మానాన్నలవి. విడి విడిగానూ, గ్రూపుగానూ (జుత్తు చెదిరి, నుదురు కొద్దిగా చిట్లించి ఎదురెండలో నిలబడి వేరే కుర్రాడుగా కనిపిస్తోన్న తనూ) తీసిన ఫోటోలు ఎప్పటివో చెరిగిపోయి, నలిగిపోయి, రంగు పాతబడి వాటికి కూడా ఏమాత్రం తగిన స్థానంలో పెట్టే శ్రద్ధలేక ఎక్కడపడితే అక్కడే’ పడేస్తుంటాడు. అల్మారాల్లో, గడ్డం గీసుకునే బాక్స్‌లో, పుస్తకాల వెనక డైరీలో.

కుటుంబంతో సంబంధాలు కోల్పోయి లేక కుటుంబం దగ్గరికి పోక ఏకాకితనంతో మంచు తేలు లోపల నిద్రిస్తుండడం ఏమీ బాగాలేదు. తనని తాను కాటేసుకుంటుంది. తేలు వీపు నుంచి తోకకి వజ్రం అందకుండా దొర్లిపోతుంది ఎక్కడికో చల్లగాలికి దూరంగా.

ఈ ట్రాఫిక్ గురించి ముఖ్యంగా నైట్ ట్రాఫిక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఠపాల్మని చచ్చిపోతే బాగున్ననిపిస్తోంది. కానీ ఆశతోనే వస్తున్నాను ఆ మనిషి వుంటాడని నూటికి నూరు శాతం వాడుండడనే. రాత్రి పదీ పదకొండవుతోంది ఈ సమయంలో అతని రూంకి వెళ్ళడమంటే హోప్‌లెస్ జర్నీయే. కానీ గత్యంతరం లేదు. అనుకున్నట్టుగానే గదికి స్టీలు తాళం వేసివుంది. గది వెనకాల ఆనుకుని వున్న పోర్షనులోని వాళ్ళు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. యింక డాబా మీద పడుకోడమొక్కటే మార్గం. అతని గురించి అడిగి బయటివాడిలా అనుమానం రాకుండా నిదానంగా పైకి పోయి పడుకున్నాను. రెండు రోజులుగా తిండి తినకపోవడం వల్లో, పక్కకిందికి ఏమీ లేకపోవడం వల్లో స్లాబ్ గరుకు తగిలి నిద్రరావడం లేదు.

మళ్ళీ రాత్రి ఆకాశానికి చిరాగ్గా ఎదురయ్యాను. నక్షత్రాల్ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాను నాలాగా ఎవడూ బతకడనీ, నేను దేనికో తగిలి లోయలో పడిపోయే వస్తువుననీ అనుకుంటున్నాను. అది జరుగుతుందో జరగదో కానీ ధీమాతోనే కొంత భయాన్నీ, జీవితపు స్పర్శలేని రోజుల్ని నెడుతున్నాననిపించింది. ఏమనిషికైనా ఎందుకిట్లా జరుగుతుంది? ఎందుకు జరగాలి? ఎక్కడో ఏదో జామ్ అయిపోయినట్టనిపిస్తోంది.
ఇట్లా, స్త్రీ సాంగత్యం, ముఖాలు రక్త సంబంధ సంతోషంతో వెలిగే సందర్భాల అనుభవం, ఎడబాటు దుఃఖం, ఎడబాటు కలవరింత, ఊరునీ, ఇల్లునీ విడిచిపెట్టి ఎక్కడైనా ఉండలేని తనం, యివే మీ లేకుండా ఎవడైనా ఎలా వుండగలుగుతాడు? చిన్నప్పుడెప్పుడో అమ్మకి భయపడి యింటినుండి పారిపోవడమొక్కటేనే ఈ వేదనంతటికీ మూలం? యింకేమీ లేదా? కన్నీళ్ళైనా వూరని కళ్ళని పొడిచేసుకో ఎక్కడైనా నిర్జనప్రాంతంలో యిలా ఏవేవో అనుకుంటూ మగతగానైనా నిద్రపోకుండా అరికాళ్ళని వూపుకుంటూ పడుకున్నాడు డాబా మీద. దిగువున కొంచెం పక్కగా పిల్లల్ని మధ్యలో వేసుకుని భార్యాభర్తలు హాయిగా నిద్రిస్తున్నారు. ఆమె తలకి కొంచెం దూరంగా మంచినీళ్ళ కుండా, గ్లాసు.

‘ఏదో సులభమైన అంతంతో తెగిపోతాను’ అనుకుంటూ తనను తాను శాంతపర్చుకుంటున్నాడు. నిజానికి అమ్మకొట్టే దెబ్బలకి భయపడి పారిపోయిన తర్వాతనుంచి స్త్రీ స్పర్శ, మనస్సు, ఎదశ్వాస తనకు తెలియనే తెలియదు. అవి అతనికి శాశ్వతంగా దూరమైన విషయాలుగా అతనొక స్థిరీకరణకు వచ్చేస్తున్నాడు. ఆమె తనకన్నా సుపీరియర్ అన్న భావన బలంగా అతనిలో ఏర్పడిపోయింది. ఆ భావం తొలిగితేనే కదా జీవితం. అది తన మనస్సు వల్ల అయ్యేపని కాదు లేదా ఇప్పుడున్న మనస్సుని నరికి కాల్చేయ్యాలి.

రాత్రి పదకొండుకో పన్నెండుకో చాప వేస్తోన్న చప్పుడు విని లేచాడు అతన్ని చూడగానే కొంతమనస్సుకు స్థలాధికారం వచ్చినట్లయింది. చాపమీద వడుకుంటుండగా అతగాడు నాతో

‘మీరు కిందకు వెళ్ళొద్దండి’

‘ఎందుకు?’

‘మా ఫ్రెండ్ వచ్చాడు’

కాస్సేపాగి

‘ఇద్దరు లేడిస్‌ని తెచ్చాడు’

బ్రిస్టాల్ సిగరెట్టో ఒక దమ్ములాగి నా వైపు కొంత కాంతి ముఖంతో చూశాడు. ఫ్రెండ్ తర్వాత రౌండ్ ఇతనిదే. రెండు మూడు నెలల్లో ఈ రాత్రయినా అతగాడు స్త్రీతో గడుపుతున్నందుకు కొంత సంతోషమేసింది.

రాత్రి ఒంటిగంట అవుతోంది. నిద్రపోతున్న వాళ్ళు లేస్తారేమోనన్న భయంతో లో గొంతులో మాట్లాడుతున్నాడు.

‘మా కొల్లీగే, ముండలపిచ్చి ఎక్కువ. సాయంత్రం ఆఫీసుకి ఫోన్‌చేసి చెప్పాడు ఇట్లా వస్తున్నానని’

అతని మాటల్లో తొందరపాటు లోపల టెన్షనూ అర్థమవుతోంది.

కింద రూంలో ‘పని’ జరుగుతుంటుందని గుర్తుకొచ్చి-

‘ముగ్గురూ?

“ఏముంది అంతే. వాళ్ళిద్దరూ తల్లీ కూతుళ్ళే.. తల్లి తలుపు కడ్డంగా వీధి వైపు ముఖంపెట్టి పడుకుంటుంది’

వేళ్ళలో సిగరెట్ వెలుగుతోంది. ఇతగాడు తన రౌండు కోసం మానసికంగా సిద్ధమౌతున్నాడన్న మాట అర్థరాత్రి అయిపోయింది. నిద్రరావట్లేదు. ఏదో బలమైన మానసిక చేతన సన్నావహించింది. వేశ్య, ఆమెతల్లీ వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. గదికూడా యిప్పుడు గదిలో వాళ్ళిద్దరికీ ముఖాలువుండవు, నిజంగానే, ముఖాల్ని చంపేసుకున్నారు. తల్లి ఎలా వుంటుంది అక్కడ? చిటపటమంటూ ఎండిపోతోన్న గుండెతో శ్వాసని అణచివేస్తూ పీలుస్తూ పడి వుంటుంది మారిన ముఖంతో,

కొత్త ఐదు వందల రూపాయల నోటు మీద ఒక మేకు కన్నం చేస్తో పొడుస్తోంది. ఆ రెండింటినీ పిడికిటలో పట్టేశాను. నిద్రరావట్లేదు. తిండికూడా లేదు. మనసంతా ఏదో భావం ఆక్రమించేసింది. మధ్యలో నాకు సమీపంలో ఎవరితోనో లోగొంతులో మాట్లాడుతున్నాడు అతగాడు. తర్వాత నిశ్శబ్దం. మళ్ళీ చాలాసేపటికి అతగాడు నా పక్కన వడుకుని సిగరెట్ వెలిగించాడు. నేను కళ్ళు హఠాత్తుగా తెరవడం గమనించి చిన్నగా నవ్వుతూ ‘నిద్రపోలేదా’

‘లేదు’

తలదిండు మీద చెమకలు ఆనించి ఏదో చెబుతున్నట్టుగా శరీరాన్ని దగ్గరగా సర్దుకున్నాడు.

‘జీవితంలో రేప్ కూడా చేసేశాను, రమణా’

ఎందుకో నాకు శిఖరం మీద ఎదురు కూర్చున్న స్పింక్స్ గుర్తుకొచ్చింది.

‘యిప్పుడే వస్తున్నారా పైకి’

‘యిప్పుడే’ మెల్లగా అంటూ దిండుమీద వెల్లకిలా తలవాల్చి ఊపిరి దీర్ఘంగా పీల్చుకుని మళ్ళీ తలదిండు మీద చెమకలు ఆనించాడు. నిష్ఫలితపు కార్య ఉత్సాహంలో వున్నాడు.

నా ఆలోచనలో స్పింక్స్ చూస్తోంది కాబట్టి రతికార్యం జరగలేదనే ఊహించాను.

‘చీకట్లో ఆమెను పట్టుకున్నాను బలంగా. ఆమె ఒప్పుకోలేదు తోసేసింది నన్ను.

ఇప్పుడు, ఏడుస్తో కూర్చోంది’

‘యిప్పుడింకా ఏడుస్తోందా’

‘ఆ’

అతని ముఖంలో సంతోషాన్ని సంతృప్తినీ చూస్తోంటే అబద్ధమాడుతున్నాడా లేక తనలోపలి వానిమీద అడుగేసి అదిమేసి ఆనందిస్తున్నాడా అర్ధం కాలేదు. అతను ఎంజాయ్ చేసివుండుంటే బావుండేది నా మనస్సులో ఒక ఫ్లాగ్ గాలిలో రెపరెపమంటూ ఉధృతంగా ఎగురుతోండేది. తర్వాత చెప్పాడు అసలు విషయం.

‘ముందు చెప్పలేదు రమణా. పైకొచ్చాక అతనితో విషయం చెప్పాను. అతను ముందు కుదరదన్నాడు

అతన్ని ఒప్పించి కిందకెళ్ళాను. చీకటి ఆమె మొదట నన్ను గుర్తుపట్టలేదు. నన్ను అతడే అనుకుంది. తర్వాత నా బనీను గుర్తించి, నన్ను విదిలించింది. బలవంతం చేశాను’

స్పింక్స్ రెక్కలు చెల్లాచెదురై ఈకలుగా పడుతున్న తర్వాత లేదూ స్పింక్స్ సింహంలా నడుస్తోంది. తెల్లారాక వేశ్యలున్న గదిలోకి వెళ్తున్నానన్న చిత్రమైన మనస్తత్వంతో మెట్లు దిగి గదిలోకి వెళ్ళాను. బ్రష్ చేసి బయటపడదామని.

గదిలో అందరూ లేచి వున్నారు. వెళ్తూనే కుడుంముక్క లాంటి మనిషోకడు బొజ్జమీద లుంగీ బిగించుకుంటూ నిలబడి వున్నాడు. అతని ఆకారం, ముఖం, మొద్దుబారిన వెంట్రుకల బొజ్జ, అలసిన కళ్ళతో సాగతీసిన ధనస్సులాగా వున్నాడు. అలాంటి ఆకారం ఎప్పుడూ ఎదురుపడలేదు. నలభైల లోపే వుంటాడు. పెళ్ళైయింది. యిది వేరే వ్యవహారం. లోపల చాప మీద రెండు నల్లని స్త్రీలు ఒకరినొకరు దగ్గరగా కూర్చుని వున్నారు. బాధతో అనుభవంతో నిండుగా వున్న పెదాలతో ఒకామె కళ్లజోళ్ళు పెట్టుకుని వుంది. వెనకాల ఆమె తల్లి ఎండిన నుదురుతో ముక్కు మీదకంటా చీరని కప్పుకొని చూస్తోంది. ఆమె చూపులు బెరుగ్గా, సిగ్గు పడుతున్నట్టుగా వున్నాయి. ఎండిపోయిన నుదురు కళ్ళు యింకా చూస్తున్నాయి. మొద్దుబొజ్జ మీంచి అతడు లుంగీ బిగిస్తూనే వున్నాడు కళ్ళజోళ్ళు నావైపు దగ్గరితనంతో చూస్తూనేవున్నాయి. ఎండిపోయిన నుదురుని చెక్కసుత్తితో బద్దలు చేసి ఆ ముక్కలోంచి నల్లని గోళీకాయల్ని తీస్తున్నాను. వేడిగా కాలుతున్నాయి.

ఆ రోజుట్నుంచి మళ్ళీ వెళ్ళలేదు అతగాడి రూంకి.

బల్లులంటే చాలా భయం అతనికి. బల్లులకీ ఒంటరితనానికీ ఏమైనా సంబంధం వుందా? కప్పకాళ్ళతో ఒక బల్లి పిలిస్తోన్నట్టనిపిస్తోంది నా లోపల. నాకు నేను నా దేహానికి చిక్కుకున్నానేమో. అయిపోయిందా నా పని. ఏ స్నేహమూ రాదా నా దగ్గరికి, చచ్చిపోగలను నేను. బ్యారేజ్ నుండి దూకేయగలనా నేను? లేదు మళ్ళీ అదే ‘యాతన’ యింటికి పోలేవు ప్యారడైజ్ అక్కడే వుందా? నాగలి, వర్షంలో పొలం గట్ల మీద బురదకాళ్ళతో కూర్చుని తినడం. కాదు యివేమీకాదు వీటన్నిటినీ ఖచ్చితంగా తిరష్కరించేశాను. మళ్ళేప్పుడైనా వెళ్తే భూములుంటాయా? పోరా. ఎంత ధైర్యంగా వెళ్ళగొడ్డున్నావు నిజాన్ని? రైలు రైలుమిద బ్యారేజ్, బ్యారేజ్ మీద టాబ్లేట్, టాబ్లేట్ మీద ఎండోసల్ఫాన్ ఖాళీ డబ్బా, ఖాళీడబ్బాపై ఆర్థ్రంగా చూసే వేశ్యా పెదాలు. మళ్ళీ ఎందుకొస్తున్నాయ్ రొంపిరా కంపురా అది. బేకరీ కేక్ కాదు. బొగ్గుముక్క” అతను రావడంతోనే కొద్దిగా తెరుచుకుని వున్న తలుపురెక్క దభాల్మని ఊడి వరండాలోకి పడిపోయింది. అతను వచ్చినప్పుడల్లా అంతే. ఇంటి వాసన. ఒత్తుగా వున్న జుత్తుని చక్కని పాపిటగా దువ్వుకుని వున్న అతనీ ముఖాన్ని చూస్తే లేని బాల్యం, లేని రోజులూ గుర్తుకొస్తాయి మళ్ళీ. ‘నో మోర్ సర్ఫేస్, నోమోర్ హోం, నోమోర్ రెయిన్’ యిలా అనుకుంటూ అతగాడు తన కుర్చీలోంచి లేచాడు. చొక్కా తాడు మీద నుంచి పడిపోయి వుంది. దాన్ని నిలబెట్టే ఆత్మస్థోమత అతనికి లేదు. పాపిట నడుస్తూ, గాలిహాయిని అనుభవిస్తూ చెప్తున్న మాటలేమీ అతనికి తాకకుండాపోతున్నాయి. అతనేదో పక్కా ప్లాన్ చేస్తున్నాడు. లోపలి రక్తాన్ని ముట్టించెయ్యడానికి యెధవ.

చిత్రకొండ గంగాధర్
కవి గంగాధర్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడుకు చెందినవారు. 'చిత్రకొండ' అనే ఊరుని తన ఇంటిపేరుగా మార్చుకుని చిక్కటి కవిత్వం, ఒకటి రెండు కథలు, 'మృతనగరంలో' అనే నవల రాశారు. గంగాధర్  మరణానంతరం ప్రేమలేఖ ప్రచురణకర్తలు  'ఆత్మహత్యా సదృశ్య  దేశద్రిమ్మరి ఆఖరి కోరిక' పేరుతో  కవిత్వ పుస్తకాన్ని వెలువరించారు.
1975 జనవరి 25న పుట్టిన గంగాధర్ సంచారజీవిగా జీవిస్తూ ముప్పై ఏడేళ్ల వయసులో 2011 ఆగస్టులో తిరిగి తమ ఊరు బొడ్డపాడుకు వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *