ఆలోచన
ఒక పదార్థం
కాంతిలాగే
అణువులతో నిండిన
పదార్థం
ఇది ప్రయాణిస్తుంది
నిన్ను చేరుకుంటుంది
నువ్వు తీసుకుంటే ఉంది
లేకుంటే లేదు
నాకు తెలుసు
నేను కొంత గ్రహిస్తున్నాను
కాంతివలయం చుట్టూ
కనిపించని రహస్య కిరణాల్లా
ఆలోచన కూడా రంగుల్లో
మెరిసిపోతుంది
నాకు
నలుపు రంగు
ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది
నిద్రావస్థలో -
ధ్యానంలో
తెలుపు కూడా...
రెండు రంగులు కలిసే చోట
విడిపోయే చోట విస్ఫోటం
ఆ నిశ్శబ్దం
మెదడు తరళం మీద
పసికందు పాద స్పర్శలా
దేహబోధిలో హృదయం
ఓ కొత్త ఛందస్సును సృష్టించడం
నేను విన్నాను
కొంత చెప్పాను
కొంత కోల్పోయాను
కొంత దాచుకున్నాను
Thought is a matter
చేజారిపోతోంది
నీలోంచీ
నాలోంచీ
భాషలోంచీ

పసునూరు శ్రీధర్‌బాబు
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న పసునూరు శ్రీధర్‌బాబు 1969 జూలై 21న తెలంగాణ పల్లె మోత్కూరులో జన్మించారు. జర్నలిస్టుగా ఇండియా టుడే, హెచ్ఎంటీవీ, ఈటీవీ, బీబీసీ వంటి సంస్థలలో వివిధ హోదాలలో పని చేసిన ఈ కవి ‘తెలంగాణ ఉద్యమంలో టీవీ జర్నలిజం పాత్ర’ అనే అంశం మీద పరిశోదన చేసి జర్నలిజంలో డాక్టరేట్ అందుకున్నారు. ఆధునిక కవిత్వంలో తనదైన స్వరాన్ని వినిపిస్తూ 1991లో తొలి కవితా సంపుటి “అనేకవచనం” ప్రచురించారు. ఆ తరువాత 2021లో రెండో కవిత్వ సంపుటి “నిదురపోని మెలకువ చెప్పిన కల” ప్రచురించారు. అనేకవచనం సంపుటికి అజంతా అవార్డు, రమణ-సుమనశ్రీ పౌండేషన్ పురస్కారం అందుకున్నారు. ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ సంకలనానికి 2022లో రొట్టమాకు రేవు పురస్కారం, ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు, మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కారం అందుకున్నారు. “ఏకాంతం ఒక అతిథి” పేరుతో ఆయన మూడో కవిత్వ సంకలనం డిసెంబర్ 7న హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్ ఆవిష్కృతమవుతోంది.
