అనగనగా ఒక బాబులా

Spread the love

వాళ్ళు ఎక్కడైనా కనపడతారు మీకు.

 మొహం లేని శరీరాలకు, ఎప్పుడో ఒకప్పుడు తెల్లరంగులో వుండి ఇప్పుడు రంగు,రూపం కోల్పోయిన పొట్టి చేతుల చొక్కాలు తొడుక్కుని, సగం చిరిగిన, పాడై  పోయిన ముదురు కాషాయం, ఖాకీ రంగు లాగూలు వేసుకుని, నూనె స్పర్శ ఎరుగని పొగరుబోతు జుట్టు ఎగురుతూ ఉంటే, ఖాళీ చూపులతో, వయసును మించిన అనుభవం ప్రసాదించిన నుదుటి మీది కఠిన రేఖలతో వాళ్ళు ఎక్కడైనా కనపడతారు మీకు.

వాళ్ళ పేరు ఏదయినా కావచ్చు. శీను, మున్నా, భీమ్,చోటు, పేరు ఏదైయినా కావచ్చు. ఎవరికి మాత్రం వాళ్ళ పేరు తెలుసుకోవాలని ఉంటుంది? మీరు వాళ్ళను ప్రతిరోజూ చూస్తూనే వుంటారు. కానీ ఎప్పుడూ గమనించరు.ఈ సృష్టిలో ఏ అస్తిత్వమూ లేని మిగతా క్రిమి కీటకాలతోనో, దారితప్పి చచ్చిపోయిన పిల్లితోనో, లేదా మరణించిన పిచ్చికుక్కతోనో ఏ భావమూ లేకుండా జీవించినట్టు, వాళ్ళతోనూ ఏ భావమూ లేకుండా మీరు రోజులు గడిపేస్తూనే వుంటారు.

దేవాలయం మెట్ల మీద సత్తు అల్యూమినియం బొచ్చె పట్టుకుని జాలిచూపులతో అడుక్కుంటూ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన మీ కారు అద్దం గట్టిగా తడుతూ చేతులు చాస్తూ, చిరిగిన దుస్తులు కప్పుకుని, మురికి గుడ్డలను కాళ్లకు బ్యాండేజ్ లా చుట్టుకుని మీ చుట్టూ ఎప్పుడూ కనిపిస్తూనే వుంటారు. కానీ మీరెప్పుడూ వాళ్ళను గమనించరు.

ఆ దయనీయ స్థితిని మీరు మార్చలేరు. కానీ ఆ దయనీయ స్థితే ఈ దేశ దరిద్రానికి ఒక ప్రతీకగా నిలచింది అన్న వాస్తవం తో మీరు జీవించక తప్పదు.

కానీ బాబులా అలా కాదు. ఒకప్పడు అతడు అందరిలో ఒకడు. ఇప్పుడు అతడు లేకపోతే మా తరుణీ మిఠాయిల దుకాణంఅస్తిత్వానికే అర్ధం లేదు. మా తరుణీ మిఠాయిల దుకాణం లో బాబులా ఒక తప్పనిసరి అవసరం. అందులో ఎలాంటి భిన్నాభిప్రాయమూ లేదు. మా తరుణీ మిఠాయిల దుకాణం బస్ స్టాండ్ కి పది గజాల దూరంలో ఉంటుంది. కటక్-బారిపద హై వే మీద ఉన్న ఆ బస్ స్టాండ్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కటక-బారి పద  బస్సులే కాక, భద్రక్ కేంద్రంగా తిరిగే బస్సులు కూడా ఆ బస్ స్టాండ్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది కనుక దుకాణం ఎప్పుడూ జనం తో కిటకిట లాడుతూ ఉంటుంది.

రెండు వెదురు బొంగులకు తుప్పు పట్టిన ఇనుప వైర్ తో కట్టిన మా తరుణీ స్వీట్స్ అన్న బోర్డు రంగు వెలసి చాలా కాలం అయింది. ఎండకు ఎండీ, వానకు తడిసి కొన్ని అక్షరాలు అలుక్కుని కనపడకుండా పోయాయి. దుకాణం లోకి వెళ్లే వాళ్ళు ఎవరైనా కాస్త తల వంచి లోపలకు జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఒక వైపుకు ఒరిగిన మా తరుణీ బోర్డు వాళ్ళ తల మీద పడిపోయే ప్రమాదం వుంది. బోర్డు వెనుక మరీ అంత చిన్నగా కానీ, మరీ అంత పెద్దగా కానీ కాక మధ్యస్థంగా ప్లాస్టరింగ్ చేయకుండా కేవలం ఇటుకలతో కట్టిన ఒక గది దానిపైన ఆస్ బెస్టాస్ రేకులతో వేసిన కప్పు తో ఉంటుంది. ఆ గది వంటగదిగానూ, భోజన శాల గానూ రెండు విధాలుగా ఉపయోగ పడుతున్నది. గది వెనుక వైపు భాగానికి దారితీస్తూ చిన్న తలుపు. గది ఒక మూలగా ఒక పెద్ద మట్టి పొయ్యి. మా తరుణీ మిఠాయి దుకాణం యజమాని బటా సాహు ఆ పొయ్యి పక్కన కూర్చుని పెద్ద మూకుడు లో నోట్లో నీళ్లు వూరే విధంగా రకరకాల తియ్యటి మిఠాయిలు చేసి పక్కనే వున్న అద్దాల బీరువాలో అందంగా అమరుస్తాడు.  

అద్దాల బీరువా బటా సాహు కూర్చునే కుర్చీ కి పక్కగానే ఉంటుంది. అద్దాల బీరువాలో అందంగా అమర్చిన మిఠాయిలు నోరు ఊరిస్తూ ఉంటాయి. బీరువా కి ఎదురుగా ఐదు టేబుళ్లు, ఒక పెద్ద చెక్క బెంచీ కస్టమర్లు కూర్చోవడానికి వీలుగా ఉండి ఆహ్వానిస్తూ ఉంటాయి. కొన్నేళ్ల క్రితం ఆ టేబుళ్ళకీ, చెక్క బెంచీ కి, కుర్చీలకీ మక్కు పెట్టి పెయింట్ వేసి వుంటారు. ఇప్పుడవి పెయింట్ అంటే ఏమిటి అని అమాయకంగా కనిపించిన వాళ్ళందరినీ అడుగుతుంటాయి.

ఇరవై ఏళ్ళ జగబంధు కస్టమర్ల దగ్గర ఆర్డర్ తీసుకుని పదార్ధాలు సరఫరా చేస్తాడు. బటా సాహు చాలా తరచుగా

“కొంచెం చురుగ్గా ఉండరా!” “ఫాస్ట్ గా కానివ్వరా!”

 అని కోపము, అసహనము మిళితమైన స్వరం తో హెచ్చరిస్తూ ఉంటాడు. బాబులా పని వేరు. కస్టమర్ల టేబుళ్ల కి కొంచెం దూరంగా నిలబడి, “ఎవరు తినడం పూర్తి అవుతుందా?” అని డేగ కళ్ళతో చూస్తూ ఉంటాడు తన ఎడమ చేతిలో నూనె మరకలతో మొద్దుబారిన ముతక గుడ్డను పట్టుకుని. కస్టమర్ తన కుర్చీలోనుండి లేచీ లేవకముందే బాబులా ఒక్కుదుటున సీట్ దగ్గరకు వెళ్లి కుడి చేత్తో ప్లేట్ తీసి ఎడం చేత్తో టేబుల్ శుభ్రం చేస్తాడు. బాబులా రెండు చేతులూ ఎంత వేగం తో ఎంత సమన్వయం తో పని చేస్తాయో అంత కళాత్మకంగానూ పనిచేస్తాయి. అయినా జగబంధు, బటా సాహు ఇద్దరూ బాబులా పని లో ఏ చిన్న తప్పు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ వుంటారు. ఒక్క సెకను పాటు ఆలస్యం చేసినా

 “ఓ బాబులా! బుద్ది తక్కువ వెధవా! అక్కడ నిలబడి ఏం చూస్తున్నావు?” అని గట్టిగా అరుస్తారు.

బాబులా వెనక ఉన్న తలుపు నెట్టుకుని చవకరకం స్టీల్ పళ్లేలు, గిన్నెలు శుభ్రం చేయడానికి తీసుకుని వెళతాడు. పళ్ళేలలో మిగిలి ఉన్న పదార్ధాలను వాటి అంచుకు తీసుకుని వచ్చి కుడి చేతిలోకి ఒంపుకుని వెనుకగా రోడ్డు పక్కన వున్న, చెత్తకుప్పల్లోకి, పొదల్లోకి విసిరివేస్తాడు. అతడు అలా చేసిన ప్రతిసారీ, రెండు వీధి కుక్కలు అందులో ఒకటి గోధుమ రంగు వున్నది, మరొకటి నల్ల రంగు వున్నది అలా విసరివేయడం కోసమే ఎదురు చూస్తున్నట్టు ఒక్కసారిగా ఆ చెత్తకుప్ప మీదకి లంఘిస్తాయి తోకలు ఊపుకుంటూ. రోజుల తరబడి నిల్వ ఉన్న పదార్ధాల దుర్గంధం కుక్కలు దూకగానే స్వేచ్ఛ పొందినట్టు గాలిలో వ్యాపించి బాబులా నాసికను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మురికి నీళ్లతో నిండిన మురికి తొట్టి లో పళ్లేలు, గిన్నెలు, గ్లాసులు శుభ్రం చేసి ఒక పక్కన పెట్టి, హ్యాండిల్ లేని సగం విరిగిపోయిన మగ్ నీళ్లు తీసుకుని మళ్ళీ రెండోసారి వాటిని శుభ్రం చేస్తాడు. పాత్రలనుండి కారే నీరు మట్టితోనూ, బురదతోనూ కలిసి గోడ పొడవునా పేరుకుని పోతుంది. శుభ్రం చేసిన పాత్రలు తీసుకుని హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు లోపలకు పరుగెత్తుతాడు. అప్పటికే ఒక కస్టమర్ తినడం పూర్తిచేసి, మరొకరు పూర్తిచేయడానికి సిద్ధంగా వుంటారు పూరీ  చివరి ముక్కను నములుతూ. జగబంధు కి కానీ బటా సాహు కి కానీ నిందించే అవకాశం ఇవ్వకుండా బాబులా వెంటనే ఖాళీ ప్లేట్స్ శుభ్రం చేస్తూ ఉంటాడు.

మా తరుణీ మిఠాయి దుకాణం చాలా పొద్దున్నే, తెల్లవారుజామునే నిద్ర లేస్తుంది. ఉదయం ఫలహారంగా పూరి,వడ, ఆలుగడ్డల కూర, జిలేబి తయారు చేస్తారు. పొద్దున్నే బస్సు దిగే ప్యాసింజర్లు మా తరుణీ లోనే తమ ఉదయ ఫలహారం పూర్తి చేస్తారు. బస్సులు ఆపి కస్టమర్లను తీసుకుని వచ్చినందుకు గాను బస్సు డ్రైవర్లు కండక్టర్లకు, తిన్నంత ఫలహారం సగం ధరకే లభిస్తుంది. ఉదయం పూట టిఫిన్ చేసే వాళ్లతో పోలిస్తే మధ్యాహ్నం భోజనం చేసే వాళ్ళ సంఖ్య తక్కువే! కొద్దిమంది రోజువారీ కస్టమర్లు, ట్రక్కు, ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో రిక్షా నడుపుకునే వాళ్ళు ముతక బియ్యం తో వండిన అన్నం, దాల్మా, వేయించిన కూరలతో భోజనం ముగిస్తారు. సాయం కాలం కస్టమర్ల కోసం మళ్ళీ, వడ పకోడీ, సమోసా తయారు చేస్తారు. రాత్రిపూట మిఠాయిల తయారీ. దాదాపు అర్ధరాత్రి అవుతుండగా మా తరుణీ తనను తాను శుభ్రం చేసుకుని మూత పడుతుంది.

షాపు మూసేశాక జగబంధు ఎక్కడికో వెళతాడు. అతడు ఎక్కడికి వెళ్తాడన్నది బాబులా కి ఒక పెద్ద పజిల్. బాబులా కి తెలిసినంత వరకు జగబంధు చుట్టాలు ఎవరూ ఆ చుట్టుపక్కల లేరు. కానీ బటా సాహు ని అడిగితే “జగబంధు తన బంధువుల దగ్గరకి వెళ్తాడు” అని అదోరకంగా నిర్లక్ష్యంగా నవ్వుతూ చెప్తాడు. మా తరుణీ మిఠాయి దుకాణాన్ని ఆనుకుని మరొక చిన్న గది వుంది. అది కూడా ప్లాస్టరింగ్ లేకుండా కేవలం ఇటుకలతో వేసిన గదే!. చిన్న మంచం మీద ఎప్పటిదో ఒక పాత పరుపు పరచి ఉంటుంది ఒక పక్కన. బటా సాహు విడిచిన బట్టలు, లో దుస్తులు గదిలో ఆ మూల నుండి ఈ మూలకు కట్టిన తీగ మీద వేసి ఉంటాయి. ఒక మూలగా మడిచి పెట్టిన చాప, మరొక పక్క రాత్రి పూట చేసిన మిఠాయిలు సర్ది ఉంటాయి. ఆ గది బటా సాహు కి ఉండటానికీ, పడుకోవడానికి ప్రత్యేకించినది

“నాకో మూడు రూపాయల సమోసాలు ఇస్తారా?” బాబులా వెనుక నుండి వినిపించిందో స్వరం. ఆ గొంతు లోని మార్దవం బాబులా ను తన పనిలోనుండి తల పక్కకు తిప్పేలా చేసింది. ఎదురుగా చేతిలో డబ్బులు పట్టుకున్న పిల్లాడి   రెండు కళ్ళు బాబులానే చూస్తున్నాయి.

“నాకు సమోసాలు ఇస్తారా?” మళ్ళీ అడిగాడా పిల్లాడు. ఆ పిల్లాడు అడిగిన ప్రశ్న తననా? కాదా? అని తేల్చుకోవడానికి చుట్టూ చూసాడు బాబులా. జగబంధు కానీ, సాహూ కానీ చుట్టుపక్కల లేరు. అంటే ఆ పిల్లాడు అడిగింది తననే! బాబులా మా తరుణీ మిఠాయి దుకాణం లో చేరిన తరువాత ఒక కస్టమర్ ఫలానా కావాలి అని బాబులా ని అడగడం అదే మొదటిసారి. అలా తనను అడగడం ఒక అద్భుతమైన, ముఖ్యమైన విషయంగా బాబులా అనుభూతించాడు. సమోసాలు పొట్లం కట్టి ఎదురుగా నిలుచున్న పిల్లాడికి ఇవ్వడానికి ఉద్యుక్తుడు అయ్యాడు బాబులా.

 కానీ తన మురికి చేతులతో ఎలా పొట్లం కట్టగలడు? ఎదురుగా వున్న పిల్లాడు బాబులా కంటే కాస్త ఎత్తుగా వున్నాడు. ముదురు గోధుమ రంగు లో ఉండి తెల్లటి చొక్కా, నల్లటి నిక్కర్ వేసుకుని, ఖరీదైన బెల్ట్ పెట్టుకుని, కాళ్లకు శుభ్రంగా రంగులద్దిన బూట్లు వేసుకుని వున్నాడు. అలాంటి పిల్లాడికి తన మురికి చేతులతో సమోసాలు కట్టి ఇవ్వడమా? ఒక్క క్షణం పాటు బాబులా ఆలోచనలో ఉండగానే ఆ పిల్లాడు ముందుకు వచ్చి మడతపెట్టిన ఐదు రూపాయల నోటు తీసుకుని కౌంటర్ దగ్గరకి వచ్చాడు.

“అలా అక్కడ రాట లాగా నిలబడకుండా, ఈ సమోసాలు ఆ పిల్లాడికి ఇవ్వు. బుద్ది లేని వెధవా?”

పొట్లం కట్టిన సమోసాలను చేతికి అందిస్తూ కోపంగా అన్నాడు బటా సాహు. బాబులా చేతిలో ఉన్న స్టీల్ ప్లేట్, గిన్నె టేబుల్ మీద పెట్టి సాహు దగ్గరనుండి పొట్లం తీసుకుని ఆ పిల్లాడికి అందించాడు. ఆ పిల్లాడు నవ్వుతూ బాబులా దగ్గరనుండి సమోసాలు తీసుకున్నాడు. ఆ పిల్లాడు హఠాత్తుగా బాబులా వేసుకున్న చొక్కాకి భుజం మీద కనపడుతున్న పెద్ద చిరుగును చూపుడు వేలుతో చూపిస్తూ,

 ” ఆ చిరుగు కుట్టమని మీ అమ్మ కు చెప్పు. లేకపోతే అది మరింత పెద్దది అవుతుంది” అన్నాడు

బాబులా ఏమీ మాట్లాడకుండా పిల్లాడి చేతిలోనుండి ఐదు రూపాయల నోటు తీసుకుని, బటా సాహు కి ఇచ్చి చిల్లర రెండు రూపాయలు తీసుకుని మళ్ళీ పిల్లాడికి ఇచ్చాడు.  రెండు రూపాయలు తీసుకుంటున్నప్పుడు పిల్లాడి ముని వేళ్ళు బాబులా అరచేతిని తాకాయి. ఈ మొత్తం సన్నివేశం బాబులా ను అబ్బురపరిచింది. యువరాజులా ఉన్న ఒక అబ్బాయి తనతో ఎంతో మర్యాదగా మాట్లాడటం, తన మురికి చేతుల మీదుగా సమోసాలు తీసుకోవడం అంతా చాలా కొత్తగా వుంది బాబులాకి.

“ఆ చిరుగును కుట్టమని మీ అమ్మను అడుగు” అని ఆ పిల్లాడు చెప్పిన మాటను బాబులా ఇష్టంగా గుర్తు చేసుకున్నాడు. తనకంటూ ఒక అమ్మ వున్నదని ఆ పిల్లాడికి ఎలా తెలుసు?  బాబులా ఆలోచనలో పడ్డాడు. అతడికి హఠాత్తుగా తన తల్లి గుర్తుకు వచ్చింది. అవును బాబులాకి అమ్మ ఉండేది. ఈ ప్రపంచం అంటూ ఒకటి అనుభవం లోకి వచ్చినప్పటి నుండీ బాబులా అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు.

 అమ్మ ఎలా ఉండేది?  మురికి పట్టిన ముతక చీర కట్టుకున్న సన్నని ఆకారం, ఎప్పుడూ వికారంగా వుండే మొహం, గాలికి రేగే జుట్టు, ఎండకు నల్లబడిన వొళ్ళు. అమ్మ బొమ్మ అస్పష్టంగా జ్ఞాపకం వచ్చింది.అమ్మ కి ఎంత వయసు ఉంటుంది? అమ్మ చిన్నదా? పెద్దదా? అసలు ఆమె తన అమ్మేనా? ఉడికీ ఉడకని అన్నం, నీళ్లు కారే ఆలుగడ్డల కూర గిన్నెలో పట్టుకుని బాబులా కోసం తరచూ ఎదురు చూస్తూ ఆమె ఉండేది కనుక బాబులా కి అమ్మ అనగానే ఆ రూపం గుర్తుకు వచ్చి ఉండొచ్చు

మిగతా రోజంతా బాబులా కానీ, ఆమె కానీ ఒకరినొకరు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు మరి కొంత మంది తో కలసి ఒక బస్తీలో వుండేవాళ్ళు. బాబులా తనలాంటి మరికొంతమంది పిల్లలతో కలిసి ఒక మురికి గదిలో పడుకునేవాడు. అందరూ అన్నాతమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ లాగా ఒకరి మీద మరొకరు కాళ్ళేసుకుని పడుకునేవాళ్ళు. తెల్లవారగానే ఎవరికీ వాళ్ళు వాళ్ళ అమ్మలు వుండే గుడిసెల్లోకి వెళ్లిపోయేవాళ్లు అమ్మలు ఏదైనా పెడతారేమో తింటానికి అనే ఆలోచనతోనే.

అప్పుడప్పుడు రాత్రిపూట పోలీసులు వచ్చి ఆ బస్తీ మీద దాడి చేసేవాళ్ళు. పోలీసుల బూట్లచప్పుడు, వాళ్ళ బూతు మాటలు, ఆడవాళ్ళ ఏడుపులు, రాత్రిపూట భయంకరంగా వినిపించేవి. ఒక్కోసారి గుడిసెలను తగులబెట్టేవాళ్ళు. అలా తగులబెట్టిన మరునాడే అందరూ కలిసి మరోచోటికి వెళ్లి గుడిసెలు వేసుకునే వాళ్ళు. అలా రెండు మూడు నెలలకు ఒకసారి వాళ్ళు తిరిగిన చోటుకు తిరగకుండా తిరిగేవాళ్లు.

అలాంటి ఒక సంఘటనే బాబులా జీవితాన్ని మార్చేసింది. ఆ సంఘటన బాబులా మనసులో ఇంకా తాజాగానే వుంది. ఒక మధ్యాహ్నాం పూట బస్తీ మధ్యగా వెళ్లే మురుగు కాలువ పక్కన మిగతా స్నేహితులతో కలిసి బాబులా ఆడుకుంటున్నప్పడు కొన్ని గజాల దూరం లో ఒక పోలీస్ జీప్ ఆగింది. అందులోనుండి పోలీసులు గుడిసెలోపలికి వెళ్లి బాబులా అమ్మను జుట్టుపట్టుకుని బయటకు లాక్కుని వచ్చారు. బాబులా వాళ్ళ అమ్మ పెద్దగా అరుస్తూ ఏదో చెప్తోంది. ఆమె ఏమి చెప్తున్నదో బాబులా కి వినపడలేదు. ఆమె ఏమి చెప్తున్నదో వినే సహనం పోలీసులకు లేదు. వాళ్ళు ఆమెను బరబరా లాక్కుని వచ్చి జీప్ ఎక్కించారు. జీపు కదులుతుండగా అమ్మ తనవైపు చూస్తుంది అని బాబులా ఎదురు చూశాడు కానీ ఆమె చూడలేదు.

పోలీసులు వెళ్ళిపోయిన తరువాత బాబులా గుడిసెలోకి వెళ్ళాడు. ఏమి జరిగిందో అతడికి అర్ధం కాలేదు. మొట్టమొదటి సారి బాబులా గుడిసె లోకి పరిశీలనగా చూశాడు. మామూలుగా అయితే రోజుకు రెండు సార్లు అన్నం తినడానికి మాత్రమే అతడు గుడిసె లోకి వచ్చేవాడు.  మాసిన చిరుగులు బొంత ఒకటి నేల మీద పరచివుంది. పక్కనే ఒక చిన్న ట్రంక్ పెట్టె, పైన మడతపెట్టి పెట్టిన రెండు చీరలు. బహుశా అమ్మవే అయి ఉంటాయి. ఇంకో మూల రెండు అల్యూమినియం గిన్నెలు, ఒక మట్టి కుండ దానితో పాటు వంట చేసే మరొక మట్టి కుండా. వీటన్నిటిని చూసే సరికి బాబులా కి కడుపులో ఏదో కదిలినట్టు అనిపించింది. అవును ఆకలి

తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని గుడిసె అంతా వెతికాడు బాబులా. ట్రంక్ పెట్టెమీద వున్న చీరలు లాగి కింద పడేశాడు. గిన్నెలన్నీ వెతికి చూసాడు. ఇంకా వెతుకుతుంటే చిన్న జగన్నాధుడి విగ్రహం ఒకటి కనిపించింది. దాని పక్కనే చిన్న ఇత్తడి గంట. అమ్మ పూజ చేసుకునేటప్పుడు వాయించేది అనుకుంటా. చివరకు అతడి వెతుకులాట ఫలించి ఒక గిన్నె లో మెత్తబడిపోయిన పాఖల కనిపించింది. అతడు గబుక్కున ఆ గిన్నెలోంచి దాన్ని తన పొట్టలోపలకు జారవేశాడు. ఇదంతా అయ్యేసరికి అలసట ముంచుకుని వచ్చి బాబులా అక్కడే నేల మీద ముడుచుకుని పడుకున్నాడు. క్షణం లో నిద్రలోకి జారుకున్నాడు.

బాబులా కి మళ్ళీ మెలకువ వచ్చేసరికి తెల్లవారిపోయింది. గుడిసె లో నుండి మెల్లగా బయటకు వచ్చి చుట్టూ చూసాడు. బస్తీ మొత్తం మీద మగవాళ్ళు అంటూ ఎవరూ కనిపించలేదు. కొంతమంది ఆడవాళ్ళూ ఉతికిన బట్టలు తీగల మీదారవేస్తున్నారు.  మరికొంతమంది పేడను పిడకలు చేసి ఎండలో ఆరబెడుతున్నారు. కొంతమంది పిల్లలు బోరింగ్ దగ్గర ఏర్పడిన చిన్న నీటి గుంటలో ఆడుతున్నారు. నెమ్మదిగా బయటనుండి గుడిసె తలుపుకి బయటనుండి గొళ్ళెం పెట్టాడు. ఒక్కసారి గుడిశె వంక చూసాడు. ఈ గుడిసె తో ఇక నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అన్నట్టుగా, చివరిసారి చూసినట్టు చూశాడు. మెల్లగా నడక మొదలు పెట్టాడు.

అలా చాలా దూరం నడిచి బస్ స్టాప్ దగ్గరకు చేరుకున్నాడు. హడావిడిగా అటూ ఇటూ తిరిగే జనాలు, బస్సు ఇంజన్ల మోత, గాలిలోనుండి తెలివచ్చే సమీప హోటళ్లలోని పదార్ధాల వాసన అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆహార పదార్ధాల వాసన బాబులా లోని ఆకలిని తట్టి లేపింది. ఆకలి తీర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు అనిపించింది. హోటల్ దగ్గరకో, దుకాణం   దగ్గరకో వెళ్లి చేయి చాస్తే చాలు. ఓ బ్రెడ్డు ముక్క, లేదా రెండు వడలు, లేక ఒక చపాతీ, అదృష్టం బాగుంటే రసగుల్లా దొరుకుతుంది. ఇంత అద్భుతమైన ఆహరం ఇక్కడ ఉండగా తను ఎందుకా పాచిపోయిన పాఖల ఇన్నాళ్లు తిన్నాడు అని తనను తానే  నిందించుకున్నాడు బాబులా.

 కానీ ఇలా ఒకరి దయా దాక్షిణ్యం మీద ఎన్నాళ్లని ఆధారపడటం? అయినా వాళ్ళు విదిలించేది ఆకలిని ఏమాత్రం తీర్చడం లేదు. అందుకని బాబులా నెమ్మదిగా ఎవరూ లేకుండా చూసి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. నాలుగు ఐదు సార్లు విజయవంతంగా దొంగతనం చేశాక ఆరో సారి పట్టుబడ్డాడు. పిడిగుద్దులు, బూతుమాటలు బాబులా మీద కుండపోత వర్షం లాగా కురిశాయి. దుకాణదారుడు బాబులను కొట్టీ కొట్టీ అలసిపోయి “ఇంకోసారి ఈ పని చేశావంటే పోలీసులకు పట్టి ఇస్తాను. వాళ్ళైతే వొంట్లో వున్న ఎముకలు అన్నీ విరగ్గొడతారు” అని ఆవేశంగా కూర్చున్నాడు.

బాబులా దెబ్బల తాకిడికి నుగ్గునుగ్గు అయిన శరీరాన్ని ఎలాగో ప్రయాణీకులు కూర్చునే సిమెంట్ బెంచీమీదకు చేర్చాడు. ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. అలా ఒంటరిగా కూర్చున్నపుడు

“రెండు ఆలుగడ్డ వడలు దొంగతనం చేసినందుకు వొళ్ళంతా వాయగొట్టారా?” అని ఎవరో అన్నారు బాబులను ఉద్దేశించి. బాబులా ఆ మాటలు వచ్చిన వైవు చూసాడు. పక్కనే ఒక పెద్ద మనిషి. నెరిసిన గడ్డం, మోకాళ్ళ పైకి వున్న నీరుకావి పంచ తన పక్కనే నిలబడి వున్నాడు. అతడిని బాబులా ఎప్పుడూ చూడలేదు. అతడిని చూసిన వెంటనే ఏడుపు ముంచుకొచ్చింది బాబులాకి.

“అయ్యయ్యో! పిల్లాడిని గొడ్డును బాదినట్టు బాదారే! చిన్న పిల్లాడిని. సరేలే ఏడవకు.” అని బాబులను సముదాయించి

 “అయినా నువ్వు ఆ దొంగతనం ఎందుకు చేశావు?నువ్వు పని చేస్తే నీకు కావలసినంత ఆహారం దొరుకుతుంది కదా. చూడు ఇప్పుడు నువ్వు దొంగతనం చేసిందేమో రెండు వడలు. నీ ఒంటిమీద పడినవి రెండొందల దెబ్బలు” అన్నాడు అనునయంగా

ఆ పెద్ద మనిషి వంక ఉత్సుకత తో చూశాడు బాబులా ఈ సారి.

” చూడు నువ్వొక హోటల్ లో పనిచేస్తావా? పెద్ద పనేమీ ఉండదు. టేబుల్స్ ను తుడవడం, కొన్ని గిన్నెలు కడగడం. నా మేనల్లుడికి ఒక చిరుతిళ్ల దుకాణం వుంది. నువ్వాపని చేస్తే నీకు మూడు పూటలా నువ్వు తిన్నంత భోజనం” అతడి మాటలకు బాబులా ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఆ పెద్ద మనిషే

“నాతో రా! నిన్ను అక్కడకు తీసుకుని వెళతాను.” అన్నాడు.

బాబులా చేతి వెనుక భాగం తో కళ్ళు తుడుచుకుని   ఆ పెద్దమనిషిని అనుసరించాడు. వాళ్లిద్దరూ బస్సెక్కి చాలా దూరం ప్రయాణం చేసి మధ్యాహ్నానికి ఒక ఊళ్ళో బస్సు దిగారు. బస్ స్టాండ్ కి పది గజాల దూరం లోనే ఆ పెద్దమనిషి చెప్పిన దుకాణం వుంది. అదే మా తరుణీ మిఠాయిల దుకాణం. ఆ పెద్ద మనిషి గబగబా దుకాణం లోకి వెళ్ళాడు బాబులా ను దుకాణం ముందే ఉంచి. లోపల మరొక మనిషి వున్నాడు. చెక్క స్టూల్ మీద కూర్చుని వున్నాడు. ధోవతి కట్టుకుని పైన అంతా ఏ ఆచ్చాదనా లేకుండా వదిలేసాడు. బాబులా ని తీసుకుని వచ్చిన పెద్ద మనిషి కాస్త కిందకు వంగి అతడి చెవిలో ఏదో చెప్పి బాబులను చూపించాడు. పెద్ద మనిషి అలా చెపుతుండగానే అర్ధ నగ్నం గా వున్న మనిషి కళ్ళెత్తి బాబులా వంక చూశాడు. ఒకసారి తలా పంకించి

 “లోపలకు రా! బయటే నిలబడ్డావెందుకు? నీ పేరేమిటి?” అని అడిగి బాబులా చెప్పే జవాబును వినిపించుకోకుండానే లోపలికి తిరిగి

 ” జగ్గా! కాస్త అన్నం కూర తీసుకుని రా ఈ పిల్లాడికి!” అన్నాడు

మా తరుణీ మిఠాయి దుకాణం పక్కనే వున్న చిన్న గది బటా సాహు విశ్రాంతి తీసుకునే గది. జగబంధు ఒక అరిగిపోయిన గడ్డి చాప ను బాబులా ముందుకు విసిరేసాడు. ఆ గడ్డి చాప మీద బాబులా పడుకుంటే, మంచం మీద బటా సాహు పడుకున్నాడు. సాహు పెట్టే పెద్ద గురక, ఎలుకలు రణగొణ చప్పుడు బాబులాకి నిద్ర పట్టనివ్వలేదు.  కానీ చాలారోజులకు కడుపు నిండా తిన్న తిండి, కొత్త చోటులోని సరికొత్తదనం, ఎప్పుడూ ఎరగని గడ్డి చాప ఇచ్చిన మెత్తదనం బాబులాని నిద్ర లోకి లాక్కున్నాయి.

ఆ మరునాడు కూడా భోజనం బావుంది. దొరికిన మంచి భోజనం తో పోలిస్తే చేస్తున్న పని కూడా పెద్ద భారంగా అనిపించలేదు బాబులా కి. కానీ చేస్తున్న పనికి కొత్త కావడం వలన కొంత నెమ్మదిగా చేసేవాడు. సాహు కూడా పెద్దగా పట్టించుకోలేదు, నెమ్మదిగా నేర్చుకుంటాడులే అని. ఎంగిలి పళ్లేలు తీస్తున్నప్పుడు ఎప్పుడైనా వాటిలో మిగిలిన పదార్ధాలను పొరపాటున కిందపడేస్తే బాబులా చాలా కంగారుగా జగబంధు వైపు చూసేవాడు. జగబంధు ఫరవాలేదు లే అన్నట్టు తల వంచి నవ్వేవాడు. బాబులా రావడం తో జగబంధు పని సగానికి పైగా తగ్గిపోయింది. అందుకేనేమో బాబులా అంటే కొంత సానుకూలంగా ఉండేవాడు జగబంధు.

 పని అయిపోగానే జగబంధు బయటికి వెళ్లిపోయేవాడు. అతడు ఎక్కడికి వెళుతున్నాడో, ఎప్పుడు మళ్ళీ వస్తున్నాడో బాబులాకి అర్ధం అయ్యేది కాదు. క్రమం తప్పకుండా చేస్తున్న భోజనం, మంచి నిద్ర, వ్యాయాయం లాంటి పని కొద్దీ రోజులలోనే బాబులా రూపాన్ని మార్చేశాయి.ఆకలి, దుఃఖం కలిగించిన నల్లటి చారికలు బాబులా మొహం మీద నుండి అదృశ్యం కావడం మొదలు అయింది.  బాబులా ఇప్పుడు ఆకర్షణీయంగా తయారయ్యాడు.

అప్పుడు జరిగింది అది  

ఆ సాయంత్రం కొద్దిగా పడిన వర్షానికే దోమలు బాగా రెచ్చిపోయాయి. అవిశ్రాంతంగా అవి కుడుతున్నా బాబులా ఎప్పటిలాగే నిద్రలోకి జారుకున్నాడు. హఠాత్తుగా ఏదో తన మీద పాకుతున్నటు అనిపించింది. వెంటనే బాబులా లేచి కూర్చున్నాడు.

“ష్ ..! చప్పుడు చేయొద్దు” ఒక బొంగురు గొంతు బాబులా చెవిలో గుసగుస గా వినిపించింది. ఆ గొంతు ఎవరిదో మొదట బాబులా కి అర్ధం కాలేదు.

“కదలకుండా పడుకో!” బిగించిన పళ్ళ మధ్య నుండి బుసలా వినిపించింది మళ్ళీ ఆ గొంతు. బాబులా కి వెంటనే అర్ధం అయింది ఆ గొంతు బటా సాహు ది అని. బాబులా ఏదో మాట్లాడబోయే లోగానే, బటా సాహు లూజుగా ఉన్న బాబులా లాగు కిందికి లాగేసాడు.

“సాహు ఏం చేయబోతున్నాడు?” బాబులా ఆశర్యం తో బిగుసుకుపోయాడు. మరుక్షణం లో గట్టిగా ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. బాబులా గొంతు చీల్చుకుని పెదవుల నుండి గట్టి కేక బయటకు వచ్చింది.

“అమ్మా! నేను చచ్చిపోతున్నాను. నన్నొదిలెయి” ఆ చిన్న గది లో ప్రతిధ్వనించిన ఆర్తనాదాలు మూసివున్న తలుపు ఖాళీల లోనుండి జాతీయ రహదారి మీద కు వచ్చి మెల్లగా అనంత శూన్యంలో కలిసిపోయాయి. కొన్ని వందల పిల్లల ఆర్తనాదాలు ఎవరూ వినకుండా గాలిలో కలిసిపోయినట్టుగా.

“నోర్మూసుకో! అమ్మా! అట అమ్మ! అదక్కడ ఎంతమందితో కులుకుతుందో దేవుడికే తెలుసు!” బటా సాహు గుర్రుమన్నాడు. నొప్పి భరించలేక బాబులా అరుస్తూనే వున్నాడు. “నోర్ముయ్య్” అంటూ బటా సాహు రెచ్చిపోతూనే వున్నాడు. నొప్పిని మించిన అవమానం, బాధ బాబులా కళ్ళనుండి కాలువలు కట్టినాయి.

“నోరు ముయ్యి లం …. కొడకా! లేకపోతే ఆ కత్తితో గొంతు కోసేస్తాను” అని తిడుతూనే బటా సాహు లేచి తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కొద్దీ క్షణాల తరువాత బటా సాహు పంపు తిప్పి గొంతు శుభ్రం చేసుకుంటున్న శబ్దం వినిపించింది బాబులాకి.

మరునాడు నొప్పి బాబులా ను అతలాకుతలం చేసింది. అతి కష్టం మీద లేచాడు. నిలబడితే కాళ్ళు వణుకుతున్నాయి. బటా సాహు కౌంటర్ లో నుండి ఐదు రూపాయల నోటు తీసి చేత్తో పట్టుకుని బాబులా వంక తీసుకోమన్నట్టు చూసాడు. రాత్రంతా ఏడ్చి, ఏడ్చి ఉబ్బిన కళ్ళతో ఆ ఐదు రూపాయలవంక చూస్తుంటే దాన్ని తీసుకోమన్నట్టు జగబంధు సైగ చేసాడు.

బటా సాహు బాబులా వంక చూడకుండా జగబంధు తో ” వాణ్ణి తీసుకెళ్లి వారం వారం జరిగే సంత లో వాడికో కొత్త చొక్కా, రెండు నిక్కర్లు కొను. కొంటావా?” అన్నాడు జవాబు ఆశించకుండా పూరీలను బాణలి లో వేయిస్తూ

ఆ రోజంతా భారంగా గడిచింది బాబులాకి. ఆ దుకాణం లో పనిచేస్తూ బాబులా ఒకటి గమనించాడు. దుకాణం కట్టేయడానికి కొద్దీ నిమిషాల ముందు ఒక బస్సు వస్తుంది. అది కొద్దీ నిమిషాలపాటే అక్కడ ఆగుతుంది. దుకాణం నుండి బస్ స్టాండ్ ఎంతో దూరం లేదు. పొద్దున్న ఇచ్చిన ఐదు రూపాయల నోటును జేబులోనుండి ఒకసారి బయటకు తీసి చూసుకున్నాడు బాబులా. సరిగ్గా బస్సు ఇంకాసేపట్లో వస్తుంది అనగా వెనుక తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. రెండడుగులు వేసేసరికి బస్సు వస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే బాబులా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. వేగంగా నడవడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా వెనక ఎవరిదో చేయి పడింది. తలతిప్పితే బటా సాహు, జగబంధు. సాహు చేతిలో ఎలక్ట్రిక టార్చ్.

” రోజూ రెండుపూటలా మంచి తిండి పెట్టి మంచి జీతం ఇస్తుంటే వొళ్ళు బలిసిందేం?” గుర్రుగా అన్నాడు సాహు బాబులా మీద చేయి చేసుకుంటూ. బాబులా కి ఏమి చెప్పాలో అర్ధం కాక సాహు కొడుతుంటే మాట్లాడకుండా వుండిపోయాడు. కొట్టీ, కొట్టీ అలసిపోయి

“ఇంకోసారి ఇలా పారిపోవడానికి ప్రయత్నం చేశావో, నేనే పోలీసులకు పట్టిస్తాను దొంగతనం చేశావని. వాళ్ళు బొక్కలో వేసి కుళ్ళబొడుస్తారు. జన్మలో బయటి మొహం చూడలేవుఅంటూ టార్చ్ వెనుక భాగం తో గట్టిగా పొడిచాడు. దుకాణం లోకి వచ్చాక బాబులా జేబులో చేయి పెట్టి ఐదు రూపాయల నోటు తీసేసుకున్నాడు.

ఆ తరువాత వారానికో, పదిరోజులకు ఆ రోజు జరిగిందే మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యేది.  కానీ ఈసారి నొప్పిలో సాంద్రత తగ్గింది బాబులాకి.

బాబులా తలవొంచుకుని “కొత్త చొక్కా కొనిపెడతానన్నావు?” అన్నాడు. ఆ చిన్న ప్రశ్న లో బాబులా తాను అనుభవించిన బాధను అంతా నిక్షిప్తం చేశాడు.

” ఈ వారం కొనిపెడతాలేరా?” అని సాహు అన్నాడు. అన్నమాట  నిలబెట్టుకున్నాడు

3

“నాకో మూడు రూపాయల సమోసాలు ఇస్తారా?” పరిచితమైన గొంతు వినిపించేసరికి పరధ్యానం లో నుండి బయటకు వచ్చాడు బాబులా. అదే పిల్లాడు. బాబులా ఎందుకో తెలియదు కానీ ఆ పిల్లాడి కోసమే ఎదురు చూస్తున్నాడు. మంచి దుస్తులు వేసుకుని, సున్నితంగా మాట్లాడే ఆ పిల్లాడి తో మళ్ళీ, మళ్ళీ మాట్లాడాలని అనిపిస్తున్నది బాబులా కి ఎందుకో.

ఈసారి కూడా ఆ పిల్లాడు బాబులా తోనే మాట్లాడాడు. కౌంటర్ దగ్గర ఎవరూ లేరు. బాబులా వెంటనే తన చేతుల వంక చూసుకున్నాడు. అవి పొడిగా ఉండి, శుభ్రంగా, స్వచ్ఛం గా వున్నాయి. బాబులా సమోసాల దగ్గరకు వెళ్లి మూడు సమోసాలు పేపర్ సంచీలో వేసుకుని ఆ పిల్లాడి చేతికి అందించాడు. ఈ సారి కూడా పిల్లాడు ఐదు రూపాయల నోటు ఇచ్చాడు. ఆ నోటు తీసుకుని సాహు కి ఇచ్చి చిల్లర తీసుకుని వేగంగా పరుగెత్తుకెళ్లి పిల్లాడికి ఇచ్చాడు. ఆ పిల్లాడు రెండు రూపాయలు తీసుకోకుండా

“ఇదుగో ఒక సమోసా తీసుకో” అన్నాడు. అలా సమోసా తీసుకోమని ఆ పిల్లాడు అనగానే బాబులా కి ఆశ్చర్యం కలిగింది. కొంచెం సిగ్గు పడుతూ “వద్దు!” అన్నాడు.

“అయితే ఆ రెండు రూపాయలు నువ్వే ఉంచుకో! అమ్మ చెప్పింది ఉన్నంతలోఎవరైనా పేదలకు సహాయం చేయాలని.  నువ్వు చాలా పేద పిల్లాడివేగా! “

బాబులా తలతిప్పి బటా సాహు వంక చూసి అతడు చూడకుండా రెండు రూపాయలు వున్న చేతిని కిందకు జార్చాడు.

“నువ్వు స్కూల్ కి వెళ్లడం లేదా?” ఆ పిల్లాడు  మళ్ళీ అడిగాడు. బాబులా మాట్లాడకుండా ఆ పిల్లాడి వంకే చూస్తున్నాడు. స్కూల్ కి వెళ్లడం ఆ ఆలోచనే ఇంతవరకూ బాబులా కి కలగలేదు.

“నా పేరు మోహన్. నీ పేరేమిటి?”

బాబులా ఆ ప్రశ్న కి కూడా జవాబు చెప్పలేదు సిగ్గుతో. ఏమని చెప్పాలి

“నీ పేరేమిటి?” మళ్ళీ రెట్టించాడు ఆ పిల్లాడు

“బాబులా!”

“అది ఇంట్లో పిలిచే పేరు. అసలు పేరు ఏదో ఒకటి ఉండి వుంటుందిగా!”

బాబులా మాట్లాడకుండా నిశ్శబ్దంగా తల దించుకుని నేల చూపులు చూడసాగాడు  

“ఓహో! నీకు మీ అమ్మా నాన్న అంత మంచి పేరు పెట్టలేదా? అందుకే నువ్వు స్కూల్ కి వెళ్లడం లేదా?”

ఆ పిల్లాడిని సైకిల్ మీద తీసుకుని వచ్చిన యువకుడు ఒకడు కొంచెం దూరం లో ఉండి “మున్నా బాబు. త్వరగా వచ్చేయి మనకు ఆలస్యం అవుతుంది” అని పిలిచాడు.

“నేనిప్పుడు వెళుతున్నాను.మళ్లీ వస్తాను. ఇక్కడ సమోసాలు బావుంటాయి. కానీ మా అమ్మ బజారులో సమోసాలు తినొద్దని అంటుంది. నేనిక్కడ సమోసాలు కొంటున్నాను అని ఎవరికీ చెప్పకేం?” అంటూ ఆ పిల్లాడు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు

” ఆ పిల్లాడు   ఏమంటున్నాడు నీతో!” జగబంధు బాబులా  దగ్గరకి వచ్చి ఆరా తీసాడు.

“ఏమీ లేదు. నీ పేరేమిటి?” అని అడిగాడు అన్నాడు బాబులా

” ఆ పిల్లాడికి నువ్వు నచ్చినట్టున్నావే! ఆ పిల్లాడు ఎవరో తెలుసా? ఈ జిల్లా కలెక్టర్ గారి అబ్బాయి. అతడు నీతో స్నేహం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు?” ఈ ప్రశ్న కి బాబులా దగ్గర జవాబు లేదు. కానీ బాబులా ఒక్కసారిగా ఆనందం తో నిండిపోయాడు.

వెంటనే లోపలకు వచ్చి పళ్లేలు, గ్లాసులు తీసుకుని వెనక్కు వచ్చాడు. వాటిని అక్కడ పడేసి ఐదు నిమిషాలపాటు తనలోపల నిండిన ఆనందాన్ని. సంతోషాన్ని ఆస్వాదిస్తూ వుండిపోయాడు. లాగు జేబులోనుండి రెండు రూపాయల నోటు బయటకు తీసి చూసుకుని, మళ్ళీ రెండు మడతలు పెట్టి జేబులో పెట్టుకున్నాడు. “నీ పేరేమిటి?” బాబులా మెత్తగా గొణుక్కున్నాడు తనతో తానే ఆ పిల్లాడు వేసిన ప్రశ్న ను పునశ్చరణ చేసుకుంటూ. ఆ పిల్లాడి పేరేమిటి? మోహన్ కదా.

 మోహన్ ఎంత అందమైన పేరు. ఆ పేరు తలచుకోగానే ఎప్పుడో క్యాలండర్ లో చూసిన అందమైన కృష్ణుడి బొమ్మ గుర్తుకువచ్చింది. నల్ల రంగులో ఉన్న కృష్ణుడి బొమ్మ, అందమైనచిరునవ్వుతో వున్న బొమ్మను చూపి అమ్మ మోహన అన్నది. మోహన అన్నపేరును మరొకసారి పెదవులతో పలికి ఆ శబ్దం లో వున్న సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాడు బాబులా. తనది కూడా అంత అందమైన పేరే అయివుంటుంది అనుకున్నాడు. అయివుంటే బావుండును అని మనసులో కోరుకున్నట్టు అనుకున్నాడు. ఇంతలో బయట ఏదో గొడవ వినిపించేసరికి గిన్నెలు అన్నీ గబగబా కడిగి దుకాణం లోకి వచ్చాడు.

గులాబీ రంగు ఫ్రాక్ వేసుకున్న చిన్న అమ్మాయి వెక్కివెక్కి ఏడుస్తున్నది. నూనె రాసి శుభ్రంగా తల దువ్వి వేసిన రెండు జడలు ఎర్రటి రిబ్బను తో బలంగా కట్టివున్నాయి. బాబులా విషయం ఏమిటో అర్ధం కాక వింతగా చూస్తూవుండిపోయాడు ఆ అమ్మాయి వైపు. మరో రెండు అడుగులు ముందుకు వేస్తే బటా సాహు దగ్గర మరో ఇద్దరు అబ్బాయిలు నిలబడి వున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ వాళ్ళను చూసినట్టు అనిపించలేదు బాబులా కి. అందుకే జగబంధు దగ్గరకు జరిగి “వాళ్లెవరు?”అన్నాడు

“నీకు తెలియదా?” అని ప్రశ్న లాంటి మాటొకటి విసరి   గుసగుసగా “వాళ్ళు ముగ్గురూ సాహు పిల్లలు. ఇంకో ముగ్గురు వున్నారు వాళ్ళ వూళ్ళో” అన్నాడు. ఆ ఇద్దరు మగపిల్లలు ఆడపిల్ల కంటే కాస్త పెద్ద పిల్లలులాగా వున్నారు. వాళ్ళు ముగ్గురూ రాత్రి భోజనం చేసి బాబులా తో పాటే పడుకున్నారు. బాబులా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ముగ్గురిలో ఒకడైన పెద్ద పిల్లాడికి, సాహు కి మధ్య జరిగిన సంభాషణ చెవిన పడింది.  

“అమ్మకి వొంట్లో అస్సలు బాగాలేదు. మంచం మీదనుండి లేవలేక పోతున్నది. కునీ కి వాంతులు విరోచనాలు. అమ్మ నిన్ను ఇంటికి త్వరగా రమ్మన్నది” అన్నాడు పెద్దపిల్లాడు సాహు రాక ఎంత అత్యవసరమో గొంతు లో ధ్వనిస్తూ.

“నేనెలా వస్తాను. నేనొస్తే షాపును ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా? అయినా షాపును వదిలెసి. నేనొచ్చి ఇంట్లో కూర్చుంటే మీరు పొట్టలు ఎలా నింపుకుంటారు? మీ అమ్మ కి వొంట్లో ఎప్పుడు బావుంది? ఒక రోగం తరువాత ఒక రోగం వస్తూనే ఉందిగా! నువ్వు కునీ ని గ్రామ వైద్యుడి దగ్గరకు తీసుకునిపోలేక పోయావా? ఇప్పుడు అసలే షాపు చాలా బిజీగా వుంది. కాస్త వానలు పడ్డాక చూద్దాం లే” అని గోడవైపు తిరిగి పడుకున్నాడు బటా సాహు.

మరునాడు పొద్దున్నే ముగ్గురు పిల్లలూ పూరీ, ఆలుగడ్డ కూరతోనూ, రసగుల్లాలు ఒకటికి రెండు సార్లు అడిగి మరీ తిన్నారు. సాహు కౌంటర్ లో నుండి కొన్ని డబ్బులు తీసి పెద్ద పిల్లాడి జేబులో కుక్కి

 ” అనవసరంగా ఇక్కడకు రావొద్దు. డబ్బులెందుకు బస్సు ఛార్జీలకు తగలెయ్యడం. ఏదన్నా ఉంటే ఒక ముక్క రాయండి” అని ఖరాఖండిగా చెప్పి ముగ్గురు పిల్లలను బస్సెక్కివ్వడానికి బస్టాండ్ కి బయలుదేరాడు. ఆ ఆడపిల్ల “నేనెళ్లను” అని గొంతు గట్టిగా చించుకుని పెద్దగా ఏడవసాగింది. సాహు ఆ పిల్లను లాక్కెళ్లినంత పనిచేసాడు.

“ఆయనకు అరడజను మంది పిల్లలు వున్నారు. ఇంకొకళ్ళు రాబోతున్నారు. వాళ్ళావిడ నీటి కుండలాగా ఉబ్బి ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక జబ్బు తో మంచం కూడా దిగలేదు. ఈయన మాత్రం సంవత్సరానికో మారు ఇంటికెళ్లి ఆమెకి కడుపు చేసి వస్తూవుంటాడు” వాళ్ళు నలుగురూ వెళ్ళగానే వుండబట్టుకోలేక ముక్కు చిట్లిస్తూ అన్నాడు జగబంధు.

సూర్యుడు వెళ్లిపోవడానికి సిద్ధంగా వున్నాడు. బాబులా మనసంతా ఏమీ బావోలేదు. క్షణక్షణానికీ అశాంతి పడుతున్నాడు. తరచూ షాపు ముందుకొచ్చి చూస్తున్నాడు. అతడి కళ్లు అన్నీ రోడ్డు వైపే వున్నాయి. అప్పుడు కనపడ్డాడు మోహన్. మోహన్ ని ఎప్పుడూ తీసుకుని వచ్చే యువకుడు సైకిల్ మీద ఉంటే మోహన్ ముందు కడ్డీమీద కూర్చుని వున్నాడు. ఇద్దరూ కలిసి షాపు వైపే వస్తున్నారు.

” ఆ పిల్లాడు ఇప్పుడు ఎప్పటిలాగే మూడు రూపాయలకు సమోసాలు అడుగుతాడు.” అని బటా సాహు తో చెప్పి మూడు సమోసాలు పొట్లం కట్టి సిద్ధంగా ఉంచాడు బాబులా. మోహన్ బాబులా చేతిలోని సమోసాల పొట్లం చూసి

 “ఇవాళ సమోసాలు వద్దు”. అని నవ్వి “కానీ నీకోసం ఇవాళ కొన్ని చాకోలెట్లు తెచ్చాను అని తన గుప్పిట తెరచి చూపించాడు. విప్పిన మోహన్ చేతిలో నాలుగు రంగురంగుల చాకోలెట్లు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, నారింజ రంగులలో మెరుస్తూ. బాబులా కళ్ళు విప్పార్చుకుని ఆ చాకోలెట్ల వంక చూసాడు.

“సరే! నా కోసం నువ్వు సమోసాలు కట్టి ఉంచావు కనుక నీకోసం తీసుకుంటాను” అని,వెనక్కు తిరిగి, “సత్యా అన్నా ఒక మూడు రూపాయలు ఇవ్వు” అని తనతో వచ్చిన యువకుడితో చెప్పాడు.

“నేనెప్పుడూ మూడు సమోసాలే ఎందుకు తీసుకుంటానో తెలుసా? రెండు నాకు. ఒకటి సత్యా అన్నకి. బాబులా నువ్వీ చాకోలెట్స్ తీసుకొనే లేదు. నీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఎందుకో తెలుసా ఇవాళ బాలల దినోత్సవం. బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు అనీ ,బాలలు  పువ్వులాగా వికసించాలి అని మా స్కూల్ లో మాస్టార్లు చెప్పారు.” మోహన్ ఆగకుండా చెపుతూనే వున్నాడు.

బాబులా ఏమి చెప్పాలో తెలియక మోహన్ వంక అలా కళ్ళు విప్పార్చుకుని చూస్తూ వుండిపోయాడు.

“ఊ…! తీసుకో” మరొకసారి చాకోలెట్స్ అందించాడు. బాబులా సాహు వంక కను చివర్ల నుండి చూసి చాకోలెట్స్ కోసం చెయ్యి చాపాడు.

“నాకు ఇక్కడ స్నేహితులు ఎవరూ లేరు. వున్న వాళ్ళు మా ఇంటికి చాలా దూరంగా వున్నారు. సత్యా అన్న నాతో క్రికెట్ ఆడతాడు. కానీ ఇద్దరే క్రికెట్ ఆడితే మజా ఏముంటుంది చెప్పు. నువ్వు మా ఇల్లు చూసావా? నువ్వొస్తే మనం ముగ్గురం రేపు క్రికెట్ ఆడుకుందాము. నువ్వు వస్తావా?”

బాబులా చాకోలెట్స్ ను గట్టిగా గుప్పిట్లో పట్టుకుని చూస్తూ నిలబడ్డాడు. ఈ లోగా జగబంధు బాబులా ని, మోహన్ ని దాటుకుని “సత్యా భాయ్” అంటూ సైకిల్ దగ్గర వున్న యువకుడి దగ్గరకు వెళ్లి “వాడెవరో తెలుసా?  వాడితో మీ చిన్న యజమానికి పనేమిటి? ” అన్నాడు ముసిముసి గా నవ్వుతూ

“వాడెవరో తెలుసా?” మళ్ళీ హేళన, నిర్లక్ష్యం ధ్వనించే గొంతు తో అని

 వాడు, వాడు, బటా సాహు ఉంచుకున్న ముండ వాడొక వేశ్య ” అని ఒక్కసారిగా అసహ్యం అంతా గొంతులోకి తెచ్చుకుని ఖాండ్రించి ఉమ్మేసాడు. ఆ మాటలు వినగానే బాబులా వెన్ను ఒకరకమైన ఏవగింపుతో కూడుకున్న సిగ్గు తో వణికింది. చేతిలో పట్టుకున్న చాకోలెట్స్ జారీ కిందపడ్డాయి. మొహం ఎర్రగా జేవురించింది. కళ్ళ నుండి నీళ్లు ఒక్కఉదుటున దూకగా మోహన్ వైపు ఖాళీగా చూసాడు.

జగబంధు అన్న మాటలు వినలేదో, విన్నా అర్ధం కాలేదో కానీ మోహన్ మాత్రం

 ” బాబులా జవాబు చెప్పవేం? రేపు మా ఇంటికి వస్తావా? ఆదివారం నాకు స్కూల్ కూడా లేదు. వస్తావా?” అని గట్టిగా మళ్ళీ అడిగాడు.

బాబులా జవాబు చెప్పలేదు. ఇంతలో సత్యా ” మున్నా బాబూ! వచ్చేయి ఇంటికివెళదాం. అమ్మ చెప్పలేదు వీధుల్లో పిల్లలతో    మాట్లాడొద్దని” అని మోహన్ దగ్గరకు వచ్చి దాదాపు లాక్కుని వెళ్లినంత పనిచేశాడు. మోహన్ మాత్రం అదే మృదువైన, సున్నితమైన చిరునవ్వు తో “ఏం బాధపడకు. నేను మళ్ళీ వస్తాను” అని చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు

బాబులా జగబంధు తో కానీ, బటా సాహుతో కానీ మాట్లాడకుండా వెనుక తలుపు తీసుకుని గిన్నెలు కడిగే చోట కూర్చుండిపోయాడు. అలా ఎంత సేపు కూర్చున్నాడో తెలియదు.  అతడిని లోపలకు రమ్మని ఎవరూ పిలవలేదు. చీకటి పడింది. భోజనం చేసి జగబంధు వెళ్ళిపోయాడు. చాలా సేపటికి బటా సాహు వెనక్కు వచ్చి

 ” ఒరేయ్! మధ్యాహ్నం నుండీ ఇక్కడే కూర్చున్నావు. నీ పనంతా ఎవరు చేస్తారు అనుకున్నావు. ఆ గిన్నెలు కడిగి లోపలపెట్టి, శుభ్రం చేసి అన్నం తినుపో! జగబంధు నీకోసం అన్నం తీసి పక్కనపెట్టాడు” బాబులా వంక చూడకుండా ఎటో చూస్తూ అని మొహం చేతులు కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయాడు

బాబులా మెల్లగా లేచి వంటపాత్రలు అన్నీ కడిగి, లోపలకు వచ్చి కంచం లో అన్నం పెట్టుకున్నాడు. కొంచెం పప్పు, వేపుడు కూర కలగలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. రెండో ముద్దకే తినబుద్ది కాలేదు. కంచం లోనే చేయి కడిగేసుకుని వెనక్కు వెళ్లి పెట్టుకున్న అన్నం మొత్తం చెత్త కుండీలోకి విసిరేసాడు. చేతులు కడుక్కుని లోపలకు వస్తున్న బాబులాని చూస్త్తూ

“ఒరేయ్! ఎవరు ఏమి అన్న నువ్వు పట్టించుకోవద్దు. ఇక్కడ నీకు సౌకర్యంగా ఉన్నదా? లేదా? అది చెప్పు? నాలాగా నిన్ను ఎవరు చూసుకుంటారు. నేను నీకు ఆశ్రయం ఇవ్వకపోతే అడుక్కుతినేవాడివి. లేకపోతే దొంగై జైల్లో చిప్ప కూడు తినేవాడివి. లేదంటే ఆకలి తో చచ్చేవాడివి. నీకా పెద్ద ఇంటి పిల్లాడితో స్నేహం చేస్తే వచ్చేదేమిటి చెప్పు? ” అని బటా సాహు ఒక్క గుక్కలో ముందే రిహార్సల్ చేసుకుని తయారుగా ఉన్నట్టు శ్వాస తీసుకోకుండా చెప్పాడు. మధ్యాహ్నం నుండి బాబులా లో వచ్చిన మార్పును గమనించినట్టున్నాడు బటా సాహు. ఆ మాటలు చెప్పాక శ్వాస తీసుకుని ఒక్క క్షణం పాటు మౌనంగా వున్నాడు.

బాబులా తిరిగి జవాబు చెప్పలేదు. నిశ్శబ్దంగా వున్నాడు.

***

“ఒరేయ్! ఉన్నావా?” బటా సాహు మంచం మీద కూర్చుని అడిగాడు. బాబులా వైపు నుండి మాట లేదు. సాహు మెల్లగా మంచం దిగి బాబులా కోసం చీకట్లో వెతికాడు. బుగ్గల మీద తడి తగిలేసరికి

 “ఎందుకు ఏడుస్తున్నావు?” అని ప్రశ్నించి

“నువ్వు ఆ జగ్గా చెప్పింది పట్టించుకోవద్దు. వాడంతే ఏ ఆలోచనా లేకుండా మాట్లాడతాడు. మొద్దు మొహం వాడూను”

. బాబులా మాట్లాడలేదు. సాహు చేతులు మెల్లగా బాబులా వొంటిని అలవాటైన చోట్లల్లా తడమసాగాయి. సాహు శ్వాస బలంగా పైకే వినపడుతోంది. బాబులా కి అదే అనుభవం. ఎవరో చీలుస్తున్నట్టు. కానీ నోటినుండి ఒక్క శబ్దం కూడా బయటకు రాలేదు. పళ్ళు, దవడలు బహుశా గట్టిగా పట్టుకుని ఉంటాడు గొంతులో నుండి మూలుగు బయటకు రాకుండా! సాహు మెల్లగా చాప మీదనుండి లేచి నడుం చుట్టూ గావంచా చుట్టుకుని తలుపు తీసుకుని బయటకు వెళ్ళాడు.

కాసేపటికి సాహు గురక వినిపించింది. బాబులా అలాగే కళ్ళు విప్పుకుని చీకట్లోకి చూస్తూ వుండిపోయాడు. ఎప్పుడో కన్ను మూత పడింది. అలవాటైన చీకట్లో సన్నటి వెలుగు. మూగ పోయిన బాబులా నరాలు ఊపిరి తీసుకున్నాయి. ఆ సన్నటి వెలుగు మెల్లగా ఒక రూపాన్ని దాల్చింది. మెరిసే తెల్లటి దుస్తుల్లో వున్న ఒక చిన్న పిల్లాడు లా ఆ వెలుగు మారింది. బాబులా గుర్తుపట్టాడు. అతడు మోహన్.

 అవును మోహనే. ఈ గదిలోకి ఎలా రాగలిగాడు? బాబులా చూస్తూ ఉండగానే మోహన్ లేచి చీకట్లోనే తలుపు వంక నడిచాడు. మెల్లగా తలుపు తీసాడు. బాబులా ఒక మత్తులో ఉన్నట్టు, ఒక మైకం లో ఉన్నట్టు, మోహన్ ని అనుసరించాడు. అంతా నిశ్శబ్దం. ఎలుకలు, కీచురాళ్ళ, క్రికెట్ పురుగులు ఏవీ శబ్దం చేయడం లేదు.

 బయట షెల్ఫ్ లో ఒక పదునైన పెద్ద కత్తి. అల్లం, ఉల్లిపాయలు లాంటివి తరగడానికి ఉపయోగించే కత్తి. బాబులా ఆ కత్తి తీసుకుని ఒక్కఉదుటున గదిలోకి, సాహు నిద్రిస్తున్న మంచం దగ్గరకు వచ్చాడు. మరుక్షణం లో సాహు పెడుతున్న గురక కాస్తా బాధతో చెవులు బద్దలు అయ్యే భయంకరమైన అరుపుగా మారింది.ఆ అరుపు తారాస్థాయికి చేరి చీకటిని చెదరగొట్టింది.

 వెంటనే బాబులా విల్లు విడిచిన బాణం లాగా పరుగెత్తాడు గమ్యం లేకుండా. చాలా దూరం నడిచి, పరుగెత్తి, మధ్యాహ్నానికి బాబులా ఒక చిన్న రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు. ప్లాట్ ఫారం మీద వున్న నల్లా లోనుండి కడుపునిండా నీళ్లను తాగాడు.తెలియని దూరాల వరకు విస్తరించిన రైల్వే లైన్ వైపు విప్పారిన కళ్ళతో చూశాడు. మరి కొద్ది సేపట్లో గోధుమరంగు రైలు ఒకటి చంచలమైన అతడి భవిష్యత్తులా స్టేషన్ లోకి వచ్చింది 

కంపార్ట్మెంట్ లో ఒక మూలకి  భయం భయంగా నిల్చుని ఉన్న బాబులా దగ్గరకు టికెట్ టికెట్ అంటూ వచ్చాడు టికెట్ కలెక్టర్. బెదురుగా చూశాడు బాబులా.

” ఒరే అబ్బాయి. టికెట్ ఏది? లేదా? నువ్వు కొని ఉండవులే! ఓరి భగవంతుడా ఎక్కడనుండి వస్తారయ్యా వీళ్లంతా టికెట్ కొనకుండా రైలెక్కడానికి?  జేబులో పైసా ఉండదు కానీ వీళ్లకు ప్రయాణాలు కావాలి. టికెట్ ఎందుకు కొనలేదు?” ఎదుటివాడికి మరొక మాట మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా టికెట్ కలెక్టర్ ఏకపాత్రాభినయం చేస్తున్నాడు.

బాబులా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టికెట్ కలెక్టర్ చెప్పింది ఏదీ బాబులా మనసులోకి ఎక్కినట్టు లేదు. వాడింకా ఆ షాక్ లోనే వున్నాడు. టికెట్ కలెక్టర్ మిగతా ప్యాసింజర్ల టికెట్స్ చెక్ చేయడానికి ముందుకు వెళ్ళాడు. బాబులా తన లాగు జేబులోకి చెయ్ పెట్టుకున్నాడు. ఆ చేతులకు మోహన్ ఇచ్చిన రెండు రూపాయల నోటు మెత్తగా తాకింది. దాన్ని టికెట్ కలెక్టర్ కి ఇవ్వడానికో, ఖర్చు పెట్టడానికో బాబులా మనసు ఒప్పుకోలేదు.

“వచ్చే స్టేషన్ లో దిగి పో! మళ్ళీ నా కంటికి కనపడ్డావంటే బావుండదు” టికెట్ కలెక్టర్ మళ్ళీ వచ్చి హెచ్చరించాడు. రైలు వేగం తగ్గింది. ఎప్పుడూ చూడని, ఎప్పుడూ వినని స్టేషన్ ఏదో బాబులా దిగిపోవడానికి దగ్గరపడినట్టుంది

                               ***************    

Pakhala: A mix of water and rice slightly fermented a delicacy and everyday meal of the common people of Odisha

Gamuncha: Thin towel made of cotton, generally used by Odisa during summer

పరమిత శతపథి
వంశీకృష్ణ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *