చెకోవ్. 1897, మార్చి 22 సాయంత్రం, అతను మాస్కోలో తన స్నేహితుడు, ఆప్తమిత్రుడు అయిన అలెక్సీ సువోరిన్‌తో కలిసి రాత్రి భోజనానికి వెళ్ళాడు. ఈ సువోరిన్ పత్రికా రంగంలో, పుస్తక ప్రచురణలో పేరు పొందిన ధనవంతుడు, సాంప్రదాయవాది. బోరోడినో యుద్ధంలో పాల్గొన్న ఒక ప్రైవేట్ వ్యక్తికి పుట్టి, స్వయంకష్టంతో ఎదిగినవాడు. చెకోవ్‌లాగే అతను కూడా ఒక రైతుకూలీ మనవడు. వారిద్దరిలోనూ ఒకే రకమైన రైతు రక్తం ప్రవహిస్తోంది. అది తప్ప, రాజకీయంగానూ, స్వభావరీత్యానూ వారిద్దరూ ఎంతో భిన్నమైన వారు. సువోరిన్ చెకోవ్ యొక్క అతి కొద్దిమంది సన్నిహితులలో ఒకడు, చెకోవ్ అతనితో గడపడానికి ఇష్టపడేవాడు.
సహజంగానే, వారు నగరంలోని మంచి రెస్టారెంట్‌కు వెళ్ళారు. అది ఒకప్పటి టౌన్ హోమ్ , దాని పేరు ‘హెర్మిటేజ్’ అక్కడ పది రకాల వంటకాలతో చేసిన భోజనం పూర్తి చేయడానికి గంటల తరబడి సమయం పడుతుంది, కొన్నిసార్లు సగం రాత్రి గడిచిపోతుంది. ఆ భోజనంలో రకరకాల వైన్‌లు, లిక్కర్లు, కాఫీ కూడా ఉంటాయి. చెకోవ్ ఎప్పటిలాగే ఖరీదైన నల్లటి సూట్, వెస్ట్‌కోట్, తన అలవాటైన ‘పిన్స్-నే’ అద్దాలతో ఎంతో హుందాగా ఉన్నాడు. ఆ కాలంలో తీసిన ఛాయాచిత్రాలలో అతను ఎలా కనిపిస్తాడో, ఆ రాత్రి కూడా సరిగ్గా అలాగే ఉన్నాడు.
అతను చాలా ఉల్లాసంగా, హుషారుగా ఉన్నాడు. అక్కడి మేనేజర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఒకసారి ఆ పెద్ద డైనింగ్ రూమ్ వైపు చూశాడు. అది అదమైన షాండ్లియర్స్ కాంతితో వెలిగిపోతోంది, టేబుల్స్ అన్నీ అందమైన దుస్తులు ధరించిన స్త్రీ పురుషులతో నిండి ఉన్నాయి. వెయిటర్లు నిరంతరం అటు ఇటు తిరుగుతున్నారు. అతను సువోరిన్ ఎదురుగా టేబుల్ వద్ద కూర్చున్న వెంటనే, అకస్మాత్తుగా ఎటువంటి హెచ్చరిక లేకుండా అతని నోటి నుండి రక్తం ధారగా కారడం మొదలైంది.
సువోరిన్, ఇద్దరు వెయిటర్లు అతన్ని విశ్రాంతి గదికి తీసుకువెళ్లి, ఐస్ ప్యాక్‌లతో రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించారు. సువోరిన్ అతన్ని తన హోటల్‌కు
తీసుకువెళ్లి, తన సూట్‌లోని ఒక గదిలో చెకోవ్ కోసం పడకను సిద్ధం చేయించాడు. తరువాత, మరొకసారి రక్తస్రావం అయిన తర్వాత, చెకోవ్ క్షయవ్యాధి, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ప్రత్యేకమైన క్లినిక్‌కు వెళ్లడానికి అంగీకరించాడు. సువోరిన్ అక్కడ అతన్ని చూసి నప్పుడు, మూడు రాత్రుల క్రితం రెస్టారెంట్‌లో జరిగిన ఆ ‘ఇబ్బందికి ‘ చెకోవ్ క్షమాపణలు చెప్పాడు, కానీ తనకు ఏమీ కాలేదని, అంతా బాగానే ఉందని మొండిగా వాదించాడు. “అతను ఒక పెద్ద పాత్రలోకి రక్తం ఉమ్మివేస్తూనే, ఎప్పటిలాగే నవ్వుతూ జోకులు వేస్తున్నాడు” అని సువోరిన్ తన డైరీలో రాసుకున్నాడు.
మార్చి చివరి రోజుల్లో చెకోవ్ చెల్లెలు మారియా చెకోవ్ క్లినిక్‌లో అతన్ని చూడటానికి వచ్చింది. అప్పుడు వాతావరణం చాలా దారుణంగా ఉంది.
ఆమె ఆసుపత్రికి వెళ్లే సమయానికి వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. మంచు తుఫాను కురుస్తోంది, ఎక్కడ చూసినా గడ్డకట్టిన మంచు పేరుకుపోయాయి. ఆసుపత్రికి వెళ్లడానికి ఒక గుర్రపు బండిని ఆపడం కూడా ఆమెకు కష్టమైంది. అక్కడికి చేరుకునేసరికి ఆమె మనసు భయంతో, ఆందోళనతో నిండిపోయింది.
“ఆంటోన్ పావ్లోవిచ్ వెల్లకిలా పడుకుని ఉన్నాడు,” అని మరియా తన జ్ఞాపకాల లో రాశారు. “అతన్ని మాట్లాడనివ్వలేదు. అతనికి అభివాదం చేసిన తర్వాత, నా ఉద్వేగాలను దాచుకోవడానికి నేను పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లాను.” అక్కడ, షాంపేన్ సీసాలు, కేవియర్ జార్‌లు, శ్రేయోభిలాషులు పంపిన పూలగుత్తుల మధ్య ఆమెను భయపెట్టే ఒక దృశ్యం
కనిపించింది: అది ఒక నిపుణుడు గీసిన చెకోవ్ ఊపిరితిత్తుల రేఖాచిత్రం. ఒక డాక్టర్ తన రోగికి లోపల ఏం జరుగుతుందో వివరించడానికి సాధారణంగా గీసే చిత్రం అది. ఊపిరితిత్తుల అంచులు నీలి రంగులో ఉన్నాయి, కానీ పై భాగాలు ఎరుపు రంగుతో నిండి ఉన్నాయి. “అవి బాగా చెడిపోయాయని నాకు తెలిసింది ,” అని మరియా రాశారు.
లియో టాల్‌స్టాయ్ మరొక సందర్శకుడు. దేశంలోని గొప్ప రచయిత తమ మధ్య ఉన్నాడని తెలిసి ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. రష్యాలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తిని కాదనలేక, “అనవసరమైన” సందర్శకులను అనుమతించకపోయినా, వారు అతన్ని చెకోవ్‌ను చూడటానికి లోపలికి పంపారు. నర్సులు, డాక్టర్ల గౌరవ మర్యాదల మధ్య, గడ్డంతో భీకరంగా
కనిపించే ఆ వృద్ధుడిని చెకోవ్ గదిలోకి తీసుకెళ్లారు. నాటక రచయితగా చెకోవ్ సామర్థ్యంపై టాల్‌స్టాయ్‌కు తక్కువ అభిప్రాయం ఉన్నప్పటికీ (చెకోవ్ నాటకాలు నిశ్చలంగా ఉంటాయని, వాటిలో నైతిక దృష్టి లోపించిందని టాల్‌స్టాయ్ భావించేవారు. ఒకసారి ఆయన చెకోవ్‌ను ప్రశ్నిస్తూ, “నీ పాత్రలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? సోఫా నుండి జంక్ రూమ్ వరకు, మళ్ళీ వెనక్కి!” అన్నారు), ఆయనకు చెకోవ్ రాసిన కథలంటే చాలా ఇష్టం, వ్యక్తిగా కూడా ఆయనకు చెకోవ్ అంటే చాలా ప్రేమ. “ఎంత అందమైన, అద్భుతమైన మనిషి: ఒక అమ్మాయిలా నిశ్శబ్దంగా, అణకువగా ఉంటాడు. నడక కూడా అమ్మాయిలాగే ఉంటుంది. అతను చాలా అద్భుతమైన వ్యక్తి,” అని టాల్‌స్టాయ్ గోర్కీతో చెప్పారు. టాల్‌స్టాయ్ తన డైరీలో “నేను చెకోవ్‌ను ప్రేమిస్తున్నందుకు సంతోషంగా ఉంది…” అని రాసుకున్నారు.
టాల్‌స్టాయ్ తన ఉన్ని స్కార్ఫ్‌ను, ఎలుగుబంటి చర్మంతో చేసిన కోటును తీసి, చెకోవ్ మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చెకోవ్ మందులు తీసుకుంటున్నాడని, మాట్లాడకూడదని తెలిసినా, టాల్‌స్టాయ్ తన ‘ఆత్మ యొక్క అమరత్వం’ అనే సిద్ధాంతాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. చెకోవ్ కు అది వినక తప్పలేదు. ఆ కలయిక గురించి చెకోవ్ తర్వాత ఇలా రాశారు, “మనమందరం ప్రేమ అనే ఒక సూత్రం ఆధారంగా జీవిస్తామని టాల్‌స్టాయ్ భావిస్తారు. దాని సారాంశం, లక్ష్యాలు మనకు రహస్యం..ఆ రకమైన అమరత్వంతో నాకు ఎటువంటి ఉపయోగం లేదు. అది నాకు అర్థం కాదు, నాకు అర్థం కానందుకు లెవ్ టాల్‌స్టాయ్ ఆశ్చర్యపోయారు.”
అయినప్పటికీ, టాల్‌స్టాయ్ తనను చూడడానికి వచ్చి నందుకు, చూపిన శ్రద్ధకు చెకోవ్ ముగ్ధుడయ్యారు. కానీ, టాల్‌స్టాయ్ లాగా కాకుండా, చెకోవ్ మరణానంతర జీవితాన్ని నమ్మలేదు. ఎప్పుడూ నమ్మలేదు. తన ఐదు ఇంద్రియాలకు అందని దేనినీ ఆయన నమ్మేవారు కాదు. జీవితం, రచనల పట్ల తన దృక్పథం గురించి ఆయన ఒకసారి ఒకరితో ఇలా అన్నారు: “నాకు రాజకీయ, మతపరమైన, తాత్విక ప్రపంచ దృక్పథం లేదు. నేను దానిని ప్రతి నెలా మారుస్తుంటాను, కాబట్టి నా కథానాయకులు ఎలా ప్రేమిస్తారు, వివాహం చేసుకుంటారు, బిడ్డలకు జన్మనిస్తారు, ఎలా చనిపోతారు, వారు ఎలా మాట్లాడతారో వివరించడానికే నేను పరిమితం కావాలి.”
అంతకుముందు, అతనికి టి.బి. ఉన్నట్లు నిర్ధారణ కాకముందే, చెకోవ్ ఒకసారి ఇలా
వ్యాఖ్యానించారు, “ఒక రైతుకు క్షయ వ్యాధి వచ్చినప్పుడు, అతను ‘నేనేమీ చేయలేను. మంచు కరిగే వసంతకాలంలో నేను వెళ్ళిపోతాను (మరణిస్తాను)’ అని అంటాడు.” అయితే చెకోవ్‌కు క్షయవ్యాధి ఉన్నట్లు తెలిసిన తర్వాత, ఆయన తన పరిస్థితి యొక్క తీవ్రతను నిరంతరం తగ్గించి చూపడానికి ప్రయత్నించారు. అన్ని విధాలా చూస్తే, ఆయన తన చివరి వరకు కూడా, ఒక సాధారణ జలుబును వదిలించుకున్నట్లుగా ఈ వ్యాధిని వదిలించుకోగలనని భావించినట్లు అనిపించింది. తన చివరి రోజుల్లో కూడా, పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ఆయన మాట్లాడారు. నిజానికి, ఆయన మరణానికి కొద్ది కాలం ముందు రాసిన లేఖలో, తాను “లావవుతున్నానని” బాడెన్‌వీలర్ వచ్చిన తర్వాత చాలా బాగుందని తన సోదరికి రాశారు.
బాడెన్‌వీలర్ అనేది బాసెల్ నగరానికి సమీపంలో, బ్లాక్ ఫారెస్ట్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక స్పా, రిసార్ట్ నగరం. నగరంలో ఎక్కడి నుండి చూసినా వోస్జెస్ పర్వతాలు కనిపిస్తాయి. ఆ రోజుల్లో అక్కడి గాలి చాలా స్వచ్ఛంగా, హాయిగా ఉండేది. రష్యన్లు చాలా ఏళ్లుగా వేడి మినరల్ స్నానాల కోసం, అక్కడి రోడ్లపై విహరించడానికి వెళ్తుండేవారు. జూన్, 1904లో, చెకోవ్ అక్కడికి వెళ్లారు.
అదే నెల ప్రారంభంలో, ఆయన మాస్కో నుండి బెర్లిన్ వరకు రైలులో కష్టమైన ప్రయాణం చేశారు. ఆయన తన భార్య, నటి అయిన ఓల్గా నిప్పర్ (Olga Knipper) తో కలిసి ప్రయాణించారు. ఆమెను ఆయన 1898లో “ది సీగల్” (The Seagull) నాటక రిహార్సల్స్ సమయంలో కలుసుకున్నారు.
ఆమె సమకాలీనులు ఆమెను ఒక అద్భుతమైన నటిగా అభివర్ణించారు. ఆమె ప్రతిభావంతురాలు, అందగత్తె. నాటక రచయిత (చెకోవ్) కంటే దాదాపు పదేళ్లు చిన్నది. చెకోవ్ ఆమె పట్ల వెంటనే ఆకర్షితుడయ్యారు, కానీ తన భావాలను వ్యక్తపరచడంలో నెమ్మదిగా ఉండేవారు. ఎప్పటిలాగే, ఆయన వివాహం కంటే సరసాలకే మొగ్గు చూపారు. చివరగా, అనేక విడిపోవడాలు, లేఖలు, అనివార్యమైన… అనేక అపార్థాల తర్వాత, చివరకు వారు మే 25, 1901న మాస్కోలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. చెకోవ్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అతను ఓల్గాను ప్రేమగా “పోనీ” అని, కొన్నిసార్లు “కుక్కపిల్ల” అని పిలిచేవాడు. ఆమెను “చిన్న టర్కీ” అని, కేవలం “నా ఆనందం” అని పిలవడానికి కూడా అతను ఇష్టపడేవాడు.
బెర్లిన్‌లో, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణుడైన డాక్టర్ కార్ల్ ఎవాల్డ్‌ను చెకోవ్ సంప్రదించాడు. కానీ ఒక ప్రత్యక్ష సాక్షి ప్రకారం, డాక్టర్ చెకోవ్‌ను పరీక్షించిన తర్వాత, ఏమీ మాట్లాడకుండా చేతులు పైకెత్తి గది నుండి బయటకు వెళ్లిపోయారు. చెకోవ్ పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది, అద్భుతాలు చేయలేనందుకు తనపై తనకు కోపం రావడం వల్ల, చెకోవ్ అంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నందుకు ఆ డాక్టర్ అసహనానికి గురయ్యారు.
ఒక రష్యన్ పాత్రికేయుడు హోటల్‌లో చెకోవ్ దంపతులను కలిసి తన ఎడిటర్‌కు ఈ సమాచారాన్ని పంపాడు: “చెకోవ్ రోజులు లెక్కింస్తున్నారు. అతను మరణాసన్న స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు, చాలా నీరసించిపోయాడు, ఎప్పుడూ దగ్గుతూనే ఉంటాడు, చిన్న కదలిక చేసినా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతనికి విపరీతమైన జ్వరం ఉంది.” అదే పాత్రికేయుడు చెకోవ్ దంపతులు బాడెన్‌వైలర్‌కు వెళ్లే రైలు ఎక్కుతున్నప్పుడు పోట్స్‌డామ్ స్టేషన్‌లో వారిని చూశాడు. అతని కథనం ప్రకారం, “స్టేషన్‌లోని చిన్న మెట్లు ఎక్కడానికి కూడా చెకోవ్ చాలా ఇబ్బంది పడ్డాడు. అతను ఊపిరి పీల్చుకోవడానికి కొన్ని నిమిషాల పాటు కూర్చోవలసి వచ్చింది.” నిజానికి, చెకోవ్‌కు కదలడం కూడా చాలా బాధాకరంగా ఉండేది. అతని కాళ్లు నిరంతరం నొప్పులు పెట్టేవి, లోపల అవయవాలు బాధిస్తూ ఉండేవి. వ్యాధి అతని ప్రేగులు, వెన్నెముకపై దాడి చేసింది. ఆ సమయంలో అతను జీవించడానికి ఒక నెల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓల్గా మాటల్లో చెప్పాలంటే, చెకోవ్ ఇప్పుడు తన పరిస్థితి గురించి “దాదాపు నిర్లక్ష్యమైన ఉదాసీనతతో” మాట్లాడేవాడు.
వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కోసం స్పా (spa) కి వచ్చే సంపన్నులకు చికిత్స చేస్తూ మంచి జీవనం సాగిస్తున్న బాడెన్‌వైలర్ వైద్యులలో డాక్టర్ ష్వోరర్ ఒకరు. అతని రోగులలో కొందరు అనారోగ్యంతో బలహీనంగా ఉండేవారు, మరికొందరు వయసు పైబడిన వారు లేదా తమకు ఏదో వ్యాధి ఉందని ఊహించుకునే వారు. కానీ చెకోవ్ కేసు ప్రత్యేకం, అతను స్పష్టంగా సహాయం చేయలేని స్థితిలో, తన చివరి రోజుల్లో ఉన్నాడు. అతను చాలా ప్రసిద్ధ వ్యక్తి కూడా. డాక్టర్ ష్వోరర్‌కు కూడా అతని పేరు తెలుసు. అతను జర్మన్ పత్రికలో చెకోవ్ రాసిన కొన్ని కథలను చదివాడు. జూన్ ప్రారంభంలో రచయితను
పరీక్షించినప్పుడు, అతను చెకోవ్ కళను మెచ్చుకున్నాడు కానీ తన వైద్య అభిప్రాయాలను మాత్రం బయటపెట్టలేదు. దానికి బదులుగా, అతను కోకో, వెన్నతో కూడిన ఓట్‌మీల్, స్ట్రాబెర్రీ టీతో కూడిన ఆహారాన్ని సూచించాడు. ఈ చివరిది రాత్రిపూట చెకోవ్ హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుందని భావించారు.
జూన్ 13న, అతను మరణించడానికి మూడు వారాల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు, చెకోవ్ తన తల్లికి ఒక లేఖ రాశాడు, అందులో తన ఆరోగ్యం…
కోలుకుంటున్నట్లు ఉన్నాడు. అందులో అతను, “బహుశా నేను ఒక వారంలో పూర్తిగా నయమైపోతాను” అని రాశాడు. అతను అలా ఎందుకు అన్నారో ఎవరికి తెలుసు? అతను ఏమి ఆలోచిస్తూ ఉండవచ్చు? స్వయంగా డాక్టర్ కావడంతో
అతనికి అసలు విషయం తెలుసు. అతను చనిపోతున్నాడు, అది తప్పించుకోలేని చేదు నిజం. అయినప్పటికీ, అతను తన హోటల్ గది బాల్కనీలో కూర్చుని రైల్వే టైమ్‌టేబుల్స్ చదివేవాడు. మార్సెయిల్స్ నుండి ఒడెస్సాకు వెళ్లే పడవల వివరాల గురించి అడిగేవాడు. కానీ అతనికి తెలుసు. ఈ దశలో అతనికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. అయినా, అతను రాసిన చివరి లేఖలలో ఒకదానిలో, తాను రోజురోజుకూ బలపడుతున్నానని తన సోదరికి రాశాడు.
అతనికి ఇకపై సాహిత్య పనిపై ఆసక్తి లేదు, అది చాలా కాలం క్రితమే పోయింది. నిజానికి, అంతకు ముందు ఏడాది ‘ది చెర్రీ ఆర్చర్డ్’ పూర్తి చేయడంలో అతను దాదాపు విఫలమయ్యాడు. ఆ నాటకాన్ని రాయడం అతని జీవితంలోనే అత్యంత కష్టమైన పని.
చివరి రోజుల్లో, అతను రోజుకు కేవలం ఆరు లేదా ఏడు లైన్లు మాత్రమే రాయగలిగేవాడు. “నాలో ఉత్సాహం తగ్గుతోంది,” అని ఓల్గాకు రాశాడు. “ఒక రచయితగా నా పని అయిపోయిందని నాకు అనిపిస్తోంది, నేను రాసే ప్రతి వాక్యం పనికిరానిదిగా, దేనికీ ఉపయోగపడనిదిగా అనిపిస్తోంది.” కానీ అతను ఆగలేదు. అతను అక్టోబర్ 1903లో తన నాటకాన్ని పూర్తి చేశాడు. లేఖలు, అతని నోట్‌బుక్‌లోని కొన్ని అంశాలు తప్ప, అతను రాసిన చివరి రచన ఇదే.
జూలై 2, 1904 అర్ధరాత్రి తర్వాత, ఓల్గా డాక్టర్ ష్వోరర్‌ను పిలవడానికి ఒకరిని పంపింది. అది అత్యవసర పరిస్థితి: చెకోవ్ స్పృహలో లేడు. పక్క గదిలో విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువ రష్యన్లు ఉన్నారు, ఏమి జరుగుతుందో వివరించడానికి ఓల్గా అక్కడికి పరిగెత్తింది.
ఆ యువకుల్లో ఒకరు పక్కపై నిద్రపోతుండగా, మరొకరు ఇంకా మేల్కొనే ఉండి పొగ తాగుతూ చదువుకుంటున్నారు. అతను వెంటనే హోటల్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి డాక్టర్ ష్వోరర్‌ను వెతికాడు. “ఆ ఉక్కపోతతో కూడిన జూలై రాత్రి నిశ్శబ్దంలో, అతని షూల కింద కంకర రాళ్ల శబ్దాన్ని నేను ఇప్పటికీ వినగలను,” అని ఓల్గా తర్వాత తన జ్ఞాపకాలలో రాసింది. చెకోవ్ భ్రాంతిలో ఉన్నాడు, నావికుల గురించి మాట్లాడుతున్నాడు, జపనీయుల గురించి ఏదో అస్పష్టంగా చెబుతున్నాడు. ఆమె అతని గుండెలపై ఐస్ ప్యాక్ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, “ఖాళీ కడుపుతో ఐస్ పెట్టకూడదు,” అని అతను అన్నాడు.
డాక్టర్ ష్వోరర్ వచ్చి తన బ్యాగ్ తెరిచాడు, అప్పటికే మంచంపై ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న చెకోవ్‌ను తీక్షణంగా
గమనిస్తున్నాడు. ఆ రోగి కనుపాపలు విప్పారాయి అతని నుదురు చెమటతో మెరుస్తోంది. డాక్టర్ ష్వోరర్ ముఖంలో ఎటువంటి భావాలు కనిపించలేదు. అతను భావోద్వేగాలకు లోనయ్యే మనిషి కాదు, కానీ చెకోవ్ ఆఖరి గడియ దగ్గర పడిందని అతనికి తెలుసు. అయినా, అతను ఒక డాక్టర్, తన శాయశక్తులా ప్రయత్నించాలని ప్రమాణం చేసినవాడు, చెకోవ్ తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాడు. డాక్టర్ ష్వోరర్ ఒక ఇంజెక్షన్ సిద్ధం చేసి, కర్పూరం (camphor)….అది గుండె వేగాన్ని పెంచడానికి ఇచ్చే ఒక మందు. కానీ ఆ ఇంజెక్షన్ ఏమాత్రం పనిచేయలేదు. నిజానికి, అప్పుడు ఏదీ సహాయపడే స్థితిలో లేదు. అయినప్పటికీ, ఆక్సిజన్ కోసం ఎవరినైనా పంపాలనే తన ఉద్దేశ్యాన్ని డాక్టర్ ఓల్గాకు తెలియజేశాడు. హఠాత్తుగా, చెకోవ్ తనను
తాను మేల్కొలుపుకుని, స్పృహలోకి వచ్చి నిశ్శబ్దంగా ఇలా అన్నాడు, “ఏమిటి ప్రయోజనం? అది వచ్చేలోపే నేను శవాన్ని అయిపోతాను.”
డాక్టర్ ష్వోరర్ తన పెద్ద మీసాన్ని నిమురుకుంటూ చెకోవ్‌ను తీక్షణంగా చూశాడు. ఆ రచయిత (చెకోవ్) బుగ్గలు లోపలికి పోయి, పాలిపోయి బూడిద రంగులో ఉన్నాయి; ఆయన శ్వాస కష్టంగా వస్తోంది. సమయం కేవలం నిమిషాల్లోనే ఉందని డాక్టర్ ష్వోరర్‌కు అర్థమైంది. ఓల్గాతో ఏమీ మాట్లాడకుండా, అతను గదిలో ఫోన్ ఉన్న ఒక మూలకు వెళ్ళాడు. ఆ పరికరాన్ని ఎలా వాడాలో సూచనలను చదివాడు. ఒక బటన్‌ను నొక్కి పట్టుకుని, ఫోన్ పక్కన ఉన్న హ్యాండిల్‌ను తిప్పడం ద్వారా అతను హోటల్ కింది అంతస్తులోని వంటగదికి కనెక్ట్ అవ్వగలడు. అతను రిసీవర్‌ని తీసి,
సూచనల ప్రకారం కాల్ చేశాడు.
చివరికి అవతలి వైపు ఎవరో సమాధానం ఇచ్చినప్పుడు, డాక్టర్ ష్వోరర్ హోటల్‌లో ఉన్న అత్యుత్తమ షాంపైన్ బాటిల్‌ను పంపమని ఆర్డర్ ఇచ్చాడు. “ఎన్ని గ్లాసులు?” అని అతన్ని అడిగారు. “మూడు గ్లాసులు!” అని డాక్టర్ బిగ్గరగా ఫోన్‌లో అరిచాడు. “త్వరగా పంపండి, వినబడుతుందా?” అది అరుదైన ప్రేరణతో తీసుకున్న నిర్ణయం; ఆ చర్య ఆ సందర్భానికి ఎంత తగినది అంటే, అది అనివార్యం అనిపిస్తుంది.
అలసిపోయినట్లు కనిపిస్తున్న ఒక కుర్రాడు షాంపైన్‌ను గది దగ్గరకు తీసుకువచ్చాడు. అతని జుట్టు చెల్లాచెదురుగా ఉంది, యూనిఫాం ప్యాంటు ముడతలు పడి ఉన్నాయి, హడావిడిలో అతను తన జాకెట్ బటన్ పెట్టుకోవడంలో ఒక లూప్‌ను వదిలేశాడు. తెల్లవారుజామున ఎక్కడో ఫోన్
మోగినప్పుడు, కుర్చీలో కునుకు తీస్తున్న అతడిని ఒక పై అధికారి వచ్చి నిద్రలేపి, రూమ్ నంబర్ 211 కి ‘మోయెట్’ (Moët) బాటిల్‌ని తీసుకువెళ్లమని చెప్పినట్లుగా అతని రూపం ఉంది. “త్వరగా వెళ్ళు, వింటున్నావా?”
ఆ యువకుడు వెండి ఐస్ బకెట్‌లో ఉన్న షాంపైన్, మూడు కట్-క్రిస్టల్ గ్లాసులు ఉన్న వెండి ట్రే పట్టుకుని గదిలోకి ప్రవేశించాడు. అతను బకెట్ మరియు గ్లాసులను టేబుల్‌పై పెడుతూ, పక్క గదిలోకి తొంగి చూడటానికి ప్రయత్నించాడు. అక్కడ ఎవరో శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. అది వినడానికి చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంది. ఆ యువకుడు తన తల దించుకున్నాడు…
అతను తన గడ్డాన్ని చొక్కా కాలర్‌లోకి దాచుకుని, శ్వాస పీల్చుకోవడం మరింత
కష్టతరమవడంతో పక్కకు తప్పుకున్నాడు. తనను తాను మర్చిపోయి, తెరిచి ఉన్న కిటికీ గుండా చీకటిగా ఉన్న నగరం వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు దట్టమైన మీసాలు ఉన్న ఒక భారీ ఆకారం కలిగిన వ్యక్తి, అతని చేతిలో కొన్ని నాణేలను ఉంచాడు—అవి పట్టుకోగానే పెద్ద మొత్తంలో ఇచ్చిన ‘టిప్’ అని అర్థమైంది—అంతలోనే ఆ యువకుడు తలుపు తెరుచుకోవడం చూశాడు. అతను కొన్ని అడుగులు వేసి వరండాలోకి వచ్చాడు, అక్కడ తన అరచేతిని తెరిచి ఆశ్చర్యంతో ఆ నాణేల వైపు చూశాడు.
అతను ప్రతి పనినీ చేసే పద్ధతిలోనే, డాక్టర్ ఎంతో నిలకడగా సీసా నుండి కార్క్‌ను తీసే పనిలో పడ్డాడు. పండగ సంబరాల్లో వచ్చే శబ్దం లాంటి ఆ ‘పాప్’ శబ్దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా అతను దాన్ని తీశాడు.
అతను మూడు గ్లాసుల్లో పోసి, అలవాటు ప్రకారం సీసా మూతను తిరిగి బిగించాడు. తర్వాత అతను ఆ షాంపేన్ గ్లాసులను పడక దగ్గరకు తీసుకెళ్లాడు. ఓల్గా తాత్కాలికంగా చెకోవ్ చేతిపై ఉన్న తన పట్టును వదిలేసింది—ఆ చేయి తన వేళ్లను కాల్చేస్తోందని ఆమె తర్వాత చెప్పింది. ఆమె అతని తల వెనుక మరో దిండును సర్దింది. తర్వాత ఆమె చల్లని షాంపేన్ గ్లాసును చెకోవ్ అరచేతికి ఆనించి, అతని వేళ్లు ఆ గ్లాసు కాడను గట్టిగా పట్టుకునేలా చూసింది. వారు ఒకరినొకరు చూసుకున్నారు—చెకోవ్, ఓల్గా, డాక్టర్ ష్వోరర్. వారు గ్లాసులను తగిలించుకోలేదు. అక్కడ ఎటువంటి చీర్స్ లేదు. అసలు దేని గురించి అని తాగాలి? మరణం గురించా? చెకోవ్ తన మిగిలిన శక్తిని కూడగట్టుకుని, “నేను షాంపేన్ తాగి చాలా కాలమైంది” అన్నాడు. అతను
గ్లాసును తన పెదవుల దగ్గరకు తెచ్చుకుని తాగాడు. ఒక నిమిషం లేదా రెండు నిమిషాల తర్వాత, ఓల్గా అతని చేతి నుండి ఖాళీ గ్లాసును తీసుకుని నైట్‌స్టాండ్‌పై ఉంచింది. అప్పుడు చెకోవ్ పక్కకు తిరిగి పడుకున్నాడు. అతను కళ్లు మూసుకుని నిట్టూర్చాడు. ఒక నిమిషం తర్వాత, అతని శ్వాస ఆగిపోయింది.
డాక్టర్ ష్వోరర్ పడకపై నుండి చెకోవ్ చేతిని తీసుకున్నాడు. అతను తన వేళ్లను చెకోవ్ మణికట్టుపై ఉంచి, తన కోటు జేబు నుండి బంగారు గడియారాన్ని తీసి, దాని మూత తెరిచాడు. గడియారంలోని సెకన్ల ముల్లు చాలా నెమ్మదిగా కదులుతోంది. పల్స్ కోసం వేచి చూస్తూ, అతను ఆ ముల్లును మూడు సార్లు తిరగనిచ్చాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలు, గదిలో ఇంకా ఉక్కపోతగా ఉంది. బాడెన్‌వైలర్లో గత
కొన్నేళ్లలో చూడని భయంకరమైన వడగాల్పులు వీస్తున్నాయి . రెండు గదుల్లోని కిటికీలన్నీ తెరిచే ఉన్నాయి, కానీ గాలి ఆనవాలు లేదు. ఒక పెద్ద, నల్లటి రెక్కలున్న చిమ్మట కిటికీ గుండా లోపలికి వచ్చి, ఎలక్ట్రిక్ దీపానికి పిచ్చిగా కొట్టుకోసాగింది. డాక్టర్ ష్వోరర్ చెకోవ్ మణికట్టును వదిలేశాడు. “అయిపోయింది,” అని అతను అన్నాడు. అతను తన గడియారం మూత మూసి, తిరిగి కోటు జేబులో పెట్టుకున్నాడు.
వెంటనే ఓల్గా తన కళ్లను తుడుచుకుని, మనసును కుదుటపరుచుకుంది. వచ్చినందుకు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఆమెకు ఏదైనా మందు కావాలా—బహుశా లాడనమ్ (నల్లమందు ద్రావణం) లేదా కొన్ని వాలెరియన్ చుక్కలా అని ఆయన అడిగారు. ఆమె వద్దని తల ఊపింది. కానీ ఆమె ఒక అభ్యర్థన చేసింది:
అధికారులకు తెలియజేయకముందే, వార్తాపత్రికలకు తెలిసేలోపు, చెకోవ్ తన సంరక్షణ నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేలోపు, ఆమె అతనితో కొద్దిసేపు ఒంటరిగా ఉండాలని కోరుకుంది. డాక్టర్ దీనికి సహాయం చేయగలరా? అప్పుడే జరిగిన విషయం బయటకు తెలియకుండా ఆయన కాసేపు ఆపగలరా?
డాక్టర్ ష్వోహరర్ తన వేలి వెనుక భాగంతో తన మీసాన్ని నిమురుకున్నారు. ఎందుకు చేయకూడదు? అసలు ఈ విషయం ఇప్పుడే తెలిసినా లేదా కొన్ని గంటల తర్వాత తెలిసినా ఎవరికి ఏం తేడా ఉంటుంది? మిగిలిన ఏకైక పని డెత్ సర్టిఫికేట్ పూర్తి చేయడం, అది ఉదయం కొన్ని గంటలు నిద్రపోయిన తర్వాత తన కార్యాలయంలో చేసుకోవచ్చు. డాక్టర్ ష్వోహరర్ అంగీకరిస్తూ తల ఊపారు. ఆయన కొన్ని సానుభూతి
మాటలు చెప్పారు. ఓల్గా తల వంచి మౌనంగా వింది. “ఇదొక గౌరవం,” అని డాక్టర్ ష్వోహరర్ అన్నారు. ఆయన తన బ్యాగు తీసుకుని గదినుంచి వెళ్లిపోయారు, ఆ రకంగా ఆ సన్నివేశం నుండి, చరిత్ర నుండి నిష్క్రమించారు.
సరిగ్గా ఆ క్షణంలోనే షాంపేన్ బాటిల్ నుండి బిరడా శబ్దంతో పైకి ఎగిరింది. నురగ మేజాపైకి ఒలికింది. ఓల్గా తిరిగి చెకోవ్ మంచం వద్దకు వెళ్ళింది. ఆమె ఒక చిన్న పీటపై కూర్చుని, అతని చేయి పట్టుకుని, అప్పుడప్పుడు అతని ముఖాన్ని నిమురుతూ ఉండిపోయింది. “అక్కడ మానవ స్వరాలు లేవు, రోజువారీ శబ్దాలు లేవు,” అని ఆమె రాసింది. “అక్కడ కేవలం అందం, ప్రశాంతత, మరణం యొక్క వైభవం మాత్రమే ఉన్నాయి.”
కింద ఉన్న తోట నుండి పక్షుల అరుపులు
వినిపించే తెల్లవారుజాము వరకు ఆమె చెకోవ్‌తోనే ఉండిపోయింది. అప్పుడు కింద గదిలో మేజాలు, కుర్చీలు జరుపుతున్న శబ్దం వినిపించింది. కొద్దిసేపటికే మనుషుల మాటలు ఆమెకు వినిపించాయి. ఆ సమయంలోనే తలుపు మీద ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. ఆమె అది ఎవరైనా అధికారి అయి ఉంటారని భావించింది. బహుశా మెడికల్ ఎగ్జామినర్ లేదా పోలీసుల నుండి ఎవరైనా ప్రశ్నలు అడగడానికి, ఫారాలు నింపడానికి వచ్చి ఉండవచ్చు, లేదా డాక్టర్ ష్వోహరర్ శవపరీక్ష చేసే వ్యక్తితో తిరిగి వచ్చి ఉండవచ్చు.
కానీ, దానికి బదులుగా, కొన్ని గంటల క్రితం షాంపేన్ తీసుకువచ్చిన అదే బంగారు వర్ణపు జుట్టు గల యువకుడు అక్కడ ఉన్నాడు. అయితే ఈసారి, అతని యూనిఫామ్ ప్యాంటు చక్కగా ఇస్త్రీ చేసి ఉంది, అతని
ఆకుపచ్చ జాకెట్‌పై ఉన్న ప్రతి బటన్ సరిగా పెట్టుకుని ఉన్నాడు.
అతడు ఇప్పుడు పూర్తిగా వేరే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అతను నిద్రలేచి చురుగ్గా ఉండటమే కాకుండా, అతని బొద్దుగా ఉన్న చెంపలు శుభ్రంగా షేవ్ చేసినట్లు ఉన్నాయి, జుట్టు సరిగ్గా ఉంది, అతను ఎదుటివారిని మెప్పించాలనే ఆత్రుతతో ఉన్నట్లు కనిపించాడు. అతను మూడు పొడవాటి కాడలున్న పసుపు రంగు గులాబీలతో కూడిన పింగాణీ వాజును పట్టుకొని ఉన్నాడు. అతను తన మడమలను చప్పుడు చేస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో వాటిని ఓల్గాకు అందించాడు. ఆమె వెనక్కి అడుగు వేసి అతడిని గదిలోకి రానిచ్చింది.
తను గ్లాసులు, ఐస్ బకెట్ మరియు ట్రే సేకరించడానికి వచ్చానని అతను చెప్పాడు.
అంతేకాకుండా, విపరీతమైన ఎండ కారణంగా, ఈ ఉదయం అల్పాహారం తోటలో వడ్డించబడుతుందని కూడా అతను చెప్పాడు. ఈ వాతావరణం మరీ ఇబ్బందికరంగా లేదని అతను ఆశించాడ. దాని కోసం అతను క్షమాపణ కూడా చెప్పాడు.
ఆ స్త్రీ పరధ్యానంగా ఉన్నట్లు అనిపించింది. అతను మాట్లాడుతున్నప్పుడు, ఆమె తన కళ్లను పక్కకు తిప్పి తివాచీ పై ఉన్న ఏదో ఒక వస్తువు వైపు కిందికి చూసింది. ఆమె తన చేతులను కట్టుకుని మోచేతులను పట్టుకుంది. ఇంతలో, తన వాజును పట్టుకుని, ఆమె నుంచి ఏదైనా సంజ్ఞ వస్తుందేమోనని వేచి చూస్తూ, ఆ యువకుడు గదిలోని వివరాలను గమనించాడు. తెరిచిన కిటికీల గుండా ప్రకాశవంతమైన సూర్యరశ్మి లోపలికి
వస్తోంది. గది క్రమబద్ధంగా ఉంది. ఎవరూ తాకని విధంగా ప్రశాంతంగా అనిపించింది. కుర్చీలపై బట్టలు పడేసి లేవు, బూట్లు, మేజోళ్ళు లేదా ఇతర వస్తువులేవీ కనిపించడం లేదు. సరిగా చెప్పాలంటే, అక్కడ గజిబిజి ఏమీ లేదు, సాధారణ హోటల్ గదిలో ఉండే భారీ ఫర్నిచర్ మాత్రమే ఉంది.
ఆ తర్వాత, ఆ స్త్రీ ఇంకా కిందికే చూస్తుండటంతో, అతను కూడా కిందికి చూశాడు. అప్పుడు అతనికి తన షూ అంచు వద్ద ఒక సీసా బిరడా కనిపించింది. ఆ స్త్రీ దానిని చూడలేదు, ఆమె మరెక్కడో చూస్తోంది. ఆ యువకుడు వంగి ఆ బిరడాను తీయాలనుకున్నాడు, కానీ అతను ఇంకా గులాబీలను పట్టుకుని ఉన్నాడు, తన పని వల్ల మరింత దృష్టిని ఆకర్షించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తానేమో అని
భయపడ్డాడు. ఇష్టం లేకపోయినా, అతను ఆ బిరడాను అక్కడే వదిలేసి తన కళ్లు పైకెత్తాడు.
అక్కడ ఒక చిన్న టేబుల్‌పై రెండు క్రిస్టల్ గ్లాసుల పక్కన ఉన్న, మూత తీసి సగం ఖాళీగా ఉన్న షాంపేన్ బాటిల్ తప్ప మిగతావన్నీ సక్రమంగానే ఉన్నాయి. అతను తన చూపును మరోసారి చుట్టూ తిప్పాడు. తెరిచిన తలుపు గుండా పడకగదిలో, నైట్‌స్టాండ్ మీద మూడవ గ్లాసు ఉండటం అతను గమనించాడు.
కానీ ఎవరో ఇంకా మంచం మీద పడుకుని ఉన్నారు! అతనికి ముఖం కనిపించలేదు, కానీ దుప్పటి కింద ఉన్న ఆ ఆకారం కదలకుండా నిశ్శబ్దంగా ఉంది. అతను ఆ ఆకారాన్ని గమనించి చూపు పక్కకు తిప్పాడు. అప్పుడు, అతనికి అర్థం కాని కారణం వల్ల, ఒక రకమైన అశాంతి
కలిగింది. అతను తన గొంతు సవరించుకుని, తన శరీర బరువును మరో కాలిపైకి మార్చుకున్నాడు. ఆ స్త్రీ ఇంకా పైకి చూడలేదు, తన మౌనాన్ని వీడలేదు. ఆ యువకుడి, తన చెంపలు ఎర్రబడటం గమనించాడు. లోతుగా ఆలోచించకుండానే అతనికి ఒక విషయం తోచింది…
బహుశా తోటలో అల్పాహారానికి బదులుగా మరొక ప్రత్యామ్నాయాన్ని సూచించాలని అతను అనుకున్నాడు. ఆ స్త్రీ దృష్టిని ఆకర్షించాలని ఆశిస్తూ అతను దగ్గాడు, కానీ ఆమె అతని వైపు చూడలేదు. విశిష్ట విదేశీ అతిథులు కోరుకుంటే ఈ ఉదయం వారి గదుల్లోనే అల్పాహారం తీసుకోవచ్చని అతను చెప్పాడు. ఆ యువకుడు,తాను ట్రే తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. బెడ్‌రూమ్ వైపు మరోసారి సందేహంగా చూస్తూ, రెండు ట్రేలు అని
అతను జతచేశాడు.
అతను మౌనంగా ఉండిపోయి, తన కాలర్ లోపలి భాగంలో వేలితో సరిచేసుకున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆ స్త్రీ తను చెప్పేది వింటోందో లేదో కూడా అతనికి ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు ఇంకేం చేయాలో అతనికి పాలుపోలేదు. అతను ఇంకా ఆ పూలగుత్తిని పట్టుకునే ఉన్నాడు. గులాబీల తీపి వాసన అతని నాసికా రంధ్రాలను నింపింది. వివరించలేని విధంగా ఒక పశ్చాత్తాపపు వేదనను కలిగించింది. అతను వేచి ఉన్నంత సేపు, ఆ స్త్రీ ఆలోచనల్లో మునిగిపోయినట్లు అనిపించింది. అతను అక్కడ నిలబడి, మాట్లాడుతున్నప్పుడు, తన బరువును ఒక కాలు నుండి మరొక కాలుకు మారుస్తున్నప్పుడు, పూలను పట్టుకుని ఉన్నప్పుడు—ఆమె మరెక్కడో,
బాడెన్‌వీలర్‌కు చాలా దూరంలో ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్పృహలోకి వచ్చింది, ఆమె ముఖంలో మరో భావం కనిపించింది.
ఆమె కళ్ళు పైకెత్తి, అతని వైపు చూసి, తల ఊపింది. చేతిలో మూడు పసుపు గులాబీలు ఉన్న వాసే పట్టుకుని ఈ యువకుడు ఈ గదిలో అసలు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆమె తడబడుతున్నట్లు అనిపించింది. పూలా? ఆమె పూల కోసం ఆర్డర్ ఇవ్వలేదే.
ఆ క్షణం గడిచిపోయింది. ఆమె తన హ్యాండ్‌బ్యాగ్ దగ్గరకు వెళ్లి కొన్ని నాణేలను తీసుకుంది. ఆమె కొన్ని నోట్లను కూడా బయటకు తీసింది. ఆ యువకుడు తన నాలుకతో పెదవులను తడుపుకున్నాడు; మరొక భారీ బహుమతి (టిప్) రాబోతోంది, కానీ దేనికి? ఆమె తనను ఏమి చేయమని
కోరుతోంది? అతను ఇంతకు ముందు ఇలాంటి అతిథులకు ఎప్పుడూ సేవ చేయలేదు. అతను మరోసారి గొంతు సవరించుకున్నాడు.
“అల్పాహారం వద్దు,” అని ఆ స్త్రీ చెప్పింది. “కనీసం ఇప్పుడైతే వద్దు. ఈ ఉదయం అల్పాహారం ముఖ్యమైన విషయం కాదు.” ఆమెకు మరేదో కావాలి. అతను బయటకు వెళ్లి ఒక శవపరీక్షకుడు (mortician) ను తీసుకురావాలని ఆమె కోరింది. ఆమె చెప్పింది అతనికి అర్థమైందా? “హెర్ చెకోవ్ మరణించారు, చూడు. నీకు అర్థమవుతోందా?యువకుడా? ఆంటోన్ చెకోవ్ మరణించారు.”
“ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను,” అని ఆమె అంది. అతను మెట్ల మీద నుండి కిందకు వెళ్లి, నగరంలో అత్యంత గౌరవనీయుడైన శవపరీక్షకుడు ఎక్కడ
దొరుకుతారో రిసెప్షన్‌లో అడగాలని ఆమె కోరింది. నమ్మకస్థుడు, తన పనిలో చాలా శ్రద్ధ వహించేవాడు, ప్రవర్తనలో తగినంత హుందాతనం ఉన్న వ్యక్తి కావాలి. క్లుప్తంగా చెప్పాలంటే, ఒక గొప్ప కళాకారుడికి తగిన శవపరీక్షకుడు. “ఇదిగో,” అని అంటూ ఆమె ఆ డబ్బును అతని చేతిలో పెట్టింది.
“అతడితో చెప్పు. ఈ పనిని నా కోసం నువ్వే చేయాలని నేను ప్రత్యేకంగా కోరినట్లు కింద ఉన్న వాళ్లకు చెప్పు. నేను చెప్పేది వింటున్నావా? నీకు అర్థమవుతోందా?”
ఆ యువకుడు ఆమె చెబుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతను పక్క గది వైపు మళ్ళీ చూడకూడదని నిర్ణయించుకున్నాడు. ఏదో సరిగ్గా లేదని అతనికి అప్పటికే అనిపించింది. తన జాకెట్ లోపల గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి తెలిసింది,
నుదుటిపై చెమటలు పట్టాయి. చూపులు ఎటు తిప్పాలో అతనికి అర్థం కాలేదు. ఆ పూల కూజాను ఎక్కడో ఒకచోట పెట్టేయాలని అతనికి అనిపించింది.
“దయచేసి నా కోసం ఇది చెయ్,” అని ఆ స్త్రీ అంది. “నేను నిన్ను కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను. నేను చెప్పినట్లుగా కింద ఉన్న వాళ్లకు చెప్పు. అలానే చెప్పు. కానీ నీ మీదకు కానీ, అక్కడ ఉన్న పరిస్థితి మీదకు కానీ అనవసరమైన దృష్టిని మళ్లించవద్దు. ఇది అవసరమని, నేను అడిగానని మాత్రం చెప్పు అంతే. వింటున్నావా? అర్థమైతే తల ఊపు. అన్నింటికంటే ముఖ్యంగా, ఆందోళన కలిగించవద్దు. మిగతావన్నీ, ఆ గందరగోళం అంతా త్వరలోనే వస్తాయి. జరగకూడనిది జరిగిపోయింది. మనకు ఒకరి మాట ఒకరికి అర్థమైందా?”
ఆ యువకుడి ముఖం తెల్లబారిపోయింది.
అతను ఆ పూల కూజాను గట్టిగా పట్టుకుని, బిగుసుకుపోయి నిలబడ్డాడు. ఎలాగోలా తల ఊపాడు.
హోటల్ నుండి బయటకు వెళ్లడానికి అనుమతి పొందిన తర్వాత, అతను నిశ్శబ్దంగా, దృఢ నిశ్చయంతో, ఎటువంటి తొందరపాటు ప్రదర్శించకుండా, మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తి వద్దకు వెళ్లాలి. అతను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లుగానే ప్రవర్తించాలి, అంతకంటే మరేమీ కాదు. అతను నిజంగానే ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాడని ఆమె అంది. అతను తన నడకలో ఉద్దేశాన్ని కోల్పోకుండా ఉండాలంటే—తాను ఒక రద్దీగా ఉన్న కాలిబాటపై నడుస్తూ, ఒక ముఖ్యమైన వ్యక్తికి అందించాల్సిన పింగాణీ పూల కూజాను చేతుల్లో పట్టుకున్నట్లు ఊహించుకోవాలి. (ఆమె చాలా నిశ్శబ్దంగా,
రహస్యంగా, ఒక బంధువుతో లేదా స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు మాట్లాడింది.) తాను చూడబోయే వ్యక్తి తన కోసం ఎదురుచూస్తున్నాడని, బహుశా పూల కోసం అసహనంగా ఉన్నాడని కూడా అతను అనుకోవచ్చు. ఏదేమైనా, ఆ యువకుడు ఉత్సాహంతో పరుగెత్తకూడదు లేదా తన నడక వేగాన్ని మార్చకూడదు. తన చేతిలో ఉన్న పూల కూజాను గుర్తుంచుకోవాలి! అతను చురుగ్గా నడవాలి, ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలి. అతను ఆ ‘మార్టీషియన్’ ఇంటికి చేరుకుని, తలుపు ముందు నిలబడే వరకు నడుస్తూనే ఉండాలి. తర్వాత అతను ఇత్తడి తలుపు గొళ్ళెం ఎత్తి ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు కొట్టాలి. ఒక నిమిషంలో, ఆ మార్టీషియన్ స్వయంగా సమాధానం ఇస్తాడు.
ఆ మార్టీషియన్ నిస్సందేహంగా నలభై ఏళ్లలో లేదా యాభై ఏళ్ల ప్రారంభంలో ఉంటాడు—బట్టతల, దృఢమైన శరీరం, స్టీలు ఫ్రేము ఉన్న కళ్ళద్దాలు ధరించి ఉంటాడు…
అతని ముక్కుపై కళ్ళజోడు చాలా కిందకు వేలాడుతూ ఉంటుంది. అతను చాలా అణకువగా, నిరాడంబరంగా, కేవలం అత్యంత ప్రత్యక్షమైన, అవసరమైన ప్రశ్నలను మాత్రమే అడిగే వ్యక్తిగా ఉంటాడు. బహుశా అతను ఏప్రాన్ ధరించి ఉంటాడు. చెప్పేది వింటున్నప్పుడు అతను తన చేతులను ముదురు రంగు తువ్వాలుతో తుడుచుకుంటూ ఉండవచ్చు. అతని బట్టల నుండి ఫార్మాల్డిహైడ్ స్వల్ప వాసన వస్తూ ఉంటుంది. కానీ అంతా బానే ఉంటుంది, ఆ యువకుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతను ఇప్పుడు దాదాపు పెరిగి
పెద్దవాడయ్యాడు, వీటిలో దేనికీ భయపడకూడదు లేదా అసహ్యించుకోకూడదు.
ఆ శవపరీక్షకుడు (mortician) అతని మాటలు పూర్తిగా వింటాడు. అతను నిగ్రహం హుందాతనం గల మనిషి, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల భయాలను పెంచకుండా, వాటిని తగ్గించడంలో సహాయపడే వ్యక్తి. ఎప్పుడో పాత రోజుల్లోనే అతను మరణాన్ని దాని వివిధ రూపాలలో, పద్ధతుల్లోతెలుసున్నవాడు.మరణం అతనికి ఇకపై ఎటువంటి ఆశ్చర్యాలను కలిగించదు, అందులో అతనికి తెలియని రహస్యాలేమీ లేవు. ఈ ఉదయం ఈ వ్యక్తి సేవలే అవసరమయ్యాయి.
ఆ శవపరీక్షకుడు రోజా పూల కూజాను (vase) అందుకుంటాడు. ఆ యువకుడు మాట్లాడుతున్నంత సేపు, ఆ శవపరీక్షకుడు
కేవలం ఒక్కసారి మాత్రమే స్వల్ప ఆసక్తిని లేదా తాను ఏదైనా అసాధారణమైన విషయం విన్నట్లుగా ఒక సంకేతాన్ని కనబరుస్తాడు. యువకుడు మరణించిన వ్యక్తి పేరు చెప్పిన ఆ ఒక్కసారి మాత్రం, ఆ శవపరీక్షకుడి కనుబొమ్మలు కాస్త పైకి లేస్తాయి. “చెకోవ్ (Chekhov) అంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే వస్తాను.”
“నేను చెప్పేది మీకు అర్థమవుతోందా?” అని ఓల్గా ఆ యువకుడితో అంది. “గ్లాసులను వదిలేయండి. వాటి గురించి చింతించకండి. క్రిస్టల్ వైన్ గ్లాసుల గురించి మర్చిపోండి. గదిని ఎలా ఉందో అలా వదిలేయండి. అంతా సిద్ధంగా ఉంది. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వెళ్తారా?”
కానీ ఆ క్షణంలో ఆ యువకుడు తన షూ దగ్గర పడి ఉన్న కార్క్ (బెండు) గురించి
ఆలోచిస్తున్నాడు. దాన్ని తీయడానికి అతను పూల కూజాను పట్టుకునే వంగాల్సి ఉంటుంది. అతను అలా చేశాడు. కిందకు చూడకుండానే, అతను చేతిని చాచి దాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు.
—-

ఈ రచన చదువుతుంటే మరణం ఒక సంఘటనలా కాకుండా, ఒక నిశ్శబ్ద క్రమంలా అనిపిస్తుంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఒక మహా మనీషి, అద్భుతమైన కథకుని జీవితం ఎలా మెల్లగా ముగిసిందో చాలా సహజంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి క్షణాల్లోని ఆ షాంపేన్ దృశ్యం… సంబరాలకు చిహ్నమైన పానీయం, ఇక్కడ వీడ్కోలుకి సాక్షిగా మారడం మనసు లోతుల్లో స్థిరపడిపోతుంది. ఓల్గా చూపిన స్థైర్యం, యువకుడి అయోమయం, గదిలోని నిశ్శబ్దం… అనీ కలిసి ఒక గాఢమైన అనుభూతిని సృష్టించాయి. చదివిన తర్వాత మనసుమీద కొంతసేపు మౌనాన్ని రాసిన రచన ఇది.