పరుగు… ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరమూ ఎవరితో ఎక్కడి వరకు నడుస్తాము!?
ఏ పరిచయం ఎన్నాళ్ళు ఉంటుంది!?. ఎవరు ఏ వేదిక మీదైనా కలవవచ్చు,
ఏ కాల్పానిక కథనైనా వెంట వేసుకొని రావచ్చు. మనతో మమేకమై జీవించనూ వచ్చు.
ఏది ఏమైనా మనుషులు మనుషులుగా కలిసి మసలే కాలాన్ని ఎలా లెక్కించగలం. ఎవరు ఎంతవరకో ఎలా గుణించగలం. కాలాన్ని ఎన్ని హెచ్చ వేతలు, గుణకారాలు చేసినా… ఏ మనిషితో నడక ఎంతవరకు ఎవరమూ చెప్పలేము.
ఏ క్షణం వెంట ఎవరు పరిగెడతారు, ఆధునిక ఆలోచనల్లో తరాలు మారుతున్న సందర్భాన్ని, బతుకు చిత్రంలో మనిషి పెట్టే పరుగుని గురించి చర్చించడమే ఈ పుస్తకం.
యువత భవిష్యత్తు పై అనేక ఆశలు పెట్టుకుంటూ కాలచక్రానికి ఇరుసులా వారి బంగారు భవితను నిర్మించుకోవడం కోసం పుట్టిన ఊరుని, కన్న తల్లిదండ్రులని, స్నేహితులని, వదులుకొని ఉద్యోగం పేరుతో ఇంటి వాతావరణానికి దూరమై… వ్యాపార చక్రంలో బందీ అవుతున్న యువత ఆలోచనల తీరును అద్ధం పడుతుంది ఈ నవల.
ఈ నవల అనువాదంలా అనిపించలేదు. మూల రచయిత చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా కాకుండా అనువాదకుడు డా. వి. ఎల్.నరసింహం శివకోటి స్వేచ్ఛానువాదం చేయడం వల్ల భాషా సౌందర్యము, కథా నడకలో చాలా చక్కగా ఇమిడిపోయాయి.
పాఠకుడికి పాత్రల మధ్య కలిసిపోయే మాటలు మాత్రమే కనిపిస్తాయి. రచయిత ప్రత్యేకంగా మధ్యలో ఎక్కడ తన భావాన్ని వినిపించినట్టు ఉండదు, ఏ పాత్రలోనూ రచయిత జోక్యం మనకి కనిపించదు. కథకు తగ్గట్టుగా సంభాషణ నడుస్తుంది. అయితే ఇక్కడ అనువాదకుని చాతుర్యాన్ని మెచ్చుకోక తప్పదు చక్కటి నుడికారాలతో జాతీయాలతో అనువాదాన్ని చేసినట్టు అర్థమవుతుంది. అయితే మూల కథ రాసిన మమతా కాలియా రచనల గురించి కొద్ధి పరిచయం ఉండడం వలన ఈ రచనలో భావం మారలేదని చెప్పవచ్చు.
యువత భావజాలం ఏ పక్కగా నడుస్తుందో పరిశీలనాత్మక రచన మనకి కనిపిస్తుంది. నేడు ఉద్యోగాల కోసం పోటీ తత్వాన్ని పెంచి పోషించుకునే దిశగా, ఆ పోటీలో పెట్టే పరుగుల్ని చూస్తూ మనం అక్షరాల వెంట పరిగెడతాం. మనిషి వ్యాపార చక్రం లాంటి బతుకు పరుగు ఈ పుస్తకం.
బిడ్డ పుట్టిన నాటి నుంచి ఈ పరుగు మొదలవుతుంది. ఆ బిడ్డ భవిష్యత్తుని ఆలోచిస్తూ మనం చదివించే చదువులు, వారి భవిష్యత్తుకి మార్గాలు అవ్వాలని, వారు అందలాలు ఎక్కాలని తల్లిదండ్రులుగా కోల్పోయే ఆర్థిక స్వేచ్ఛని గురించి మాట్లాడుతూనే… మానసికంగా మనిషి ఎదుగుదలలోని ఆలోచనల మార్పులని, బిడ్డల ఆలోచనల్లోని మార్పులు జీర్ణించుకోలేని తల్లిదండ్రుల పరిస్థితులు, సొంత గ్రామాలకు, పుట్టి పెరిగిన ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిపోయే సంస్కృతికి అడ్డం పడుతూ మారిపోతున్న మనుషుల నడవడికని, మానవత్వపు విలువలని ఈ నవల చక్కగా పట్టి చూపిస్తుంది.
ఈ నవల ప్రారంభంలో పవన్ కథానాయకుడిగా మనకి కనిపిస్తాడు. అహ్మదాబాద్ నుండి అలహాబాద్ ఉద్యోగంలోని వ్యాపార రీత్యా తన ప్రయాణం మొదలైన తనతో పని చేసే తోటి వారి పట్ల ప్రేమతో ఉన్నా పోటీ తత్వం మాత్రం మారదు.
అందుకు పోటీ పడవలసిన కారణాలను కూడా మనం ఏమాత్రం అభ్యంతరం పెట్టడానికి వీలు లేనంతగా మనల్ని అనునయిస్తూ ఈ కథ సాగుతుంది.
తనతోపాటు పనిచేసే వారితో కలిసి పంచుకునే సంతోషాలతో బాటు
ఆధ్యాత్మికంగా పెద్దగా ప్రభావాన్ని చూపించకపోయినా, వారి జీవితాలకి అన్వయించుకోకపోయినా ఆశ్రమ జీవనాలలో వెతుక్కునే ప్రశాంతతలోకూడా ఎలా వ్యాపార ప్రవృత్తి అల్లుకుపోయిందో నేటితరం ఆధ్యాత్మికతని ఎంతగా వ్యాపారంగా చేసుకుని వంట పట్టించుకుంటుందో.. కథలోనే మిళితం చేసి చెప్పడం బాగుంటుంది.
ఈ నవలలో స్త్రీ ఆత్మ సంఘర్షణ ఉంటుంది. ఈ పుస్తకం మొత్తం మీద ముగ్గురు స్త్రీమూర్తులు కనిపిస్తారు మనకి
మొదటగా తారసపడే రాజుల్.. కెరియర్ లో మంచిగా స్థిరపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక బిడ్డను కనీ తల్లిగా మరే సందర్భంలో తన కెరీర్ ని ఎలా వదులుకోవాల్సి వచ్చిందో తన చుట్టూ ఉద్యోగవ్యాపార రంగం బిగించిన చక్రాలమధ్య… వదులుకున్న ఉద్యోగము తో పాటు తన భర్త తన నుంచి దూరమైపోతాడేమో ఈ రంగుల ప్రపంచంలో అన్న బలహీనత ఆమెను పట్టి వేధించడం ఆమె జీవితంలో భాగమైపోవడాన్ని మనం చూస్తాం.
స్టెల్లా… ఆధునిక వనితకి రూపంగా ఉంటుంది. వ్యాపార దక్షతని అందిపుచ్చుకున్న మార్కెటింగ్ ఆఫీసర్. ఆమె ఉద్యోగ ధర్మం లో ఒక గంట సమయాన్ని వంటకి కేటాయించినా అది సమయం వృధా అన్న ధోరణిని చూపిస్తూనే నేడు పురుష సమాజం స్త్రీని వంటగదికి పరిమితం చేయట్లేదు అన్న భావాన్ని ఎంతో ప్రోగ్రెసివ్ ఆలోచనలతో స్త్రీ ప్రేమను పెంచాలంటే వంటే చేయాల్సిన అవసరం లేదని చిన్నచిన్న మాటలతో మనుషుల మధ్య ఆప్యాయతల్ని పంచుకోవచ్చు అని చూపిస్తారు ఈ నవలలో.
రేఖ.. ఆర్థిక స్వాతంత్రం ఉన్నా కుటుంబానికి ఆ ఆర్థిక స్వేచ్ఛని అందించాలి అదే స్త్రీగా తన బాధ్యత అని నమ్మే రేఖ ఇందులో ఓ టీచరు, రచయిత కొడుకు ఆధునిక ఆలోచనలను అర్థం చేసుకుంటూనే తమ జీవితాలనుంచి బిడ్డలు దూరం అవుతున్న స్థితిని తట్టుకోలేని అమ్మ పాత్ర సర్దుకుపోయే అమ్మ పాత్ర. ఈ నవలకి పట్టుకొమ్మ ఈమె పాత్ర. భర్త రాకేష్ తో, కొడుకు పవన్ తో రేఖ సంభాషణ మన చుట్టూ అనేకమంది ఆలోచనలని మన ముందు నిలబెడుతుంది.
పిల్లలు జీవితంలో స్థిరపడడానికి తల్లిదండ్రుల సంపాదన ఎంత ముఖ్యమో చూపిస్తూనే దూర తీరాల్లో ఉండే పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రులుగా వాళ్ళు పడే మానసిక ఆవేదనని ఆవిష్కృతం చేస్తుంది ఈ నవల.
విదేశాలలో ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఎందరో పిల్లలు తమ తల్లిదండ్రుల అంత్యక్రియలకు రాలేని సందర్భాన్ని ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రుల్లో మిగిలిన ఒక్కరూ ఆ పిల్లలు రాని బాధని అనుభవించే తీరుని అతి కొద్ది అక్షరాలతో చాలా స్పష్టంగా వివరించారు.
వలస పక్షుల్లా, మనుషులు కూడా వలస వెళ్లి తిరిగి రావాలన్నా ఆలోచనను విరమించుకోవడాన్ని ప్రశ్నిస్తూనే.. ఇదంతా ఒక వ్యాపార చక్రంలో బంధించబడిన బతుకు పరుగు అని ఈ వ్యాపార పరుగులు నువ్వు నేను అందరం భాగస్వాములమే అని గుర్తుచేసే నవల ఇది.
ఇలా ఈ పుస్తకం లో రంగులరాట్నంలా పరుగుపెట్టే జీవితాల మధ్య అనుబంధాలు సెల్ ఫోన్ లో మాటలుగా మిగిలిపోవడం మనల్ని మనం ఏ దిక్కుగా పరుగు పెడుతున్నామని ప్రశ్నిస్తాయి.
~
రూపరుక్మిణి.కె
27నవంబర్ 25
“పరుగు” – నవల ఎన్నెల పిట్ట ప్రచురణలు.
హిందీ :మమతా కాలియా, అనునువాదం: వి. ఎల్.నరసింహం శివకోటి.











