కలువల కన్నుల్లో మెరుపుని చూసి సంతోషించే మనసు ఉండదా!!
తాను పరిచిన మోహపు దారిలో తనని తాను వెతుక్కునే ఓ లౌక్యం తెలిసిన మనిషి కథ,ఓ స్వాప్నికుడి కల ఈ నవల.
అందమైన కన్నులతో, చందమామలా మెత్తని నవ్వులు రువ్వే సుందరాంగుడిని చూసి ఏ చెలియ మోహించకుండా ఉండగలదు. అలాగే ఈ అందగాడి జీవితం అట్టడుగు స్థాయి నుండి నీలదొక్కుకోడానికి చేసే ప్రయత్నంలో…, తాను బ్రతకడానికి వచ్చిన పారిస్ లోని అతి ముఖ్యమైన సంపాదకులలో ఒకరిగా ఎదిగిన క్రమం ఈ “జార్జ్ డ్యూ రోయ్” మనకి చూపిస్తాడు.
ఓ వ్యక్తి అందంగా ఉండగానే సరిపోదు దానికి తగ్గట్టు తన జీవితాన్ని కూడా అందంగా మలుచుకోవడంలోనే గెలుపు ఉంటుంది. జార్జ్ అందగాడు మాటకారి తన కథకి తానే హీరో, తానే విలన్, రెండూ తానే అయినప్పుడు సాధారణమైన జీవితాన్ని గడపడం మహా కష్టం. అటువంటి కష్టమైన జీవితంలో నుంచి ప్రపంచాన్ని చూస్తున్న జార్జ్ చురుకైన కళ్ళతో మతాబులా పెలే తనలోని అక్షర జ్వాలను ప్రయోగించగల కలం బలం ఉన్న అతను ఎదగాలనుకున్నప్పుడు తన చుట్టూ ప్రపంచంలోని వారిని గెలవడానికి అతను ఎంతో ప్రేమగా ప్రేమిస్తూనే తనలోని నయవంచనతో కూడిన ఆలోచనలను అమలు చేసుకోగల నేర్పరి తనాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
ప్రేమ ఎంతటి వారినైనా బలహీనపరుస్తుంది. మోహకాంక్ష ఎదుటివారిలోని బలాన్ని ప్రశ్నించకుండా చేస్తుంది అటువంటి ఈ సుందరాంగుడు స్త్రీలోలుడు (a man who engage is in numerous casual sexual affairs with women)
తన ఎదుగుదలకి తనని తానే పెట్టుబడిగా పెట్టుకున్న వ్యక్తి గమనాన్ని తెలియజేస్తుంది. ఆకర్షణల మధ్య దూరాలని చెరిపివేసి మిత్ ని వీడి కేవలం నిజాల్ని నిర్భయంగా ఎదుర్కో గల వ్యక్తి “జార్జ్ డ్యురోయ్”
తన లక్ష్యసాధనలో భాగంగా వయసుతో నిమిత్తం లేకుండా తన చూపులతో మగువని మానసికంగా జయించి తన సొంతం చేసుకోగల చాకచక్యం అతనిలో మనకు కనిపిస్తుంది.
అలా అతని జీవితంలోకి వచ్చిన వారెవ్వరు డ్యూరోయ్ ని ద్వేషించలేక పోవడం ఈ కథలో మ్యాజిక్ అందరూ అతని ప్రేమను అందుకోవడానికి ఎదురు చూస్తూనే ఉండడం డ్యూరోయ్ పాత్ర సృష్టించిన మాయ.
ఈ పాత్రలన్నీ మనకేం చెబుతున్నాయి అంటే తన బ్రతుకు బాటని మార్చుకోవడానికి అతను ఏ మాత్రం నిజాయితీగా ఉండడు, అలా అని మోసపూరితంగా మనుషులని దోచుకోడు. తన ఆటలో తాను ఎప్పుడు విన్నింగ్ చాంపియనే తనకు కావలసిన డబ్బుని ఇవ్వగలిగిన స్త్రీలని ఎంచుకుంటూనే వారిని మోహావస్థలో పడవేస్తాడు.
స్త్రీ లోలుడు అంటున్నారు, మోసం చేస్తాడు అంటున్నారు మరి అటువంటి మోసపూరితమైన ఆలోచన కలిగిన వ్యక్తిత్వాన్ని నీచమైనది అని కూడా అనుకోవచ్చు కదా అన్న సందేహం మీకు రావచ్చు, రావాలి కూడా.. ఈ కథని చెప్పేటప్పుడు “మోపాస” ఏమి ఆలోచించాడోగాని మనుషుల అంతరాంతరాలలోని బానిసత్వపు గోడల్ని బద్దలు కొట్టడానికి మాత్రం ప్రయత్నించాడు అనిపిస్తుంది.
మరి అలా అనుకున్నప్పుడు ఇటువంటి నీచమైన వ్యక్తిత్వం అతనిది అయినప్పుడు ఆ స్త్రీలంతా అతని వైపు ఎందుకంత మమకారాన్ని చూపిస్తారు. ఏ పరిస్థితులు వారి చుట్టూ అల్లుకున్నాయి ఎటువంటి సామాజిక వ్యవస్థలో వారు ఉన్నారు, పెళ్లి చేసుకున్న అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి, మాత్రమే కాదు అతని జీవితంలో ప్రవేశించిన ప్రతి స్త్రీ డ్యూ రోయ్ ని గౌరవిస్తూనే ఉంటుంది.
అలా గౌరవించుకునే సమయంలో ఆ స్త్రీలకు అతి దుఃఖ దాయకమైనదే అయినా డ్యూరోయ్ కి సహకరిస్తూనే అతని గెలుపుకి కారణం అవుతూ ఉంటారు
మరి ఏమిటా పరిస్థితులు అతనిలో మంచి లేకుండానే కేవలం పరిస్థితిలో మాత్రమే అతన్ని నడిపించడం లేదని ఈ కథ ప్రతి మలుపులో మనకు అర్థమవుతూనే ఉంటుంది.
డ్యూ రోయ్ స్టేటస్ కోసం తాపత్రయపడినా ఎవరికి హాని కలిగించే గుణం ఉండదు. మరి ఇంత మంది హృదయాలను ఎలా గెలిచాడు? ఇలాంటి మోసపూరితమైన వ్యక్తిని స్త్రీలోలుడని తెలిసీ అతన్నెలా గౌరవిస్తారు. అతను విడాకులిచ్చిన భార్య తిరిగి ఎలా ప్రేమించగలిగింది ఇలాంటి మోసపూరిత వ్యక్తిని, ఇతను కావాలని విడాకులు ఇచ్చిన భార్యని మర్చిపోలేని అవస్థకు అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ.
తన తీయని గొంతు వెనక ఉన్న విషపు ఆలోచనలు ఎలా అమలు చేసి తన గమ్యాన్ని చేరాడు చేరితే తన చుట్టూ చేరిన సమాజం ఇతడిని నిలదీసిందా అలా నిలదీసినప్పుడు సమాధానం ఏమిటి? మోసపోయిన వారే క్షమించి ఎందుకు సహకరిస్తున్నారు. అసలీ పరిస్థితులు అంతటా అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు అనేది ఈ బెల్ అమీ ని చిత్రించే క్రమంలో రచయిత ప్రతి పేజీకి ఒక ట్విస్ట్ ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. చివరి అక్షరం వరకు మనల్ని పట్టి ఉంచే కథా గమనం.
దీనిని ‘మోపాసా’ (1850 – 1893)లో ఫ్రెంచ్లో రచించిన ప్రఖ్యాత నవల ‘ బెల్ అమీ’ ఒకటి. బీనా దేవి గారు తన కోవిడ్ కాలాన్ని ఇలా అనువాదానికి ఉపయోగించుకున్నారు. అందులో భాగమే ఈ బెల్ అమీ సాహితీ ప్రచురణల ద్వారా ఉదయిని వెలుగులోకి తీసుకొచ్చిన పుస్తకం మీకు నచ్చుతుంది తప్పకుండ చదవండి.