తరాల అంతరాల అంతరంగ ఆవిష్కరణలు కొన్ని సేద తీరుస్తాయి. మరికొన్ని ఉద్వేగాలని కలిగిస్తాయి.
ఇంకొన్ని ఎక్కడో దేహాలు చిద్రమై ప్రవహించే నెత్తుటి నదుల్ని పరిచయం చేస్తాయి.
ఇప్పుడు ఇక్కడ నేను చదువుతున్న ‘త్రికాల’ మాత్రం సమాజంలో ఇంకిపోయిన ఆచారాల మధ్య నలిగిపోయిన ఆది హిందువుల మనోవేదనని పరిచయం చేస్తుంది.
ఎక్కడా పేరైనా నమోదు చేసుకోలేని ఈ దేశంలోని సంఘజీవి కనీసం పుట్టిన ఊరు, ఏరు కూడా దాటనివ్వని మూఢనమ్మకాల్ని దాటుకు రావడం ఎలా!, అని చెప్పే ఓ బహిరంగ హింస! మనందరి వెనుక సుమారు 50 సంవత్సరాల క్రితం తరాలు అనుభవించిన శారీరక, మానసిక హింస, ఇప్పటివరకు ఎలా మన వెంట వస్తుందో చెప్పే కాలం కథ .
దేవదాసి వ్యవస్థ కూకటి వేళ్ళతో పెకిలించడానికి ప్రయత్నించిన కుర్వి రామకృష్ణ, భాగ్య వర్మ రెడ్డి లాంటి సంఘసంస్కర్తల ప్రయత్నాలు మనకి తారసపడతాయి.
ఇందులో హింసను అనుభవించింది వెలివాడలు అయితే ఆ హింసను ప్రేరేపించింది మాత్రం ఊరి మూఢనమ్మకాలు. జోగినీ వ్యవస్థను పెంచి పోషించిన కామాంధుల దహన కాండలు ఎన్ని అని ఉంటాయో ఎంత చెప్పుకున్నా తరగని కాలాన్ని చరిత్రలో ఓ పేజీగా నమోదు చేసింది ఈ ‘త్రికాల‘
ఈ కథను రాయడానికి సంధ్యా విప్లవ్ గారు ఓ వాస్తవిక కథ ఆధారంగా నవలను మలచడంలో తను పూర్తిగా సక్సెస్ అయ్యారు.
పితృస్వామ్యాన్ని ప్రశ్నించి, ఎదురు నిలిచిన ఎన్నో సందర్భాలు మనకి ఈ నవల లో పరిచయం చేశారు.
కథ మూలాల్లోకి వెళ్తే…
ఏరు దాటి, ఊరు దాటి, జనసంద్రంలో కలిసిపోవాలని ఆరాటపడ్డ నిజామాబాద్ జిల్లా, కమాన్ పల్లి గ్రామ నివాసి గౌరమ్మ కథ.
ఓ జోగినీవ్యవస్థ మూలాలు ఎంత పటిష్టంగా ఈ సమాజం నిర్మించుకుందో ఆ అనాది ఆచారాల మధ్య సాంఘిక సంస్కరణలు తెచ్చిన వెసులుబాట్లు ఎన్ని ఉన్నా చితికిపోయిన బతుకు చిత్రాలు ఇంకా మారుమూలల్లో కొన ఊపిరితో ఉంటూనే ఉన్నాయి,. అని చెప్పే ఉదాహరణలు ఎన్నో.
ఎక్కడో ఎందుకు మన హైదరాబాద్ బోనాల సమయంలో జోగిని వచ్చి మొదటి బోనం సమర్పించాల్సిందే అనే ఆచారాన్ని నేటికీ అమలు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం, మనమంతా.. అయినా అది ఆ ఇంటి ఆచారం అని మాట్లాడకుండా వెళ్ళిపోతూనే ఉన్నాం.
త్రికాల నేటి సమాజానికి మూడు తరాల మధ్య కాలాల్ని పరిచయం చేస్తుంది. మనకి విప్లవమో, స్త్రీ చైతన్యమో ఎక్కడ నుంచో ప్రత్యేకంగా రాలేదు వాళ్ళు ఎదుర్కొన్న హింస లో నుండి పడ్డ మానసిక ఘర్షణల్లో నుండి , ఎద్దేవ చేసిన లోకపు నిందల నుండి, వ్యక్తి మానసిక ధైర్యాన్ని కూడగట్టుకుని గొర్రెల మంద నుండి విడిపోయి, తన రెండో తరానికి వెలుగు పంచడానికి పడ్డ ఆరాటాన్ని చూడవచ్చు.
చదువే లక్ష్యంగా ఎంచుకున్న, కన్నయ్య చదువు కోసం, ఎన్నడూ! ఊరు దాటని ఓ తల్లి బడిని వెతుక్కుంటూ వెళ్లి వెలుగునిచ్చేది చదువొక్కటే,! అని నమ్మి, దుబ్బ రోడ్డు దాటిన అవిటి తల్లి గౌరమ్మ దేవుడి కథ.
అవిటితనం ఆడతనానికి ఎప్పుడూ అడ్డురాదు అనైతిక పురుషస్వామ్య ప్రపంచానికి.. పితృస్వామ్య వ్యవస్థలో వేళ్ళూనుకున్న సనాతన ధర్మాల్లో గడ్డకట్టుకుపోయిన దేహాల్ని అనుభవిస్తూ బతికే బతుకుల్ని చూపించిన నవల.
ఈ కథలో ఏ పాత్ర అనాలోచితంగా ప్రారంభం కాదు ముగింపు కాదు, ప్రతి పాత్ర నిజాయితీని అద్దం పడుతూ మానవ ధర్మాన్ని కాపాడుకునే సమయంలో పడే ఆవేదన కళ్ళకి కట్టి చూపిస్తుంది.
కుటుంబంలో వచ్చే కష్టనష్టాల్లో ఆపదల్లోనూ ఊరి అమ్మవారి పాత్రే ఎక్కువ అనుకునే పల్లె వాతావరణం లో అవిటి బిడ్డ పుట్టడం నేరమని ఆమె రూపురేఖలు అందంగా ఉన్నాయని గమనించిన పూజారి చెప్పిన మాటలు నమ్మి బిడ్డను గుడికి వదిలిన పేదరికం.
వెలివాడల మాదిగ బిడ్డ ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఆట బొమ్మగా ఏ విధంగా మలచబడిందో తెలిపే కథ. అటువంటి గౌరమ్మ కడుపున పుట్టిన వాడు విద్య నేర్చి ప్రొఫెసర్ స్థాయిలో నిలబడటానికి ఎన్ని
చెద పట్టిన మెదళ్ల ముళ్ళ పొదళ్లని దాటుకు వచ్చాడో చెప్పిన విజయ గాధ.
సనాతన ధర్మాలు రాజ్యం చేసే చోట, ఎంత హింస దాగి ఉంటుందో, ఎందరి స్త్రీల మానసిక హింసకు ప్రేరకమవుతుందో, చూపిస్తుంది, ఈ కథలోని ప్రతి మలుపులో ఎదురయ్యే దుర్ఘటనలలో నుండి సంఘసంస్కర్తలే కానక్కర లేని! మానవత్వం ఉన్న మనుషుల మంచితనం ప్రోత్సాహం కొందరి జీవితాల్ని ఎలా నిలబెడుతుందో చెప్తుంది ఈ త్రికాల
ఆరేళ్ల ప్రాయంలోనే జోగినిగా మార్చబోతున్న పసిబిడ్డను కాపాడి, కలెక్టర్ కు అప్పచెప్పిన గౌరమ్మ కొడుకు. ఆ బిడ్డ అడ్రస్ కనుక్కోలేకపోవడం, ఆ బిడ్డను వెతుకుతూ అతని ప్రయాణం ఏమలుపు తిరిగింది, కన్నయ్య కాపాడిన ప్రాణం ఆ పసిబిడ్డ జీవితం ఏ మలుపు తిరిగింది. అతను ఊహించినట్టుగా ఆ బిడ్డ జీవితం ఉందా! లేదా! అనే ఉత్కంఠతతో కథ ఆసాంతం నడుస్తుంది.
ఉట్నూరు మాష్టారు నారాయణ సహకారం, ఉస్మానియా క్యాంపస్ రాజకీయ వేడి వాతావరణం, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రాంతీయ భేదాల మధ్య బెంగాలీ తీపి ప్రేమలను పరిచయం చేస్తుంది.
నవల ప్రారంభంలో ఈ కథను మనకు పరిచయం చేసే అరుణ ఏ కారణంగా తను ఈ రీసెర్చ్ మొదలు పెట్టింది, అంతటి ఉద్వేగం ఆ గుండె కింద ఎందుకు ప్రవహించేను!? ఇలాంటి ప్రశ్నలు చదువుతున్నంత సేపు క్యూరియాసిటీని నింపుతాయి.
సంధ్య విప్లవ్ రాసిన ఈ ‘త్రికాల’ లో సనాతన ధర్మంలో పురుషస్వామ్యం పై తిరగబడ్డ వాక్యాల్ని బాగా సమర్థవంతంగా చిత్రించారు.అని చెప్పవచ్చు, ఈ కథలోని ప్రతి పాత్రకు నారేషన్ బాగుంటుంది, రీడబిలిటీ కూడా ఉంటుంది.. అయితే అక్కడక్కడ మాత్రం లాగ్ అవుతూ ఎంతకీ ఈ సస్పెన్స్ వీడదా! ఈ స్టోరీ ఇంకా ఎంతసేపటికి ముగింపు లోకి వస్తుంది అనుకుంటాం, అయితే కథ రెండో డైమెన్షన్స్ నుండి మూడుగా చీలి వైద్యము, హెల్త్, స్మగ్లింగ్ అంటూ కొత్త కథలోకి వెళ్ళిపోతున్నట్టు కథా ప్రవర్తన మారిపోతుంది ముగింపు సమయంలో. ఐతే ‘త్రికాల‘ జరిగిపోయిన కాలాల్లో మిగిలిపోయిన ఒక చరిత్ర పేజీ
ఉద్వేగాల్ని మనకి పంచి, ఆదర్శవంతమైన జీవితానికి వెలుగుల మూలాల్ని చూపిస్తుంది. మీకు అందరికీ కూడా నచ్చుతుంది, తప్పక చదువుతారని ఆశిస్తూ…. సంధ్య విప్లవ్ గారికి శుభాకాంక్షలతో
పుస్తకం మీద ఆసక్తిని పెంచి, చదవలనిపించేలా రాసిన పరిచయం…