This book given to me a new experience of reading
ప్రతి పుస్తకం ఓ కొత్త అనుభవాన్ని పంచుతుంది అనడానికి ఈ పుస్తకం ఓ ఉదాహరణ.
పుస్తకము లో లోపలకి ప్రయాణం కొంచెం కష్టమైనా ఓ కొత్త ప్రక్రియను పరిచయం చేసింది. కథలు చెప్పడంలోని ఓ విలక్షణతని చూపించింది.
అడల్ట్రీ ప్రధాన అంశంగా మొదలవుతుంది. ఈ పుస్తకంలోని మొదటి కథ. ఇందులో మొత్తం తొమ్మిది కథలు ఉంటాయి. A, సలుపు, చిదుగు, అనేన, తాలీ, కళత్ర కౌటిల్యం, సబల, ఎదుగు, బావరీ. కథ పేరుని చూసి కథను ఊహించడం మహా కష్టం ఇక్కడ కానీ కదంతా చదివాక ఈ పేరు తగినదే అనిపించక మానదు. ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా వేటికవి ప్రత్యేక శైలితో, కొత్త వస్తువుతో చదువుతున్నంతసేపు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒకటి, రెండు పేరాల్లో చెప్పాల్సిన విషయాన్ని, ఒక వాక్యంతో, రెండు పేజీల్లో చెప్పాల్సిన విషయాన్ని ఒక పేరాతో ముగించేస్తారు. చాలా సందర్భాల్లో…కవిత్వం మలిచినట్టు ఈ కథల్లో బ్రీవిటీని తీసుకొచ్చేస్తారు రామ ఉమామహేశ్వర శర్మ గారు.
ఈ పుస్తకంలో ముందుమాటలో తన కథల గురించి చెప్తూ “చక్కెరకేళి ఒలిచి చేతిలో పెట్టలేను కొంత శ్రమైక సాహచర్యం ఆశిస్తాను పాఠకుడి నుండి.” అని చెప్పడం బలే నచ్చింది.
నిజమే కదా అన్నిసార్లు తెరిచిన పుస్తకమై సమాధానమూ, ప్రశ్న రెండు ఒకే దగ్గర ఉంటే మనసుకి పని ఎక్కడ ఉంటుంది. అందుకే ఓ పజిల్ లాంటి పదవిన్యాసంలో, ఆలోచనను రేకెత్తించే విధంగా… ఒక విషయాన్ని చెప్పడంలో మన తెలుగు భాషకు ఉండే వెసులుబాటుని చక్కగా ఉపయోగించుకున్నారు అనే అనుకోవాలి.
నాకు పూర్వపు కవుల పధఘటనలు ఒక్కసారిగా నాకు సాక్షాత్కారమైనాయి. శర్మ గారి పద్య ప్రయోగాలు ఆశ్చర్యాన్ని కలిగించింది. మోడరన్ గా ఆలోచించే ఆలోచన అనిపించే కథలో… కథను చెప్తూ అందులోని పాత్రలు వ్యంగాన్ని ప్రదర్శించే అందుకు పద్య పాదాలతో చెప్పించడం. అటువంటి పద్య పాదాలను శ్రీనాధుని కాశీఖండము, నుండి, శంకర కవి హరిశ్చంద్రోపాఖ్యానము, శకుంతలా పరిణయము, మను చరిత్రల నుండి పద్యాలను తీసుకొని వచ్చి కథలో సంభాషణకు అనుగుణంగా ప్రయోగించడం మాత్రం తనలో ఉన్న చక్కని స్క్రీన్ ప్లే కి ఓ వొప్పుదలగా చూడవచ్చు.
A, సలుపు, చిదుగు, అనేనా కథలో స్త్రీపురుష సంబంధాలు వాటి మధ్య నలిగే మనుషుల త్రిశంకుస్వర్గనీతి మనకు తారసపడుతుంది.
అడల్ట్ రీ గురించి మాట్లాడుతూ.. వ్యక్తి స్వేచ్ఛ, స్త్రీ స్వేచ్ఛ ను, గురించి చెప్పేటప్పుడు ప్రతి పాత్రను స్వచ్ఛంగా పలికించారు. ఈ కథలో అరుంధతి బామ్మ ఉంటుంది. నేటి తరానికి ఈ బామ్మ ప్రతి ఇంట ఉండవలసిన బామ్మ, కథానాయకుడికి బామ్మ. ఈ పాత్ర ద్వారా చెప్పింది ప్రతి పదం అడల్ట్ రీ కి సంబంధించి నూటికి నూరు శాతం నిజం. మాటల మధ్యలో అరుంధతి బామ్మ “అడల్ట్రీ మీద ఎన్నేళ్లు రా ఎదురు చూపు,.. 150 ఏళ్లు పట్టిందిరా మనవాళ్ళకి, పునరాలోచించడానికి” అంటూ అనేక విషయాలు బోల్డు గా మనవడితో చర్చకి తెచ్చి., ఇద్దరి మధ్య బంధమో, మోహమో ఏర్పడితే దానిని మార్చ ఎవరి తరం కాదన్న వాస్తవాన్ని చురకల్లాంటి మాటలతో చెప్తారు.
ఇద్దరు వ్యక్తులని ఒకేసారి ప్రేమించడం అనేది అతి సహజ విషయమని చెప్పి ఒప్పించిన కథ ‘అనేన’ ఇందులోని కొన్ని వాక్యాలు మనల్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. తప్పు, ఒప్పు నిర్ణయం ఎవరికీ లేదని., నిష్పక్షపాతంగా కథ ముగింపుకొచ్చేసరికి ఒప్పుకు తీరతాడు పాఠకుడు.
స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి., మానసిక పరిపక్వత ఎంత అవసరమో..! తెలిపే కథ ‘సలుపు’. ఎవరూ మన జీవితంలోకి చెప్పి రారు చెప్పి వెళ్ళరు అంతా ఓ బ్రమణచక్రంలా ఉంటుంది అనడానికి ఓ ఉదాహరణ ఈ కథ.
మంచికి, చెడుకి, మానవత్వానికి మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. నొప్పిని భరించే వాడికే తెలుస్తుంది. ఆ బాధను అనుభవించిన వాడికి ఉండే స్పృహ వేరని
తెలియ చెప్పడానికి ప్రయత్నం చేసిన కథ శివ /కమల ఓ వ్యక్తి శివ నుండి కమలాగా మారిన మానసికవ్యధలో కోరుకున్నది పొందినప్పుడు కలిగిన ఆత్మ తృప్తి, ఇవన్నీ ఒకటైతే ఆ పాత్ర ద్వారా పలికించిన ప్రతి మాట కొట్టినట్లు ఉంటుంది మనిషన్న వాడికి.
ఈ కథకుడు చాలాసార్లు స్త్రీ పక్షాన నిలబడి మాట్లాడటం మనకి కనిపిస్తుంది. ఎంతో ఇష్టమైన పనిగా తెలుగు పద్య పాదాలు మనకు ఒక కథలో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన కథల్లో బ్రాహ్మణ( సంస్కృత) భాష మనకు ఎదురవుతుంది. వీరి కథల్లో పాత్రలు మనకు చెప్పకనే అనేక విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి.
వీటన్నింటినీ దాటుకొని ‘బావరీ’ కథలో అడుగుపెడితే ఒక్కసారిగా కపిలవస్తుకి చేరిపోతాం., బౌద్ధం వచ్చి చేరుతుంది. బుద్ధిని బోధనలు బౌద్ధం ప్రధమార్ధంలో బావరి యొక్క 16 మంది శిష్యులు బుద్ధుని దర్శనం కోరి ఆ వైపుగా నడిచే మార్గంలో ఎన్ని పద ఘటనలని వివరంగా స్థల కాలాలని వివరిస్తూ రాస్తారు ఉమామహేశ్వర శర్మగారు. బౌద్ధంతో తన పరిచయం, లోక విధితమైన కథకుడి అభిప్రాయాలు తెలుస్తాయి.
ఇలా ఈ పుస్తకం ప్రతి కథ ఓ పజిల్ విప్పినట్టుగా మనకు సాక్షాత్కరిస్తుంది. రీడింగ్ ఎంజాయ్ చేసే వాళ్లు హాయిగా చదవచ్చు.
A
శాంతా సహిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ. గారి పుస్తకాన్ని.
పుస్తకం దొరికే చోటు:
అజు పబ్లికేషన్స్, హైదరాబాద్
ఫోన్: 9912460268
– రూపరుక్మిణి. కె
































