కథ మనిషి జీవితం చుట్టూ అల్లుకున్న పొదరిల్లు వంటిది. ఈ సమాజంలో చూడదగ్గ విషయాలనే కాదు, మనిషినీ / మనసుని రెండూ పొందే అనుభవ సారాన్ని అందుకోగల రచన ఏదైనా ఉంది అంటే అది కథ. విజ్ఞానాన్ని, లోపాయికారి వ్యవహారాన్ని, సత్యాన్వేషణని, సద్గుణాన్ని.., మంచి చెడు బేధా- అభేదాలని చిన్నతనం నుండే మన సంస్కృతిలో అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర నుండి వింటూనే పెరుగుతాం. కథ మన నాడిని, నానుడిని తెలియజేస్తుంది. ప్రపంచం ముందు నువ్వు ఎలా వున్నావో, వుండాలో, వుండకూడదో నిర్ణయించుకోమంటుంది.
అటువంటి కథలు ఆణిముత్యాల వంటి కథలు ఇతర భాషల్లోకి అనువదింప చేయాలన్న సత్ సంకల్పంతో ఈ కాలపు తెలుగు కథ పుస్తకానికి ఒక రూపం ఇచ్చారు. “కుమార్ కూనపరాజుగారు.” తెలుగు కథకు తగినంత ప్రాచుర్యం కల్పించాలన్న దృక్పథంతో ఈ కాలపు కథలుగా గత దశాబ్ద కాలం నుండి రాస్తున్న రచయితల నుండి సేకరించిన కథలే ఇవి. కథాలోకానికి కొత్త రంగులు అద్దుకోవడానికి సిద్ధమైందని చెప్పొచ్చు ఈ పుస్తకం చదివాక.
తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ కాలం నుండి నేటి కాలం వరకు అంటే నూరు సంవత్సరాల పై కథా చరిత్ర మనది. అందులో ఈ దశాబ్దపు కవయిత్రులని ఎంచుకున్నారు కుమార్ గారు. ఆనాటి కాలంలోని సామాజిక పరిస్థితుల్లోని పరిధుల్లో కథలకి, నేటి కాలపు సామాజిక కట్టుబాట్లలోని ఆత్మ విమ్మర్షని, ఆదర్షాలని, ఆధునిక ఆలోచనల దొంతరని స్పష్టం చేసి చూపారుఅనవచ్చు.
ఓ కొత్త దారి ఇందులో ఉందా కథల్లో ప్రత్యేకత ఏమిటి అనేది ఈ పుస్తకం యొక్క మూలాంశంగా తీసుకుంటే ఈ పుస్తకంలో 30 మంది రచయితలు తమ 30 కథలను కాలానుగుణంగా రాసి ఇచ్చారు. అందులో స్త్రీ రచయితలు 11 మంది ఉన్నారు.
ఈ పుస్తకంలోని అన్ని కథలు ఒక్కసారిగా చర్చించలేక రెండు లేదా మూడు భాగాలుగా విభజించాలనుకున్న అందులో మొదటి భాగంగా స్త్రీ కథా రచయిత్రులు అందించిన కథలను చూద్దాం.
…
ఎక్కడైనా స్త్రీ ఆలోచనలు సమాజమూలాల నుండి నిర్మించబడతాయి అని నమ్ముతాను. ఒక స్త్రీగా పునరుత్పత్తి శక్తి కలిగిన ఆమె ఈ సమాజపు నడకను ప్రతిబింబించేలాగా జీవితాన్ని చిత్రించగలిగిన ఈ ఆధునిక రచయిత్రులు విజయం సాధించారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన.., అయినా వారి కథల్లో స్త్రీత్వం తొణికిసలాడుతుంది. మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ఇక్కడ రచయిత్రులు ఏది చెప్పినా ఈ సమాజంలో రావలసిన మార్పుని ఆలోచనల్లో తెచ్చుకోవలసిన పరిణతిని గురించి అవగాహన పెంచేలా ఈ కథలు నిర్మించబడ్డాయి అనిపించింది. ప్రతి వ్యక్తికి ఓ దృష్టి కోణం ఉంటుంది అని నమ్మి అటువైపుగా ఈ రచయితలు అడుగు వేశారా అనిపించక మానదు.
“సముద్రపు పిల్లాడు” ఈ కథ లో పిల్లాడు సముద్రంతో కబుర్లు చెప్తాడు. సముద్రం తన తండ్రిని ఎత్తుకెళ్లిపోయిందని కథలుగా విని ఉండడం వల్ల చిరిగిన పుస్తకాల సంచిని సముద్రంలోకి విసిరేసి ‘నువ్వు ఏది ఉంచుకోవు కదా!’ మా నాన్నని మాత్రం అలా ఎలా నీలోనే దాచేసుకున్నావని?! సముద్రాన్ని అడిగే అమాయకపు పసి హృదయం మనకు తారసపడుతుంది. అదే సముద్రం పై వేటకు వెళ్లి మేనమామతో కలిసి వేటాడిన తన చిట్టి చేతుల గాలానికి సముద్రం ఇచ్చిన సంపదకి ఆ పిల్లాడి సంతోషాన్ని మనము పంచుకుంటాము. రచయిత్రి ‘డాక్టర్ ఎం ఎస్ కె కృష్ణజ్యోతి’ కథని నడిపిన తీరు అబ్బురంగా అనిపిస్తుంది.. ఆ చిన్నారి పాల బుగ్గలపై చేరిన సముద్రపు కంటి తడిని మనము స్పర్శిస్తాము.
“నీరుగట్టోడు” ‘ఝాన్సీ పాపుదేశి’ పల్లెలో నీటిని అంచనా వేసి పంటలకు నీరు అందించే దాన్ని లెక్కించే నీరు గట్టోడి కథ. పట్టణం లో ఊపిరాడలేని అనుబంధాలకి పల్లె గాలిలో పలుకులు ఎంత మధురంగా ఉంటాయో…, ఈ సిటీ లైఫ్ ఇనప కంచెల్ని తనదైన పద్ధతిలో బాగా చెప్పారు. కడజాతి వారి ఇంటి కోడలు ఉన్నత వర్గం నుండి వస్తే ఎలా ఉంటున్నారో.., ఆధునిక పోకడలతో ఆత్మ విమర్శ చేసుకోలేనితనాన్ని స్పష్టంగా చెప్పారు.
“నల్ల పెట్ట” ఇందులో మనుషుల జీవితంలో మూగజీవాలు ఎలా భాగం అవుతాయో…, డొమెస్టిక్ యానిమల్స్ మనిషి జీవితంలో ఎలా అంతర్భాగంగా మారిపోయాయో, ఎలా మాట్లాడుతాయో., ఆ మూగజీవాలకు కూడా ఓ క్రమం తప్పని దినచర్యలు పుట్టుక,చావు వంటి వి మనిషిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో, కళ్ళకి చిత్రం గీసి చూపారు ‘ఎడపల్లి భారతి’ గారు తన రచనలోని స్పెషాలిటీ, ఫ్లేవర్ ఆఫ్ ఎసెన్స్, ఏ మాత్రం తగ్గకుండా చెప్పడం తన ప్రత్యేకతగా ఈ కథ ని నడిపారు.
‘గోగు శ్యామల’ గారి “మబ్బుతేరిడిన పువ్వెండ”,, ‘వినోదిని’ గారి “అత్త అంబేద్కర్ లా ఉంది” కథా, ‘రుబీనా పర్వీన్’ “బుర్ఖా”, ‘జూపాక సుభద్ర’ గారి ‘అంటూ – ముట్టు’ కథలు వేటికవి ప్రత్యేకమైన భాషలో కళాత్మకంగా చెప్పిన సామాజిక అంశాలు. ఎన్ని వేల చరిత్ర గాథలు చెప్పినా మాసిపోని మరకలు అంటిన స్త్రీ గాధలు, అస్తిత్వ ప్రతిరూపాలని ప్రతిబింబించేలా రాశారు.
కులం వద్దన్నా మన వెంట ఎలా ప్రయాణిస్తుందో.., ఆ కులాన్ని దాచి మన అస్తిత్వాన్ని నిలుపుకోలేము., మనం ఏ పక్క నిలబడుతున్నామో స్పష్టంగా ముందు మనకి మనం సమాధానం చెప్పుకోవాలని., ఆపైన సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించగలుగుతామన్న నిజాన్ని స్పష్టంగా చెప్పారు తన కథలో శ్యామల గారు.
వినోదిని గారు అంబేద్కర్ ని ఎలా అర్థం చేసుకోవాలో మన జీవితాలపై చుట్టూ ఉన్న సామాజిక కట్టుబాట్లు ఎలా ప్రభావం చూపిస్తాయో రూతు, రేచల్, రెబ్బీ మాటల్లోనే వినాలి. అంబేద్కరిస్టుగా తన కథని సామాజికం చేశారు ఫెమినిజం పోకడలని నిర్దేశించే తత్వాన్ని వొ ప్రొఫెసర్ గా విశ్లేశించి చెప్పారు.
‘రుబీనా పర్వీన్’ “బుర్ఖా” ఈ బుర్ఖా మన మూలాల్లోకి ఎలా చొచ్చుకొని వచ్చిందో ఏ సామాజిక వర్గంగా నిలబడినా వృత్తి ధర్మంలో సాంప్రదాయాల పాత్ర ఎలా ఉపయోగంలో ఉందొ, ఎంతవరకు సామాన్య జీవనానికి అవి అడ్డుకట్ట వేస్తున్నాయో.., ఈ సాంప్రదాయ ఘోషాను వదలకపోతే తన కోసం కూడా తన బ్రతకలేని స్త్రీ సాధికారతను ఎలా నిర్మించుకుందో చూపిస్తారు.
“ అంటు-ముట్టు” కథలో చదువులు సాంప్రదాయాలు ఎంత ఆధునికతను చేర్చినా ఈ కాలంలో కూడా అగ్రకులాల్లో ఇంకా స్త్రీలపై జరుగుతున్న అంటు – ముట్టు లోపలి మానసిక హింసను చూపిస్తూ, అగ్రవర్ణ కుటుంబ స్త్రీల కంటే కూడా శ్రామిక స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ అని మరి ఈ కట్టుబాట్లు శ్రామిక స్త్రీలకి ఏనాడు లేవని స్పష్టం చేసి చెప్పారు.
నేటి ఆధునిక సాఫ్ట్వేర్ జీవితాల్లో మనుషుల మానసిక చపలత్వాన్ని, మనీ, కెరియర్, మైండ్ గేమ్ లో మనుషుల విచలిత మెకానిక్ లైఫ్ డీల్ చేస్తున్న విధానాన్ని, కథలోని ప్రతి పాత్రకి సమానమైన ప్రాధాన్యతని., ఆలోచనల ప్రభావాన్ని, స్త్రీ పురుషుడికి సమానంగా వర్తిస్తున్న నేటి ఆధునిక సంక్లిష్ట ప్రేమ చంచలత్వాన్ని స్పష్టం చేశారు. ‘కుప్పిలి పద్మ’ గారు “ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్” అంటూ
“ఇసుక అద్దం” ఒక సామాన్య కుటుంబంలో ఎన్నో అవమానాలకు కారణం కేవలం డబ్బు లేకపోవడం, చదువు లేకపోవడం, ఈ అవమానాలు అన్నింటిని ఆత్మగౌరవంగా నిలబెట్టుకునే నిర్మాణం వైపు అడుగులు వేసే కౌముది, శివల జీవన పరిమళాన్ని ‘శ్రీ ఊహ’ తన మ్యాజికల్ మ్యూజింగ్స్ లో చక్కగా వివరిస్తారు.
“రూబా” లో ‘ఎన్ మల్లీశ్వరి’ గారు ఆధునిక ఆలోచనలో మనుషుల మానసిక ఒత్తిడిల మధ్య నలిగే జీవితాన్ని స్పష్టం చేస్తారు. నేటి కాలంలో ప్రవహించే ప్రేమ అనండి లేక ఇద్దరు మనుషుల మధ్య లేక దంపతుల మధ్యలో కానివ్వండి కొద్దికాలం కలిసి జీవించిన తరువాత ఈ మోడరేట్ జీవన విధానంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడుతున్న ఖాళీని అనుబంధాల మధ్య ఉన్న స్పేస్ ని ఎలా భర్తీ చేసుకోవాలో స్పష్టం చేస్తూ ఓ ఇద్దరి మధ్య ఓ మూగ జీవికి స్థానం కల్పిస్తే అయినా వారి మధ్య ఖాళీ భర్తీ అవుతుందేమో అన్న అస్పష్ట ఆలోచనను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం బాగుంటుంది.
“ జైల్లో జాబిలమ్మ” ‘కత్తి పద్మ’ గారు కన్నీళ్లు పెట్టిస్తారు. పోలీసు బూటు కాళ్ల దౌర్జన్యాన్ని చవిచూసిన రాంబాయికి అటువంటి పరిస్థితుల్లోకి ఎలా ఈ సమాజంలో నెట్టివేయ బడిందో, పురుషస్వామ్యం ఎంత బలమైన ముద్రలు వేసుకుందో వివరిస్తూనే.., కష్టకాలంలో ఆలంబనగా ఆమెకు దక్కిన ఒక్క పురుషుని మాట మనసుని ఎంత తేలిక చేస్తుందో చెప్పడం ఈ కథలోని ప్రత్యేకత. రాంబాయి కథని సామాజికం చేయడంలో మీ కలం చేయి తిరిగింది పద్మాగారు.
…
వచ్చేవారం మరికొన్ని కథలతో కలుద్దాం…
































