తెలుగులో విరిసిన కథలు

Spread the love

     కథా సాహిత్యం

            – ఇదో రంగురంగుల పూలవనం.

          కథలు ఎప్పుడు మనిషిని వెన్నంటి వస్తూనే ఉంటాయి. మనతో ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అలాంటి కథా వాతావరణంలో ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన  లాంటి బీభత్సమైన కాలం తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం  ప్రశాంతతని ఇస్తుందా?!    నిర్లిప్తతను ఇస్తుందా,?! 

 లేక నిన్నటి తుఫానులో కొట్టుకుపోయిన జీవితానికి ముగింపు పలికి,  కొత్త సూర్యోదయంలో వెలుగుని పంచుతాయా   ఈ కథలు.    ప్రతీ కథ ఓ మనసు పైనో, మనిషి పైనో చేసే యుద్ధంలాంటిదే అనాలి.

            కథకుడు – పాఠకుడు అంతరంగం మేథోమథనాలు ఒక్కటైన ప్రవాహమేదో ఈ కథల్ని నడిపే కథకుడితో చదివే పాఠకుడు అనుభవించాలి అప్పుడే కథలకు ఓ సార్ధకథ.

      ఇలా కథలు మనసు ప్రవాహంలో కలిసి మనిషిని హత్తుకునేవి చాలానే చదివి ఉంటాం. కథకి ఎప్పుడు మరణం ఉండదని నమ్ముతాను నేను. కాల ప్రవాహంలో కనుమరుగవుతాయేమో కానీ గమనాల్ని మాత్రం వదులుకోదు కథ.

        అటువంటి కథలని ప్రేమించి ఆరాధించే సాహిత్యకారులు  నిర్వహించిన ఉగాది కథల పోటీ 2025లో గెలుపొందిన

#తెలుగు_కథా_పూతోట పుస్తకంలోని కథల గురించి మాట్లాడుకుంటున్నాం.

 ఇందులో 12 మంది కథకులు 12 రకాల భావోద్వేగాలు మనకు కనిపిస్తాయి.

 మొదటి కథ నుండి ఆఖరి కథ వరకు అనేక జీవన సంఘర్షణలోని మార్గమైన సంక్లిష్ట సందర్భాల నుండి చెప్పబడ్డాయి ఈ కథలు.

     ఈ కథల్లో సామాజిక కోణం ఒక్కటే కాదు మనిషిగా ఉండవలసిన అవసరాన్ని, మానవత్వానికి చేదోడు వాదోడుగా ఉండలేనితనాన్ని, బంధాల మధ్య బరువులే కాదు అరమరికలు లేని అన్యాయాలు, బతుకుల్లోని డొల్లతనాల్ని మనసు చేసే అలజడిలో మృత్యువు కూడా విభేదించే విభేదాలను పసి హృదయాల పైన పడిన చేదు, తీపి గాయాల పరంపరలు అన్నీ మనకు తారసపడతాయి. వీటితోపాటు పితృస్వామ్యం పైన యుద్ధభేరీలు, స్త్రీ సౌకుమారత్వాన్ని చెప్తూనే ఆధునిక ఆలోచనల్లోని సంకుచితత్వాన్ని వివరించే ప్రయత్నం చేశారిక్కడ ఉన్న కథకులు.

 ముందుగా కథకులందరికీ అభినందనలు కథల్లోకి వెళితే..

  పేచీ కోరుగా పేరు తెచ్చుకున్న కొట్టాం పిన్నమ్మ తెచ్చి పెట్టే తగవు పంచాయితీతో ఆత్మీయుల అనుబంధాలు  మనుషుల మధ్య ఎంత అవసరమో చెప్తుంది. ఎవరి మీద అయితే ఆమె పేచీ పడుతుందో ఆ పిన్నమ్మే వాడి కడుపు ఆకలి కూడా తీర్చేదాకా కునుకు తీయదు. ఆత్మీయ కలతల్లోని అనురాగాలు మంచివే అంటూ చైతన్య పిన్నమ్మ రాజు చెప్పిన కథ కాస్త పాత అనుబంధాల్ని తలచి చూసుకున్నట్టుగా ఉంటుంది.

       మన్ను బోసే కాలం   నేటి జీవన విధానంలో వ్యవసాయం చేసే రైతు దుక్కి దున్ని,  సేద్యం చేయాలనుకునే వాడికి ఈ సమాజం ఇస్తున్న గౌరవాన్ని,  కోల్పోతున్న సహజత్వాన్ని, అంతర్థానమైపోతున్న రైతుని గురించి ఝాన్సీ పాపుదేశి తన మార్కు ప్రాంతీయ భాషలో బాగా చెప్పారు.

    రెండు మనసులు ఎక్కడ ఎలా ముడి పడతాయో ఎవరు చెప్పలేరు.  అలాగే ఒకరి ప్రేమ మరొకరికి అర్థం అయినా బ్రతికినంత కాలం ఆ ప్రేమను  ఆరాధిస్తూ మనసుకు గోడలు కట్టుకునే అనేకమందిని ఈ కథలో ఆవిష్కరించారు రెండు స్వప్నాల నడుమ కథకుడు డాక్టర్ ఎం.అయోధ్యారెడ్డి.

 ఈ పుస్తకం మొత్తంలో నన్ను బాగా వెంటాడిన కథల్లో ఒకటి ప్రియమైన‘ఆవార్ గీ’

 స్త్రీ ఒంటరి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన కథ తనలో ప్రేమను అందుకోవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు చెప్తూనే స్థిరంగా నిలబడాలంటే బంధాలకు అవతలి వైపు ఉండక్కరలేదు అలాగే గౌరవం లేని చోట నిలబడకూడదు అన్న మనోవికాసాన్ని చెప్పిన కథ. రెండేషన్ చాలా బావుంది. కథ చెప్పిన విధానం సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంది. సౌమ్య నిట్టల బాగా రాశారు.

 ఇలా కాస్త కొత్త నెరేషన్తో ఈ పుస్తకంలో నాలుగైదు కథలు రొటీన్ కి భిన్నంగా కొత్త అభివ్యక్తితో ఉన్నాయి. రమేష్ శ్యామల -వెన్నెల తాగిన ప్రేమ, శ్రీనివాసరావు -ఆత్మ దర్శనం, క్రాంతి శివరాత్రి -అబ్సర్డ్ ఇవన్నీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేసిన కథలు.

    మన్ ప్రీతం  నేటి సామాజిక పరిస్థితులకి అద్ధం పట్టేలా తన రచనలు తీసుకోవచ్చాడు. ఎంచుకున్న అంశం చిన్నదే అయినా చెప్పే విధానంలో కథని నడిపిన తీరు బావుంది. మానవత్వం లేని మనుషుల కంటే మూగజీవులే జీవన చక్రాన్ని బాగా పాలిస్తున్నాయి అనడానికి ఉదాహరణ ఈ కథ.

 పుంసవనం పాత కథే. కొత్త మూసలో చెప్పారు పితృస్వామ్య భావజాలంలో ఇమిడి ఉన్న లోపాలు ఎంత సహజంగా మన యాంత్రిక జీవితాల్లో కలిసిపోయాయో గుర్తుచేసే కథ.

  ఇక్కడ కథల్లో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. పితృస్వామ్య భావజాలానికి గురైన స్త్రీ జీవితాన్ని ఆవిష్కరించే కథలు – పుంసవనం, -యే ఆగ్ కబ్ బుజేగీ, ఇంకో కథ -దీపదారి  స్త్రీ భార్యగా అయిన ప్రేమికురాలిగా అయినా పురుషుడి అవసరాల్లో మాత్రమే వినియోగించబడే వస్తువు అని గుర్తు చేసే కథ ఇది. ఈ కథ ముగింపు నాకు బాగా నచ్చిన తీరుగానే ఉంది. అయినా ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. అంతటి చైతన్యం వుందా మన సమాజంలో? ఎప్పటికైనా పూర్తిస్థాయిలో రావాలని కోరుకుందాం స్వర్ణ.

   -అంతేవాసి వేణు బజ్జురి చెప్పిన కథ. ఇందులో చూడవలసిన అంశాలు రెండు స్త్రీ – పురుషులు ఎంత సమానం అన్న చిన్ననాటి ముద్రలు ఆడపిల్లలు జీవితం పై వేసే ముద్రలు ఈ సమాజం ఎలా వెంటాడి వేధిస్తుందనడానికి ఉదాహరణగా ఇలా ఎందరో ఆడపిల్లలు వారి జీవితాలు మిత్ లాంటి పరువులో కొట్టుకుపోతున్నాయో తెలిపే కథ. చాలా సహజమైన విషయం అని చెప్పుకునే చిన్న సందర్భాన్ని ఎంత గాలి దుమారం రేపుతుందో  కథ చేయడం బాగుంది.

 చీకటి తలుపులు మనసుకు వేసుకున్న స్త్రీలు ఎందరో.. చీకటి వాకిట్లో నిలబడిన నాన్నల జీవితాల్ని తెరిచి చూపించే ప్రయత్నం శ్రీనివాస్ తెప్పల బాగా చేశారు.

 ఎడపల్లి భారతి ఎంచుకున్న అంశం ఏదైనా లోతుల్లోకి వెళ్లి కూలంకశంగా రాయడం తన కలం ప్రత్యేకత. ఈ కథలో కూడా -కదిరి మామ కష్టాన్ని బాగా చెప్పారు.

 ఇంకా ఈ పుస్తకంలో చివరి కథ – యే ఆగ్ కబ్ బుజేగీ .  ఈ జ్వాల ఎప్పటికీ ముగిసేది కాదు లక్ష్మీ గాయత్రి గారు. ఈ కథ పదేళ్ల బాలికతో మొదలై 60 ఏళ్ల ముదిమతో ముగుస్తుంది. చెప్పాలనుకున్న విషయంలో స్పష్టత చర్చించిన తీరు బాగుంది. ఇటువంటి కథలు నిన్న, నేడు,రేపు తేడా లేకుండా చెప్తూనే ఉండాలి. ఈ జ్వాల ముగిసేది కాదు. ఈ జ్వాల ముగిసిందా మనిషి మనుగడే ముగిసిపోతుంది మరి.

 ఇలా ఈ కథ పూ తోటలోని కథలు అన్నీ దేనికవి ప్రత్యేకతను సంతరించుకుని ఉన్నాయి.

 ఈ కథలు అన్నీ ఆలోచనలు అందించే దిశగానే నడిచాయి. సామాజిక చైతన్యం అనను గాని నేటి రోజులకి దగ్గరగా సామాన్య జీవన చక్రాన్ని దాటి పోకుండా,  ఘర్షణలను ఏవైనా అంతరంగంలో నుండి ఉండే సామాన్య సౌమ్య రూపాల్ని పరిచయం చేస్తాయి.

 మొదట్లో చెప్పుకున్నట్లు మనసు తుఫాను తర్వాత వచ్చే ప్రశాంతత ఈ కథల్లో ఉంటుంది.

 కథకుడు -పాఠకుడు కలిసి సమాంతరంగా ఆలోచనలు కదిలించే కథలు ఇవి.

 206 కథలు ఈ ఉగాది పోటీకి వస్తే 12 కథలని  ముద్రణలోకి తెచ్చారు. 

కథలు రాయాల్సిన అవసరం ఎంత ఉందో మనమందరం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది.

 ఎన్నెల పిట్ట ప్రచురణలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.

~

     రూప రుక్మిణి. కె

     31oct 2025

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *