చిన్నప్పటినుంచి పొలిమేరలో అమ్మవార్లని చూస్తూ ఉన్నప్పుడు ఈ విగ్రహాలు ఎందుకు ఇలా ఏ ఆచ్ఛాదనా లేకుండా ఉంటాయి. వీటికి మూలాలు ఏముంటాయి అన్న ఆలోచన ఎప్పుడూ పట్టివేదించేది. గ్రామదేవతలందరూ నిమ్న జాతుల ఆరాధకులే, ప్రాణ త్యాగాలకు ప్రతిరూపాలే, స్త్రీ సమానత్వంలో ఆత్మ త్యాగాల బలిదానాలే అనే నమ్మకం కూడా నాలో ఉండేది. ఆ నమ్మకానికి ఆధారాలుగా ఇన్నాళ్ళకి ఓ పుస్తకం చదివాను.
20వ శతాబ్దపు చివరి భాగము నుండి 21వ శతాబ్దం వరకు మన మధ్య ఉన్న అనేక గ్రామాలలోని దేవతలను వారి చుట్టూ జరిగే జాతరను వివరించడం, కొన్ని గ్రామాలలో ఉన్న కులాల వారి పద్ధతులను నిమ్న జాతుల, బ్రాహ్మణ ఆచారాలను బేరీజువేస్తూ గ్రామ దేవతలను గురించి…, జానపద ఆచార వ్యవహారాలు తెలియజేస్తుంది. ఈ గ్రామ దేవత పుస్తకం ఓ పరిశోధనాత్మక గ్రంథంలా మనకు తెలియని ఎన్నో విషయాలను ఆవిష్కృతం చేస్తుంది.
స్త్రీని స్వయం శక్తి అంటాం. భారతదేశంలో స్త్రీ పూజింపబడుతుంది. ఆ పూజింపబడడానికి కారణాలని వెతుకుతూ గ్రామ దేవతల యొక్క ప్రాముఖ్యతను వారికి ఉన్న ప్రాచుర్యాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణమే ఈ గ్రామదేవత పుస్తకం.
ఒక స్త్రీ ని ఎందుకు దేవతగా కొలుస్తున్నాము?!
ఆ దేవతగా కొలిచే ప్రతి గ్రామానికి ఒక కథ ఉంటుంది., ఆ కథలో ఆ స్త్రీ మరణిస్తుంది. మరణించిన తరువాత దేవతగా.., ఆమె త్యాగానికి గుర్తుగా.., ఆమెకు నైవేద్యాలు సమర్పిస్తూ…, బలులు ఇస్తూ ఒక కులానికి ప్రతీకగాను, ఒక గ్రామానికి ప్రతీకగా కథలు కథలుగా అనేక రకాల చరిత్రలు అనేక ప్రాంతాలలోని మార్మిక వ్యవస్థలో మార్పులని చారిత్రక అంశాలతో కలిపి ఇక్కడ మనం చూడవచ్చు.
చెడుపై జరిగే యుద్ధంలో మరణించి గెలిచిన దేవతామూర్తులు వీరంతా.
ఒక స్త్రీ మూర్తి తనకు జరిగిన అన్యాయాలను తన చుట్టూ జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించినప్పుడు ఆ సమాజం చేతిలోనే చంపివేయబడ్డ సమయంలోనో, లేదా బలి కావాల్సి వచ్చిన సందర్భంలోనూ, తనకు తానే త్యాగం చేసుకున్న ప్రాణాలను కథలుగా మనము ఈ గ్రామదేవతల దగ్గర వింటాము.
రచయిత పరిశోధనలు, అధ్యయనాల ద్వారా దేవతను ఆరాధించే ఆచార సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని, బౌద్ధుల కాలానికి బ్రాహ్మణుల కాలానికి ముందు నుంచే ఈ ఆచారం ఉందని నిర్ధారించడానికి ప్రయత్నించారు.
ఈ గ్రామ దేవతలు అందరూ హిందూమతం ఆరాధ్యకులుగా ఉంటారు. సింధూ నాగరికత నుండి మొదలై చోళ, పల్లవుల కాలంలో దక్షిణ భారతదేశంలో హిందూమతం పుట్టి పెరిగినతీరునుండి మెల్లగా బ్రాహ్మణుల భాగస్వామ్యంతో అనేక వైవిధ్య ఫలితమైన అంశాలతో వేదాలుగా జానపద అంశాలుగా విస్తరించింది ఈ చరిత్ర.
దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి చాలా ప్రాచీనమైనది. ఈ సంస్కృతి గురించి స్టీమ్ రా అనే రచయిత వ్యక్తీకరించిన అభిప్రాయాలకు బాసటగా తీసుకొని భారతదేశపు మొట్టమొదటి నాగరికతగా అభివృద్ధి చెందిన అనుసరించిన ఆచారాలను విశ్లేషణలను తెలియచేస్తారు.
అలాగే బౌద్ధులు, జైనులు, శైవులు, వైష్ణవులు తమ దేవతగా చూపించడానికి గ్రామ దేవతలని ఎలా ప్రాభవంలోనికి తీసుకొచ్చారు, ఎటువంటి సామాజిక చైతన్యం వారి మధ్య ఉండేది!? ఎటువంటి భక్తి మార్గాన్ని ఉపయోగించారు!.., విశ్లేషణ చేస్తూ వివరంగా సంక్షిప్త ఆధారాలతో ఈ పుస్తకం చెప్పబడింది.
అంతేకాక గ్రామాలలోని దేవతల చుట్టూ ఉన్న చిహ్నాలని, ప్రేమ దేవత మూలాలను బ్రాహ్మణత్వంలోకి ఎలా మార్చుకున్నారు. కుల వర్గీకరణ గ్రామదేవతలకి ఉండి ఉంటే చారిత్రక రూపాల్లో ఉన్నవా? లింగ బేధ రూపాలు ఈ దేవతలకి ఉన్నాయా ఉంటే ఆ పోలికలు ఎలాంటివి.
ప్రకృతి ఆరాధన నుండి విగ్రహారాధనకు చేరిన పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఒక్కో గ్రామ దేవత స్వరూప స్వభావాలను లక్షణాలతో కూడిన ఆచార వ్యవహారాలను గురించి ఇక్కడ చర్చకు తీసుకొని వస్తారు.
ఆధునిక కాలంలో నేటికీ గ్రామదేవతల పారంపర్యాన్ని పరిస్థితులకు అనుగుణంగా పునఃసృష్టి చేయబడిన దేవతల లక్షణాలను ఎన్నో మత భావాలను సంస్కృతి తనలో నింపుకున్న దేవతల రూపాలను విశ్లేషణ చేస్తూ వీరి ఇతివృత్తాలలో దాగి ఉన్న శక్తిని గురించి తెలియజేస్తూ ఈ గ్రామ దేవతలు వృద్ధులు అవ్వకుండానే చనిపోవడంలోని మర్మాన్ని, చిన్నపిల్లలుగాను, కన్నెపిల్లలు గాను లేక సాంప్రదాయ విలువల్లో స్త్రీ స్థానాన్ని ప్రభావితం చేస్తూ బలిదానాలు గానో, ఆత్మహత్యల గానో… సాంప్రదాయ రీతుల్లో కూతుళ్లుగానో, భార్యలుగాను చరిత్రను తలపించే గాయాలుగా గ్రామ దేవతలుగా మారిన విధానాన్ని బ్రాహ్మణ దేవతలకు గ్రామ దేవతలకు ఉన్న పోలికలను తెలియజేస్తూంది ఈ పుస్తకం.
సతీసహగమన కాలం నుండి బలి, జంతు బలి, మానవ బలులు, ఆత్మహత్యలు మత విశ్వాసాలని ఏ రకంగా స్త్రీని దేవతగా మార్చాయో సమాజం ముందు స్త్రీల శక్తి మీద, నీతి పేరు మీద పెట్టే ఆంక్షలు ఏమిటో…చర్చిస్తూ ఆ ఆంక్షల మధ్య గ్రామ దేవతలకు ఉండే లక్షణాలు, ప్రాచీన కాలం నుండి స్వతంత్రాన్ని ప్రకటించుకున్న గ్రామదేవతలుగా నిలబడిన వీరి చరిత్ర తెలుసుకోవాల్సిందే.
ఈ గ్రామ దేవత విగ్రహాలన్నీ సృష్టి రహస్యాన్ని విప్పి చూపిస్తున్నట్టు, స్త్రీ శక్తి రూపాన్ని అంగంగా ప్రదర్శన చేస్తున్న సృష్టి రహస్యమే అని ప్రజలకి గొంతేత్తి చెబుతున్న సందర్భాలని గ్రామ దేవతల కథల్లో మనం చూడొచ్చు
ఈ పుస్తకం ఆరు అధ్యాయాలుగా ఉంటుంది ‘గ్రామదేవత’ ఫలప్రదాయిని కథా కమామిషు
దేవతల చిత్రాలు ప్రాచీన కాలంలో ఉన్న చిత్రాలకి ఇప్పుడు ఆ గ్రామదేవతల చుట్టూ ఉన్న ఆనవాళ్లు గా మిగిలిన చిహ్నాలని బేరీజు వేస్తూ చారిత్రక ఆధారాలలో దొరికిన దేవతల తొలిరూపాలను, బౌద్ధ కళారీతులలో ఆవిష్కృతమైన పద్మాన్ని ప్రత్యుత్పత్తి శక్తికి చిహ్నంగా ఉపయోగించడం అది వైష్ణవ కళారీతులలో ప్రసిద్ధిగా మారడం నుండి మొదలవుతుంది చరిత్ర.
200ల ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్లమ్మ కథ ఈ ఎల్లమ్మను ఋగ్వేద కాలం నుండి అంటే క్రీస్తు శకం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు కాకతీయుల కాలంలో కూడా రేణుక ఎల్లమ్మగా… నగ్న రూపంలోనే కొలిచిన విషయాన్ని, శాసనాల రూపంలో బయట పడ్డ చరిత్రను తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవతగా ఉన్న ఈ ఎల్లమ్మ తొమ్మిదవ శతాబ్దానికి చెందిన చోళుల శాసనంలో గ్రామ దేవత అమ్మగా పిలవడం చూస్తాం.
ఈ ఎల్లమ్మను ఫలప్రదాయని దేవతగా విజయదుర్గగామారిన చరిత్ర తెలియచేస్తూ ఆనాడు యుద్దకాలాలలో ఆయుధాలు ధరించి నగ్నరూపాలనుండి ఉగ్రమూర్తులుగా, విజయదుర్గలుగా కొలవబడ్డారు
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన చోట ఎద్దుని ఎద్దు రూపంలో ఉన్న దేవత విగ్రహాలని ఎక్కువగా కొలిచేవారు. అవన్నీ నగ్నదేవతలుగా ఉండడం చరిత్ర ఆధారాల్లో సాక్షాలుగా చూపించడం ఇక్కడ ప్రత్యేకత.
గ్రామదేవతల్లో ఎక్కువగా గుర్తులుగా, చిహ్నాలుగా మనకు దర్శనమిచ్చేది చక్రం, పద్మం, నందిపాదం, శ్రీవత్స, స్వస్తిక్ ఉజ్జయిని చిహ్నం, నక్షత్రం, దేవతఎద్దు ఇలా అనేక చిహ్నాలతో దేవతలు విరాజిల్లుతున్నారని, ప్రతి చిహ్నానికి ఓ చరిత్ర ఉందని, ఆ చరిత్రను సమకాలీన గ్రామ దేవత ఆరాధనలతో పోల్చి చూపిస్తూ ప్రకృతి ఆరాధన లో ముఖ్యంగా మర్రిమానులు, రాతితో చెక్కిన ముత్యాలమ్మ, మరిడమ్మ మనకు కనిపిస్తారు ఇక్కడ అంటరాని వారిగా పరిగణించే కులానికి చెందిన దంపతుల బిడ్డలని దేవతలుగా ఆరాధించడం అనేది తరతరాల చరిత్రకు సాక్ష్యంగా చూస్తాం.
నల్ల పోచమ్మ,గంగమ్మ కథ, గౌరీ పున్నమి కథ, పైడితల్లమ్మ కథ, గరగలమ్మ కథ, లొల్లలమ్మ, ఘటమెత్తుకోవడం, బోనం చెల్లించుకోవడం, లజ్ఙాగౌరీ దేవత( స్త్రీ ప్రసవ వేదన కి గుర్తుగా ఉండే శిల్పం), నాగదేవతలు ఇందులో ఎక్కువగా జంట నాగులు ప్రత్యేకంగా చెప్పాలంటే క్రీడిస్తున్న జంట నాగులు, బతుకమ్మ బొడ్డెమ్మల కథలు ఈ విధంగా ప్రస్తుత కాలంలో కూడా నాటి నుండి నేటి వరకు దేవతలుగా ఆరాధనను అందుకుంటున్న వీళ్లంతా ప్రకృతి దేవతలుగా కనిపిస్తారు…
చాలామంది చుట్టూ అనేక ప్రకృతి దేవతల ప్రతిరూపాలు చూసే ఉంటారు. శ్రీవత్స చిహ్నంలో సింహరూపాన్ని, మర్రి చెట్టు పైన , వేప చెట్టు పైన అనేక చిహ్నాలతో కూడిన దేవతామూర్తులని చూడొచ్చు.
ఈ గ్రామదేవతల కథల్లో మొదటగా శక్తికి ప్రాధాన్యత ఉంటుంది. శక్తి స్త్రీ శక్తిగా ఆరాధించినా..
అనాదిగా నానుడిగా వస్తున్న కథలో… శక్తి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులను తనతో రతి (వివాహం ) జరపమని అడిగినట్లు అందుకు వారు శక్తిని వరప్రదాయినిగా ఆమె శక్తిని అడిగి ఆమెను బూడిద గా మార్చి లక్ష్మీ,సరస్వతి,పార్వతిగా త్రిమూర్తులకు భార్యలుగా శక్తిని మార్చుకున్నారని అలా మారిన శక్తి నేడు బ్రాహ్మణ దేవతగా ఆరాధన అందుకుంటూ ఉన్నప్పటికీ కథను అనుసరించి శైవ ప్రాధాన్యత కలిగి క్రమంగా వైష్ణవంగా పద్మం చిహ్నముతో విష్ణువు నాభి నుండి వచ్చినట్టుగా అనేక విగ్రహాలు జైన బౌద్ధ కాలము నాటివి చరిత్రకు ఆధారాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి.
8, 9వ శతాబ్దాల నాటికి ఆంధ్రాలో బౌద్ధం వెనక్కు నెట్టి శైవం విజృంభించింది. చాలా గ్రామ దేవతలలోని మూలాల్ని తనలో కలుపుకు పోయింది. వీరశైవులు బౌద్ధానికి వ్యతిరేకంగా చేసిన తీవ్ర ప్రచారం కారణంగా ఈ దేవతల మీద బౌద్ధమత ఆనవాళ్లు చాలా కొద్దిగా మాత్రమే మిగిలాయి. ఎరుకమ్మ గాథ, ఎరుకమ్మ విగ్రహం బౌద్ధ, శైవ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుంది.
అక్కదేవతలు బ్రాహ్మణ కోవెలలోని సప్తమాతృకామూర్తుల ఫలప్రదాయని పోలి ఉంటాయి.
గ్రామదేవతలైన ఏడుగురు అక్కచెల్లెళ్ల కథలు, నూట ఒక్క మంది అక్కా చెల్లెళ్లని చెప్పే మరో కథ,
ఇలా ఏది ఏమైనా ఈ గ్రామ దేవత కథ యొక్క భిన్న కథనాలు దేవతారాధనను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి భిన్న మత సాంప్రదాయాల వారు చేసిన వివిధ రకాల ప్రయత్నాలను అలాగే ఒక గ్రామంలో భిన్న తారతమ్య వర్గాల మధ్య ఘర్శణలను తెలియజేస్తూ ఉన్నాయి. కొన్ని కథనాలు అయితే బ్రాహ్మణ బ్రాహ్మణేతర వర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని కూడా చూపిస్తున్నాయి.
గ్రామ దేవతలు బ్రాహ్మణేతరులకే కాకుండా బ్రాహ్మణులకు కూడా వీరి దీవెనలు కావలసి రావడము కూడా గ్రామాలలో అనేక గొడవలకి కారణాలు పొలిమేరలో దేవతలు ఊరి మధ్యలోకి వచ్చేసారు. బ్రాహ్మణత్వం వచ్చి చేరింది. సంస్కృత ఆచారాలు వచ్చి చేరాయి గ్రామదేవతల గుళ్ళలోకి.
ఆరవ శతాబ్ద కాలంలో సప్తమాతృకల రూపాలు ఆలయాల్లో కనిపించడం ప్రారంభమైన కాలం. రెండవ శతాబ్ద కాలానికి లేదా మూడో శతాబ్దానికి వచ్చేసరికి వారు బిడ్డలని ఎత్తుకొని ఉండడం కమండలాలని పట్టుకొని ఉండడము ఆ విగ్రహాల్లో మార్పులని గమనిస్తాం.
హిందుత్వం విధానాలలో మృత్యువు మనిషిని దేవుడి నుంచి వేరు చేస్తే.., జానపద తెగలలో మాత్రం మరణం మనిషిని దేవునితో ఏకం చేస్తుంది. అలా అని మరణాలన్నీ ఈ కోవకు చెందవు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆ జాతినో, తెగను కాపాడడానికి లేదా పగా, ప్రతీకారాల మధ్య జరిగిన వైరుధ్యాలలో మృత్యువు పొందిన వారు. లేదా హింసాత్మకంగా మరణించిన వారిని దేవతలుగా కొలవడం జరుగుతుంది. ఇలా కొలిచేవారు నిమ్న జాతుల వారు మాత్రమే కొలుస్తారని బ్రాహ్మణులు ఇటువంటి ఆరాధన విధానాలలో పాలుపంచుకోరని బ్లాక్ బర్న్ పరిశీలనగా మనకు ఇక్కడ చూపించబడుతుంది.
గిరిజన దేవతలు గురించిన ఆధారాలు దొరకడం మాత్రం చాలా కష్టం అయింది అంటారు రచయిత్రి. సమ్మక్క సారలమ్మ, అక్కమ్మ, బండమ్మ, సింగపురంలోని కొండలమ్మ ఇలా కనకదుర్గ ను జాగ్రత్తగా పరిశీలిస్తే మూడు తలల కనకదుర్గ, ఐదు తలల కనకదుర్గ , పది తలల కనకదుర్గగా భద్రకాళి,మహాకాళిగా… ఆమె ఆరాధన అనేక ఆరాధనల చారిత్రక పరిణామాల సమ్మిశ్రమంగా కనిపిస్తుంది. ఏడవ శతాబ్దానికి ఆ తర్వాత కాలానికి గ్రామదేవతగా విజయవాడ కనకదుర్గను కొలిచినట్టు చాళుక్య రాజు పాలకులు సామంతుడైన సింగయ్య రాజు శాసనంలో మనకు ఆనవాళ్లు కనిపిస్తాయి. జైన కావ్యం “యశస్తిలకం” ప్రకారం నిర్జన ప్రదేశాలలో పూజారిణులు రక్తతర్పానం చేస్తూ దుర్గాదేవిని పూజించేవారు. రక్తదాహం కలిగిన గిరిజన దేవతలను వీరశైవ మతం స్వీకరించింది. లేదా దుర్గా, కాళీ వంటి దేవతలు గ్రామదేవతలుగా గుర్తించబడ్డారు అన్న విషయం తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది ఈ పుస్తకం లోని ప్రమాణాలు.
ఐదవ అధ్యాయంలో ఎక్కువగా సతి ఆచారం గురించి చర్చకు తీసుకొని వస్తారు.
సతి ఆచారానికి మూలాలు వాయువ్య భారతంలోనే కాకుండా ఈ గ్రామ దేవతారాధనకు చాలా దగ్గర సంబంధం ఉందని ఉదాహరణలతో చెప్పడానికి ప్రయత్నించారు. ఉత్తరాది దక్షిణాధులలో ఈ సతి ఆచారానికి ఆత్మ త్యాగాలకు ఉన్న పోలికలను చెప్తూనే వాటి ప్రభావాలను సతిస్మారకార్ధాలను, రాజపుత్ర సతి ఆచారాన్ని వివరిస్తూనే పేరంటాల కథకు, సతి కథకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఈ గ్రామ దేవతల్లో ఎక్కువగా బలి, కన్నెపిల్లల హత్యలు, వివాహిత హత్యలు,మాతృమూర్తిగా బిడ్డలకుజరిగిన దారుణాల్ని చూడలేక పోయిన సామాన్య స్త్రీలు ప్రాణాలు పోయాక ఎవరో గ్రామ పెద్ద కలల్లో కనిపించినట్టు చెప్పి వారికి ఆరాధన చేయడం చేస్తారు
ఈ పుస్తకంలో మనం చూసేది సంస్కృత ఆచారాలలో చెప్పబడిన దేవతల కంటే గ్రామ దేవత ఏ మాత్రం తీసిపోదు. అంతేకాకుండా ఆమె పురాతన ఫలప్రధాయినీ దేవత యొక్క సమకాలీన రూపం అని ఈ పుస్తకం శతాబ్దాల చరిత్రకు ఒక ఆధారంగా రచించబడింది.
అదే శతాబ్దాల క్రితం బౌద్ధ, జైన,వైదిక బ్రాహ్మణ వంటి తాత్విక మతాలను స్థాపించాలనుకున్న మతాచార్యులు గ్రామ దేవతలు ప్రత్యేక అస్తిత్వాన్ని కలిగి ఉన్నారనే సత్యాన్ని అంగీకరించక తమలో కలుపుకోవాలని చేసిన ప్రయత్నాలు ఏమంతగా ఫలించలేదని, నిమ్న కులాల ప్రజల్లో గ్రామ దేవతల పట్ల ఆరాధన రోజురోజుకు పెరుగుతోందని.. శ్రమకు చిహ్నంగాను దోపిడీదారుల పైన విజయంగానో ఈ గ్రామ దేవతలు నిలిచారని చారిత్రక ఆధారాలతో సాగిన రచన ఇది.
~~~
-రూపరుక్మిణి. కె
29NOV25
పుస్తకం పేరు:
గ్రామదేవత
చారిత్రక పరిణామం
తెలుగు: అనువాదం అరుణా ప్రసాద్
అజు పబ్లికేషన్స్
~~~
ఆంగ్లమూలం: Sri Padma గారు
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వారి ఆధ్వర్యంలో 2013 లో “vicissitudes of the goddess”: reconstructions of the Grama Devatha in India’s religious traditions












“గ్రామదేవత “… Quite interesting 👌🌹