ధ్యానం – జ్ఞానం

Spread the love

ఉంగరాల జుట్టు, అరమోడ్పు  కళ్ళతో,.. ఆజానుబాహుడు ధ్యానముద్రలో బోధివృక్షం కింద కూర్చున్న బుద్ధుడి రూపం. చిన్ననాటి  పాఠ్యాంశాల్లో   చూసిన బుద్ధుడి రూపం మనసుపై చెరగని ముద్ర వేసుకుని వెళ్ళింది.

      చదువుతోపాటు ఎదుగుతున్న క్రమంలో రాజ్యాంగ రచన చేసినవాడే బౌద్ధాన్ని స్వీకరించమని చెప్పడం లాంటివన్నీ కూడా…,   బుద్ధుడు అంటే ధ్యానం,  ధ్యానంతో పాటు పొందిన జ్ఞానం,  జ్ఞాన జ్యోతిని వెలిగించేది బౌద్ధం అని నమ్మే స్థాయికి చేర్చింది.

        బౌద్ధాన్ని మతంగా ఎప్పుడూ స్వీకరించలేదు. కానీ మనసుకు నచ్చినది బౌద్ధం. ఆ నచ్చడంలో నుండి బౌద్ధ ధర్మ సూత్రాలను, బౌద్ధ గురువులు చెప్పే కథలను వినడం, చదవడం, బౌద్దారామాలు సందర్శించడం మాత్రం అలవాటయ్యాయి.

    ఇప్పుడు నా చేతిలో ఉన్న పుస్తకం #మసిబారిన_బుద్ధుడు (మరికొన్ని జెన్ కథలు) దీవి సుబ్బారావు గారి అనువాదంలో వచ్చిన పుస్తకం ఇది.

          ఈ పుస్తకంలో దళిత దృక్పథంతో బౌద్ధాన్ని విశ్లేషించే కొన్ని కథలు, మానవ నిర్మితమైన జీవితంలో,  తాత్వికతతో కూడిన మనిషి జీవనం ఎన్ని పార్శ్వలుగా కళాత్మకమైన ప్రభావాన్ని చూపిస్తుందో విశ్లేషించే కథలు వున్నాయి.

       సమానత్వాన్ని, స్వేచ్ఛ మరియు సోదర భావాన్ని పెంపొందించే బౌద్ధంలో మూడు రకాలు.  అందులో మహాయాన బౌద్ధంలో ఒక శాఖ ‘జెన్’ అనేది. ఇది ఎక్కువగా చైనా, జపాన్ లలో ప్రాచుర్యం పొందింది.

జెన్ అంటే ధ్యానం.

 “ధ్యానం అనే సాధన ద్వారా జ్ఞానాన్ని అందించడమే” జెన్ బౌద్ధ లక్షణం.

        జ్ఞానాన్ని అందించడం, కరుణను, దయను ప్రోత్సహించడం,  శాంతిని మరియు సామాజిక న్యాయాన్ని,  సామరస్యతను నెలకొల్పడం ఇటువంటివన్నీ ఈ కథలలో అంతర్భాగమై కనిపిస్తాయి.

        బౌద్ధాలయాలలో ఉండే బౌద్ధ గురువులు వారి ధర్మాన్ని పాటిస్తూ నియమనిష్టలతో జీవనాన్ని గడిపే వారి వద్ద జ్ఞానాన్ని ఆర్జించి ఎందరో తమ శిష్యులుగా చేరిన కాలాన్ని,  ఆ శిష్యులు అందుకున్న గురు బోధలు,  వారు నేర్చుకున్న అంశం, వాళ్ళ జీవన గతిని ఎలా మార్చింది.,  అనేది అతి చిన్న సారాంశాలతో కూడిన చిన్న చిన్న కథలు. ఆనాటి కాలాన్ని ప్రతిబింబిస్తూ గురువులు బోధించిన ధర్మపరమైన బోధనలు. 

      మోక్షాన్ని ఆశించి వచ్చే ఒక్కో శిష్యుడు జ్ఞానం కలగడానికి కొన్నిసార్లు ఒక్క రోజులో ఒక్క క్షణంలో కలిగితే కొందరికి సంవత్సరాల ప్రయాణ అనంతరం జ్ఞానమార్గం గోచరిస్తుంది.

   ఇందులో ఉండే కథల్లో శిష్యులు తమ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకుంటూనే సాంసారిక బంధాల నుండి విముక్తి కోసం..,  కొందరు తమలోని జిజ్ఞాసను పెంపొందించుకునేందుకుమరికొందరు గురువుల వద్ద శిష్యరికం చేస్తారు.

   ఈ శిష్యుల్లో స్వార్ధ చింతనను దూరంచేసి, నలుగురికి ఉపయుక్తమైన ఆలోచనలను కల్పించడమే… ఆ గురువుల యొక్క లక్షణం.

     ఓ జెన్ శిష్యుడు మోక్షం లభించింది తనకు అనుకున్నాక,  తాను ఓ బౌద్ధ మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఎంతో కఠినమైన దీక్షతో భిక్షాటన చేస్తూ కొన్ని సంవత్సరాలు తన సంపదను మొత్తం కూడగట్టుకొన్న సమయంలో తన చుట్టూ ఉన్న ప్రజల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కరువు సంభవిస్తుంది. అతను కూడబెట్టిన ధనాన్ని ఆ ప్రజల అవసరాలకి ఖర్చు పెట్టేస్తాడు. మళ్లీ ప్రయత్న పూర్వకంగా 10 సంవత్సరాల కాలం తర్వాత బౌద్ధాలయాన్ని నిర్మించాలని కూడగట్టిన ధనాన్ని తను నివసించే గ్రామానికి పట్టిన మహమ్మారి లాంటి అనారోగ్యాన్ని వదిలించడం కోసం,  ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తన ధనాన్ని మొత్తం ఖర్చు చేస్తాడు.

   అలా 30 సంవత్సరాల తర్వాత అతను అనుకున్నట్టు ఓ బౌద్ధ ధర్మశాలను నిర్మించగలుగుతాడు. అంటే ఇక్కడ

లక్ష్యం ఉండాలి, 

మానవత్వము ఉండాలి, 

సమాజం పైన కరుణతో ఉండాలి,  ఎంచుకున్న పని పట్ల నిబద్ధత ఉండాలి.  అలా ఉన్నవారే ఈ మత గురువులు మరియు శిష్యులు అని తెలిపే అనేక ఉదాహరణలు మనకి ఈ పుస్తకం నిండా దొరుకుతాయి.

       ఈ పుస్తకానికి మసిబారిన బుద్ధుడు అని టైటిల్ పెట్టడానికి కారణం “బౌద్ధం తన నిజమైన స్వభావాన్ని కోల్పోయిందని చెప్పడమే” రచయిత యొక్క ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.

 మారుతున్న కాలంతో బౌద్ధం పోటీ పడలేకపోయిందా? 

వెనకడుగులో ఉందా?!

అంటే అవుననే చెప్పాలేమో!!

 అటువంటి బౌద్ధాన్ని dr. B. R.అంబేద్కర్ ఆచరించి, సూచించిన బౌద్ధం ధర్మం గురించి తెలిపే అంశాలతో కూడిన జెన్  కథలు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. చదివి చూడండి ఒకసారి.

    థాంక్యూ  దీవి సుబ్బారావు గారు మంచి కథలను అనువదించి అందించారు సెలెక్టివ్ గా…

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *