సమాజాన్ని కదిలించే “హోరుగాలి”

Spread the love

ధునిక కాలం నుంచి మధ్యయుగాలకు రాజకీయ నాయకులు సమాజాన్ని తీసుకువెళ్లి… సమాజంలో అరాచకాలను, ఆటవిక నీతిని అమలు చేస్తుంటే.. ఏ కవి రచయిత వ్యాసకర్త ఊరికే చేతులు కట్టుకొని ఉండరు. ఒక దీపధారియై హోరుగాలిలా వీస్తూ.. సమాజానికి దారి చూపుతూ, వర్తమానాన్ని తన కలంతో అక్షరీకరించి చరిత్రగా ముందు తరాలకు అందజేస్తారు. మార్పును ఆశిస్తూ సమాజాన్ని ఒక శిల్పిలా అందంగా తీర్చిదిద్దుతూ… ముందుకు తీసుకువెళ్తారు. ఇదే పనిని రచయిత, కవి, నాటకర్త కొసనం శాంతారావు చేశారు.

                కవి కొసనం శాంతారావు రాసిన హోరుగాలి కవితా సంపుటిలోని కవితలు, అభ్యుదయాత్మకంగా ఉండడమే కాదు… సమాజంలో మార్పును కోరుతూ, చదువుతున్న పాఠకుడి మనసులో మానవత్వ బీజాలు నాటుతాయి. ప్రేమ పరిమళాన్ని వెదజల్లమని పురిగొల్పుతాయి. కవి తాను చూసిన, విన్న, చదివిన సంఘటనలు తన హృదయాన్ని కదిలిస్తే… స్పందించి కవిత్వంగా మన ముందు ఉంచారు.

               “చీలుకుంటూ

                చీల్చుకుంటూ కాదు

                కలుపుకుంటూ

                కలుసుకుంటూ

                సంఘమంలా సాగాలి” అంటూ సాగే ఈ కవిత పంక్తులు విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనాలు. మనిషి సంఘజీవి సంఘంతో పాటుగా సాగాలని చెబుతూ.. కర్మయోగిలా నిశ్శేషం కావాలని హితబోధ చేస్తాయి .

               “ఆ ప్రేమలో నిజాయితీ ఎంత?

                నైరూప్యమైనా ఆ ప్రేమ భావనలో

                అహంభావం ఎంత? అజ్ఞానం ఎంత?చర్చానంతం అనే కవిత్వంలోని ఈ వాక్యాలు వ్యక్తుల మధ్య, బంధాల మధ్య ఉన్న ప్రేమలో నిజాయితీని ప్రశ్నిస్తాయి. ఆ ప్రేమ భావనలో, అహంభావం, అజ్ఞానం ఎంతుందోనని సందేహాన్ని వ్యక్తం చేస్తాయి.

              “బలైపోతున్నది నవజాత

               శిశు ప్రేమైక్యం

               కదలిరా ఇక జాగు చేయక

               ప్రజాస్వామ్యపు దీపధారిగా”… దీపధారి అనే కవితలో… దేశంలో ప్రజాస్వామ్యం బీటలు వారి అరాచక, ఆటవిక పాలన కొనసాగుతుంటే… చూసి సహించలేని కవి దానికి చరమగీతం పాడి, మమతానురాగాలను పంచుతూ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కదిలిరమ్మని పాఠకునికి పిలుపునిస్తారు.

     సమూహం కావాలి అనే కవితలో

              “ఎలక్షన్ల ప్రచారం ఎందుకో

               ఎంగిలాకుల కోసం

               కుక్కల కోట్లాటలా కనిపిస్తున్నది” అని అధికారం కోసం వెంపర్లాడే రాజకీయ నేతలను ఎద్దేవ చేస్తూ.. ఈ వాక్యాలు చురకనంటించినట్టుంటాయి.

     దిశ ఘటనకు స్పందించి రాసిన పొద్దు పొడుపు కవిత… ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న మారణ హోమాన్ని, ఎథికల్ క్లీనింగ్కు కూడా ప్రతిబింబించినట్టు అనిపిస్తుంది.

             “ఆకులు తెంపినంత సులువుగా

               పూవులు కోసినంత తేలిగా

               ప్రాణాలు రాలుతున్నాయి” అంటూ కవి ఈ కవిత్వంలో ఆవేదన వ్యక్తం చేశారు.

          “ద్వేషం ఏనాడు సమాధానం కాదు

           తక్కినవన్నీ గాలికి కొట్టుకుపోవడం ఖాయం

           కరుణారస హోరుగాలికి… కాదంటారా?” అని ప్రశ్నిస్తూనే పాఠకుడి మనసులో కరుణా రసాన్ని నింపి, మానవతా మూర్తులుగా పాఠకుల్ని కవిత్వం మారుస్తుంది.

              “నీవన్నది నిజమే

               నెత్తుటి కూడులో

               మార్కెట్ ప్రపంచం

               ఇరుక్కుపోయింది” ద్వేషంతో సమాజాన్ని చీల్చుతూ, చరిత్రను వక్రీకరించి తీసిన చిత్రాలు సమాజంలో ద్వేషాన్ని నింపి డబ్బులు సంపాదిస్తున్నాయి. అటువంటి దర్శకులను,  ప్రొడ్యూసర్లను ఉద్దేశించే ఈ కవిత వాక్యాలు రాయబడ్డాయేమో…!

     సమకాలీన ప్రతీ అంశాన్ని  కవి స్పృశిస్తూ… గౌరీ లంకేష్ హత్య, స్టాన్ స్వామి హత్య, కరోనా సమయాన్ని , గుజరాత్ నరమేధాన్ని, మణిపూర్ మారణ హోమాన్ని.. ఇప్పటి వరకు జరిగిన  ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ… తన మనసులో పుట్టిన భావాలను అక్షరీకరించి, కవిత్వంగా… కవి కొసనం శాంతారావు మన ముందుంచారు. ధిక్కార స్వరం, మానవత్వం, కరుణరసం, ప్రేమ, దీపధారై హోరెత్తించే “హోరు గాలి” కవితా సంపుటిని చరిత్రగా సాహిత్యంతో ముందు తరాలకు అందించారు.

సయ్యద్ ముజాహిద్ అలీ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *