వనవాసుల అస్తిత్వ పోరాటం

Spread the love

“ రణ రక్త ప్రవాహసిక్తం”

 యుద్ధాల వలన రక్తం ప్రవహించిన చరిత్ర.

హింసకు ప్రతిరూపమే చరిత్ర అయినప్పుడు, అటువంటి చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవాల్సిందే. చరిత్రను తిరిగి చూసుకుంటే కలిగేదంతా దుఃఖమే

 అయినా నేటి సామాజిక చలనశీలతలో మార్పులను గమనించుకోవాలంటే తప్పక ఇతిహాసాలను  తిరిగి చూడాల్సిందే. ఏముంది ఈ ఇతిహాసాల్లో అంటే ఆదిపత్యం ముందు ఓడి గెలిచిన అణగారిన వ్యవస్థ ఉంటుంది. మన అణిచివేతల్లోని వెతలు ఉంటాయి. మన నేటి స్వేచ్ఛా ఊపిరికి మూలమైన కారణాలు ఉంటాయి.

 కొన్ని కథలు మన భవితకు మార్గాన్ని సులభం చేస్తే, కొన్ని కథలు మరుగున పడిపోతున్న మానవత్వానికి ప్రతిబింబాలవుతాయి. అటువంటి ఇతిహాస సాహిత్య చర్చలో భాగంగానే ఈ #హిడింబి మన ముందుకు వచ్చిందేమో అనిపించింది.

కొన్ని కథల్లో కొన్ని పాత్రలు అర్ధాంతరంగా వచ్చి, అంతే అర్ధాంతరంగా మాయమైపోతూ ఉంటాయి.. ఎలా అంటే మన జీవితాల్లో అనుకోకుండా చేసే ప్రయాణాల్లో పరిచయమై అంతర్దానమయ్యే మనుషుల్లా వారితో గడిపిన ప్రయాణ కాలం అతికొద్ది కాలమైనా జీవితకాల జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అలా ఆ క్షణం లోని వారి ప్రవర్తన ద్వారా అది మంచి,  ఇది చెడు అని జ్ఞాపకాలని వదిలి వెళుతుంది.

 అలాగే మనం చదువుకున్న కథల్లోని రాక్షస పాత్రలు బాగా గుర్తుంటాయి. కీకరారణ్యంలోకి వెళితే రాక్షసులుంటారు.   అనే గోరుముద్దల మాటలు మన మెదడులలో ఎన్నో నాటుకుపోయి ఉన్నాయి కదా !? అలా అడవిలో జీవనం సాగిస్తున్న వాళ్లను రాక్షసులుగా ముద్రలు వేయబడిన వారి వెనుక చరిత్రే ఈ కథకు మూలం.  ఆ క్షణానికి వారు రాక్షసులుగా ఎందుకు మారారు అన్న కాలానికి ప్రశ్నను వెతుకుతూ,  మూలాలు వెతుకుతూ నరేష్కుమార్  ఓ ఇతిహాస సాహిత్య ప్రయాణం చేశాడు.

           అరణ్యం లోపల మంచి మాత్రమే తెలిసిన మనుషులు ఉంటారని,

వారి లోపల  గుట్టలు గుట్టలుగా మానవత్వం పొంగి పొర్లుతూ ఉందని.

తమ జాతి  రక్షణకు ప్రాణాలర్పించడం తెలిసిన    అమాయక జీవులుంటరాని,

నమ్మిన వారి కోసం జీవితాన్ని వదులుకుంటారని చెప్పే చిన్ని ప్రయత్నంలా ఈ పుస్తకం కనపడింది.

 అణచివేయబడిన జాతుల అస్తిత్వ ప్రకటన ఎలా జరుగుతుంది. అధికారానికి ఎదురుతిరిగినప్పుడు మాత్రమే అని ఎన్నో చరిత్రలు మనకు ఉదాహరణలుగా ఉన్నాయి.

#హిడింబి – ఒక వనదేవత తన జాతి మనుగడను కాపాడుకోవడానికి అస్తిత్వ పోరాటం చేసిన నాయకి. ఈ పోరాటంలో ఆమె అంతర్మథనం # ప్రేమ #త్యాగం #ఓర్పు #నేలరాలిన కన్నీటి చుక్కలు, సరస్వతీ నది సాక్షిగా ప్రవహించిన రక్తపుటేరుల నిశ్శబ్ద ప్రవాహమే హిడింబి జీవిత చరిత్ర.

     మన చుట్టూ ఉన్న తన వారి  భూమికై, భుక్తికై చేసే పోరాటంలో ఎవరైనా తమ నివాసాలను వదిలి వేరే ప్రాంతాలకి తరిమి వేయబడడాన్ని ఎలా తీసుకుంటారు. నేటి పాలస్తీనా కోసం కన్నీళ్లు కార్చే మనుషులు ఎందరున్నా..! ఆగని దహన కాండను ఏ రాక్షస చర్యగా తీసుకుంటాము.?! ఈ హిడింబి వనవాసులు కూడా తమ నేలని, తమ జాతి రక్షణకు తమని తాము నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే నాకు కనిపించింది.

   అరణ్యాలలో జీవించే వారిని అనాగరికలుగా చూడడం నాగరికుల లక్షణం కాదంటారా!

 ఈ నాగరికత మూలాలు ఆనాటి అనాగరికత నుండే అంటే మాత్రం ఒప్పుకోరు.,  ఒప్పుకోలేరు అలా ఒప్పుకోని ప్రపంచమే మన చుట్టూ ఉందని నేను నమ్ముతాను.

 హిడింబి తలపడింది ఆనాటి చరిత్రకారులు అయిన #హస్తిన రాచపరివారంతో అన్నప్పుడు మనకు రాచరికపు పాండవ కుమారులే గుర్తుకు వస్తారు. ఇందులో యుధిష్టిరుడి రాజనీతిని, దానితో పాటు కురువంశ పాలకుల యుద్ధనీతుల్ని,  ఆనాటి రాజ్యాధికార కాంక్షలోని పాలకుల విభేదాలన్నింటినీ గుర్తు చేసే క్రమంలో ఈ పరిస్థితులని దాటుకొని మానవ పరిణామ క్రమంలోని లోపాల్ని చూడగలిగిన దృష్టి కోణం ఉన్న రచయితలు మాత్రమే ఇటువంటి రచనలను చేయడానికి సాహసిస్తారు.

 బుక్కెడు భూమి కోసం నేటి చరిత్రకారుడుగా చెప్పుకునే కొమరం భీమ్ చేసినదీ. కాకతీయుల వెన్నులో వణుకు పుట్టించిన సమ్మక్క చేసింది. ఆనాడు హిడింబి చేసింది ఒకే పోరాటం,  భూమి పోరాటం. ఈ భూమి పోరాటంలో హిడింబి తలపడింది హస్తిన రాజులతో,  ప్రేమలో పడింది హస్తిన రాకుమారుడి తో…, అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి త్యాగం చేసింది ఆ రాకుమారుడినే కాదు, కన్న బిడ్డని కూడా.

హిడింబి- హిడింబాసురుల గురించి కథలు విని ఉన్నా వనవాసులుగా అరణ్య రక్షకులుగా నేడు నరేష్కుమార్ రచించిన చరిత్రని ఒకసారి చదవాల్సిందే. భీమ కౌశలత్వాన్నే కాదు, కోమలత్వాన్నీ చూడాల్సిందే. రాజకీయ కోణం నుండి మంచి ప్రయత్నం చేశాడు నరేష్.

 అయితే చెప్పాల్సిన దానిలో ఇంకా చెప్పాల్సింది  దాగి ఉందని అనిపించింది.

ఏ అస్తిత్వ ప్రకటన కోసం హిడింబి ప్రయత్నించిందని కథ మొదలైందో.. ముగింపులో  ఆ అస్తిత్వ ప్రయాణాన్ని హడావిడిగా ముగింపు పలికినట్లుంది. సినిమా టిగ్గా సినిమాలో లాస్ట్ రీల్ పరిగెత్తినట్టు అన్నీ సడన్గా జరిగిపోతాయి.

అలా ఆదుర్దాగా ముగించడానికి పుస్తక పరిమాణం దృష్టిలో ఉంచుకున్నారో, లేక పాత్ర పొడిగింపులో న్యాయం చేయలేమన్న ధోరణో గాని ముగింపు మాత్రం అత్యంత వేగంగా వచ్చి పడుతుంది.

 మూల కథలు వివరించే క్రమంలో హస్తినా పురాదీశుల గురించి, కురు వంశ ఆగమనం గురించి కాస్త ఎక్కువ వివరణే ఇచ్చాడు. చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పేసే ఆప్షన్ ఉపయోగించుకోలేదనిపించింది.

 మరుగున పడిపోయిన వ్యవస్థను చెప్పేటప్పుడు అనుసరించాల్సిన రాజకీయ కోణం లాఘవంగా తీసుకున్నాడు. యుద్ధ విషయాలు రాసేటప్పుడు చాలా సంయమనంతో రాసినట్లు అనిపించింది చదువుతున్న సమయంలో మన ముందు చిత్రాన్ని ఆవిష్కరణ చేసినట్లే ఉంది.  స్త్రీ కోణంలో నిలబడి చెప్పడానికంటే ఒక అణగారిన జాతి పక్షం వహించి చెప్పే ప్రయత్నం చేశాడు నరేష్ కుమార్ సూఫీ.

 అభినందనలు సూఫీ.

 చాలా ధైర్యం చేశావు హిడింబి చరిత్రను తలకెత్తుకొని భవిష్యత్తులో మరో పుస్తకంగా వస్తున్నావ్ ఇంకాస్త నేర్పుతో,  నీ రచన ముందుకు సాగుతుందని ఆశిస్తూ

✍️రూపరుక్మిణి.కె, 25 10 25

పుస్తకం పేరు – హిడింబి
రచయిత- నరేష్కుమార్ సూఫీ
#ఝాన్సీ పబ్లికేషన్స్

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *