అందరం కోరుకునేది ఒక్కటే “స్వేచ్ఛ”.
ఈ స్వేచ్ఛ మనల్ని ఎంత దూరం ప్రయాణించేలా చేస్తుందంటే మనల్ని మనం అందుకోవడానికి మనసుల చుట్టూ కోట గోడల్లా కొలతల్ని నిర్మిస్తుంది.
నిజానికి స్వేచ్ఛగా ఉండడం వేరు, స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటూనే.., ఓ బ్రమణ చక్రంలో ఇరుక్కుపోయేవాళ్ళు ఎంతో మంది మనకు తారస పడుతూనే ఉంటారు. గమ్మత్తైన విషయం ఏంటంటే మనం స్వేచ్ఛగా లేమన్న సంగతిని మనకి మనముగా తెలుసుకోవడం, ఎంత అవసరమో…, అలా తెలుసుకోలేని అమాయకత్వంలో బ్రతుకుతూ ఇదే స్వేచ్ఛ అని భ్రమించే మనసు గాయాల తెరలు దిగినప్పుడు కనిపించే వాస్తవికతను పరిచయం చేస్తుందిక్కడ.
నిన్ను నువ్వు ఎప్పుడైనా పరికించి చూసుకున్నావా!?
నీకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు తెలుస్తుందా!?
నీ చుట్టూ ఉన్నవాళ్లు నీపై ఎంతటి ఆపేక్షను చూపిస్తున్నారు.,
నువ్వు వాళ్లపైన అంతే ఆపేక్షని చూపించగలుగుతున్నావా!?
ప్రేమగా నువ్వు నమ్మిన నీ మనిషిలోని స్వార్థపు మనసు నిన్ను నీకే పరిచయం లేకుండా చేస్తోందా..?
ఇలా…ఆలోచనల పరంపరలో పడేస్తుంది.,
అవును ఈ బ్రతుకు ప్రయాణంలో స్త్రీ తనకు తానే పరిచయం చేసుకోవడానికి ఎన్నో ఆంతరంగిక జ్వలనలలో నలిగిపోవాలి.
భ్రమలను దాటుకుని
మనసు ‘రెక్క చాటున ఆకాశమంత’ విశాలమైన మనుషులు కనిపించినప్పుడు., నీలోనే నిన్ను పాలించే ఆ.. సంకుచిత భావాన్ని నెట్టి అవతల పెట్టాలి.
అటువంటప్పుడే కొన్ని భావాలు చిలి ఉద్వేగా భరితమైన ఆలోచనలను అందిస్తూ ఉంటాయి. అక్కడ కొందరిలో….
ఎప్పుడూ నాకు నేనే, నాలో నేనే,అనుకునే మనసులంటాయి.
అవును కొంతమంది ఆలోచనల పరిధి వారిని దాటి రాదు.
అందరితో తమని తాము పోల్చుకుని చూసుకుంటూ ఉంటారు.
వారిలో ఉన్న చిన్న చిన్న అతి చిన్న లోపాలను కూడా భూతద్దాలను వేసి చూసుకుంటూ.., చుట్టూ ఉన్న సమాజాన్ని చూడ్డం మర్చిపోతారు. అలా మర్చిపోయిన మర్చిపోతున్న కొందరు తమ ఆలోచనల పరిధిని దాటి రాలేని వారికి ఉదాహరణగా ఈ నవలలోని పాత్ర అయిన ఇందిర కనిపిస్తుంది. ఇటువంటి మానసిక స్థితి నుండి తనని తాను గుర్తించి, తన చుట్టూ ఉన్న మనుషుల మనసుల్ని, మాటల వెనక గారడీని అర్థం చేసుకోవడానికి ఆమె పడిన అంతరంగ జ్వలనే ఈ నవల.
రెక్క చాటు ఆకాశం. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మనిషి ఆలోచనలు కూడా అంతే విశాలంగా ఉండాలని చెప్పేందుకు సూచనగా ఈ పేరు పెట్టారేమో ఈ నవలకి.
మానసిక స్థితులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని చెప్పకనే చెప్పింది ఈ నవల.
మనలోని ఆలోచనల పరిణతిని పెంచుకోవలసిన అవసరాన్ని, టాక్సిక్ పర్సన్స్ నుండి ఎవరిని వారు ఎలా కాపాడుకోవాలి, వ్యక్తిగతంగా మనకి నచ్చిన మనుషుల లోపాలు మన కంటికి ఎందుకు కనపడవు!?, అలా కనపడకపోవడానికి మనలోనే ఉన్న లోపం ఏంటి ? , బాధ్యతలు, బంధాల మధ్య ఎవరిని వారు ఎలా కోల్పోతారు.!?, ఇలాంటి అతి చిన్న సామాన్యమైన ప్రశ్నలే.., మనకి ఎదురైనా ఎక్కడో ఎవరో ఒకరు ఆ ప్రశ్నల చాటున తెరదించుకున్న మొఖాలు మనకి కనిపిస్తాయి., నవల చదువుతున్నంత సేపు . అవును ఈ ముఖము మనకు తెలిసిన వీరిదే కదా అని అనిపించినప్పుడు., ఈ నవలలో వ్యక్తీకరించబడిన కొన్ని మాటలు మన చుట్టూ ఉన్న అంతరంగాల ఘోషని వినిపిస్తూ ఉంటాయి.
కొన్ని పాత్రలు మనతో ఉచిత-అనుచితాల గురించి మానసిక సంఘర్షణ లోనుండి మనతో మాట్లాడుతూ ఉంటాయి.
నవల లోపలికి వెళ్తే.. ఇందిర ముఖ్య పాత్రగా ఈ కథ నడుస్తుంది. ఎదుగుతున్న వయసులో చుట్టూ ఉన్న మనుషుల నుంచి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ ఈ పాత్ర చుట్టూ అల్లుకొని ఉంటుంది. తనలో ఉన్న చిన్న శారీరక లోపం అది లోపం అని కూడా అనకూడదు. ఒక స్త్రీగా పుట్టి, అమ్మ అయ్యే అవకాశం లేదని అందుకు తన శరీర అవయవ వ్యవస్థ సహకరించదని తెలిసినప్పుడు కుటుంబ సభ్యుల నుండి మొదటగా ఎదుర్కొన్న సంఘర్షణ మనకు తారసపడుతుంది. సమాజం దృష్టిని అంతా కూడా ఆ తల్లిదండ్రులు, నానమ్మ ల మాటలతో మనకు వివరించడానికి ప్రయత్నిస్తారు రచయితలు. పిల్లలు పుట్టకపోవడం అన్న ఈ సమస్యని ఇందిర ఎంత భూతద్దంలో పెట్టి చూసుకుందో తనలో తానే ఎంత ఆత్మన్యూనతకు గురి అయిందో చెప్తున్నప్పుడు.., చాలా సహజమే కదా అనిపిస్తుంది.
మన చుట్టూ పాతుకుపోయిన పీడన పితృస్వామ్య వ్యవస్థ నాటిన మొక్కలం కదా మనం!!.
కూకటి వేళ్లతో పెకిలించలేని ఎన్నో వేల సంఘర్షణల సమాహారాలం కదా!!
అందుకే ఆత్మ న్యూనతకు గురైతూ ఉంటాం.
ఇందూ చుట్టూ వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, ఆర్థిక వెసులుబాటులు, అందుకోవాలనుకున్న ప్రతిదీ అందుబాటులో ఉండే లైఫ్ స్టైల్, ఎందరో స్నేహితులు, ఆమె స్నేహితులందరి మధ్య అల్లుకున్న స్నేహంలోనే తన ఆలోచనల ధోరణి మారింది., స్నేహితులలోని సమస్యలే తనని తన ఆలోచనల ఊబిలో నుండి బయటకు లాగింది. తనకు పరిచయమైన, తన జీవితంలోకి వచ్చిన స్నేహితుల జీవితాల్లో లేని సౌలభ్యత తనలో ఏముందో.., తన మానసిక వేదనకు తానే కారణమన్న ఆలోచన తనకు అందడానికి ఓ దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి రావడాన్ని కథలో చాలా చక్కగా తీసుకొని వచ్చారు ఈ ఇద్దరు రచయితలు .
బిడ్డకు తల్లి అయినప్పుడు ఉండే మానసిక వ్యవస్థ, పురుషుడు అందిపుచ్చుకోలేని ఆ మాతృత్వపు పరిమళం., అన్నింటిని మనకు వివరంగా అందించినట్టు అనిపిస్తుంది.
మనం నిర్మించుకోవాలనుకుంటే మన చుట్టూ చాలా పెద్ద ప్రపంచం ఉంటుందని, ఎవరికి వారు బిగించుకుపోయిన ఊబిలో నుండి బయటకు రావాలని చెప్పడం ఈ నవల ఉద్దేశంగా కనపడింది.
ఇందిర స్నేహితులందరి మధ్య ఇందిర కోరి ఎంచుకున్న భర్త నుండి తను ఎదుర్కొన్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారాలు మనల్ని వాస్తవ ప్రపంచంలో నిలబెడుతుంది.
కాథీ, వాళ్ల సూదమ్మమ్మ ఏ చదువు లేకున్నా మగవాడి దాష్టికాన్ని ఎదుర్కోవడంలో ఆమె చూపించిన ధైర్యాన్ని కథలో భాగం చేయడం బాగుంది.
నేహా,కావ్య, సుధా, గీత వీళ్ళందరి పాత్రలు ఒక ఎత్తు అయితే మీనా-డావి ల పాత్ర ప్రత్యేకంగా తీసుకొచ్చి చెప్పినట్టుగా అనిపిస్తుంది టాక్సీక్ పర్సన్స్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు. నిజంగా ఇటువంటి కథలు అవసరం ఇటువంటి మనుషులు మన చుట్టూ కోకొల్లలుగా ఉన్నారు. ఎందరో మీనాలు మానసిక సంఘర్షణలకు లోనై ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు ఏకాకితనానికి ఒంటరితనానికి మధ్య భేదం తెలియని తనాన్ని అనుభవిస్తూ ఉంటారు.
అటువంటి స్థితిని డావీ లాంటి వాళ్ళు ఎలా స్త్రీలని సమాజంలో ఆట బొమ్మలుగా తయారు చేస్తారో చక్కగా చూపించారు. అదే సమయంలో అటువంటి హింసాత్మకమైన మానసిక పరిస్థితుల నుండి బయటపడే మార్గాలని సూచించారు.
ఇకపోతే పరిమళ మన చుట్టూ 80% ఇటువంటి పరిమళలే ఉన్నారు. పరిమళ సమస్యకి వేరే పరిష్కారం దొరకకపోవడం కొంచెం బాధాకరంగా అనిపించింది. నిజమే రాతలో చూపించిన ధైర్యం జీవితంలో చూపించే మగువలు తక్కువే అటువంటి వారికి పరిమళ జీవితం ఓ ఉదాహరణ.
నవల చివరగా వచ్చేసరికి ముగింపుని నాటకీయంగా ముగించినట్టుగా అనిపించినా.. ఈ కథకు మరోలా కూడా ముగింపు ఉండొచ్చేమో, అంత టాక్సిక్ పర్సన్ నుంచి ఇంత సాధారణంగా బయటికి రాగలుగుతుందా ఇందిర అనిపిస్తుంది. అటువంటి మనుషుల నుంచి విడిపోవడం ఒక్కటే మనిషిని నిలబెట్ట లేకపోవచ్చు. అందుకు కావలసిన మానసిక ధైర్యాన్ని, ఎంచుకోవలసిన దూరాలని, ఎదుర్కొనే సంఘర్షణల కొలమానాల్ని అంచనా వేయగలిగే ధైర్యాన్ని నేటితరం మగువలు కూడగట్టుకోవాలి అప్పుడే మనిషిగా నిలబడతామేమో..
ఉమా నూతక్కి, సుజాత వేల్పూరి వీరిద్దరూ ఈ పుస్తకంలో సమవుజ్జీలుగా తమ రచనా కౌశలాన్ని ప్రదర్శించారనే చెప్పాలి., బలమైన స్త్రీవాద గొంతుని వినిపించారు.
అభినందనలు ఇరువురికి…

































రెప్పచాటు ఆకాశం విశ్లేషణ బాగుంది.. మువ్వురికీ శుభాకాంక్షలు 🌹🌹