“అంతా మిథ్యే”… అని చెప్పే సంసారవృక్షం

Spread the love

ప్రముఖ విమర్శకులు, సాహితీవేత్త అయిన కీ.శే., ఆర్. ఎస్. సుదర్శనం (1927-2001) గారి రచన ఈ ‘సంసారవృక్షం’ అనే నవల. ఆంగ్ల సాహిత్యంలో పి.జి‌. చేసి ఆంగ్ల అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్ గా, విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ గా ఉద్యోగించినవారు. శ్రీమద్ భగవద్గీత, జిడ్డు కృష్ణమూర్తి ల తాత్త్విక దృక్పథాలపట్ల అభిమానం కలవారు. ఆస్తిత్త్వవాది, వేదాంతి అయిన వీరి రచనలు, కథలైనా, నవలలైనా, విమర్శనాత్మక వ్యాసాలైనా… సులభ సాధ్యంగా అర్థం గాక, మెదడును పదునెక్కించేవి, అనడం ఎంతో నిజం! నూట యాబైపుటల ఈ సంసారవృక్షం నవల కూడా చదివిన వెంటనే సారం పట్టుబడనివ్వదు. మన మనస్సును తొలుస్తూనే , ఎన్నో కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఎటువంటి ఆవేగ, ఉద్వేగాలు లేక, ఒక జీవితాన్ని…
ఇంకా చెప్పాలంటే ఈ లోకంలోని కొన్ని కుటుంబాలను, పరస్పరం స్నేహామో బాంధవ్యాలో ఉన్న కొన్నికుటుంబాలను, అసలు పరిచయమే లేని కొందరు వ్యక్తులను పరస్పరం పరిచయం చేస్తూ నెమ్మదిగా ముందుకు సాగుతుంది, అయితే కథలో ఫ్లో ఎక్కడా కుంటుబడదు. మనకు తెలియకుండానే, వేగంగా మనతో కథను చదివించే లక్షణం ఈ నవలకు ఉంది. కొంతమంది రచయితల రచనలను చదవగానే వాటి పట్ల ఒక నిర్ధారణకి వచ్చేయడం సులభం అవుతుంది. కాని ప్రాచ్య, పాశ్చాత్య, తాత్త్విక సిద్ధాంతాలతో పరిచయం కలిగి ఉన్న సుదర్శనం గారి ఈ రచన తెలుగుసాహిత్యవనానికి కొత్త మధురిమలను ప్రసాదించిన అపురూపమైన పారిజాత సుమం అనవచ్చు.

“ఒకవ్యక్తి జీవితం అతని మనస్సుయొక్క ప్రతిబింబమే! అంటే అతని ఆలోచనల ప్రతిబింబమే!” అంటూ ”సత్యం అభిప్రాయాల్లో లేదని, అనుభవంలో మాత్రమే ఉంటుంద”ని చెప్పే నవల ఇది! “ప్రతీక అంటే మేధ వివరించి చెప్పలేని అనుభూతి, జ్ఞానమూ నిక్షిప్తమైన గుర్తు. ఒకదానిమీద ఒకటి పనిచేస్తున్నట్లు గమనించేది మనస్సే కాబట్టి, మనస్సుకే ప్రాధాన్యం” అంటూ, “అద్వైత స్థితి అనే అనుభూతి మనస్సుకు లేదు. అది మనస్సుకు ఆవలే ఉంటుంది. ఆ స్థితిని పొందాలని ఆర్తి చెందే వారిని అది తప్పకుండా స్వీకరిస్తుంది. జగత్తు, మనస్సూ ఒక్కటే! వ్యక్తిలోని అహంత వాటిని వేరుగా తోపింప జేస్తుంది. జగత్తూ మనస్సూ ఒక్కటే కాబట్టి, మనిషిలోని అపభ్రంశమే, జగత్తులోనూ రూపుదాల్చి, కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి జీవితం అతని మనస్సు యొక్క ప్రతిబింబమే” అని సిద్ధాంతీకరిస్తూ, సంతుష్టిని కలిగి ఉండటమే జీవితానికి అర్థం అని చెప్పే ఈ నవలను చదివి ముగించిన తరువాత, ఇందులోని ప్రతి పాత్రా, ప్రతి ఘటనా, ప్రతిమాట మనలను వెన్నాడుతూనే ఉంటాయి.

ప్రథమ పురుషలో సాగిన ఈ నవలలో లాయరు అయిన నాయకుడు, అతని భార్య సావిత్రి, పక్కింటి
భావనారాయణ, అతని చెల్లెలు హేమసుందరి, కొత్తగా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన డాక్టర్ వీరభద్రం ……. వీరి చుట్టూ తిరిగే కథతో, ఆయా వ్యక్తులలోని, విభిన్నమైన తాత్త్విక ధోరణులు, వారి వ్యక్తిత్త్వ నిరూపణలు … వంటి పెక్కు అంశాలను ఆసక్తి దాయకంగా వివరిస్తుంది. అసలు ‘సంసార వృక్షం’ అన్ననవల పేరే గమనింపదగినది. భవద్గీతలో శ్రీకృష్ణుడు, వృక్షాలలో శ్రేష్టమైన అశ్వత్థ వృక్షం (రావి చెట్టు)తో తనను తాను పోల్చుకున్నాడని, సృష్టిని రావి చెట్టుగా వర్ణిస్తూ, అసంగత్వం అనే కత్తితో సంసారం అనే రావి చెట్టు వేళ్ళను దృఢంగా నరికి భగవంతునికి శరణాగతి కమ్మంటాడు ,అన్న గీతాసారాన్ని దృఢంగా విశ్వసించిన నాయకుడు, రావి చెట్టును గురించి “అది నీకు వంశవృక్షం. నాకు సంసారవృక్షం. ….నువ్వు సంతానం కావాలంటావు. నేను అసంగత్వంతో దీన్ని ఛేదించి విముక్తి పొందాలంటాను” అని భార్య సావిత్రితో అన్న మాటలు గమనింపదగినవి.

సంతానం లేదన్న దిగులు సావిత్రిది. భగవద్గీతను, జిడ్డు కృష్ణమూర్తి తాత్త్వికతను నమ్మిన నాయకునికి ఆ విషయంలో ఏ మాత్రం దిగులు లేదు. అధీరలక్షణాలను కలిగిన నాయకుడు, నిర్లిప్తమోహన మూర్తి. “నాలో బాధ అనే భ్రమ కలిగిందంటే, నాలోని నిర్లిప్తత పరిపక్వం చెందకపోవడమే అందుకు కారణం” అని నమ్మిన వాడు. ఏ పరిస్థితులలో అయినా నిజాయితీతో దైర్యంతో వ్యవహరించడమే మనుష్యులను సన్నిహితం చేస్తుంది అని నమ్మిన నాయకుని దృష్టిలో మాత్రం, మన కోరికలు, ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది ముఖ్యం కాదు. .. సంస్కృతి లోని మూల తత్త్వానికి, ఆధునిక భావాలకు, వంతెన నిర్మించుకోవడంలోను, వైయక్తిక అన్వేషణలోను ఆసక్తి గలవాడు. భార్య సావిత్రి దృష్టిలో అతను, చంపడము, బ్రతికించడము రెండూ తెలియని వ్యక్తి. ఆప్యాయత లేని రాతి మనిషి. కాని అనురాగమూర్తి.

పక్కింటి హేమకు బి. ఎడ్. పరీక్షకు కూర్చోవడానికి సాయం చేస్తూ, ఆమె ప్రేమను తిరస్కరించిన అతను, తాను కూడా ఆమెను ప్రేమిస్తున్నానని అర్థం చేసుకుంటాడు. కాని భార్య పట్ల గల ప్రేమ, హేమ చూపిన ప్రేమను నిరాకరించేలా చేస్తుంది. ఈ నేపథ్యం లో ఒక సంవత్సరం తరువాత, భోరున వర్షం కురుస్తున్నా, తమ యింటికి ఎదురుగా నున్న పార్కు లోని రావి చెట్టు కాలిపోయినట్లు, ఆ చెట్టు నుండి ఎన్నో పాములు పారాడు తున్నట్లు, అందులో ఒక పాము తనకు ఎదురుగా వచ్చి హేమగా మారి ‘తాను ఇన్నాళ్లూ శాప వశాత్తు చెట్టుగా ఉన్నానని, తానిప్పుడు శాప విమోచన పొంది వెళ్ళి పోతున్నాన’ని చెప్పినట్లుగా, తాను కన్న కలనుండి మెలకువ రాగానే, ‘జీవితంలో ఏర్పడే అనుబంధాలు ఏర్పడుతూనే ఉంటాయి…. ఒక్కొక్క వ్యక్తి ఒక ద్వీపం, ఒక కోట, ఇతరులకు దుర్భేద్యం’ అని ఆలోచిస్తూ, హేమ తనను ఇప్పటికి మరిచిపోయి ఉంటుంది అంటూ సమాధాన పడతాడు నాయకుడు.

సావిత్రి అచ్చమైన మహిళ. భర్తకు ఏదో ఒక పనిని పురమాయిస్తూ ఉండటం, పిల్లలు లేరని చింత పడటం, పక్కింటి చిన్న పిల్లలను ముద్దు చేయడం, గజ్జి కుక్కను తుపాకితో కాల్చి చంపేశాడని డాక్టర్ ను నిందించడం, అదే డాక్టర్ తమ యింటిలోని నాగుపామును తుపాకీతో కాల్చేసినపుడు, అతడు చేసిన పని మంచిదే నని పొగడటం, అతడి తల్లి మరణించినపుడు అతడిపట్ల కరుణతో మెలగడం, అతడికి హేమతో వివాహం జరిపించ డానికి తాను పెద్దరికం వహించడం…. ఇటువంటి వన్నీ ఆమె భర్త దృష్టిలో బాలిశపు పనులు.

ఈ నవలలో డాక్టర్ వీరభద్ర రావుది ఒక విలక్షణమైన పాత్ర! ‘సాహసమూ, ధైర్యము లేనిది జీవితం లేదని, మూఢ విశ్వాసాలని, పాత అలవాట్లని వదిలించుకోవడమే సాహసమ’ని, అవసరమైన చోట హింస కూడా తపస్సుకు ప్రత్యామ్నాయమేనని, విప్లవం అంటే ఒక నూత్న సృష్టి అని, అది అనుకరణ ద్వారా వీలుపడదని… అతని అభిప్రాయం. స్వామీజీల విషయంలో నైనా, సాక్షాత్తు భగవంతుని విషయంలో నైనా ఈ నవలా నాయకునికి, డాక్టర్ కు ఏకాభిప్రాయం లేదు. ఇక భావనారాయణ నిమిత్త మాత్రుడు. డాక్టర్ పుట్టుకను గురించి తెలిసి, కట్నం ఇవ్వకుండా తన చెల్లెలు హేమకు డాక్టర్ తో వివాహాన్ని జరి పించాలని నారాయణ కోరుకుంటే, ఆమెను వివాహం చేసుకొని పుట్టింటికి పంపకుండా,కట్నం డబ్బులను వసూలు చేసికొన్న ఘనత డాక్టరుది. డాక్టర్ వాస్తవవాదిఅయితే నాయకుడు ఆర్ద్ర హృదయుడు. అతని దృష్టికోణం ప్రకారం డాక్టర్ కు నిజాయితీ లేదు. అదే డాక్టర్ దగ్గర తనను తాను పరీక్షించుకొని, తనకు సంతాన యోగం లేదు అని తెలిసికొన్న నాయకుడు, సావిత్రికీవిషయం ఎలా చెప్పాలి అని మధన పడుతున్నరోజులలో ఆమె గర్భవతి అన్న వివరం తెలిసి, తనలోని ఇన్నాళ్ల తాత్త్వికతను, సహనశీలతను, ఉదార గుణాన్ని…. అన్నిటిని మరిచి పోతాడు. తీరని ఆవేదనతో, సావిత్రికి ఖర్చులకు కావలసిన డబ్బును , బీరువాలో ఉంచి నాయకుడు ఇల్లు వదలి వెడతాడు.

పూనా లోని ఒక గురూజీ ఆశ్రమాన్ని చేరుకున్న నాయకుడు, ‘ ఆత్మ, ఆత్మాన్వేషణఅంటే, “శరీరము మనస్సు ఏర్పరచుకున్న కృత్రిమ బంధాలనుండి విముక్తిని పొందినపుడు, ఆత్మ స్వయం ప్రకాశితమవుతుంది” అని గురూజీ చెప్పిన మాటలు నచ్చినా, ఆ ఆశ్రమ వాతావరణం, అక్కడి హద్దుల్లేని స్వేచ్ఛా నచ్చక అదే ఆశ్రమం లోని ఒక చిన్న గదిలోనికి మారాడు. వారం రోజుల పాటు తీవ్ర మైన జ్వరం వచ్చినపుడు, తనకు సేవ చేసిన అమృత అన్న పంజాబీ మహిళలో దేవతను చూశాడు… విడాకులు తీసుకున్న ఆమె తన కుమారుడిలోనే తన ఆనందాన్నివెదుక్కుంటోదని తెలిసి, సావిత్రిని గుర్తుచేసుకుంటాడు. కలకత్తాలో అమీయబాబా ఆశ్రమం ఉందని తెలుసుకొని అక్కడకు వెడతాడు. ఎన్నెన్నో మానసిక సంఘర్షణల మధ్య నలిగిన నాయకునికి, యథాస్థితికి రావడానికి చాలా సమయమే పడుతుంది. చివరికి, “ అద్వైత స్థితికి లక్షణం మరొకరి అహంతలోకి ప్రవేశించడం కాదని, నిర్లిప్తంగా, సాక్షీభూతంగా, స్వేచ్ఛగా ఉండటమే ఆ స్థితి అని అర్థం చేసుకుని, బాబాతో తన మనోవ్యధను చెబుతాడు. తనలో తాను పరివర్తన పొంది, ఆ ఊర చేయించుకున్న పరీక్షలలో, తనలో ఏ లోపమూ లేదని తెలిసి ఆశ్చర్య పోతాడు. జరిగిన తప్పిదాలను గూర్చిన తర్జన భర్జనలు దుఃఖాన్ని పోగొట్టజాలవని, ఇంటికి తిరిగి వెళ్లమన్న బాబా మాటలవలన ఇంటికి తిరిగి వస్తాడు.

ఇల్లు వదిలిన దగ్గరనుండి మళ్ళీ ఇంటికి చేరేదాకా సాగిన ఈ పయనంలో, స్వేచ్ఛాయుత శృంగారం మాత్రమే వ్యక్తి స్వేచ్ఛకు పరిధి కాదని , మానసిక స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛకు అర్థమని గ్రహిస్తాడు. దేనిమీదైనా అపరిమితమైన అనుబంధాన్ని పెంచుకోక పోవడం కూడా దుఃఖాన్ని దూరంగా ఉంచే మార్గమని తెలుసుకుంటాడు. పంజాబీ యువతి అమృత మరణం తరువాత, ఆమె కొడుకును, అతని తండ్రి కోర్టు ద్వారా, పూనా ఆశ్రమం నుండి స్వాధీనం చేసికోవడం చూసి, ఎవరి తలరాతలను ఎవరూ నిర్థారించలేరని, వ్యక్తి తనకు తానే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఎదగడమె జీవిత లక్ష్యమని గుర్తిస్తాడు. జీవితానందం ఎక్కడో లేదనీ, జీవితాన్ని తాను చూసే సమ్యక్ దృష్టిలోనే నిబిడీకృతమై ఉందని తెలుసుకుంటాడు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనీ, దానిని తామే వెదుక్కోవాలన్న సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. నాణేనికి బొమ్మా బొరుసూ ఉన్నట్లే, ప్రతి పనికీ మంచి, చెడు అన్న రెండు పార్శ్వాలు ఉంటాయని, అది చూసే వారి దృష్టి పై ఆధారపడి ఉంటుందని గ్రహిస్తాడు. ఈ నవలలో రచయిత, అద్వైత సిద్ధాంతము, గీతా తత్త్వము, జిడ్డు కృష్ణమూర్తి తాత్త్వికత, ఫ్రాయిడ్ సిద్ధాంతాలతోబాటు, అస్తిత్వవాదాన్ని కూడా చర్చించారు. మనసు సక్రమమైన దారిలో నడవనంత వరకు ప్రతి విషయమూ దుఃఖహేతువు గానే మారుతుందని, సానుకూల దృక్పథాన్ని మనసుకు నేర్పినపుడు మాత్రమే ఏ విషయాన్ని అయినా సమగ్రంగా దర్శించగలమని ఈ నవల చెబుతుంది. అప్పుడు మాత్రమే, గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్లు, నిజమైన సత్యమేదో దానిని గ్రహించ గలమని చెబుతుంది. ఆనందానుభూతికి కారణ మయ్యే స్పర్శ, మనుష్యుల మధ్య స్నేహ వాత్సల్యాలను పెంచగలదని, దుఃఖ నివారక శక్తిగా పనిచేయగలదని, మానవతకు చిహ్నమని చెబుతుంది.

ఈ పుస్తకం ముఖ చిత్రం పుట మీదనే, గజం మిథ్య-పలాయనం మిథ్య అన్న వాక్యం ఈ నవల సారాంశాన్ని చెబుతోంది. ఏదో జరిగిందన్న అనుమానంతో, పలాయనం చిత్తగించిన నాయకుని మనస్సు, ఎందరెందరో విభిన్న వ్యక్తులను కలుసుకోవడం, ఎన్నెన్నో విభిన్న సంఘటనలను ఎదుర్కోవడంతో బాటు బంగ్లాదేశ్ విభజన సమయంలో బెంగాలుకు చేరుకున్న కాందిశీకులకు చేసిన సేవ … వంటి వాటితో బాటు అమీయ బాబా సాంగత్యం వలన కూడా సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకున్నది. “అన్నమైతే నేమిరా మరి సున్నమైతే నేమిరా / అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా” అన్న ఈ నవలా ప్రారంభమే, పైనున్న వాక్యానికి తోడు మరికొంతగా కథలోని అంతరార్ధాన్ని చెబుతున్నది.

అంతే కాదు.. నవల ప్రారంభానికి ముందు, రచయిత, జెన్ బౌద్ధం నుండి రెండు గాథలను, ఆస్ట్రియాకు చెందిన, రెయినర్ మరియా రికీ కవితను ఒకదానిని ఉటంకించడం జరిగింది. ఈ మూడు ఉటంకింపులనుండి కూడా ఈ నవల చెప్పే అంశాన్ని గ్రహించవచ్చు.
‘” ఈ శరీరమే బోధి వృక్షం
మనసు ఒక ప్రకాశవంతమైన అద్దం
అద్దాన్ని నిరతమూ శుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసికో
ఎటువంటి దుమ్మూ చేరనీయక చూసుకో”
అని రాయబడిన గాథకు మరునాడు జెన్ బౌద్ధ శాఖ కు చెందిన 16వ గురువు,
“బోధి వృక్షమూ లేదు
ప్రకాశవంతమైన అద్దమూ లేదు
ప్రధానంగా ఏదీ లేనపుడు
దుమ్ము ప్రసక్తి ఎక్కడిది? “…అని పూరిస్తాడు.

అంతా మిథ్యే అయినపుడు దుఃఖమెక్కడ? అన్న బౌద్ధ శూన్యవాద తత్త్వాన్ని, ఈ గాథ చెబుతూ ఉంది!

అలాగే, “ అంతర్లోకాల స్థలావకాశం, అన్ని
జీవరాశుల్లోనూ సమానంగానే ఉంటుంది. పక్షులు, నింపాదిగా ఎగురుతూ, యింకా ఎగురుతూ మనలను దూసుకొని పైపైకి పోతుంటాయి. బయట చూస్తున్న వృక్షం లా ఎదగాలనుకున్న నేను మాత్రం నాలోనే ఒకవృక్షాన్ని పెంచుకుంటాను” అన్న, రికీ మాటల వలన, మనిషి ప్రతి విషయాన్ని ఎంత భారంగా మనసులో మోస్తాడో కదా అన్న విషయం సూచింపబడుతూంది. అంటే, ఏమీ లేని విషయాల పట్ల కూడా, ఏవేవో ఊహించుకుని మనిషి తన బ్రతుకు నెంత భారం చేసుకుంటున్నాడో అన్నదే ఈ నవల చెప్పే సారాంశం!

ఈ నవల నాయకుడు, బెంగాలీ రచయిత శరత్ చంద్ర శ్రీకాంత్ ను తలపింప జేయడాన్ని కూడా మనం గమనింపవచ్చు! రాజ్యలక్ష్మి పట్ల ఎంత ప్రేమ ఉన్నా, నిర్లిప్తమోహనంగా జీవితాన్ని గడుపుతుండిన శ్రీకాంత్ కు జీవితమంటే ఏమిటి అన్న విషయం బృందావనంలో అవగాహనకు రాగా, మన నాయకునికి, అమీయబాబా ఆశ్రమంలో జీవితం పట్ల అవగాహన ఏర్పడుతుంది.(ఇంకా ఈ రెండు నవలల్లో సమానంగా కనిపించే పెక్కు అంశాలు మరొక వ్యాసానికి సరిపడే టంతగా ఉన్నాయి) భారత దేశం లో ఏ ప్రాంతంలో నున్న వారిలో నైన కనిపించే, సాంస్కృతిక మనోభావాల లోని సమానతను స్మరించడానికి మాత్రమే ఈ పోలిక!

ప్రతి మనిషి తనలోని ద్వైధీభావనలను తొలగించుకొని, ఏకీకృతమైన సమ్యక్ నిర్ణయానికి రావడమే అద్వైత సిద్ధాంత లక్షణమన్నదే ఈ నవల యిస్తున సందేశం. దానికి కావలసిన మానసిక పరిపక్వతను సాధించడమే మన కర్తవ్యం అని చెప్పడమే ఈ నవల ప్రధాన ఉద్దేశం.

డా. రాయదుర్గం విజయలక్ష్మి

డా.రాయదుర్గం విజయలక్ష్మి గారు  కొత్తగూడెంలో తెలుగు లెక్చరర్ గా  పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారు. మద్రాస్ యూనివర్సిటీలో బౌద్ధం మీద PhD చేసి డాక్టరేట్ పొందారు. గతంలో  'ఆధునికాంధ్ర కవిత్వంపై బౌద్ధమత ప్రభావం' పుస్తకం వెలువరించారు. వీరి రేడియో ప్రసంగాలను  'పొరుగు తెలుగు బతుకులు' పేరుతొ క్రిష్ణగిరి రచయితల సంఘం వారు ప్రచురించారు. చెన్నపురి రచయితల సంఘం వారు ప్రచురించిన 'మదరాసు బతుకులు' కథల పుస్తకానికి సహ-సంపాదకత్వం వహించారు. మిసిమి, పాలపిట్ట, సాహితీ స్రవంతి వంటి పత్రికలలో అనేక సాహిత్య విమర్శ  వ్యాసాలు ప్రచురించబడ్డాయి.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *