రష్యా నుంచి ప్రేమతో

Spread the love

మిత్రుడు కుమార్ కూనపరాజు కొందరు మిత్రులతో కలిసి 2018లో ఓ పది రోజులు రష్యా యాత్ర చేశాడు.
కుమార్ రష్యాలో ఏం చేశాడు?
టాల్ స్టాయ్ ఇల్లు చూసాడు, ‘రిసరక్షన్’ రాసిన టేబుల్ ముట్టుకున్నాడు. ఆ గదిలో ఆ కిటికీ నుండి బయటకు చూస్తే కనిపించే పొడుగైన చెట్ల ఉద్యానవనాన్ని చూసాడు. అన్నాకెరినినా ని తలచుకున్నాడు. పుష్కిన్ ఇల్లు చూశాడు. ‘ఇస్పేటు రాణి’ నవలికను గుర్తుచేసుకున్నాడు. చెకోవ్ సమాధి చూసాడు. మౌనంగా మనసులో రోదిస్తూ ఆ మహా రచయితను స్మరించుకున్నాడు. మయకోవ్ స్కీ సమాధి చూసాడు. ‘ ఇదే అదను లెనిన్ కథను రచించెదను నేను లెనిన్ బ్రతుకు జనం కొరకు ధ్వనించెదను నేను ‘ అన్న శ్రీశ్రీ అనువాద లెనిన్ కావ్యాన్ని గుర్తుచేసుకున్నాడు. దొస్తయేవ్ స్కీ ని జైలులో వుంచిన గదిని చూసాడు. లెనిన్ సమాధి చూడలేక పోయినందుకు బాధపడ్దాడు. వీర వనిత జోయా గురించి ఇలా పలవరించాడు
“అదిగో వీర వనిత జోయ! ఆ శిల్పం అపురూపంగా ఉంది. ఆ త్యాగమయి సమాధి వద్దకు వచ్చి కూర్చుని, చేతులు ఆనించి, “క్షమించు జోయా!”అని మానవాళి తరపున క్షమాపణలు చెప్పుకున్నాను.
జోయా – (13 సెప్టెంబర్ 1923 – 29 నవంబర్ 1941)
నాజీ జర్మనీ ఆక్రమణకు వ్యతిరేకంగా గ్రామాలలో నిర్మించబడిన యువ కమ్ సోమాల్ సభ్యురాలిగా వుండి ప్రతిఘటించింది. జర్మన్ సైన్యానికి చిక్కిన జోయాను, చిత్రహింసలు చేసి, చంపి గ్రామం నడిబొడ్డులో వారాలపాటు వ్రేలాడదీశారు. ఆమె త్యాగానికి ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటికి ఆమె వయస్సు 18 సంవత్సరాలు.
హీరో అఫ్ సోవిట్ యూనియన్ , ఆర్డర్ అఫ్ లెనిన్ అవార్డులు ఇచ్చి ప్రభుత్వం గౌరవవించింది. ఆమె త్యాగన్ని గుర్తుంచుకోవడానికి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు కుటుంబాలలో పిల్లలకు ఆమె పేరు పెట్టుకున్నారు”. సోవియట్ సాహిత్యకారుల ఇళ్లని, సమాధులను, మ్యూజియంలను, విగ్రహాలను చూసి వారి సాహిత్యసృజనను గుర్తుచేసుకుని కలవరించి పలవరించాడు. వారికి నివాళులు అర్పించాడు. ఇది విహార యాత్ర కాదు సాహిత్య యాత్ర.
పీటర్స్ బర్గ్ లో హెర్మిటేజ్ మ్యూజియం ను చూసి ఇలారాసాడు.”మ్యూజియం ముఖద్వారము చేరాము. ఎలీనా(గైడ్) తల్లి మా కోసం టిక్కెట్లు తీసుకుని ఎదురు చూస్తోంది. మాకు ఆశ్చర్యం వేసింది. ఏలినాకు,ఆమె తల్లికి కూడా కృతజ్ఞతలు చెప్పాము. అక్కడ వేల మంది చైనా టూరిస్టులు లైన్ లలో ఉన్నారు. జనం సమూహాలుగా, ప్రవాహాలుగా లోపలికి పోతున్నారు. మొదటి కోట ఎంతో అందంగా ఉంది. అక్కడ మెట్లు ఎక్కి పై స్టైర్ కు వెళ్ళాము. ఇక ఈ రాజప్రాసాదం గురించి వర్ణించలేమని అనిపించింది. మేము కలలో కదులుతున్నట్లుగా అనిపించింది. అక్కడ శిల్ప సౌందర్యం, పైన మిద్దె పైన కళాఖండాలు , పెయింటింగ్స్, ,అన్ని ప్రక్కలూ రాజమహల్ వెలుగులు చిమ్ముతున్నాయి. మరో హాల్ లో, ఆఖరి జార్ నికోలస్ -2 అధిరోహించిన సింహాసనం కనిపించింది.అప్పుడే  జాన్ రీడ్ వ్రాసిన ‘ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పది రోజులు’ పుస్తకం గుర్తుకు వచ్చింది. పీటర్స్ బర్గ్ లో జరిగిన రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవ సంఘటనలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. రష్యాలో పల్లెల నుంచి వచ్చిన  విప్లవకారులు  1917 విప్లవకాలంలో జార్ కోటను ఆక్రమించుకున్నాక రాజాసౌదాన్ని …చూచి నిశ్చేష్టులైపోయారు. విప్లవకారులకు లెనిన్ చెప్పారు,”భవనాలు రాజప్రాసాదాలు,రష్యన్ పేద ప్రజల రక్త మాంసాలతో కట్టబడ్డాయి. వేటినీ పాడు చేయకండి. వీటిని మన ముందు తరాల వారికి చూపించాలి. మహారాజు,పేద ప్రజల ఉసురు తీసుకుని ఎంత దర్పంగా బ్రతికాడో వాళ్ళు తెలుసుకోవాలి”అని అన్నారు. ఆ మాటలు మాకు గుర్తుకు వచ్చాయి.”
.  చివరిగా ఎయిర్పోర్ట్ కు వెళుతూ డ్రైవర్ నికిత మాట్లాడిన మాటలు వినాల్సిందే. “ఓ సారి కారులో నికితాను గురించి విశేషాలు అడిగాను. అతను ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. డ్రైవర్ గా ఓ ట్రావెల్ కంపెనీలో పని చేస్తున్నాడు. నిండా 20 ఏళ్ళ  వయసు ఉంటుందేమో! ప్రైవేటుగా పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తను విడిగా ఓ రూమ్ లో ఉంటున్నాడు. రూమ్ అద్దె కావాలి,ఫీజులు, ఇతర ఖర్చులకు కనీసం నెలకు 40 వేల రూబుల్స్ కావాలి అన్నాడు. మరి వస్తున్నాయా అని అడిగా. “ఆ…. ఒకోసారి వస్తున్నాయి, ఓవర్ టైమ్ చేస్తున్నాను”అన్నాడు. కమ్యూనిస్ట్ విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయాక నేను పుట్టాను. స్వేచ్చ, ప్రజాస్వామ్యం, కావాలని అనిపించింది. కానీ ఇప్పుడు రష్యాలో ఉన్న ప్రజాస్వామ్యం నీచమైనదని అనిపిస్తున్నది. ఇప్పుడు, ఇక్కడ ఓ హత్య చేస్తే డబ్బు ఉంటే రాజాలా బయటకు రావచ్చు. అంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యం కాదనిపిస్తుంది. ఇక్కడ, పీటర్స్ బర్గ్,మాస్కో లలో బాగానే సంపాదించవచ్చు. కానీ చుట్టుప్రక్కల పట్టణాలు, పల్లెటూర్లు సమీపంలో లేవు. యువకులు నిరాశలో మునిగి “మందుకు”బానిసలవుతున్నారు. చాలామంది యాభై సంవత్సరాలకే చనిపోతున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం కదా!అన్నాడు. కానీ నేను ఇంజనీర్ అయ్యి కొంచెం మంచి జీవితాన్ని సాధించగలనన్న నమ్మకం కలిగింది. కమ్యూనిస్ట్ పతనం తరువాత వచ్చిన అరాచకం కొంత తగ్గి ఇప్పుడు స్థిరమైన ఆర్థిక వ్యవస్థతో రష్యా పురోగమిస్తుందనిపిస్తుంది. ఈ యువత,యువకుల కళ్ళల్లో ,ఆనందం ,ఉత్సాహం మాకు స్పష్టంగా కనిపించింది. “రష్యా నెవర్ స్టాప్స్”అని మాకే గట్టిగా నమ్మకం ఏర్పడింది. “
కుమార్ రష్యా నుండి తిరిగివచ్చాక ఏం చేశాడు?
కుమార్ రష్యా సాహిత్య యాత్ర ఇచ్చిన ఉత్తేజంతో ఒక కొత్త సోవియట్ అనువాద ఉద్యమం మొదలుపెట్టాడు. వ్యక్తిగా ప్రారంభించి సమూహాన్నీ కూడగట్టాడు అచ్చం సమిష్టి వ్యవసాయ క్షేత్రంలా. ఇది సమిష్టి సాహిత్య క్షేత్రం.  ‘ఉదయిని’ పక్ష పత్రిక ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. నా సహకారంతో తెలుగులో వచ్చిన టాల్ స్టాయ్ సాహిత్యాన్ని సేకరించాడు. సాహితి లక్ష్మితో మాట్లాడి వాటిని పునర్ముద్రణ చేయించాడు. కుమార్ తన సొంత డబ్బు అనువాదకులకు చెల్లించి  రష్యన్ సాహిత్యాన్ని అనువాదం చేయిస్తున్నాడు. కరమజోవ్ సోదరులు, చెకోవ్ కథలు1, 2 , దోస్తయవ్ స్కీ ఇడియట్ ఇలా వచ్చిన గొప్ప పుస్తకాలు.  ఇవి ఒక్కోటి దాదాపు 500 నుండి 1000 పేజీల బృహత్ గ్రంథాలు. అరుణా ప్రసాద్ అనువాదం చాలా బాగుంది. మైఖేల్ షోలకోవ్ ‘డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది’,  చెకోవ్ కథలు 3 వ భాగం, టాల్ స్టాయ్  ‘రిసరక్షన్ ‘ కొత్త అనువాదం ‘చిగురించిన వసంతం’, గోగోల్ కథలు మొదలైన రచనలు… క్యూలో వున్నాయి. కుమార్ ఈ డబ్బుతో మరో యాత్ర చెయ్యొచ్చు లేదా మరో దేశం చూడొచ్చు. కానీ ఆ రష్యన్ మహా రచయితల మీద ప్రేమతో, గౌరవంతో ఈ అనువాద యాత్ర చేస్తున్నాడు.  అందుకే కుమార్ గారు అంటే నాకు బోల్డంత ప్రేమ. ఈ పుస్తకాన్ని గిరిధర్ అరసవల్లి అద్బుతంగా డిజైన్ చేశారు. ఇది ఒక అందమైన ఫోటో ఆల్బం. తక్కువ మాటర్, ఎక్కువ బొమ్మలు, రంగుల బొమ్మలతో ఆర్ట్ పేపర్ మీద చక్కటి ముద్రణ. బుక్ చాలా బాగా వచ్చింది. మిత్రులు కుమార్ గారికి అభినందనలు. ఈ పుస్తకంలో రష్యన్ రచయితల, వారి సమాధుల, పుస్తకాల, మ్యూజియంల బొమ్మలు చూడటం కనులకు పండగ. అంత క్వాలిటీగా ముద్రించారు. పుస్తకంలో కాగితాలు తెల్ల గులాబి రెక్కల్లా అందంగా సుకుమారంగా వున్నాయి. ఈ పుస్తకం చదివాక, బొమ్మలు సుతారంగా తడిమి చూసాక.. నాకూ ‘ రష్యా సాహిత్య యాత్ర ‘ చెయ్యాలనే కోరిక బలంగా కలిగింది. కుమార్ గారూ..మరి రష్యా మరలా ఎప్పుడు వెల్దాం? రష్యాకి మనతో పాటు యేయే మిత్రుల్ని తీసుకెల్దాం? 
.
రష్యా నుంచి ప్రేమతో
రచయిత: కుమార్ కూనపరాజు
వెల: 350 రూ
ప్రతులకు: సాహితీ ప్రచురణలు, విజయవాడ
0866- 2446643
9849992890

అనిల్ బత్తుల

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *