ఒక జీవితం అనేక పార్శ్వాలు

Spread the love

ఓ మనిషి జీవితం లో అనేక పార్శ్వాలు కలిగి ఉంటాయి. . సీమ ప్రాంతంలోని భాషా ప్రాతిపదికన నిర్మితమైన కథలు ఇవి.. అడవాల శేషగిరి రాసిన (అశేరా )ఈ పుస్తకంలో ఒక ప్రాంతంలో నివసించే జీవన విధానాన్ని, పరిస్థితుల ప్రభావాన్ని,  వివరిస్తూ.., చిన్ననాటి ఎలిజీలను, స్నేహ పరిమళంలోని మాధుర్యాన్ని, స్వీయ అనుభవంలోని  సునిషితమైన చూపుతో, తన చిన్ననాటి కబుర్లు మనతో పంచుకుంటూ

 అశేరా తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను వివరిస్తూంటే,

ప్రతి కథలో ఒక కథాంశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అతని కలం.

   స్థానికతకు ప్రాముఖ్యతనిస్తూ పాతూరు చెరువు కట్ట కాడ ఉండే జీవన విధానాన్ని నేటివిటీని ప్రతిబింబిస్తూ  అక్కడ మనుషులు మనతో వారి ప్రాంతీయ భాషలో మాండలికంలో మాట్లాడుతూ ఉంటారు.

 ఈ కథలన్నీ పూర్తి మాండలిక భాష ప్రయోగం అనవచ్చు. ఎవరి భాష వారికి ఇంపు అన్న సామల సదాశివ గారి మాటల్ని గుర్తు చేస్తాయి ఈ కథలు.

 అశేరా చిన్ననాటి ఊసుల నుండి మొదలు పెడతాడు తన కథల్లో.. 

       తన బాల్యం, ఆ బాల్యంలో చిగురించిన స్నేహాలు, ఆ స్నేహాలు ఎవరితో ఎక్కడ వరకు ప్రయాణించేలా చేశాయి.  ఎవరెవరు ఎలా తన జీవితంలో మార్పులు తీసుకుని వచ్చారు.  ఏ పరిస్థితులు తన మనసుపై ఎక్కువ ప్రభావాన్ని చూపించాయో..,  చెప్తూనే అంతర్లీనంగా ప్రతి కథలో  ఓ అంశాన్ని తీసుకొని ఆ అంశానికి తన చుట్టూ ఉన్నవారి జీవితాల్లో జరిగిన సంఘటనలను తీసుకుని కథాని బిగువుగా  నడిపిస్తాడు. ఇతరులు చెప్పేది కథ మనకి మనమే రాసుకునేది చరిత్ర అని చెప్పే అశేరా కథల్లో ఏముంటాయి?.

       మనిషిగా తాను ఎదుగుతూ,  తన చుట్టూ పరిసరాలనే గమనిస్తూనే ఎలాంటి మార్పులు సంభవించాయి. పరిసరాల పరంగా,  మనుషుల్లో ఏ పరిస్థితులు ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి. ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సరిగ్గా నడుపుకోలేకపోయారు.  వివరించే ప్రయత్నం చేస్తాడు. ఈ కథల్ని ఉన్నట్టుండి ఏదో తన ప్రయాణంలో గుర్తొచ్చినట్టుగా చెప్పినట్టుగా ఉండదు.

     కథకుడి ప్రత్యేకత కథ ఎత్తుగడ, నడక ముగింపు గురించి మాట్లాడుకోవాలంటే  సదరు వ్యక్తిని తీసుకొని కథ మొదలు పెడతాడు ఆ కథలోని ఆ పాత్రతో సంబంధం కంటే కథను నడిపించే మార్మిక మైన నీతి ఉంటుంది. కొన్ని అతిథి పాత్రలు వస్తూ ఉంటాయి . కొన్ని పాత్రలు సమాప్తం అయిపోతూ ఉంటాయి . ఈ పాత్రలు ఎందుకొచ్చాయి ఎందుకు వాటి గురించి మాట్లాడాడు కథకుడు అన్న సంగతి  కథ ముగింపు దశకు వచ్చాక కానీ ఇంతసేపు కథకుడు చెప్పిన విషయం పట్ల మనకు పూర్తి అవగాహన దొరుకుతుంది.

ఒక కథలో లోభి ఎలా ఉంటాడో, వాడి జీవనం ఎలా మార్పు చెందుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. లోభి లక్షణాలు అన్నిటిని ఎవరెవరిలో ఉన్నాయో వెతికి మరీ ఆ ప్రాంతంలో తాను ఎవరెవరిలో ఇటువంటి లక్షణాలను చూశాడో, అందరి గురించి వివరిస్తాడు. అందుకు ఒక పాత్రని ఎంచుకుంటాడు,  అతని చుట్టూ ఉన్న మనుషుల మానసిక బలాన్ని బలహీనతలను వివరిస్తాడు.  ప్రలోభాలకు ఎలా లొంగుతారో చూపెడుతూనే,  తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చివరాఖరికి స్పష్టం చేస్తాడు.

 దొంగతనం అనేది ఎంతటి చెడుపు తెస్తుందో చెప్పడానికి అనేక ఉదాహరణలను ఇస్తూనే ఆ ఉదాహరణల్లో మనుషుల నడవడిక,  గమనము,  పడిన కష్టాలను వివరిస్తూనే అలా ఉండకుండా ఉండి ఉంటే వాళ్ళ జీవనం బాగుండేది కదా అనిపించేలాగా ఆ కథని మలుస్తాడు.

‘కాంతి పుంజం’ కథలో మానవత్వానికి మించిన మిత్రుత్వం లేదని చెప్తూనే, ఒక స్త్రీకి చివరాకరి దశ వచ్చేసరికి కొడుకులు ఎలా చూస్తారో, ఆ తల్లిని ఎలా వదిలించుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడతారో నానారావు పాత్ర ద్వారా వివరించాడు.. ఎదుటి వ్యక్తిని ఆశపెట్టి ఎలా పనులు ముగించుకుంటూ ఉంటారో, చెప్పని కులం పోకడను,  కులం తీసుకుని వచ్చిన అంటూ రోగాన్ని ముత్యాలు పాత్ర ద్వారా చాలా చాకచక్యంగా వివరించి చెప్పాడు.

 ఆర్థిక క్రమశిక్షణ లేనివాడు ఎటువంటి కష్టాలను అనుభవిస్తారో ఆర్థిక కట్టుబాట్లను నిర్మించుకోవలసిన అవసరాన్ని  వివరిస్తూనే

 బాల్యం నుంచి ఆర్థిక కట్టుబాట్లు ఎంత అవసరమో,  ఒకవేళ ఆర్థిక కట్టుబాట్లు లేని పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో,  వాళ్ళ జీవనం ఎట్నుంచి ఎటు ప్రయాణిస్తుందో,  అలా లేనప్పుడు మనుషుల్లో వచ్చే మార్పులు.  ఆర్థిక భద్రత ఇచ్చే భరోసాని మానవీయంగా జన ప్రియంగా చెప్తాడు.

     కులం పోకడ, మనుగడ ఎరగని చంటి పిల్లాడి నడక గురించి మాట్లాడతాడు. ఆ నడత మారడానికి గల కారణాలని వివరిస్తాడు. కులం పోకడలో కొట్టుకొని పోయే రాజ్యాధికారం గురించి మాట్లాడాడు కానీ చిన్నోడిగున్నప్పుడు గాయపడ్డ మనసు నొప్పి పెద్దయ్యాక కూడా వెంటపడి తిరిగింది అని చెప్పడం ‘మెడబట్టి’ కథలో ప్రామాణికం.

 కనకమ్మోరు కథ చెప్తూ గుడి లోపల కి వెళ్లొచ్చే బతుకుల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటే, గుడి బయట ఉన్నోళ్ల బ్రతుకుల్లో క్షయరోగం వచ్చిన మాదిరి అంతకంతకు బతుకులు ఈనంగా మారుస్తుంది. అని వాపోతాడు నలభై ఏళ్ళ క్రితం నాటికి ఈనాటికీ ఆ బ్రతుకుల్లో మార్పులు ఏమీ లేవని చింతిస్తాడు.

 50 పైసలు దాచుకోవడంలో ఉన్న కష్టాన్ని చెప్తూనే,  దానిని ఒకరికి సాయం చేసే సందర్భం వచ్చినప్పుడు మనసు చెందిన కలత, దిగులుపడ్డాక మిగుల్చుకున్న స్నేహం. జీవితంలో ఒ అడుగు ముందుకు వేయడానికి సహకరించినందుకు స్నేహాలు తెచ్చే మార్పులు. మంచి  నడవడికకు రూపాలని చెప్పడానికి ప్రయత్నించారు.

 కోతి పీరాగాని పెండ్లి, నజర్ కి అండే… చదువుతున్నంతసేపు నవ్వొస్తుంది విషయం తెలిసాక మాత్రం కథకుడు చెప్పాలనుకున్న మూల అంశం మనకు అర్థమవుతుంది. దిష్టి తీయడాలు, ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే చేతబడులు చేశారంటూ ప్రాణాలు పోయేంతవరకు నమ్మిక పట్టడం, పోయిన ప్రాణాలు తెచ్చుకోలేక పడ్డ తిప్పలు గురించి చాలా స్పష్టమైన అవగాహనతో ప్రజల్లో ఉన్న మూర్ఖత్వాన్ని విమర్శనాపూర్వకంగా “ఆయం పాటు” కథలు లవుడి ప్రాణం పోయినందుకు కారణమైన ఈ మూర్ఖత్వాన్ని ఎండగడతాడు.

   మన ఇంట్లోనే మన సావాసగాళ్ల మధ్య కొందరు మొహం కప్పుకొని ముసుగులతో తిరుగుతూ ఉండే దొంగలు ఉంటారు ఎంత నమ్మిక తో ఉంటారో “దొంగ బీగం” కథ ద్వారా చెప్పుకోస్తాడు.

 మంపరం, ఫ్రెండ్షిప్ గిఫ్ట్ కథలు చదువుతున్నంత సేపు ఓ క్రైమ్ నవల చదువుతున్న ఎఫెక్ట్ ఉంటుంది. స్నేహితులు చేసే మోసాలు ఆర్థిక పరమైన కట్టడి లేనప్పుడు కుటుంబాల విచ్చిన్నం గురించి మాట్లాడుతూ నేర ప్రవృత్తి కలిగిన వాడు ఎప్పటికీ మారడని రుజువు చేస్తాయి ఈ కథలు.

 అయితే ఈ పుస్తకం నిండా భాష మాత్రం కడుగడ్డుగా ఉంటుంది. సీమ ప్రాంత వాసులకు మాత్రమే సొంతమైన పదాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. అంతేకాకుండా ప్రజలభాష గా మాట్లాడే ప్రతీ పదాన్ని తీసుకొని వచ్చి ఈ కథలో జత చేయడం ఈ పుస్తకం ప్రత్యేకత. నాకు కాస్త ఆ భాషతో పేచీ ఉంది అందుకే అంత గడ్డుగా అనిపించి ఉండొచ్చు. నచ్చేవారికి నచ్చొచ్చు రీడర్ ఛాయిస్.

 అభినందనలు అడవాల శేషగిరి గారు.

                              14-may-26

పుస్తకం: చెరువు కట్ట కాడ సుద్దులు

 రచయిత:అడవాల శేషగిరి గారు.

 పబ్లికేషన్స్: ఎన్నెలపిట్ట

Rupa Rukmini

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *