“సోవియట్ క్లాసిక్స్” అని పేరున్న ఈ చిన్న పుస్తకంలో ఎనిమిది కథలున్నాయి. తెలుగునాట సోవియట్ సాహిత్యానికి గల ప్రాచుర్యం మనకు తెలిసిందే. ప్రపంచంలో ఏ భాషకూ తీసిపోని సాహిత్యం సోవియట్ సొంతం. ఒకప్పుడు అక్కడి సోషలిస్టు ప్రభుత్వం ముద్రించి పంపిణీ చేసిన ఆ పుస్తకాలను అందులోని సోషలిస్టు రియలిజాన్ని మిగతా ప్రపంచం ఆసక్తిగా గమనించింది. అది మానవ అస్తిత్వాన్ని గురించిన అనేక మానసిక తాత్విక ప్రశ్నల్ని లేవనెత్తింది. అందుకనే ఇప్పటికీ ఆ పుస్తకాలు సాహిత్య క్లాసిక్స్‌గా నిలిచి పోయాయి.
ఆ రచయితలు కూడా గొప్ప పేరున్న వాళ్లు కారు, మనిషివైపు శ్రమ శక్తీవైపు నిలబడటం వల్ల ఈ కథలు గొప్పవి అయ్యాయి. ఈ పుస్తకంలోని రచయితలను చూడండి పర్వత ప్రాంతాల ఒక ఆర్మేనియా రచయిత, పేరు కూడా తెలియని సొంత లిపి కూడా లేని చూక్ చ జాతి వాడు రాసిన కథ, బాల్టిక్ సముద్రం తీరప్రాంత లాత్వియా లోని పేద రైతు బిడ్డ రాసిన కథ, కాకస్ పర్వత సానువుల వెచ్చని నల్ల సముద్ర తీర ప్రాంత అబోహాసియా వాసి రాసిన కథ. అసలింత వైవిధ్య భరిత కథా సాహిత్యాన్ని మనమెప్పుడైనా గమనించామా? మనకిప్పుడు తెల్సిన సబ్అల్ట్రన్ పదానికి అర్థమే లేని ఆ కాలంలో వెలువడిన కథలివి. సోషలిస్టు ప్రభుత్వం ప్రచురించిన కథలివి.
జీవితంలో శ్రమ నిరంతర భాగమైన చోట ఇలాంటి కథలే వెలువడుతాయి. వీటికి ఒక రూపు ఉండదు, కథ ఇలాగే ఉండాలన్న సాంకేతిక సమస్య లేదు. ఆ జీవన సమరానికి చెందిన చిత్రణ మాత్రమే ఉంటుంది. అందులోని వాస్తవిక చిత్రణే కథగా మనముందు నిలుస్తుంది. ఆ పాత్రలన్నీ మనముందు తిరుగాడే మనుషులే. తాత్విక దృక్పథానికి లింగ వివక్ష, వర్గ వివక్ష ఉండదు కేవలం జీవన సారం ఆ ఆలోచనా ధారకు ఆధారం. నైతిక ప్రమాణాల చర్చే కాకుండా సమాజం పట్ల వైయక్తిక భాద్యతను మన ముందుంచి చర్చించమనే పాత్రల సమాహారమే ఈ కథలు.
యూరీ రితేవు రాసిన కథలో ఒక పాత్ర ఇలా అంటుంది “నాకు కథలు అల్లడం రాదండీ, నా కథలన్నీ కూడా మా అమ్మాయి నాకు చెప్పిన వాటి మీదే ఆధారపడి ఉంటాయి, ఈ కథలు జీవితానికి దగ్గరగా ఉంటాయి కనుక మా ఇరుగు పొరుగు వాళ్ళు ఈ కథలు వినడానికి చెవి కోసుకుంటారు” ఇంతకు మించి చెప్పడం కంటే మీరే చదివి చూడండి.ఈ పుస్తకం టైపింగ్, ఎడిటింగ్ చేసి సహకరించిన దామరాజు నాగలక్ష్మి గారికి కృతజ్ఞతలు.