మొత్తానికి గోర్కీ ఆత్మకథ మూడు భాగాలు కలిపి ‘నా జీవిత కథ’ గా ఒకే పుస్తకంగా చూడటం ఇన్నేళ్ళకి సాధ్యపడింది. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల క్రితం మాస్కోలో ప్రగతి ప్రచురణాలయం ప్రచురించిన ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’, ‘నా విశ్వవిద్యాలయాలు’ పుస్తకాలు ఈ కాలానికి అందుబాటులో లేకపోవడం, పాఠకుల దగ్గర ఒక భాగం ఉంటే మరో భాగం లేకపోవడం, ఉన్న పుస్తకాలు కాలానికి చివికి, చదవడానికి వీలులేక చరమదశలో ఉన్న తరుణంలో ఇవన్నీ ఒకే పుస్తకంగా రావడం ఈ పుస్తకాల అభిమానులు సంతోషించదగిన సందర్భం.
తెలుగునాట టామ్‌సాయర్, హకల్‌బెరీఫిన్‌కి, ఆలివర్ ట్విస్ట్‌కి అభిమానులు ఉన్నట్లే గోర్కీ బాల్య జీవితానికి కూడా అభిమానులున్నారు. అది సాహసాలతో కూడింది కాదు. వాటి సామాజిక నేపథ్యం దేనికదే ప్రత్యేకమైంది. రష్యన్ సాహిత్యం నుండి వెలువడిన పావెల్, రాస్కాల్నికోవ్, అన్నా కెరినినా, వాంక, బజరోవ్, మిష్కిన్ వంటి పాత్రలు చిరస్మరణీయమైనట్లే గోర్కీ అమ్మమ్మ ‘ఆకులినా కషిరీన్’ కూడా ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. గోర్కీ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఘట్టం, అమ్మమ్మ దగ్గర గడిపిన కాలంలో తాతతో తిట్లు, తన్నులు, ఇంట్లో మామయ్యల పాటలు, డాన్సులు, ఆస్తుల తగువులు, తల్లి రెండో పెళ్ళి, తరువాత ఆమె మరణం పుస్తకంలో ఇవన్నీ మనం మరిచిపోలేని సంఘటనలు. తెలుగులో ఒకతరం ఇదంతా చదువుకుని, నవ్వుకుని, కన్నీళ్ళు పెట్టుకుని గోర్కీని కడుపులో దాచుకుంది.
తెలుగులో వచ్చిన సోవియట్ పుస్తకాలలో పిల్లలది (బాల సాహిత్యం కాదు) ప్రత్యేకమైన అంశం. వీళ్ళంతా కటిక దారిద్య్రం అనుభవిస్తూ చిన్న వయసులోనే ఇంటికి ఆసరాగా ఉండటానికి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి దుకాణాల్లో, సంపన్నుల ఇళ్ళలో నౌకల్లో పనివాళ్ళుగా చేరతారు. ఎక్కువమందివి అర్థంతరంగా ముగిసిపోయిన విషాదాంతాలు. ఆర్మీనియాకి చెందిన హెువనేస్ తమన్యాన్ సృష్టించిన ‘గిఖోర్’ కథలో గిఖోర్ అర్థంతరంగా చనిపోతాడు. చేహెువ్ ‘వాంకా’ తన తాతకు రాసిన ఉత్తరం ఎప్పటికైనా చేరుతుందో లేదో మనకు తెలీదు. వాంకా మీద మనకు ఎనలేని బెంగ కలుగుతుంది. బోరిస్ లవ్రేన్యోవ్ ‘అర్జంటు రవాణా’ కథలో మీత్యా అనే పిల్లవాడు ఓడ పొగగొట్టంలో ఇరుక్కుపోతాడు. చివరికి ఓడ అర్జంటుగా బయలుదేరాల్సిన సమయంలో ఆ పిల్లవాడిని అలాగే ఉంచి ఆ పొగ గొట్టం కింద పొయ్యి ముట్టిస్తారు.
ఓడ గమ్యస్థానం చేరాక చిమ్నీ గొట్టం నుండి కింద పడిన పిల్లవాడి కపాలం, కొన్ని ఎముకలు మనకి కళ్ళమ్మట నీళ్ళు తెప్పిస్తాయి. ఇలాగాక చావు తప్పించుకుని బతికి బట్టకట్ట గలిగిన పసివాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ఈ గోర్కీ ఆత్మకథ చదివితే మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకంగా ఉండొచ్చు కూడా. చేహెువ్ వాంకా కథలో తాతకు ఉత్తరం రాసిన ఆ పిల్లవాడు ఆ తరువాత ఏమయ్యాడో ఎవరికీ తెలియక పోవచ్చు. చేహెువ్ రాసిన మరో కథ ‘స్టెప్పీ’లో చదువుకోడానికని మావయ్యతో బయలుదేరిన ఎగొరుష్కాకి స్టెప్పీల వెంబడి చేసిన ప్రయాణంలో అనేక అనుభవాలు కలుగుతాయి. అనేక రకాల మనుషుల్ని కలుసుకుంటాడు. చివరికి కథ ముగింపులో “అప్పటిదాకా తనతో వచ్చినవారు వీథిలో మలుపు తిరిగి మాయమయిపోయే సరికి, వాళ్ళతో పాటు పొగలాగ తను అంతపరకు జీవించిన జీవితం అంతా మాయమైపోయిందని ఎగొరుష్కాకి అనిపించింది. అతను నిస్పృహగా బెంచి మీద కూలబడి తన కొత్త జీవితానికి కన్నీళ్ళతో స్వాగతం పలికాడు… అదెటువంటి జీవితమో మరి?” అని కథ ముగిస్తాడు చేహెువ్. పందొమ్మిదవ శతాబ్దపు రష్యన్ సాహిత్యంలో తారసిల్లిన పిల్లల జీవితాల గురించి రాస్తే ఒక ప్రత్యేక అధ్యాయమే అవుతుంది.
గోర్కీ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని చెప్పుల దుకాణంలో పని నేర్చుకునే కుర్రవాడిగా, స్టీమరులో చిప్పలు తోమేవాడిగా, ఓడలమీద బరువులెత్తే వాడిగా అనేక పనులు చేస్తూ ఖాళీ సమయాలలో పుస్తకాలు చదువుకుంటూ జీవితం గడిపాడు. కటిక దారిద్య్రం అనుభవిస్తూ ఆ జీవితానుభవాలనే తన ‘అప్రెంటిస్ షిప్’ గా చెప్పుకున్నాడు. ఆ కాలంలోనే మనుషుల్ని గమనించడం, మంచి చెడూ తెలుసుకోవడం, జీవితానికి సంబంధించిన అనేక చేదు నిజాలని ఆకళింపు చేసుకుంటూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఒక పనిచేస్తూనే తిట్లు, తన్నులు తినడంతోపాటు పుస్తకాలు చదవడం నేర్చుకున్నాడు. నా బాల్యం నుంచి నా విశ్వవిద్యాలయాల దాకా గోర్కీ వ్యక్తిత్వంలో వచ్చిన పరిణితిని ఈ ఆత్మకథలో మనం సులభంగా గమనించవచ్చు, ఆయన అభిప్రాయాలతో మనం ఏకీభవించినా, కాకున్నా. ముఖ్యంగా కౌమారం (నా బాల్యసేవ) నుంచి యవ్వనం (నా విశ్వవిద్యాలయాలు) వరకు అతడిలో అనుభవాల వలన స్థిరపడిన అభిప్రాయాలను తద్వారా ప్రతిష్టితమైన వ్యక్తిత్వాన్ని మనం చూడగలం. ఈ ప్రయాణంలో అతడు పుస్తకాలను ఎంపిక చేసుకుని చదివిన విధానం, వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకొన్న విధానం ఈ పుస్తకం మొత్తంలో ఆసక్తికలిగించేది.
అత్యంత కఠోరమైన జీవితంలోంచి అనుభవాలని ప్రోది చేసుకుంటూ అందులో ఉక్కిరిబిక్కిరి అవుతూ “నా అంతరాత్మపై నా జీవితం తానే రాసిన స్వర్ణాక్షరాలను మొండిగానూ మోటుగానూ చెరిపేసి, వాటి స్థానంలో అదేదో కొరగాని చెత్తను రాసి ఉంచింది. ఆగ్రహంతోనూ, పట్టుదలతోనూ నేనీ దౌర్జన్యాన్ని ప్రతిఘటించాను. ఒక నదీ ప్రవాహంలో అందరితోపాటు నేనూ కొట్టుకొనిపోతూన్నాను, కాని నా పట్ల ఈ నీళ్ళు మరింత చల్లనై, మిగతా వాళ్లకంటె నన్నంత తేలికగా పైకి తేలనివ్వడంలేదు. ఒక్కొక్కప్పుడు నేను నదిలో ఈదుతూప్పుడు లోతు నీళ్లలో పడి మునిగిపోతున్నట్లు అనిపించేది.” అని ఒకచోట చెప్పుకున్నాడు గోర్కీ,
గోర్కీ జీవితంపై ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం మీద ఆయన అమ్మమ్మ ‘ఆకులీనా’ ప్రభావం చాలా ఉంది. ఆయన ఇల్లు విడిచిపెట్టి తనవారికి దూరంగా జరుగుతూ పెరిగి పెద్దవాడవుతూ ఆమెకు తనకు మధ్య ఏర్పడుతున్న దూరం కూడా గమనించుకుంటాడు. అదే స్థితిలో ఆవిడ ఆత్మ ఔన్నత్యం గురించి నిరంతరం మననం చేసుకుంటాడు.
“అమ్మమ్మను నేను కలుసుకొన్నప్పుడు ఆమె అంతరాత్మను తెలుసుకుని మరింతగా తన్మయుడనై పోయేవాణ్ణి, కాని ఈ సుందరమైన ఆత్మ గంధర్వ కథలవల్ల అంధురాలైపోయి, ప్రపంచంలో నివసిస్తూ నికృష్టమైన వాస్తవికతను గమనించే శక్తి ఆమెకు లేదనీ, వాటిని గ్రహించలేకుండా వుందనీ, నా ఆందోళనలూ, నా భావాలూ ఆమెకు పరాయివి అయిపోయాయనీ నేనదివరకే గుర్తించాను.”
గోర్కీ విశ్వవిద్యాలయంలో చదువుకోడానికి కజాన్ వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గరనుంచి వీడ్కోలు తీసుకుంటూ
‘నావ వెనుక భాగాన నిలబడి వెనక్కి తిరిగి మా అమ్మమ్మ వైపు చూశాను. పడవలు కట్టే కొయ్య వద్ద ఆమె నిలబడి ఒక చేతితో శరీరంపై శిలువ గుర్తును వేసుకుంటూ రెండో చేతితో చీకి పోయిన పాత శాలువా అంచుతో తన ముఖాన్నీ, మానవులపట్ల అచంచల ప్రేమతో నిరంతరం భాసిల్లే తన నల్లటి కళ్ళనీ తుడుచుకుంటూ ఆమె అక్కడ నిలబడింది’ అని చెబుతాడు.
స్టీమరులో పనిచేసే వంట మనిషి స్మూరియ్ నుంచి గోర్కీకి పుస్తకాలు చదవడం అలవడుతుంది. కుట్టుపనివాని భార్య, మార్గాట్ రాణి అనే ఇద్దరు స్త్రీల పరిచయంతో ఆయన చదివే పుస్తకాల పరిధి పెరుగుతుంది.
పుస్తకాలు నన్ను అనేక విషయాలతో వజ్రదేహిగా చేశాయి అంటాడు గోర్కీ ‘వాస్తవికతను ఉన్నది ఉన్నట్టుగా చూడటంలో అవరోధం కలిగించకుండా, జీవితంతో
తొణికినలాడుతూన్న మనుషులను అర్థం చేసుకోవాలనే కాంక్షను తగ్గించక, ఈ పుస్తక ప్రపంచంలోని అవ్యక్త స్థితి పారదర్శకమే అయినప్పటికీ అది దుర్భేద్యమైన ఒక తెరను సృష్టించి నా చుట్టూవున్న జీవితంలో దాగిన విష పంకిలం నుండి, అసంఖ్యాక రోగాలనుండి నన్ను రక్షించింది’ అని అంటాడు ఆయన.
స్టీమరులో పనిచేసే స్మూరియ్ గోర్కీని దగ్గరకు తీస్తాడు. అతడి చేత పుస్తకాలు చదివిస్తాడు. నచ్చని పుస్తకాల్ని అవతలకి విసిరేస్తాడు. తనకి నచ్చినవి పేష్కోవ్ (గోర్కీ) చేత చదివించుకుని కన్నీళ్ళు పెడతాడు. పుస్తకాన్ని ప్రేమతో తడుముతాడు. “మీరు ఇంత మంచివారు కదా. అందరినీ భయపెడుతూ ఉంటారెందుకు అని ఒకసారి గోర్కీ అడిగితే స్మూరియ్
“నేను నీతోనే మంచిగా ఉంటాను. మనుషుల ఎదుట మంచివాడిగా కనపడకూడదు. కనపడ్డావా వాళ్ళు నిన్ను బతకనీయరు. బురదలోని దిబ్బమీదికి ఎక్కినట్లు మంచివాడిపైకి ఎక్కుతారు. తొక్కితొక్కి వదిలేస్తారు” అంటాడు.
గోర్కీ మనుషుల్ని అర్థం చేసుకునే తీరు లోతుగా ఉంటుంది. ఉదాహరణకి ఓసిప్ అనే వ్యక్తి గురించి చెబుతూ అర్థంచేసుకోడానికి అందని వాడైనా అతను స్థిరుడు. మరొక నూరేళ్ళు జీవించినప్పటికీ, ఆశ్చర్యకరంగా మారుతున్న మనుషుల మధ్య,తన హృదయాన్ని ఊగిసలాడనివ్వకుండా భద్రపరుచుకొని, అతడు ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాడని నాకు తోచింది’.
“మనుషులలో అస్థిరత్వం అతి తీవ్రంగానే కొట్టవచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. ఒక మానసికస్థితి నుండి వేరొక మానసికస్థితికి వారు వేసే జిత్తులమారి గంతులు నన్ను తలక్రిందులు చేసాయి. అంతుచిక్కని ఈ గంతులను గురించి నాకు కలిగిన అచ్చెరువుతో నేనిదివరకే అలసట పడిపోయాను, ప్రజల మీద నాకుగల ఉత్సాహం క్రమక్రమంగా చల్లారిపోతూ వచ్చింది. వారి మీద నాకున్న ప్రేమ నన్ను కలవర పెట్టింది.”
ఈ పుస్తకంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది- అడవి మనిషిమీద కలిగించే ప్రభావం గురించి గోర్కీ చెప్పిన అనుభవం ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా మందికి అరణ్యం ఒక అందమైన దృశ్యమే. లేకుంటే అది నిఘూఢం. కొందరికి సాహిత్యంలో మనుషులు లేకుంటే మింగుడు పడదు. నిర్జన అరణ్య జీవితం అందరికీ పట్టదు. గోర్కీ అమ్మమ్మతో కలిసి అడవిలో తిరుగుతూ ‘అరణ్యం నా అంతరంగంలో ప్రశాంతతనూ సుఖాన్ని సృష్టించింది. ఈ భావం నా బాధను తొలగించి, చీకాకునంతటినీ మరిచిపోయేందుకు సహాయం చేసింది; దానితోపాటు సున్నితమైన
గ్రహణ శక్తిని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాను: చూపూ, వినికిడి శక్తీ నిశితమయాయి, జ్ఞాపకశక్తికి మరింత ధారణకల్గింది, మనసులో చేరిన భావనా నిధి వృద్ధి చెందింది. తిరిగి తిరిగి వేసారినప్పటికి ఈ ఇరవైనాలుగు గంటల్లోనూ నేను పెరిగినట్టూ, కొత్తది ఎదో తెలుసుకున్నట్టూ, శక్తివంతుడనైనట్టూ నాకు అనిపించేది.
ఈ వాక్యాలు చదివి నేను ఆశ్చర్యపోయాను. నా ఎరుకలో ఉన్నదే కానీ ఎవరూ నాకిలా చెప్పింది లేదు. ఒకరకంగా ఇది నన్ను నేను తెలుసుకోవడం లాంటిదే. నా చిన్ననాటి జీవితాన్ని తలుచుకుని ఒకింత సంతోషపడ్డాను.
నాలో ఇద్దరు వ్యక్తులు వుండేవారు అంటాడు గోర్కీ ఒకచోట. ఒక వ్యక్తి మానవజీవితంలోని అసహ్యాన్నీ మాలిన్యాన్నీ ఎంతో చూసి, దీనివల్ల భయపడి, దైనందినపు జీవితంలోని ఘోరాన్ని గురించిన పరిజ్ఞానంవల్ల కుంగిపోయి, సంశయస్థుడూ అనుమానస్థుడూ అయిపోయి తనతో సహా ప్రజలందరిపట్లా దుర్బలతతోకూడిన సానుభూతి వైఖరిని అవలంబించసాగేడు. ఈ వ్యక్తి తన పుస్తకాలతో జనంలేని స్థలంలో ఏకాంత ప్రశాంతజీవనం గురించి, సన్యాస మఠం గురించి, అరణ్యంమధ్య కుటీరం గురించి, ఎక్కడో రైల్వేలైను వొడ్డునవున్న గార్డు బస గురించి, పర్ష్యా గురించి, ఎక్కడో ఏ నగరం పొలిమేరనో రాత్రి గస్తీ తిరిగే కావలివాని ఉద్యోగం గురించి కలలు కన్నాడు. తక్కువ మనుషులుండే చోటులో దూరం దూరంగా మసలాలని ఉబలాటపడ్డాడు.
ఒక సంపూర్ణ జీవితానికి గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యాలని పుస్తకం చివర్లో ఆయన ఉటంకికస్తాడు. ప్రపంచంలో చెడ్డ మనిషి నిజంగానే ఉన్నాడనీ, మరి మంచి మనుషుల సంగతి ఏమిటి అన్నది ప్రశ్న.
“నిత్యం నీ హృదయాన్ని సంతృప్తి పరిచేందుకు నీ సొంత సత్యాన్నే నీవు ఎంచుకోవాలి! అటు చూడు, వాగుకు అడ్డంగా ఒక మంద మేస్తూ వుంది. ఒక కుక్కా, ఒక పశువుల కాపరీ అక్కడ వున్నారు. మంచిది – మరి దాని మాట ఏమంటావ్? మన హృదయాలకు ఆనందాన్ని చేకూర్చుకోడానికి నువ్వుగానీ నేను గానీ దాని నుండి ఏం గ్రహించగలం? అవి ఉన్న ప్రకారమే నువ్వు ప్రతి విషయాన్నీ చూడటానికి ప్రయత్నిస్తావు.. చెడ్డ మనుషులు నిజంగానే వాళ్లు చెడ్డవాళ్లు. మరి మంచి మనుషులో? ఎక్కడున్నారంటావు వాళ్లు? వాళ్లనింకా తయారుచేసి చిత్రించాల్సిన అవసరం వుంది! అదీ సంగతి.”

బి అజయ్ ప్రసాద్
బి అజయ్ ప్రసాద్ 52 ఏళ్ల కిందట గుంటూరు జిల్లా నకరికల్లు లో 1972 జూన్ 9న జన్మించారు. దక్షిణ కోస్తాంధ్ర లోని గుంటూరు, మాచర్ల,అద్దంకి గుడ్లవల్లేరు వంటి నగరాలు, గ్రామాల్లో పెరిగారు. జీవిత సమరంలో అనేక ఆటుపోట్ల అనంతరం నిరుద్యోగిగా హైదరాబాదు మహానగరంలోనికి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో స్టెనోగ్రాఫర్ గా జీవిక కొనసాగిస్తున్నారు. 2005లో వచ్చిన తన మొదటి కథ మరుభూమి తో రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పటిదాకా 50 కి పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించ బడ్డాయి. వాటిలో 30 కథల తో రెండు కథా సంపుటాలు 'లోయ, గాలి పొరలు' పేర్ల తో ముద్రించబడ్డాయి. కొన్ని కథలు హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో అనువదించబడ్డాయి. వీరి కథలు తమిళం లోకి అనువాదమయి 'అద్దంకి మలై' పుస్తకంగా వెలువడింది.


