మనసౌతుంది

Spread the love

నువ్వొచ్చే క్షణాలను
కనులదోసిళ్ళతో
ఎలా ఎత్తిపట్టను..?
గడచి రాలిపోయే క్షణం
గడుస్తున్న విరుస్తున్న క్షణం
గడపబోయే వికసించబోయే
క్షణాల మధ్య ఆరాటపుపూలను
గుండెగంపలకు ఎలా ఎత్తను ?

కలిసిన నీ చేయి నా చేయి మధ్య
కాలమలా స్థంభించకూడదా ?
చేయి వీడుతున్న కలయిక
స్థంభించిన హృదిని మీటగలదా?

వీడేది కలవడానికేనని
మభ్యపడతా కానీ
మనసు వీడితేగా కలవడానికి ?
కలలు కలవళపడుతున్నప్పుడల్లా
నువ్వు కలుస్తున్నావనే అర్థం.
వెన్నెలకు మబ్బు అడ్డుపడినప్పుడల్లా
నా విరహ వాక్యాలు
నీ ఆకాశ ముంగిలిలో
తారాడాయనే అర్థం.

ఒక మనసులో మనం నిండినపుడు
మన మనసు నిండుగా వుంటుంది.
మన మనసులో ఒకరు రగిలినపుడు
మంటలనాలుకల మీద కూడా మనసౌతుంది.
P. Srinivas Goud

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపాధ్యాయులుగా పని చేసి, ప్రస్తుతం నిర్మాణ రంగంలో వున్నారు. కవిత్వం, కథ, విమర్శ, అనువాదాలలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 9 కవిత్వ పుస్తకాలు వెలువరించారు. 2024లో మార్జినోళ్ళు కథా సంపుటి వెలువరించారు. శ్రీనివాసం- కవిత్వ విశ్లేషణలు వెలువరించారు. కవిత్వ అనువాదంలో 4 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం మరికొన్ని అనువాదాలు రానున్నాయి. రచనలకు గాను పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

సెల్ : 9949429449 మెయిల్ : srinivasgoudpoet@gmail.com


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *