1
ఎంత స్వేచ్చగా, ఎంతగా హృదయం లోంచి..
ఇవే కదా మౌలిక ప్రశ్నలు అంటుంది ఆమె
అవునంటావు, చేతులని మృదువుగా, ధృడంగా పట్టుకొని
కాలం మీ మధ్యకు రావటానికి జంకుతూ వుంటుంది
2
సాంద్రమైన, స్వచ్చమైన ఒక్క జీవితానుభవం చాలదా
బ్రతుకంతా వెలగటానికి అంటుంది
చాలును అంటావు, ఆమెను ఆశ్చర్యంగా గమనిస్తూ
నీలోని లోభి ఎవరో వెలుతుర్లో కరిగిపోతూ వుంటాడు
3
నువు నా ప్రక్కనే ఉన్నావు
ఇంతకన్నా ఏమీ వద్దు ఇక్కడ అంటుంది
నీ భుజంపై తలవాల్చి, కనులు మూస్తూ
మాటలు రాక ఉండిపోతావు
నీపై నీకే ఎన్నడూ లేని గౌరవంలోకి కనులు తెరుస్తూ
4
మీరు ఇద్దరు, మీ చుట్టూ ఒక ప్రపంచం
నేలతో, గాలితో, ఆకాశంతో వెలుగుతూ, తేలుతూ
మౌనంలోకి మిమ్మల్ని జారవిడుస్తూ
5
ఇద్దరూ ఒక్కరే
ప్రపంచం ఎప్పుడో పక్షిలా ఎగిరిపోయింది
తెలియరాని గగనంలో కరిగిపోతోంది
6
బహుశా, ఒకనాడు
ప్రపంచం తాను ఎప్పుడూ లేనేలేనని
తెలుసుకుంటుంది నీలోంచి ఆమెలోంచి