నేను ప్రేమించాలంటే
ముందుగా–
అక్షరమై వ్యక్తం కావాలి నువ్వు!
గులాబీలూ పాలమీగడా కలగలిసిన దేహఛాయా..
నేరేడు కళ్లూ, కెంపులద్దిన బుగ్గలూ
దైహిక సౌందర్యాంశలన్నీ
ఒక అంచె వరకే మురిపిస్తాయి నన్ను!
కోరమీసమూ, వజ్రసమమైన దార్ఢ్య శరీరమూ..
కండలు తిరిగిన దండలూ, ధీరగాంభీర్యమూ
మగటిమి ప్రతీకలన్నీ..
ఒక మెట్టు వరకే మెప్పించగలవు నన్ను!
నిజానికి,
నీ లింగ, కుల, మత, ప్రాంత తారతమ్యాలూ
ఆహార ఆహార్యాది సంస్కారాలూ
ధూమ సురాపానాది వన్నెచిన్నెలూ
భాషణాలూ భూషణాలూ గట్రా గట్రా
నా బధిరాంధత్వానికి ఆనవు గాక ఆనవు!
పలకరింపులూ పరిచయాల దశను
దాటనివ్వవు నన్ను.
స్నేహమో ప్రేమో దేహాతీత అనుబంధాలో
పుట్టనివ్వవు నాలో.
నేను ప్రేమించాలంటే
ముందుగా–
అక్షరమై వ్యక్తం కావాలి నువ్వు!
== ==
అక్షరమైన తర్వాతనే కదా
అలా వ్యక్తమైన తర్వాతనే కదా
దృక్కోణమూ ఆలోచనా బుద్ధీ
ప్రకటితమయ్యే నిజాయితీ భావశుద్ధీ
సాకల్యంగా నాకు ఎరుకపడగలిగేదిi!
అక్షరంగా రూపుదిద్దుకున్న తర్వాతనే కదా
ఆ రూపు నాకు ఇంద్రియగోచరమైనప్పుడే కదా..
పరిమాణమూ బరువూ ఎత్తూ..
ఆత్మికమైన చింతనలోని లోతూ..
విపులంగా నాకు అనుభవమయ్యేది!
అక్షరాలతో నువ్వు రమించినప్పుడే కదా
ఆ రమ్యతలో ఆవిష్కరించుకున్నప్పుడే కదా
రంగూ రుచీ వాసనా గాఢతా
రూపుదిద్దుకున్న కాంక్షా దీక్షా దక్షతా
సాంగోపాంగంగా నాకు అవగతమయ్యేది!
అక్షరాలలోకి నువ్వు సంలీనం అయినప్పుడే కదా
లీనమై, సంపూర్ణంగా పరావర్తనమైనప్పుడే కదా..
వ్యక్తిత్వమూ రుజుత్వమూ తన్మయత్వమూ
ఆర్జితమైన మాన్యతా తాత్వికతా తాదాత్మ్యతా
నిశ్శేషంగా నా లోపలి పొరల్లోకి యింకిపోయేది!
నేను ప్రేమించాలంటే
ముందుగా–
అక్షరమై వ్యక్తం కావాలి నువ్వు!
అప్పుడు కదా..
నిన్ను నేను ఆరాధించేది
నేను నీకు దాసోహం అయ్యేది
భక్తితో నీ సన్నిధిలో కైమోడ్చేది
అనురక్తితో నీ సహవాసాన్ని ఆస్వాదించేది
నీ నుదుట నా పెదవులను అద్దుకునేది!
నీ పాదాల ఎదుట నన్ను నేను దిద్దుకునేది !!