హైవే మీద కారు మెత్తగా దూసుకు పోతోంది
రోడ్డుకిరువైపులా పచ్చని పంటపొలాలు, ఎడమవైపు దూరంగా తూర్పు కనుమల నీలిజాడలు.
కన్నార్పకుండా అటే చూస్తూ.. “ఆవిణ్ని ఎక్కడో చూసేను. ఎక్కడ చూసేనో గుర్తుకు రావడం లేదమ్మా” అంది సత్య మూడో సారి.
ఈ సారి వర్ధనమ్మ పైకే నవ్వేసింది. “ఎన్నిసార్లు అంటావే అదేమాట? సరే చూసి ఉండచ్చు, అదా ఇప్పుడు మనకి ముఖ్యం? అసలు కార్యం వదిలేసి ఈ సంగతి పట్టుకున్నా వేంటి!” అంది.
రెండు గంటలకి రాజమండ్రి హోటల్లో భోజనాలు చేసి కారెక్కేరు. తిని వెళ్లమని వాళ్లు ఎంతగా అడిగినా
‘కతికితే అతకదు’ అంటూ నిరాకరించింది సత్య. కారు విండోస్ లోంచి వీస్తున్న చల్లని గాలికి వర్ణనమ్మకి నిద్ర ముంచుకొస్తోంది. ఉండుండి సత్య అంటున్న ఆమాటకి నిద్ర చెదిరిపోతోంది. దారి పొడవునా కట్టిన ఫ్లైఓవర్ల వల్ల చాలా ఊళ్లు దిగువన ఉండిపోతున్నాయి, కొత్తగా వేసిన బైపాస్ రోడ్ల వల్ల కొన్ని ఊళ్లు దూరంగా ఉండిపోతున్నాయి, తూర్పుగోదావరి జిల్లాలోని ఆ ప్రాంతంలోనే వర్ధనమ్మ పుట్టి పెరిగింది.
బెండపూడి దరిదాపులకి రాగానే ఆమెకి చిన్నప్పుడు చూసిన బెండపూడి సాధువుగారు గుర్తుకొచ్చాడు.
హైవే పక్కన మామిడి తోటలో పెద్దపెంకుటిల్లు ఉండేది. దాన్నే ఆశ్రమం అనేవారు. రెండు వందల ఎకరాల, తోట అది. తోటపల్లి కొండల వరకూ విస్తరించి ఉండేది. వర్ధనమ్మ తండ్రి ఉన్నప్పడు ప్రతీ సంవత్సరం భీష్మఏకాదశికి బండి కట్టి కుటుంబంలో అందర్నీ అన్నవరం తీసుకెళ్లేవాడు. తల్లి తండ్రి వ్రతంలో కూర్చుంటే పిల్లలకి ఆటవిడుపు సమయం. తమ్ముళ్లు, చెల్లెళ్లతో మంటపం బైటికి పరుగెత్తి సువర్ణ గన్నేరు పూలు ఏరుకోవడం ఒక పండగలా ఉండేది.
అప్పటికి కొండపైకి మెట్లదారి మాత్రమే ఉండేది. కొండ కింద ఎడ్లను విప్పేసి అందరూ మెట్ల దారిలో పైకి వెళ్లేవాళ్లు. మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టి మెట్ల దారి ముగిసేవరకూ ఐదు కొబ్బరికాయలు కొట్టేవాడు తమ తండ్రి. ఆచెక్కల కోసం పోటీపడి కొబ్బరి తింటూ మెట్లెక్కడం ఎంత బావుండేదో. గోదావరి పరిసరాల్లోంచి వచ్చేవాళ్లంతా తిరిగి వచ్చేటప్పుడు బెండపూడి ఆశ్రమంలో ఆగేవారు. అప్పటికి దేవస్థానంలో ఉచిత భోజనాలు లేవు. కొండ కింది పాక హోటళ్లలో భోజనాలు అస్సలు బావుండేవి కావు, అందుకని అన్నవరం వెళ్లిన వాళ్లంతా భోజనాలకి బెండపూడి ఆశ్రమం మీదే ఆధారపడేవాళ్లు. ఎన్ని వందలమంది వచ్చినా పిండి వంటల్తో వేడి వేడి వంటకాలు వడ్డించేశారు.
పిల్లలకి ఆసక్తిదాయకమైన విషయం ఒకటుండేది. సాధువు గారి ఎనిమిది మంది భార్యల్ని చూడడం, వాళ్లు వడ్డాణాలు వంకీలతో సహా వొళ్లంతా బంగారు నగలు అలంకరించుకుని నడినెత్తి నుంచి కాలివేళ్ల వరకూ మెరిసిపోతూ ఉండేవారు. కరెంటు లేని రోజులు కావడం వల్ల వాళ్లంతా ఒక చీకటి గదిలో వరసగా నిలబడి ఉంటే సాధువుగారు వాళ్లని కేన్ లాంతరు వెలుగులో ఆడవాళ్లకి, పిల్లలకి చూపించేవారు. లాంతరు ఎత్తి పట్టుకుని వాళ్ల మొహాలు చూపించేటప్పుడు వర్ధనమ్మ కళ్లింతంతలు చేసుకుని చూసేది, కాషాయవస్త్రాల్లో ఉన్న సాధువుగారు గొప్ప మహిమలున్న వ్యక్తి అనీ, ఆయనే అల్లూరి సీతారామరాజు అనీ, బ్రిటిష్ వాళ్లు ఈయనే అనుకుని ఇంకెవర్నో చంపేసేరనీ- రకరకాలుగా అను కునేవాళ్లు అప్పటి జనం, వెళ్లగానే ఒకసారి, తిరిగి వచ్చేటప్పుడు మరోసారి ఆయన పాదాలకి నమస్కరించేవాళ్లు. అంతమంది భార్యలున్న ఆయన్ని సాధువు అనడమేంటి, నిరాడంబరమైన సాధువుకి అన్నెకరాలతోట, భార్యల వొంటి మీద అంతంత బంగారం, రోజూ అంతమందికి ఉచితంగా భోజనాలు పెట్టేటంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించే కాలం కాదది. అటుచూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ. అన్నవరం హైవేలో ప్రసాదం అమ్మే కాంప్లెక్స్ దగ్గర కారు ఆపించి ప్రసాదం పేకెట్లు, పాలకోవాలు కొన్నది సత్య. అన్నవరం ప్రసాదంలాగే ఆపాలకోవాల రుచి కూడా ప్రసిద్ధమైందట ఇప్పడు. ఉదయం వెళ్లేటప్పుడు కొండపైకి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడిక బైపాస్ రోడ్లో వెళ్తున్నారు. కారు తూర్పుకి, పొద్దు పడమరకి పరుగెడుతున్నాయి. తుని సమీపిస్తుందనగా “అమ్మా, ఎలాగూ ఇటు వచ్చాం కదా పార్వతిని చూసివెళ్లాం” అంది సత్య.. పార్వతి వాళ్లు తునిలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఏదో అవాంతరం వల్ల ఆగృహప్రవేశానికి రాలేకపోయింది సత్య. పార్వతి కూడా సత్యలాగానే గవర్నమెంట్ కాలేజిలో లెక్చరర్ గా పనిచేస్తోంది. వాళ్లిద్దరూ హైస్కూల్ రోజుల నుంచీ క్లాస్ మేట్స్, స్నేహితులు కూడా. వాళ్లని చూసి పార్వతి చాలా సంతోషించింది. బైట గార్డెన్లో ఉన్న పూలమొక్కల్ని చూస్తూ “ఎంతందంగా ఉందో ఈ గార్డెన్! ఎంత బావుందో మీ ఇల్లు” అంది రెండంతస్తుల ఆ ఇంటిని బైటి నుంచే కళ్ళారా చూస్తూ సత్య, “పోవే, మీలాగా సిటీ ఇళ్లు కాదుకదా!” అంది పార్వతి. ” ఏం సిటీ ఇళ్లులేవే, జైళ్లలాంటి అపార్ట్మెంట్స్, నిజంగానే ఎంత బావుందో మీ ఇల్లు. “ఏంటి ఫ్రెండ్సిద్దరూ బైటే నిలబడి మాట్లాడుకుంటారా”
అన్నాడు పార్వతి వాళ్లాయన శంకరం. “రండమ్మా” అని వర్ధనమ్మను లోపలికి తీసుకెళ్ళేడు.
వీళ్లను చూస్తూనే టీ పెట్టినట్టున్నాడు. ట్రేలో నాలుగు కప్పుల్లో టీ, స్నాక్స్ ఉన్న ప్లేట్స్ తెచ్చాడు శంకరం.
“అయ్యో శంకరం, స్నాక్స్, టీ ఒక్కసారి తెస్తే అవి తినేసరికి టీ చల్లారిపోదా?” అంది పార్వతి,
“లేదే, టీ ఒక్కటే చాలు. మధ్యాహ్నం హోటల్ భోజనం హెవీగా ఉంది ” అంటూ టీ కప్పు అందుకుంది సత్య.”
“ఏంటీ సడెన్ ప్రయాణం, ఇలా ఎక్కడికెళ్లేరు?”
“రాజమండ్రి వెళ్ళొస్తున్నామే, మనమూ అత్తగార్లయ్యే టైం వచ్చేసింది కదా!”
“ఏంటే, రాజీవ్ కి పెళ్లి చేస్తున్నావా?”
“వాడు పిల్లను చూసుకున్నాడు. మనల్ని పెళ్లి చెయ్యమంటున్నాడు”. ఫోన్ లో ఉన్న అమ్మాయి ఫొటో చూపించింది.
“బావుందే పిల్ల, నాకు చాలా నచ్చింది. అక్కడే జాబ్ చేస్తోందా?”
“ఆ.. మనవాడి ఆఫీస్ లోనేనట. పేరు అపరాజిత”
“ఇకనేం, శుభస్య శీఘ్రం. అపరాజిత, అమ్మాయంత అందమైన పేరు
“శీఘ్రమే. అన్నీ నచ్చాలి కదా!”
“అన్నీ అంటే ?”.
“అమ్మాయి కుటుంబం, వాళ్ల పద్ధతులూ..”
“పోవే, కాలిఫోర్నియాలో వాళ్లిద్దరూ ఒకళ్లకొకళ్లు నచ్చుకుంటే ఇక్కడ వాళ్ల పద్ధతులూ అవీ చూసి ఏం చేస్తావ్ ?”
“అవేం చూడకుండా చెయ్యాలంటావా, మన పెళ్లిళ్లకి ఎన్నెన్ని చూసి చేసారో గుర్తులేదా?”
“ఆకాలం వేరులే, ఇప్పుడంతా మారిపోలేదూ?”
“ఏం మారింది? ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అయ్యాయి పద్ధతులన్నీ”
“వాళ్ళొచ్చేరా మీ ఇంటికి ? ముందు రావాల్సింది వాళ్లేమో కదా!”
“వాళ్లది మగదిక్కు లేని కుటుంబం, తల్లి, అమ్మమ్మ మాత్ర మే ఉన్నారు. ఆ ఇంటిని చూస్తే ఒకప్పుడు. బాగా బతికిన కుటుంబం అన్పిస్తోంది. అపరాజిత ఒకత్తే వాళ్ళకి, అమ్మాయి తండ్రి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగం చేసేవాడు అంటూ దాటవేసింది పెద్దావిడ, పిల్ల ఇంటర్మీడియేట్ నుంచీ అమెరికాలో చదువుకుంది అంటున్నారు. అమ్మాయి తల్లి ప్రైవేటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది, ఇప్పడంటే టీచర్స్ కి జీతాలు పెరిగాయి కాని ఒకప్పుడు అంతంత మాత్రపు సేలరీస్ కదా! ఇక ప్రైవేటు స్కూల్స్ మాట చెప్పే దేముంది! పిల్లను అమెరికా పంపించి చదివించడం ఎలా సాధ్యపడిందో ?!” అంది సత్య
“నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావేమోనే. అదంతా వాళ్ల సొంత విషయం, ఆ తలనొప్పి నీకెందుకు?
పిల్ల చక్కగా ఉంది, మన పిల్లవాడు ఇష్టపడుతున్నాడు, ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగాలు, అది చాలదా
మనకి?” వర్ధనమ్మ వైపు చూసింది పార్వతి,
పార్వతి చెప్పింది కరెక్ట్ అన్నట్టు వర్ధనమ్మ తల ఊపి సన్నగా నవ్వింది.
“వాళ్లు మన కేస్ట్ కాదేమో అని డౌటొస్తోంది నాకు” చివరి అభ్యంతరాన్ని బైటపెట్టింది సత్య.
“నీ మొదటి అభ్యంతరం ఇదై ఉంటుంది” అని నవ్వింది పార్వతి.
“ఇలాంటి అభ్యంతరాలు ఉంటే అమ్మలాంటి పెద్దవాళ్లకి ఉండాలి. అమ్మకి అలాంటిదేం లేనట్టుంది. మన
పిల్లల పెళ్లిళ్ల విషయంలో మనం కొంత మారాలేమోనే! ఇంతకీ అన్నయ్య ఏమంటున్నారు?”
“నీ ఇష్టం, నీకొడుకిష్టం. నన్ను ఇందులోకి లాగద్దు అంటున్నారు. నేను బంధువులందరికీ ఏం సమాధానంచెప్పగలను” అంది దిగులుగా సత్య.
“అన్నయ్య తెలివైనవాడు. ఒక విధంగా మగాళ్లంతా అంతేలే, మనల్ని బరిలోకి తోసి క్రెడిట్ వాళ్లు కొట్టేస్తారు.”
“ఇది బావుంది. ఉరుమురిమి మంగలం మీద పడినట్టు మామీదికి తిరిగేవేంటి ” అన్నాడు శంకరం నవ్వుతూ.
“రాజీవ్ ఒకవేళ అక్కడి ఏతెల్లమ్మాయినో ప్రేమించి పెళ్లాడ తానంటే ఏం చేసేదానివి? అప్పుడూ ఈ అభ్యంతరం ఉండేదా?” అవును కదా అన్నట్టు సాలోచనగా చూసింది సత్య,
“మన పిల్లాడు అంతగా ఇష్టపడుతున్నప్పుడు నీ అభ్యంతరాలు చెల్లవేమో చూడు, నయం, వాడు పెళ్లి అంటున్నాడు, సహ జీవనం అనడం లేదు.”
“వాడు నాకొడుకు, నామాట జవదాటడు. అందుకేగా కుటుంబాన్ని కలిసి, చూసి రమ్మన్నాడు!” అంది సత్య కాస్త గర్వంగా.
“అలా అయితే ఇంక వర్రీ కాకు, రాత్రికి వాడితో మాట్లాడి నిర్ణయం తీసుకో, రండి, ఇల్లు చూద్దురుగాని” అని లేవ దీసింది పార్వతి.
కొత్త ఇల్లు – సర్దుకున్న విధానం చాలా నచ్చేసింది సత్యకి, ఆమాటే అంటే “నాదేం లేదమ్మా! ఆ క్రెడిట్ అంతా మీ అన్న గారిదే, ఎక్కడికెళ్లినా ఏదో ఒక ఆర్ట్ పీస్ కొనుక్కొచ్చి అలంకరిస్తున్నారు” అంది.
దక్షిణం వైపు బాల్కనీలో నగిషీలు చెక్కిన రోజ్ వుడ్ స్టూలు మీద పెట్టిన కోణార్క టెంపుల్ శిల్పం దగ్గర ఆగిపోయింది సత్య.
ఈ శిల్పం చాలా బావుంది కదా! ఆ చక్రాల మీద చిన్ని చిన్ని నగిషీల్ని కూడా ఎంత నాజూకుగా చెక్కేడో చూడు శిల్పి అంది పార్వతి “అంతటి బృహదాలయాన్ని ఇంత చిన్న శిల్పంలో ఇమడ్చడం గ్రేట్ కదా!”
“అవునో కాదో తెలీకుండా తల ఊపి “ఇంక వెళ్ళొస్తాం” అంది సత్య.
“అదేంటే, రాత్రికి భోజనాలు చేసి వెల్దురు గాని, ఇక్కడి నుంచి ఎంత సేపట్లో వెళ్తారు వైజాగు! కారే కదా!”
“లేదే, రేపు కాలేజ్ కి అటెండవ్వాలి కదా! ఆయన కూడా కేంప్ నుంచి వచ్చేస్తూంటారు. ఇంటి దగ్గర శ్యామ ఒక్కర్తే ఉంది చంటి పిల్లాడితో ” అంటూ తొందరపడింది సత్య.
“నువ్వేం మారలేదే బాబూ! లేడికి లేచిందే పరుగు అంటావ్” అంటూ బొట్టు పెట్టి ఇద్దరికీ చీరలిచ్చింది
పార్వతి. శ్యామాకి ఇమ్మని స్వీట్లు, పళ్లు తెచ్చి కారులో పెట్టింది. దారి పొడవునా మౌనంగా ఉండిపోయిన కూతుర్ని చూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ.ఇంటికొస్తూనే డ్రాయింగ్ రూంలో టేబుల్ మీద ఉన్న ఆల్బమ్స్ లోంచి ఒక ఆల్బమ్ తీసుకుని తన గది లోకి వెళ్లిపోయింది సత్య. చంటాడికి పాలు పడుతున్న శ్యామల ఏం మాట్లాడకుండా వెళ్లిపోతున్న తల్లినిచూస్తూ ఏమైందన్నట్టు కనుబొమలు ఎగరేసి అమ్మమ్మను అడిగింది. ‘ఏమో, తెలీడం లేదు’ అంటూపెదవి విరిచి సమాధానం చెప్పింది వర్ధనమ్మ.
“శ్యామా, నీకోసం మీ అమ్మ ఏవేవో కొనుకొచ్చింది. పార్వతి ఆంటీ కూడా ఏవో ఇచ్చింది. ఆ బేగ్ లో ఉన్నాయి తీసుకో” అంది.
అరగంట తర్వాత సోఫాలో ఒరిగి సేదతీరుతున్న తల్లి పక్కన వచ్చి కూర్పుంది సత్య. “ఇది చూడు”అంటూ ఓ ఫొటో ఇచ్చింది, ” నీకు గుర్తుందా, ఆ మధ్య మనం ఒరిసా టూర్ వెళ్లేం” అంది. వర్ధనమ్మ లేచి కళ్లద్దాలు పెట్టుకుని ఫోటోని చూసింది.ఆ ఫోటో లో బయలుదేరబోతున్న టూరిస్ట్ బస్ ఎదుట పాతికేళ్ల యువకుడితో కలిసి రోడ్డుమీద బైఠాయించిన ఆమె మధ్యాహ్నం తాము రాజమండ్రి లో చూసిన అపరాజిత తల్లి.
వర్ధనమ్మకి ఆనాటి దృశ్యం మొత్తం కళ్లకి కట్టినట్టైంది ముందురోజు భువనేశ్వర్ టూర్లో నలభై ఏళ్ల ఆమె పక్కన పాతికేళ్ల యువకుణ్ణి చూసి బస్సులో జనం టూర్ మాట మరచిపోయి చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టేరు. చేతిలో చెయ్యి దూర్చి అతుక్కుపోయి తన్మయత్వంలో తిరుగుతున్న వాళ్లిద్దరికీ ఈలోకం పట్టినట్టులేదు. ఎవరేం అనుకుంటే మాకేం అన్నట్టున్నారు.
నందన్ కానన్, గుహాలయాలు, అమరగిరి మీది బౌద్ధస్థూపం, లింగరాజాలయం, భువనేశ్వరీ దేవి ఆలయం – ఎక్కడా ఎవరి మనసు నిలిచినట్టులేదు. వాళ్లను చూడడమే పనిగా పెట్టుకున్నారు. కొందరైతే ఇకిలింతలు, సకిలింతలు, చికాకులు ప్రదర్శించడం మొదలుపెట్టేరు.
మర్నాడు కోణార్క టూర్. వాళ్లని బస్సు ఎక్కనివ్వద్దని అందరూ కలిసి కంప్లయింట్ చేసారు. ఫలితంగా వాళ్లని బస్సు ఎక్కనివ్వలేదు. దానికావిడ ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి బస్సుకి అడ్డంగా రోడ్డు మీద బైఠాయించింది. ‘మనుషుల జీవితాల్లో కొన్ని బలహీనమైన క్షణాల లుంటాయి. దాన్ని అంగీకరించని సమాజం ఎదుట వాళ్లు దెబ్బతిన్న పులిలాగా తిరగబడతారు, లేదా ఆత్మన్యూనతాభావంతో కుంచించుకుపోతారు. చిత్రంగా ఇదంతా ఆడవాళ్లకి మాత్రమే, ఆ అబ్బాయి ఎంత ధీమాగా ఉన్నాడో!’ అనుకుంది వర్ధనమ్మ, ‘ఎవరి జీవితాలు వాళ్లవి’ అని వదిలేసే అలవాటు లేదు కదా మన వాళ్లకి’ అనికూడా అనుకుంది.
మోడ్రన్ డ్రెస్ లో చూసి ఆమెదే రాష్ట్రమో అనుకున్నా గొంతు పెంచి డ్రైవర్ తో ఘర్షణ పడినప్పుడు తెలిసింది, ఆవిడ తెలుగు వనిత అని. ఆమెని అవమానించే పక్రియ అక్కడితో ఆగ లేదన్న మాట! ఇప్పడిలా ఆమె కూతురి భవిష్యత్తు మీదకూడా ప్రభావం చూపబోతోందన్న మాట! కోణార్క ప్రయాణం ఆలస్యం కావడం వల్ల సత్య వాళ్లను బాగా తిట్టుకుంది. ఫోటో కూడా తీసిందన్న మాట! జీవితాన్ని కాచి వడపోసిన వర్ధనమ్మకి బాధగా అన్పించింది.
పిల్లలు ఎవరంతటివాళ్లు వాళ్లయ్యేక ఎవరికీ ఏదీ చెప్పే వయసు తనది కాదని అనుకుంటుంది వర్ధనమ్మ. చెప్పినా, వాళ్లు వింటారనే నమ్మకమూ లేదు. ఫొటో చూపించిందే కాని తన అభిప్రాయం ఏమిటో సత్య చెప్పలేదు కాబట్టి ఆమె కూడా మౌనంగానే ఉండిపోయింది. ‘ఆమె జీవితం ఆమె సొంతం. మనకెందుకు ఆ విషయాలన్నీ ‘ అనాలని ఉంది.
అమ్మమ్మ చేతిలోని ఫొటో అందుకుని చూసిన శ్యామలకి ఆఫొటో ప్రత్యేకత ఏమిటో, దాన్ని తల్లి ఎందుకు ప్రత్యే కంగా అమ్మమ్మకి చూపించిందో అర్థంకాలేదు. నిద్రకొచ్చిన చంటాడిని జోకొడుతూ, ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ కూర్చుంది. కాస్సేపటికి విసుగొచ్చి “అమ్మా, వంటై పోయింది, మీ ఇద్దరూ తినెయ్య రాదూ ” అంది.
వాళ్లు స్నానాలు చేసి వచ్చేసరికి టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టింది.”ఎలాగూ మీ అన్నయ్య పెళ్లి అంటున్నారు కదా, అదయ్యాక తీసుకెళ్తాలే ” అని ఫోన్ చేసాడు రఘు అంది శ్యామల తల్లితో.
“అదంతా ఇప్పుడేం కాదులే. ముందు అనుకున్నట్టే ఈ శ్రావణం లో వచ్చి తీసుకెళ్లమను, మళ్లీ మూఢం వస్తుందంటున్నారు ” అంది సత్య.
శ్యామల భర్తకి దుబాయ్ లో ఉద్యోగం. శ్యామల పురుటికి పుట్టింటికి వచ్చి ఉంది. పుట్టిన చంటాడికి ఈ శ్రావణానికి ఐదో నెల వస్తుంది.
వెంటనే ఫోన్ తీసుకుని తన గదిలోకెళ్లిన శ్యామల భర్తతో మాట్లాడింది. అదయ్యాక ఫేస్ బుక్కులో అతనుచూడమన్న ఫోటో చూసి ముఖం నిండా నవ్వు పులుముకుని వచ్చింది. ఫోన్ తల్లి ముఖం ముందు పెట్టి “ఈ ఫొటో చూడు ” అంది, ఫొటో చూసిన సత్య ముఖం ముందు వెలవెలపోయి తర్వాత కోపంతో నిండిపోయింది.
అదేమీ గమనించని శ్యామల “అమ్మమ్మా చూడు ఈ ఫొటోలో ఎంత బావున్నారో వీళ్లిద్దరూ” అంది, ఏదో లేక్ ఒడ్డున బెంచి మీద కూర్చున్న అపరాజిత పాదాన్ని నీళ్లలో నిల్చున్న రాజీవ్ తన అరచేతిలో మురిపెంగా పట్టు కున్న ఫోటో అది.
సత్య విసురుగా లేచి తనగదిలోకెళ్లి రాజీవ్ కి వీడియో కాల్ కలిపింది. ఆఫీస్‍కి వెళ్తూ డ్రైవ్లో ఉన్నాడు.
“నేనే చేద్దాం అనుకుంటున్నానమ్మా. ప్రయాణం బాగా జరి గిందా? ఉదయం నుంచి అదేపనిగా ప్రయాణం చేసి అలసి ఉంటారు అని ఆలోచిస్తున్నాను” అన్నాడు. హుషారుగా మొదలు పెట్టినా, తల్లి ముఖం లోని అప్రసన్నత చూసి ఆగేడు.
“ఆ ఫోటో ఏంటి, అలాంటి ఫొటో పబ్లిక్‍లో పెడతావా? మనల్ని తెలిసినవాళ్లుతా ఏమనుకుంటారు?” అరిచినట్లే మాట్లాడుతుంటే ఆమె గొంతు వణికింది.
“అదా పకపకా నవ్వేసాడు రాజీవ్. “కూల్ కూల్ అమ్మా! అదంతా ఇక్కడ కామన్, నాఫ్రెండ్స్ చేసిన పని అది, ఇంతకీ నీకు అపరాజిత కుటుంబం, వాళ్ల ఇల్లూ నచ్చిందా?”
“నచ్చలేదు” అంది కరాఖండిగా నచ్చలేదా? పోనీలే, నో ప్రోబ్లెమ్. అయినా అపరాజిత తల్లికీ తండ్రికీ ఏవో గొడవలై తన చిన్నప్పుడే విడిపోయారట, వాళ్ళ నాన్నగారు తనని తీసుకుని అమెరికా వచ్చేసారట. తను తల్లి ప్రేమను కోల్పోకూడదని అప్పుడప్పుడు సెలవుల్లో కొన్నాళ్లు అక్కడికి పంపిస్తూ వచ్చారట. వాళ్లతో కూడా పరిచయం అవుతుందని వెళ్లమన్నాను అంతే “
“అరేయ్ బాబూ, నువ్వెన్ని చెప్పు, నువ్వీ పెళ్లి చేసుకోవడం నాకిష్టంలేదు” అంది సత్య. ఖంగు తిన్నాడు రాజీవ్.
“పెళ్లే ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా! ఏమైంది, ఏంజరిగింది అక్కడ? వాళ్లు నిన్ను సరిగా రిసీవ్ చేసుకోలేదా? నాకు నచ్చిన అమ్మాయిని చూసుకోమని నువ్వేకదా అన్నావు!”
“అవన్నీ నన్ను అడగద్దు. అదంతే!”
“ఇంతవరకూ వచ్చాక మనం ఇలా మాట్లాడడం భావ్యమేనా అమ్మా? అపరాజిత, వాళ్ల నాన్నగారు ఏమనుకుంటారు “
“వాళ్లేమనుకునేదే ముఖ్యమున్నమాట నీకు. నా మాట లెక్కలేనట్టే కదా!”
రాజీవ్ మొహం చిన్నబోయింది, “అమ్మా, నాఆఫీస్ దగ్గరకి వచ్చేసాను, రేపు ఉదయం చేస్తాను. ఇప్పడు ఫోన్ ఆఫ్ చేస్తు న్నాను. ఏమీ ఆలోచించకు. ప్రశాంతంగా పడుకో. రేపు మాట్లాడుకుందాం. ఓకేనా” ఫోన్ కట్ చేసాడు.
అక్కడి నుంచి రాజీవ్ ఏంజరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టేడు. ప్రయాణంలో ఉన్న తండ్రికి ఫోన్ చేసాడు. ఆయన తనకేం తెలీదన్నాడు. చెల్లెలికి, బావకి చేసాడు. చివరికి వర్ధనమ్మకి – తన లంచ్ టైమ్‍లో ఇండియాలో లేట్ నైట్ అని తెలిసినా చేసాడు.
“అమ్మమ్మా, అమ్మతో కలిసి వెళ్ళింది నువ్వే, అక్కడేం జరిగిందో చెప్పగలిగేది నువ్వే” అన్నాడు..
చెప్పవద్దని అనుకున్నా ఇదంతా ఎక్కడి వరకూ వెళ్తుందోనని అనుకుంది వర్ధనమ్మ. క్లుప్తంగా విషయం
చెప్పింది. అంతా విని ఓ నిముషం సైలెంట్‍గా ఉండిపోయాడు రాజీవ్. “అదా సంగతి! అమ్మను
తీసుకొచ్చి ఇక్కడ కొన్నాళ్లు తిప్పి చూపించాలి. డైవోర్సీల ఫ్రీడం అర్థం చేసుకుంటుందేమో!” అన్నాడు.
అయినా అమ్మమ్మా! అమ్మ లెక్చరర్‍గా ఎందరి మనస్తత్వాలనో కాచి వడపోసిందనుకున్నాను. కాలంతో బాటు మోడరన్ అయ్యిందనుకున్నాను. ఇంత మీన్ మైండెడ్ అనుకోలేదు. నువ్వే చెప్పు, దాంట్లో ఆ అమ్మాయి తప్పు ఏమైనా ఉందా? ” అన్నాడు.”ఆ అమ్మాయి రూపాన్ని చూసికాదు. బిహేవియర్ చూసి ఇష్టపడ్డాను. చాలా మంచి పిల్ల” రాజీవ్ గాంతులో ఆవేదన దాగలేదు.
“లేదులే నాన్నా! ఒక్క రోజులో తీసుకునే నిర్ణయాలు కావు కదా ఇవన్నీ, ఎందుకో మీ అమ్మ షాక్
తిన్నట్టైంది. తనే సర్దు కుంటుంది. కాలం అన్నిటినీ సర్దిపెడుతుంది కదా! నువ్వు కూడా తొందరపడి ఏమీ మాట్లాడకు.”
అయ్యో అమ్మమ్మా, నేనెప్పుడైనా అమ్మతో అలా మాట్లాడేనా? నువ్వు చెప్పినట్టే కొన్నాళ్లు వేచి చూస్తాను” అన్నాడు.
***
శ్రావణమాసం వచ్చింది, శ్యామల చంటాడితో కలిసి దుబాయ్ వెళ్లిపోయింది. సత్య రాజీవ్ కోసం వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. కొందరు అమ్మాయిల ఫొటోలు కూడా పంపింది. అపరాజితను ఇండియా తీసుకొచ్చి మాట్లాడిస్తానన్నాడు రాజీవ్. సత్య ఒప్పుకోలేదు. చెప్పకుండా తీసుకొస్తే ఇల్లు వదిలి వెళ్లిపోతానంది. మూడునెలలు.. ఆరు నెలలు గడిచాయి. సత్య బింకం వదలలేదు. ఫోన్ చేసినప్పుడల్లా ” ఆపిల్ల అపరాజిత మనకొద్దు ” అంటోంది.
మాఘమాసం వచ్చింది. ఓ మంచి రోజున కొడుకునుంచి ఓ వీడియో వచ్చింది. స్నేహితుల సమక్షంలో అక్కడి దేవాలయంలో రాజీవ్ అపరాజిత పెళ్లి చేసుకున్న వీడియో అది.
***
