భూమిలోని సారం పీల్చుకుంటూ పొగ వొదులుతున్న సిగరేట్ పీకలా నిల్చోనున్నాయి… దూరం నుండి ఎన్టిపీసి చిమ్నీలు. అవి కనబడగానే, ‘దాదాపు వచ్చేసాం’ అని కార్లో అలెర్ట్ అయ్యాడు మౌళి. ప్రమోషన్ తో అడుగుపెట్టబోతున్నాను అనే ఫీలింగ్తో బయటకి కన్పించకుండా లోలోపల కాస్త ఉత్సాహంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. రావడం కొత్తకాకపోయినా, వచ్చినప్పుడల్లా సింగరేణి కాలనీల్లో ఉండే పచ్చదనంకి ఏదో కొత్త ప్రపంచంలోకి ఎంటరయ్యామనే ఫీలింగ్. ఈ సారి ఎండలకి మాత్రం రామగుండం అగ్నిగుండలానే ఉంటుందని కార్ అద్దాల్లోంచే కనిపెట్టేసాడు. కొత్త డ్రైవర్ కి ఆ కాలేజీ రూట్ తెలీదు, నెట్ రాక మ్యాప్స్ లోడ్ అవ్వట్లేదు, వెళ్ళాల్సిన చోటుకు ఉండాల్సిన బోర్డులు చుట్టూ కనపడక కార్ ఓ చోటా ఆపక తప్పలేదు.
“ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ ఎటు వైపండి ?”, అడిగాడు డ్రైవర్ కార్ గ్లాస్లోంచి తాబేలులా తల బయటపెట్టి.
డ్రైవర్ వైపు విచిత్రంగా చూసి, “మన దిక్కు యూనివర్సిటీ కాలేజీ ఉందారా ?”, తన టీ షాప్ లో పనిచేస్తున్న పిల్లాడ్ని అడిగాడు ఓనర్. తెలీదన్నట్టుగా అక్కడున్న అందరు గుసగుసలాడుతుంటే, అది విని చదువుతున్న పేపర్ కిందికి దించి చూశాడో వ్యక్తి.
వచ్చిన కారు, లోపల మౌళి హుందాతనం చూసి, “రూట్ నాకు తెలుసండి…ఇంతకీ మీరు ?”, అనడిగాడతను.
“మా సారు కాలేజీ కొత్త ప్రిన్సిపాల్. ఇప్పటికే కాస్త లేట్ అయిన్ది. మీరేమి అనుకోకుండా దారి చెప్తూ ఉండండి, మిమ్మల్ని మళ్ళీ ఇక్కడే దింపుతా”, అని డ్రైవర్ మాటకి కారెక్కాడు ఆ వ్యక్తి .
కారు ఇంక్లైన్ కాలనీలు సందులన్నీ దాటుతోంది. ఈ గ్యాప్లో, “నా పేరు రమేష్ అండి, ఇక్కడే విలేకర్ని”, పరిచయం చేసుకున్నాడు.
“ఓ ఈస్ ఇట్! మరీ క్యాంపస్ మీద న్యూస్లు పెద్దగా ఏమి రాయరేమో. యూనివర్సిటీ కాలేజీ ఒకటున్నట్టు ఇక్కడి వాళ్ళకే తెలీకపోతే ఎలా ?”, అన్నాడు మౌళి నవ్వుతు.
“చాలా సార్లు రాసాం సార్. అయినా కాలేజీ కట్టినప్పట్నుండి దాన్ని చూసుకునే యూనివర్సిటీకే సరైన పట్టింపు లేనప్పుడు ఇక ప్రజలకేం పట్టి. వార్తలు రాసేటప్పుడు కాలేజీ పేరు ముందు ‘ప్రతిష్ఠాత్మకమైన’ అని పెడ్తున్నప్పుడల్లా ఏదో వెలతి సార్ “, సురుకుగా అన్నాడతను.
“మ్మ్. సరేగాని నీకు పాత ప్రిన్సిపల్ చంద్రం గురించి ఏమైన తెలుసా ?”, అడిగాడు మౌళి .
“తెల్సార్. చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్. ఆయన టర్మ్ లోనే కదా కాలేజీ ఆ మాత్రం డెవలప్ అయ్యింది. కొట్లాడి మరీ బడ్జెట్ లో అన్ని కోట్లు సాంక్షన్ అయ్యేలా చేసారు. అప్పట్నుంచే కదా ఇక్కడి లీడర్లంతా కన్నేసి రాజకీయాలు మొదలెట్టారు. ఉన్న కాంట్రాక్టులన్నీ తీసేసి, తమ వాళ్లకు ఇప్పించేలా తెగ ట్రై చేసిన కూడా, ఏ నాయకుడి మాట లెక్కచేయకుండా చంద్రం సార్ క్వాలిఫైడ్ కాంట్రాక్టులతోనే పనులు చేయించారు. ఈ విషయాల్లోన్నే ఇంటర్నల్ గా చాలా గొడవలు అయ్యాయి. హా ఇక్కడే…రైట్ తీస్కో”, రూట్ చెప్తూ రమేష్.
“నైస్” మౌళి ఫోన్ చూస్తూ అన్నాడు.
“ఇంతకి మీరు ఇన్ని రోజులు ఎక్కడ పని చేసారు సార్”, రమేష్.
“నేను ప్రిన్సిపాల్ గా ప్రమోట్ అయ్యింది మొన్నే. ఇదే నా మొదటి కాలేజ్. ఇంతకి ముందు ఇక్కడికి ఓ రెండు మూడు సార్లు వచ్చాను, గెస్ట్ ఫ్యాకల్టీగా. హైద్రాబాద్ మేయిన్ బ్రాంచ్లోనే ట్రిప్లీకి హెచ్ఓడిగా వర్క్ చేసాను”, చెప్పుకొచ్చాడు మౌళి.
కాలేజీ వచ్చేసింది.
గేట్ దాటుకుంటూ కార్ లోపలికి వెళ్తుంటే,
ఓ మూలన…సగం నిల్చోని సగం పడిపోయున్న టెంట్ గుడ్డ కిందా కొంత మంది స్టూడెంట్స్ కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. పట్టుమని పది మంది లేరు, పట్టుకునే సత్తువ లేక ఒరిగిన కొన్ని ప్లకార్డుల్లోని నిరసన భావంకంటే అలసిపోయిన్న వాళ్ళ నీరసత్వమే ఎక్కువగా వ్యక్తమవుతుంది. అందరిలాగే మౌళి కారు కూడా వాళ్లను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది.
మౌళికి వచ్చిన రహదారి మొత్తం అక్కడి నాయకుల ఫ్లెక్సీ నీడల్లో ఉంటే, క్యాంపస్ లో మాత్రం ఫ్లెక్సీలు లేవు కానీ నీడలు మాత్రం స్పష్టంగా కనబడసాగాయి.
*** **** ****
పోలీస్ స్టేషన్లో.
రైటర్ పక్కనున్న బల్ల పై బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు గిరి. అది అతనికి మొదటి సారి స్టేషన్లోకి రావడం. చుట్టూ వాతావరణమంతా గుండెలో దడ పుట్టిస్తుంది.
“నీ పేరేంద్రా ?”, గట్టిగా అడిగాడు రైటర్.
“గిరి”
“యేడుంటవ్ ?”,
“క్యాంపస్ హాస్టల్లోనే”,
“మీ నాన్న పేరేంది ? ఎం జేస్తడు”,
“కిషన్ సార్. అండర్ గ్రౌండ్ మైన్ల తట్టమోసేటోడు సార్. పది పాసయ్యిండని ఓపెన్ క్యాస్ట్ లో మిషన్ల ఆపరేటింగ్ అప్పజెప్పిండ్రు”
“ఫోన్ జేసి రమ్నను”
“లేడు సార్. ఎప్పుడో సచ్చిపోయిండు”
“అయ్యొ. మరి అది ముందు జెప్పవ్ ఏంద్రా. మీ అమ్ముందా? ఉంటె నంబర్ చెప్పు”
“ఉంది సార్. లక్ష్మీ.”, ఫోన్ నెంబర్ చెప్పేసాడు.
తల్లికి విషయం తెలుస్తే ఏమంటదోనని భయం, నాన్నుంటే బాగుండేదని బాధ.
ఆ సమయానికి పదేపదే నాన్న గుర్తుకొచ్చాడతనికి. మూడో తరగతిలో ఉన్నపుడు బొగ్గు పనికి ఒళ్లు నొప్పులతో నిద్ర పట్టదని తాగొచ్చే నాన్న ఎన్నడూ భార్యను అతన్ని కొట్టలేదు. మార్కులు తక్కువచ్చినా కొట్టలేదు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా శవంగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నన్ను చూస్తే కొట్టే వాడా అనే ఆలోచన రాగానే,
“ఏమైంది, బాల కార్మికుడి కేసా..?”, అడిగాడు ఓ కానిస్టేబుల్. తల అడ్డంగా ఊపాడు.
పక్కనున్న రైటర్ “ఆడు సిన్న పోరడు కాదులే, సూసైడ్ కేసు. అసలు ఈడే మీదికేళి నుకిండేమోనని నా డౌటూ” కానిస్టేబుల్.
*** *** ***
తెల్లటి ఆకాశమంతా బిటుమినస్ కోల్ తో గీకినట్టు నల్లబడింది. రాళ్లు గీకినట్టు అప్పుడప్పుడు మెరుపులు. డిన్నర్ అయిపోగానే, ‘కాలేజీ టెర్రస్ మీద కలుద్దాం. అక్కడైతే ఎవరుండరు’ అని ఆమె మెసేజ్ చూడగానే దగ్గరున్న సెకండ్ షో సినిమా టికెట్ వార్డెన్ కి ఇచ్చేసి హాస్టల్ నుండి బయట పడ్డాడు గిరి. ఎవరి కంట పడకుండా కాలేజ్ లోకి దూరి టెర్రస్ వైపు వెళ్లాడు. మెట్లన్నీ ఎక్కినాకా టెర్రస్ గేట్లు తాళం వేసున్నాయి. తిరిగి వెళ్దామనుకునే లోపే ఆమె వచ్చేసింది. ఆ మెట్ల మీదే కూర్చున్నారు ఇద్దరు. ఎలాగూ యస్ చెప్తుందిలే అని సగం సంతోషం సగం భయం కల్పుకొని అతను ఆమెను చూస్తున్నాడు.
“ఏం లేదు. నెక్స్ట్ మంత్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి కదా, నువ్వు దేనికి అప్లై జేస్తే నేను కూడా దానికే జేస్తా. ఇన్ని సంవత్సరాలు చేయకుండా మొన్న ప్రపోజ్ చేసావ్, మూడు నెలల్లో కాలేజ్ అయిపోతుంది. ఎట్లీస్ట్ జాబ్ వచ్చాకనైనా రోజు కలవొచ్చు అని”, నెమ్మదిగానే చెప్పుకొచ్చింది ఆమె.
గిరి లోపల కాస్త సిగ్గుపడి కాస్త ఆశ్చర్యంతో అడిగాడు, “క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి నేనేందుకి అప్లై చేస్తా?! మాకెలాగో సింగరేణి ఉందిగా. ఇంత సదువు సూదులు వేరే ఉద్యోగాలు నేనైతే జెయ్యా”, కుండ బద్దలు కొట్టాడు.
“హా! మీ బ్రాంచ్ కి జాబ్స్ కూడా వస్తాయని అంత నమ్మకమా ?”, అడిగింది.
సడన్ గా కరెంట్ పోయిన పవర్ గ్రిడ్ లా ముఖం మాడిపోయినట్టు పెట్టాడు. మళ్ళీ ఎప్పుడూ చెప్పే విషయమే చెప్పుకొచ్చాడు, “మన కాలేజీ స్టార్ట్ అవ్వడానికి కారణం ‘మైనింగ్’ అండ్ ‘మైనింగ్ మిషినరీ’ బ్రాంచ్లే. వాటికి తోడుగా మీ ఇతర బ్రాంచ్లని కలిపారు. జార్ఖండ్ లోని ఐఐటి దన్బాద్ తర్వాత మన దేశం లో మైనింగ్ మిషినరీ బ్రాంచ్ మన కాలేజీ లోనే ఉంది తెలుసా”, కాస్త గర్వంగా.
“ఎహే ఆపు, ఎప్పుడు సూడు ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ని పట్టుకొని వేలాడుతావు. అది కాదబ్బా, జస్ట్ బ్రాంచ్ అంటూ ఒకటుంటే సరిపోతదా, దానికంటూ ఓ గుర్తింపు కూడా ఉండాలిగా! కాలేజ్ స్టార్టయిన నుండి ఇప్పటికి వరకు మూడు బ్యాచ్లు బయటికి పోయాయి, అందులో ఎంత మందికి జాబ్స్ వచ్చి సెటిల్ అయ్యారు ? కాలేజ్లో జాయిన్ కావడంతోనే నాలుగేండ్లుగా ఉద్యోగాలు కల్పించాలని నిరసనలు, ధర్నాలు చేసి చేసి మైనింగ్ మిషినరీ అని మర్చిపోయి ‘ధర్నబ్రాంచ్’ అని గుర్తుంది అందర్కి. అసలు వచ్చే సంవత్సరం నుండి మీ బ్రాంచ్ ఉంచాలో తీసేయాలో అని ఆలోచిస్తున్నారు…ఇది తెలుసా నీకు…” కాస్త సైలెంటై, “ అయినా వయసొచ్చిందని ప్రేమిస్తే సరిపోదు, కెరీర్ మీదా కూడా ఫోకస్ ఉండాలే”, ఇంకాస్త సీరియస్ గా బుంగ మూతితో ఆమె.
“సరే, నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు గానీ, గిది పెద్ద ప్రాబ్లమే కాదని నా ఫీలింగ్. సింగరేణి మన కాలేజీ తో కుదురించుకున్న ఎంఓయూ(MoU) లో ఇరవై కోట్లుతో బ్రాంచ్ ని ఎంకరేజ్ చేయడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇప్…పి..స్..తామని”, అతని పూర్తిగా చెప్పక ముందే లేచి నిల్చుంది. విసుగొచ్చిన ముఖచిత్రంతో పళ్లు కొరుకుతూ కండ్లల నీళ్లు ఆపుకుంటుంది, “సంపయ్ రా నన్ను, ఓ పీడపీక్తది. అరే నీకు చెప్తే అర్థం కాదారా, ఎన్ని సార్లు చెప్తావ్ ఇవన్ని. నాకు ఏ మాత్రం నమ్మకం లేదు గిరి. ప్లేస్మెంట్ సెల్లో రేపు నువ్వు అప్లికేషన్ పెడ్తాను అంటేనే మన రిలేషన్ కొనసాగుతుంది, లేకుంటే మా…త్..ర్..రం”, కన్నీళ్లు బయటికొచ్చేసాయి. అతను ఓదార్చడానికి ముట్టుకోగానే చీదరించుకుంది. అతను అంతే మొండిగా
“నేను అప్లై చెయ్యను”, అన్నాడు. ఏడ్చుకుంటూనే మెట్లు దిగడం మొదలెట్టింది. అతను వెనకే వెళ్లి పిలుస్తున్నా ఆమె పరిగెత్తింది. లైట్స్ ఆన్ చేస్కుంటూ సెక్యురిటీ మీదికొచ్చింది. ఏడుస్తున్న ఆమెను చూసి ‘ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం చేయబోయాడని అడిగి’ అతన్ని లాక్కెళ్లారు.
“వాడికేం చాతగాదు. వదిలేయండి” అంటూ సెక్యురిటీకి చెప్పి వెళ్లిపోయింది. వాళ్లకు అర్థం కాలేదు, అతనికి అర్థమైనా పట్టించుకోలేదు.
“ఏం పోరగాండ్లో, ఏది సక్కగ చెప్పరు. ఏమైనైతే ఎవరు రెస్పాన్సిబుల్”, సెక్యురిటీ మొత్తుకున్న విడ్చిపెట్టుకొని ఆమె వెంటే అతని పరుగు.
ఆమె హాస్టల్ కి సేఫ్ గా రీచ్ అయ్యిందో కూడా పెట్టలేదు, అతను మెసేజ్ చేసాడు, చూసింది రిప్లై ఇవ్వకపోయే సరికి డిలీట్ చేసి కూర్చున్నాడు. బుర్ర నిండా ఆలోచనల్తో ఆ రాత్రి నిద్ర పట్టట్లేదు. ఆమె మాటలు, నమ్మకం లేదు…చాత కాదు…వదిలేయ్…అతన్ని వదలట్లేదు.
మిగితా బ్రాంచ్ లతో పోలిస్తే అతను చేరిన బ్రాంచ్ కి తక్కువ స్ట్రెంత్ ఉండడంతో ఎవరు పట్టించుకోకపోవడం, అసలు కనీసం గుర్తించక పోవడంతో…చివరికి ఆ బ్రాంచ్ లో జాయిన్ అవ్వడమే అతని చేసిన తప్పు అన్నట్లు ప్రేమ కూడా దూరమవ్వడం బయటకి కోపాన్ని, లోపల బాధని పెంచుతూ ఉంది.
మరుసటి రోజు.
మైనింగ్ మిషినరీ విద్యార్థులంతా… కాలేజీ హడలెత్తిపోయేలా నినాదిస్తూ బయట కూర్చున్నారు, వచ్చే ప్రిన్సిపల్ కార్ కి అడ్డంగా. ఎప్పటి లాగే వచ్చి నచ్చజెప్పబోతే, ఈ సారీ తిరగబడ్డారు.
“చూడండి. ఒప్పందం ప్రకారం కాలేజీ చేయాల్సింది చేస్తుంది, మీరైమైన అడగాలి అనుకుంటే సింగరేణి సంస్థని అడగండి. మా ప్రయత్నాంగా ఎన్ని వినతి పత్రాలు, మీటింగ్ లు పెట్టి అడిగినా మాకు సరైన రెస్పాన్స్ రాలేదు. అనవసరంగా కాలేజీలో ఇలా ధర్నా చేస్తూ మిగితా వాళ్లకు డిస్టర్బన్స్ క్రీయెట్ చేయొద్దు. మీ సీనియర్స్ ఎలాగూ అవస్థలు పడ్తున్నారు. మారైనా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోండి. ఉద్యోగాలే లేవంటే ఇక బ్రాంచ్ ఎందుకురా…తీసేస్తేనే నయమని మీకెప్పుడు అర్థమౌతది”, అంటూ ప్రిన్సిపాల్ సీరియస్ గా నచ్చచెప్పాడు.
“సీనియర్స్ అవస్థలు పడ్తున్నారు కాబట్టే మేము ఇదంతా చేయల్సొస్తుంది సార్. ఎట్లీస్ట్ 2013 పాస్డౌట్ బ్యాచ్ గా మేము, మా తర్వాత బ్యాచ్లు, ముందు వాళ్లలా కాకుండా ఫ్యూచర్ కోసం ఇప్పుడు పోరాడక తప్పట్లేదు సార్. ప్లీజ్ ట్రై టూ అండర్ స్టాండ్. బ్రాంచ్ తీసేస్తే తీసేయండి తప్పులేదు కానీ మా బతుకేంటో…మా భవిష్యత్తేంటో…ఓ దారి చూపి తీసేయండని మా బాధ మీకెప్పుడు అర్థమౌతది”, స్టూడెంట్స్.
“దెన్ గో అన్ మీట్ సింగరేణి హెడ్స్.”, అంటూ ప్రిన్సిపల్ వెనక్కి కూడా చూడకుండా లోపలికెళ్లాడు.
మైనింగ్ మెషినరీ స్టూడెంట్స్ కాలేజీలో చేసేది ఏమిలేక అక్కడి నుండి సెంటినరీ కాలనీలోని సింగరేణి జీఎం ఆఫీస్ ముందుకి వెళ్లారు. అందరు తమ పనిలో మునిగి ఉండడంతో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడి మేనేజర్ ని కలుద్దామని లోపలికెళ్తుంటే సెక్యురిటి సిబ్బంది బయటికి తోసారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ఆఫీస్ ముందే గట్టిగా అరుస్తూ కూర్చున్నారు. అయినా కూడా ఎవరు చూడట్లేదు. చూసి చూసి ఓపిక నశించింది. ఆఫీస్ ముందున్న రోడ్ మీదికి ఎక్కారు. ప్లకార్డులతో రాస్తారోకో చేశారు. కిలోమీటర్ల మెర వాహనాలు ఆగాయి, కాసేపటికి దాంట్లో సింగరేణి బొగ్గును తీస్కపోయే డంప్ ట్రక్లు కూడా నిలిచిపోవడంతో పోలీసులు దిగారు, అయినా స్టూడెంట్స్ బెదరలేదు.
కాసేపటికి మెల్లిగా ఆఫీసులోని ఓ ఏసీ గదిలోంచి పిలుపొచ్చింది, “పది మంది విద్యార్థులతో మాట్లాడాలి, లోపలికి రండి”, అని.
అక్కడి మేనేజర్, వాళ్ళ పై ఆఫీసర్ సంతకంతో ఉన్నా ఒక ఆర్డర్ విద్యార్థులకి ఇవ్వగానే, వాళ్ళ గుండెల్లో ఓపెన్ కాస్ట్ మైన్ బ్లాస్టింగ్ జరిగినట్టైంది.
“డైరెక్టర్ జనరల్ అఫ్ మైనింగ్ సేఫ్టీ వాళ్ళ గుర్తింపు మైనింగ్ మిషినరీ బ్రాంచ్ కి లేనందున, ఈ బ్రాంచ్ చదివిన వాళ్ళు కోల్ మిషినరీ పనితీరు, నిర్వహణ కి సంబంధించిన ఉద్యోగాలకి అనర్హులు. ఇక పై ఈ బ్రాంచ్ ని తొలగించడం మంచిది మరియు ప్రస్తుతానికి మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళను మిషినరీ మైన్టైనెన్సు ఉద్యోగాలకి అర్హతను ఇస్తూ త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం”, అని తేల్చేశారు.
విద్యార్థుల నోట్లో బొగ్గు కొట్టినట్టైంది. గనులని నమ్ముకున్నందుకు బూడిదే మిగిలేలా ఉందని కొంత మంది అక్కడే ఏడ్చేశారు. ముఖ్యoగా గిరి అయోమయంగా ఉన్నాడు. ఆఫీస్లో లొల్లి లొల్లి చేసారు కానీ బయటికి గెంటేయడంతో కాలేజ్ కి వచ్చారు. ఈ గ్యాప్లో ఒకడికి కోపం హై గ్రేడ్ బొగ్గు లాగే అంటుకుంది, అంత తొందరగా చల్లారేలా లేదు. ఉన్నట్టుండి ఒంటికి నిప్పంటిచుకోబోయాడు. కానీ చుట్టున్న వాళ్లు ఆపారు, కానీ కాసేపటికే కాలేజ్ అంటుకుంది. నినాదాల హోరు, క్లాస్లు జరగకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసారు. ఏం లాభం, ఒక్క రోజు మందమే! ఆ ఒక్క రోజు కూడా మిగితా బ్రాంచ్ వాళ్లు వీళ్లకు మద్దతుగా రారు, క్లాస్లు తప్పాయి అంటూ మాస్ బంక్ లాగా సినిమా కి వెళ్తారు, కొంత మంది లవ్ బర్డ్స్ క్యాంటీన్ వెనక్కి వెళ్తారు.
ఎవరో సజెస్ట్ చేస్తే ఎందుకైనా మంచిదని మెషినరి స్టూడెంట్స్ మొత్తం ఎమ్మెల్యే దగ్గరకి వెళ్ళారు. కానీ కానీసం కలవడానికి సమయం కూడా ఇవ్వలేదు. అయినా ఎదురు చూసారు. ఎప్పుడు ఉపయోగించే నిరసన పద్ధతిని అక్కడ పనికొచ్చేలా లేదు, ఎందకంటే ఆల్రెడీ పది టెంట్లేసి ఎవరెవరో పెద్దలు కూర్చున్నారు. చాలా సమయానికి ఎమ్మెల్యే బయటకి రాగానే విద్యార్థులంతా ఎదురుపడ్డారు ,”మీ ప్రిన్సిపాల్ నా మాట ఎప్పుడైన వింటాడా అసలు. సింగరేణికి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, దాంట్లో మీ విషయం గుర్తొస్తే చెప్తాను. కాలేజీ నిధుల నుండి వాటా లెక్కలు సరిగ్గా లేవు, మా వాళ్లకి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ లు ఇవ్వలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యా క్యాంపస్ లోకి అడుగు పెట్టను అని. అర్జంట్ గా ట్రాన్స్ఫర్ చెయ్యాలి వాడిని. విద్యా శాఖ మంత్రి మద్దతు ఉన్నంత మాత్రానా నన్ను కాదని కాలేజ్ కి స్పెషల్ ఫండ్ ఎలా అడుగుతాడు మీ ప్రిన్సిపాల్ ?”, అంటూ ఏదేదో అనేసి కారెక్కి వెళ్లిపోయాడు.
మాజి ఎమ్మెల్యే దగ్గరికి పోతే అంత వివరంగా విని కాసేపు ‘అయ్యయ్యే…అర్రర్రే…’ అని,
“నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తే అప్పుడు తప్పకుండా ట్రై చేస్తా, ఇప్పుడు వెళ్లి చదివుకోండి”, అన్నాడు.
మరుసటి రోజే..
పేపర్లో పెద్దగా ఓ వార్త..
ఈ సారీ బడ్జెట్ లో కాలేజీ కి వంద కోట్లు సాంక్షన్ అయ్యాయి అని. క్యాంపస్ లో అందరికి ఏదో సంబరం, ఏదో మారబోతదని ఆశ…వెంటనే కాలేజీ ఫెస్ట్ కి సిద్ధం అయిన్ది. రంగు రంగుల జెండాలతో, ముగ్గులతో ముస్తాబైంది.
గేట్ కి దూరం గా మాత్రం నీరసంగా నిరసన తెల్పుతూ మైనింగ్ మిషినరీ విద్యార్థులు. ముఖ్యoగా గిరి, వంద కోట్లు అనగానే ముస్తాబవుతున్న కాలేజీ వైపు కోపంగా చూస్తున్నాడు.
అర్థరాత్రి హాస్టల్ రూమ్లో నిద్రపోకుండ కూర్చున్నాడు. ఎవేవో అతని మెదట్లో తిరుగుతున్నాయి. భవిష్యతoతా శూన్యంగా కనబడుతుంది. ప్రైవేట్ కాలేజీలో అసలు ఈ బ్రాంచే ఉండదు, ప్రైవేట్ కంపెనీలో సంబంధించిన ఉద్యోగాలే ఉండవు, ఏ సాఫ్ట్ వేర్ కో లేదా ఎంబీఏ చేయడానికి ఈ బ్రాంచ్ తీస్కొని లాభం ఏంటి అనే ప్రశ్నలు లోలో ఏదో ఉద్వేగాన్ని రేపుతున్నాయి. ఇళ్ళు, ఊరు గుర్తొస్తుoది. ఎంత ఇంజనీర్ ఐనమాత్రాన, కన్నీళ్లకు ఆనకట్ట కట్టలేడుగా. చేతిని నోటికి అడ్డం పెట్టుకొని ఏడవసాగాడు. కాసేపటికి ఉక్రోషంతో లేచి బయటికి నడిచాడు.
రెండు బీర్లు కొనిస్తే టెర్రస్ తాళం చెవి ఇచ్చాడు ఓ సీనియర్. గబగబా కాలేజీలో వెళ్లి టెర్రస్ వైపు పరిగెత్తాడు. మెట్ల గోడలకున్న ‘మోటివేషనల్ కొటేషన్’లు ఏవి అతన్ని ఆపలేకపోతున్నాయి. ఆశ్చర్యంగా గేట్ తాళం తీసే ఉంది.! టెర్రస్ అంత ఖాళీగానే కనబడుతుంది అనుకుంటున్నప్పుడు ఓ మూలకి ఎవరో అటు తిరిగి ఉన్నారు, సడన్ గా కిందికి దూకేసారు.! దబ్ మని ఒక శబ్దం. ఉలిక్కిపడ్డ సెక్యురిటీ గార్డ్స్ విజిల్ శబ్దాలతో లైట్లు వేస్కుంటూ మీదికి వచ్చారు. కాసేపటికే కాలేజంతా లేచి ఉరికొచ్చింది. దూకదామనుకున్న గిరి కూడా కిందికి దిగాడు. అందరు దూరం దూరంగా గుమ్మిగూడారు…ప్రిన్సిపాల్ శవం చుట్టు!
**** **** ****
“అసలు ఈడే ప్రిన్సిపాల్ ని మీదికేళి నుకిండేమోనని నా డౌటూ”, రైటర్ తోని ఓ కానిస్టేబుల్.
“అయినా పిలగాండ్ల సచ్చిన కాలేజీ చూసిన గాని గిట్ల సార్లు, ఏకంగా ప్రిన్సిపాలే ఆత్మహత్య చేసుకున్న కాలేజీ యేడ సూడ్లే. అనవరసరంగా కాలేజీకి మచ్చలు తెచ్చుడే ఉన్నదిపో. రేపటి సంది ఈ కాలేజీలో జాయిన్ కావాలన్నా జంకుతరు జనాలు”, అన్నాడు కానిస్టేబుల్.
“ఏ ఊకో వ్యా నువ్వు, భలేటోడివి. గట్ల కాలేజీ ని అంటవ్ ఏంది! అన్ని ఇప్పటి మందమే అని తెల్వదా. పెద్ద పెద్ద ఊర్లల్లా ఐఐటీ, ఎన్ ఐ టీ లుగా ఉన్నవి ఒక్కప్పుడు కమ్యునల్ ప్రభావమున్న రీజినల్ కాలేజీలే కదా. అందులో ఇసొంటివి జరగలేవా ఏంది, అయినా కూడా మంచిగా సదువుకోని బాగుపడ్డ వాళ్ళు మస్తు మంది ఉన్నారు. గిసొంటివి వట్టుకొని కాలేజీని సులకన సూడద్దు. ఇప్పటికే యూనివర్సిటీ కాలేజీ అంటే ఉద్యమం, గొడవలు, ఆత్మహత్యలనే ముద్ర మస్తు పడింది. పాపం కాలేజీ పోరగాండ్లంతా మంచిగా అడుగుతే ఎవరు సక్కగ పట్టించుకోరు. అదే పోరాడి, ధర్నా, లొల్లిలు చేస్తనే పట్టించుకునేటట్టు ఉన్నరు”, అన్నాడు ఇంకో పోలీస్.
అప్పుడే గిరి వాళ్లమ్మ స్టేషన్ కి వాళ్ల తమ్ముడితో వచ్చింది. గిరి తల్లిని పట్టుకొని ఏడ్వసాగాడు, అతన్ని ఒదార్చుతూ ఆమె కూడా ఏడుస్తూనే ఉంది. స్టేషన్ అని కూడా చూడకుండా కాసేపటికే గిరిని తిడ్తూ కొడ్తుంది.
ఇన్స్పెక్టర్ రాగానే వాళ్ళను బయటే ఉండమని, గిరి ని లోపలికి రమ్నన్నాడు. పేరు, ఊరు లాంటి వివరాలు అడుగుతూ భయం పోగొడుతున్నాడు.
“నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావ్ ? అక్కడ ఏం చేసావ్, ఏం చూసావ్ ?”, విచారించాడు. బిక్కుబిక్కుమని అతను చూసింది మొత్తం చెప్పాడు. గిరి వాళ్లమ్మను, బంధువుని కూడా విచారించాడు.
వివరాలు అడిగినప్పుడు ఆమె చెప్పినదాంట్లో తల్లి తండ్రి గురించి చెప్తూ ,”ఇయ్యాల్రేపు మిచిన్లు అచ్చినాక, బొగ్గు తీసుడు బగ్గ అల్కగైoది గదా సారూ… సింగరేన్ల గవి నడుపుకుంటూ నడిమిట్లవడి సచ్చిండు సారూ నా మొగుడు”, అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంటుందామె.
ఇన్స్పెక్టర్ కి పూర్తిగా అర్ధం కాలేదు, “అంటే సార్, సింగరేణి మిషీన్ల పరంగా ఎప్పటిదప్పుడు అప్డేట్ గా ఉంటుంది. కన్టీన్యూస్ మైనింగ్ మెషిన్లు, డంపర్లని, లోడర్లని, లిఫ్టర్లని, క్రషర్లని ఎన్నున్న, అన్ని కూడా అడ్వాన్స్డ్ వచ్చినై. గాని వాటి పనితీరు, మైన్టైనెన్సు చూసుకునే మెషినరీ ఇంజినీర్లు మాత్రం సరిగ్గా లేక మెషిన్ల వల్ల ప్రమాదాలు జరిగినవి చాలానే ఉన్నాయ్. గట్లనే కోల్ కట్టర్ మెషీన్ ల బెల్ట్ తెగి మెషిన్ లో ఇర్రుక్కుపోయి వీళ్లు పెద్ద దిక్కు సచ్చిపోయిండు సార్. ఇప్పటికి కార్మికులు, వాళ్ళ సంఘాలు, మైన్టైనెన్సు వాళ్ళు లేనిదే మేము మిషిన్ లు ముట్టమని ధర్నాలు చేస్తనే ఉన్నా, సంస్థా మాత్రం రిక్రూట్ చేస్కుంటున్నాము అని చెప్తూ వాళ్ళని చల్లపరుస్తున్నారు”, కాస్త క్లారిటీ ఇచ్చాడు వెంట వచ్చిన గిరి మేనమామ.
“సంస్థ గొప్పది సారు. గట్ల నా మొగుడు పోయినాక మమ్ముల్ని ఆదుకుంది. సూసుకుంది. సింగరేణే కాలేజీలు పెట్టి బ్రాంచ్లు పెట్టి సదుపిత్తాంది”, అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది.
ఈ గ్యాప్ లో ఇన్స్పెక్టర్ కి ప్రిన్సిపాల్ సూసైడ్ కి సంబంధించి పై అధికార్ల నుండి ఫోన్లు వస్తూనే ఉన్నాయి.
**** ***** ****
మౌళి గెస్ట్ హౌస్ ముందు దిగగానే, విలేకర్ రమేష్ కి నమస్తే పెట్టేసాడు. డ్రైవర్ మళ్లి టీ షాప్ దగ్గర డ్రాప్ చేసేసాడు. అప్పటికే రేపటి నుండి కొత్త ప్రిన్సిపాల్ గా మౌళి నియమించిన న్యూస్ హెడ్ ఆఫీస్ నుండి పంపమని ప్రెజర్ స్టార్ట్ అయ్యింది.
కిటికిలోంచి చూస్తూంటే కనబడ్డాయి, కాలేజీ పేరు తప్పా మిగితా క్యాంటీన్,లాబ్స్, హాస్టల్స్ పేర్లన్నీ ఎవరెవరివో ఉన్నాయ్. కొన్ని చెరిపేసి మరి ఉన్నాయ్, ‘ఇక్కడి లోకల్ లీడర్ల భార్య, పిల్లల పేర్లు కనబడుతాయి సార్. లీడర్లు మారినప్పుడల్లా ఆ పేర్లు కుడా మారుతాయి’, రమేష్ మాటలు గుర్తొచ్చాయి మౌళికి.
అడగకపోయినా కూడా ఒకావిడా టీ తెచ్చింది. ఆమెను చూడగానే మళ్లీ రమేష్ మాటలే గుర్తొచ్చాయి,
“జాగ్రత్త సార్. ఇక్కడ దాదాపు వాళ్ల మనుషులే ఉంటారు. నిజానికి నేను పత్రికలో పనిచేస్తున్న కాబట్టి తెల్సింది సార్…వంద కోట్లు సాంక్షన్ అయిన తర్వాత లీడర్లకి మనసునపట్లేదు.! ఇక్కడే మైనింగ్ మిషినరీ బ్రాంచ్ చదివిన ఓ అమ్మాయి లెక్చరర్ గా జాయిన్ అయ్యింది. ఆ బ్రాంచ్ తీసేస్తున్నారని తెలియడంతో ఆమెకు తర్వాత ఆ జాబ్ ఉండది కదాని ‘ఎలాగో కాలేజ్ నుండి పోయే ముందు మీ ప్రిన్సిపాల్ ఇక్కడి నుండి పోయేలా…నీ మీద ఓ పాడు పని చేయబోయాడని ప్రచారం లేపు. నీకు నేను వేరే జాబ్ ఇప్పిస్తా’ అని ఇక్కడ ఓ లోకల్ లీడర్ అన్నాడటా సార్. అది తట్టుకోలేకే పాత ప్రిన్సిపాల్ చంద్రం సార్ సూసైడ్ చేస్కున్నాడు”.
కొత్త ప్రిన్సిపాల్ మౌళికి రమేష్ మాటలతో వచ్చిటప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేకుండాపోయింది. గెస్ట్ హౌస్ కిటికిలోంచి సుధీర్ఘంగా ఫెస్ట్ కోసమని ముస్తాబైన కాలేజీ వైపు చూస్తున్నాడు.
మరుసటి రోజు.
వైస్ ప్రిన్సిపాల్, హెచ్ఓడీ స్టాఫ్ కి విషయం ముందే తెల్సు కాబట్టి పోస్ట్ పోన్ అవ్వాల్సిన ఫెస్ట్ ని కావాలనే రాబోతున్న కొత్త ప్రిన్సిపాల్ మరియు అతిథులుగా వస్తున్న లోకల్ లీడర్ల కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాటు చేసి బొకేలతో ఎదురుచూస్తున్నారు. గేట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్న మైనింగ్ మిషినరీ విద్యార్థుల్ని ఎవరు పట్టించుకునే స్టేజ్లో లేరు.
సరిగ్గా వాళ్ళ కార్లు,కాన్వాయ్లు గేట్ లోపలికి రాగానే…స్టాఫ్ అంత ఆశ్చర్యపోయేలా, అప్పటికప్పుడు రంగు రంగుల జెండాలు నేలకూలి నల్ల జెండాలు పైకి లేచాయి. క్యాంపస్ లోపల వందకు పైగా విద్యార్థిని విద్యార్థులు గుమ్మిగూడి దారికి అడ్డంగా కూర్చున్నారు. ప్లకార్డులు పైకి లేపి స్లోగన్ల తో ఒక్కసారిగా హోరేత్తారు. గేట్ బయట నిరసన వ్యక్తం చేస్తున్న మైనింగ్ మిషినరీ విద్యార్థులు లోపల జరుగుతున్నది చూసి బిత్తిరి పోయారు. వాళ్ళకి తేలేదు క్యాంపస్ మొత్తం వాళ్ళకి అండగా ఉందని. ముఖ్యoగా గిరి, తనకి బ్రేకప్ చెప్పిన ఆమె అందరికంటే ముందుంది ధర్నా చేస్తుంది. అప్పటికే పోలీసులు చుట్టుముట్టారు. విద్యార్థులు తిరగబడ్డారు.
గాల్లో రాళ్ళూ లేచి కార్లు కాన్వాయ్ ల మీద పడ్డాయి. కాలేజీ సెక్యూరిటీ ,పోలీసులు లాఠీలు పట్టారు. ఎటుపడితే అటు పరుగులు. ఫెస్ట్ కోసం వేసిన స్టేజి, ఫ్లెక్సీలన్నీ నెల కూలాయి. అరెంజ్ చేసిన కుర్చీలు చల్లాచెదురురయ్యాయి.
కార్యక్రమాన్ని ఫోటోలు తీద్దామని వచ్చిన విలేకర్లకు, లైవ్ హాట్ టాపిక్ దొరికినట్లయింది. అప్పటికే సోషల్ మీడియా లో వీడియోలు పోస్ట్ చేయడంతో లైక్లు, షేర్లతో వైరల్ అయిన్ది. “ఉన్న మైనింగ్ మెషినరీ స్టూడెంట్స్ కి మెకానికల్ బ్రాంచ్ ఈక్వివలెంట్ గుర్తింపు ఇవ్వాలి లేదా ఉద్యోగాలు కల్పించాకే బ్రాంచ్ ఉంచాలో తీసేయాలో ఆలోచించండి”, అన్న ధర్నా ఉద్దేశం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి చేరింది…ప్రభుత్వం చర్చలు మొదలెట్టింది. రాయి దెబ్బలతో ఆమె, లాఠీల దెబ్బలతో గిరి, ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సారి లాఠీ దెబ్బతో నీరసంగా కల కంటున్న గిరి నిజంగా నొప్పితో పైకి లేచాడు.!!
మిగితా పోలీసులు వచ్చి టెంట్ కింద కూర్చున్న మిషినరీ విద్యార్థుల్ని తరిమేస్తూ గిరిని కూడా నూకుతున్నారు. అప్పుడే పూర్తిగా తేరుకున్నాడు.
లోపల రిబ్బన్ కట్ చేసి బెలూన్లు ఎగిరేస్తూ కొత్త ప్రిన్సిపాల్ ఫెస్ట్ మొదలెట్టాడు. బయిట మిగితా సగం టెంట్ కూడా కూలిపడింది. దాని మీద నీరసంగా గిరి కూడా కుప్పకూలాడు.
***
(మైనింగ్ మిషినరీ బ్రాంచ్ తీసేసి ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగస్తుల్లో అడ్వాన్స్ మిషినరీ వాడడం & మెయింటెయిన్ చేయడం రాకపోయేసరికి సింగరేణి బొగ్గు తవ్వకాల్లో ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి)
Good story Preetam 👏.
I think this is the first story in Telugu to elevate regarding Mining Mechinary branch students. Able to visualise things while reading everyline, well narrated. Keep writing more, Congratulations 🙌.
మంచి కథ రాసారు. అసాంతం చదివించగల కథ, ముగింపు ఒక హార్డ్ రియాలిటీ. 👏👍
కొత్త కథాంశం, నడిపించిన తీరు కథకు ప్రత్యేకమైన బలాన్ని చేకూర్చింది సార్. టైటిల్ తో కథ చదవక ముందు ఓ ఉద్దేశ్యం ఏర్పడ వచ్చును కానీ చదివాక అర్ధమైంది. 2013 కాలాంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయం కూడా పీక్ లెవల్లో ఉండడం వల్లా , ఆ బ్రాంచ్ కి సంబంధించి ఎంత కొట్లాడినా పట్టించుకునే నాథుడే లేకపోవటం జరిగింది, ఆ పాయింట్ తో కూడా కథ మధ్యలో ఉందేమోనని చూసాను.
కథ బాగుంది ప్రీతమ్. ప్రిన్సిపాల్ కి ఇంకా వేరే మార్గాలు కూడా ఉంటాయి కదా! కథ నడిపిన తీరు అద్భుతంగా ఉంది.
వాస్తవిత కు అద్దం పట్టిన కథ, చాలా బాగుందండీ
ఈ మధ్య కాలంలో ఇలాంటి కాలేజీ-బ్రాంచ్ కథలు చదవలేదు. కొత్త కథ రాసావు. Keep it up 👏👏
యువ కథకుడికి అభినంధనలు .మంచి రచన శైలి.పాఠకుణ్ణి చదివించింది.ఇంజినీరింగ్ బ్జీరా జీవితాల అభద్రతను కళ్ళకు కట్టినట్లు చూపించావు ఇంకా మంచి కథలు రాస్తావని ఆశిస్తున్నాను.