లోకపు స్పర్శ!

Spread the love

సూర్యుడు చంద్రుడు గతులు తప్పటంలేదు,
మట్టిలో విత్తు చిగురిస్తూనే ఉంది
సమస్త ప్రపంచం గిరుగిర్రున తిరుగుతూనే ఉంది!
ఋతువులు మాత్రం
అల్జైమర్స్ బారిన పడిన మనిషిలా
తడబడుతున్నాయి!
వానావానా వల్లప్పా ఆటలాడించే వర్షపు చినుకులు
తుఫానుల బారిన పడి
వరదలై ఊళ్లకూళ్లు మింగుతున్నాయి!
యుగాంతం ఇంకా ఎంత దూరం?
ఎంతకీ తెలవారని రాత్రులు
మరింత దీర్ఘాలవుతున్నాయి!
ఎంత ఒబ్బిడిగా పడుకుందామనుకున్నా,
నిశిరాత్రి మెలకువ పలకరిస్తూనే ఉంది!
కళ్ళు తెరిస్తే కిటికీ కావలి చారెడు ఆకాశం
బూడిదరంగు పులుముకుని దిగులు పుట్టిస్తోంది!
రాత్రింబవళ్ల మధ్య నలుగుతున్న జీవితపు చరమాంకం
మళ్లీ తెల్లవారుతోందంటూ బావురుమంది!
పక్కన అలికిడి లేక, పలకరింపూ లేక
లోకపు స్పర్శ కోల్పోతుంటే,
దూరంగా పసిపాప ఏడుపు…
ఎన్ని జన్మలనాటిదో బతికున్న జ్ఞాపకాన్ని పట్టుకొచ్చి
ఒంట్లోని రక్తాన్ని వెచ్చబరిచింది!

అనూరాధ నాదెళ్ల.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *