దర్భలు దారితీస్తే కుదురైన పాపిడికి పొడవు సిందూరాలు అద్దిన సీమంతం సీను.
బొజ్జలో బుజ్జికి ఒడిబియ్యంలో తొలి ఒజ్జబంతి.
గలగల ముచ్చట్ల మట్టి గాజులే జంత్రవాద్య కచేరి.
గడువులు మీరిన దొంగ చలిమిడికి గసగసాల garnish.
పిరమైన డాలర్ పూలకి పసుపుకుంకాల చందనం.
ఇరుగు దిష్టి… పొరుగు దిష్టి… నా దిష్టి… నీ దిష్టి… థూ… థూ… థూ…
మెటికలై విరిగిన ఉప్పుగల్లు మురిపెం
ఘాటు మిరపకాయ తుమ్ముకి చిరంజీవ దీవెన
దిగదుడిచిన కింకనీళ్ళలో కినుక బుడగల తుంపర
కావిరిబొట్టుతో బుగ్గనంటిన మొనగోరు చనువు
దిష్టిపూసల నులితాడు తాకి చక్కిలిగింత
అగరుధూపాలు ఆత్రాల రేగి, సాంబ్రాణి పొగలు మేఘాలై కమ్మి Molonglo నది దాకా ఫైర్ ఎలర్ట్!
అక్క బ్రో వేవిళ్లకి చెల్లి బ్రో…చేవారెవరురా వెక్కిళ్ల క్కూడా వీసాలు రాక విలవిల.
ఉన్న తాళాలు తప్పించి, లేని రాగాలు రప్పించి, కొత్త వాచకాలు చొప్పించిన నీ Facetime పేరంటం పాటకి ఉల్లాస ఉపగ్రహాల ప్రత్యక్ష ప్రసారం.
వెయ్యి ఆమడల అవతల చిట్టి గుండె డప్పుకి నీ చిన్దుల cheers.
నీ క్లేశానందబాష్పంలో ఉప్పటి వెన్నెల ఇసుక తీరాల ప్రేమై ఎగసే పాల సముద్రం.
చివ్వున చిమ్మే బుగ్గబావి పూడిక గొంతులో దిగమింగిన దిగులు పాట.
అయినా పొంచిన కంచెలకే గానీ, మించిన నీ ఆకాశాల వర్షప్రహర్షాలకి ఉంటుందా immegration checking?
అంచెలంచెలుగ మడిచే పుటల్ని పురాస్మృతుల పుస్తకంలా చదువుతోంది.
తొమ్మిది అరల తెలివిడి తొర్రలో మెలకువ కలల దోబూచులాడుతోంది.
సచ్చిదానంద బాలాసనంలో నీ వ్యూహాలు వింటోంది. మోస్తున్న అమ్మకే అష్టావక్ర గీత వినిపిస్తోంది. గుర్తుపట్టదని గుబులెందుకు నీకు. బొడ్డుతాడు ప్రవాహాలకి అటుఇటూ పల్లమే.
వామనగుంటల పందేరంలో లెక్కతప్పి, అష్టాచెమ్మా ఆటల్లో పట్టుతప్పి ఎగిరొచ్చిన ఎనకటి జన్మాల చింతపిక్క నీ ముంజేతికి పుట్టు వాయినాల మచ్చ – పెట్టుడు Tatooల చెంపపెట్టు… వంద కొండగుర్తుల తీసికట్టు! మరిక త్రివేణి తీర్థానికి ముందొచ్చిందెవరని మూడో పాయ ఆరాలు తీస్తుందా?
జంట చెట్టు అంటు కొమ్మకి అంటిన పుప్పొడి పూతకి ఇది చిన్నమ్మ…. చిన్ను అమ్మ emotional surrogacy కత అని తెలియకుంటుందా?
నా చిన్నతల్లికి*
