సాహితీ ప్రియులందరికీ నమస్కారాలు. మిత్రులు శ్రీ వెంకట్ నాగం గారు రచించిన రెండు విశిష్ట గ్రంథాలను పది రోజుల క్రితమే వాషింగ్టన్ డి.సి.లో యూ ఎస్ పీ యెస్ పోస్టు ద్వారా స్వీకరించాను. సెప్టెంబర్ 27, 2026న తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య వేదిక 96వ అంతర్జాల సదస్సులో జరిగిన ఈ ఆవిష్కరణ మహోత్సవం చిరస్మరణీయంగా నిలిచింది. ఇందులో భాగస్వామినయ్యే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సదస్సు సంధానకర్త, తెలుగు భాషా సాహిత్యాల పట్ల అచంచలమైన అంకితభావం కలిగిన డా. ప్రసాద్ తోటకూర గారికి ముందుగా నా అభినందనలు. ప్రతి నెలా తానా సాహిత్య వేదికపై ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, సాహితీ ప్రియులను ఒక్కచోట చేర్చడం అభినందనీయం.
వెంకట్ గారితో నాకు చాలా సంవత్సరాలుగా ఆత్మీయ పరిచయం ఉంది. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారి అమెరికా-2023 పర్యటన నిర్వహణను మేమిద్దరం కలిసే పర్యవేక్షించాం. అలాగే శాక్రమెంటో తెలుగు అసోసియేషన్ (టాగ్స్) ద్వారా కూడా మాకు మంచి పరిచయం ఉంది. వెంకట్ గారు నన్ను కూడా తరచూ వ్యాసాలు రాయమని అడుగుతుంటారు.
వెంకట్ గారు ఎప్పుడో ఒకసారి వ్యాసాలు రాస్తుంటారనే అనుకున్నాను తప్ప, ఇన్ని వ్యాసాలు రాశారనే విషయం నాకు అసలు తెలియదు. ఇప్పుడు ఈ పుస్తకాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది! సరళంగా చెప్పాలంటే, శ్రీ ఇనాక్ గారు అన్నట్లు, ఇది కేవలం ఒక ‘కలగూర గంప’ మాత్రమే కాదు, విభిన్న సాహిత్య ప్రక్రియల ‘సంగమ క్షేత్రం’. ‘సంగమ క్షేత్రం’ అనే పదాన్ని ఉపయోగించారంటేనే ఈ పుస్తకానికి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
కలగూరగంప’, ‘రచ్చబండ చర్చలు’, ఈ రెండు పుస్తకాలలో ఎన్ఆర్ఐల సమస్యలు కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించిన వివరాలు, రామజన్మభూమి విశేషాలు, లేదా మన ‘మనబడి’ పాఠశాల గురించిన సంగతులు… ఏ విషయాన్నీ ఆయన వదల్లేదు. అసలు ఈయనకు ఏ అంశంలో పట్టు ఉందో, దేనిపై లేదో అర్థం కానంత వైవిధ్యంగా, లోతుగా రాశారు. ప్రతి అంశంపై చాలా కూలంకషంగా పరిశోధించి, లోతుగా విశ్లేషించి మరీ రాశారు.
కచ్చితంగా మనమందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకంటే, ఒక్క అంశం మీద అవగాహన ఏర్పరచుకోవడానికి, పరిశోధన చేయడానికే మనకు చాలా సమయం పడుతుంది. అలాంటిది ఇన్ని భిన్నమైన అంశాల మీద ఆయన పూర్తిగా అధ్యయనం చేసి, మనకు ఒక విందు భోజనంలా ఈ వ్యాసాల సంకలనాలను రెండు పుస్తకాల రూపంలో కూర్చి మనందరి చేతిలో పెట్టారు. “అంతా సిద్ధం – ఇదిగోండి, చదువుకోండి” అని చేతికి అందించినట్లుగా ఉంది. నిజానికి మొదట్లో ఈ పుస్తకాలలో విషయ పరిజ్ఞానం ఇంత లోతుగా ఉంటుందని నేను అనుకోలేదు. కానీ ఒక్కో పేజీ చూస్తుంటే మాత్రం చాలా లోతైన విశ్లేషణ కనిపిస్తోంది.
సాహిత్య, సామాజిక, చారిత్రక మరియు సమకాలీన అంశాలను నిశితంగా పరిశీలించిన రచయిత లోతైన ఆలోచనా ప్రపంచాన్ని ప్రతిబింబించే విశ్లేషణాత్మక వ్యాసాల సమాహారం ఈ రెండూ పుస్తకాలు. ప్రతి వ్యాసం ఒక కొత్త దృక్పథాన్ని, ప్రశ్నలను, కొత్త ఆలోచనలను పాఠకుడి ముందుంచుతూ సమాజాన్ని అర్థం చేసుకునే దారులను విస్తరిస్తుంది.
‘కలగూరగంప’ అన్నా, ‘రచ్చబండ చర్చలు’ అన్నా, ఆ పేర్లలోనే పుస్తకాల ఆత్మ కనిపిస్తుంది. విభిన్న అంశాలను లోతుగా చర్చించే ఈ రచనలకు అవి చక్కగా అమరాయి. రెండు పుస్తకాలూ నాకెంతో నచ్చాయి. వెంకట్ గారూ, మీకు హృదయపూర్వక అభినందనలు! పుస్తకాభిమానులు ఈ ఈ రెండు పుస్తకాలను ‘అచ్చంగా తెలుగు’, ‘నవోదయ’ వెబ్సైట్లలో పొందవచ్చు. వెంకట్ గారి కలం నుంచి ఇలాంటి ఉత్తమ రచనలు ఇంకా రావాలని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు,
- పుస్తకాల పేర్లు: “కలగూరగంప” వ్యాస సంపుటి, “రచ్చబండ చర్చలు”
- రచయిత పేరు: వెంకట్ నాగం
- ప్రచురణకర్త: వంగూరి ఫౌండేషన్ – అమెరికా
- ధర: రూ. 100/- (“కలగూరగంప”), రూ. 400/- (“రచ్చబండ చర్చలు”)
- పుస్తక ఉద్దేశ్యం: సాహిత్యం నుంచి సమకాలీన సమాజం వరకు, చరిత్ర నుంచి వర్తమానం వరకు రచయిత చేసిన నిశిత పరిశీలనకు, విస్తృత ఆలోచనా పరిధికి నిదర్శనం ఈ రెండు విశ్లేషణాత్మక వ్యాస సంపుటాలు.
- సమీక్షకులు: వేణు నక్షత్రం (వాషింగ్టన్ డి.సి. ఆటా 19వ మహాసభలు 2026 – అమెరికా: తెలుగు సాహిత్య కమిటీ చైర్, ప్రముఖ తెలుగు రచయిత మరియు లఘుచిత్ర దర్శకుడు)
- పుస్తకాల లభ్యత: వెంకట్ నాగం గారు రచించిన రెండు పుస్తకాలు: “కలగూరగంప” వ్యాస సంపుటి మరియూ “రచ్చబండ చర్చలు” ‘అచ్చంగా తెలుగు’ మరియు ‘నవోదయ’ వెబ్సైట్లలో సాహితీ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
వేణు నక్షత్రం
(వాషింగ్టన్ డి.సి, ఆటా 19వ మహాసభలు 2026 – అమెరికా: తెలుగు సాహిత్య కమిటీ చైర్, ప్రముఖ తెలుగు రచయిత మరియు లఘుచిత్ర దర్శకుడు)
