ముందుమాటలో తనే అన్నట్టు…
ఎక్కడ మొదలుపెట్టాలో నాకూ అర్థం కావడం లేదు. పన్నెండు కథల్తో పన్నెండు ప్రపంచాలు పరిచయం చేశాడు. ఆ ప్రపంచాల్లోకి మనల్ని తీసుకెళ్ళి తిప్పి, నవ్వించి, ఏడిపించి, మనసుని మెలిపెట్టి గుండెకు కాస్త తడి అద్దాడు.
తన రచనల ద్వారా తానేంటో తెలిసింది.
“నేను విధిని నమ్మను, పనిని మాత్రమే నమ్ముతాను” అని తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తూ పోతూ ఈ రోజు చాలా మందికి ఆదర్శం అయ్యాడు.
ఎక్కడా అస్పష్టత కన్పించలేదు. అంతా స్పష్టతే.
ఊరి నుండి అమ్మ పంపించిన పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో, తను ఊరి నుండి తెచ్చుకున్న కథలు అంత కమ్మగా ఉన్నాయి.
త్రివిక్రమ్ పెంచల్ దాస్ గురించి చెప్తూ “ఊరిలో ఇతను లేడు, ఇతనిలోనే ఊరు ఉంది” అని చెప్పాడు. ఇది నూటికి నూరు శాతం సురేంద్రకి సరిగ్గా అతికినట్టు సరిపోయే మాట.
ముప్పై ఏళ్ళ లోపే ఇంత మెచ్యురిటి, రచన మీద పట్టు, సంభాషణల చాతుర్యం, లోతైన పరిశీలన,కథలో గాఢత, వాక్యంలో చిక్కదనం, వ్యక్తుల మద్య సంఘర్షణ, ఇవన్నీ సూరికి పెట్టని ఆభరణాలు.
తను వాడిన ఆ ప్రాంతపు బాష, యాస ఎంత మధురంగా ఉందో ఈ కథలు చదివేటప్పుడు. ఆడే తిరుగాడినట్టు ఉందబ్బా.
తన చూసి వచ్చిన జీవితంలో నుండే పాత్రలు సేకరించి, సృష్టించి రచనలు చేశాడు. అందుకే అవి అంత lively గా ఉన్నాయి. పాత్రలన్నీ సహజంగా మాట్లాడతాయి. ప్రతి కథలోనూ రీడబిలిటీ ఉంది. ఎక్కడా ఆపకుండా చదివించే గుణం ఉంది.
ఇంత బాగా ఈ వయసులో ఎలా రాశాడబ్బా అన్పించి ఆశ్చర్యానికి లోనవుతాం.
తన కథలతో పోల్చుకుంటే, నేను చాలా వెనకబడి ఉన్నాను అన్పించింది. నేను లింగంపల్లిలో ఉంటే తను బాగ్ లింగంపల్లిలో ఉన్నాడు.
నిజంగా తనను చూసి సిగ్గేస్తుంది నా మీద నాకు. నేను ఇంకెంత రాయాలి. ఇంకెంత నేర్చుకోచాలి. ఇంకెంతా concentrate చేయాలి అనే జిజ్ఞాసను కలిగించాడు నాలో సూరి.
నన్ను నీ కథలతో కదిలించినందుకు,
నీ కథలతో కదలకుండా చేసినందుకు.
ఒక్కో కథ గురించి విపులంగా నా సమీక్ష
1. సూరిగాడు – నల్లకోడి: –
కథలో సూరిగాడు చచ్చిపోయాడు కానీ ఈ కథ రాసి మా సూరిగాడు బతికిపోయాడు. అందరి మనసుల్లో నిలిచిపోయాడు. మృగశిరకార్తె రోజు నల్లకోడి తింటే స్వర్గానికి పోతారు అన్న వాళ్ళ నాన్న నమ్మకాన్ని నెరవేర్చడానికి రెడ్డి గారింట్లో ఉండే నల్లకోడిని దొంగతనం చేయడానికి వెళ్ళి సూరిగాడిని చంపేసుకున్నాడు పసాదు.
సూరిగాడంటే పసాదుకి పాణం.
తన నాన్న కోసం తన ప్రాణం తీసుకున్నాడు.
ఆ ఊళ్ళో రెడ్డి గారింట్లోకి కుక్క కూడా రావడానికి వీల్లేదు, ఎవడైనా వస్తే వాడికి కుక్క చావే గతి” అని Symbolic గా ఆ ఊరి రెడ్ల బూర్జువా తనాన్ని చెప్పడంలో రచయిత నేర్పరి తవం కన్పిస్తుంది.
ఏదేమైన రెడ్డిగారి తుపాకీ పేలింది
సూరిగాడి (ప్రసాదు) ప్రాణం పోయింది.
ఆయన తూటాలకి ఇంకెంతమంది బలవ్వాలో..?
2.మాయన్నగాడు: –
“వాడు బరుగోళ్ళకి పోయే పతిసారి నేను వాకిలి దగ్గర నిలబడి సూసేవాణ్ని, ఒక్కరోజైనా నన్ను పిలచ్చాడేమోనని…!”
ఈ చివరి వాక్యాలు అలాగే ఉండిపోయాయి మనసులో. అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంత చక్కగా చెప్పాడు రచయిత ఈ కథలో.
“వాళ్ళ నాన్న,అమ్మ సేలోకి కలుపు తీయడానికి పోయేటప్పుడు ఆయన కొడవళ్ళు తీసుకోవడం, వాళ్ళమ్మ బాటిల్కి నీళ్ళు పోయడం, కోళ్ళని మూసేయడం. బరుగోళ్ళపై ఆమెకున్న ప్రేమ” – ఇవన్నీ ఇప్పటికీ మా ఇంట్లో చూస్తున్న పరిస్థితులే. అవి గుర్తొచ్చాయి.
దూడకి దెబ్బ తగిలితే విలవిలలాడిన ఆ తల్లి మనసు ఎంత గొప్పది. ఆ రోజు ఆవిడ రెండు సార్లు ఏడ్చింది.
ఈ అన్నదమ్ముల అనుబందం చదివాక నాకు రేసుగుర్రం సినిమా గుర్తొచ్చింది.
అక్కడా సూరీనే – సురేందర్ రెడ్డి – Director
ఇక్కడా సూరీనే – సురేంద్ర శీలం – writer
What a Co- incidence.
3.పార్వేట:
“ఈ అరుగు మీద యింగోసారి కూర్చున్నావంటే నరకతా..” కులాల మధ్య ఎంత వివక్ష ఉందో మొదట్లోనే చెప్పాడు రచయిత.
“సాయంత్రం ఆ గుడిసెలొ ఉన్న కిరోసిన్ బుడ్డి వెలుగు కన్నా శాంతమ్మ మొహంలో కనపడిన వెలుగే ఎక్కువ.”
‘సీకటి పూర్తిగా ఊరిని సుట్టుకుంది.’
‘నిశ్శబ్దాన్ని మింగిన సీకటి’
తింటున్న ముద్ద కంటే బలంగా శాంతమ్మ మాటలు, సుమతి గొంతులోకి దిగినాయి. ఎంత మంచి మాటలు.. కథకి బలాన్నిచ్చిన మాటలు. ఎంత పరిశీలన లేకపోతే ఇలాంటి వాక్యాలు వస్తాయి రచయిత కలం నుండి. అల్లుడు చెప్పిన మాటలే సుదర్శనం చెవుల్లో తప్పెట కంటే ఎక్కువ శబ్దం చేస్తున్నాయి. తన బాధకు తప్పెట బలవుతుంది. అందరూ రాళ్ళలాగే నిలబడి చూస్తున్నారు.
పదునైన మాటలు.
గొర్రె కోసం గోపాల్ చనిపోవడం గుండెను మెలిపెట్టింది.
సుదర్శనం యొక్క అంతఃసంఘర్షణ అద్భుతంగా ఆవిష్కరించాడు రచయిత. శేఖర్ రెడ్డి తానే గోపాల్ని చంపి ఆ నేరాన్ని గొర్రె మీదకి నెట్టడం ఎంత పాపం.
శేఖర్ రెడ్డి గొర్రెపిల్లని మీదేసుకున్నాడు – గెలిచానని ఆనందం
సుదర్శనం గోపాల్ని మీదేసుకున్నాడు – బలయ్యాడని బాధ.
ఏదేమైనా ఈ పార్వేట ఉత్సవం గోపాల్ ఉసురు తీసింది.
దసరా రోజు మా ఊళ్ళో జరిగే పార్వేట ఉత్సవం గుర్తొచ్చింది.
4.కోటర్:-
ఊళ్ళో ఐదు రూపాయలు ఎక్కువని, టౌన్ కెళ్ళి కాలేజీలో చదువుకునే కొడుక్కి ఒక కోటర్ బాటిల్ తెమ్మని చెప్పె ఒక నాన్న కథ కోటర్.
ఆ కోటర్ బాటిల్ నాన్న చేతికి అందకుండానే పగిలిపోవడం విషాదం.
ఆ కోటర్ బాటిల్ తేవడానికి సుమన్ పడే ఘర్షణను చక్కగా వివరించాడు రచయిత.
“రికార్డ్ డాన్స్ ఏసేటప్పుడు ముసిలోళ్ళను ముందర లైన్లో కూచ్చోబెడ్తే ఆళ్ళ మొకంలో కనపడే వెలుగు కనపడింది”. ఈ వాక్యం చదివాక మా ఊళ్లో నేను చిన్నప్పుడు చూసిన ‘బోరింగ్ పాప, దంపుడు లక్ష్మీ’ రికార్డింగ్ డాన్స్ లు గుర్తొచ్చాయి.
చివరిలో సీసా పగిలినప్పుడు మా గుండె ముక్కలవ్వలేదులే గానీ.. ఆ శబ్దం మాత్రం చెవులకి వినపడింది.
5.దేవమ్మ: –
నాకు ఈ కథలో విపరీతంగా నచ్చిన అంశం – దేవుడికి వదిలిన ఆ దేవర దున్నపోతుని symbolic గా సామరెడ్డితో పోల్చడం. అవసరమైన చోటల్లా కథలో ఈ అంశాన్ని జోడించడంలో సక్సెస్ అయ్యాడు.
“కూలీ ఎందుకు పోదెంకుంటావు” ల్యాకుంటే మాన్లే,ఊళ్లో అందరికి పావు వచ్చింది, ఈ నా బట్టకి రాకుంది. ఎంతమంది మండల ఉసురు తగిలి ఉంటుందో, ఈడి దినం చెయ్య”..
ఈ మాటలన్నీ మా ఊళ్లో చింతాబుల్లి మాట్లాడినవే. ఆవిడ కూలీల మేస్త్రి. ఆవిడే గుర్తొచ్చింది ఈ వాక్యాలు చదివుతుంటే.
“రోలు బజార్ల ఉంటే దంచుకోవడానికి చూస్తారు. ఈ నాకొడుకులు”.
సామిరెడ్డి లాంటోళ్ళందరికీ సరితూగే మాట రాశాడు సూరి.
సూరి..దేవమ్మ అందం గురించి వర్ణించిన తీరు చదువుతుంటే నాకు కూడా చేతులు వదిలిపెట్టి సైకిలు తొక్కాలన్పించింది.
రాణిలాగా బ్రతికిన దేవమ్మ ఒక్కపూట కడుపు నింపుకోవడానికి బియ్యం కోసం పక్కింటికి పోవడం నిజంగా మనసుని మెలిపెట్టింది.
ఊళ్ళో జరిగిన అన్ని సంఘటనలకు పత్తి చేనును సాక్ష్యంగా చూపించాడు రచయిత.
ఓ పక్క కొడుకు కోసం ఎదురుచూస్తున్న దేవమ్మ,
ఇంకోపక్క దేవమ్మ కోసం కామంతో ఎదురు చూస్తున్న సామిరెడ్డి.
Cinematic screen play. Hats off సూరి.
6.కొత్త బట్టలు:
ఉగాది పండగ రోజు కొత్త బట్టలు కట్టుకోవాలని ఆ పిల్లాడు పడే తాపత్రయం చూస్తే పాపం ముచ్చటేసింది. జాలేసింది. నవ్వొచ్చింది. బాదేసింది. చివరికి జ్వరమొచ్చింది (పిల్లోడికి). వాడికి జ్వరమొస్తె నాకు అయ్యో… అన్పించింది.
ఉగాది పండగ చుట్టూ తిరిగిన ఈ కథ నేను ఉగాది నాడే చదవడం యాధృచ్చికం.
చిన్నప్పుడు మేము కూడా కొత్తబట్టల కోసం మా నాన్నని ఎంత వేపుకు తిన్నామో…ఇప్పుడు గుర్తొచ్చింది.
కానీ పాపం పిల్లోడు కొత్త బట్టలు వేసుకోకుండానే పనుకున్నాడు.
“ఫ్యాను గాలికి కొత్త బట్టలున్న కవర్ చేసే శబ్దం వింటూ ఉన్నాడు” ఎంత clean observation లేకపోతే రచయిత ఈ మాట రాయగలడు.
ఇది కథ కాదు. తన జీవితమే అన్పించింది.
ఆ చివరి Paragraph చదివి నేను కూడా ఊరు వెళ్ళాలని, వెళ్ళలేక దుప్పటి కప్పుకుని ఏడ్చిన.
7.విజయ కుమార్:-
కథ చదువుతున్నపుడే తెలిసింది. సూరి ఈ కథకి ఈ శీర్షిక ఎందుకు పెట్టాడో. ఎందుకంటే విజయ్- కుమారి అనే ఇద్దరి ప్రేమకుల కథ ఆ విజయకుమారి కథ.
కథ చదువుతున్నంత సేపు మా స్కూల్ ప్రేమలు, రాఖీ రోజున మేము బడికి పోకుండా ఉండటం, కొత్త సినిమా సంగతిని రిక్షా మోసుకురావడం, ఇవన్నీ కళ్ళముందు మెదిలాయి.
నేను కూడా విజయ్ లాగే అమ్మాయిలను Impress చేయడానికి ఏవేవో పిచ్చి వేషాలు వేసేవాడిని. తన్నులు తప్పలేదు మరి. కుమారి, విజయ్ కి బలవంతంగా రాఖీ కట్టిన దగ్గర నుండి కథ Speed అందుకుంది. సో సో గా సాగింది.
హైదరాబాద్ వచ్చిన తరవాత ఇద్దరికీ మధ్య అనుబందం ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉండాలి, మరి అలా ఎందుకు జరగలేదో?
కథ చివరిలో ఏదో పెద్ద twist పెడతాడనుకున్నా…కానీ అలా ఏం జరగ లేదు.
కుమారి సినిమాకి ఎందుకు రాలేదో సూరీకి ఒక్కడికే తెలుసు.
నాకు సూరి మీద కోసం వచ్చింది, కుమారిని సినిమాకి పంపనందుకు.
నిజం చెప్పు సూరి కుమారి ఎక్కడుంది ఇప్పుడు?
8. సర్పం:-
కాటేయడానికి అలవాటు పడ్డ పాము ఖాళీగా ఉంటదా?
ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు. తప్పు మీద తప్పు.
పెద్దిరెడ్డి ఎలాంటాడో చెప్పడానికి, రచయిత పాముని పావుగా వాడుకున్నాడు. చాలా మంచి idea, great thinking.
రంకు రందిలో మొగుళ్ళను ప్రియుడి చేత చంపించే ఓలేసు లాంటి పెళ్ళాలు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో.
సమాజంలో పెద్ద మనుషుల్లా చెలామణి అవుతూ, చేయాల్సింది చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా చేతులు దులిపేసుకుంటున్న పెద్దిరెడ్డిలాంటి పెద్ద విషనాగులు చాలామందే ఉన్నారు ఈ సమాజంలో కావాలంటే రోజూ T.V చూడండి, పేపరు చదవండి.
“కానిస్టేబుల్ జేబులో నుండి పదివేల కట్ట పైకి లేచి కనపడ్తాంది, కోడి పుంజు ఒక్కటే ఉంది, చెప్పకనే చెప్పాడు రచయిత పెద్దిరెడ్డి విలన్ అని.
తన కళ్ళ ముందే పెరిగిన అమాయకుడైన శీనుని పెద్దిరెడ్డి అతి దారుణంగా చంపడం మాత్రం చాలా ఘోరమనిపించింది.
బైరాగి లాగా ఈసిరెడ్డి తిరుగుతోంటే జాలేసింది. ఎంత “తిక్కశీను” అయినా కొడుకు కొడుకే కదా !
పెద్దిరెడ్డి పెళ్ళాం ఇంకో పాతికేళ్ళు పూజలు చేసినా పిల్లలు పుట్టరు. పెద్దిరెడ్డి పెళ్ళామే కాదు మేము కూడా ఎదురుచూస్తున్నాం బాయి కాడకూర్చొని, నిజం ఎప్పటికైనా బయటికి రాక పోదా అని.
పెద్దిరెడ్డి, ఓలేసు పెళ్ళాంకాడ పనుకొని లేచి వస్తాంటే పెద్దిరెడ్డి పెళ్ళాం చూసిద్ది. ఓలేసు వెళ్ళాం మంచంలోనే మసుల్తా ఉంటది.
ఈ సీన్ చదివినప్పుడు ‘సీతాకోక చిలక’ సినిమాలో శరత్ బాబు, రాళ్ళపల్లి పెళ్ళాం ఇంట్లోకి దూరి పాడుచేయడం. ఆ సీన్ సిల్కుస్మిత చూడటం. గుర్తొచ్చింది.
9. మాసిన మబ్బులు :-
ఈ కథ చదువుతుంటే మా ఊరి దగ్గరున్న గుండ్లకమ్మ రిజర్వాయర్ గుర్తొచ్చింది.
1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెన గుర్తొచ్చింది.
“గుండెల్లో గోదావరి” సినిమా గుర్తొచ్చింది. ఒక రిజర్వాయర్ నిర్మాణం వెనక ముంపు గ్రామాల్లో ఉండే ప్రజల జీవితాలను, వారికి, ఉరికి ఉండే అనుబంధాన్ని రచయిత చక్కగా వివరించాడు.
వాన వల్ల ఎన్ని జీవితాలు తడిసిపోతాయో కళ్ళకి కట్టినట్టు రాశాడు. అధికారం భుజాల మీద ఎక్కినప్పుడు అందరం తోలుబొమ్మలమే.
అవును వీళ్ళు నిజంగానే విధిచేతుల్లో కీలుబొమ్మలు, అధికారుల చేతుల్లో ఆటబొమ్మలు. ఎవరు ఎట్టా ఆడిస్తే అట్టా ఆడాలి. ఆకాశమంత అభివృద్దిలో వీరు నిజంగా మాసిన మబ్బులే.
10.లొక్కోడు: –
ఆ రాత్రి తనకి ఆకు వక్క ఇవ్వలేదని సినమ్మ చనిపోయిందని ఊరందరినీ నమ్మించిన లోక్కోడు భలే నవ్వించాడు. ఈ కథ చదివాక పీర్ల పండగ విశేషాలు, జాతరలో వేషం వేసే లోక్కోడి లాంటి జీవితాల గురించి తెలిసింది. లొక్కోడి లాంటి మనిషి ఊరికి ఒక్కడైనా ఖచ్చితంగా ఉంటాడు. మా ఊళ్లో ఉన్నాడు. వాడి పేరు ఉప్పోడు. ఊరంతా తిరుగుతా ఆడోళ్ళతో చతుర్లాడుతూ వాళ్ళతో తిట్లు తింటా ఉంటాడు.
వేషాలేసే తన తండ్రిని ఊర్లో వాళ్ళు ఆట పట్టించడం అవమానంగా ఫీల్ అయిన కొడుకు కర్నూల్ పోదామంటే ” నేను ఈడనే పుట్టినా…. ఈడనే సచ్చా” అనే లొక్కోడు చెప్పే మాట తనకి, ఊరికి మధ్య ఉన్న అనుబంధం ఎంత గాఢంగా ఉందో అర్థం అవుతుంది.
కొంత మందికి ఊరు విడవాలంటే
ప్రాణం ఇడిసినంత పనయిద్ది.
11.నల్ల మోడాలు కప్పిన ఆకాశం:-
కథ చదివాక గుండె బరువెక్కింది.
ప్రేమంటే స్వార్ధం.
అవును ఎంత స్వార్థం లేకపోతే ప్రేమ ఇద్దరి ప్రాణస్నేహితులను విడదీసింది.
ప్రాణస్నేహితుడుని పిచ్చాడిని చేసింది. ‘రంగురంగుల’ బాల స్వామి జీవితాన్ని సామీ తన స్వార్ధం కోసం చీకటి మయం చేశాడు.
స్నేహితుడి చెల్లెల్ను లేపుకొని పోయి స్నేహితుడికి అన్యాయం చేశాడు.
సాయిత్రి నల్లగుంటది. ఆమె గజ్జెల శబ్దం సామి గుండెల్లో మ్రోగుతూ ఉంటది. ఆ శబ్దమే బాలసామి నిశ్శబ్దానికి కారణం అయింది. కథలో సాయిత్రి చేత సూరి పాడించిన రెండు జానపదాలు ఎంత బాగున్నాయో- ఇవి గనక సినిమాల్లా పెడితే super hit అవుతాయి.
మాదిగోళ్ళతో తిరగొద్దని వాళ్ళ నాన్న చెప్తే, “వాడు నా సావాసగాడు. నాతో పాటు సదువుకున్యాడు” అని సామీ చెప్పడం తనకున్న Maturity అర్ధమవుతుంది.
“నువ్వసలు శెట్టిగాళ్ళ పిల్లాడివిలా లేవని” సాయిత్రి అంటే “నాకు వచ్చినట్టు నేనుంటా” అని సామి చెప్పడం తనకున్న clarity ని గుర్తు చేస్తుంది.
సాయిత్రి, సామీ ఇద్దరూ నీళ్ళ ట్యాంకు కాడ పంచుకున్న వెన్నెల రాత్రులను చదువుతుంటే మనకి అలాంటివి లేవే లైఫ్ లో అని గుర్తు చేసి బాధ పెడతాడు రచయిత సూరి.
బాలసామి పరిస్థితి చూస్తుంటే నిజంగా సామీ మీద, సాయిత్రి మీద ఎనలేని కోసం వచ్చింది. ఇది నిజంగా వెన్నుపోటే.
కథ చదివిన తర్వాత చాలాసేపు మౌనంగా ఉండిపోయిన. ఇన్నాళ్ళూ సామిని నమ్మి రక్షించిన బాల సామిని, ఆ పైనున్న స్వామివారే రక్షించాలి. నా దృష్టిలో, ఈ కథలో బాలసామే హీరో
సామి విలన్
సాయిత్రి సైడ్ క్యారెక్టర్.
తొమ్మిదో నెల కడుపుతో ఉన్న సాయిత్రికి బాలసామి మళ్లీ పుడితే బాగుండు. అలా జరిగితే బాగుండు.
ప్రేమ = స్వార్థం. అంతే..!
12.ఓడిపోయిన వాన:-
ఊరూరా తిరిగి కొలిమి పని చేసుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పే కథ ఈ ఓడిపోయిన వాన కథ. ఊరి చివర సత్రంలో నొప్పులు పడుతున్న మహిళ, ఊరిని ముంచెత్తుతున్న వాన, చూట్టూ దడి కట్టడానికి కూడా సరిపోని చీరలు, ఎదురుగా పదేళ్ళ పిల్లాడు, మగ దిక్కులేని సంసారం. చదువుతుంటేనే మనసు అదోలా అయిపోయింది.
బాలింత అయిన తల్లికి చీరల కోసం పిల్లవాడు ఊళ్లోకెళితే ఒక్కరు కూడా తలుపు తీయరు. వాడికి కోపం వచ్చి రాయి రోడ్డు మీదకి విసురుతాడు. వాడు రాయి విసిరింది రోడ్డు మీదకి కాదు సమాజం మీదకి, సాయం చేయ్యలేని స్వార్ధపు మనుషుల మీదకి.
అంత వానలో వాడు ఇంటింటికీ తిరిగి చీరలు అడుగుతుంటే మనకే బాదేస్తుంటుంది. వాళ్ళ నాన్న ఉంటే ఎంత బాగుండేది కదా అన్పిస్తుంది.ఆ గుడిలో అమ్మవారికి కప్పడానికి ఉంచిన చీరను తీసుకుంటాడేమో అనుకున్నా…కానీ అలా జరగలేదు. పాఠకుడు ఉహించింది రాస్తే సురేంద్ర శీలం, దళపతి సూరి ఎలా అయ్యేవాడు..
పదేళ్ళ పిల్లవాడిని చూసి ఆరవై ఏళ్ళ వెంకటసుబ్బయ్య నేర్చుకున్న పాఠం, ఈ కథనాన్ని వీళ్ళదిరికీ ముడిపెట్టి ముందుకు నడిపిన రచయిత తెలివికి నిజంగా చేయెత్తి మొక్కాలి అన్పించింది..
ఆ పిల్లాడి నమ్మకం ముందు నిజంగానే వాన ఓడిపోయింది. ఆ బట్టల మూట ఆ పిల్లాడికి బరువున్నా, వాడి మనసు మాత్రం తేలికయ్యింది.
ప్రతి కథా చదివిన తర్వాత నాకు అర్థమయ్యి నాకు అన్పించింది రాశాను. ఈ సమీక్షంతా కూడా నా దృష్టి కోణం నుంచే, నా పెన్నుతోటే రాసిందే. నా పరిజ్ఞానానికీ, నా పరిశీలనకి లోబడే ఉంటుంది ఈ సమీక్ష.
ఈ సమీక్ష చదివాక ఏవైనా పోరపాట్లు ఉంటే, తప్పులు ఉంటే తొందరపడి తిట్టుకోకుండా, నన్ను తిట్టకుండా, కాస్త తట్టుకొని తమాయించుకొని తిట్టండి..
ఈ మధ్య కాలంలో నేను చదివిన కథల్లో అతి అరుదైన, అత్యద్భుతమైన, మనసును రగిలించే కథలు ఈ పార్వేట కథలు,
సూరి writing style నాకెంతో నచ్చింది. నేను చాలా నేర్చున్నాను. సూరిని అడిగి కొన్ని మెలుకువలు నేర్చుకొవాలి కథ రాయడం గురించి. అంతగా ప్రభావితం చేశాడు సూరి తన కథలతో.
ప్రతి ఒక్కరూ తమ బుక్ షెల్ఫ్ లో తప్పనిసరిగా ఉంచుకోవలిసిన పుస్తకం సురేంద్ర పార్వేట పుస్తకం.
ఈ పుస్తకం కవర్ పేజీలాగే ఈ కథలు ఎప్పుడు ఎర్రగా మండుతూ మన మనసుకి వెలుగునిస్తాయి.