నా మెక్సికో ప్రయాణం

Spread the love

ఇంతవరకూ నేను ఉత్తర అమెరికా ఖండాన్ని చూడలేదు. ఆ ఖండంలో ఉన్న మూడు దేశాల్లో కెల్లా పెద్దది కెనడా,తరువాత అమెరికా, మూడోది మెక్సికో. అమెరికన్‌ వీసా ఉండేపనైతే మిగతా రెండు దేశాలు కూడా వెళ్ళొచ్చు. ఆ విధంగా మూడు దేశాలూ చూడొచ్చు అనే ఆశతో నా అమెరికన్‌ మిత్రుల్ని ఇన్విటేషన్‌ పంవమని అడిగాను. ఎవరూ ముందుకు రాలేదు. రెండు నెలల తరువాత కెనడాలో ఉంటున్న ఇసా అకిన్‌ బోలాజీ అనే చిత్రకారుడు (నైజీరియా దేశంలో నాకు సహాయం చేసిన మిత్రుడు) “ఆది సర్‌, మీరు మా ఇంటికి వస్తానంటే ఇన్విటేషన్‌ పంపిస్తాను” అంటూ భరోసా ఇచ్చాడు. అప్పటికి నాకు కెనడా వెళ్ళే ఉద్దేశం లేదు. మెక్సికో మాత్రమే వెళ్ళదలచుకొన్నాను. విహార యాత్రికులు దర్శించాలనుకొనే ఎత్తైన మెక్సికన్‌ పిరమిడ్లనో, లేదా ఫ్రిదా కాలో సినిమాలో (2002) నటించిన సల్మా హయేక్‌(బి.1966)నో చూడటానికి మాత్రం కాదు. నా మెక్సికో ప్రయాణానికి మాత్రం రెండు కారణాలు ఉన్నాయి.
మెక్సికన్‌ ఆధునిక కళకి పితామహుడిగా పిలువబడుతున్న జోస్‌ పసోదా (1852 – 1913) అనే చిత్రకారుడి శత వర్థంతి ఉత్సవాలని చూద్దామనేది మొదటి కారణం. ధనికుల జీవితాల్లోని మురికినీ, జీవాచ్చవల్లాంటి రాజులనీ, మూర్ఖులైన మిలిటరీ అధికారుల్ని,అసమర్థులైన రాజకీయ నాయకులనీ తన చిత్రాల ద్వారా విమర్శించాడు వసోదా. ఇలాంటి విషయాలని చిత్రించటంలో పసోదా ఉపయోగించిన ముఖ్యమైన ప్రతీకలు పుర్రె, అస్థిపంజరాలు. ఇలాంటి విప్లవాత్మకమైన ధోరణిలో చిత్రాలు వేసినందుకు ఆయన అనేకసార్లు జైలుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. తన కళ ద్వారా సమాజాన్ని సంస్కరించాలి అనుకొన్న పసోదా, చాలామంది లాటిన్‌ అమెరికన్‌ కళాకారులకి ఆరాధ్యనీయుడుగా మారిపోయాడు.
పసోదా కళాతత్వం గురించి చాలాసార్లు నా విద్యార్థులకి పాఠాలు చెప్పాను, అయితే ఇన్నాళ్ళకి ఆయన ఒరిజినల్‌ చిత్రాల్ని చూడటానికి ఒక కారణం దొరికింది. ఈ శత వర్థంతి సందర్భంగా 2014 సం॥ చివరి వరకూ మెక్సికో దేశం అంతటా ఆ మహానుభావుడి చిత్రాల ప్రదర్శన ఉంటుంది. అందుకే ఎలాగైనా మెక్సికో వెళ్ళాలనుకొన్నాను.
మెక్సికో దేశంలో గ్రీన్‌ రెవెల్యూషన్‌ (హరిత విప్లవం)కి మూలపురుషుడు పాండురంగ సదాశివ ఖాన్‌ ఖోజే (1884 – 1967).ఈయన మహారాష్టకి చెందినవాడు. మెక్సికో దేశంలో 1920వ సం॥ నుండి 1947వ సం॥ వరకు నివసించి వారి ఆహారపంటల అభివృద్ధికి పాటుపడిన ఖాన్‌ఖోజే వలన భారతదేశానికి ఎంతో పేరొచ్చింది. మెక్సికో సిటీలోని “నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌”లో బోటనీ ప్రాఫెసరుగా పనిచేసిన ఈయనకి “వ్యవసాయ విప్లవవీరుడు” అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇలాంటి గొప్పవాడు నివసించిన దేశానికి వెళ్ళాలి అనేది నా ప్రయాణానికి రెండో కారణం.
అమెరికా వీసా దొరికే అవకాశం లేదని తెలుసుకొన్నాక, నా పాత మిత్రుల సహాయంతో మెక్సికో నివాసి మైగూల్‌శాంటి అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీయర్‌ని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాను. అతడు నాకంటే రెండు సంవత్సరాలు చిన్న నా బయోడేటా పంపుతూ, అక్కడికి వస్తున్నందుకు కారణాలు కూడా తెలియజేశాను. పదిరోజులకల్లా ఆ వైపు నుండి వచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యపరచింది.
“మీ టికెట్‌ మీరు తీసుకొని మా దేశానికి వస్తామంటున్నారు. ఖాన్‌ ఖోజే దేశం నుండి వస్తున్న మీకు ఒక నెలపాటు భోజనం పెట్టలేమా! మా ఇల్లు మీ ఇల్లే అనుకోండి” అంటూ వచ్చిన ఆ మెయిల్‌ని వందసార్లు చదువుకొని ఆనందించాను.
రెండు రోజులు పోయాక వచ్చిన మరో ఉత్తరంలో “ప్రాఫెసర్‌ ఆది, సెప్టెంబరు 18వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకూ మా మోంతారే సిటీలో ‘శాంతాలూసియా’ ఫెస్టివల్‌ కూడా జరుగుతుంది. ఎంత ముందుగా వస్తే అంత మంచిది. జోస్‌ పసోదా పేరుతో సిటీ స్కేర్‌లో అంతర్జాతీయ చిత్రకళా పోటీలు కూడా ఉంటాయి” అని రాశాడు.
తర్వాత అతడు పంపిన ఇన్విటేషన్‌ లెటర్‌ సహాయంతో ఢిల్లీలోని మెక్సికో ఎంబసీకి స్వయంగా వెళ్ళి వీసా తెచ్చుకోవటంతో ఈ ప్రయాణాల పక్షి కొత్త రెక్కలు తొడుక్కొంది.
‘నేను మెక్సికో వెళుతున్నాను’ అని నార్వేదేశపు మిత్రుడు డగ్గాస్‌కి చెప్పగానే “ఆది, నువ్వు ఎంత ప్రమాదకరమైన దేశానికి వెళుతున్నావో తెలుసా? అక్కడ పట్టపగలే నడిరోడ్డమీద డ్రగ్‌ మాఫియా వాళ్ళు కాల్పులు జరుపుకొంటారు. వారికి చావు అంటే అసలు భయం లేదు. నడిచే అవకాశం ఎక్కడా ఉండదు, జాగ్రత్త” అని వివరించాడు.
అప్పటికల్లా నేను టిక్కట్లు కొనడం, విమానం ఎక్కటం కూడా జరిగిపోయింది. అది అక్టోబరు ఒకటవ తేదీ. నా ఫ్లయిట్‌ ఢిల్లీ నుండి నేరుగా అమ్‌స్టర్‌డామ్‌ వెళ్ళింది. అమెరికన్‌ వీసా లేని మెక్సికో ప్రయాణీకులు ఇక్కడ నుండి వేరే ఫ్లయిట్‌లో వెళ్ళాలి.ఆ రోజు మధ్యాహ్నానికి K.L.M ఎయిర్‌లైన్స్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌ నుండి మెక్సికో సిటీకి బయలుదేరాను.
ఇది అట్లాంటిక్‌ సముద్రాన్ని దాటటానికి పదకొండు గంటలు పడుతుంది. కీ॥శ॥ 1492వ సంవత్సరంలో ఈ సముద్రాన్ని నౌకల మీద దాటిన కొలంబస్‌ను, 1927వ సంవత్సరంలో ఒక చిన్న విమానం మీద దీన్ని దాటిన లిండ్‌బర్గ్‌నీ, వారి అసమానధైర్య,సాహసాలనీ గుర్తుకి తెచ్చుకొన్నాను.
మా విమానం గంటకి 850 కి.మీ. వేగంతో, 25-30వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది. ఈ మెటల్‌ బర్డ్‌ పొట్టలో దాదాపు 530 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఒక పొడవాటి శాటిలైట్‌ టౌన్‌షిప్‌ గాల్లో విహరిస్తున్నట్టుగా ఉంది. అప్పుడప్పుడూ కింద కనిపించే బులుగు సముద్రాన్ని చూస్తూ, రెండు పూటలా హాయిగా భోజనం చేస్తూ, కాసేపు అటూ, ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేశాను.
రాత్రయ్యేసరికి ఒక అలసిపోయిన సముద్రపక్షి మాదిరిగా, మెల్లగా జారుకొంటూ మెరిసిపోతున్న మెక్సికో సిటీలో ఆగింది ఫ్లయిట్‌. అక్కడ నుండి మరో విమానం మీద మైగూల్‌ శాంటి నివసిస్తున్న మోంతరే నగరం చేరుకొన్నాను. ఈ ప్రయాణం గంట కంటే ఎక్కువ సేపు పట్టలేదు. సమయం సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటయ్యింది. బయటికి వచ్చేసరికి ఆకాశంలో చందమామ వెలుగులు విరజిమ్ముతున్నాడు. డిపార్చర్‌ గేట్‌లో మైగూల్‌ చేతులు ఊపుతూ కనిపించాడు. ‘అమిగో, వెల్‌కం టూ మెక్సికో’ అంటూ కౌగలించుకొన్నాడు.నాకంటే ఎత్తైన, దట్టమైన విగ్రహం. అతడు నవ్వుతుంటే బుగ్గలు సొట్టలు పడుతున్నాయి.
“సార్‌! మనం ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి. అప్పటి వరకు హాయిగా ఈ అలల సంగీతాన్ని వినండి” అంటూ మ్యూజిక్‌ ఆన్‌చేసి, ఒక ఫ్రూట్‌ జ్యూస్‌ పాకెట్‌ నా చేతికి అందించి, కారుని వేగంగా మలుపులు తిప్పుతూనే “మీకు మెక్సికన్‌ పాప్‌ గాయకుడు,’అగస్టిన్‌ లారా’తెలుసా?” అని అడిగాడు.
“లేదు, నాకు జోస్‌ హో సంగీతం అంటే ఇష్టం”, అని చెప్పాను.
“అవును లాటిన్‌ అమెరికా దేశాల్లో (స్పానిష్‌, పోర్చుగీసు భాషలు మాట్లాడే ప్రజలు నివసించే బ్రెజిల్‌, అర్జెంటైనా, మెక్సికో)అతని సంగీతం బాగా పేరు తెచ్చుకొంది” వివరించాడు మైగూల్‌.
“నగరం అంతా నిద్రపోతున్న సమయంలో నా కోసం మేల్కొని ఇంతదూరం వచ్చినందుకు ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాను మిత్రమా” అని చెప్పకుండా ఉండలేకపోయాను మైగూల్‌కి. నేల మీదకు దిగిన నక్షత్రమండలాల మధ్యలో, నిశ్శబ్దంగా ఉన్న నగరపు రోడ్డమీద, వెలుగుబాటలు వేసుకుంటూ, దూసుకుపోయింది మా కారు.
“నన్ను కలవడానికి ఇరవై వేల కిలోమీటర్ల దూరం నుండి వచ్చినందుకు మీకే థాంక్స్‌ చెప్పాలి” అన్నాడు. మాటల్లోనే వారి కాలనీకి చేరుకున్నాం. ‘మీ ఇల్లు వచ్చేసింది’, అంటూ నవ్వాడు మైగూల్‌. లారా గీటారు తీగల సంగీతపు హోరులో కలిసి పోయింది ఆయన నవ్వు.
అదొక చిన్న కాలనీ. రోడ్డుకి ఆనుకొనే ఉంది ఇల్లు. కింది పోర్షన్‌లో నాకోనం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళగానే కిటికీలో గుండా చందమామ మరలా పలుకరించింది. గదికి అవతల కట్టేసి ఉన్న కుక్క నన్ను గమనించి తోకతో ప్రశ్నించి, చిన్నగా గుర్రుమని సర్దుకొంది. నా కోసం టేబుల్‌ మీద పెట్టిన బ్రెడ్‌ రోల్స్‌ తిని హాయిగా నిద్రలోకి జారాను.
తెల్లారగానే మేడ మీదికి వెళ్ళి ఎదురుగా కన్పిస్తున్న పెద్ద కొండను దర్శించుకొన్నాను. పరిసరాలన్నీ ఆకుపచ్చని రంగులో మెరుస్తున్నాయి. చెట్లు విపరీతం. కనుచూపుమేరా ఆకాశాన్నంటే భవనాలే. మోంతరీ నగరానికి ప్రతీకగా నిలిచిన ఈ కొండ “గుర్రం మీద వేసిన జీను, ఆకారంలో ఉండటం వలన దీన్ని ‘శాడిల్‌ మౌంటైన్‌’ అనిపిలుస్తున్నారు. స్పానిష్‌ భాషలో ‘సెర్రొ దేలా సిర్రా’ అంటున్నారు.
నగరానికి రెండోవైపున మరో పర్వతాల వరుస కనిపిస్తూ ఉంది. ఇది అక్టోబరు అయినా ఇక్కడ చలి అసలు లేదు. అంతా ఇండియాలో మాదిరి వాతావరణమే ఉంది.
“ఆది సార్‌, ఆ కొండల సౌందర్యాన్ని తరువాత ఆస్వాదన చెయ్యెచ్చు; ముందుగా బేకరీకి వెళదాం రండి” అని కింద నుండి పిలుస్తున్నాడు మైగూల్‌. తన ఇద్దరు కుమార్తెలను స్కూల్‌కి తీసుకు వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. “హాయ్‌” అంటూ నన్ను విష్‌ చేశారు వాళ్ళు.
“వాళ్ళ మమ్మీ ఆర్టోపెడిక్‌ డాక్టర్‌. ప్రతి ఉదయం ఆరున్నరకల్లా హాస్పిటల్‌కి వెళ్ళిపోతుంది. ఉదయం వీళ్ళని స్కూలుకి తీసుకెళ్ళటం నా పని. తీసుకు రావటం ఆవిడ వంతు. సాయంత్రం నువ్వే చూస్తావు.” అని వివరిస్తూ దగ్గరలో ఉన్న బేకరీకి తీసుకువెళ్ళాడుమా అందర్నీ. పిజ్జాలు, బ్రెడ్‌లూ తిన్నాం. పిల్లలకి ప్రత్యేకంగా ఆమెట్స్‌, ఛిప్స్‌ ప్యాక్‌ చేయించాడు. వాళ్ళని స్కూల్లో వదిలి పెట్టి ఇంటికి చేరాం మేము.
“ప్రొఫ్‌! నా పని ప్రతి ఉదయం పదిగంటలకి మొదలవుతుంది. రాత్రికే ఇంటికి చేరగలను. ఇంటి తాళాలు ఒక సెట్‌ నీ వద్ద ఉంచుకో, ఫ్రిజ్‌ నిండా ఆహారం ఉంది, నచ్చింది తీసుకో. ఈ లాప్‌టాప్‌ కూడా ఉపయోగించుకో” అంటూ అన్ని ఏర్పాట్లు చేశాడు నాకోసం. నా దృష్టి హాల్లో తగిలించిన ఆంథోనీ క్విన్‌ ఫోటో మీదకి వెళ్ళింది.
‘సార్‌! మీరు క్విన్‌ అభిమానులా?’
‘అవును. క్విన్‌ మా దేశస్థుడు. ఈయన నటుడు మాత్రమే కాదు ఒక గొప్ప చిత్రకారుడు కూడా. అతన్ని మేము ఎంతగానో అభిమానిస్తాం” అని చెబుతూ పుస్తకాల ర్యాక్‌ నుండి ఒక ఆల్బమ్‌ అందించాడు.
“క్విన్ నటించిన ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’, జోర్బా ద గ్రీక్‌’ అనే సినిమాలు నేను చూశాను” అని చెప్పాను.
“సార్‌! నాకింకా కొంచెం టైముంది. మేడమీదికి వెళ్ళి కాసేపు ఆ కొండల్ని చూద్దాం రండి” అంటు నన్ను పైకి తీసుకెళ్ళాడు.
“మోంతారే అని మా నగరానికి పేరు రావటానికి కారణం చుట్టు పక్కల కనిపిస్తున్న ఈ కొండల వరుసలే. అలా చూడండి, ఆ కుడి వైపుగా కనిపిస్తున్న కొండలు నిజానికి చాలా ఎత్తైనవి. ఈ సాయంత్రం మనం చూడబోతున్న శాంతాలూసియా ఫెస్టివల్స్‌ జరుగుతున్న ప్రదేశం అదే” అని చెయ్యెత్తి దూరంగా చూపిస్తూ, ఆ పరిసరాల్ని నాకు పరిచయం చేస్తున్నాడు మైగూల్‌.
“శాంతాలూసియా అంటే ఎవరు సార్‌?”
“మా దేశాన్ని కాలనీగా చేసుకొని మమ్మల్ని పరిపాలించిన స్పానిష్‌ దేశీయుల దైవం. 16వ శతాబ్దం నుండి 1821వ సంవత్సరం వరకూ వారిపాలనే సాగింది. అందుకే వారి స్పానిష్‌ భాష, సంస్కృతి మాకూ వచ్చాయి. నిజానికి మా మెక్సికన్‌ చరిత్ర మూలాలు మాయా (2500 బిసి ) మరియు అజ్‌టెక్‌ (ఏ.డి 14-16వ శతాబ్ధం) నాగరికతల్లో ఉన్నాయి. మనం మెక్సికో మ్యూజియానికి వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తాను” అని చెప్పాడు.
“మాకు బ్రిటిష్‌ వారి నుండి 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వస్తే, మీకు స్పానిష్‌ వారి నుండి 1821వ సంవత్సరంలోనే వచ్చిందన్న మాట!” అన్నాను నేను.
“అవును! మేము సాయుధ విప్లవాలు చేసి స్వాతంత్ర్యం తెచ్చుకొన్నాం” గర్వంగా చెప్పుకుపోతున్నాడు మైగూల్‌.
“మేము శాంతి మార్గంలో సాధించాం, కాబట్టే చాలా ఆలస్యంగా వచ్చింది మాకు స్వాతంత్ర్యం. ఇంకో విషయం కూడా ఉంది. మీకు తెలుసా?” అన్నాను నేను.
“ఏమిటో చెప్పండి?” అన్నాడు భుజాలు ఎగురవేస్తూ
“మీ జాతీయ జెండాకు, మా జెండాకి పోలికలు ఉన్నాయి. మీ జెండాలో మూడు రంగులు అడ్డుగా ఉంటే, మా జెండాలో అవే రంగులు నిలువుగా ఉన్నాయి” అంటూ నా మొబైల్‌లో ఫీడ్‌ చేసుకొన్న ఇమేజ్‌ని చూపించగానే “యు ఆర్‌ రైట్‌ అంటూ సంబరపడిపోయాడు మైగూల్‌.
“ఆది, మీకు తెలుసా మాదేశం అమెరికాతో పోటీ పడి అన్నీ రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. మా నగరం గత పది సంవత్సరాల్లో 400 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఈనాడు మోంతారే జనాభా 12 లక్షలకి చేరింది. మా దేశం జనాభా మొత్తం కోటి ఇరవై లక్షలు”, అంటూ వివరించాడు.
“మైగూల్‌ సార్‌ ! మా దేశ జనాభా ఎంతో తెలుసా! 130 కోట్లు”.
“అవును. నా ఇండియా స్నేహితుడు చెబుతూ ఉంటే నమ్మలేకపోయాను. మీ దేశంలో పులులు, ఏనుగులు రోడ్లమీద తిరుగుతాయంటారు నిజమేనా?”
“మిమ్మల్ని భయపెట్టటానికి ఎవరో చెప్పిన కథలు అవన్నీ. వాటిని నమ్మకండి. వచ్చే సంవత్సరం మీరు మా ఇంటికి వచ్చి ఒక నెల రోజులపాటు ఉండి, హాయిగా నాతోపాటుగా తిరుగుతూ ఆనందించండి. వెల్‌కమ్‌ టూ ఇండియా” అని చెప్పాను.
క్రమేణా ఎండ ఎక్కువైపోతూ ఉంది. సిల్లా కొండల మీద పేరుకు పోయిన మేఘాలు చెదరిపోయి దాని విశ్వరూపం కనిపిస్తూ ఉంది.
మైగూల్‌ తన సామాగ్రి సర్దుకొని కారుమీద ఆఫీసుకి వెళ్ళిపోయాక, శాంతా లూసియా పండుగ వివరాల్లోకి వెళ్ళాను నేను.ఇవి అక్టోబరు 5వ తేదీ వరకూ మాత్రమే ఉంటాయి కాబట్టి ‘ముందుగా ఈ ఉత్సవాలని చూసి, తర్వాతనే జోస్‌ పసోదా మ్యూజియం ఉన్న అక్వాస్‌ కాలియంత్‌ నగరానికి వెళ్ళాలి’ అని నిశ్చయించుకొన్నాను. అక్కడికి బస్సులో వెళ్ళాల్సిందే. 600 కిలోమీటర్ల దూరం.
వెజిటబుల్‌ సలాడ్‌, సాసేజ్‌లతో లంచ్‌ ముగించుకొన్నాను. కిటీకిలోంచి తొంగి చూస్తున్న కుక్క అరవకపోయినా దానికి ఒక మాంసం ముక్క అందించాను. రెండు గంటలు దాటింది. నిద్ర దొంగ నా కళ్ళు కప్పే పనిలో ఉండగానే కాలింగ్‌ బెల్‌ మోగింది. స్కూలు నుండి పిల్లల్ని తీసుకొని డాక్టరమ్మ వచ్చేసింది. మైగూల్‌తో పోటీ పడే భారీ శరీరం. పిల్లలు పై గదుల్లోకి పరుగులు తీశారు; బ్యాగులు ఈడ్చుకొంటూ.
“సలూతోన్‌ సిన్యోరో. నా పేరు యాజ్‌మిన్‌. మీ గురించి మైగూల్‌ రోజు చెబుతూనే ఉన్నాడు. ఆదివారం వరకు మీరు సిటీలో బాగా ఎంజాయ్‌ చెయ్యెచ్చు” అంటూ ఎంతో మర్యాదగా కబుర్లు చెప్పింది. “మైగూల్‌ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మనం త్వరగా సిటీ సెంటర్‌కి వెళదాం, తయారుకండి” అని హడావుడిగా తన గదికి వెళ్లింది.
మేము సరిగ్గా 5 గంటలకి బయలుదేరాం. వారి పాపల ఉత్సాహానికి అంతులేదు. వాళ్ళ వయస్సు 9 – 10 సంవత్సరాలు ఉంటుంది. “మా పిల్లల వయస్సు ఎంతో చెప్పగలరా?” అని అడిగింది మేడమ్‌. అలా అడిగేసరికి నేను ఊహించింది పారపాటు అనుకొని “ఇద్దరూ కవల పిల్లలు అయి ఉంటారు” అన్నాను.
“కాదు! ఇద్దరి మధ్య 2 నెలలు తేడా ఉంది!”
“అది ఎలా జరుగుతుంది?
“కొన్నిసార్లు అలాగే అవుతుంది. మా స్నేహితురాలి పిల్లల మధ్య మూడు నెలలు తేడా ఉంది. ఇది నిజం” అని ఆమె చెప్పగానే ఆశ్చర్యంతో ఆ పిల్లల మొఖాల్ని చాలా పరిశీలనగా చూడాల్సి వచ్చింది.
సిటీ సెంటర్‌ అద్భుంతంగా ఉంది. అన్నీ పైకి పెరిగే భవనాలే. దీన్నే శాంతా లూసియా సెంటర్‌ అంటున్నారు. స్పెయిన్‌ వారి మొట్టమొదటి కాలనీ ఇక్కడే ఏర్పడిందట. వారు నిర్మించిన శాంతాలూసియా చర్చి ఈ ప్రదేశంలో ఉండేది. 1980వ సంవత్సరంలో నిర్మించిన ఈ సిటీ సెంటర్‌ని “గ్రాండ్‌ ప్లాజా అని కూడా పిలుస్తున్నారు. అత్యంత విశాలమైన రోడ్లు. ఈ సాయంత్రం ప్రోగ్రాంలో “కొలంబియన్‌ డాన్సు ప్రత్యేక ఆకర్షణ” అని బోర్డులు పెట్టారు. ప్రవేశం ఉచితం అయినా టిక్కెట్లు తీసుకోవాలి. అందువలన అందరం లైనులో నిలబడ్డాం.
ఇక్కడ ఒక విశాలమైన థియేటర్‌, దాని పక్కన పెద్ద లైబ్రరీ, రెండు అంతస్థుల మెక్సికన్‌ మ్యూజియం ఇంకా ఎన్నో పెద్ద భవనాలు ఉన్నాయి. టూరిస్టుల కోసం ఒక చిన్న కృత్రిమ నది (21/2 కి.మీ.)ని కూడా తయారుచేశారు. దాని మీద పడవలో విహారం కూడా చెయ్యెచ్చు. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచంలోని ప్లాజాల్లో దీనికి నాలుగవ స్థానం ఇచ్చారు.
కొంచెం దూరంగా గవర్నమెంట్‌ ప్యాలెస్‌ లాంటి పెద్ద భవనాలు ఎర్రరంగు రాతిలో కనిపిస్తున్నాయి. చీకటి పడే కొద్దీ ఒక ఎరుపురంగు లేజర్‌ టార్చి నగరం మీద తిరుగుతూ ఉంది.
మేము థియేటర్‌లోకి వెళ్ళే సమయానికి మైగూల్‌ కూడా రావటంతో పిల్లలు సంతోషపడ్డారు.
“కొంచెం ముందుగా రావాల్సింది సార్‌” అన్నాను.
“మెక్సికో దేశంలోని మొత్తం కంప్యూటర్లలో ఇరవై శాతం ఈ మోంతారే నగరంలోనే ఉన్నాయి. అందుకే మా సాఫ్ట్‌వేర్‌ వాళ్ళకి బోలెడంత పని” అంటూ తమ నగర ప్రత్యేకతని చెప్పాడు.
హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది. కొలంబియా దేశం వారి నాట్యం చాలా బాగుంది. ‘వల్లెనాతో’అనే ఒక ప్రత్యేక తరహాకి చెందిన ఈ నాట్యానికి మూలం ప్రాచీన కాలంలోని కొలంబియా వార్తాహరుల ప్రయాణాలు. ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వార్తలు చేరవేయటానికి కొలంబియాలోని కొండ ప్రాంతాల్లో మనుషులు అవనరమయ్యారు. వార్తల్ని సులభంగా గుర్తుపెట్టుకొనేందుకు వారు ఆ వార్తల్ని పాటల రూపంలోకి మార్చుకొని, పాడుకొంటూ ప్రయాణం చేసేవారు. అలాంటి సాంప్రదాయం నుండి పుట్టిన ఈ నాట్యకారుల పాటలు, మానవ జీవితానికి సంబంధించిన పుట్టుక, పెళ్ళి, మరణం లాంటి ముఖ్యమైన సంఘటనల్ని తెలియజేస్తుంటాయి. వీరి సంగీతంలో అకాడియన్‌ అనే వాయిద్యం ప్రధాన ఆకర్షణ.
ఉదయాన్నే అలా ఒక్కడినే వాకింగ్‌కి బయలుదేరాను. నేను ఉంటున్న గాడాలూపే కాలనీలో ఇళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. వాకర్స్‌ కోసం ప్రత్యేకమైన బాటలు ఏమీలేవు; యూరప్‌లో మాదిరిగా. నడిచేవారు అసలు లేరు. ఇంటి ముందు నుండి అలా ముందుకు వెళ్ళి ఎడమవైపుకి తిరగ్గానే అక్కడ చిన్న నది కనిపించింది. దాని వొడ్డునే పార్కు. కొందరు ముసలి వాళ్ళు కుక్కలతో ఆడుకొంటున్నారు. విపరీతమైన వాహనాల రద్దీ. రోడ్డ మీద పుట్‌ పాత్‌లు కనిపించటం లేదు. నడిచే అవకాశం లేకపోవటం వల్లనే మెక్సికో వారి శరీరాలకి బరువు ఎక్కువ అయిందని భావించాను. రెండు కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం నడక సాగలేదు. కొన్ని ఇళ్ళ ముందు చిన్నపిల్లలు పేపర్‌తో ఒక అడుగు ఎత్తులో పుర్రె, అస్థిపంజరాలు బొమ్మలు చేసి ఇంటిముందు ఆరబెట్టుకొంటున్నారు. వాటిని చూడగానే జోస్‌పసోదా చిత్రాలు గుర్తుకివచ్చాయి. వీటికి ఏదో ప్రాముఖ్యత ఉంది అనుకొన్నాను. అలా ఆ ఏరియా అంతా తిరుగుతూ రెండు గంటల తరువాత దారి తప్పకుండా ఇంటికి చేరుకొన్నాను.
మైగూల్‌ అప్పుడే ఆఫీసుకి ప్రయాణం అవుతున్నాడు “హస్త ప్రాంతో” (మళ్ళీ కలుద్దాం) అని చెప్పి చేయి ఊపాడు.
సాయంత్రం మేడం రాగానే అందరం మళ్ళీ సిటీ సెంటర్‌కి బయలుదేరాం. ఈ రాత్రికి కాంబోడియా వారి నృత్యం ఉంది. ఆ ధియేటర్‌కి ఎదురుగా జరుగుతున్న మరో ప్రోగ్రాం పేరు ‘మెక్సికన్‌ రాక్‌ డాన్స్‌.’ కాంబోడియా డాన్సు చూడటం కోసం అరకిలోమీటరు పొడుగు లైను ఏర్పడింది. అకస్మాత్తుగా చిన్నపాటి వర్షం అందుకొంది. అయినాసరే ఎవ్వరూ కదల్లేదు. గొడుగులు అమ్మేవారు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు. సరిగ్గా పది నిమిషాల్లో వర్షం ఆగింది. సరిగ్గా అప్పుడే వచ్చిన మైగూల్‌ “డాన్సు చూడటానికి హాల్లోకి పోయి ఉంటుంది వర్షం” అని జోక్‌ చేయగానే వాళ్ళ పెద్దమ్మాయి అందుకొని “అయితే నాకో గొడుగు కొనిపెట్టండి. లోపల నేను తడిసి పోకుండా ఉంటాను” అనగానే అందరూ నవ్వుకొన్నారు.
స్టేజ్‌ అంతా బంగారు కాంతిలో మెరిసిపోతూ, మిసమిసలాడుతూ ఉంది. ఆ నాట్యకారుల వొంటి మీద ఆ భరణాలు ఎక్కువ. అందువలన వారికి కదలికలకి ఒక నిర్దిష్టత ఏర్పడింది. వారి సంగీతకారులు కూడా, నాట్యం చేస్తున్న వారి వెనుకనే స్టేజీ మీదే కూర్చొన్నారు. వారు ప్రదర్శించే జానపదగాధ ఒక ప్రేమికుడి చుట్టూ తిరుగుతూ ఉంది. చిన్న షెహనాయి లాంటి గాలి వాయిద్యం, ప్రేక్షకుల్ని సుదూరాలకి తీసుకొనిపోతూ ఉంది. హాల్లో నిజమైన నిశ్శబ్దం తాండవించింది. దానికి తోడు అప్పుడప్పుడూ స్టేజీ మీదకి తెల్లని పాగను ఒక పద్ధతిలో వదులుతూ, మేఘాల నేపధ్యాన్ని సృష్టిస్తున్నారు. అన్నిటికంటే వారి సంగీతం బాగుంది. గాత్రం, వాయిద్యం రెండూ సమానస్థాయిల్లో కలిసిపోయాయి. నాట్యకారుల ఆహార్యం బరువుగా ఉండటం చేత, సంగీతం అనే వృక్షానికి ఊగుతున్న పువ్వులగుత్తులు మాదిరిగా ఉన్నాయి వారి కదలికలు. సభ ముగియగానే ప్రేక్షకులందరూ ఒక తుఫాన్‌ను తలపించే రీతిలో కరతాళధ్వనులు చేశారు. (ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చెయ్యటంలో కంబోడియా కళాకారులకి శతాబ్దాల అనుభవం ఉందని తెలిసింది.)
ఉదయం లేవగానే “శాంతా లూసియా ఉత్సవాలు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటాయని” గుర్తుకి తెచ్చుకొని, ఏ ప్రోగ్రాములు చూడాలో ఒక ప్రణాళిక తయారు చేసుకొన్నాను. పైగా ఈ రెండు రోజులూ వీకెండ్‌ కూడా వచ్చింది.
ఈ రోజు గవర్నమెంట్‌ ప్యాలెస్‌ ముందున ఆరుబయట ప్రాంగణంలో జోస్‌ పసోదా పేరుమీద పెయింటింగ్‌ పోటీలు జరుగుతాయి. వీటిలో పాల్గొనటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక చిత్రకారులు వస్తున్నారు. ఆస్ట్రేలియాలోని తాస్మానియాలో ఉన్న “హంటర్‌ స్ట్రీట్ ఆర్ట్‌ సోసైటీ”లో కొందిమంది నాకు తెలుసు. వారు ఎవరన్నా ఇక్కడకి వస్తున్నారో తెలుసుకోవాలి. ఆక్వాస్‌ కాలియంట్‌ నగరానికి చెందినవారు ఎవరైనా పరిచయమైతే బాగుంటుంది అనుకొన్నాను.
ఈ సాయంత్రం ఇవా పిరాన్‌ (ఎవిటా) పేరుమీద సంగీత కార్యక్రమం ఉంది. రేపు ఫ్లయింగ్‌ డాన్స్‌ ప్రోగాం ఉంది. ఈ రెండు కార్యక్రమాలు చూడగలిగితే చాలు అనుకొన్నాను.
మైగూల్‌ ఆఫీస్‌కి వెళ్ళే సమయానికి నన్ను కూడా తనతో పాటు తీసుకువెళ్ళాడు. ‘ఈ రోజు మీకు నా ఇండియన్‌ ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను.” అంటూ నన్ను ఒక కంప్యూటర్‌ గేమ్స్‌ అమ్మే చిన్న షాపులోకి తీసుకెళ్ళి, ‘మై (ఫెండ్‌ ఆది, ఫ్రం ఇండియా’అంటూ ఒక కుర్రాడికి పరిచయం చేసి వెళ్ళిపోయాడు.
“నా పేరు రావత్‌సింగ్‌” అంటూ ఆ పంజాబీ కుర్రాడు నాకు కోల్డ్‌ కాఫీ ఇచ్చి కాసేపు మాట్లాడి, తన బిజినెస్‌ కార్డు అందించి “లంచ్‌ బైం వరకు అలా తిరిగి ఇక్కడికి వచ్చేయండి” అని చెప్పి నా మొబైల్‌ నెంబరు తీసుకొన్నాడు.
నేను పరుగులు తీస్తూ స్ట్రీట్ పెయింటర్స్‌ వర్దకి వెళ్ళిపోయాను. అక్కడ దాదాపు వందమంది చిత్రకారులు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పది చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. తాను వేయబోతున్న బొమ్మని కార్డు సైజులో ప్రింట్‌ చేసి,ఆర్టిస్టు పేరు రాసి అక్కడ ఉంచారు.
స్కేలు ప్రకారం గీతలు కొట్టి కొందరు; ఫ్రీ హాండ్‌ డ్రాయింగ్‌తో మరికొందరు బొమ్మల్ని మొదలుపెట్టారు. ఈ సాయంత్రానికి స్కెచ్చింగ్‌తో పాటుగా ఒక కోట్‌ పెయింట్‌ ఎక్కించటం పూర్తికావాలి. రెండో లేయర్‌ వేసి ఫినిషింగ్‌ టచ్‌లు ఇచ్చేసరికి రేపు సాయంత్రం అవుతుంది. ఇంటర్‌నెట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకొన్న ఫోటోల ఆధారంగా ఎక్కువమంది పెయింట్‌ చేస్తున్నారు. ఐరోపా దేశపు గ్రాండ్‌ మాస్టర్స్‌ అయిన మైకేలాంజిలో, రెంబ్రాంట్‌, వెర్మీర్‌ లాంటి వారి బొమ్మల్ని కాపీ చేస్తున్నవారు మరికొందరు. కొందరు ఫ్రిదాకాలో(1907-1954) చిత్రాన్ని మరికొందరైతే మెక్సికన్‌ నోబుల్‌ బహుమతి గ్రహీత అయిన ఆక్టేవియా పేజ్‌(1914-1998) చిత్రాన్ని గీస్తున్నారు.ప్రజలు గుంపులుగా చేరిపోతున్నారు. విశ్రాంతి తీసుకొంటున్న కొందరు కళాకారులకి నా విజిటింగ్‌ కార్డు ఇచ్చి ‘హాయ్‌’అంటే ‘హాయ్‌’చెప్పుకొన్నాం.
కాసేపు గ్రాండ్‌ ప్లాజా అంతటా జాగ్రత్తగా తిరిగి, ఆ మహా కట్టడాలని చూసి ఆశ్చర్యపోతూ, ఆరుగంటలకి ఇవా పీరాన్‌ మ్యూజికల్‌ ప్రోగ్రాంకి హాజరయ్యాను. మైగూల్‌ నన్ను వెదుక్కొంటూ వస్తాడు అనే నమ్మకం ఉంది. ఇవా పిరాన్‌ గురించిన వివరాలతో ఉన్న కరపత్రాన్ని కూడా పంచుతున్నారు. చీకటి పడిన కాసేపటికి ఆకాశంలో వెన్నెల పుష్పం వికసించింది.
ఇవా పిరాన్‌ (1919-1952) కి మరోపేరు ఎవిటా. ఈమె అర్జెంటైనా లోని పాంపాస్‌ గడ్డి మైదానాల్లోని చిన్న గ్రామంలో జన్మించింది. నటన, సంగీతం ఆమెకి ఇష్టమైన విషయాలు. స్టేజీనటిగా స్థిరపడదామనే ఉద్దేశ్యంతో తన 15వ ఏటనే రాజధాని అయిన “బునాయిస్‌ ఎయిర్స్‌”కి చేరుకొంటుంది. అక్కడ పది సంవత్సరాల పాటు మంచి గాయనిగా పేరు తెచ్చుకొన్న తరువాత 1944వ సంవత్సరంలో ఆమెకి పీరాన్‌ అనే రాజకీయ నాయకుడితో పరిచయమౌతుంది. క్రమేణా వారి మధ్య ప్రేమ అంకురించి వివాహానికి దారి తీస్తుంది. ఆ తర్వాత కొద్ది కాలానికే పిరాన్‌ అర్జెంటైనా ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడతాడు. ఆ విధంగా ఇవా ఆ దేశపు ప్రధమ మహిళగా ఉన్నత స్థానాన్ని చేరగలుగుతుంది. ఆ తర్వాత కాలంలో ఆమె స్త్రీల సంక్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించగలుగుతుంది. అయితే దురదృష్టవశాత్తూ తన 33వ సంవత్సరంలోనే ఆమె కేన్సర్‌ జబ్బుతో మరణించటం వలన తాను (ప్రేమించిన ప్రజలకి దూరమైపోతుంది.
ఆమె సమాధి ఫలకం మీద రాసిన మొదటి వాక్యాలైన “Don’t cry for me Argentina, I remain quiet near to you”అనే పల్లవితో పాట మొదలుపెట్టారు. స్టేజీమీద ఎంతో ఆనందమైన వాతావరణం నిండి ఉంది. చిట్ట చివరిపాట వరకూ ప్రతిపేక్షకుడూ సీట్లకి అతుక్కొనే ఉన్నారు. పైగా చివరిపాటకి సంగీతకారులందరూ స్టేజీమీదనే డాన్సులు చేశారు; వారి వాయిద్యాలనుమోగిస్తూనే.
మైగూల్‌ సరిగ్గా 9 గంటలకి వచ్చి నన్ను కలుసుకొని, “లంచ్‌ తిన్నావా?’”అని అడిగాడు.
“లేదు! అన్నాను.
తిరిగి వెళ్ళేమార్గంలో మా కారు “ఓల్డ్‌ స్పానిష్‌ క్వార్టర్స్‌” ఉన్న వీధుల్లో గుండా సాగిపోయింది.
“సార్, ఎందుకు ఈ దారిలోకి వచ్చారు?”
“మిష్టర్‌ ఆది, అటు చూడండి. ఈ విలాసాల వీధుల్ని మీకు చూపిద్దామని మాత్రమే” అంటూ కారుని కొంచెం స్లో చేశాడు.
అప్పటివరకూ నేను గమనించలేదు. ఆ దారిపాడగునా షాపుల ముందర అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఖరీదైన దుస్తుల్లో వయ్యారంగా నిలబడి మొబైల్‌ ఫోన్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది పాత మోంతారే ఏరియా, ఒక రకమైన డౌన్‌ ట్రీట్‌.
“సార్‌! మీ దేశంలో క్రైం రేటు చాలా ఎక్కువ అని విన్నాను?.”
“అవును. ఒకప్పుడు చాలా ఎక్కువ. మనం ఒక మంచి కారు కొనుక్కొంటే మాఫియా వాళ్ళు ఇంటికి వచ్చి “మనం కార్లు మార్చుకుందామా? అంటూ ఎంతో మర్యాదగా మన చేతికి వాడి కారు తాళాలు ఇచ్చి, మన కారు తాళాలని తుపాకీ మొనతో తీసుకొని వెళ్ళేవాడు.”
ఇలాంటి కబుర్లు చెప్పుకొంటూ ఆ రోడ్డులో రెండు సార్లు అటూ ఇటూ తిరిగి ఇంటికి చేరాం. ఈ రోజు 5వ తేదీ. ఫెస్టివల్‌కి చివరి రోజు. అందరం కాస్త ముందుగానే సెంటర్‌కి చేరుకోవాలనుకొన్నాం. నాకు పెయింటర్స్‌ని పరిచయం చేయమని డాక్టర్‌ మేడమ్‌ని అడిగాను. ఈ రోజు మోంతారే డాన్సు ఫోరమ్‌ వారి ఫ్లయింగ్‌ డాన్సు ఉంది. సాయంత్రం నాలుగు గంటలకి బయలుదేరితే సరిపోతుంది.
ఈ ఉదయం నది వద్దకి మళ్ళీ బయలుదేరాను. ఆదివారం కాబట్టి అక్కడ కాస్త ఎక్కువ మందే ఉన్నారు. నది వొడ్డున నిలబడి గాలంతో చేపలు పడుతున్న ఒక ముసలాయన వద్దకి చేరుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు చేపలు పట్టటం అంటే ఇష్టం.
ఈ సారి నదివొడ్డుకి వచ్చినప్పుడు గాలాపు కర్ర లేకుండా రాదలచుకోలేదు. ఇంటికి వెళ్ళాక “నాకు రెండు Angling rods(గాలాపు కర్రలు) కావాలని మైగూల్‌ని అడిగాను. “మా మామయ్యగారు స్వయంగా తయారుచేసుకొన్న కర్రలు మీ గదిలో ఏదో మూలన ఉన్నాయి, వెతకండి” అని చెప్పాడు.
మేము సెంటర్‌కి చేరగానే ఆర్టిస్టులందరూ దాదాపు వారి చిత్రాల్ని వేయటం పూర్తిచేసుకొని అన్నీ సర్దుకొంటున్నారు. ఒక పక్కన జడ్జిమెంట్‌ కూడా అవుతూ ఉంది. మరో పక్కన ఫ్లయింగ్‌ డాన్స్‌ కోసం క్రేన్‌ సహాయంతో ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
మైగూల్‌ వాళ్ళ పాపలు చాలా బొద్దుగా ఉంటారు; వారి తల్లిదండ్రుల మాదిరే. ఆ పరిసరాల్లో వారు రుచిచూడని ఆహారం లేదు. నాకూ ఒక చిన్న ఛిప్స్‌ ప్యాకేట్‌ ఇచ్చారు. విపరీతమైన కారం. ఇండియాలో దొరికే ప్యాకెట్‌ పుడ్‌ అంతా ఇక్కడ కూడా దొరుకుతూ ఉంది.
డాక్టర్‌ మేడం గారు నాకంటే ముందుగానే కొందరు పెయింటర్స్‌ని పరిచయం చేసుకొంటూ వారికి నా ప్రయాణాల గురించి స్పానిష్‌లో వివరిస్తూ ఉంది. జోహాన్‌ అనే ఒక 40 సంవత్సరాల వయస్సున్న పెయింటర్‌ మాకు దగ్గరయ్యాడు. తన పెయింటింగ్‌ వద్దకి నన్ను తీసుకొని వెళ్ళి ఫోటో తీసి, దాన్ని వెంటనే నా మెయిల్‌ కి కూడా పంపాడు. కొన్ని కబుర్లు చెప్పుకొన్నాక అసలు విషయంలోకి వచ్చి “అక్వాస్‌ కాలియంత్‌లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా?” అని అడిగాను.
“రేపు ఉదయానికి ఇన్‌ఫర్‌మేషన్‌ ఇవ్వగలను” అని చెప్పటంతో కొంత ఆశాభావం కలిగింది. వారికి నా విజిటింగ్‌ కార్డుతో పాటుగా మేడం మొబైల్‌ నెంబరు ఇచ్చాను. “మీకో ఫ్రెండ్ ని తప్పకుండా వెతికి పెట్టగలను సార్‌!” అంటూ జోహాన్‌ ప్రామిస్‌ చేయటంతో, పసోదా మ్యూజియం చూడటానికి ఒక కళాకారుడు తోడు దొరకుతున్నాడనే నమ్మకం కుదిరింది.
స్టేజీమీద రాక్‌ సంగీతం మొదలుకాగానే క్రేన్‌ సహాయంతో పైకి లేస్తున్న డాన్సర్ల బృందం అందర్నీ ఆకర్షించింది. నిముషాల్లోనే క్రేన్‌ యాభై అడుగుల ఎత్తుకి చేరింది. తాళ్ళ చివరకి తమ నడుము భాగాన్ని కట్టివేసుకొని గాల్లో తేలిపోతున్నారు వాళ్ళందరూ.
“ఇంత ప్రమాదకరమైన ఎత్తులో, ఈ క్రేన్‌ సహాయతో నాట్యం చేసే అవసరం ఉందా? హాయిగా నేల మీదే నాట్యం చేయవచ్చుకదా” అని మైగూల్‌ని అడిగాను.
“ఇది మా దేశ సంస్కృతిలో ఒక భాగం. ఒకప్పుడు “పోల్‌ డాన్సు” అనే పేరుతో 15 అడుగుల ఎత్తైన స్తంభాన్ని పాతి, దానిమీద కట్టిన అడ్డుకర్రకి వారి పాదాలు కట్టుకొని తల కిందులుగా వేలాడుతూ నాట్యం చేసేవారు. మా ప్రాచీన అజ్‌టెక్‌ కాలండర్‌ ప్రకారం ఆ స్తంభం చుట్టుతా 52 సారు ప్రదక్షిణం చేయాలి. ఇదీ దాని కథ” అని వివరించాడు.
క్రేన్‌ సహాయంతో వారు చేస్తున్న ఈ నాట్యానికి ప్రజలు విపరీతంగా చప్పట్లు కొడుతూ, కేరింతలతో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఆ నాటి పోల్‌ డాన్సుకి, ఈ ఫ్లయింగ్‌ డాన్స్‌ ఒక ఆధునిక రూపం. నింగిలో చేసిన ఇలాంటి నృత్యంతో శాంతాలూసియా సంబరాలు ముగిశాయి.
ఇక నేను త్వరగా జోస్‌ పసోదా మ్యూజియానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి. తరువాత డ్యూరాంగ్‌ పట్టణానికి వెళ్ళాలి. దాని తరువాత మెక్సికో సిటీకి వెళ్ళి ఖాన్‌ ఖోజే పనిచేసిన కాలేజీకి వెళ్ళటం; ఇదీ నా ప్లాన్‌.
ఆ రోజు ఆఫీసుకి వెళుతున్న మైగూల్‌ నన్నుపిలిచి, “ఈ వారంలో నా మిత్రుడు ఒకరు మెక్సికో సిటీకి వెళుతున్నాడు, తన కారులో నిన్ను కూడా తీసుకెళతానంటున్నాడు. ఫ్రిదాకాలో మ్యూజియం చూడవచ్చు, అలాగే ఖాన్‌ ఖాజే కాలేజీని చూసి రావచ్చు కదా!” అని అడిగాడు.
“ముందుగా పసోదా మ్యూజియానికి వెళ్ళాలి. ఎలాగూ చివరగా మెక్సికో సిటీ వెళ్ళతాను కదా. అప్పుడు అవన్నీ చూస్తాను.”
“సరే! ఫ్రిదా మ్యూజియం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?”
“ఫ్రిదా కాలో గురించి ప్రపంచానికి తెలియని విషయాలు ఏమీలేవు. ఆమె గొప్ప చిత్రకారిణి. వైవిధ్యభరితమైన ఆమె జీవితం, ఆమె పెయింటింగ్స్‌, రొమాంటిక్‌ జీవితం గురించి అందరికీ తెలుసు. కొత్త విషయాలు తెలుసుకొనటంలో నాకు ఆనందం ఉంది” అని నా వాదన వినిపించాను.
“అయితే ఈ రోజు మిమ్మల్ని బెనిటోజ్యూరిజ్‌ సెంటర్లో వదిలిపెడతాను. రండి”, అంటూ తనతోపాటే తీసుకెళ్ళాడు. దారిలో నాకోసం పెద్ద పిజ్జా, రెండు చిన్న జ్యూస్‌ పాకెట్లు కొన్నాడు.
“సార్‌! ఢిల్లీలోని మెక్సికన్‌ ఎంబసీ ప్రాంతంలోని రోడ్‌ని బెనిటో జ్యూరిజ్‌ పేరుతో పిలుస్తున్నారు?” అతని గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని ఉంది?”.
“మా దేశానికి నాలుగుసార్లు ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావటమే ఆయన ప్రత్యేకత. ఒక గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి ఇంత గొప్ప దశకి చేరుకొవటం కొంతమందికే సాధ్యం. అందుకే ఆయనంటే మాకు ఎంతో గౌరవం!.”
మా దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడి ఒకప్పుడు టీ అమ్ముకొని బ్రతికిన వాడే సార్‌” అని మన వారి గొప్పలు కూడా చెప్పాను.
“ప్రొఫ్, మా బెనిటో (1806-1872) చెప్పిన ఒక మంచిమాట మా దేశం మొత్తాన్ని పురోగతి వైపు మళ్ళించింది; తెలుసా?”
“ఆ మంచి మాట నాకూ వినాలని ఉంది?”
“An ant on the move does more, than a dozing ox,ఇంతకీ అతడి ఎత్తు ఎంతో మీరు ఊహించగలరా?”
“బహుశా మీకంటే చాలా ఎత్తుగా, అంటే 6 అడుగులు దాటి ఉండొచ్చునేమో?”
“కాదు! కేవలం 4 అడుగులా, 6 అంగుళాలు మాత్రమే.”
“నేను నమ్మలేకపోతున్నాను మైగూల్‌ సర్‌. ఇలాంటి గొప్పవారి గురించి మీ ద్వారా తెలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. మనం సాయంత్రం కలుసుకొందాం” అదియోస్‌ (బై బై) అని చెప్పి బెనిటో సెంటర్‌లో దిగిపోయాను.
నిన్నటితో రద్దీ అంతా తగ్గిపోవటంతో చాలా భవనాలు, విగ్రహాలు బయటపడ్డాయి. ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న స్తంభం మీద, పన్నెండు అడుగుల బెనిటో జూరిజ్‌ విగ్రహం జాతీయ జెండాని ఎగురవేస్తున్నట్లుగా ఉంది. పరిసరాల్లో దేశ భక్తుల విగ్రహాలు కూడా స్పూర్తిదాయకంగా ప్రతిష్టించారు.
ఈ రోజు మైగూల్‌ కొంచెం త్వరగానే పని పూర్తి చేసుకొని నా కోసం ఇంటికి వచ్చి మెక్సికన్‌ మ్యూజియానికి తీసుకెళ్ళాడు. నన్ను మొదటగా బెనిటో జూరిజ్‌ గుర్రపు బగ్గీ వద్దకి తీసుకెళ్ళాడు. దేశాన్ని ముందుకి నడిపించిన అలాంటి గొప్పవ్యక్తి విగ్రహాన్ని చూడగానే నాకు మన లాల్‌ బహదూర్‌ శాస్త్రి గుర్తుకొచ్చాడు. మెక్సికో వారి అజ్‌టెక్‌ సంస్కృతిని నాశనం చేసి, వారి దేశాన్ని ఆక్రమించిన స్పానిష్‌ సైన్యాధిపతి హెర్మన్‌ కోర్టెస్‌ (1485 – 1547) జీవితాన్ని ఎంతగానో అసహ్యించుకొంటున్నారు మెక్సికన్‌ స్థానికులు. మాయా, అజ్‌టెక్‌ సంస్కృతి గొప్పతన్నాన్ని తెలియజేసే చాలా పరికరాలు, బొమ్మలు లాంటి వాటిని ఎంతో పద్ధతిగా ప్రదర్శించారు ఆ మ్యూజియంలో.
తరువాత ఇద్దరం కలిసి కంప్యూటర్‌ గేమ్స్‌షాపు యాజమాని రావత్‌సింగ్‌ వద్దకి వెళ్ళాం. ఈ సాయంత్రం మాకు వాళ్ళ ఇంట్లోనే డిన్నర్‌ ఏర్పాటు చేశాడు ఆ కుర్రాడు.
సిటీకి పదికిలోమీటర్ల దూరంలో ఉంది వారి కాలనీ. ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా గోడ మీద గురునానక్‌ చిత్రం ఉన్న కాలండర్‌ కనిపించింది. లోపల నుండి ఒక పంజాబీ పెద్దాయన హాల్లోకి రాగానే “మా నాన్నగారిని కలుసుకోండి” అని చెప్పి లోపలికి వెళ్ళాడు మిత్రుడు.
“నా పేరు దుగ్గల్‌సింగ్‌” అంటూ, ఆ పెద్దాయన మమ్మల్ని టేబుల్‌ ముందు కూర్చోపెట్టాడు. మైగూల్‌కి వాళ్ళు బాగా తెలుసు. “ఇక్కడ ఇండియన్‌ అసోసియేషన్‌ ఉందని విన్నాను, దాని అడ్రసు తెలుసుకోవాలని ఉంది?” నేనే అడిగాను.
“ప్రొఫ్‌ ఆది, మనం భోజనం చేస్తూ మాట్లాడుకొందాం” అంటూ ఉండగానే మిత్రుడు మాకు టేబుల్‌ మీద అన్ని ఏర్పాట్లు చేశాడు. వాటిల్లో “కొరానా” అనే చిన్న బీరు సీసాలు కూడా ఉన్నాయి.
“ఇంటర్‌నెట్‌ ప్రభావంతో అందరూ నిత్యం ఛాటింగ్‌ చేస్తూండటం వలన, పండుగల సమయంలో మాత్రమే నిజంగా కలుసుకోవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్న అసోసియేషన్‌ కేవలం ‘ఆన్‌ లైన్‌’కే పరిమితం అయింది” అని చెప్పాడు దుగ్గల్‌ సింగ్‌.
ఈయనకి 65 సంవత్సరాలు ఉంటాయి. ఇంట్లోవాళ్ళు కొందరు హాల్లోకి వచ్చి మాకు నమస్కరించి వెళ్ళారు.
“సార్‌! మన భారతీయుడు M.N.రాయ్‌ (1887-1954) ఈ దేశంలో కొంతకాలం ఉండి, కమ్యూనిష్టు పార్టీ స్థాపించాడని చదివాను. అలాంటి వివరాలు మీకు తెలిస్తే కొన్ని చెప్పండి” అని అడిగాను.
“నేను కూడా విన్న విషయాలే అవి. 1917వ సంవత్సరంలో రష్యా విప్లవం జరిగిన తర్వాత, లండన్‌లో ఉంటున్న రాయ్‌ తన భార్యతో సహా 1919వ సంవత్సరలో మెక్సికో వచ్చి, మెక్సికన్‌ కమ్యూనిటీ పార్టీ స్థాపించాడు. అంతకంటే వివరాలు నాకు తెలియవు.
“పాండురంగ సదాశివ ఖాన్‌ ఖోజే గురించి కూడా కొన్ని విషయాలు తెలునుకోవాలని ఉంది!”
“మా క్లబ్‌లో ఆయన ఫోటో ఉండటం నాకు బాగా గుర్తు. లాలా హరదయాళ్‌ స్థాపించిన గదర్‌ పార్టీలో ఆయన ఒక మెంబరు. బెల్జియం దేశపు స్రీని పెళ్ళి చేసుకొని, ఇక్కడే ఉంటూ అగ్రికల్చర్‌ గురించి పరిశోధన చేస్తూ, మొక్కజొన్నలు పండించటంలో కొత్త ప్రయోగాలు చేశాడు. ప్రఖ్యాత మెక్సికన్‌ పెయింటర్‌ ‘డీగో రివేరా ఖాన్‌ఖోజే’ చిత్రాన్ని ఒక మ్యూరల్‌ పెయింటింగ్‌లో భాగంగా వేశాడు”.
“ఇలాంటి వివరాలు మీకు తెలియడం నాకు ఆశ్చర్యంగా ఉంది”.
“మా నాన్నగారు ధాన్యం అమ్మే షాపుల్లో పనిచేయటం వలన నాకు ఇవన్నీ చెప్పేవారు.”
మైగూల్‌ మమ్మల్ని పట్టించుకోకుండా భోజనం చేస్తున్నాడు. మేము మాటల్లో పడ్డాం. మొక్కజొన్న పిండితో చేసిన మెత్తని రొట్టెల మీద ‘కాబ్రిటొ అనే లేత మేక మాంసాన్ని వడ్డించారు.
“ఆది! నువ్వు బాగా తినాలి. తిరిగి వెళ్ళేసరికి మాకు మాదిరిగా లావుగా తయారవ్వాలి” అంటూ ఉత్సాహపరుస్తున్నాడు నన్ను మైగూల్‌.
“అలాగైతే నాకు రెండు జతల కొత్తబట్టలు ఫ్రీ సైజులో కుట్టించి సిద్ధంగా ఉంచండి” అని జోక్‌ చేశాను నేను.ఆ పంజాబీ ఫ్యామిలీ వద్ద శెలవు తీసుకొని ఇంటికి వచ్చాము. అప్పుడే మేడమ్‌ కిందికి దిగివచ్చి, “సార్‌, మీకో గుడ్‌ న్యూస్. జోహాన్‌ ఫోన్‌ చేశాడు. ఎల్లుండి మీ కోసం తన మిత్రుడు ఆక్వాస్‌ కాలియంత్‌కి వస్తున్నాడట. అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి” అని చెప్పగానే సంతోషించాను.
తెల్లారగట్ల కోడికూతలు వినిపించాయి; నా గది వెనుక ఉన్న వారింట్లో నుంచి. మా కుక్క నా మౌనానికి అలవాటైపోయినట్టుంది. అసలు నా వైపే చూడటం లేదు. ప్రతి ఉదయం మేడం ఆరున్నరకి డ్యూటీకి వెళ్ళే ముందే కుక్కని పలుకరించి, కాస్త ఆహారం పెట్టి, ఒకసారి గట్టిగా వాటేసుకొని బుజ్జగించిపోతుంది. ఈ రోజు ఆమె బయలుదేరే సమయానికి నేను బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడ్డాను, వాకింగ్‌కి వెళదామని.
“ఈ రోజు నాతోపాటుగా హాస్పటల్‌కి వస్తారా? నా స్నేహితులకి మీ గురించి చెప్పాను” అని అడిగింది. రేపే గదా నా ప్రయాణం, సర్దుకోవాలి” అనగానే “అది చాలా ముఖ్యం” అని ఆమె వెళ్ళిపోయింది. వాకింగ్‌ ఆలోచన మానుకొని గాలాపు కర్రల కోసం గదిలో వెదకటం మొదలుపెట్టాను. పోయినసారి ఫ్రాన్స్‌ దేశంలో బేత్‌మల్‌ సరస్సు వద్ద కూడా ఒక అవకాశాన్ని వదులుకున్నాను. ఎనిమిది గంటలకల్లా రెండు గాలాపు కర్రలు తీసుకొని ఒక్కన్నే బయలుదేరాను నదివైపుకి. ఇంతలో మైగూల్‌ “మన కుక్కని అలాగా తీసుకొని నీకు తోడుగా వస్తాను” అని చెప్పి పదినిమిసాల్లో బయలుదేరాడు. మా కుక్క రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఇళ్ళల్లోని ప్రతి కుక్క మొరగటం మొదలుపెట్టింది. పార్కుకి వెళ్ళిందాకా ఒకటే అరుపులు. ఆ కుక్క మైగూల్‌ని లాక్కొంటూ ముందుకు పోతూనే ఉంది. అన్ని కుక్కలు అక్కడ ఉన్నాయని అంత వరకూ నాకు తెలియదు.
మేము నది వొడ్డుకి చేరేసరికి అక్కడ ఇద్దరు ముసలివాళ్ళు గాలాలు వేసి సిద్ధంగా ఉన్నారు. మైగూల్‌ నన్ను వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళాడు. గాలానికి ఎరలు గుచ్చే పనిలేదు. ‘ఆర్టిఫిషియల్‌ ఫ్లై’ అనే ప్లాస్టిక్‌ పురుగు మధ్య, స్టీలుతో చేసిన చిన్న గాలం దాగి ఉంటుంది. నా గాలాపు కర్రకి కూడా అవే ఉన్నాయి. చేపలు దాన్ని నిజమైన ఆహారం అనుకొని మింగటానికి వస్తాయి.
గంట తరువాత వారికి రెండు చేపలు తగులుకొన్నాయి. అయినా నా గాలానికి ఉన్న బెండు ఏ మాత్రం కదలటం లేదు. వారికి పడిన చేపలు ఎగురుతూ నేల మీద దొర్జుతుంటే అనందించాను. చిన్నతనంలో మా నాన్నతో పాటుగా నేనూ గాలాపు వేటకి వెళ్ళేవాడిని. “ఒరే నారాయణా, నీకు ఓపిక ఎక్కువరా! అలా కూర్చుండిపోతావు. నీకే ఎక్కువ చేపలు పడతాయిరా” అంటూ ఉండేవాడు. “ఇది మెక్సికో నాన్నా! స్థానికులే వాటికి ఇష్టం” అంటూ గొణుక్కున్నాను. మరో గంట సేపు ఓపికగా కూర్చొన్నాను. అయిన ఒక్కటి కూడా పడలేదు. గాలానికి చేపలు తగలటం తరువాత విషయం; “చేపల వేట” అనే గాలానికి నేను బాగానే తగులుకుపోయాను అనిపించింది.
ఈ రోజు సాయంత్రం పార్టీకి వెళదామనుకొన్నారు మావాళ్ళు. అది కాన్సిల్‌ అయింది. అందువలన నా కోసం ఒక D.V.D తీసుకొచ్చి చూపించారు. ఆ సినిమా పేరు ‘అలామార్‌’ (సముద్ర తీరానికి), తీరంలోని పర్యావరణాన్ని కాపాడుతూ, అక్కడే జీవిస్తూ ఉన్న తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరిన యువకుడి కథ దీని ఇతివృత్తం. గొంజాలెజ్‌ రూబివో దాని డైరెక్టర్‌.
వేకువజామునే మేడమ్‌ తన ఆఫీసుకి వెళ్ళుతూ నన్ను బస్‌స్టాండ్‌లో దించింది. ఆక్వాస్‌ కాలియంత్‌కి బస్సు అయినా, ఫ్లైట్‌ అయినా టిక్కెట్టు ధర ఒక్కటే. పరిసరాలు అన్నీ చూడవచ్చు కాబట్టి బస్‌ ప్రయాణం చేద్దామనుకొన్నాను. రెండు వైపులా టిక్కెట్‌ ముందే కొనుకున్నాను. 150 డాలర్లు. ఏడుగంటల ప్రయాణం. మెక్సికో నగరానికి, మోంతరేకి సరిగ్గా మధ్యలో ఉంది; ఈ అక్వాస్‌ కాలియంత్‌.
అద్భుతమైన కొండ మార్గాల్లో గుండా సాగిపోయింది బస్సు. దాదాపు ఎడారిలాంటి ప్రదేశాలు కొన్ని వచ్చాయి. అక్కడక్కడ రైతులు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు పెద్ద యంత్రాలతో.
నా పక్క సీట్లో ఉన్న చైనా విద్యార్ధులతో మాటలు కలిపాను. “మెక్సికో యూనివర్సిటీ ప్రాజెక్టు వర్కు కోసం వచ్చాం” అని చెప్పారు.
“నేను ఒకసారి చైనా వెళ్ళొచ్చాను”అని చెప్పగానే “మా దేశం వారి వీసా స్టాంపింగ్‌ లేబుల్‌ ఎలా ఉంటుందో చూపించండి” అని అడిగారు. అ పేజీ మీద చైనా గోడని చూడగానే పరమ సంతోషించారు. నా ఎదురుగా కూర్చొన్న జెంటిల్‌మెన్‌ చేతిలో ‘మెక్సికన్ టూరిజం’ పుస్తకాన్ని చూశాను. నేను అడక్క ముందే ‘ప్లీజ్‌ టేక్‌ ఇట్‌’ అంటూ నా చేతికి ఇచ్చాడు. అంతలోనే అతడు సామానులు సర్దుకొంటున్నట్టు గమనించి, తన పుస్తకాన్ని తిరిగి ఇవ్వబోతుంటే “నేను దిగిపోతున్నాను, ఉంచుకోండి. మెక్సికో చాలా గొప్పదేశం”అన్నాడు. “ఫైన్‌, థ్యాంక్యూ” అని మాత్రమే అనగలిగాను. ఇంకా మూడుగంటలు బైముంది నా గమ్యానికి. ఈ పుస్తకంలో నేను కొత్తగా తెలుసుకొన్న విషయం ఏమంటే అక్వాస్‌ కాలియంత్‌ నగరంలో “National Museum of death”ఉందని అంతే కాకుండా జోస్‌ పసోదా చిత్రాలు కూడా కొన్ని ఆ మ్యూజియంలో ఉన్నాయని తెలిసింది. అక్టోబరు 31వ తేదీ నుండి నవంబరు 2వ తేదీ వరకు కొనసాగే,“Day of the dead” ఉత్సవాలను పురస్కరించుకొని ఈ మ్యూజియంకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలిసింది.
సరిగ్గా మధ్యాహ్నాం మూడు గంటలకి ఆక్వాస్‌ కాలియంట్‌ చేరుకొంది బస్‌. చాలా అందమైన నగరం. జోహాన్‌ పంపిన మిత్రుడు నన్ను మెయిన్‌ గేట్‌లోనే కలుసుకొన్నాడు.
“నా పేరు ఇద్రిస్‌. గూగుల్‌లో మీ సైట్‌, వెబ్‌ పేజీ చూశాను. ‘వెల్‌కం టు ది సిటీ ఆప్‌ హాట్‌ వాటర్‌ స్రింగ్స్‌’ అంటూ ఎంతో ప్రేమగా పలుకరించాడు.
ఇతడి వయసు 40కి దాటదు. మెక్సికన్‌ వాళ్లలాగా లేడు మనిషి. ఆ విషయాన్నే అడిగాను. “మాది కోస్టా రీకా (సెంట్రల్‌అమెరికా), మా పేరెంట్స్‌ ఇక్కడికి ఇమ్మిగ్రేషన్‌ వచ్చారు” అని తన కుటుంబం గురించి చెబుతూ ఉండగానే సిటీ బస్‌లోకి ఎక్కాం.’డెల్‌ ఎన్‌-సినో’ అనే ప్రదేశంలో ఉన్న ‘ప్రీస్ట్‌ క్లాయిస్టర్స్‌’ అనే చోటుకి చేరగానే ఎదురుగా ‘జోస్‌ పసోదా మ్యూజియం’ అనే బోర్డు, తన సిగ్నేచర్‌ స్టయిల్‌ అయిన ‘కత్రినా పురై’ చిత్రం కనిపించాయి.
“ఇదే సార్‌ మీరు చూడాలనుకొంటున్న ప్రదేశం రండి” అంటూ తనే ముందుకి దారి తీశాడు. “ఒక కార్టూనిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టి అంతర్జాతీయ కళాకారుడిగా ఎదిగిపోయిన జోస్‌ పసోదా జీవితం మాకు అందరికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ మ్యూజియాన్ని 1972వ సంవత్సరంలో నిర్మించారు” ఇద్రిస్‌ చెబుతున్నాడు.
“ఇద్రిస్‌, మీ దేశంలో ఈ పురై బొమ్మ, అస్థిపంజరాలకీ ఏమైనా సాంస్కృతిక నేపధ్యం ఉందా?”అని అడిగాను.

“డే ఆఫ్‌ ది డెడ్‌” అనే పండుగలో ఈ పుర్రెలు, అస్థిపంజరాలే ప్రధాన పాత్ర వహిస్తాయి కాబట్టి అతని చిత్రాలకి గుర్తింపు గౌరవం లభించాయి. ఈ నగరపు పతాకం మీద కూడా పసోదా చిత్రించిన ‘కత్రినా’ చిత్రాన్నే ప్రింట్‌ చేస్తున్నారు.
ముఖద్వారంలోనే పసోదా కాంస్య శిల్పాన్ని అమర్చారు. లోపలి గదుల్లో డ్రాయింగులు, ట్రింట్‌లు, కేరికేచర్‌లు అన్నీ ఒక పద్ధతిగా ప్రదర్శించారు. వాటిల్లో చిన్న పిల్లల కోసం వేసిన ఇల్లస్ట్రేషన్లు కూడా చోటుచేసుకొన్నాయి. డజన్ల కొద్దీ ఉన్న పసోదా చిత్రాలకి ఎంతో విలువ ఇచ్చారు ఈ నగర పౌరులు.
గ్యాలరీలో ఐదారుగురు కంటే ఎక్కువ లేరు. సాయంత్రం కావచ్చింది.
ఒక చిత్రంలో అస్థిపంజరం ఉపన్యాసం ఇస్తూ ఉంటే, మరికొన్ని అస్థిపంజరాలు తీరుబడిగా కూర్చొని వింటూ ఉంటాయి.కొన్నిచోట్ల చిత్రమైన వేషధారణతో అస్థిపంజరాలు నాట్యం చేస్తుంటాయి. మరొక చిత్రంలో ఒక గుర్రం మీద మనిషి స్వారీ చేస్తుంటాడు. అయితే అవి రెండూ కూడా అస్థిపంజరాలే. అది వెళ్ళేదారిలో ఎముకల గుట్టలు పడి ఉంటాయి. యుద్దాన్నీ మృత్యువునూ తలపించే ఇలాంటి దృశ్యాలు ఆయన చిత్రాల్లోనే ఎక్కువ. తాను చేసిన ‘కత్రినా ‘(పుర) బొమ్మనే పసోదా ముద్దుపెట్టుకొంటున్నట్లు ఒక చోటచూస్తాం. ‘నేను మృత్యువుకి భయపడను’ అని మనకు చెబుతున్నట్టుగా ఉంటుంది ఇది. కొన్ని చిత్రాల్లో అయితే ఆ కాంకాళాలు ఎవరివో గుర్తుపట్టేందు కోసం ఆధారాలు కూడా మనకి అందించాడు పసోదా. కొన్ని కాంకాళాలకి గడ్డాలూ, పొడవాటి మీసాలూ, టోపీలు, నోటిలో పెద్దచుట్ట లాంటి గుర్తులు చిత్రించి, ఆ బొమ్మ ఎవరిని ఉద్దేశించి వేశాడో తెలియజేసిన ధైర్యశాలి పసోదా.
ఇంతలో ఇద్రిస్‌ నన్ను పిలిచి “ఈయన చిత్రాల్లో ‘జపాటా’ అనే మెక్సికన్‌ విప్లవకారుడుకూడా ఉన్నాడు. ఇలా చూడండి” అంటూ నన్ను ఆ చిత్రం వద్దకి తీసుకెళ్ళాడు.
ఫోర్బిరోడయాజ్‌ రాజు కాలంలో జరిగిన అన్యాయాలను ఎదిరించి వేసిన సీరీస్‌లో ఒక ముఖ్యమైన చిత్రం ‘జపాటా.’మెక్సికన్‌ కొండ ప్రాంతాల్లో నివసించే రైతులకి జరుగుతున్న అన్యాయాలని నిరసిస్తూ ఉద్యమాలు చేసిన ఎమిలియావో జపాటా(1879-1919) 39 సంవత్సరంలోనే హతమార్చబడ్డాడు. “Land and liberty” అనే స్లోగన్‌తో అనాటి భూస్వాముల మీద తిరుగుబాటు చేసిన వీరుడు జపాటా. విశాలమైన టోపీ, కోరమీసం, చేతిలో తుపాకీతో గుర్రం మీద స్వారీ చేస్తున్న ఆ వీరుడి చిత్రాన్ని చూసినప్పుడు మన మన్యం విస్లవవీరుడు అల్లూరి సీతారామరాజు (1897-1924) గుర్తుకు వచ్చాడు నాకు.
“జపాటా లాంటి విప్లవ వీరుడి చిత్రాల్ని ద్వారా తాను కూడా ఒక విప్లవ కళాకారుణ్ని అని తెలియజేశాడు పసోదా”. ఇద్రిస్‌ వ్యాఖ్యానించాడు.
ఆ పూట మ్యూజియం నుండి బయటకు వచ్చిన చివరి వాళ్ళం మేమే.
ఆ రోడ్డు వారగా ఉన్న చిన్న షాపులో ఒక ‘పేపర్‌ స్కల్‌’ బొమ్మ కొన్నాను. ఇది ‘కత్రినా కపాలం.’ ఇద్రిస్‌ నన్ను తన స్టూడియోకి తీసుకెళ్ళాడు. ఇతడు వేసే బొమ్మలు అన్నీ లాండ్‌ స్కేప్‌ ఆర్ట్‌కి సంబంధించినవే. టూరిస్టులు విపరీతంగా తిరిగే ఇలాంటి నగరాల్లో సగం మంది కళాకారులు స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొంటున్నారు. సాయంత్రానికి ఎంతో కొంత డబ్బు చేతికి వస్తుంది.అతని ఆర్ట్‌ గురించి ఎలాంటి కామెంట్‌ చేయలేదు. “కొన్ని మంచి ఎగ్జిబిషన్లు పెట్టటానికి ప్రయత్నించండి” అని మాత్రమే సలహా ఇచ్చాను. రాత్రికి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. కోస్టా రీకా దేశంలోని అందమైన జలపాతాలు, అగ్ని పర్వతాలు, రెండు వైపులా ఉన్న సముద్రాన్ని గురించి చెప్పాడు.
“ఇద్రిస్‌, నీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఒకసారి ఇండియా రండి, నా ఆర్టిస్టు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను”, అని చెప్పి నా విజిటింగ్‌ కార్డు ఇచ్చాను.
“సార్‌, మీరు జిప్సీలా?” అన్నాడు, నా కార్డుమీద రాసి ఉన్న ‘ది స్కాలర్‌ జిప్సీ’ అనే టైటిల్‌ని పరిశీలనగా చూస్తూ.

“ఇది నా పెన్‌నేమ్‌ మాత్రమే” అని చెప్పాను.
“సార్‌! ఇక్కడ జిప్సీల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. మెక్సికోలో వారిని అందరూ అసహ్యించుకొంటున్నారు.”
“ఎందువలన?”.
“వారి ప్రవర్తన వలన నగరాల్లో కొన్ని నమన్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించటం మానేసిన గవర్నమెంటు, ఈ జిప్సీలపై కోపాన్ని తెచ్చుకొని వారిని బాధలు పెట్టటమే పనిగా పెట్టుకొంది. అలాంటి పరిస్థితుల్లో 2010వ సంవత్సరలో ‘పాబ్లో లువినోఫ్‌’ అనే జిప్సీ లీడర్‌ని పోలీసులు చంపేశారు. అప్పటి నుండి వారి బాధలు పట్టించుకొనేవారు ఎవరూ లేరు. వారిపై దండనకాండ కొనసాగుతూనే ఉంది.”
“ఈ మెక్కికో నగరంలో జిప్సీలు ఎంతకాలంగా ఉంటున్నారు?”
“ఇక్కడి జిప్సీలని ‘హంగారో’అని పిలుస్తున్నారు. అంటే వారు హంగేరీ నుండి వచ్చారని తెలుస్తుంది. పాతరోజుల్లో సినిమారీళ్ళ పెట్టెలు మోసుకొంటూ గ్రామాల్లో తిరిగి సినిమాలు చూపించి జీవనం సాగించేవారు. క్రమేణా వారు నగరాల్లో ప్రవేశించి నాట్యం, సంగీతం ద్వారా బతుకుతున్నారు. ఇదీ వారి కథ”.
“నేను క్రితంలో వారిని యూరప్‌లో చూశాను. అక్కడా వారికి సరైన రక్షణ లేకుండా పోయింది”. నేను చూసిన విషయాలు ఇద్రిస్‌తో చెప్పాను.
అతని స్ట్రూడియోలోని ఎక్రిలిక్‌ పెయింటింగ్‌ వాసన కారణంగా రాత్రి సరిగా నిద్రపట్టలేదు. కాస్త వేకువనే మెలకువ వచ్చింది. ఉదయాన్నే లేచి ఇద్దరం కాసేపు జాగింగ్‌ చేశాం. పదిగంటలకల్తా ‘సాన్‌డీగో టెంపుల్‌’పరిసరాల్లో ఉన్న “National Museum Of Death”కి చేరుకొన్నాం.
“1997వ సంవత్సరంలో దీని నిర్మాణం పూర్తయినట్టుగా కరపత్రాలు చెబుతున్నాయి. పాత సమాధులు ఉన్న స్థలంలో ఈ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళగానే మళ్ళీ పసోదా చిత్రం ‘కత్రినా’ పురైమీద పువ్వుల టోపీతో నవ్వుతూ కనిపించింది.
గంటసేపు అన్ని గదులూ పూర్తిగా తిరిగాం. యాత్రికులు ఒక్కొక్కరే రావటం మొదలైంది. ఈ మ్యూజియంలో ఉన్న దాదాపు రెండు వేల చిత్రాలు, శిల్పాలు మృత్యువుకి సంబందించినవే. వీటిని చూడటానికి సరాసరిన రోజుకి నాలుగువందల మంది వస్తున్నారని చెబుతున్నాడు ఇద్రిస్‌.
“సార్‌! ఈ మ్యూజియం చూశాక ప్రజలు నవ్వుకొంటూ, సంతోషంగా వెళుతుంటారు. ఎందుకో తెలుసా?”
“చెప్పండి, ఇదో కొత్త విషయం లాగుంది!”
“మృత్యువునీ, మరణాన్నీ ఇన్ని రూపాల్లో చూశాక మనిషికి చావుపట్ల భయం తగ్గిపోయి, మృతులపట్ల ప్రేమ ఎక్కువ కావటమే దీనికి కారణం” అని వివరించాడు మిత్రుడు.
ఈ మాటలు విన్నాక నార్వే మిత్రుడు డగ్లాస్‌ చెప్పిన “వారికి చావంటే భయం లేదు” అనే వాక్యం గుర్తుకొచ్చింది.
“ఇద్రిస్‌, ఇలాంటి మ్యూజియం ప్రపంచంలో మరెక్కడైనా ఉందా?”
“1995వ సంవత్సరంలో హాలీవుడ్‌లో ‘మ్యూజియం ఆఫ్‌ డెత్‌’ అనే దాన్ని ప్రారంభించాక, ఆ ప్రభావంతోనే ఇక్కడ “నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ డెత్‌”ని నిర్మించారు. “డే ఆఫ్‌ ది డెడ్‌’ (కలబేరా) పండుగకి ఇక్కడ ఉన్న ప్రాధాన్యత వలన ఇలాంటి మ్యూజియం ప్రజాదరణ పొందింది”.
ఈ మ్యూజియంలోని పుర్రెలు, ఎముకలు, కళేబరాలు, కాంకాళాలు, దెయ్యాలు, భూతాలు, రక్తం, రాక్షసులు, మృత్యుదేవతలు లాంటి బొమ్మలు చూశాక నేనుకూడా నవ్వు ఆపుకోలేకపోయాను.
నన్ను తిరిగి అదే బస్టాండ్‌లో వదిలిపెడుతూ, ‘పురా విదా’ అని చెయ్యి ఊపుతున్నాడు. అర్ధంకానట్లు మొఖం పెట్టేసరికి “గుడ్‌ లైఫ్, మా కోస్టారీకాలో ఇలాగే బైబై చెబుదాం” అన్నాడు.
“వెల్‌కం టు ఇండియా డియర్‌ ఫ్రెండ్. పసోదాని తలచుకున్నప్పుడల్లా నువ్వే తప్పకుండా గుర్తుకు వస్తావు” అని చెప్పి ఇద్రిస్‌ వద్ద శెలవు తీసుకొన్నాను. రాత్రి పదిగంటలకి మోంతారే చేరగానే మైగూల్‌ వచ్చి పికప్‌ చేసుకొన్నాడు నన్ను.
ఒక సాయంత్రం పూట ఇద్దరు పిల్లలూ స్కూల్‌ నుండి రాగానే పేపర్లు, కత్తెర, గమ్‌ బాటిల్‌, స్కెచ్‌ పెన్నులూ, టేబుల్‌ మీద కుమ్మరించి బొమ్మలు చేస్తుంటే వారు చేసేవి కలబేరా (పుర్రె) బొమ్మలు అని నాకు అర్థం అయింది.
“మీ కాలనీలో వారం క్రితమే ఇలాంటివి తయారు చేశారు పిల్లలు. నేను కూడా మీతో కలిసి కొన్ని బొమ్మలు చేస్తాను”,అంటూ మొదలుపెట్టి ఐదు చిన్న పురై బొమ్మలు చేశాను. నేను అక్వాస్‌ కాలియంత్‌లో కొనుక్కొచ్చిన చిన్న పురై నమూనా ద్వారా,వారికి నేర్పిస్తున్నాను.
ఇంతలో మైగూల్‌ డ్యూటీ నుండి వచ్చాడు. పిల్లలు ఏవో పాటలు పాడుతూ ఇంట్లోకి వెళ్ళారు.
“ఆది సర్‌, బొమ్మలు చాలా బాగున్నాయి. మీరు ప్రతి సంవత్సరం ఈ పండగ సమయంలో ఇక్కడికి వస్తే మనం ఒక బొమ్మల కొలువు పెట్టుకోవచ్చు” అని చెబుతూనే నేను చేసినఒక చిన్న పేపర్ పుర్రె బొమ్మ తీనుకొని దాని నుదుటి మీద THE SCHOLAR GYPSY అని రెడ్ స్కెచ్‌ పెన్నుతో రాసి, “దీన్ని మన స్నేహానికి గుర్తుగా ఉంచుకొంటాను” అన్నాడు.
“వీటితో మీరు ‘డే ఆఫ్‌ ది డెడ్‌ పండుగ’ని ఎలా జరుపుకొంటారో చూడాలని ఉంది” అన్నాను.
“ఎలాగూ అప్పటి వరకు మీరు ఉంటారుగా! ఇళ్ళన్నీ పుర్రెల బొమ్మలతోనూ, పుష్పగుచ్చాలతోనూ అలంకరిస్తారు. కొన్ని పుర్రెల్ని చక్కెరతోనూ, కేకుతోను చేసి బహుమతులుగా ఇచ్చుకొంటారు. వాటి మీద తమ పూర్వీకుల పేర్షుకూడా రాస్తారు. ఆ మూడు రోజులపాటూ సమాధుల వద్దకి వెళ్ళి అలంకరించి, పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. చిన్న పిల్లల సమాధుల వద్ద వారికి ఇష్టమైన ఆట వస్తువులు ఉంచి వేడుక చేసుకొంటారు.
“అంటే అందరి ఆత్మలకి శాంతి చేకూరాలనీ, అందరినీ గుర్తుకు తెచ్చుకొంటారన్నమాట!”
“అంతేకాదు మృతులు అందరూ సంతోషంగా ఉంటేనే సమాజానికి మేలు కలుగుతుంది అనేది మా భావన”.
“అక్వాస్‌ కాలియంత్‌లో చాలామంది యువతీయువకులు ఈ పుర్రైబొమ్మని పచ్చబొట్టుగా వేయించుకోవటం నేను చూశాను”
“అంతేకాదు! ఆ పండగ మూడు రోజులూ పురై మాస్కులు ధరించి వీధులో తిరుగుతారు. అస్థిపంజరాల డ్రస్సులు వేసుకొని నాట్యాలు కూడా చేస్తారు. అది మీరు చూస్తే కాంకాళాల కరాళ నృత్యంలాగా ఉంటుంది”.
“ఈ పండుగ వెనుక ఏదైనా తాత్విక దృక్పధం ఉందనుకొంటున్నాను!”
“మరణం మరో జీవితానికి పుట్టుక అని మా నమ్మకం. It is a passage to a new life అని కూడా చెప్పుకొంటాం”.అంటూ తన గదిలోకి వెళ్ళాడు మైగూల్‌.
ప్రపంచంలో ప్రతి సంస్కృతిలోనూ ఇలాంటి నమ్మకాలే ఉన్నాయి. ఈ అద్భుతమైన మానవ జీవితాన్ని ఎంత అనుభవించినా తనివి తీరదు కాబట్టి మళ్ళీ జన్మించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. అందు కోసం ఈజిప్టు ఫారువా రాజులు పిరమిడ్‌లు నిర్మించారు. అలాంటి ఆశ మనుషుల చేత ఎన్నెన్నో వింత పనులు చేయించి, జీవితాన్ని అత్యంత మధురంగా, సుందరంగా మార్చివేసింది.
“మా నాన్నగారు డ్యూరాంగో నుండి వచ్చేవారం వస్తారట. కాబట్టి రేపు (12వ తేదీ) మీరు డ్యూరాంగో వెళ్ళి ఒక వారం అక్కడ గడిపి, ఇద్దరూ కలిసి వచ్చేయండి” అని చెప్పింది డాక్టర్‌ మేడమ్‌.
ఇదే మంచి ఐడియా అనిపించింది. డ్యూరాంగో అందమైన నగరం. పైగా అక్కడ చాలా ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రయాణం కోసం లగేజీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాను.
తెల్లారింది. ఆరోజు 12వ తేదీ “మీ వాళ్ళు ఎవరైనా విశాఖపట్నంలో తప్పిపోతే తెలుసుకోవటానికి ఫలానా నెంబరుకి ఫోన్‌ చేయండి” అని నా మొబైల్‌కి S.M.S రావటం చూసి నాకు ఏమీ అర్థంకాలేదు. గంట తరువాత మర్గా అదే మెసేజ్‌ రిపీట్‌ అయింది.వెంటనే మైగూల్‌కి ఈ విషయం చెప్పాను. B.B.C న్యూస్‌లోకి వెళ్ళిచూడగానే కళ్ళు తిరిగినంత పనైంది.
విశాఖపట్నంలో సూపర్‌సైక్లోన్‌ చెలరేగిపోతూ ఉంది. అంత ఎత్తుకి లేచి వడుతున్న సముద్రపు అలలు, కూలిపోతున్నచెట్టు, నాశనం అయిపోతున్న నగర పరిసరాలు.
అసలే నేను ఉండేది సముద్రం ఒడ్డునే. యూనివర్సిటీ ఏమైపోయిందో తెలియకుండా ఉంది. నా పుస్తకాలు తడిచిపోయాయో, ఎగిరిపోయాయో ఊహకి అందటం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆనందంగా ప్రయాణాలు చేయటం మంచిదికాదు అని నిర్ణయించుకొని అ రోజు రాత్రికే ఇంటికి బయలుదేరాను.
మైగూల్‌ స్నేహితుడు నన్ను మెక్సికో సిటీకి తీసుకెళ్ళతానన్నప్పుడు వెళ్ళి ఉండాల్సింది. ఫరవాలేదు, మరోసారి మెక్సికో నగరానికి రావచ్చు. మరిన్ని ప్రదేశాలు చూడవచ్చు, అనుకొంటూ మోంతారే ఎయిర్‌ పోర్టులో అడుగుపెట్టాను.
* * *

అక్టోబర్‌ – 2014

Dr. Adinarayana Machavarapu

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు.  ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *