కవులూ – గులాబీలూ కలిసిన స్వర్గం

Spread the love

ఒయాసిస్సుల ఒడ్డున పరచుకుపోయిన గ్రామాల్లో జీవించాలనీ, ఎడారిలో ప్రయాణాలు చేయాలనీ ఎప్పటినుంచో ఆలోచన ఉంది. ఉమర్‌ఖయ్యాం (కీ॥1048-1131) రుబాయిల్లో రూపు దిద్దుకొన్న బుల్‌బుల్‌ పిట్టల సంగీతాన్ని వినాలనీ, ద్రాక్ష పళ్ళతోటల్లో తిరగాలనీ, సుల్తానులు నిర్మించిన ఎత్తైన గోపురాల్ని చూద్దామనీ కలలు కనేవాడిని. ఫిరదౌసీ (కీ;శ॥ 940-1020), సాదీ (కీ॥శ॥ 1210-1290), హఫెజ్‌ (కీశ॥1325-1390) లాంటి ఫార్సీమహాకవుల్ని చదువుతున్నప్పుడల్లా వాళ్ళు జీవించిన దేశానికి ప్రయాణం చేద్దామనిపించేది.

అలాంటి కల నిజమవ్వటానికి ఒక అవకాశం వచ్చింది. అది ఎలాగంటే ఆంధ్రాయూనివర్సిటీలో చదువుకొంటున్న రేజా బగేరీ అనే రీసెర్చ్‌ స్కాలర్‌, సమీరా అనే స్టూడెంట్‌ ఇరానీ దేశీయులు కావటం వలన వారిని పరిచయం చేసుకొన్నాను. 2011వ సంవత్సరం వేసవి శెలవుల్లో వారి దేశం వెళ్ళటానికి వీసా తీసుకోగానే ఇద్దరూ నన్ను ఇరాన్‌కి ఆహ్వానించారు.

వేసవి శెలవులు ఇచ్చిన వారం రోజుల తరువాత మే నెల, ఏడవ తేదీ ఉదయం కువైట్‌ ఎయిర్‌లైన్స్‌ మీద ముంబై నుండి ప్రయాణమై, అరేబియా సముద్రాన్ని దాటి, ఇరాన్‌ మంచు పర్వతాల మీదుగా ప్రయాణించి, మధ్యాహ్నానికి టెహరాన్‌ ఎయిర్‌ పోర్టుకి చేరుకోగానే సమీరా నాన్న గారు నాజర్‌ అక్సారీ నాకు స్వాగతం పలికి ఇంటికి తీసుకువెళ్ళాడు. కుటుంబ సభ్యులకి పరిచయం చేసి

పర్షియన్‌ తివాచీల మీద తేనీటి విందు ఏర్పాటు చేశాడు. నేను పాఠాల్లో చేప్పే పర్షియన్‌ మీనియేచర్‌ చిత్రాల్లోకి ప్రవేశించినట్టుగా అనిపించింది.

                సాయంత్రానికి అలా బయటికి తీసుకెళ్ళాడు మిత్రుడు. ఎదురుగా అన్నీ కొండల వరుసలే. చాలా ఎత్తైన పర్వతాలు దూరంగా కనిపిస్తున్నాయి. కొండ మార్గంలో పైకి వెళ్ళేకొద్దీ టెహరాన్‌ నగరమంతా విస్తరించిన ఆకాశ హర్మ్యాలు లేత బంగారు ఎండలో మెరుస్తూ, గుంపులుగా బయట పడుతున్నాయి. అద్భుతమైన గాలి. గడ్డి పరక కూడా లేని ఆ కొండల మీద పచ్చదనాన్ని పరచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దూరంగా కనిపిస్తున్న పర్వతాల శిఖరాలకి దట్టమైన మంచు పట్టుకొని వేళ్ళాడుతూ ఉంది; తల్లి వక్షాన్ని వదల్లేని బిడ్డ మాదిరిగా. అంత ఎత్తులో ఉండే ఈ మంచు రిజర్వాయర్ల వల్లనే టెహరాన్‌ నగరానికి ఆకలి దప్పులు తీరేది. ఆ మంచు కరిగి కాలువలై పారుతూ చిన్న నదులుగా ఏర్పడి ఎడారిలో కొంత భాగాన్ని పచ్చగా మార్చగలిగింది.

                “మిష్టర్‌ ఆదినా! ఈ పర్వతాల్లో చిన్నప్పుడు రోజుల తరబడి స్నేహితులతో పాటుగా తిరుగుతూ ఉండేవాడ్ని. అప్పుడు చాలా పెద్ద మంచు దిబ్బలు ఉండేవి” అంటూ చిన్ననాటి స్నేహితుల్ని, పరిసరాల్ని గుర్తుకి తెచ్చుకొన్నాడు నాజర్‌ అక్బారీ.

                అక్బారీ సాబ్‌ నాకంటే రెండేళ్ళు పెద్దవాడు. అయినా గుర్రప్పిల్ల మాదిరిగా పరుగులు తీస్తున్నాడు. ఎంతో హుషారైన మనిషి. ఇరాన్‌ గురించి కొన్ని వివరాలు చెప్పుకొంటూ పరిసరాల్లో తిరిగాం.

                ఇరాన్‌ దేశాన్ని పర్షియా అని మొదటగా పిలిచిన వారు గ్రీకులు. పర్షియా దేశపు పూర్వీకులు ఆర్యులు. కాబట్టి 1930 వ సంవత్సరం నుండే ఇరాన్‌గా పేరు మార్చుకొన్నారు. ఈ దేశంలో సగానికి పైగా ఎడారి. పదిశాతం వ్యవసాయానికి, ముఫ్పె శాతం పశువుల మేతకి పనికివస్తుంది. దక్షిణ భారతదేశమంత వైశాల్యం ఉన్న ఇరాన్‌లో, జనాభా మాత్రం ఏడుకోట్లు మాత్రమే. కొండలు, ఎడారులు, ఒయాసిస్సులు, జలపాతాలూ ఎక్కువగా ఉండటం వలన చాలా అందమైన దేశంగా తయారైంది ఇరాన్‌.

                తొంభై లక్షలమంది ప్రజలు నివాసం ఉంటున్న ఈ టెహరాన్‌ నగరంలో ముఫ్ఫై లక్షల మంది కారుల్లోనే తిరుగుతారు. 1980-88 సంవత్సరాల మధ్యలో పక్కదేశమైన ఇరాక్‌ చేసిన దాడులకి నష్టపోయినా, త్వరలోనే కోలుకొని పశ్చిమ ఆసియాలో ఒక ప్రముఖమైన దేశంగా పేరు తెచ్చుకొంది ఇరాన్‌ దేశం.

                మర్నాడు సాదాబాద్‌ మ్యూజియంకి వెళ్ళాం. చీనార్‌ వృక్షాల నీడలో ఉన్న మెల్తాత్‌ ప్యాలెస్‌లో మధ్యయుగాల ముస్లిం వాస్తుకళ తొణికిసలాడుతూ ఉంది. 1979వ సంవత్సరంలో ఆయాతుల్లా ఖోమైనీ తెచ్చిన విప్లవం తరువాత ఇవన్నీ ప్రజోపకార్యాలకి ఉపయోగపడేలా చేశారు. అంతకుముందు ఈ ప్యాలెస్‌లో పహ్లవీవంశపు నవాబులు పరిపాలన సాగిస్తూ ఉండేవారు.

                మ్యూజియం మొత్తం మీద నన్ను ఆకర్షించింది మాత్రం ఒమిద్‌వార్‌ బ్రదర్స్‌ గ్యాలరీ. ఈ ఇరానీ సోదరులు 1954వ సంవత్సరంలో ప్రపంచ యాత్రకు బయలుదేరి, 1964వ సంవత్సరం వరకూ తొంభై దేశాల్లో తిరిగారు. బయలుదేరినప్పుడు వారి వద్ద తొంభై డాలర్లు మాత్రమే ఉన్నాయట. మ్యూజియంలో మీనియేచర్‌ చిత్రాలు, హస్తకళలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా, నాకు బాగా నచ్చింది మాత్రం వాటర్‌ మ్యూజియం. నీటి విలువ, ఉపయోగం ఎడారి ప్రజలకే ఎక్కువగా తెలుస్తుంది. భూమికిందగా ప్రవహించే నీటిపాయళల్ని కనిపెట్టి, ఆ నీటిని సేకరించే విధానాలు మనకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.

                మెల్లాత్‌ భవనంలో మార్క్‌ఛాగల్‌ పెయింటింగ్స్‌ చూశాము. తోచల్‌ రోప్‌వే మార్గం ద్వారా మంచుకొండల మీదకి వెళుతున్నప్పుడు లోయల్లో తిరుగాడుతున్న గొర్రెల మందలు, వంట చేసుకొంటున్న కాపర్ల దృశ్యాలు కనిపించాయి.

                ఆ మరుసటి రోజున “ఇరాన్‌ ఎస్పరాంతో సెంత్రో’లో నా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ మొదలై మూడు రోజుల పాటు సాగింది. కొత్తవారు పరిచయం అయ్యారు. నా వయసు వాళ్ళందరూ గాంధీ, నెహ్రూలను తలచుకున్నారు. మూడవ రోజున వాళ్ళు నా బొమ్మలు కొన్ని తీసుకొని, ప్రయాణ ఖర్చుల కోసం వంద డాలర్లని, రియాల్స్‌ రూపంలో ఇచ్చి, “సఫర్‌ బే ఖేయిర్‌’ (Happy Journey ) చెప్పారు.

                అక్బారీ సాబ్‌ నన్ను మరో రోజంతా టెహరాన్‌ నగరంలో తిప్పి, తన మాతృభూమి గొప్పతనాన్ని అభివృద్ధిని చూపించాడు. ఎంతో బిజీగా ఉండే టెహరాన్‌ నగరంలో ఎక్కడా శబ్ధ కాలుష్యం లేదు. వారి పరిశుభ్రత నన్ను ఆశ్చర్యపరిచింది. ఫిరదౌసీ మాన్యుమెంట్‌ వద్ద పుస్తకాలు కొన్నాను. “Color of the Paradise “అనే సినిమా తీసిన ప్రఖ్యాత ఇరానీ సినీ డైరెక్టర్‌ మజిద్‌ మాజాదీని ఉంచిన జైలు పక్కగా వెళుతున్నప్పుడు “మాకు పత్రికా స్వాతంత్ర్యం లేదు” అంటూ చాలా బాధపడ్డాడు అక్బారీ. స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్న భారతీయులంటే ఇరానీయులకి ఎంతో ప్రేమ అని తెలుసుకున్నాను. తరువాత రోజు ఉదయం నన్ను టెహరాన్‌లోని ఆజాదీ టవర్‌ వద్ద యాజ్జ్‌ నగరానికి బస్సు ఎక్కించి “See you soon”అంటూ నా జేబులో యాభై డాలర్లు పెట్టాడు.

                యాజ్జ్‌ టెహరాన్‌కి దక్షిణంగా ఉంటుంది. నాపక్క సీట్‌లో కూర్చున్న ఇరానీ యువకుడు తూర్పు తీరంలో ఉన్న బందర్‌ అబ్బాస్‌లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు.“నెలకి ఏడు వందల డాలర్ల జీతం. నా కుటుంబాన్ని వదలి అంతదూరం పోతున్నందుకు ఎంతో బాధగా ఉంది” అని చెప్పాడు. తన తమ్ముడు మోటర్‌ సైకిల్‌ ప్రమాదంలో మరణించాడట. అప్పటినుండి కుటుంబ భారం అంతా అతడే

మోస్తున్నాడు.

                యాజ్జ్‌లో ఉన్న మిత్రుడు రేజా బగేరీని కలిశాను. ఇతడు “ఆష్కజార్‌ యూనివర్సిటీ’లోని ఫైన్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా ఉంటున్నాడు. ఊరి బయట ఇసుక దిబ్బల మధ్యలో ఉంది వారి కాలేజీ. చదువుకొనే స్రీల సంఖ్య ఎక్కువ. ఇతర ముస్లిం దేశాలకంటే ఇరాన్‌లోనే స్త్రీలకి స్వాతంత్ర్యం ఎక్కువ అని తెలిసింది.వీళ్ళకి Nude Study తప్ప, అన్ని సబ్జెక్టులు  ఉన్నాయి. భారతీయ చిత్ర కళ మీద నాచేత రెండు ఉపన్యాసాలు ఇప్పించాడు రేజా. కాలేజీలో ఆరోజు జరుగుతున్న ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌కి Chief Guest గా హాజరయ్యాను.

                యాజ్ద్  నగరం ఒక ఒయాసిస్‌ అంచున ఏర్చడింది. ఈ నగరం ఇరాన్‌కి సరిగ్గా మధ్యలో ఉంది. ఎండలు విపరీతం. నగరం చుట్టూతా నీలంగా కనిపించే పర్వతాల వరుసలు. కీ॥శ। పదమూడవ శతాబ్ధంలో మార్కోపోలో చైనాకి వెళుతున్నప్పుడు యాజ్ద్ నగరంలో మజిలీ చేసినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి.

                యాజ్ద్ లో ఎండలు ఎక్కువగా ఉండటం వలన పాతకాలపు ఇళ్ళ పైకప్పు మీద నిలువుగా, కిటికీ లాంటి నిర్మాణాలు కట్టారు. పది నుండి పదిహేను అడుగుల ఎత్తులో దీర్ధచతురస్రాకారంగా ఉండే ఈ కట్టడాలు, పెద్ద చిమ్నీల మాదిరిగా ఉంటాయి. ఈ కట్టడాల వలన బయట నుండి వీచే గాలి ఇంటి మధ్యలోకి వెళుతుంది. గాలి ఎటు నుండి వీచినా అది ఇంటి లోపలికి వెళ్ళే విధంగా వీటి నిర్మాణం ఉంది. వీటిని బద్‌గీర్‌ (Wind catchers) అంటున్నారు. ఒక్కొక్కసారి ఇంటిలోపల అరుగు మీద పెద్ద నీటిపళ్ళాన్ని అమర్చటం ద్వారా, బద్‌గీర్‌ నుంచి ఇంటిలోనికి వచ్చే గాలి, ఈ నీటితో కలిసిపోయి ఇంటి మొత్తాన్నీ చల్లబరుస్తుంది. ఓల్డ్ టౌన్‌ అంతటా ఇలాంటి ఇళ్ళు కనిపిస్తూనే ఉంటాయి; ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి సాక్షులుగా.

                సిటీలో ఉన్న చారిత్రక కట్టడాల్ని ఒక్క రోజులోనే చూసేశాను. ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తుంది. రోడ్డకి రెండు వైపులా ఉన్న చెట్లకి ప్రతిరోజూ నీళ్ళు అందే ఏర్పాటు చేశారు. యాజ్ద్ హస్తకళలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మధ్య ఆసియా వాసులందరికి యాజ్ద్  తివాచీలంటే ఎంతో అభిమానం.

                ఇరాన్‌లో శుక్రవారం శెలవుదినం. ఇంగ్లీషు డిపార్ట్‌మెంట్‌లో పరిచయం అయిన ప్రాఫెసర్‌ ఆలీగేవేష్‌ గురువారం సాయంత్రం వాళ్ళ అమ్మగారి గ్రామం నౌదుషాన్‌కి బయలుదేరుతుంటే నేనూ సిద్ధం అయ్యాను”Always at your service” అంటూ తన కారులోనే రమ్మన్నాడు. యాజ్ద్  నుండి ఉత్తర దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నౌదుషాన్‌. రెండు గంటల ప్రయాణం. అద్భుతమైన ముడుత పర్వతాల పక్కనుంచి దుసుకుపోయింది కారు. అంతా ఎడారే. దారిలో కొన్ని మసీదులు, గ్రామాలు కనిపించాయి. గ్రామం ఉందంటే అక్కడ ఒయాసిస్సు ఉందనుకోవాలి. దానిలో దారికే నీటి పరిమాణాన్ని బట్టీ అక్కడ జనావానం ఉంటుంది. ప్రజల జీవన గమనాన్ని నిర్ణయించేది ఒయాసిస్సు. హఠాత్తుగా ఎదురైన ఒక పెద్ద కొండ నీడలో సేదతీరుతూ ఉంది నౌదుషాన్‌ గ్రామం. సాయంత్రమైంది. ఎత్తైన పడమటి కొండలు సూర్యుడికి అడ్డుగా రాగానే గాలికొంచెం చల్లబడింది.

                మిత్రుడి ఇంట్లో వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గారి అబ్బాయి ఉన్నారు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఇంటి మధ్యలోనే తోట. వెలుతురు తగ్గిపోక ముందే గ్రామాన్ని చూడటానికి బయలుదేరాం. గడ్డిమోపులు ఎత్తుకొని వస్తున్న గాడిదల గుంపులు ఎదురయ్యాయి. ఒక చిన్న పురాతన కోటని దాటుకొని ఊర్లోకి వెళ్ళాం. “దాదాపు మూడు వేలమంది నివసిస్తున్నారు. అందరికీ సరిపడా నీరు ఇచ్చేది ఒకే ఒక చిన్న నీటి ఊట” అని ఆలీగేవేష్‌ చెబుతున్నాడు.

“సార్‌! కొంచెం వివరంగా చెప్పండి?” అని అడిగాను.

                “ఇక్కడికి ఉత్తరంగా దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన కొండల నుండి సాగిన నీటి ఊట, భూమికిందగా ఇక్కడ వరకూ ప్రయాణించి, బల్లపరుపుగా ఉన్న ఈ ప్రదేశంలో బయటకి వచ్చి ఒయాసిస్‌గా మారింది. కాబట్టి, ఇక్కడ భూమి సారవంతంగా తయారై పంటలు పండుతున్నాయి. అందువల్లనే ఇంత పెద్ద ఒయాసిస్‌ గ్రామం ఏర్పడింది” అని వివరించాడు.

                “అయితే ఈ ఊట ఆగి పోవడం, పూడిపోవటం లాంటి సమస్యలు ఉండవా?”

                “అలా జరిగినప్పుడు వెంటనే వాటికి మరమ్మత్తులు కూడా చేస్తుంటారు. యాజ్ద్  పనివాళ్ళు ఈ కాలువల్ని తవ్వటంలో మంచి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. అది ఎలాగో చూద్దురుగాని రండి” అని చెబుతూ కొంచెం పైభాగంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళాడు. ఒకచోట నేలమీద గుండ్రంగా ఉన్న కొన్ని రాళ్ళు తొలగించగానే ఒక మనిషి నిలువుగా కిందికి వెళ్ళటానికి సరిపడే బిలం కనిపించింది.

                “సార్‌! ఈ బిలం ద్వారా పదిహేను అడుగుల కింద ప్రవహిస్తున్న ఆ నీటి మార్గంలోకి దిగి, అవసరమైన మరమ్మత్తులు చేసి, అదే మార్గంలో పైకి నిలువుగా వస్తారు. భూమిలో ప్రవహించే ఈ నీటి కాలువపైన, ప్రతి వంద మీటర్లకీ ఇలాంటి ఒక బిలం ఉంటుంది. వీటి ద్వారానే మరమ్మత్తులు జరుగుతాయి” అని వివరించాడు మిత్రుడు.

                అలా నడుచుకొంటూ ముందుకి వెళ్ళేసరికి చీకటైంది. అయినా మరికొంచెం ముందుకెళ్ళి మసీదు సెంటర్‌ వద్ద మలుపు తిరిగిన ఇదే నీటి కాలువని చూసి ఇంటికెళ్ళిపోయాం.

                ఈ నీటి కాలువ నౌదుషాన్‌ గ్రామంలో మూడు వందల సంవత్సరాల నుండీ పనిచేస్తూనే ఉంది. దీన్ని కనాత్‌ అంటున్నారు. చైనా ఎడారి ప్రాంతంలో కూడా ఇలాంటి నీటి మార్గాలున్నాయట. వాటిని ‘కారేజ్‌’ అని పిలుస్తున్నారు.

                నౌదుషాన్‌ గ్రామంలో ఇళ్ళని ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకొని, ఇంటి ముందున్న లోతైన భాగంలో తోటని పెంచుకొంటున్నారు. ఆ చెట్లు పై వరకూ పెరిగి విననకర్రల్లాగా వనిచేన్తూ ఇంట్లోకి చల్లని గాలిని, పరిమళాన్ని పంపిస్తుంటాయి. ఆ రాత్రి ఎత్తుగా ఉన్న అరుగుల మీదే కూర్చొని కబుర్లు చెప్పుకొన్నాం.

                ఈ గ్రామంలో సున్నీలు, షియాలు కలిసే ఉంటున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ పడదు. ఆ వ్యత్యాసం పట్టణాల్లో ఎక్కువ. పల్లెటూర్లలో ఒకరికొకరి అవసరం ఉంది కాబట్టి కలిసిపోక తప్పదు. షియాలు గడ్డాలు పెంచుకోరు. కానీ సున్నీలు గడ్డాల ప్రేమికులు.

                షియాలు ధనవంతులైతే, సున్నీలేమో పేదవారు. పేదవారికి పిల్లలు ఎక్కువ. షియాలకి Only one Baby . 1979వ సంవత్సరంలో జరిగిన ఇరాన్‌ విప్లవంలో యువకులు ఎక్కువ మంది మరణించగా, సున్నీల పిల్లలకి బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఇరాన్‌లో 90 శాతం షియాలే. షియాల మసీదులకి రెండు ఎత్తైన మీనార్లు ఉంటే, సున్నీలు ఒక మీనార్‌ ఉన్న మసీదునే నిర్మించుకున్నారు.

                ఎడారి గ్రామంలో వేకువ జామునే మెలకువ రావటం అదృష్టమే. లేచి బయటికి వచ్చి అరుగు మీద ఒంటరిగా కూర్చున్నాను. సగం కరిగిన చందమామ, ఎర్రని దానిమ్మ పూలకొమ్మల చాటున, దోరగా కాలిన రొట్టె ముక్కలాగా ఊగిపోతున్నాడు.

                తెల్లారగానే పక్కింటి పిల్లల్ని తీసుకొని ఊరిబయట కొండ లెక్కటానికి వెళుతుంటే, “మీరు త్వరగా వస్తే పిస్తా తోటల్లో తిరుగుదాం” అన్నాడు మిత్రుడు.రెండు కొండల్ని కొన్ని పాత కట్టడాల్ని చూసి పది గంటలకే తిరిగొచ్చాము. ఆ మధ్యాహ్నం మిత్రుడి పిస్తా తోటల్లో ఇద్దరు ప్రొఫెసర్లు పనిచేశారు. ఎండిన కొమ్మల్ని కత్తిరించారు, నీళ్ళు పెట్టారు, పనికి అడ్డం వస్తున్న చెట్లని రంపంతో కోశారు.వాళ్ళ మేనల్లుడిని అడిగాను “ఇండియా వస్తావా?” అని.

                “రెండు సంవత్సరాలు పాటు మిలిటరీ సర్వీసు పూర్తి చేసి Passport  తీసుకొన్నాక తప్పకుండా వస్తాను” అని చెప్పాడు. “ఇరాన్‌ అంటే మీకు చాలా ఇష్టంలాగా ఉంది” అన్నాడు ఆ కుర్రాడు.

                “అవును. ఇది మా ముత్తాతల (ఆర్యులు) ఊరే కదా!” అన్నాను నవ్వుతూ.

                సాయంత్రానికల్లా చాలామంది మసీదు వద్దకి చేరి నమాజ్‌ చేసుకొంటున్నారు. సెలయేటి ఒడ్డున దప్పిక తీర్చుకొంటున్న బాటసారుల్లాగా కనిపించారు వాళ్ళు. చీకటి పడేసరికల్లా యాజ్ద్ కి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. గ్రామంలో మరికొన్ని రోజులు ఉండి కనాత్‌ భూగర్భ నీటి కాలువలకి వ్యతిరేక దిశలో ప్రయాణించి, అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ నీటి మూలాన్ని చూద్దామనిపించింది.

                మరుసటి ఉదయాన్నే యాజ్ద్ మిత్రుల వద్ద  శెలవు తీసుకొని, ఆ సాయంత్రానికి కెర్మాన్‌ నగరం చేరుకొన్నాను. ఇది యాజ్ద్కి దక్షిణంగా వంద కి.మీ. దూరంలో, ఆఫ్ఘనిస్తాన్‌కి దగ్గరగా ఉంటుంది. ఇదంతా బెలూచీ ఒంటెల కాపరులు తిరిగే ప్రాంతం. అక్కడ నాకు రేజాసత్వానీ అనే చిత్రకారుడు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అంతర్జాతీయ పద్ధతుల్లో కళా సాధన చేస్తున్న ఈయన వయస్సు ముఫ్పై ఐదు సంవత్సరాలు. ఇంకా ఒంటరిగానే ఉంటున్నాడు కాబట్టి నాకోసం సమయాన్ని కేటాయించగలిగాడు. తన అక్కయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయి వేర్వేరు ప్రాంతాలకి వెళ్ళిపోవటంతో అమ్మా నాన్నలకి తోడుగా ఇంట్లోనే ఉంటున్నాడు. “Guest is a friend of God”అనేది మా నమ్మకం. వారంపాటు మా ఇంట్లో ఉండవచ్చు” అంటూ ఎంతో ప్రేమగా అహ్వానం పలికాడు. అతని స్టూడియోలోనే నా నివాసం.

                సొంత  ఇల్లు కట్టుకొని, కొంత సంపాదించాక మాత్రమే ఇరాన్‌ యువకులు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు.

                కెర్మాన్‌ పరిసరాలన్నీ దాదాపు ఎడారిలాగా ఉంటాయి. ఒయాసిస్సులు ఎక్కువ. మిత్రుడు నన్ను ప్రతిరోజూ ఒక ప్రముఖమైన ప్రాంతంలో వదిలిపెట్టి, సాయంత్రానికి మరలా వచ్చి తీసుకెళ్ళేవాడు. ఈ లోపుగా నేను ఆ పరిసరాల్లో హాయిగా తిరిగేవాణ్లి. చేతిలో మొబైల్‌ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందీ లేదు.

                సఫావిద్‌ పీరియడ్‌లో నిర్మించిన గంజాలీఖాన్‌ బజార్‌ నగరానికి మధ్యలో ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. ఒక చదరపు కి.మీ. వైశాల్యంలో ఉన్న ఆ బజార్‌లో, ఇరాన్‌లో ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువూ దొరుకుతుంది. అడవి పక్షుల్ని పెంచుకొనే సాంప్రదాయం బాగా ఉంది ఇక్కడ. నవాబుల కాలం నుండి ‘కారవాన్‌ సరాయి’గా పేరు తెచ్చుకొన్న ప్రదేశం ఇది. పరిసరాల్లో పండించే పంటలన్నీ ఈ మార్కెట్‌కే వస్తాయి. పళ్ళ దుకాణాలు విపరీతం. దానిమ్మ పళ్ళు అమ్ముతున్న ఒక యువతి “ఇలాంటి పెద్ద పళ్ళు మరెక్కడా దొరకవు” అని చెప్పింది. ఆనాటి రెండంతస్థుల సరాయిలు ఇంకా ధృఢంగా ఉన్నాయి. ఐరోపాకి వెళ్ళే సిల్కురూట్‌ ఈ పరిసరాల గుండానే సాగిపోయింది.

                సరాయి కిందిగదుల్లో సామానులతో పాటుగా ఒంటెలు, గుర్రాలు ఉండేవి. పై గదుల్లో వ్యాపారస్తులు, యాత్రికులు విశ్రాంతి తీనుకొనేవారు. విరిగిపోయిన ఆ సరాయిల మెట్లు జాగ్రత్తగా ఎక్కి, మలుపుల వద్ద అరిగిపోయిన ఎర్రని ఇటుక గోడల్ని తాకుతూ ఆనందించాను. సుదూర ప్రయాణం చేసి ఈ సరాయికి చేరుకొన్న ముసాఫిర్‌ లాగా అనుభూతి చెందాను. సరాయిల ముందున్న చీనార్‌ చెట్ల నీడలో మోటార్‌ సైకిళ్ళు నిద్రపోతున్నాయి. అక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకొంటున్న విద్యార్థులు కనిపించారు.

                ఈ బజార్‌లో ఉన్న ఒక గొప్ప నిర్మాణం గంజాలీఖాన్‌ హమామ్‌ (Bath House). ప్రస్తుతం ఇదొక మ్యూజియం. ఇది కీ॥శ॥ పదిహేడవ శతాబ్దం నాటి సఫావిద్‌ నవాబుల సామూహిక స్నానాల గదుల సముదాయం. ఎడారి దేశాలన్నిటిలోనూ ఇలాంటి హమామ్‌లు ఉన్నాయి. వీటిల్లోకి నగరంలోని స్త్రీలు,  పురుషులు వేరు వేరు వేళల్లో స్నానాలకు వచ్చేవారు.

                సమాజంలోని వివిధ హోదాల వారికి అక్కడ వేరుగా గదులు ఉన్నాయి. శరీరాన్ని మర్ధనా చేయటానికి, జుట్టు కత్తిరించుకోవటానికి, దేహ సుఖానికి సంబంధించిన అన్ని వసతులూ ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికి వాటి గురించిన చరిత్ర అంతా బొమ్మల రూపంలో చూపిస్తున్నారు. ముస్లిం వాస్తుకళని, సిరమిక్‌ టైల్స్‌ మీద ఉన్న చిత్రాల్ని చూసి ఎంతో ఆనందించాను. దీని పక్కనే ‘వకీల్‌ హమామ్‌’ అనే మరొక భవనం ఉంది. దీన్ని ప్రస్తుతానికి ఒక ‘టీ హౌస్‌’ గా మార్చారు. ఒక టూరిస్ట్‌ గైడ్‌ నన్ను ఈ ‘టీ హౌస్‌’లోనికి ఆహ్వానించాడు.

                ఇక్కడ టీ తోపాటుగా హుక్కా కూడా ఇస్తున్నారు. కష్టమర్ల కోసం Live Music  అవుతూ ఉంది. సంతూర్‌, డప్పు మీద ఇద్దరు ఇరానీయులు మంచి సూఫీ పాటలు అందుకొంటున్నారు. అల్లా పేరు చెప్పి కొంత చిల్లర సంపాదిస్తున్న ఒక సూఫీ డెర్విష్‌ పరిచయమయ్యాడు. అతడు చెప్పిన “ఒక చేత్తో రెండు పుచ్చకాయల్ని తీసుకోలేం” అనే సూక్తి వినగానే, మన “అవ్వ – బువ్వ” సామెత గుర్తుకు వచ్చింది.

                ఇరాన్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. 2003వ సంవత్సరంలో బామ్‌ అనే చోట వచ్చిన భూకంపంలో నలభై మూడు వేల మంది మరణించారు. అందువలన ఇళ్ళుకట్టుకునే వాళ్ళు ముందుగానే ఐరన్‌తో బిల్డింగ్‌ ఫ్రేమ్‌ని తయారుచేసుకొని, దాని మీద గోడలు కట్టకొంటున్నారు. పార్కుల్లో మన ముద్ద బంతిపూలు చూసి సంతోషపడ్డాను. కెర్మాన్‌ బజార్లలో “గుల్‌” పేరుతో పూలు అమ్మే షాపులు ఎక్కువ.

                ఒక సాయంకాలం కుర్ధిస్తాన్‌కు చెందిన బహాడిన్‌ రేడ్‌ అనే చిత్రకారుడి షో చూడటానికి వెళ్ళాను. ఇండియా గురించి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి చిత్రకళ కంటే, జానపద నృత్యాలే ఎంతో ఇష్టం. కుర్గుల సంగీతాన్ని వినిపిస్తూ నాట్యం చేశాడు. తడిపిన రెండు చిన్న గుడ్డముక్కల్ని చేత్తో పట్టుకొని ‘ఛళ్‌ఛళ్‌’ మనిపిస్తూ, గుర్రం మాదిరిగా పాదాలని కదిలిస్తూ గొప్పగా నాట్యం చేశాడు.

                నగరంలోని అనీస్‌ గ్యాలరీ క్యూరేటర్‌ని కలవగానే “మీ దేశపు సాంప్రదాయ చిత్రకళ మీద మా గ్యాలరీలో ఒక షో ఏర్పాటు చెయ్యండి” అని కోరింది.

                ఒక రోజు మహాన్‌ అనే ప్రదేశానికి వెళ్ళాను. అదంతా కొండ ప్రాంతం. కెర్మాన్‌ నగరానికి యాభై కి.మీ. దూరంలో ఉంది. కొండల మీదుగా కిందకి దూకే జలపాతాల ద్వారానే అక్కడ పంటలు పండుతున్నాయి. గజార్‌ కాలం నాటి షాహజాదీ నవాబులు పెంచిన వందల ఎకరాల పూల తోటల్లో విహరించడానికి యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు. ఈ నీటి ప్రవాహానికి మూలం అక్కడి పర్వతాల్లో పేరుకు పోయిన మంచుదిబ్బలే. మహాన్‌లో ఉన్న పెద్ద మసీదు ‘నిమాతుల్లావలీ’ చాలా అందంగా ఉంటుంది. దగ్గరలో ఉన్న కాలేజీలో Calligraphyలో శిక్షణ ఇస్తున్నారు.

                మహాన్‌లో రేజాసత్వాని నన్ను తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రాత్రికి అక్కడే ఉన్నాం. మంచి విందు ఏర్పాటు చేశాడు రేజా. తనకు ఇష్టమైన ఇరానీ గాయని మార్డాన్‌ (ప్రేమ గీతాల్ని ప్లేయర్‌ మీద వినిపించి, అనువాదం చేస్తూ ఎంతో తన్మయత్వానికి లోనైయ్యాడు. ఎండిపోతున్న ఎడారి బావుల వేదన మాదిరిగా ఉంది మార్దాన్‌ స్వరం. విరహవేదన అనుభవించే “తోడి రాగిణి” అనే రాజస్థానీ పెయింటింగ్‌ నా కళ్ళముందు మెదిలింది.

                కెర్మాన్‌ నగరానికి బయట ఘయీమ్‌ కొండల్లోపల నుండి పెద్ద జల పాతం దూకుతూ ఉంది. గడ్డి పరక కూడా మొలవని ఆ కొండల మధ్యలో అంత పెద్ద జలపాతం ఎక్కడ నుండి వస్తుందో తెలియటం లేదు. ఎడారిని సస్యశ్యామలం చేసిన అల్లాకి కృతజ్ఞతగా, కొండ దిగువలో ఉన్న పెద్ద మసీదులో ప్రార్ధనలు చేస్తున్నారు. వారి సంగీత నివేదన హృదయాన్ని కలచివేస్తూ ఉంది. వర్షం వస్తుందనే భయంలేదు కాబట్టి చాలా ధృఢమైన మట్టి కోటలు నిర్మించారు నవాబులు. ఆ కట్టడాలను ధృఢతరం చేయడానికి నీటితో పాటుగా ఒంటె పాలని కలిపారట; ఆ మట్టిలో.

                సిటీలో ఉన్న మెల్లి లైబ్రరీకి వెళ్ళాను. పుస్తకాల కంటే ఆ భవనపు వాస్తుకళే పాఠకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంది అనుకొన్నాను. కెర్మాన్‌ బజార్లో యాత్రికులకి బాగా నచ్చేవి స్థానికంగా తయారైన అందమైన రాగి పాత్రలు. వాటి మీద ఆయుధాలు ధరించి ఉన్న ‘పెర్సిపోలిస్‌’ సిపాయిల బొమ్మలు ఉంటాయి. “దానిమ్మ పండు పట్టుకొని, చెట్టుకింద టీ తయారుచేస్తున్న కన్య చిత్రం” మరొక ఆకర్షణ. నేను కెర్మాన్‌లో ఉన్న ఆఖరి రోజు సాయంత్రం పూట, తనకి కాబోయే అత్తగారింటికి తీసుకెళ్ళాడు మిత్రుడు. ఆవిడ నాకు గిఫ్ట్‌గా ఒక కెర్మాన్‌ రాగి పాత్ర ఇచ్చింది.

                కెర్మాన్‌ నగరంలో నల్ల దుస్తులు ధరించిన ఎర్రని అమ్మాయిల్ని చూసినప్పుడల్లా ద్రాక్షపళ్ళ గుత్తుల మీద, గులాబీ పూల గుఛ్చాల్ని ఉంచినట్టుగా అనిపించేది. కెర్మాన్‌ నగరాన్ని వదిలిపెట్టడం అంత సులభం కాలేదు నాకు.

                తరువాత ఇస్ఫాహాన్‌ నగరం చేరుకున్నాను. అక్కడ నాకు ఆహ్వానం పలికిన వ్యక్తి మెహిదీ అనే టూరిస్టు గైడ్‌. అతడు రేజాసత్వానికి మిత్రుడు. నాజర్‌ అక్బారీ చేత ఇతనితో ఫోన్‌లో మాట్లాడించాను. కీ॥4॥ పదహారవ శతాబ్ధంలో పర్షియాని పరిపాలించిన సఫావిద్‌ వంశంవారు. ఇస్ఫహాన్‌ నగరాన్ని రాజధానిగా చేనుకొన్నారు. ఇది టెహరాన్‌కి ఈశాన్యంగా మూడు వందల నలభై కి.మీ. దూరంలో ఉంది. కీ॥శ పదిహేడవ శతాబ్ధంలో షా అబ్బాస్‌ ద గ్రేట్‌ (1587-1629) పరిపాలించేవాడు. ఈ కాలంలోనే ఇస్పహాన్‌ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఎందుకంటే అతని కాలంలో ఇస్ఫహాన్‌లో 163 మసీదులు, 48 కళాశాలలు, 1800 దుకాణాలు, 263 హమామ్‌లు ఉండేవి. “ఇస్ఫహాన్‌ నగరాన్ని చూస్తే, సగం ప్రపంచాన్ని చూసినట్లే” అనే నానుడి కూడా ఏర్పడింది ఆరోజుల్లో.

                నగరానికి కేంద్రం “కింగ్స్‌ స్కేర్‌”. దాని పరిసరాల్లోనే “అలీ కాపు ప్యాలెస్‌”, “చెహెల్‌ సో తేన్‌ ప్యాలెస్‌’లు ఉన్నాయి. అవన్నీ అద్భుతమైన భవనాలే.

                క్రీ॥శ॥ 1540వ సంవత్సరంలో మొగల్‌ కింగ్‌ హుమాయూన్‌ ఇండియా నుండి ఇరాన్‌ వచ్చినప్పుడు షా తాహ్‌మాస్ప్  ఆస్థానంలో తలదాచుకొన్నాడు. ఆ చారిత్రక సంఘటనకి గుర్తుగా చెహెల్‌ సో తేన్‌ ప్యాలెస్‌ గోడల మీద పెద్ద మ్యూరల్‌ చిత్రాలు వేశారు. ఖాజోన్‌ నది మీద ఉన్న పురాతన రాతివంతెన ఇంకా ఉపయోగంలోనే ఉంది. ప్రకృతిలోకి, నవాబుల చరిత్రలోకి ఒకేసారి ప్రయాణించటానికి ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతూ ఉంది.

                ఇస్ఫావోన్‌లో పర్షియన్‌ నంన్కృతిని ప్రతిబింబించే నిర్మాణాలు, మ్యూజియంలు ఎక్కువగా ఉన్నాయి. చీనార్‌ చెట్లని చూస్తూ ఎంత దూరం నడుచుకొంటూ వెళ్ళినా అలసట తెలియదు. కింగ్స్‌ స్క్య్వేర్‌కి నాలుగు పక్కలా ఉన్న షాపుల్ని చూసుకొంటూ తిరిగితే చాలు! పర్షియన్‌ సాంస్కృతిక చరిత్ర మొత్తం మనకి తెలిసిపోతుంది. అలెప్పో నుండి ఆగ్రా వరకు ప్రయాణించిన థామస్‌ కోర్యాట్‌ క్రీ॥శ॥ 1614వ సంవత్సరంలో ఇక్కడ ఆగి పర్షియన్‌ భాష నేర్చుకున్నాడు.

                నా తిరుగు ప్రయాణానికి వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే మూడు వారాలు నిముషాల మాదిరిగా కరిగిపోయాయి. ఇస్ఫాహాన్‌ నుండి పసార్‌గాడ్‌ వెళ్ళాను. పర్షియా సామ్రాజాన్ని స్థాపించిన రెండవ సైరస్‌ నమాధి ఇక్కడే ఉంది. ముపఫ్పె ఐదు అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం ఇప్పటికీ చెదిరిపోలేదు. దగ్గరలో కింగ్‌ షూజా నిర్మించిన కారవాన్‌ సరాయి శిధిలాల మధ్యన ఎండలో కాసేపు  నిలబడ్డాను. పరినరాలన్నీ ఎంతో సారవంతంగా ఉన్నాయి. ఎదురుగా ఉన్న కొండ మీద ఆనాటి కోటల పునాదులు కనిపిస్తున్నాయి. ఆ సాయంత్రానికి ప్రఖ్యాతి గాంచిన పెర్సిపోలిస్‌ చేరుకున్నాను. పెద్ద పర్వత పంక్తిని అనుకొని ఉన్న గొప్ప నిర్మాణం అది. పరిసరాల అందమే ఆ కట్టడాల నిర్మాణానికి కారణమై ఉంటుంది. సాయంత్రం కావటంతో మంచి వాతావరణం అలుముకొంటూ ఉంది. శిధిలమైన ఆ ప్రాంగణమంతా యాత్రికులతో కిక్కిరిసిపోయింది. అబూ ఇషాక్‌ ఇబ్రహీం అనే పెర్సిపోలిస్‌ యాత్రికుడు కీ॥4॥ పదో శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చాడు.

                డేరియస్‌ రాజు (క్రీ.పూ. 522-456) నిర్మించిన ‘తక్త – ఏ – జంషేడ్‌’ అనే నిర్మాణం అత్యంత విశాలమైంది. లక్షాపాతిక వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ శిధిలాలు ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి. మౌర్యుల కాలం నాటి జంతువుల శిల్పాలకి మూలాలు ఇక్కడే ఉన్నాయి. పెర్సిపోలిస్‌ శిధిలాల వద్ద గడిచిన ఆ సాయంత్రం ఎప్పటికీ మరుపురానిది. ఎత్తైన శిల్పాల నుండి జారిపోతున్న వెలుగు నీడల్నీ, కాలాన్నీ స్థంభింపచేయడానికి ఫోటోగ్రాఫర్లు కెమేరాలు ఎక్కుపెట్టి, కింగ్‌ ఫిషర్‌ లాగా ఏకాగ్రతతో చూస్తున్నారు.

                ఆ రాత్రికి షిరాజ్‌ చేరుకొన్నాను. City of poets and flowers ‘అని షిరాజ్‌కి ముద్దుపేరు. పదమూడవ శతాబ్ధం నాటికే కళలకి పేరు మోసిన నగరం షిరాజ్‌. పద్దెనిమిదవ శతాబ్దంలో జాండ్‌ వంశస్థులు షిరాజ్‌ని రాజధానిగా చేసుకున్నారు. షిరాజ్‌ ఈ నాటికీ ఒక ప్రముఖమైన వ్యాపార కేంద్రంగానే నిలిచింది. మహాకవులైన సాదీ, హఫెజ్‌ల అందమైన సమాధులు నగరానికి కొత్త వెలుగులు ఇచ్చాయి.

                నగరం చుట్టుతా అన్నీ కొండలే. ఆ కొండల నుండి పలుచని జలపాతాలు మెల్లగా జారిపడుతూ ఉంటాయి. నగరం అంతా తోటలు పుట్టుకొచ్చి, చల్లని వాతావరణం ఏర్చడింది. ప్రజలకి కాస్త తీరిక దొరికితే చాలు; రోడ్డ ప్రక్కన చీనార్‌ చెట్ల కింద గుడారాలు వేసుకొని టీ తాగుతూ ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. పచ్చని ఖాళీ స్థలం కనిపిస్తే పండుగలు మొదలవుతాయి వారికి. ప్రతి ఇంట్లో ఒక టెంట్‌ తప్పనిసరిగా ఉంటుంది.

                సాదీ (కీ॥శ॥ 1210 – 1290) సమాధి వద్దకి చేరుకొన్నాను. అదొక విశాలమైన పెద్ద పూదోట. ఆ ప్రక్కనే ఒక నీటి బుగ్గ ప్రవహిస్తూ ఉంది. చిన్న పిల్లలు దాంట్లో దిగి చేపల్ని తరుముకొంటున్నారు. సమాధి చుట్టుతా తాపడం చేసిన పాలరాతి’పైన గులిస్థాన్‌లోని పద్యాలు చెక్కారు. నీతివాక్యాలతో నిండిన ఆయన రచనలు ముస్లిం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేసాయి.

                స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నట్లే సాదీ రాసిన గులిస్థాన్‌ పుస్తకంలో కూడా ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సూఫీ తత్త్వాన్ని ప్రతిబింబించే తన ‘గులిస్థ్రాన్‌” గ్రంథాన్ని “ఎన్నటికీ వాడని గులాబీ తోట’గా ఆయనే వర్ణించాడు. మన కవికోకిల దువ్వూరి రామిరెడ్డి (1895 – 1945) ఫార్సీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన గ్రంథాల్లో ఇది ఒకటి. ఆసియా ఖండంలో ముఫ్పై సంవత్సరాల పాటు తిరిగి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు సాద్‌. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఆయన భారతదేశాన్ని కూడా దర్శించాడు. తన కవిత్వం ద్వారా దైవానికి దగ్గరగా చేరుకున్న సాత్వికుడు సాదీ. ముఫ్పై అడుగుల ఎత్తులో ఉన్న సాదీ “సమాధి గుమ్మటం” బులుగు రంగులో ఉంటుంది. అంతా విశాలమైన ప్రాంగణం. తన తత్త్వాన్ని ప్రతిబింబించే విధంగా పర్షియన్‌ శైలిలో పూలతోటల మధ్యలో నిర్మించారు ఈ సమాధిని.

                తాను రాసిన బోస్టాన్‌ (పళ్ళ తోట), గులిస్టాన్‌ (పూల తోట) అనే రెండు పుస్తకాలు ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలోని మానవులందరూ ఒక్కటేననీ ఎవరికి బాధ కలిగినా దాని ఫలితం ఆ పక్కవారి మీద ఉంటుందని చెప్పాడు. పళ్ళ తోట అంటే తన అనుభవాల తోటలో పండిన ఫలాలు అని భావం. దీనిలో సామెతలు, కథలు ఉంటాయి. తాను చూసిన మానవ జీవిత సారాన్ని కధలుగా చెప్పాడు. అవి మనకి ఎన్నో నీతులని బోధిస్తాయి. “ఎడారిలో బావి త్రవ్వే శక్తి లేకపోతే, మసీదులో కొవ్వొత్తి వెలిగించు”, “నీ బానిసతో కూడా ప్రేమగా ఉండు, అతడు రాజు కావచ్చు ఒకరోజు” లాంటి గొప్ప సూక్తిముక్తావళి ఆ గ్రంధం.

                సాద్‌ రాసిన ‘“గులిస్థాన్‌’ పర్షియా సాహిత్యంలో ఒక మైలురాయిలాంటింది. ఆసియా దేశపు మధ్య యుగాల్లో ఇంతగా పేరు పొందిన గ్రంధం మరేదీలేదు.

                మహాకవి హాఫీజ్‌ (క్రీశ॥ 1335 – 1390) సమాధిని కూడా చాలా అందంగానే నిర్మించారు. ఆయన మీద ప్రేమ, గౌరవం వల్ల అదొక తీర్థయాత్రా స్థలంగా మారింది. వాఫీజియా రోడ్డు ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటుంది. ఈ సమాధిని డిజైన్‌ చేసింది ఆంద్రే గోదార్డ్‌ అనే ఒక (ఫెంచి ఆర్కియాలజిస్ట్. పర్షియన్‌ మీనియేచర్‌ చిత్రాల మీద హఫీజ్‌ ప్రేమ కవితల్ని ముద్రించి అమ్ముతున్నారు. నేనూ రెండు కార్డులు కొన్నాను. పద్నాలుగవ శతాబ్ధపు ఫార్సీ సాహిత్యాన్ని శాసించిన వ్యక్తి హఫీజ్‌. దైవం మీద ప్రేమ గీతాలు ఎక్కువగా రాశాడు. “నీ ఆలోచనని అందమైన ప్రేయసిగా మలచుకో. బంధాలను తెంచుకొని, ప్రార్థన చేస్తూ ప్రేమను పొందు” అని చెబుతాడు.

                షిరాజ్‌లోని షాచరాగ్‌ మసీదు అన్నిటికంటే గొప్ప కట్టడం. సఫావిద్‌ కాలంలో నిర్మించిన ఈ మసీదు వద్దకి చేరుకొనే సరికి రాత్రి తొమ్మిది గంటలైంది. యాత్రికులు వేల సంఖ్యలో ఉన్నారు. కాంతి సముద్రం మీద తేలిపోతున్న తెల్లని తెరచాపల పడవలాగా ఉంది ఆ నిర్మాణం. ఆ విశాలమైన ప్రాంగణంలో సేద తీరుతున్న వారికి రెట్టింపు జనం, మసీదు లోపల ప్రార్థన చేస్తున్నారు. పరిమళాలు వెదజల్లుతున్న వారి ప్రార్ధనకి ఒక రూపం ఉంటే బాగుండేది.

                “ఇరాన్‌లో ఇంతకంటే పెద్ద మసీదు లేదను’కొన్నాను. మరో యాత్రికుడు నా ముందుకొచ్చి “ఎందుకు లేదు! మహషద్‌లో ఉన్న మసీదు దీనికంటే పెద్దది. అలాంటిది మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లోనే లేదు” అని వివరించాడు. మసీదు లోపల చేసిన అలంకరణలో అద్దాలు, రంగుల గ్లాసు ముక్కలు ప్రముఖపాత్ర వహించాయి. రెండు ఎత్తైన మీనార్లతో ఉన్న ఈ మసీదుని చూస్తే, రెండు చేతులూ ఆకాశం వైపుగా ఎత్తి ప్రార్ధిస్తున్న భక్తుని రూపం గోచరిస్తుంది. ప్రార్ధన కోసం ఇంత గొప్ప నిర్మాణం తలపెట్టాలని ఆలోచన రావటమే నన్ను ఆశ్చర్యపరచింది. మహషద్‌ వెళ్ళి ఉమర్‌ఖయ్యాం సమాధిని కూడా చూద్దామనుకొన్నాను. సమయం లేదు. నేను బయలుదేరాలి. నా వీసా రేపటివరకే పనిచేస్తుంది.

                షిరాజ్‌ నుండి బస్‌ మీద ఇస్స్ఫాహాన్‌ రైల్వేస్టేషన్‌కి చేరేసరికి సాయంత్రం ఏడు గంటలైంది. అక్కడ నుండి రాత్రి తొమ్మిది గంటల రైల్లో టెహరాన్‌కి బయలుదేరాను.

                తెల్లవారేసరికి టెహరాన్‌ చేరుకొని అక్బారీసాబ్‌ ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి మిత్రుడు నమాజ్‌ చేసుకుంటున్నాడు; మక్కా దిక్కు వైపుగా ముఖాన్ని పెట్టి. ఇన్ని రోజుల నుండి నేను ఎక్కడ, ఎవరి ఇంట్లో ఉన్నా సరీ, ప్రతిరోజూ ఫోనుచేసి, నా మంచి, చెడ్డలన్నీ తెలుసుకున్న మంచి మనిషి ఆయన. యాత్రికులందరికీ ఇలాంటి సహృదయులు మిత్రులుగా దొరకాలని కోరుకున్నాను. ఆయన“అల్లాహో అక్బర్  (God is real )అంటూ కళ్ళు మూసుకొని మూడుసార్లు పలికే లోపుగానే నేను “నాజర్‌ అక్బారీ అక్బర్‌ హో” అనుకొంటూ అతని పాదాలకి నమస్కరించాను.

    *    *   *

Dr. Adinarayana Machavarapu

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు.  ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *