హుయాన్‌ త్సాoగ్ అడుగుజాడల్లో

Spread the love

తూర్పు చైనాలోని షాంటుంగ్‌ నగరంలో ఫోటోగ్రాఫర్‌గా జీవితాన్ని గడుపుతున్న నా ఫేస్‌బుక్‌ స్నేహితుడు జియావెన్‌ గత పది నెలలుగా నన్ను వాళ్ళ ఊరికి రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. తీరా నేను బయలుదేరబోయే సమయానికి అతనికి అమెరికన్‌ ఎంబసీలో ఉద్యోగం రావటంతో “డియర్‌ ఆది, మిమ్మల్ని ఆహ్వానించటానికి నాకు కొంత సమయం కావాలి, గుడ్‌లక్‌” అంటూ ఉత్తరం వచ్చింది.

వాళ్ళ దేశం చూద్దామని చైనా గోడంత ఆశతో ఉన్న నాకు ఆ ఉత్తరం నిరాశ కలిగించినా, మరొక నెలరోజుల పాటు కష్టపడి ఫేస్‌బుక్‌లో ఉన్న ఒక ఇంగ్లీషు టీచర్‌ ద్వారా సియాన్‌ నగరానికి రెండు వందల కి.మీ. దూరంలో ఉన్న ‘యాపిల్‌ కోపరేటివ్‌ సొసైటీ’అడ్రసు సంపాదించి “నాకు చైనా గ్రామసీమలు చూడాలని ఉంది. అందుకు మీ సహకారం కావాలి” అని రాసి నా పూర్తి బయోడేటా వారికి పంపాను. పదిరోజుల్లోనే నాకు తిరుగు సమాధానం వచ్చింది. “గ్రామీణ వాతావరణాన్ని  ప్రేమించే మీ లాంటి కళాకారులకి మా పరిసరాలు తప్పనిసరిగా నచ్చుతాయి. నెల రోజులపాటు మిమ్మల్ని అతిథిగా ఉంచుకోవటానికి మా సభ్యులంతా ఇష్ట పడ్డారు” అంటూ ఆ సంస్థ డైరెక్టర్‌ ట్రెజోరో నాకు అభయహస్తం ఇచ్చాడు.    

  ట్రెజోరో ఉండేది పింగ్‌లియాంగ్‌ అనే చిన్న టౌనులో. గూగుల్‌ మ్యాప్‌లో చూశాను. చాలా అందంగా ఉంది. కొండల మీద యాపిల్‌ తోటలు,ఊరు చుట్టుతా  బౌద్ధ మందిరాలు. ప్రయాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టుకొన్నాను. అయితే అతని వద్ద నుండి ఒక వారం తరువాత వచ్చిన ఉత్తరంలో “తొంభై సంవత్సరాలు జీవించిన మా అమ్మగారు స్వర్గస్తులైన కారణంగా ఆమె పెద్దకర్మ పూర్తయ్యే వరకూ నాకు పనివొత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాకు దగ్గరలో ఉన్న తియోఫోసి మోనాష్టరీలో ఉండండి. మిమ్మల్ని అక్కడ కలుసుకొంటాను” అంటూ రాసి దాని  అడ్రస్‌, మిగతా వివరాలు అన్నీ స్పష్టంగా ఇచ్చాడు.

     “సరే, అంతా మన మంచికే” అనుకున్నాను. పింగ్‌లియాంగ్‌ నుండి తియోఫోసి నూట ఇరవై కి.మీ. దూరంలో ఉంటుంది. అంటే సియాన్‌ నుండి పింగ్‌ లియాన్‌కి నేరుగా వెళ్ళే దారి మధ్యలోనే తియోఫోసి ఉందన్న మాట. ఆ బౌద్దాలయంలో ఉండే మాంక్‌ పేరు మియావో. చాలా కాలంగా అతడు బౌద్ధమత ప్రచారకుడుగా సేవలు అందిస్తున్నాడు. ఇలా నేను అతని వద్దకి వస్తున్నట్టుగా ఉత్తరం రాసి స్థానికంగా ఉన్న చిత్రకారులకి నా ప్రయాణం గురించి తెలియజేయ వలసిందని కోరాను.

    ఈ సంవత్సరం మార్చి నెల, రెండవ తేదీ సాయంత్రం నేను చైనాలోని సియాన్‌ ఎయిర్‌ పోర్టులో దిగిన వెంటనే మియావో పంపిన ఇద్దరు మిత్రులు వచ్చి నన్ను కలుసుకొన్నారు. కబుర్లు చెప్పుకొంటూ నగరంలోనికి బయలుదేరాం.

     దారి పొడవునా కన్పిస్తున్న ఆకాశ హర్మ్యాలు, చైనా అభివృద్ధిని కొలవటానికి నిలబెట్టిన స్కేలు మాదిరిగా ఉన్నాయి. నగరంలోకి చేరే సరికి రోడ్డుకి రెండు వైపులా ఉన్న చెట్లకి, స్థంభాలకి అమర్చిన వందల కొలదీ గుండ్రని చైనా దీపాలు, ఎర్రమందార పూలగుత్తుల మాదిరిగా ఊగిపోతున్నాయి. “ఇవన్నీ మా కొత్త సంవత్సర పండుగ సందర్భంగా చేసిన అలంకరణలో భాగాలు” అని చైనా మిత్రులు చెబుతున్నారు.

     సియాన్‌ నగరంలో ఒక బహుళ అంతస్థుల భవనం ముందు ఆగిన కారు వద్దకి ఒక పెద్దాయన వచ్చి “నా పేరు కియాలిస్కో,మియావో స్నేహితుణ్ణి” అంటూ పరిచయం చేసుకొన్నాడు. నాకు వీసా లెటరు పంపింది ఈయనేననీ, ట్రెజోరో కూడా ఈయన మిత్రుడేనని తెలుసుకొన్నాను. ప్రస్తుతానికి కియాలిస్మో ఒక  Exports &Imports కంపెనీ నడిపిస్తున్నాడు.

                        ఆఫీసు లోపలి గదుల్లో నన్ను కలుసుకోవటానికి కొత్తమిత్రులు ఎదురు చూస్తున్నారు. వారిలో ఒకతను చిత్రకారుడు. బొమ్మలు ముద్రించి ఉన్న తన కేటలాగుని నాకు చూపిస్తూ “బుద్ధుడు జన్మించిన దేశం నుండి వస్తున్నందుకు మీకు సుస్వాగతం” అంటూ ఎంతో ప్రేమగా టీ కప్పు, సిగరెట్‌ పెట్టె అందించాడు. అందరితోనూ పరిచయాలయ్యాయి. చలి ముదిరి పోయేకొద్దీ టేబుల్‌ మీద టీ కప్పులు పేరుకు పోతున్నాయి.

     “మీరు ఇండియా వచ్చినపుడు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి” అని చెప్పి అందరికీ నా విజిటింగ్‌ కార్డులు ఇచ్చాను.

     “అయ్యా! మాకు ఇండియా వెళ్ళటానికి వీసాలు దొరకటం చాలా కష్టంతో కూడుకున్న పని”,  “ఎందుకని?”

   “మీ డెమోక్రసీ భావాలు, స్వేచ్చా మమ్మల్ని ప్రభావితం చేస్తాయనీ, పనిచేయటం మానేసి, స్వాతంత్ర్యం కావాలి” అంటూ గొడవలు చేస్తామనీ మా ప్రభుత్వానికి భయం”.

     “మీ వాళ్ళ భయానికి సరైన కారణాలే ఉన్నాయి మరి. మాకు ఉన్న స్వాతంత్ర్యాన్ని మేము సద్వినియోగ పరచుకోలేదు అనేది మాత్రం నిజం. మీకు క్రమశిక్షణ ఉంది కాబట్టే అమెరికాతో సమానంగా నిలబడగలిగారు” అని చెప్పాను.

          ఇంతలో కియాలిస్మో అందుకొని “రేపు ఉదయం మీతోపాటుగా తియోఫోసి మోనాష్టరీ వరకూ రావటానికి లియాంద్రో అనే ఒక బ్రెజిల్‌ కుర్రాడు సిద్ధంగా ఉన్నాడు” అని చెప్పగానే సంతోషించాను.

    కనీసం రెండు రోజులైనా సియాన్‌ నగరంలో ఉందామనుకొన్నాను. ఇక్కడ నేను చూద్దామనుకొన్న ముఖ్యమైన ప్రదేశాలు రెండు. మొదటిది దాయంతా పగోడా. రెండోది ‘రైతు చిత్రకారుల ఆర్ట్‌ గ్యాలరీ’.

    సియాన్‌ నగరానికి పాత పేరు ఛాంగ్‌ ఆన్‌. ఇది సరిగ్గా చైనాకి మధ్యలో ఉండటం వలన టాంగ్‌ వంశపురాజులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని క్రీ.శ. 618 సం॥ నుండి 907 సం॥ వరకూ పరిపాలించారు. ఇక్కడ ఉన్న మహాబోధి మోనాష్టరీ ను౦డి క్రీ||శ|| 627వ సంవత్సరంలో హుయాన్‌ త్సాంగ్‌ (క్రీ.శ. 600-664) చలికాలపు చీకటి రాత్రిలో రహస్యంగా బయలుదేరి భారతదేశానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే. నలందా విశ్వవిద్యాలయంలో ఐదు సంవత్సరాలు నివసించి శీలభద్ర అనే సంస్కృత గురువు వద్ద విద్య నేర్చుకొని, భారతదేశమంతా పద్నాలుగు సంవత్సరాలు ప్రయాణాలు చేసి, ఆరు వందల యాభై ఏడు బౌద్ధమత సూత్రాల్ని సంపాదించి, వాటిని తనతోపాటుగా ఈ సియాన్‌ నగరానికి తీసుకువచ్చాడు. అమూల్యమైన ఆ సూత్రాల్ని జాగ్రత్తగా కాపాడేందుకోసం టాంగ్‌ వంశపురాజు గావోజోంగ్‌, ఇక్కడ ఏడు అంతస్థుల పగోడా నిర్మించాడు. దాని పేరే ‘దాయంతా’ (The great wild goose). దాని ఎత్తు రెండు వందల పది అడుగులు. ఆకాశంలోనికి చొచ్చుకు పోతున్నట్లుగా ఉండే ఈ మహా పగోడా ఒక అద్భుతమైన వాస్తు కళాఖండం. హుయాన్‌త్సాంగ్‌ సమాధి కూడా దగ్గరలోని సింగ్‌జియావో ఆలయ ప్రాంగణంలో ఉంది.

   సియాన్‌లో నాకిష్టమైన రెండో ప్రదేశం ఇక్కడికి ఇరవై రెండు కి.మీ. దూరంలో ఉన్న హూసియాన్‌ అనే చిన్న టౌను. అక్కడ సామాన్య రైతులు పెయింటింగ్‌ వేస్తూ జీవిస్తున్నారు. సాంఘిక సమానత్వం కోసం చైనాలో సాంస్కృతిక విప్లవం (1966-76) కొనసాగుతున్న రోజుల్లో ‘గ్రామీణ కళల వికాసమే దేశాభివృద్ధికి మూలం’ అనే ఉద్దేశంతో “రైతులు, సిపాయిలు కూడా కళాసాధన చెయ్యాలి” అని పిలుపునిచ్చిన మావో జెడాంగ్‌ మాటల ప్రభావంతో చైనాలోని, ఈ షాంజి ప్రావిన్స్‌లో వందల సంఖ్యలో రైతు చిత్రకారులు పుట్టుకొచ్చారు.

     చిత్రకళని ప్రత్యేకంగా ఎక్కడా నేర్చుకోకుండానే బొమ్మలు వేయగలిగిన వీరి చిత్రాలకు మంచిధరలు కూడా పలకటంతో వారి చిత్రాలు ప్రపంచ కళాభిమానుల్ని ఆకర్షించాయి. “ఆధునిక జానపద కళ” అనే పేరుతో కొనసాగుతున్న ఈ చిత్ర కళా ఉద్యమంలో ‘జాంగ్‌ కింగ్‌ ఈ’, ‘ఫెంగ్‌ ఇ-దోంగ్‌’ అనే రైతు చిత్రకారులు (Farmer Painters) వేస్తున్న చిత్రాలకు చాలా గుర్తింపు వచ్చింది.

     ఈ రెండు ప్రదేశాలను చూడాలంటే ప్రస్తుతానికి వీలుకాదని తెలిసింది. కాబట్టి, ముందుగా తియోఫోసిలో అడుగుపెడితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించుకోవచ్చు అనుకొన్నాను.

     చైనావారి డిన్నర్‌ సాయంత్రం ఆరుగంటలకే మొదలవుతుంది. వానపాముల్లా జారిపోతున్న ఆ నూడిల్స్‌ని ఛాప్‌స్టిక్స్‌తో పట్టుకోవటం కాస్త ఇబ్బంది అనిపించినా ఏదోలా ఆకలి తీర్చుకున్నాను. మిత్రుల వద్ద శెలవు తీసుకున్నాక,నేనూ కియోలిస్మో కబుర్లు చెప్పుకుంటూ బజారుకి చేరుకున్నాం. అన్నీ ఆకాశాన్నంటే భవనాలు, ఎంతో పరిశుభ్రంగా ఉన్న రోడ్లు,ఒక పద్ధతిలో సాగిపోతున్న ప్రజానీకం.

   కియాలిస్మో నాకంటే నాలుగేళ్ళు పెద్దవాడు. ప్రతి ఎస్పరాంతో వాక్యాన్ని చెక్కినట్లుగా పలుకుతున్నారు.

   “సార్! చైనా ఇంత అభివృద్ధిలోకి రావటానికి ముఖ్యమైన కారణం తెలుసుకోవాలని ఉంది”అని నేను అడిగాను.

  “ఛైర్మన్ మావో (1893-1976)సిద్ధాంతాల్ని సక్రమంగా అర్థం చేసుకునే ప్రజలు ఉండటమే ముఖ్యమైన విషయం”అని వివరిస్తూ, 1921వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించటం,రెడ్ ఆర్మీని తయారు చేసుకోవటం,నేషనలిస్టు పార్టీ దాడుల్ని తప్పించుకోవటానికి ఆయన సాగించిన ‘లాంగ్ మార్చ్’ (1934-43)విజయవంతం కావటం, ఆ తర్వాత తలపెట్టిన సాంస్కృతిక విప్లవం ద్వారా ప్రజల్లో సాంఘిక చైతన్యం కలిగించి,వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయటం లాంటి పనుల ద్వారా ప్రజలు సాధించిన మార్పుని వివరిస్తూ ఎన్నో విషయాలు చెప్పుకుపోయాడు.

   భారతదేశంలో 1925 వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు కదా! మనమెందుకు అభివృద్ధిలోకి రాలేకపోయాము! అనే ఆలోచన వచ్చింది నాకు. చిన్నతనంలో మా ఊర్లోని కమ్యూనిష్టు పార్టీ వారికి నేను బ్యానర్లు రాయటం,జెండాలు కుట్టి పెట్టటం లాంటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. జూలియస్ ప్యూజిక్ (1903-1943) అనే ఛెకోస్లేవియా కమ్యూనిష్టు రాసిన ‘Notes From The Gallows’ని ఆ రోజుల్లో చదివాను.

   ఒక రోడ్డు మలుపులో ఇంపైన టర్కీ సంగీతం వినిపించింది. ఆ దారిలో కొంచెం ముందుకి వెళ్ళగానే రోడ్డు మీద దాదాపు యాభై మంది స్త్రీలూ,పురుషులూ నాట్యం చేస్తున్న దృశ్యం కనిపించింది. ‘ఏదైనా ఉత్సవం జరుగుతుందేమో!’అనుకున్నాను.

              “ఇది మా దేశపు సాంప్రదాయ నృత్యం. ఇలాగా ప్రతి ఉదయం,సాయంత్రం కూడా బహిరంగంగానే నృత్యాలు జరుగుతూ ఉంటాయి”అని కియాలిస్మో చెప్పాడు. ఇలాగా రోడ్డు మీద డాన్స్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. కొందరు చిన్న గొడుగుల్ని పట్టుకొని, మరికొందరేమో రంగుల విననకర్రల్న ఊపుతూ ఒక పద్ధతిలో సంగీతానికి అనుగుణంగా చేస్తున్న నాట్యం ఇది. వివిధ భంగిమల్లో శరీరాన్ని తిప్పుతున్న వారి ముఖంలో సంతోషం తప్ప వేరే  భావం కనిపించటం లేదు. సంగీతం అంతా ఒకే తాళం మీద సాగిపోతూ ఉండటమే దానికి కారణం. ఈ నాట్యంలో ఒక క్రమశిక్షణ కనిపించింది నాకు.

            “ఈ నాట్యానికి ఏదైనా పేరుందా?”

            “ఎందుకు లేదు? దీన్ని ‘యాంగ్‌గే’ అంటారు. 1940వ సంవత్సరంలో కమ్యూనిష్టు ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళే పనిలో భాగంగా మావో కూడా ఈ సామూహిక యాంగ్‌గే నృత్యాన్ని ఉపయోగించాడు” అంటూ చైనా గ్రామీణ సంస్కృతిని గురించి వివరించాడు.

            మరికొంచెం ముందుకి సాగిపోయాక తనే అగస్మాత్తుగా “ఇండియాలో ఉంటున్న దలైలామా నిజానికి చైనా వాడే. టిబెట్‌ పౌరుడు కాదు, మీకు తెలుసా?” అని అడిగాడు.

            “అతడు టిబెట్‌ పౌరుడే అనుకొంటున్నాను!”

            “కాదు. దలైలామా అయ్యాక, వారి భాష నేర్చుకొని టిబెట్‌ని ప్రత్యేక దేశంగా మార్చి దానికి తనే ప్రెసిడెంట్‌ కావాలని ప్రయత్నం చేశాడు. “చైనా కమ్యూనిష్టు పార్టీకి శత్రువుగా మారి, 1959వ సంవత్సరంలో మీ దేశానికి పారిపోయాడు”.

            “చైనాలో చాలామంది విదేశీయులు సెటిలై పోయారని వింటున్నాం. నిజమేనా?”

            “చాలాకాలం క్రితమే కొరియా, మంచూరియా ప్రాంతాల వారే కాకుండా, ఇరాన్‌, టర్కీ, మంగోలియా వారు కూడా వచ్చి ఈ విశాలమైన చైనాలో స్థిరపడిపోయారు. ఇప్పటికీ ఎవరి సాంత భాష వారికి ఉంది. అందుకే చైనీస్‌ మందారిన్‌ని అధికార భాషగా గుర్తించారు”.

            “అలాగైతే చైనాలో ఉండే వారందరూ చైనా జాతివారు కాదన్నమాట!” నేను అడిగాను.

            “చైనాని పరిపాలించిన హాన్‌ (క్రీ.పూ. 206-క్రీ.శ. 220) జాతివారే నిజమైన చైనావారు. అయితే సాంస్కృతిక విప్లవం జరుగుతున్న రోజుల్లో, తమ ప్రాణరక్షణ కోసం ప్రతివారు ‘మేము హాన్‌జాతి వాళ్ళం’ అని చెప్పుకొనేవారు”.

            మాటల్లోనే ఒక పెద్ద ఎపార్టుమెంటుకి చేరుకొన్నాం.

            “రేపు తియోఫోసికి వెళ్ళాక నీవు వచ్చినట్టుగా పోలీస్‌ స్టేషన్లో రిపోర్టు ఇవ్వటం మరవొద్దు” అని చెప్పి నన్ను తన మిత్రుడైన యాంద్రియా ఫ్లాట్‌లో వదిలి పెట్టి వెళ్ళిపోయాడు కియాలిస్కో.

            అది నలభై రెండవ అంతస్తు. ఇంత ఎత్తైన భవనాల్లో ఉండటం నాకిదే మొదటిసారి. చుక్కల పక్కన నిలబడినట్లుగా ఉంది. కిచెన్‌లో ఉన్న యాంద్రియా ‘నీహావ్‌’ (How do you do) అంటూ పలకరించాడు.

            “చైనాలో తిరగటానికి ఇంగ్లీషు భాష సరిపోతుంది కదా!” అని అడిగాను.

            “నేను అర్జెంటైనా నుండి ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలైంది. కియాలిస్మో ఆఫీసులో పనిచేస్తున్నాను. చైనీస్‌ నేర్చుకొనే అవసరమే నాకు రాలేదు.గత పది సంవత్సరాల నుండీ చైనాలో ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లీషు నేర్పిస్తున్నారు. అయితే వారు చాలా తక్కువగా ఇంగ్లీషు మాట్లాడుతారు. విదేశీ నాగరికతకి అలవాటుపడితే సొంత సంస్కృతి నాశనమైపోతుందనే భయం వారికి ఎక్కువ” అని యాంద్రియా తన అనుభవాలు చెప్పుకొచ్చాడు.

“మరి వారికి ఇప్పుడు ఇంగ్లీషు అవసరం ఎందుకొచ్చింది?”

“అంతర్జాతీయ వ్యాపార రంగంలో అడుగు పెట్టే అవసరం ఉంది కాబట్టి. చైనా సోషలిస్టు దేశం అనేది పాత మాట. ఇప్పుడు చైనా కంటే పెద్ద కాపిటలిష్టు దేశం ఎక్కడా కానరాదు” అని చెబుతూ, నాకు ఒక “ఇంగ్లీషు – చైనీస్‌ ఫ్రేజ్‌ బుక్‌ ఇచ్చి ‘గుడ్‌నైట్ ‘ చెప్పాడు యాంద్రియా.

            తెల్లారగానే తియోఫోసికి బయలు దేరాం. నన్ను ఎయిర్‌ పోర్టు నుండి తీసుకువచ్చిన లిలియా, జియాంగ్‌లతో పాటుగా కియాలిస్మో చెప్పిన బ్రెజిల్  కుర్రాడు వచ్చి కారులో కూర్చున్నాడు.

            “నా పేరు లియాంద్రో” అని పరిచయం చేసుకొని జియాంగ్‌తో చైనీస్‌లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు.

            “నువ్వు చైనాలో చాలాకాలం నుండి ఉంటున్నావా మిస్టర్‌ లియాంద్రో?”

“లేదు, నేను వచ్చి రెండు వారాలే అయింది!”

            “మరి చైనీస్‌ ఎక్కడ నేర్చుకొన్నావు?”

            “బ్రెజిల్‌ లోనే! అక్కడ చైనా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సొంత ఊరు ‘ఫోర్తలేజా’లోనే వారి జనాభా పదివేల వరకూ ఉంది!”

            “అయితే మరి ఇక్కడకి ఎందుకొచ్చావో తెలుసుకోవచ్చా?”

            “చైనీస్‌ లాంగ్వేజ్‌ డిప్లమా” చేయటానికి సియాన్‌ యూనివర్శిటీకి వచ్చాను. అని చెప్పాడు ఈ ముఫ్పై రెండు సంవత్సరాల యువకుడు.

            “ఈ మధ్యకాలంలో అమెరికన్లు కూడా ఎక్కువగా చైనీస్‌ భాష నేర్చుకొంటున్నారని విన్నాను! నిజమేనా లియాంద్రో?”.

            “నిజమే, అమెరికా భవిష్యత్‌ చైనీస్‌ భాషలో రాసి ఉందని ప్రపంచవ్యాప్తంగా అనుకొంటున్నారుగా మరి!”

            దారిలో కనిపించే ప్రతి భవనం పక్కనా ఒక ఎత్తెన క్రేన్‌, విజయధ్వజం మాదిరిగా తిరుగుతూనే ఉంది. గంటన్నర ప్రయాణం తర్వాత దూరంగా లియాంగ్‌షాన్‌ కొండ కనిపించింది. వాటి మీద పురాతన కట్టడాలు ఉన్నట్లు తెలుస్తూనే ఉంది.“ఆ కొండని పరిశీలించి చూడండి సార్‌! వెల్లికిలా పడుకొని ఉన్న ఒక స్త్రీ మాదిరిగా ఉంది కదూ!” అంటూ వర్ణిస్తున్నాడు, కారు నడుపుతున్న జియాంగ్‌. కొండవాలుల్లో మెట్ల పద్ధతి వ్యవసాయం సాగిపోతూ ఉంది. కొన్ని పెద్ద మట్టి దిబ్బల్ని , దిగుడుగా ఉన్న పెద్ద రోడ్డుని దాటాక తియోఫోసి గ్రామం వచ్చింది. ఎర్రరంగు గోడలతోనూ, ఎత్తైన బురుజులతోనూ ఉన్న మోనాష్టరీ వద్దకి వెళ్ళగానే ‘అమితాబో’ అనుకొంటూ కాషాయ రంగు దుస్తుల్లో వచ్చిన మాంక్‌ మియావోని అందరం విష్‌ చేశాం.

            ఆయన నాకంటే చిన్నవాడే. పచ్చని ఛాయతో సన్నగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. తియోఫోసి మందిరం చాలా విశాలంగా ఉంది. కాస్త ఎత్తైన ప్రదేశంలో వున్న సుందరమైన భవన సముదాయం. బురుజులకి వేళాడుతున్న చిన్న గంటలకి, గాలి గిలిగింతలు పెట్టగానే, అవి నాట్యాన్ని అందుకొన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద తోటలో ఎత్తెన వెదురు పొదలు కూడా ఉన్నాయి. సియాన్‌ నుండి ఇక్కడికి వెంటనే రావటం మంచిదే అనిపించింది.

            మియావో అందర్నీ నేరుగా డైనింగ్‌ హాల్లోకి నడిపించాడు. నాకైతే నిజానికి చాలా ఆకలిగా ఉంది. నూడిల్స్‌తో పుట్టగొడుగుల పులుసు, కలువ పువ్వు కాండంతో చేసిన పచ్చడి కలుపుకొని తింటుంటే ఎంతో రుచిగా ఉంది.

            నాతో వచ్చిన ముగ్గురు మిత్రులూ రాత్రికి మళ్ళీ సియాన్‌ వెళ్ళిపోవాలి కాబట్టి “గ్రామం అంతా తిరిగి చూద్దురు గాని రండి” అంటూ మమ్మల్ని ఊర్లోకి నడిపించాడు మియావో.

            గ్రామంలో రెండువేల జనాభా ఉంటారు. ఊరి మధ్యగా సాగిపోయిన బాట చాలా విశాలంగా ఉంది. “ఆనాడు సియాన్‌లో మొదలై ఐరోపా వరకూ సాగిపోయిన ‘సిల్కు రూట్‌’ ఇదే. పైగా సియాన్‌ దాటాక ఈ దారిలో వచ్చే పెద్ద బౌద్ధాలయం తియోఫోసి” అని గర్వంగా చెబుతున్నాడు మియావో.

            ఎత్తైన మట్టి దిబ్బల పక్కగా మలుపులు తిరిగింది మా బాట. కొండమీద ఉన్న కొత్త మోనాష్టరీని చూపించాడు. అదేదారిలో కిందికి వస్తుంటే ఆ సమతలమైన మట్టి కొండల లోపలివైవుకి తవ్విన గుహలు కనిపించాయి. వాటిల్లో ప్రజలు నివాసం ఉంటున్నారు. అర్ధచంద్రాకారంలో తవ్విన ఆ గుహల్ని చూడగానే ముంబై దగ్గర కొండల్లో చెక్కిన కార్లే, కన్హేరి లాంటి బౌద్ధ మందిరాలు గుర్తుకి వచ్చాయి. నాకూ,లియాంద్రోకి ఇవి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేశాయి.

            మట్టి కొండల ముఖాన్ని తొలుచుకుంటూ నిర్మించిన ఆ గుహా నివాసాలు ఆ ప్రాంతమంతా ఉన్నాయి. పైగా సమతలంగా ఉన్న ఆ గుహానివాసాలపై వ్యవసాయం కూడా జరుగుతూ ఉంది. ఆ గువాల్ని అర్ధచంద్రాకారంలో తొలుచుకుంటూ పోవటం వలన, మీద బరువంతా పక్కలకి వెళ్ళిపోయి కూలిపోకుండా ఉంటాయి.

            “ఇలాంటి మట్టి గుహల్ని ‘యవతోంగ్‌’ అని పిలుస్తున్నారు. వీటిల్లో నివసించేవారికి చలికాలం వెచ్చగానూ, ఎండాకాలం చల్లగానూ ఉంటుంది” అని వివరించాడు మియావో.

            “చైనా అంతటా ఇలాంటి యవతోంగ్‌లు ఉన్నాయా?”

            ఉత్తర చైనా పీఠభూముల్లో ఉన్న ఇలాంటి మట్టి కొండల ప్రాంతంలోనే గుహల్ని తొలచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ షాంజి ప్రాంతంలో నాలుగు కోట్లమంది ప్రజలు ఈనాటికీ గుహల్లోనే నివసిస్తున్నారు” అని జియాంగ్‌ వివరాలు ఇస్తున్నాడు.

            రెండవ ప్రవంచయుద్ధంలో జపాన్‌వాళ్ళు చైనా మీద బాంబులు వేసినప్పుడు ఈ పరిసరాల్లోని స్థానికులు ఇలాంటి యవతోంగ్‌ల్లోనే తలదాచుకొన్నారనీ, ఇంకా చెప్పాలంటే ‘లాంగ్‌ మార్చ్‌’ ప్రయాణ మార్గంలో రెడ్‌ ఆర్మీ దళాలు జియాన్‌జి నుండి యానాన్‌ చేరినప్పుడు ఇలాంటి యవతోంగ్‌ ఇళ్ళే వారికి సహాయపడ్డాయని తెలిసింది.

            పన్నెండు అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల పొడవు గల ఈ గుహలు ఎంతో అందంగా ఉంటాయి. నాలుగిళ్ళ చావిడి మాదిరిగా ఉన్న గుహలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికి తలుపు, కిటికీ, వెంటిలేటర్‌ అమర్చారు.ప్రాచీనకాలంలో కొండల్లో చెక్కిన బౌద్ధుల ఆరామాల నమూనా, ఇలాంటి గుహల్ని తొలచటానికి మూలం అయి ఉంటుంది. వర్షం తక్కువగానూ, చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి గుహల్ని తవ్వుకోవటం తప్పనిసరి అయింది. ఇంటిపైన వ్యవసాయం చేసుకొంటూ, కింది భాగంలో హాయిగా నివసించవచ్చు.

            మేమంతా చిత్రంగా ఆగుహల్ని పరిశీలిస్తూ ఉండగా ఒక ముసలమ్మ మాకు బేరీ ఫలాలు తెచ్చింది. యవతోంగ్‌ల ముందు ఖాళీగా ఉన్న స్ధలంలో కొత్తగా ఇటుకలతో ఇళ్ళు నిర్మించుకొంటున్న వాళ్ళూ ఉన్నారు. గవర్నమెంటు లోన్‌ ఇచ్చి భవనాలు కట్టుకొమ్మని స్థానికులకి చెబుతున్నా ‘తాతలనాటి ఈ గుహల్ని వదలి రాలేము’ అంటున్నారు ముసలివాళ్ళు.

            “త్వరగా మోనాష్టరీకి వెళదాం వదండి” అని మియావో తొందర పెడుతున్నా సరే, అందరికీ ఆ గుహలవద్దే మరి కాసేపు తిరగాలనిపించింది. చాలా ఫోటోలు తీసుకొన్నాం. రైతులు ఇళ్ళకి తిరిగి వచ్చే సమయానికి మేం బయలుదేరాం. నా మనసంతా ఆ గుహల లోపలే ఉంది. భోజనాలు చేశాక సియాన్‌ మిత్రులు శెలవు తీసుకున్నారు.

            మర్నాటి వేకువ జామున నాలుగు గంటలకల్లా నిద్రలేపాడు మియావో. “త్వరగా భోజనానికి బయలుదేరండి. ప్రతిరోజూ ఇదే సమయానికి లేవాలి” అని చెప్పగానే పరుగులు తీశాను. మందిరంలో పది అడుగుల ఎత్తులో ఉన్న అవలోకితేశ్వర విగ్రహం ముందు బౌద్ధ సన్యాసులు అందరూ నిలబడి ‘నమో అమితాబో’ అంటూ మంద్రస్థాయిలో ప్రార్ధనాగీతాలు ఆలాపిస్తున్నారు.

            ఆకలి వేయకపోయినా వేడివేడి నూడిల్‌ సూపు కడుపు నిండా తాగాను. గదికి వెళ్ళి కాసేపు పడుకొందాం అనిపించింది. కానీ ప్రాంగణంలో ఉన్న తోటలోని పిట్టలు పాటలు అందుకొన్నాయి. ఎదురుగా ఆకాశంలో నగానికి చిక్కిపోయిన చందమామ, నక్షత్రాల నది మీద పడవలాగా మెల్లగా కదలిపోతున్నాడు. అలాంటి మనోహర దృశ్య కావ్యాన్ని ఆస్వాదించటానికి, వొంగిన ఒక వెదురు కొమ్మ కింద కాసేపు మౌనంగా నిలబడ్డాను; చలిగాలికి వొణికిపోతూనే.

            నిన్న చూసిన యవతోంగ్‌ గుహల దగ్గరికి బయలుదేరాను తెల్లారగానే. ఇంతలో మియావో ఎదురై “మనం ఇప్పుడు కిన్‌లింగ్‌ టౌనుకి వెళుతున్నాం రండి” అంటూ టాక్సీ ఎక్కించాడు.

            ఈ దారిలో కూడా చాలా గుహల్ని చూశాను. సిల్కు దారిలో ప్రయాణించిన ఆనాటి యాత్రికులు కూడా ఇలాంటి గుహల్లోనే ఉండేవారట. రాత్రిపూట వాళ్ళ సామానులు, జంతువులు ఈ గుహల్లో ఉండేవి. నీడనిచ్చే చెట్లు పెద్దగా పెరగని ఈ ప్రాంతాల్లో, ఇలాంటి గుహల అవసరం ఎంతో ఉందని తెలుసుకొన్నాను.

            దారిలో ఒక చిన్న బౌద్ధ ఆలయం వద్దకి వెళ్ళాం. అక్కడ ఉన్న మాంక్‌ మేం తినటానికి సన్‌ఫ్లవర్‌ విత్తనాలూ, పుచ్చ విత్తనాలు ఇచ్చి మర్యాద చేశాడు.

            కిన్‌లింగ్‌ టౌన్‌లోకి వెళ్ళగానే ఒకప్పుడు ఆ ఊరు చుట్టూతా నిర్మించిన పెద్ద మట్టిగోడ కనిపించింది. పెకింగ్‌ పక్కన The Great Wall ఉన్నట్లుగా, ఆ రోజుల్లో ప్రతి పెద్ద పట్టణం చుట్టూతా రక్షణకోసం ఎత్తైన గోడలు నిర్మించుకొనేవారు. ఆ పాత గోడ చాలా విశాలంగా ఉండటంతో దాని వీపు  మీదకి ఎక్కికాసేపు నడిచాం. అనాటి బురుజులు ఇంకా ధృడంగానే ఉన్నాయి. ప్రజలు అలాంటి ఒక బురుజుని కొత్తగా నిర్మించి, దాని గోడల మీద గ్రామ చరిత్ర అంతా రాశారు.

            కొరియర్‌ ఆఫీసులో మియావోకి వచ్చిన పుస్తకాలు తీసుకొన్నాక, నన్ను పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్ళి మోనాష్టరీలో ఉంటున్నట్టుగా తెలియజేశాడు.

            తిరుగు మార్గంలో ‘రాణిగారి సమాధి’ ఉన్న కొండపక్కనే ప్రయాణించాం.పొలాలు అన్నీ యాపిల్‌ తోటలతోనే నిండిపోయాయి. అక్టోబరు నెలలో యాపిల్‌ పంట పూర్తయ్యాక, శిశిర బుతువు దాడిచేసి చెట్ల ఆకుల్ని పూర్తిగా రాల్చి నగ్నంగా నిలబెట్టింది. చెట్టు అన్నీ నల్లగా మాడిపోయినట్లుగా కన్పిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ఎముకలు బయటపడి, పొట్టలోతుకు పీక్కుపోయి, నరాలన్నీ కనిపిస్తున్నట్లుగా చెక్కిన ‘తపస్సు చేస్తున్న గాంధార బుద్ధ’ శిల్పం  గుర్తుకు వచ్చింది. ఎండిన కొమ్మల్ని కత్తిరించటానికి, పురుగులు చేసిన గాయాలకి మందులు వేయటానికి రైతులు శ్రమిస్తున్నారు.

            గ్రామంలో ప్రతి ఇంటికప్పు మీద తెలుపురంగులో ఉన్న పావురాయి పక్షుల బొమ్మల్ని పెడుతున్నారు.

            “ఇది ఇక్కడి ఆచారమా?” అని అడిగాను.

            “పావురాళ్ళు శాంతికి చిహ్నం. చైనావారు శాంతి ప్రేమికులు” అని చెప్పి మరలా తానే “జపాన్‌ వాళ్ళు చైనా మీదకి దండయాత్ర చేసినప్పుడు మాత్రమే చైనా వారు ఆయుధాలు పట్టుకొన్నారు. అంతకు ముందు ఎప్పుడూ యుద్దాలు చేయలేదు” అన్నాడు.

            రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సైన్యాలకి వైద్య సేవలు అందించిన భారతీయుడు డాక్టర్‌ ద్వారకానాథ్‌ కొట్నీస్‌ (1910 – 1942) గురించి నేను చెప్పగానే “కొట్నీస్‌తో పాటుగా నార్మన్‌ బెతూన్‌ (1890 – 1939) అనే కెనడియన్‌ డాక్టరు కూడా మాకు చాలా ముఖ్యమే. బెతూన్‌ మాకు రెండవ చైనా జపాన్‌ యుద్ధంలో కమ్యూనిష్టు దళాలకి వైద్య సేవలు అందించాడు. వీరి పేరు మీద చైనాలో స్మారక భవనాలు కూడా ఉన్నాయి. చైనాకి సహాయం చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకొంటారు మా ప్రజలు” అని చెప్పసాగాడు మియావో.

            భోజనం అయ్యాక “ఊరి చివరలో ఉన్న లోయ చాలా అందంగా ఉంటుంది. రండి చూద్దాం” అంటూ ఒక పెద్ద కెమెరా తీసుకొని దారితీశాడు కళాప్రియుడైన మియావో.

            యాపిల్‌ పాలాల మధ్యగా ఉన్న దగ్గర దారిలో బయలు దేరాం. ఊపిరి బిగపట్టి భూగర్భంలోని అట్టడగు తేమ పొరల్ని అందుకోవటానికి ఒంటి కాలి మీద నిలబడి యజ్ఞం చేస్తున్నట్లుగా ఉన్నాయి యాపిల్‌ చెట్లు. నిజానికి ఈ ప్రాంతాల్లో ‘మంచువల్లనే పంటలు పండుతాయి, వర్షం వలన కాదు’ అని తెలిసింది. వసంతం క్రమంగా కమ్ముకొంటూ వస్తుందనటానికి సాక్ష్యంగా, చిన్న పొదల మీద బులుగు రంగు పువ్వులు మెరిసిపోతున్నాయి.

            అది చాలా విశాలమైన లోయ. దానిలోతు రెండువందల అడుగులు ఉంటుంది. అలా క్రమేణా కిందికి వెళ్ళిన లోయ ఒక పెద్ద మైదానాన్ని చేరుకొంటుంది. లోయ అడుగు భాగానికి వెళ్ళి కొన్ని మొక్కలని ఫోటోలు తీస్తూ,“ఔషధాలకి పనికి వచ్చే వివిధ రకాల మొక్కలు ఇక్కడ బాగా దొరుకుతాయి. ఈ కాలిబాటలన్నీ నాటు వైద్యులు ఏర్పాటు చేసినవే” అని చెబుతున్నాడు మియావో. లీబాయ్‌ మహాకవి (కీ.శ. 701- 762) సియాన్‌ ఆస్థానంలో ఉన్నప్పుడు తన గురువుని వెతుక్కొంటూ, ఇలాంటి నదీలోయల్లో తిరిగిన విషయం గుర్తుకొచ్చింది.

            లోయ నుండి తిరిగి వస్తుంటే ఒక రైతు చిన్నకావడిలో కుడితిని మోసుకెళుతూ కనిపించాడు. అది గేదెల కోసమే అనుకొన్నాను.

            “ఇది మా మేకల కోసం” అని చెప్పాడు ఆ రైతు.

            “మీ ఇంటికి మేమూ వస్తాం, పదండి!” అంటూ అతని భుజం మీద కావడిని నేను అందుకొన్నాను.

            “నేను మాంక్‌ని కాబట్టి సంసారుల ఇళ్ళలోనికి వెళ్ళకూడదు. నీవు విదేశీయుడివి కాబట్టి నీతో పాటుగా రావచ్చు” అని చెప్పి నా వెనకే నడిచాడు మియావో.

            మోనాష్టరీకి వెనుక ఉన్న రోడ్డులోనే ఆ రైతు ఇల్లు. అది కూడా మట్టి గుహ ఇల్లే. నా సంతోషానికి అంతులేదు. ముందున్న ఖాళీ స్థలం చుట్టూరా ఎత్తైన గోడ కట్టడం వలన మరీ అందంగా తయారైంది ఆ ప్రాంగణమంతా.

            గేటు తీసుకొని లోనికి వెళ్ళగానే కుక్కపిల్లలు మొరిగాయి. గెంతులేస్తున్న మేక పిల్లలు దూరంగా పరుగులు తీశాయి. ఆ రైతు భార్య, కోడలు మమ్మల్ని చూసి గుహ నుండి బయటికి వచ్చారు. రెండు బకెట్ల కుడితిని క్షణాల్లో ఖాళీ చేశాయి; ఆ రెండు పెద్ద మేకలు.

            “ఇవి రోజుకి రెండు లీటర్ల పాలు ఇస్తాయి తెలుసా?” అంటూ గర్వంగా చెప్పాడు రైతు.

            వాటి పొదుగుల్ని చూశాను, నేలని తాకుతున్నాయి. పరుగెత్తే ఆ పెద్ద మేకల పిల్లల్ని పట్టుకొని ముద్దాడకుండా ఉండలేక పోయాను.

            “ఇక్కడ పశువులు కనిపించటం లేదు. ఎందుకని?”

            “వ్యవసాయం పనులన్నీ యంత్రాలే చేస్తున్నాయి. పశువులని పెంచుకుందామంటే వాటికి పచ్చగడ్డి, మేత దొరకటం కష్టం. ఆ గడ్డి కోసం ఖర్చు పెట్టే డబ్బుతో యాపిల్‌ తోటలు పండించుకొంటే చాలా లాభం. అందువలన పాలకోసం మాత్రమే ఈ మేకల్ని పెంచుకొంటున్నాం” అని వివరణ ఇచ్చాడు రైతు.

            యవతోంగ్‌ లోపలకి వెళ్ళగానే మావో బొమ్మలున్న క్యాలండర్‌ కనిపించింది. ఆ మట్టి గోడలకు చిన్న గూడు లాంటివి చెక్కి వాటినే అల్మరాలుగా వాడుకొంటున్నారు. ఇటుకలతో కట్టిన వారి మంచం మీద నేను పడుకొని అటూ, ఇటూ దొర్లుతూ ఉంటే ఆ ముసలమ్మ చూసి తెగనవ్వుకొంది.

            మొదటి రోజు సాయంత్రం మేము చూసిన గుహల వద్దకి తర్వాత కూడా అప్పుడప్పుడూ వెళుతుండేవాడిని. అక్కడ కొత్తగా సిమెంట్‌ సాబ్‌ ఇళ్ళు కడుతున్నారు. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పదిమంది ఉండేవారు. అందువలన వారితో ఏదో ఒకటి మాట్లాడవచ్చు. మోనాష్టరీలో ప్రతి రోజూ మాకు రెండు మూడు యాపిల్‌ లేదా బత్తాయి పళ్ళు వగైరా ఇస్తుండేవారు. వాటిల్లో కొన్ని మిగుల్చుకొని ఈ యవతోంగ్‌ వద్ద ఉన్న చిన్న పిల్లలకి ఇస్తుండేవాడిని. వాళ్ళు నన్ను “హిందూ యేయే” (ఇండియా తాత) అని పిలిచేవారు.

            తియోఫోసి మోనాష్టరీ ఒక ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ ప్రస్తుతానికి పదిహేను – ఇరవై మందికంటే భిక్షువులు లేరు. ఈ ఆలయాన్ని మొదటగా సుయ్‌వంశపు రాజుల కాలం (క్రీ.శ. 581 – 619)లో నిర్మించారు. తరువాత వచ్చిన మింగ్‌ రాజుల కాలం నాటికి ఇక్కడ వెయ్యిమంది భిక్షువులు నివసించేవారు. చెక్కతో నిర్మించబడ్డ ఆలయం కాబట్టి ఒక అగ్ని ప్రమాదంలో ఆలయం అంతా కాలిపోతుంది.ఇనుములో పోతపోసిన ఏడు అడుగుల బుద్ధ విగ్రహం తప్ప అంతా అగ్నికి ఆహుతి అవటంతో, ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి, కాలిపోయిన ఆలయ పునాదుల మీదే మరో చిన్న ఆలయాన్ని నిర్మించి దానిలో ఈ ఇనుపబుద్ద విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించి దానికి ‘తియోఫోసి’ (ఇనుప బుద్ధాలయం) అని నామకరణం చేశారు. సిల్కు రూట్‌కి ఆనుకొనే ఉంది కాబట్టి ఈ ఆలయానికి యాత్రికుల రద్దీ ఎక్కువకాగా, దీని ప్రాముఖ్యత క్రమేణా పెరిగిపోయి చుట్టుతా చిన్న గ్రామం ఏర్పడుతుంది.1941 వ సంవత్సరంలో జువాంగ్‌జి అనే పెకింగ్‌ భిక్షువు చేసిన కృషి వలన ఇక్కడ కొత్త భవనాలు, శిల్పాలు అలంకరణలూ అన్నీ ఏర్పడ్డాయి.

            వెన్నెల రాత్రుళ్ళు నేను ఒక్కడినే ఆ ఎత్తైన రంగు రంగుల బౌద్ధ భవనాల మధ్యలో తిరుగుతూ ఉంటే, నేపాల్‌ బౌద్ధనాధ ఆలయంలో రాహుల్‌ సాంకృత్యాయన్‌ రహస్యంగా గడిపిన రోజులు గుర్తుకి వచ్చేవి.

            మియావో బ్రహ్మచారి, చాలా మంచివాడు. ఆయనకి జపనీస్‌, ఇంగ్లీషు, ఎస్పరాంతో భాషలు కూడా వచ్చు. ఈసారి నేను చైనా వెళితే ఇద్దరం కలిసి లాసా వెళదామని ప్రణాళిక వేసుకొన్నాం. ఈయన పక్కనుంటే నాకు ఏ నమస్యా ఉండదు అనిపించింది. మియావో ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలే అయిందట.

            గ్రామంలో వారానికి రెండుసార్లు సంత జరుగుతుంది. ఉదయాన్నే ఇద్దరం బయలు దేరాం. విశాలంగా ఉన్న ఆ సిల్కు రోడ్డులోనే వ్యాపారస్థులు అందరూ ఒక పద్ధతిగా సామానులు అమర్చుకొంటారు. ఎక్కువగా స్రీలే వ్యాపారం చేస్తుంటారు.ఆటో రిక్షా లాంటి వాహనం మీదే వారి సరుకులన్నీ అందంగా అమర్చుకొన్నారు. కేకలు వేయటం, గొడవ చెయ్యటం అలాంటివి ఏవీ ఉండవు, అన్ని పనులూ మౌనంగానే జరుగుతుంటాయి.

            యాపిల్‌ మొక్కలు అమ్ముతున్న రైతులు, భవనాల నీడలో గుంపులుగా చేరిపోయారు. డిజిటల్‌ తూకాలతో పాటుగా పాత కాలంనాటి ఒంటి తక్కట, ఇనుపగుండు కూడా అమల్లో ఉన్నాయి. బంగారు పంటి తొడుగులు ఇంకా వాడుతున్నారు. ఒక పంటి డాక్టరు ఏకంగా రోడ్డు మీదే ఆపరేషన్లు మొదలు పెట్టాడు. ఆయుర్వేద మందులమ్మే దుకాణాల్లో రద్దీ బాగానే ఉంది. పందిమాంసం అమ్ముతున్న ఒక వ్యాపారి చెరుకుగడ నములుతూ బేరగాళ్ళని పిలుస్తున్నాడు. వ్యవసాయ పరికరాలు, కూరగాయలు అమ్మే దుకాణాలే ఎక్కువ. సాంప్రదాయ దుస్తులు ధరించినవారు ఒక్కరూ కనిపించరు. అందరూ జీన్స్‌, కోట్లు వేసుకొన్నవారే. చలిని తట్టుకొంటూ పనిచేసుకుపోవాలంటే ఇవే సరైన దుస్తులు.

             పెద్ద ఎర్రటి యాపిల్‌ కాయలంత బుగ్గలతో చిన్నపిల్లలు ఎంతో ముద్దొస్తున్నారు. ఎవరినైనా ముద్దు చేద్దామని వారి దగ్గరగా జరిగే లోపుగానే నన్ను చూసి ఏడుపు లంకించుకొంటున్నారు.

            ఒక చిన్న అందమైన పాపని ఎత్తుకొని ఉన్న అమ్మాయి నా అవస్థ చూసి నవ్వింది. “నీహావ్‌’ అంటూ ముందుకెళ్ళి, ‘ఈ పాప మీ చెల్లెలా?” అని అడిగాను.

            “కాదు” అంది.

            “అయితే మీకు పెళ్ళి అయిందన్న మాట!”

            ఇంతలో మియావో అందుకొని “సార్‌, ఈమెకి పన్నెండు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడట” అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచాడు. సంతలో కూరగాయలు అమ్మటానికి వచ్చిన తన అమ్మగారికి తోడుగా వచ్చిందట ఈ ముప్పె ఐదు సంవత్సరాల పిల్ల.

            “పొట్టిగా, పసుపు రంగు ముఖంతో కన్పిస్తున్న చైనా వారి వయసుని అంచనా వేయటం చాలా కష్టమే” అన్నాను.

            “వయసునే కాదు, వారి శక్తిని అంచనా వేయటం కూడా కష్టమే” అని తేల్చివేశాడు మిత్రుడు.

            గ్రేట్‌వాల్‌ని చూడటం కంటే, దాన్ని నిర్మించిన గ్రేట్‌ పీపుల్‌ని చూడటం, వారితో కలిసి పోవటం చాలా ముఖ్యం అనిపించింది నాకు. తల చుట్టూ తెల్ల రిబ్బన్‌ కట్టుకొన్న కొందరిని చూశాను. దగ్గర బంధువులు మరణించినప్పుడు సానుభూతి కోసం అలా చేస్తారట.

            ‘పొగాకు చూర’ని అమ్ముతున్న దుకాణాలు కూడా ఉన్నాయి. చైనాలో పొగ తాగటం ఎక్కువ. దాంతో వారికి పంటి సమస్యలు కూడా ఎక్కువే. చైనా వారికి ఇది పెద్ద దురలవాటు, గతంలో ఈ అలవాటువలన చైనా ప్రజలు చాలా నష్టపోయారు!

            “17వ శతాబ్దంలో బ్రిటీషువారు చైనాతో వ్యాపారం మొదలు పెట్టాక, నల్లమందు (Opium)ని పొగాకుతో కలిపి ఉపయోగించటం ఎలాగో నేర్పారు. దాంతో చైనా మొత్తం నల్లమందుకి బానిసై పోయింది. ప్రభుత్వం నల్లమందు అమ్మకాల్ని, దిగుమతుల్ని నిషేధించేసరికి, బ్రిటీషువారు చైనాతో యుద్ధం చేశారు” అని చెప్పాడు మియావో.

            నిజమే క్రీ.శ. 1839 – 42 సంవత్సరంలో జరిగిన మొదటి నల్లమందు యుద్ధంలో  బ్రిటీషువారు చైనాని ఓడించి తమ వ్యాపారాన్ని మరింత సుస్థిరం చేసుకొన్నారు. రెండోసారి జరిగిన నల్లమందు యుద్ధం (కీ.శ. 1856 – 60) కూడా ఆంగ్లేయులకే లాభం చేకూర్చింది. చరిత్ర పాఠాలు గుర్తుకి వస్తున్నాయి.

            అసలు రహస్యం ఏమిటంటే బ్రిటీషువారు చైనా నుండి దిగుమతి చేసుకొంటున్న టీ (తేయాకు)కి నమాన స్థాయిలో నల్గమందుని చైనావారికి రహస్యంగా అమ్మేవారు. పైగా ఆ నల్లమందుని పండించేది బీహార్‌లో ఉన్న ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారే.

            సంతలో తిరుగుతూ అన్నీ చూశాను కానీ, మనం చెప్పుకొనే మాంసాహార దుకాణాలు అంటే పాములు, కప్పలు అమ్మటాన్ని ఎక్కడా చూడలేదు. కుతూహలాన్ని ఆపుకోలేక అడిగాను మియావోని.

            “మీరు అనుకొన్నట్టుగా చైనాలో అన్ని చోట్లా వాటిని అమ్మరు. కేవలం దక్షిణ చైనాలోని కాంటన్‌ ప్రాంతాల్లోనే అలాంటి వ్యాపారం జరుగుతుంది” అని వివరించాడు.

            ఒకసారి అతడు కాంటన్‌లోని మార్కెట్‌కి వెళ్ళి ఒక పెద్ద పామునికొని, దాన్ని తీసుకెళ్ళి అడవిలో వదలిపెట్టిన విషయం చెప్పాడు. చైనా, జపాన్‌ దేశాల్లోని బౌద్ధమతస్తులు పుణ్యం కోసం ఇలా చేస్తుంటారు. అంటే మార్కెట్‌లో అమ్ముతున్న చేపల్ని పాముల్ని, కప్పలనీ డబ్బుతో కొని వాటిని తీసుకెళ్ళి దూరంగా అడవుల్లో వదలి వేసి, వాటికి స్వేచ్చను ప్రసాదించటం ద్వారా పుణ్యాన్ని సంపాదించుకొంటారు.“చలికాలంలో కుక్క మాంసం తింటే ఆరోగ్యానికి మంచిది” అనే నమ్మకం ఇంకా సామాన్య ప్రజల్లో ఉన్నందుకు మియావో బాధపడ్డాడు.

            మోనాష్టరీలోని మొక్కలకి ప్రతి ఉదయం నీళ్ళు పోయటం ఒక పనిగా పెట్టుకొన్నాను. ఇది తెలుసుకున్న మియావో నన్ను పిలిచి “అమితాబో! ఇక్కడ బాత్‌రూముల్లోకి నరిగా నీళ్లు అందటం లేదని తెలునుకదా! దయ ఉంచి ఈ కార్యక్రమాన్ని మానుకొని, ఉదయం పూట మందిరంలో జరిగే ప్రార్ధనకి రండి, అన్ని విషయాలూ అమితాబో చూసుకొంటాడు” అని చెప్పాడు.

            నేను ప్రార్ధనకి వెళ్ళలేదు కాన్సీ లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ నేను చదివిన పుస్తకాల్లో టీ XU-XIAKE రాసిన ‘Travel Notes’ బాగా నచ్చింది. అలాగే XU GUANG QI రాసిన “The complete book of agriculture’ కూడా చాలా విషయాలని తెలియజేసింది. 16వ శతాబ్దంలో రాసిన ఈ రెండు పుస్తకాలు ‘నదులు – వ్యవసాయ పద్ధతులు” గురించి చైనా రైతులకి ఎంతో విజ్ఞానాన్ని అందించాయని తెలుసుకొన్నాను.చైనా కమ్యూనిష్టు పార్టీ గురించి Edgar Snow రాసిన “Red star over China” అనే పుస్తకంలో మావో యువకుడిగా ఉన్నప్పటి ఫోటోలు చాలా బాగున్నాయి.

            నేను ఇండియాలో బయలు దేరే ముందుగానే మియావో సలహా మేరకి మా విద్యార్థులచేత బుద్ధుని జీవితం గురించి పెయింటింగులు వేయించి నాతోపాటుగా తీసుకొచ్చాను. అడుగున్నర పొడవూ, అడుగు వెడల్పుగా ఉన్న ఈ చిన్న బొమ్మలతో తియోఫోని మోనాన్టరీలో ఒక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయటం మా ఉద్దేశం. ఒక సాయంకాలం ఆ చిత్రాల్ని చూడటానికి ఇద్దరు లోకల్‌ ఆర్టిస్టులు వచ్చారు. “రేపు మనం షో ఏర్పాటు చేయాలి” అని కోరేసరికి వారిద్దరూ ఆ రాత్రికి ఉండిపోయి, ఉదయాన్నే పని మొదలు పెట్టి పదిగంటలకల్లా  ప్రదర్శన సిద్ధం చేశారు. చాలామంది స్థానికులకి ముందుగానే చెవృటం వలన బొమ్మలుమ చూడటానికి ప్రజలు వరసగా అలా వస్తూనే ఉన్నారు.

            మధ్యాహ్నానికి ఒకావిడ కారులో వచ్చింది. ఆమెను చూడగానే నాకు రాజస్థాన్‌ బషోలి చిత్రాలు గుర్తుకి వచ్చాయి. ఆ పచ్చని ముఖం ఏదో వెలుగుతో నిండిపోయినట్టుగా అనిపించింది. ఆలయం లోపలి గదుల నిర్మాణానికి కొంత ధన సహాయం చేసే విషయం మీద మియావోతో మాట్లాడేందుకు వచ్చినట్లుగా తెలిసింది.

            మా ఎగ్జిబిషన్‌ చూసి విద్యార్థుల నైపుణ్యాన్ని మెచ్చుకోవటమే కాకుండా రెండు బొమ్మలు కూడా కొనుక్కుంది. మియావో ఆమెకి నన్ను పరిచయం చేయగానే నా వైపు పరిశీలనగా చూస్తూ “మీకు రింగుల జుట్టు ఉండే పనైతే కారల్‌ మార్క్‌లాగా ఉంటారు” అని చెప్పింది. ఆవిడకి నలభై సంవత్సరాలు ఉంటాయి. ఆమె తీసుకొచ్చిన ‘పెకింగ్‌ టీ’తో అందరికీ విందు చేసింది. అప్పుడు నేను “మేడంగారూ! నా పొడవైన గడ్డాన్ని తీసివేస్తే, మావోలాగా కనిపిస్తానేమో ప్రయత్నించండి!” అని చెప్పగానే ఆవిడకి నవ్వు ఆగలేదు.

            “మేడం గారు ఈ రోజే రావటానికి ఏమైనా ప్రత్యేకత ఉందా?” అని అడిగాను మియావోని.

            “ఈ రోజు మార్చి నెల, ఎనిమిదవ తేది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది చైనా వారికి ఎంతో ముఖ్యమైన రోజు” అని గుర్తు చేశాడు.

            లంచ్‌ తరువాత ఆ ఇద్దరు పెయింటర్స్‌, నేనూ మియావో కోసం కొన్ని బొమ్మలు వేయటం మొదలు పెట్టాం. మోనాష్టరీలో ఉన్న చివరి రెండంతస్తుల భవనంలో చిత్ర కళాసాధన కోసం ఒక ప్రత్యేకమైన హాలు ఉంది. అక్కడ రకరకాల పేపర్లు, బ్రష్‌లు ఇంకు కేకులూ ఉన్నాయి.

            9 X 3 అడుగుల క్రీమ్‌ కలర్‌ పేపరుని బల్లమీద పరచి దాని మీద నల్లని చైనా ఇంకుతో సూక్తులు రాయటం మొదలు పెట్టారు ఆ ఇద్దరూ. మొదటగా బొమ్మలు వేసిన వ్యక్తి స్కూలు టీచరు. సూక్తులు రాయటం పూర్తయ్యాక రెండు ప్రకృతి దృశ్యాలు చిత్రించాడు. వాటితో పాటుగా చిన్న కవితలు కూడా రాసి చివరగా ఎరుపురంగు ఇంకుతో తన సీల్‌ (ముద్ర) వేశాడు. సంతకానికి బదులుగా సీల్‌ వేయటం వారి పద్ధతి. ప్రతి ఆర్టిస్టుకి రెండు మూడు రకాల ముద్రలు ఉంటాయి. ఆ చిత్రకారుడి పేరు, ఊరు, ముద్దుపేరు ఇవన్నీ తెలుసుకొనేందుకు వీలుగా వారు సీల్‌ని తయారు చేయించుకొంటారు.

            రెండో ఆర్టిస్టు ఒక కాలిగ్రఫీ షాపులో పనిచేస్తుంటాడు. అందమైన వాక్యాలతో నాలుగు పెయింటింగులు వేశాడు ఇతడు. కవితలు కూడా రాశాడు. ఆ కవితలు సొంతవి కానక్కర లేదు, తమకు నచ్చిన చైనా కవుల వైనా కావచ్చు.

            చైనాలో దాదాపు అందరూ కాలిగ్రఫీ ని ప్రాక్టీసు చేస్తుంటారు. అంటే అక్షరాలని అందంగా రాయటం. బౌద్ధ మత సంబంధమైన సూక్తులు, కవితలు, శుభాకాంక్షలు లాంటి వాక్యాల్ని అందంగా రాసి  ఇంట్లో ఉంచుకొంటారు. ఇది వారి సాంప్రదాయం. మందిరానికి వచ్చేపోయే సన్యాసులు, ఉపాసకులు, ఇతర అతిధులు కూడా కాలిగ్రఫీలో కవితలు రాసి వాటిని తమ గుర్తుగా అక్కడ ఉంచిపోతుంటారు.

             ఇలా వాక్యాల్ని అందంగా రాయటాన్ని ‘షూ ఫా’ అంటారు. అయితే ఆధునిక చిత్రకారులు దాన్ని ఒక సౌందర్య ఆరాధనగా గుర్తించి ‘ఇ – షూ’ అని నామకరణం చేశారు. మనకి ఇంట్లో పూజ గది తప్పనిసరిగా ఉన్నట్లే, చైనా వారి ఇంట్లో పెయింటింగ్‌ కోసం ఒక గది ఉంటుంది.

            ఆ ఇద్దరి బొమ్మలు పూర్తయ్యాక నావంతు వచ్చింది. ‘కాలిబాటలు నా స్వర్గ ద్వారాలు’ అనే వాక్యాన్ని రాసిఅర్ధం వివరించగానే అందరూ సంతోషపడ్డారు. తెలుగులోనే రాశాను. అలాగే వారికి బాగుందట. ఆ తర్వాత కొన్ని పడవలు, చేపలు బొమ్మలు వేసి, కవితలు రాసి నా సంతకం బదులుగా ఎర్ర ఇంకుతో వేలిముద్ర వేశాను. “మీ కోసం ఒక సీలు ప్రత్యేకంగా చేయిస్తాం” అని చెప్పారు మిత్రులు. ఆ రోజు సాయంత్రం వరకూ చిత్రకళా సాధనలో గడపటం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది.

            తెల్లారే సరికల్లా లోకల్‌ మ్యూజియంలో పని చేస్తున్న బైరూబింగ్‌ అనే ఆఫీసరు వచ్చి “మీ గురించి మా పత్రిక ‘పోప్లో’ లో వ్యాసం రాస్తాను. దానికోసం కొన్ని చిత్రాలు వేసి ఇవ్వాలి” అంటూ నాకు చెప్పి, మియావోని తీసుకొని నేరుగా పెయింటింగ్‌ భవనంలోకి వెళ్ళాడు. పత్రిక కోసం కాబట్టి ప్రత్యేకమైన పేపరు తీసుకొన్నాను. ముదురు గోధుమరంగులో ఉండి, దాని మీద అక్కడక్కడ బంగారు రంగులో చిన్న మచ్చలు ఉన్నాయి. ముందుగా వాళ్ళ పత్రిక పేరుని తెలుగులో రాయించుకొన్నాడు.

            బొమ్మలు మొదలు పెట్టాక, పేపర్‌కి అడ్డంగా పాడవాటి పిల్లనగ్రోవి బొమ్మవేసి ఒక పక్కన

            “వెదురు వేణువు పాడుతూ ఉంది,

            గతించిన

            తన పచ్చటి యవ్వనాన్ని గురించి” అనే కవిత రాశాను.

            తరువాత రెండు ఎర్రటి పుష్పాల్ని చిత్రించి,

            “చెట్ల కొమ్మలు విసిరిన వలలో

వసంతం చిక్కుకొని

పువ్వుల్ని బహుమతిగా ఇచ్చి బైట పడింది” అనే కవిత రాశాను.

            ఆ చిత్రాల పక్కన ఎరుపు ఇంకుతో నా వేలిముద్రవేసి “ఇండియా -చైనా స్నేహం కోసం” అంటూ ప్రత్యేకంగా రాసేవాడిని. నా కవితలు, బొమ్మలు అందరికీ నచ్చాయని మియావో చెప్పటంతో నేనూ సంతోషించాను.

            ఒకనాటి ఉదయమే లియాంద్రో వచ్చి అగస్మాత్తుగా “భారత్‌ బహుత్‌ సుందర్‌ దేశ్‌ హై” అంటూ జాగ్రత్తగా పలికి నన్ను ఆశ్చర్యపరిచాడు. నా గదిలోనే దిగాడు. “మన పరిచయం అనుకోకుండా జరిగింది కాదు” అంటూ రెండు సార్లు అన్నాడు. అలాంటి నమ్మకాలు నాకు లేవని చెప్పాను.

            “ఇలా చెప్పకుండా వచ్చావేంటి మిత్రమా?”

        “చైనీస్‌ భాష బాగా నేర్చుకోవాలంటే గ్రామీణ ప్రజలతో కూడా మాట్లాడాలి. వారి వద్ద నుండి చాలా తెలుసుకోవచ్చు. నా భాషని ఇంప్రూవ్‌ చేసుకోవాలంటే ఇదేమంచి మార్గం” అని వివరించాడు.

            “నువ్వు బ్రెజిల్‌లో ఏదైనా జాబ్‌ చేస్తున్నావా?”

“నేను ప్రస్తుతం క్లినికల్‌ సైకాలజిస్టుగా ఉంటున్నాను. ఇండియా వెళ్ళి సంస్కృతం కూడా నేర్చుకొందామని ఆలోచన ఉంది”.

“మరీ మంచిది. ఒక నెలపాటు మా ఇంట్లో ఉండవచ్చు. ‘వెల్‌కమ్‌ టు ఇండియా” అని చెప్పాను.

            ఇక ఆ రోజంతా లియాంద్రోతో పాటుగా ఊర్లో తిరిగాను. బ్రెజిల్‌ లో తాను నివసించే ఫోర్తలీజా నగరంలో ఉన్న బౌద్ధ మత ఆలయాలు గురించి మాట్లాడాడు.

            “అంతదూరం వెళ్ళే అవసరం చైనా వారికి ఎందుకు కలిగింది?”

            “క్రీ.శ 1812 వ సంవత్సరం నాటికి బ్రెజిల్‌ దేశాన్ని పోర్చుగీసు రాణి మారియా పరిపాలిస్తూ ఉంది. ఆమెకి ఉన్న టీ తోటల్లో పనిచేయటానికి ప్రత్యేకంగా చైనా నుండి కార్మికులని రప్పించుకొని వారికోసం నివాసాలు కూడా నిర్మించింది. అది మొదలుగా నిజాయితీగా పనిచేస్తున్న చైనావారికి మా దేశంలో చాలా అవకాశాలు వచ్చాయి” అని చెప్పాడు లియాంద్రో.

            “ప్రస్తుతం ఎంతమంది చైనావాళ్ళు ఉంటారు మీ దేశంలో?”

“దాదాపు లక్షా యాభై వేలమంది”

            “వారికోసం ప్రత్యేకమైన పాఠశాలలు ఉండే పనైతే నీవు అక్కడ చైనీస్‌ టీచర్‌గా చేరే అవకాశం ఉంటుందేమో?

            “ప్రస్తుతం బ్రెజిల్‌లో ఉంటున్న చైనావారు మాట్లాడేది పోర్చుగీసు భాష, చైనీస్‌ భాషని వాళ్ళు ఏనాడో మర్చిపోయారు. వారి సాంత సంస్కృతిని కాపాడుకోవటం కోసం, కొత్తగా చైనా భాషని నేర్పించటానికి చైనా ప్రభుత్వం ముందుకి వచ్చింది. అలా జరిగితే నేను చైనీస్‌ టీచర్‌గా ఉండటానికి ఇష్టపడతాను” అని చెప్పాడు లియాంద్రో.

            తెల్లారాక ఇద్దరం కలిసి లోయ మీదుగా పైకి వచ్చే సూర్యోదయాన్ని చూద్దామని బయలు దేరాం. అయితే మాతో పాటుగా మోనాష్టరీ నుండి ఒక మాంక్‌ బయలుదేరాడు. అతడు ఎప్పుడూ పెద్దగా అరుస్తూ, ఎగురుతూ మాట్లాడుతుంటాడు. ఆయన భాష ఎలాగూ నాకు అర్థం కాదు. పైగా గొడవ. “అతన్ని మనతో తీసుకుపోవటం నాకు ఇష్టం లేదు” అని చెప్పాను లియాంద్రోకి.

            దీనికి లియాంద్రో ఒప్పుకోలేదు. “సార్‌, అతని మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. పైగా అతడు మాట్లాడే భాష చాలా పాత భాష. అది నాకు ఎంతో అవసరం అని మీకు తెలుసు కదా!” అని చెప్పగానే “సరే” అన్నాను. లియాంద్రో తన చైనీస్‌ భాషని పదును పెట్టుకోవటానికి దొరికిన సానరాయి ఈ మాంక్‌.

            ఆప్రికాట్‌ చెట్ల కొమ్మలకి సన్నగా వూత బయలు దేరింది. గుడ్డుని పొడుచుకొని బయటికి వస్తున్న పిల్ల ముక్కు మాదిరిగా, ఆ ఎర్రని లేత చిగుర్లు, కొమ్మల అంచుల నుండి తొంగి చూస్తున్నాయి.

            మేము లోయ దగ్గరకి వెళ్ళే సమయానికి సూర్యుడు ఎర్రనిబంతి మాదిరిగా పైకి వచ్చాడు. “బ్రెజిల్‌ తీరంలో సూర్యోదయం పసుపురంగులో అవుతుంది తెలుసా?”అని చెప్పాడు లియాంద్రో.

            వెంటనే మాంక్‌ అందుకొని “మా ఊర్లో  ఉన్న రెండు ఎత్తైన బండలు, కోడి పుంజుల మాదిరిగా ఉంటాయి! మీకు తెలుసా?” అన్నాడు.

            “తెలియదే!” అని లియాంద్రో చెప్పగానే ఇక చూడండి, అరుస్తూ, చేతులు ఎగరేసుకొంటూ, ఒళ్ళంతా తిప్పుకొంటూ కాళ్ళతో నేలని తన్నుకొంటూ, అరగంటసేపు ఆ కోడిపుంజుల గురించి వర్ణించాడు. మధ్యలో లియాంద్రో ప్రశ్నలు వేస్తుండేసరికి, ఆయన మరీ రెచ్చిపోయి అంతా తనకే తెలుసు  అన్నట్లుగా దంచికొడుతున్నాడు.

            ఇంతకీ కథ ఏమిటంటే “ఒకప్పుడు వారి సొంత ఊర్లోని పొలాల్లో  పంటగింజలు, ధాన్యం క్రమంగా తగ్గిపోతూ ఉండేసరికి విషయం అర్థంకాని గ్రామస్తులందరూ లామా వద్దకి వెళ్ళి కానుకలు సమర్పించుకొని తమ సమస్యని చెప్పుకొన్నారు. ఆయన దివ్య దృష్టితో చూసి “బండల మాదిరిగా ఉన్న ఆ రాతి కోడిపుంజులు రాత్రి పూట నిజమైన పుంజుల్లాగా మారి వచ్చి మీ ధాన్యం అంతా తినేస్తున్నాయి!” అని చెప్పగానే ప్రజలందరూ పరుగుల మీద వెళ్ళి, ఆరు అడుగుల కంటే ఎత్తుగా ఉన్న ఆ కోడిపుంజు బొమ్మల ముక్కుల్ని గొడ్డళ్ళతో నరికి పారేశారంట.

            ఈ కథతో మాంక్‌ ఆగిపోయే వాడే కానీ వెంటనే లియాంద్రో “అలాంటిది మరొక కథ చెప్పవా?” అనగానే మన మాంక్‌ పందెపు కోడిపుంజులా రెచ్చిపోయి, చొక్కాతో నోటి చొంగ తుడుచుకొని, మళ్ళీ మొదలుపెట్టాడు.

            “వినండి సార్‌! మా ఊళ్ళు ఒక దేవాలయం ఉంది. దాని గోడల మీద అన్నీ నాట్యం చేస్తున్న శిల్పాలే ఉండేవి. అయితే ప్రతిరోజూ రాత్రి పూట పన్నెండు గంటల తరువాత ప్రతి ఇంటి వెనకాలా గజ్జెల దరువు వినిపిస్తూ ఉండేసరికి, విషయం తెలుసుకొన్న రైతులు, ఈసారి లామా వద్దకి వెళ్ళటం మానేసి, నేరుగా ఆ దేవాలయానికే వెళ్ళి గొడ్డళ్ళతో ఆ నాట్యగత్తెల గజ్జెల కాళ్ళు పూర్తిగా నరికేశారు. అది మొదలు ఊరంతా హాయిగా నిద్రపోయారు” అని చెప్పి రొప్పుతూ, లియాంద్రో ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నాడు మాంక్‌.

            ఈయన్ని ఇలా వదలి పెడితే మాకు నిద్ర లేకుండా చేసేలాగా ఉన్నాడనుకొని “లియాంద్రో, నేను అలా పొలాల్లో తిరిగి మోనాష్టరీకి వస్తాను” అని చెప్పి మెల్లగా జారుకొని లోయకి అవతలి వైపున ఉన్న దారిలో అడుగులు వేశాను.

            యాపిల్‌ చెట్ల కొమ్మలు మెల్లగా పూల టోపీల్ని పెట్టుకొంటున్నాయి. ఆ చెట్ల మధ్య అలా ముందుకి వెళ్ళే కొద్దీ తేనెటీగలు, పురుగులు పూలకొమ్మల చుట్టూ ‘జుం’ అంటూ రొద పెడుతున్నాయి. లేత గులాబీ రంగులో ఉన్న పీచ్‌ పువ్వుల గుండెల్లోకి కీటకాలు చొచ్చుకు పోతున్నాయి. మరో పక్కన సీతాకోక చిలుకలురెపరెపలాడుతూ సుదూర ప్రయాణాలకి సిద్ధం అవుతున్నాయి. వసంత రుతువు రెక్కలు కొట్టుకొంటూ వచ్చి చెట్ల కొమ్మల మీదకి బరువుగా వాలుతున్నట్లుఅనిపించింది. సన్ననిగాలి మొదలై పరిమళాన్ని సంగీతాన్ని పెనవేసి నా ముఖానికి రుద్దింది.

            మర్నాటి ఉదయం లియాంద్రో అలా సియాన్‌కి వెళ్ళాడో లేదో బైరూబింగ్‌ కారు మీద వచ్చి, తాను పనిచేస్తున్న “రాణిగారి సమాధి మ్యూజియం’” వద్దకి తీసుకుపోయాడు.

            లియాంగ్‌ షాన్‌ కొండ మీద ఉన్న ఆ ప్రాంతాన్ని ‘కియాన్‌లింగ్‌ సమాధి’ అని పిలుస్తున్నారు. ఇక్కడ నుండి సియాన్‌కి డెబ్బై ఆరు కి.మీ. దూరం. టాంగ్‌ వంశపు మూడవరాజు గావోజోంగ్‌ అతని భార్య ఉజెటియాన్‌ సమాధులు ఇక్కడ ఉన్నాయి. పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు. దారి పొడవునా పది అడుగుల ఎత్తులో వున్న రాజులు, గుర్రాల శిల్పాలు చాలా శక్తివంతంగా ఉన్నాయి.

            కోడిగుడ్డు ఆకారంలో మట్టితో చేయబడిన ‘జున్‌’ అనే గాలి వాయిద్యంతో పాటలు పాడుతూ యాత్రికుల్ని ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. రంధ్రాలు ఉన్న చిన్న మట్టి పిడతలాగా ఉండే ఈ ‘జున్‌’ చైనా వారికి అతిప్రియమైన ప్రాచీనసంగీత పరికరం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది గోళాకారంలో ఉన్న ఒక పిల్లనగ్రోవి.

            అక్కడికి దగ్గరలోనే యువరాణి యోంగ్‌తాయ్‌ సమాధి కూడా ఉంది. పదిహేడు సంవత్సరాలకే (క్రీ.శ॥ 701) మరణించిన ఈమె కోసం భూగర్భంలో నిర్మించిన సమాధి చాలా అందంగా ఉంది. సియాన్‌లో ‘దాయంతా పగోడా’ కట్టించిన గావోజోంగ్‌ మనవరాలే ఈమె. హిందూ దేవాలయాల్లోని సన్నని అంతరాళ మార్గం గర్భగుడికి దారిచూపినట్లుగా, ఒక భూగర్భ మార్గం యోంగ్‌తాయ్‌ సమాధికి దారి చూపింది. ఎత్తైన నల్లరాతి పెట్టెలో దాచారు, పాపం! ఆ చిన్నారి మృతదేహాన్ని. గోడల మీద చక్కటి బొమ్మలు వేశారు. ఆ భవన ప్రాంగణంలో ఉన్న ‘సిల్కురూట్‌’ మ్యూజియంలోఆసియా – ఐరోపా’ దేశాల సంస్కృతిని తెలిపే పురాతన వస్తువుల్ని ప్రదర్శించారు.

            ఒకరోజు మధ్యాహ్నం ఇరవై మంది చైనా యాత్రికులు తియోఫోసి మందిరానికి వచ్చారు. ఎవ్వరికీ డెబ్బై సంవత్సరాలు వయస్సు తక్కువలేదు. ఆ పదిమంది దంపతులూ ప్రత్యేకంగా ఒక వ్యాను మాట్టాడుకొని షాంగైలో బయలుదేరి బౌద్ధాలయాలు దర్శించుకొంటూ వస్తున్నారు.

            “మీ గమ్యస్థానం ఎక్కడికో తెలుసుకోవచ్చా?”

            “యానాన్‌”

            “లాంగ్‌ మార్చ్‌ ముగిసిన ప్రదేశమే కదా!”

            “అవును”

            “బౌద్ధమతానికి యానాన్‌కి సంబంధం లేదనుకుంటాను?”

            “నిజమే! మా దృష్టిలో సామాన్య మానవులతో కలిసి జీవించిన బుద్ధుడు ఒక తిరుగుబాటుదారుడు, విప్లవకారుడు. అందుకని ఆధునిక చైనా విప్లవాలు పుట్టిన యానాన్‌ని మా గమ్యస్థానంగా చేసుకొన్నాం” అని వర్ణించారు.

            అందరికీ కలిపే భోజనం ఏర్పాట్లు చేశాడు మియావో. పుట్టగొడుగుల పులుసు మరలా ఇన్నాళ్ళకి దొరికింది. మోనాష్టరీలో ఉండటానికి, మూడు పూట్లా భోజనానికి కలిపి రోజుకి పదిహేను యువాన్లు చెల్లించాలి. రెండురోజుల తరువాత మరలా యాత్ర కొనసాగించారు వాళ్ళు.

            ఒక సాయంత్రం యాపిల్‌ పళ్ళ బుట్టతో ప్రత్యక్షమైంది ఒకావిడ. నావద్దకి వచ్చి “మాది ఈ ఊరే. మీ గురించి చాలా విన్నాను. నా కొక చిన్న పెయింటింగ్‌ కావాలి” అని అడిగింది. ఆమెకి ముఫ్పై సంవత్సరాలు ఉంటాయి. ఎరుపుకి తిరిగిన శరీరఛాయ. తేనె రంగు జుట్టుని చిత్రమైన పద్ధతిలో ముడి వేసుకొంది. “నేను బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్నాను సియాన్‌లో. వారానికి ఒక్కసారి తియోఫోసికి వచ్చిపోతుంటాను” అని చెప్పింది.

            పెయింటింగ్‌ చేయాలంటే పేపరు కోసం మరలా ఆ హాల్లోకి వెళ్ళాలి. దానికి మియావో పర్మిషన్‌ కావాలి. ఇదంతా ఎందుకని, నాగదికి తీసుకెళ్ళి నా వద్ద బొమ్మలన్నీ ఆమె చేతికిచ్చి “నీకు నచ్చింది ఒకటి తీసుకో” అన్నాను.

            ఆమె అన్నీ వెతికి నేను వేసిన ఒక చిన్న డ్రాయింగ్‌ తీసుకొంది. ఒక పెద్ద పడవ పక్కన నిలబడి ఉన్న చిన్న పిల్లవాడి బొమ్మ అది.

            “ఇన్ని పెద్ద బొమ్మలు ఉండగా ఈ చిన్న డ్రాయింగ్‌నే ఎందుకు కోరుకొంటున్నారు?” అని అడిగాను.

            “నాకు కావాల్సింది మీరు వేసిన ఒక బొమ్మ. మీ గుర్తుగా ఉంచుకోవటం కోసం. ఈ పేపరు మీద మీ విలువైన కాలం, దృష్టి, ఆలోచన ఈ బొమ్మ రూపంలో ఘనీభవించింది. అందుకే నాకిది కావాలి” అంటూ నవ్వు ముఖం పెట్టింది.

            “మీరు పెయింటింగ్‌ చదివారా?”

            “అవును. పరిస్థితుల ప్రభావం వలన ఇలా ఉద్యోగం చేయాల్సివచ్చింది. ప్రస్తుతం నా తమ్ముడు యూనివర్శిటీలో యానిమేషన్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాడు”.

            ఆ చిన్న డ్రాయింగ్‌ని ఆమెకి ఇచ్చి, యాపిల్‌ బుట్టలో నుండి రెండు ఎర్రటి పళ్ళు నేను తీసుకొని మిగిలిన వాటిని మాంకులకి ఇవ్వమని చెప్పాను. నా కోసం ఆమె ఒక పెద్ద యాపిల్‌ కాయని కోసింది. కబుర్లు చెప్పుకొంటూ ఇద్దరం తినేశాం. నా విజిటింగ్‌ కార్డు తీసుకొంది. ఒకరికొకరం ఫోటోలు తీసుకొని, బైబైలు చెప్పుకొన్నాం.

            ఆ మర్నాటి ఉదయం ఆ మర్నాటి ఉదయం గ్రామంలో దూరంగా పాటలు వినిపిస్తూ ఉంట అటుగా వెళ్ళాను. అది చైనీస్‌ పాప్‌ సంగీతం. పొగమంచు అప్పటికి ఇంకా తగ్గలేదు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే బజార్లో యాభై మంది స్త్రీలు స్టీరియో పెట్టుకొని డాన్సు చేస్తున్నారు. సియాన్‌లో మొదటిరోజు సాయంత్రం చూసిన అందమైన ‘యాంగ్‌గే’ నృత్యాన్ని మరలా ఇక్కడ కూడా చూడగలిగాను.

లోకల్‌ స్కూల్లో పనిచేస్తున్న భార్యాభర్తలు పరిచయం అయ్యారు. భార్య ఇంగ్లీషు పాఠాలు చెబుతుంది. భర్త ఆర్ట్  టీచర్‌. “మిమ్మల్ని మా స్కూలుకి ఆహ్వానిద్దామని ఇలా వచ్చాం” అన్నారు. న్యూ ఇయర్‌ గ్రీటింగ్‌లు రాసి ఉన్న ఎర్రటి పొడవైన పేపర్‌ని నా కోసం బహుమతిగా తెచ్చారు. ఇలాంటి ఎర్రరంగు కాగితాలతో ఇంటి ముఖద్వారానికి రెండు పక్కలా అలంకరణ చేయటం చూస్తూనే ఉన్నాను.

            వాళ్ళ స్కూల్లో  ‘Travel and Education ‘అనే అంశం మీద నేను ఇంగ్లీషులో మాట్లాడుతుంటే, ఆమె దాన్ని తన చైనీస్‌ ఇంగ్లీషులోకి మార్చి పిల్లలకి చెప్పింది.

            నా తర్వాత ఆ టీచరమ్మ కూడా మాట్టాడి ఒక చైనా బౌద్ధ సన్యాసి చేసిన భారతదేశ యాత్ర గురించి చెప్పింది. ‘హుయాన్‌త్సాంగ్‌ ఇండియా నుండి బౌద్ధమత సూత్రాల్ని తెచ్చిన తరువాత కాలంలో ఒక చైనా యాత్రికుడు ఉత్తర భారతదేశం వెళ్ళి బౌద్ధపుణ్య క్షేత్రాలను గురించి తెలుసుకొంటున్న సమయంలో అతనికి ఒక పురాతన తాళపత్ర గ్రంథం దొరుకుతుంది. అది ఒక ప్రముఖ బౌద్ధ సూత్రానికి సంబంధించినది. అలాంటిది ఎవ్వరి వద్దాలేదు. ఎలాగైనా ఆ సూత్రాన్ని తీసుకెళ్ళి తన రాజుకి ఇవ్వాలి అని అతని పట్టుదల. సరిహద్దుల్లో సోదా చేస్తే దొరికిపోతాననే భయం ఉంది. కాబట్టి ఆ చైనా యాత్రికుడు ఆ సూత్రాన్ని రహస్యంగా సిల్కు మీద రాసుకొని చుట్టగా చేసి, తన భుజాన్ని కోసి అక్కడ దాచుకొని, గాయం మానిందాకా జాగ్రత్తగా ఉండి, తర్వాత చైనా వెళ్ళి తన రాజుకి అందజేస్తాడు.

            అయితే ఆ సిల్కు గుడ్డ అంతా రక్తంతో తడిసి పోవటం వలన అక్షరాలు కనిపించకుండా పోతాయి. తనకోసం అంత కష్టపడి తీసుకొచ్చిన ఆ సూత్రాన్ని చదవలేక పోయినందుకు రాజు ఎంతో బాధపడతాడు. విచారంగా ఉంటున్న తన తండ్రిని చూసిన రాకుమార్తె అసలు విషయం తెలుసుకొంటుంది. తాను అప్పటికే తల్లిదండ్రుల ఇంట్లో ఒక బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు దాటిపోతుంది. “నాన్నగారూ, ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను” అని చెప్పి అఆ సిల్కు గుడ్డని తీసుకెళ్ళి తన చనుపాలలో నానబెట్టి ఉతికే సరికి, రక్తం మరకలు కరిగిపోయి అక్షరాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాంతో ఆ చైనా యాత్రికుడి గొప్పతనం అందరికీ తెలిసిపోతుంది, ఇదీ కథ.

            నా తిరుగు ప్రయాణపు తేదీ దగ్గర పడుతూ ఉంది. రెండు వారాలు కళ్ళముందే కరిగిపోయాయి. పింగ్‌లియాంగ్‌ నుండి ట్రెజోరో ఇక్కడికి వస్తానని చెప్పాడు. ఇంతవరకూ ఉత్తరం కూడా లేదు. ఉదయం లైబ్రరీలో మియావోని కలిసినప్పుడు “రేపు సాయంత్రానికి ట్రెజోరో వస్తాడనీ, రెండు రోజులు వారితో ఉన్నాక, అక్కడ నుండి నేరుగా సియాన్‌కే నన్ను పంపిస్తాడని’ చెప్పాడు మియావో. ఐతే నేను తియోఫోసిలో ఉండేది ఒక్కరోజే నన్నమాట. వెంటనే నేను యవతోంగ్‌ వద్దకు వెళ్ళి పిల్లలకి యాపిల్స్‌ ఇచ్చి వాళ్ళని ముద్దు పెట్టుకొన్నాను.

            మర్నాటి సాయంత్రానికల్లా టబ్రెజోరో వచ్చాడు. అతన్ని చూడగానే చాలా సంతోషం వేసింది. ఆ తరువాత ఒక గంటకల్లా కియాలిస్మో  కూడా వచ్చాడు. ఆ తరువాత కాసేపటికి నాన్‌ఛాంగ్‌ యూనివర్శిటీ నుండి వచ్చిన ఆర్కో అనే ఇంజనీరింగ్‌ ప్రాఫెసరు కూడా పరిచయం అయింది. అందరూ కూడబలుక్కొని వచ్చినట్టుగా ఉంది.

            అందరికి మియావో మంచి భోజనం, గదులు ఏర్పాటు చేశాడు. మిత్రుల్ని రిసీవ్‌ చేసుకోవటం అంటే ఆయనకి పండుగే మరి!

            తెల్లారే సరికల్లా  నేను అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాను. ట్రెజోరోతో వాళ్ళ ఊరికి వెళితే అక్కడ కూడా నాకు కొత్త స్నేహితులు ఏర్పడతారు అని సంతోషంగా ఉంది.

            అందరూ మియావో గదిలోకి చేరి ప్రపంచాన్ని గురించి పిచ్చాపాటీ కబుర్లు సాగించారు. బుద్దుడి జీవితాన్ని గురించి కాసేపు సీరియస్‌గా మాట్టాడుకొన్నాక వెంటనే టాపిక్‌ రూటు మారి పూర్వకాలం నాటి చైనా మీదకి వెళ్ళింది.

            ఉత్తర ఆసియాలోని సంచార జాతుల వారందరినీ సమైక్య పరచి మంగోలు సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛంఘీస్‌ఖాన్‌ (కీ.శ. 1162-1227) శక్తిని గురించి, అతని మనుమడు మరియు చైనాలో యువాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించిన కుబ్లయఖాన్‌ (క్రీ.శ. 1215-1294) పరిపాలన దక్షత గురించి, అతని ఆస్థానంలో పదిహేడు సంవత్సరాల పాటు రాయబారిగా ఉన్న ప్రఖ్యాత ఇటలీ యాత్రికుడు మార్కోపోలో (క్రీ.శ. 1254-1324) తెలివితేటల గురించి అందరం కలిసి కాసేపు మాట్లాడుకొన్నాం.

            “రష్యన్‌ భాష నేర్చుకొంటే ప్రపంచం అంతా తిరగవచ్చనే భ్రమలో ఉండేవారట చైనా వాళ్ళు ఒకప్పుడు” అని ఒకరు చెబుతుంటే, మరొకరేమో “రెండవ ప్రపంచ యుద్ధ సమయం నాటికి చైనా మార్కెట్‌లో మనిషి మాంసం అమ్మేవారని” చెప్పుకుంటున్నారు. నేనేమో వారికి విశాఖపట్నం పరిసరాల్లో ఉన్న బౌద్ధమత స్థూపాల గురించి కొన్ని ఫోటోలు చూపించి రెండు పేజీల ఇంగ్లీషు నోట్స్‌ ఇచ్చాను. ‘Love for the life’ అనే అంశం మీద మియావో చిన్న ఉపన్యాసం ఇచ్చాడు.

            అంతలో మందిరంలోకి ఒక పెద్దాయన వచ్చి “సార్‌! నేను టెలిఫోను డిపార్టుమెంట్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యాను. సియాన్‌ నుండి ఇక్కడ వరకూ ఉన్న పాత ‘సిల్కు దారి” మొత్తం నాకు తెలుసు. కావాలంటే మీకు చూపిస్తాను” అంటూ మియావో దగ్గరికి వెళ్ళాడు.

            “మీ కోసం  నేనే ఇతన్ని పిలిపించాను. ఈ అవకాశం మళ్ళీ మనకి దొరకదు. చూద్దాం పదండి!” అని మియావో చెప్పగానే అందరం బయలు దేరాం.

            లోయకి ఒక పక్కనున్న తారురోడ్డు మీదుగా సాగిపోయింది మాకారు. మలుపులు తిరుగుతూ పది కిలోమీటర్లు పోయాక ‘వాన్‌ బై’ అనే గ్రామంలో ఆగింది. అక్కడ నుండి నడుచుకొంటూ రెండు ఫర్లాంగులు  వెళ్ళాక పాత సిల్కు రూటు కనిపించింది. బీడుగా మారిపోయిన ఆ మెలికల మార్గం ఒకప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల నాగరికతలకి వారధి. ఈ మార్గంలో ప్రతి యాభై కిలోమీటర్లుకి ఏదో ఒక బౌద్ధ మందిరం ఉండేది. హుయాన్‌త్సాంగ్‌ లాంటి బౌద్ధయాత్రికులు ప్రయాణించిన ఈ మార్గంలో మేమందరం నడుస్తూ కాసేపు చరిత్రని స్మరించుకొన్నాం.

            హాన్‌ వంశపు రాజులకాలంలో కనిపెట్టబడిన సిల్కుని ఐరోపా దేశాల వారికి ఎగుమతి చేయటానికి బాటలు అవసరమయ్యాయి. అలాగే చైనాలో వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న సిల్కుని వివిధ మార్గాల ద్వారా, ప్రధాన సిల్కు రూట్లోకి చేర్చేవారు. సియాన్‌ నగరంలో మొదలైన ఈ దారి మధ్య ఆసియా, పర్షియా,  టర్కీల మీదుగా ఐరోపా చేరుకొనేది. సిల్కుని రవాణా చేసిన బాట కాబట్టి దానికి

“Silk Route”అని పేరొచ్చింది. సియాన్‌ నుండి ఐరోపా వరకూ సాగిపోయిన ఈ బాట మొత్తం పొడవు దాదాపు 6500 కిలోమీటర్లు. ఆ సిల్కు రూట్‌కి మన పాటలీపుత్రం (పాట్నా), మచిలీపట్నం కూడా అనుసంధానం చేయబడి ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోయాను.

            “సముద్రాల మీద కూడా ఒక సిల్కు రూట్‌ ఉంది! తెలుసా?” అని చెప్పాడు కియాలిస్మో.

            “అయ్యా! మీరు అంతర్జాతీయ వ్యాపారస్తులు. మీరు చెపితే తెలుసుకుంటాం” అంటూ ఆర్కో మేడం కోరింది.

            “ఆ నౌకా మార్గం చైనా తూర్పుతీరంలోని కాంటన్‌ ఓడరీవులో బయలుదేరి జావా మలయా, సిలోన్‌, అరేబియా చేరుకొని అక్కడ నుండి ఎర్ర సముద్రం ద్వారా ఈజిప్టు వెళ్ళి, ఆ పైన ఉన్న మద్యధరా సముద్రం ద్వారా ఐరోపాకి చేరిపోయేది” అని వివరించాడు.

                        సిల్కు ఉత్పత్తిని చైనావారు చాలా రహస్యంగా కాపాడారు. తద్వారా ఐరోపా వారి ధనమంతా చైనాకి చేరిపోయింది. ఐతే కీ॥శ॥ 500 నాటికి ఇదే సిల్కు దారిలో, సిల్కు తయారీ రహస్యం కూడా ప్రయాణించి బయటికి వెళ్ళింది. తర్వాత ప్రతిదేశంలోనూ సిల్కు ఫ్యాక్టరీ (Seri Culture) లు వెలిశాయి.

            “వాన్‌ బై” గ్రామానికి దిగువగా ఉన్న ఒక అద్భుతమైన లోయలో మెలికలు తిరిగిన బాటల మీద ప్రయాణించాం. ఆ మార్గంలో కూడా చాలా యవతోంగ్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఒంటెల బిడారులు ప్రయాణించిన ఆ మార్గంలో ప్రస్తుతం విద్యుత్‌ కేంద్రాన్ని స్థాపిస్తున్నారు. లోయ అంచులకి వేళాడుతున్న పీచ్‌ చెట్ల కింద పొడుగు తోకపిట్టలు విహారం చేస్తున్నాయి.

            సాయంత్రం మోనాష్టరీకి చేరుకున్నాక మియావో “మన కారుకి Time Machine అని పేరు పెడితే బాగుంటుంది” అన్నాడు.

            “ఎందుకూ?” అని ట్రెజోరో అడిగాడు, అది తన కారు కాబట్టి.

             “ఈ కారు మనందరికీ కొత్త రాతియుగం నాటి యవతోంగ్‌ గుహల్నీ, మధ్యయుగాల నాటి ‘సిల్కు రూట్‌’ని చూపించి మరలా ఆధునిక ఆకాశ హర్మ్యాల ప్రపంచంలోకి తీసుకొచ్చింది కాబట్టి” అని చెప్పగానే ‘You are right Master’  అంటూ అందరం నవ్వుకొన్నాం.

            భోజనాలయ్యాక అందరం బయలు దేరిపోవాలని నిశ్చయించుకొన్నాం. అంతలో గ్రాండ్‌ మాంక్‌ వచ్చి “రేపు ఉదయం వరకూ ఆగండి. మీకు ధ్యానం గురించి ఉపన్యాసం ఇవ్వదలిచాను” అని చెప్పగానే, అలిసిపోయిన మా శరీరాలకి అవకాశం దొరికి నిద్ర లోయల్లోకి దొర్లిపోయాం.

            వేకువ జామునే నాలుగు గంటలకి లేచి అందరం నూడిల్‌ సూప్‌ తాగాం. వెంటనే ఆ చలిలోనే అవలోకితేశ్వర విగ్రహం ముందు మాచేత పద్మాసనాలు వేయించి ధ్యానం మీద ఉపన్యాసం ఇచ్చాడు గ్రాండ్‌ మాంక్‌. ఈయన వయన్సు యాభై సంవత్సరాలు ఉంటుంది. నలభై సంవత్సరాల నుండి ఆయన ఇక్కడ ఉంటున్నాడు. కాబట్టే చిన్న వయసులోనే గ్రాండ్‌ మాంక్‌ పదవి లభించింది.

            “బుద్ధుని విగ్రహం చుట్టూ నడుస్తూ కూడా ధ్యానం చేయవచ్చు” అంటూ మా అందరి చేతా నడిపిస్తున్నప్పుడు, నేను ‘భ్రమణకాంక్షలో రాసిన “ఈ నడకంతా నా ధ్యానంలో ఒక భాగం” అనే వాక్యం గుర్తుకొచ్చింది. “భోజనం చేసిన ప్రతిసారీ, తొంభై తొమ్మిది అడుగులు నడిస్తే తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించవచ్చు” అని కూడా చెప్పాడు ఆయన.

            “నిర్వాణం అంటే మీ దృష్టిలో ఏమిటో తెలుసుకోవాలని ఉంది” అని గ్రాండ్‌ మాంక్‌ని అడిగాను నేను.

            “మెదడులో పెరిగే దురాశ, ద్వేషం, భ్రాంతి అనే కలుపు మొక్కల్ని నాశనం చేసి వాటి స్థానంలో బెదార్యం, ప్రేమ, జ్ఞానం అనే మంచి మొక్కల్ని నాటుకోవాలని తెలుసుకోవటమే నిర్వాణం” అని చాలా స్పష్టంగా వివరించాడు. నాకు చాలా అనందం వేసింది. నేను ఒక బుద్ధా పెయింటింగ్‌ అతనికి బహుమతిగా ఇస్తూ’A gift from India’ అని చెప్పాను.

            అందరం బయలు దేరాం. మా చుట్టూతా చేరిన మాంకులందరికీ నమస్కారాలు తెలియజేశాను. అవలోకితేశ్వర మందిరం ముందు ఊగుతున్న వెదురు పాదలకి, పాడుతున్న పిట్టలకి “నేను మళ్ళీ వస్తాను” అని చెప్పటానికి నా భాషా పాండిత్యం సరిపోలేదు.

            “నీకోసం సియాన్‌లో ఎదురు చూస్తుంటాను” అని కియాలిస్మో “బై బై” చెప్పాడు. “మా ఊరికి కూడా మీరు రావాలి” అంటూ ఆర్కోమేడమ్‌ ఆహ్వానించింది.

            నేను ట్రెజోరో కారులో కూర్చోబోయే ముందుగా మియావో నా కోసం ప్రత్యేకంగా ఒక యాపిల్‌ ఇచ్చి “దీని పేరు చెప్పండి చూద్దాం” అన్నాడు.

            “యాపిల్‌ పండే కదా!” అన్నాను.

            “కాదు, సరిగా చూడండి!” అనగానే ఆ పండు మీద “ఫు” (బుద్ధా) అనే చైనీస్‌ అక్షరాల్ని గుర్తు పట్ గలిగాను.

            అందరికీ మరొకసారి నమస్కరించి ‘సాయజేన్‌’ (మర్లా వస్తాను) చెప్పి ట్రెజోరో కారులో పింగ్‌లియాంగ్‌ బయలు దేరాను. రెండు వారాల పాటు ఎంతో ఆనందంగా గడిపిన తియోఫోసి మోనాష్టరీని వదలక తప్పలేదు.    

            మొదటగా చేరాలనుకొన్న చోటుకి, చివర్లో అయినా వెళ్ళగలుగుతున్నందుకు ఆనందంగానే ఉంది. దారికి రెండు వైపులా ఎత్తైన కొండలు. ఎక్కడ చూసినా వ్యవసాయమే. ఆ కొండల అంచుల్లో ప్రతి రైతూ ఒక యవతోంగ్‌ తవ్వుకొని, తల్లి కడుపులో ఉన్నంత హాయిగా నివసిస్తున్నాడు.

“ట్రెజోరో సార్‌, ఈ దారి కూడా సిల్క్‌ రూట్‌లో ఒక భాగం అనుకొంటాను?” నేను అడిగాను.

            “అవును, హుయాన్‌త్సాంగ్‌ ఇండియాకి బయలుదేరినప్పుడు ఇదే దారిలో నడిచి, తన మొదటి పెద్ద మజిలీ అయిన ‘లాంగ్‌జవ్‌’ కి చేరుకొన్నాడని చరిత్ర చెబుతుంది”.

            చైనా దుఃఖదాయనిగా ప్రసిద్ధి చెందిన ‘హోయాంగ్‌ హో’ నది ఈ ప్రాంతంగుండానే ప్రవహిస్తుంది. నది నీళ్ళు పసువు రంగులో ఉండటం వలన దీనికి Yellow River  అనే పేరు కూడా ఉంది.

            “పాత రోజుల్లో నది వరదల కారణంగా ఎంతో నష్టం జరిగిపోతూ ఉండేది. ఇప్పుడు ఈ నది మీద బ్యారేజ్‌లు నిర్మాణం చేయటం వలన దానిపేరు “చైనా ఆనందదాయని’గా మారింది” అని చెబుతున్నాడు ట్రెజోరో. రెండు గంటల కారు ప్రయాణం తరువాత పింగ్‌లియాంగ్‌ చేరుకొన్నాను. ఇది ‘గున్‌సు’ ప్రావిన్సులో ఉన్న చిన్న టౌను.

            ట్రెజోరో ఎపార్జమెంట్‌లో ఆయన భార్య, కొడుకు నాకు స్వాగతం పలికారు. ట్రెజోరో భార్య తాను వేసిన పెయింటింగ్స్‌తోనే గదులన్నీ అలంకరించింది. ఆమె లోకల్‌ స్కూల్‌లో ఆర్ట్‌ టీచర్‌. కొడుకు హైస్కూల్లో చదువుతున్నాడు.

            నేను స్నానం చేసి చాలా రోజులైంది అని కనిపెట్టిన ట్రెజోరో నా కోసం ప్రత్యేకంగా వేడి నీళ్ళు ఏర్పాటు చేశాడు. ఆరుగంటలకి భోంచేసి అందరం ఒకేసారి  బయటికి నడిచాం. కింద ఉన్న పార్కులో జరుగుతున్న “కొరియన్‌ గంగ్‌నామ్‌” డాన్సు క్లాసులకి ట్రెజోరో కొడుకు పరుగులు తీశాడు; గుర్రం మాదిరిగా ఎగురుకొంటూ. ట్రెజోరో భార్య కమ్యూనిటీ డాన్సు (యాంగ్‌గే) ప్లేస్‌లో మాకు ‘బై’ చెప్పింది.

మేమిద్దరం అలా బజారుకి బయలుదేరాం. రెండు వారాలపాటు గ్రామంలో ఉండి ఈ టౌనుకి రాగానే నాలో కొత్త శక్తి వచ్చింది. టౌను చిన్నదే అయినా అన్నీ పెద్ద భవనాలే. పాత పుస్తకాల షాపులో చైనా చిత్రకారుడు కిబైషి ‘Qi Baishi’ జీవిత చరిత్ర దొరికింది.

                        మర్నాటి ఉదయం పది గంటలకల్లా మేమిద్దరం ట్రెజోరో సొంత గ్రామంలో ఉన్నాం. దారి పొడవునా కొండలు, యాపిల్‌ తోటలు, యవతోంగ్‌లు దర్శనమిచ్చాయి అద్భుతమైన మార్గం.

            “మనం ఇప్పుడు మా అమ్మగారి సమాధి వద్దకి వెళ్ళాలి” అంటూ పొలాల్లో నిర్మించిన ఆమె సమాధివద్దకి తీసుకుపోయాడు. ఆమె బ్రతికి ఉంటే రెండు వారాల క్రితమే నేను ఈ గ్రామానికి వచ్చేవాడిని. అయితే సమాధి మీద సిలువ గుర్తువేసి ఉండటం నాకు వింతగా అనిపించింది.

            “ఆమె చిన్నతనం నుండే క్రైస్తవమతంలో చేరిపోయింది. అందుకే ఇలా చేశాం” అని చెప్పాడు ట్రెజోరో. నిజానికి చైనాలో బౌద్ధమతంతో పాటుగా ఇతరమతాలు వారు కూడా మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. తిరిగి వచ్చేదారిలో నన్ను ‘యాపిల్‌ కోపరేటివ్‌ సాసైటీ’ ఆఫీసుకి తీసుకెళ్ళి కొంతమంది సభ్యులకి పరిచయం చేశాడు.

            పింగ్‌లియాంగ్‌ టౌన్‌లోని కాల్లిగ్రఫ్‌ షాపుల్లోకి వెళ్ళాను. ‘కిబైషి’ చిత్రాల కాపీలు అమ్ముతున్నారు. అక్కడ ఒక ‘రైతు చిత్రకారుడు’ పరిచయమై ‘మనం బొమ్మలు మారకం వేసుకొందామా?’ అని చాలా వినయంగా అడిగాడు.

            “అలాంటి దేమి అక్కరలేదు. మీ చిత్రాలు చాలా విలువైనవి. నా పెయింటింగ్‌ ఒకటి మీకు బహుమతిగా ఇస్తాను” అంటూ ఆ షాపులోనే అతనికి రెండు బొమ్మలు వేసి పెట్టాను. పనిలో పనిగా ఆ షాపు యజమాని కూడా నా చేత రెండు బొమ్మలు వేయించుకున్నాడు. అయితే ఆ ఫార్మర్‌ పెయింటర్‌ నా రుణం ఉంచుకోకుండా పది నిమిషాల్లో నా Portrait  వేసి ఇచ్చాడు. అదొక కళాఖండం.

            ఆ సాయంత్రానికి జింగ్‌ అనే నలభై సంవత్సరాల వయసు గల లోకల్‌ కవితో పరిచయమైంది. “నాకు రవీంద్రనాథ్‌ టాగూర్‌ అంటే చాలా ఇష్టం” అంటూ తాను ముద్రించిన చైనీస్‌ కవితల పుస్తకాన్ని చూపించి నా కోసం రెండు కవితలు వినిపించాడు. అతనికి ఇంగ్లీషు బాగా వచ్చు.

“నది మీద ఈదులాడే

బాతులకి బాగా తెలుసు

గ్రీష్మం నిద్ర లేచిందని”

“జీవితం పొగమంచు లాంటిది,

కాస్త పొద్దెక్కగానే

కరిగి మట్టిలో కలిసిపోతుంది”.

ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. “మీరు కూడా కొన్ని కవితలు వినిపించండి” అని జింగ్‌ కోరగానే వెంటనే చెప్పాను.

“చీకట్లో

ఒంటరిగా ప్రయాణమయ్యాను

తోడుకోసం వచ్చింది చందమామ”.

“కొండలమీద కట్టిన కోటలు కూడా

భయపడు తుంటాయి, గోడల్లో

పది పచ్చగడ్డి పరకలు కనిపించగానే”

“అయితే మనం మాట్లాడు కోవాల్సింది ఇక్కడ కాదు” అంటూ ఒక పెద్ద హోటల్‌కి తీనుకెళ్ళాడు. Samsung Notebook ని మెనూ కార్డుగా ఉపయోగిస్తున్నారు అక్కడ ఉన్న వెయిటర్లు.

            ఒక టేబుల్‌ వద్ద మేమిద్దరం సెటిల్‌ కాగానే ఒక అమ్మాయి వచ్చి “సార్‌! మీతో ఒక ఫోటో తీయించుకొంటాను” అంటూ చాలా వినయంగా అడిగింది నన్ను. నా భుజం మీద చేయివేసి కూర్చొంది. ఫోటో తీయించుకొంది. ష్యేయ్‌ష్యేయ్‌ (Thank You ) అంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేమిద్దరం చాలా సేపు కవితలు, కథలు చెప్పుకొన్నాం.

            బయటికి వచ్చేటప్పుడు జింగ్‌ అడిగాడు. “నువ్వు స్వీడన్‌ నుండి ఏదో తీసుకొచ్చానన్నావు కదా! ఏమిటది?”

            “బాల్టిక్‌ సముద్ర తీరం నుండి రెండు బుజ్జిరాళ్ళు తెచ్చాను” అని చెప్పాను.

            అతడు పెద్దగా నవ్వి “నీ కంటే పెద్ద పిచ్చివాడు ఎవరూ లేరనుకొంటున్నావా? మా దేశంలో చాలామంది ఉన్నారు. మిపూ (క్రీ.శ. 1051-1107) అనే చిత్రకారుడు సెలయేటిలోని రాళ్ళు ఏరుకొచ్చి “ఇవి నా సోదరులు” అని చెప్పటమే కాకుండా అప్పుడప్పుడూ వాటితో మాట్లాడేవాడట! తెలుసా?” అని చెప్పాడు జింగ్‌.

            మర్నాటి ఉదయం ట్రెజోరోతో పాటుగా ఊరి బయట ఉన్న కొండమీదకి వెళ్ళి ‘జివాంగ్‌ము’ బౌద్ధాలయాన్ని చూశాను. దీన్ని టాంగ్‌ వంశం వారు క్రీ.శ.710వ సంవత్సరంలో నిర్మించారు.

            ఇదే కొండమీద, టావో మతానికి చెందిన మరో ఆలయం కూడా ఉంది. దాని పేరు స్వాన్‌కింగ్‌. మందిరం లోపలి గోడలకి అద్భుతమైన చిత్రాలు న్నాయి. మందిరంలో ప్రతిష్టించిన మూడు భారీ విగ్రహాలని ‘Heavenly Gods of Taoism’అని పిలుస్తున్నారు. అక్కడ ఉంటున్న మాంక్‌, పసువు రంగు కాగితం మీద తాను రాసిన కవితల్ని మాకు చూపిస్తున్నాడు.

            కొండని రాసుకొంటూ సాగిపోయిన ‘జింగే’ నది ఎండిపోయి, సిగ్గుపడుతూ ఇసుక పైటతో ముఖాన్ని కప్పుకొంది. ఈ టౌన్‌లో నేను చూసిన ఒక గొప్ప బౌద్దాలయం ‘దాయున్‌సి’. తొంభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న ఏడు అంతస్థుల పగోడా పరిసరాలకి అందాన్ని చేకూర్చింది. 1960వ సంవత్సరంలో అక్కడ బయటపడిన కొన్ని పురాతన బౌద్ధ  స్థూపాలని ఆధారం చేసుకొని ఈ కొత్త స్తూపాన్ని నిర్మించారు. దాయున్‌సి అంటే ‘మహామేఘం’ (The Great Cloud) అని అర్థం వస్తుంది. స్థూపం లోపలి గదుల్లో ‘తొమ్మిది వందల తొంభై తొమ్మిది’ బంగారు పోతపోసిన విగ్రహాలున్నాయి. ఏడవ అంతస్థు వరకూ యాత్రికుల్ని లిఫ్ట్‌లో తీసుళుతున్నారు. ఆలయం, దాని ప్రాంగణం, అక్కడ ఉన్న ప్రతి కట్టడం కూడా ముదురు లక్కరంగులో ఉండటం దాని ప్రత్యేకత.

            తియోఫోసి నుండి నేను తీసుకొచ్చిన బహుమతులు బరువై పోగా, వాటిని ట్రెజోరో కొడుక్కి ఇచ్చి, బదులుగా ఒక తేలికైన పుస్తకాన్ని తీసుకొన్నాను. దాని పేరు (‘Ancient Chinese Ideologists’. దానిలో కన్‌పూజియస్‌, మెన్సియస్‌, లావోజు, చువాంగ్‌జు, మోజి, సుంజి అనే ఆరుగురు చైనా తత్తవేత్తల గురించి వ్యాసాలు ఉన్నాయి. బ్రెజోరోకి కృతజ్ఞతలు చెప్పి బస్‌ మీద సియాన్‌కి బయలుదేరాను.

            బాగా పూతకొచ్చిన, పీచ్‌ యాపిల్‌ తోటల మధ్యగా సాగింది ప్రయాణం. కియాలిస్కో ఆఫీసులో నాకోసం లియాంద్రో ఎదురుచూస్తున్నాడు. నేను సియాన్‌లో ఉండేది సరిగ్గా రెండురోజులు మాత్రమే. ఈరోజు, రేపు. ఎల్లుండి ఉదయమే ఇండియాకి తిరుగు ప్రయాణం.

            “The Great Wild goose Pagoda’ (దాయంచి)ని చూడాలని బయలుదేరాను, లియాంద్రోని తీసుకొని. ఆ ఏడు అంతస్థుల పగోడాకి చేరుకొనే ముఖద్వారం లోనే పది అడుగుల ఎత్తున్న హుయాన్‌త్సాంగ్‌ విగ్రహాన్ని దర్శనం చేసుకొన్నాను. ప్రపంచం అంతా తెలిసిన పేరు. పద్నాలుగు సంవత్సరాల పాటు యాత్రలు చేసిన గొప్ప వ్యక్తి. బౌద్ధమత పరివ్రాజకుడిగా పండితుడిగా, ఇక్కడే తన శేష జీవితాన్ని గడిపాడు హుయాన్‌ త్సాంగ్‌. ఆ మహాయాత్రికుడి పాదాలకి నమస్కరించి భూగోళాన్ని తిరిగినంత ఆనందం పొందాను.

            తాను భారతదేశం నుండి తెచ్చిన బౌద్ధమత సూత్రాల్ని యాభై మంది పండితుల సహాయంతో చైనా భాషలోకి అనువాదం చేయించిన ప్రదేశం ఇది. తన అనుభవాల్ని కూడా ప్రత్యేకంగా సీ-యూ-కీ (Buddhist Records of the Western World)అనే పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ గ్రంథాన్ని సాధికారికంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసిన ఆంగ్ల పండితుడు శామ్యూల్‌ బీల్‌ (1825-1889).

            హుయాన్‌త్సాంగ్‌ చాలా చిన్న వయసులోనే ‘అభిధర్మకోశం’, ‘ మహాయాన సంగ్రహం’ లాంటి బౌద్ధమత గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. ఆ పరిస్థితుల్లో ‘యోగాచారభూమి సూత్ర’ అనే ముఖ్యమైన మౌలిక ప్రతికోసం అతని అన్వేషణ మొదలైంది. భవబంధాల నుండి సంపూర్ణ స్వేచ్చను ప్రసాదించే, జ్ఞాన మార్గానికి సంబంధించిన ఆ గ్రంథం కోసం చేసిన ప్రయాణాల్లోనే, హుయన్‌ త్సాంగ్‌కి పరిపూర్ణ జ్ఞానోదయం జరిగి ఉంటుందని నా విశ్వాసం.

            తనకంటే ముందుగా భారతదేశంలో ప్రయాణం చేసిన ఫాహియాన్‌ (క్రీ.శ.337-422), భారతదేశం నుండి చైనాకు వచ్చిన కుమారజీవ, బోధిధర్ముడు లాంటి మహా పండితుల ప్రయాణాలు హుయాన్‌ త్సాంగ్‌కి ఎంతో ఆత్మబలాన్ని ఇచ్చి ఉంటాయి. చక్రవర్తి అశోకుడు (క్రీ.పూ. 304-232) తర్వాత బౌద్ధమతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి హుయాన్‌ త్సాంగ్‌. బౌద్ధమతం దాదాపుగా క్షీణించిన దశలో ఆయన ఇండియాకి వచ్చినా గొప్ప గ్రంథాల్ని సేకరించగలిగాడు. అంతటి అమూల్యమైన గ్రంథాలని కాపాడటానికే ఈ మహా పగోడా నిర్మించబడింది.

            హుయాన్‌ త్సాంగ్‌ సంచరించిన ఈ అద్భుతమైన పగోడా పరిసరాల్లో నడుస్తూ ఉంటే, ప్రపంచం అంతటా ప్రయాణాలు చేసి ‘భూభ్రమణ కాంక్ష’  అనే పుస్తకాన్ని రాయాలని అనుకొన్నాను.

“సార్‌, మీకోసం నేను చాలా ఫోటోలు తీశాను కాబట్టి, నాకోసం మీరు ఒక చిన్న బొమ్మ వేసి ఇవ్వాలి” అంటూ పట్టుపట్టాడు లియాంద్రో.

            చిన్న పేపరు మీద స్కెచ్‌ పెన్నుతో “సముద్రం మీద సాగిపోతున్న తెరచాప పడవ” బొమ్మ వేసి ఇచ్చాను.

            “Indo -Brazil ” స్నేహం కోసం, ఈ బొమ్మ పక్కన మీ కవిత లేకుండా ఎలాగా?” అని మళ్ళీ అడిగాడు లియాంద్రో.

            “సంసారం ఒక సాగరం

            ఆ నీటి మీద నడవలేవు

            ఈత కొట్టి దాటలేవు

            జ్ఞానం అనే పడవతోనే ప్రయాణం చెయ్యగలవు”

            అనే కవిత రాసి లియాంద్రోకి ఇచ్చి “రేపు మనం హూసియాన్‌ టౌన్‌లో ఉన్న రైతు చిత్రకారుల్ని కలిసేందుకు వెళదాం. ‘అతే అమాన్‌హ’ (See you tomorrow) అని చెప్పి చైనీస్‌ రంగులు, బ్రష్‌లు, పేపర్లు కొనటానికి సియాన్‌ సిటీవాల్‌ సెంటర్‌కి బయలు దేరాను నేను.

            మూడు వారాల నుండి కొనసాగుతున్న నా చైనా సౌందర్య స్వప్న యాత్ర రేపటి రాత్రి వరకూ మేలుకొనే ఉంటుంది.

  *  *  *

Dr. Adinarayana Machavarapu

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు.  ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *