స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, కాస్మోనోవా
అది జూన్ 16, 2025, ఆదివారం
స్టాక్‌హోంలో ఒక చల్లని ఉదయం. చల్లటి గాలి శరీరాన్ని తాకుతూ, ఒక రకమైన ఉత్సాహాన్ని నింపాయి. ముందురోజే యూహా , అన్నేల్లి లు కాస్మోనోవాకు వెళ్దామని ఊరించినట్లు చెప్పారు. లవణం గారు “నేను రెస్ట్ తీసుకుంటా” అని చెప్పి రాలేదు. నేను, సుందర్, యూహా, అన్నేల్లి కలిసి స్టాక్‌హోం యూనివర్సిటీ వైపు బయలుదేరాం. మెట్రోలో రెడ్ లైన్ తీసుకుని, Universitetet స్టేషన్‌లో దిగాం. బయటకు వచ్చినప్పుడు చల్లని గాలి మొహాన్ని తాకి, మొదట కొంచెం ఉత్సాహాన్ని, తర్వాత గడ్డకట్టే ఫీలింగ్‌ని ఇచ్చింది.
అన్నేల్లి, “స్వీడన్‌లోనే అతిపెద్ద కాస్మోనోవాకు తీసుకెళ్తున్నాం!” అని గర్వంగా చెప్పింది. మన హైదరాబాద్ లో బిర్లా ప్లానిటోరియం చూసిన నాకు అటువంటిదే కావచ్చని అనుకున్నా, కానీ కాస్మొనోవా అంటే ఏంటో ఎవర్నీ అడగలేదు. చల్లటి గాలి ఒళ్లు తడుముతూ, చుట్టూ ఆకుపచ్చని చెట్లు, శుభ్రమైన రోడ్లు, దూరంగా కనిపించే భవనాలు చూస్తూ మెట్రో స్టేషన్ నుండి సుమారు 20 నిమిషాలు నడిచాం. స్టాక్‌హోం నగర ప్రశాంతమైన అందం మనసును ఆకట్టుకుంది.
చివరకు, ఫ్రెస్కాటివాగెన్‌లోని ఒక పెద్ద భవనం ముందు ఆగాం. పెద్ద బోర్డు కనిపించింది: స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ. అప్పుడు తెలిసింది, ఇదే ఆవరణలో కాస్మోనోవా ఐమాక్స్ థియేటర్ మరియు ప్లానిటోరియం ఉన్నాయని.
యూహా మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పి, టికెట్లు తీసుకునేందుకు వెళ్లాడు. పది నిమిషాల్లో వచ్చి, ఐమాక్స్ సినిమా టికెట్లు, మ్యూజియం టికెట్లు సుందర్ చేతిలో పెట్టాడు. “మాకు కొంచెం పని ఉంది” అని చెప్పి, అన్నేల్లి, యూహా బయటికి వెళ్లిపోయారు.
కాస్మనోవా ఐమాక్స్ సినిమాకు ఇంకా సమయం ఉంది కాబట్టి, నేను సుందర్ మొదట మ్యూజియం చూద్దామని నిర్ణయించుకున్నాం.
స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ: ఒక అద్భుత ప్రపంచం
మ్యూజియంలోకి అడుగుపెట్టగానే, సహజ చరిత్ర తెలిపే విశాలమైన ప్రపంచం మా ముందు పరుచుకుంది. స్వీడన్‌లోనే అతిపెద్ద సహజ చరిత్ర మ్యూజియంగా పేరొందిన ఈ శాస్త్రీయ సంస్థలో జీవవైవిధ్యం, భూ చరిత్ర, పర్యావరణ అధ్యయనాలకు సంబంధించిన అనేక సేకరణలు ఉన్నాయి.
మొదటి హాల్‌లో మానవ ప్రయాణం (The Human Journey) విభాగం మమ్మల్ని ఆకర్షించింది. హోమో సేపియన్స్, నియాండర్తల్ నమూనాలు, మానవ పరిణామం గురించి ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు చూస్తూ, మనిషి సాంస్కృతిక, జీవశాస్త్రీయ ప్రయాణం గురించి తెలుసుకున్నాం. ఒక చోట డిజిటల్ స్క్రీన్‌లో మానవ శరీర శాస్త్రం గురించి 3Dలో చూపిస్తుంటే, సుందర్ “ఇది స్కూల్‌లో బయాలజీ పాఠాల కంటే బెటర్!” అని నవ్వాడు.
తర్వాత జీవవైవిధ్యం (Life’s Diversity) విభాగంలోకి వెళ్లాం. అక్కడ పక్షులు, సరీసృపాలు, కీటకాలు, జంతువుల స్టఫ్డ్ నమూనాలు చూస్తూ, వాటి జీవన విధానాల గురించి ఆసక్తిగా చదివాం. స్వీడిష్ మరియు ఇంగ్లీష్ భాషలలో సమాచారం అందుబాటులో ఉంది, టచ్ స్క్రీన్‌లు మరియు ఆడియో గైడ్‌లతో. ఒక భారీ బ్లూ వేల్ నమూనా సీలింగ్ నుండి వేలాడుతూ, దాని పక్కనే సముద్ర జీవుల గురించి వివరణలు. స్పెసిమన్లు ఉన్నాయి.
డైనోసార్‌లు, శిలాజాలు (Fossils and Evolution) విభాగం నాకు మరింత ఆసక్తికరంగా అనిపించింది. టైరనోసారస్ రెక్స్ భీకరమైన నమూనా, ట్రైసెరాటాప్స్ శిలాజాలు, పురాతన సముద్ర జీవులు—ఇవన్నీ చూస్తూ ఉంటే, కాలంలో వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. ఒక చిన్న ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలో, శిలాజాలను తాకి, వాటి గురించి సమాచారం తెలుసుకోవడం భలే గమ్మత్తుగా ఉంది.

భూ చరిత్ర (The Earth’s Treasures) విభాగంలో రంగురంగుల రత్నాలు, ఖనిజాలు, ఉల్కలు చూస్తూ ఆశ్చర్యపోయాం. టెక్టోనిక్ ప్లేట్‌ల గురించి ఒక 3D యానిమేషన్ చూపిస్తూ, భూమి యొక్క గీతలు ఎలా ఏర్పడ్డాయో వివరించారు. పోలార్ ప్రాంతాలలో (Polar Regions) ధ్రువ ఎలుగుబంట్లు, పెంగ్విన్‌ల నమూనాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ పర్యావరణ వ్యవస్థల గురించి సమాచారం చాలా ఆకర్షణీయంగా ఉంది.
మ్యూజియం అంతా సహజంగా, శాస్త్రీయంగా, విద్యాపరంగా రూపొందించారు. ఇంగ్లీష్, స్వీడిష్ భాషలలో సమాచారం అందుబాటులో ఉండటం వల్ల అర్థం చేసుకోవడం సులభంగా ఉంది. ఈ మ్యూజియం 1819లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో స్థాపించబడిందని, ప్రస్తుత భవనం 1916లో నిర్మితమైందని ఒక బోర్డు మీద చదివాం. ఇది జాతీయ స్థాయి మ్యూజియంగా పరిగణించబడుతుంది, కానీ రాయల్ ప్యాలెస్ దగ్గర ఉన్న నేషనల్ మ్యూజియం కి ఇది భిన్నమైనది. విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉండటం ఒక సంతోషకరమైన విషయం.
కాస్మోనోవా: ఐమాక్స్‌లో వైకింగ్ సినిమా
మ్యూజియం చూసిన తర్వాత, కాస్మోనోవా ఐమాక్స్ థియేటర్‌కు వెళ్లాం. స్వీడన్‌లోనే అతిపెద్ద ఐమాక్స్ డోమ్ థియేటర్ ఇది. 760 చదరపు మీటర్ల డోమ్ స్క్రీన్, లేజర్ ప్రొజెక్షన్‌తో, అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని ఇస్తుంది. హైదరాబాద్‌లో ఐమాక్స్ ఉన్నప్పటికీ, నేను ఎప్పుడూ వెళ్లలేదు. కాబట్టి ఇది నాకు మొదటి ఐమాక్స్ అనుభవం. చాలా ఉద్వేగంగా సినిమా చూశాను.
మేం చూసిన సినిమా వైకింగ్స్ గురించి. స్కాండినేవియన్ సముద్రపు దొంగల సంస్కృతిని, వారి జీవనశైలిని, సాహసాలను చిత్రీకరించే ఒక డాక్యుమెంటరీ అనొచ్చేమో !. భారీ స్క్రీన్‌పై వైకింగ్ ఓడలు, ఫ్జోర్డ్‌లలో వారి యాత్రలు, యుద్ధాలు, సంస్కృతి ఇవన్నీ చూస్తూ ఉంటే, సింధుబాద్ లేదా రాబిన్ హుడ్ కథల్లో సముద్రపు దొంగల గురించి విన్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. కానీ ఈ సినిమా వాటికి భిన్నంగా, వైకింగ్ చరిత్రను, వారి సామాజిక నిర్మాణాన్ని, నమ్మకాలను సమగ్రంగా చూపించింది. సముద్ర తీరాల్లో ఓడలు నడిపే దృశ్యాలు, రూన్‌స్టోన్‌లు, వారి ఆయుధాలు వంటివి నన్ను ఆ యుగంలోకి తీసుకెళ్లాయి. సినిమా చూస్తూ ఉంటే, స్వీడన్ గతంతో ఒక బంధం ఏర్పడినట్లు అనిపించింది.
కాస్మొనోవా నుంచి బయటికొచ్చాం. ఆకలి మొదలైంది, కడుపులో కరకర లాడుతోంది. అప్పటికే మేము అక్కడికి వచ్చి దాదాపు నాలుగు గంటలు గడిచిపోయాయి.

బయటకు వచ్చిన తర్వాత
మ్యూజియం ఆవరణ నుంచి బయటకు వచ్చాక, కొంచెం విండో షాపింగ్ చేశాం. స్టాక్‌హోం షాపుల్లో వస్తువులు చూస్తే, అన్నీ ఖరీదైనవే! మన బడ్జెట్‌లో ఒక్కటీ కనిపించలేదు. ఈ లోగా అన్నేల్లి మరియు యూహా వచ్చి, మమ్మల్ని స్లుస్సెన్ మెట్రో స్టేషన్‌లో దిగబెట్టి, “మాకు మళ్లీ పని ఉంది” అని వెళ్లిపోయారు. వాళ్ళ సెలవు దినాన్ని మా కోసం కొంత ఖర్చు చేస్తూ తమ పనులు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు వాళ్ళు.
మేం స్లుసేన్ చేరే సమయానికి వచ్చిన వెంకట్ గారు మమ్మల్ని ఒక నాన్-వెజ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3:45 అయింది, ఆకలి భరించలేనంతగా ఉంది. రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే, కమురు వాసనలు! కింద భగభగ మండే నిప్పులు, పైన వేలాడుతున్న చికెన్, మటన్ గుత్తులు—వాటి నుండి చమురు చుక్కలు కిందకు కారుతూ, ఆ దృశ్యం చూస్తుంటే ఎలాగో ఉంది. నేను పరిసరాలను పరిశీలిస్తూ ఉండగా వెంకట్ గారు ఫుడ్ ఆర్డర్ చేయడం, వేడివేడిగా చికెన్ ప్లేట్ రావడం జరిగింది. ఆకలి మీద ఉండటం వల్లనో ఏమో.., ఆ రుచి మనసును దోచుకుంది. హైదరాబాద్‌లో ఎన్నో రకాల చికెన్ తిన్నాను, కానీ ఈ రుచి వేరే లెవెల్‌లో ఉంది. ఆవురావురమంటూ తినేశాం. దాన్ని షావర్మా అంటరాని , అది నిప్పులపై వేలాడుతున్న చికెన్ గుత్తి నుంచి వచ్చిందని వెంకట్ గారు చెప్పారు.
భోజనం అయి బయటకు వచ్చే సరికి సమయం సాయంత్రం 5 గంటలయింది. వెంకట్ గారు మమ్మల్ని మా మకాం కు చేర్చారు. రాత్రి 8:30 వరకు సరదా కబుర్లతో సమయం గడిచిపోయింది. వాళ్లు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, కానీ నాకు నిద్ర వచ్చేసింది. రోజంతా అనుభవాలను తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.
జూన్ 17, 2025, సోమవారం
ఉల్లాసంగా ఉత్సాహంగా రెండు సెలవుదినాలు గడిచిపోయాయి. ఈ ఉదయం మళ్ళీ అఫీషియల్ కార్యక్రమం మొదలైంది, మా బృందం మళ్లీ విడివిడిగా తమ తమ కార్యక్రమాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. స్లుస్సెన్ మెట్రో స్టేషన్ వరకు కలిసి వెళ్లాం. అక్కడ అన్నేల్లి నన్ను తీసుకుని, స్లుస్సెన్‌లోని ఒక హోంలెస్ షెల్టర్కు తీసుకెళ్లింది.
స్లుస్సెన్ హోంలెస్ షెల్టర్: ఒక సామాజిక చిత్రం
ఈ షెల్టర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. లోపల ఏడు టేబుల్స్, ఆరు పడక కుర్చీలు, ఒక బిలియర్డ్స్ టేబుల్, ఒక టీవీ అన్నీ చక్కగా అమర్చి ఉన్నాయి. అల్పాహారం 5 క్రోనార్‌లకు, మధ్యాహ్న భోజనం 10 క్రోనార్‌లకు అందుబాటులో ఉన్నాయి. బట్టలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి, అవి ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ ఉంటాయి. షెల్టర్‌లో ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వ్యక్తులు కనిపించారు. లోపలికి వచ్చే వారి దగ్గర ఆయుధాలు లేదా పదునైన వస్తువులు లేకుండా తనిఖీ చేస్తున్నారు. హోంలెస్ వాళ్లే కాకుండా పేదవారు కూడా వచ్చి చౌకగా వచ్చే అక్కడి ఆహారం తీసుకుంటున్నారు.
ఒక వ్యక్తి, రొట్టె ముక్కలు కాఫీలో నానబెట్టుకుంటూ, మమ్మల్ని చూసి, “ఈ రోజే కొత్తగా వచ్చారా? మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు!” అని అడిగాడు. నా మొహం లో బొట్టు చూసి, “యూ మస్ట్ బి ఆన్ ఇండియన్!” అన్నాడు. “అవును” అని చెప్పాను. “బాంబే? రాజస్థాన్?” అని అడిగాడు. “హైదరాబాద్” అని చెప్పాను. “ఓ, హైదరాబాద్ గురించి విన్నాను, కానీ వెళ్ళలేదు” అని తనలో తాను గొణుక్కున్నట్టు అన్నాడు. మళ్లీ “వెల్కమ్ టు స్వీడన్!” అని చెప్పి, అన్నేల్లితో స్వీడిష్‌లో మాట్లాడి, “థాంక్స్” అని గబగబా వెళ్లిపోయాడు. అతని మాటల్లో ఒక సరళత, ఒక ఆత్మీయత కనిపించింది.
వరల్డ్ హోంలెస్ డే: స్టాక్‌హోంలో ఒక సామాజిక కార్యక్రమం
మధ్యాహ్నం ఎవా మరియా తో కలిసి స్లుస్సెన్ నుండి సెంట్రల్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాం. అక్కడ లవణం గారు, రత్న, సుందర్, కై, యూహా చేరుకుని ఉన్నారు. స్టేషన్ బయటకు వచ్చేసరికి, ఒక ఖాళీ స్థలంలో జనం గుండ్రంగా గుమిగూడి ఉన్నారు. దాదాపు వందమంది పైనే ఉన్నారు. నేను వచ్చిన దగ్గరనుండి అంతమంది ఒకచోట కూడడం నేను చూడలేదు. ఏమై ఉంటుంది? ఎందుకింత మంది ఉన్నారని పక్కనున్న ఎవా మరియా ని అడిగాను. “ఇది వరల్డ్ హోంలెస్ డే సెలబ్రేషన్” అని ఆమె చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఆసక్తిగా ఆ జనం వైపు అడుగులు వేశాం. మా బృందం అంతా నాతో పాటే.
అక్కడ స్టేజ్ లేదు, టెంట్ లేదు. కేవలం బహిరంగ స్థలం. హై-పిచ్ ఆర్కెస్ట్రా సంగీతం వినిపిస్తోంది. అంతలో జనంలో నుండి ఒక వ్యక్తి మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను స్వీడన్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్! ఒక కేంద్ర మంత్రి, ఎటువంటి హడావిడి హంగామా లేకుండా, సామాన్య పౌరుడిలా జనంలో నుంచి వచ్చి మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాను. అతని ప్రసంగం స్వీడిష్ భాషలో సాగింది. అది అర్థం కాకపోయినా, హోం లెస్ సమస్యల గురించి చర్చిస్తున్నాడని తెలిసింది.
ఆ వేదిక పక్కనే రెండు పుస్తకాల ఎగ్జిబిషన్ స్టాల్స్ ఉన్నాయి, ప్రపంచ పేదరికం గురించిన పుస్తకాలు ఉచితంగా పంచుతున్నారు. సాల్వేషన్ ఆర్మీ నిర్వహించిన ఈ స్టాల్స్‌లో జనం ఆసక్తిగా పుస్తకాలు తీసుకుంటున్నారు. రెండు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఉచిత ఆహారం అందిస్తున్నారు. షెల్టర్‌లో చూసిన కొంతమంది హోంలెస్ వ్యక్తులు ఇక్కడ కూడా కనిపించారు, కడుపు నింపుకుంటూ. దాదాపు 150 మంది ఉన్నారు, వారిలో 95% హోం లెస్ వ్యక్తులే. మిగిలినవారు కార్యక్రమ నిర్వాహకులు, ఒక క్రిస్టియన్ సంస్థ ఈ ఈవెంట్‌ను నడుపుతోందని పోస్టర్లు చెప్పాయి.
లవణం గారు, “స్వీడన్‌లో అత్యంత ధనికుల్లో రోమన్ కాథలిక్స్ ఎక్కువ” అని, “క్రైస్తవులు ప్రపంచంలో పేదరికాన్ని పెంచుతున్నారు” అని విమర్శించారు. కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలైన ఆ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని తెలిసింది. మినిస్టర్ ప్రసంగం ముగిసిన తర్వాత, ఒక రాగయుక్తంగా పాట మొదలైంది. కేంద్ర మంత్రి మళ్లీ జనంలో కలిసిపోయాడు. మధ్యమధ్యలో ప్రతిపక్ష నాయకులు, సోషల్ వర్కర్లు మాట్లాడారు. హోంలెస్ సమస్యలకు పరిష్కారాలు చర్చిస్తున్నారని అన్నేల్లి చెప్పింది. స్టాక్‌హోంలో దాదాపు 1500 మంది హోంలెస్ వ్యక్తులు ఉన్నారని తెలిసింది.
ఒక ఆలోచన: చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ డే
హోం లెస్ కార్యక్రమం చూస్తూ ఉంటే, నా మనసులో ఒక ఆలోచన మెరిసింది. చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ డేను ఇలాంటి బహిరంగ కార్యక్రమంగా నిర్వహిస్తే ఎలా ఉంటుందని . వర్ని, కోటగిరి, బోధన్ వంటి చోట్ల పిల్లలతో ర్యాలీ నిర్వహించి, నాలుగు రోడ్ల కూడలిలో ఒక బహిరంగ స్థలంలో కార్యక్రమం ఏర్పాటు చేయాలి. స్థానిక అధికారులు, పోలీసులు, ప్రతినిధులు హాజరై, పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే, బాలకార్మిక వ్యవస్థ నుంచి రక్షణ పొందడానికి ఒక గొప్ప అవకాశం అవుతుంది. పిల్లలే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఈ ఆలోచన తిరిగి వెళ్ళాక మా టీం తో బలసేవాసంఘాల పిల్లలతో చర్చించాలని నిర్ణయించుకున్నాను.
చూస్తుండగానే సమయం ఆరు గంటలైంది. కార్యక్రమం ఇంకా నడుస్తోంది. తిరుగు ముఖం పట్టాం. దారిలో ICA స్టోర్‌లో కొన్ని అవసరమైన సామాన్లు కొనుక్కున్నాను.
స్టాక్‌హోంలో ఈ రెండు రోజులు తలుచుకుంటే … ఒకవైపు సహజ చరిత్ర, స్కాండినేవియన్ సంస్కృతి, మరోవైపు సామాజిక సమస్యలు, మానవత్వం—ఇవన్నీ కలిసి మనసును తడిమాయి. ఈ అనుభవాలు, ఆలోచనలు నన్ను ఒక కొత్త దృక్పథంతో ఆలోచింపజేశాయి.

