స్వీడన్ – నేరం – సంస్కరణ -3

Spread the love

11, 12 తేదిలలో వేరు వేరుగా ఉన్న మహిళల పురుషుల  ఓపెన్ ప్రిజన్ సందర్శించాం.  

మహిళా ఓపెన్ కారాగారం స్టాక్ హొమ్ నగరానికి 30 మైళ్ళ దూరంలో Faringso లో  ఉంది. దాన్ని కారాగారం అనే కంటే సంస్కరణ స్థలం లేదా సంస్కరణాలయం అనవచ్చేమో! 

మన జైళ్లలాగే స్వీడన్ జైళ్లు కూడా ఉంటాయేమో అనుకున్న నాకు వాటిని చూస్తున్నప్పుడు ప్రతి క్షణం ఆశ్చర్యమే.  నాకు తెలిసినంత వరకూ  జైలంటే కటకటాల వెనుక గాలి వెలుతురూ సోకని చిన్న చిన్న గదుల్లో ఉంటారు.  అది నేను చూసిన సినిమాలు ఇచ్చిన జ్ఞానం.  జర్నలిజం స్టూడెంట్ గా ఉన్నప్పుడు తిరుపతి పోలీస్ స్టేషన్ లో  చూసిన సెల్ తప్ప మన జైళ్ల లోపలికి వెళ్లి చూసే అవకాశం ఎప్పుడు రాలేదు. చూడలేదు మరి. 

ఇక అసలు విషయానికి వస్తే, ఈ జైలు 1976లో ప్రారంభమైంది. అక్కడి జైలు వ్యవస్థ గురించి, జైల్లో ఉండే సదుపాయాలు, చికిత్స విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, కౌన్సిలింగ్ మొదలైన వాటి గురించి మంచి అవగాహన నిచ్చింది ఈ సందర్శన. 

మొదట  Mr. Bob, ఇతర స్టాఫ్ మాకు  జైలు ఆవరణ అంతా తిప్పి చూపిస్తుంటే నోరెళ్ళబెట్టి చూడటం మా వంతయింది. మాకు అర్ధమయ్యేలా స్వీడన్ లో ఎలాంటి నేరాలతో జైలుకి వస్తున్నారో వివరించారు. అంతే కాకుండా మేం అక్కడ ఉండే మహిళా ఖైదీలతో ముచ్చటించే అవకాశం కలిపించారు.  

KRIS ప్రతినిధులు ముందే అనుమతి తీసుకుని ఉండడంతో మాకు లోనికి వెళ్ళడానికి వెంటనే అనుమతినిచ్చారు.  అయితే లోనికి వెళ్లేముందు ఫోటో  గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.  మేం మా పాస్పోర్ట్ చూపి, మా హ్యాండ్ బ్యాగ్, ఫోన్ఇతర వస్తువులను వాళ్ళు ఇచ్చిన లాకర్ లో పెట్టి లోనకి వెళ్ళాం.  

40 మందికి చోటిచ్చే ఆ ఓపెన్ జైలులో  మేం వెళ్లేసరికి కొందరు వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బల్  ఆడుతున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటూ చేతి అల్లికలు, కుట్లతో   బిజీగా.  ఇంకొందరు చెక్కతో వడ్రంగం పనిలో నిమగ్నమై ఉన్నారు.  ఎవరికీ యూనిఫామ్ లేదు. 

మరి కొందరు ప్యాకింగ్ పనిలో ఉన్నారు.  వాళ్ళు చేసిన పనులకు ప్రతిఫలంగా గంటకు తొమ్మిది స్వీడిష్  క్రోనార్లు ఇస్తారు.  ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 3. 45 వరకు పనిచేసుకోవచ్చు. చాలా మంది పనిచేస్తూ ఉంటారు. 

ఈ జైలు లోనే అన్నేల్లి స్నేహితురాలు మేరీ  పనిచేస్తున్నది.  ఆమె కూడా మాతోనే ఉన్నది. కొత్తగా కనిపిస్తున్న మమ్మల్ని చూసి కొందరు ఖైదీలు నవ్వు మొహంతో పలకరించారు. కొందరు హలో అన్నారు.   వాళ్ళ పలకరింపు చూసి నాకు ఉత్సాహం వచ్చింది.  వాళ్ళ దగ్గరకు వెళ్లి చనువుగా మాట్లాడుతుంటే వద్దని తెలుగులో వారిస్తున్నారు  లవణంగారు, సుందర్.  అదేమీ గమనించకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఖైదీలు ఏదైనా చేస్తే అని మా వాళ్ళ భయమని తర్వాత వాళ్ళు అన్నప్పుడు అర్ధమైంది.  నాకేమో అటువంటి భయమే లేదు.  

వాళ్ళు చేసిన కొన్ని నేరాలు వింటుంటే చాలా సిల్లీగా, చిన్నవిగా అనిపించాయి.  విచిత్రం ఏంటంటే వారి నేరాలన్నీ డ్రగ్స్ చుట్టూ తిరిగేవే.  అవేంటో చూద్దాం రండి. 

మదిలియా  పీటర్సన్ వయసు దాదాపు 50 ఏళ్లు.  బడిలో చదివే రోజుల్లోనే  స్నేహితుల వల్ల డ్రగ్స్ కి అలవాటు పడింది.   డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడి రెండోసారి  జైలుకి వచ్చింది. ఆరేళ్ళ శిక్ష పడింది. మూడేళ్ళుగా జైల్లో ఉంటోంది.

‘మొదటి సారి ఆరేళ్ళ శిక్షపడింది. నాలుగేళ్లు పూర్తయ్యాక ఒక టెస్ట్ పెట్టి శిక్ష తగ్గించి వదిలిపెట్టారు.  రెండేళ్ల శిక్షాకాలం తప్పింది.  జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నాను. అమ్మాను. ఇదిగో మళ్ళీ ఇక్కడికి చేరాను.’ నవ్వుతూనే చెప్పింది మదిలియా  పీటర్సన్. 

అయితే ఇప్పుడు గట్టిగ నిర్ణయించుకున్నాను.  మళ్ళీ ఇలా చేయకూడదని.  మారాలని.  డి అడిక్షన్ ప్రోగ్రాం కి వెళ్ళాను అని చెప్పింది ఆమె. 

మదిలియా కి 18 ఏళ్ల  కూతురు ఉంది. 300 కిమీ దూరంలో ఫాస్టర్ కేర్ లో ఉంది.  10వ తరగతి చదువుతోంది. రోజు ఫోన్ చేస్తానని, మూడునెలలకు ఒకసారి మేం కలుస్తాం అని చెప్పింది. కూతురు కూడా డ్రగ్స్ కి అలవాటు పడిందని బాధపడింది.  భర్త ఉన్నాడు కానీ ఆమెతో లేడు. 

అక్కడ ఉన్న వాళ్లలో డ్రగ్స్ తీసుకుని లేదా డ్రగ్స్ కోసం మర్డర్ చేసినవాళ్లు ఎవరు లేరు.  కానీ డ్రగ్స్ కోసం వాహనాల దొంగతనం, దోపిడీలు, దాడి, హత్యాయత్నం  చేసినవాళ్లు, పిల్లల్ని మోసం చేసినవాళ్లు ఎక్కువ కనిపించారు.  డ్రగ్స్ తో సంబంధం లేకుండా వ్యక్తిగత నేరాలపై జైలుకి వచ్చిన కేసులు చాలా చాలా తక్కువ.  అలాగే ఆస్తి సంబంధిత నేరాలు  కూడా ఉన్నట్టు కనిపించలేదు. 

కొందరు సింగల్ రూమ్ లో, కొందరు డబల్ రూమ్ లో టీవీ సౌకర్యంతో ఉన్నారు. వీళ్ళ ప్రత్యేక సౌకర్యానికి గాను కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.  కామన్ టీవీ హల్ లో ఉంది.  దానికి ఎటువంటి చెల్లింపు లేదు. 

ఖైదీలకు వాషింగ్ మెషిన్, ఐరన్ బాక్స్, లైబ్రరీ,  వెల్ ఎక్విప్డ్  జిమ్, ఆటవస్తువులు,   స్టోర్స్ వంటి సదుపాయాలు  ఉన్నాయి. ఫోన్ చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకుని చేయాల్సి ఉంటుంది.  నియమిత సమయాల్లో అందుబాటులో ఉండే ఫోన్ నుండి చేస్తామని చెప్పారు.  అది వింటుంటే శ్రీ చైతన్యలో చదివే నాకూతురు  ఆదివారం పూట ఇంటికి ఫోన్ చేయడానికి క్యూలో నిలబడి ఎవరో తరుముతున్నట్లు రెండునిముషాలు మాట్లాడటం గుర్తొచ్చింది.  నేను కాలేజీలో లేను జైల్లో ఉన్నాను అనేది. 

ఇక్కడ జైల్లో వారానికి రెండు సార్లు విజిటర్స్ రావడానికి అనుమతి ఉంది. జైలులో ఉన్న ఖైదీలు కుటుంబంతో గడపడానికి రెండు పడకగదుల ఇల్లు సకల సౌకర్యాలతో ఆవరణ మధ్యలో ఉంది.  కుటుంబంతో గడపాలని అనుకునే వారు ముందే అప్లై చేసుకోవాలి.  అప్లై చేసుకున్న వారికి వరుస క్రమంలో అవకాశం ఇస్తారు.  ఖైదీలు తమ భర్త, పిల్లలతో కలిసి హాయిగా గడపొచ్చు. కావలసినవి వండుకుని తినొచ్చు. కిచెన్ లో ఎలక్ట్రిక్ 4 బర్నర్ స్టవ్, ఓవెన్, వాక్యూమ్ క్లీనర్,  మైక్రోవేవ్, టోస్టర్ , ఫ్రిజ్, డిష్ వాషర్  ఉన్నాయి. వాషింగ్ మిషన్, ఏసీ, పిల్లలకు ఆడుకునే వస్తువులు, టీవీ, స్ట్రోలర్ వంటి వన్నీ చూసిన తర్వాత అది జైలేనా అనే సందేహం నాలో.. 

కానీ అది ముమ్మాటికీ జైలే. ఖైదీలు కూడా మనుషులే. వాళ్ళకి హక్కులుంటాయని పోరాడి సాధించుకున్నారు. 

శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన ఖైదీలు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువ ఉందని వారికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. 

అంత అందమైన, అద్భుతమైన ప్రదేశం అది,(మనదేశంలో అయితే అంతా నేరం చేసి జైల్లో ఉండడానికే ఇష్టపడతారేమో!) అంతకు మించి ఖైదీలలో నేరం చేశామన్న న్యూన్యతను పోగొట్టి జన జీవన స్రవంతిలో కలిసిపోవడానికి సులభతరం చేస్తూ, వారు నేరస్తులుగా కాకుండా మాములు మనుష్యులుగానే కనిపిస్తూ ఉన్నారంటే అందుకు కారణం ఆ ప్రభుత్వ తీరు, మానవీయ దృక్పథం. 

మొత్తం స్వీడన్ దేశంలో ఉన్న మహిళా ఖైదీలు ఎంతమందో తెలుసా ..? 717 మాత్రమే. పురుషఖైదీలు దాదాపు పదివేలమంది ఉన్నారు. 

12వ తేదీ ఉదయం పురుషుల ఓపెన్ జైలు కి వెళ్లాం. 

పురుషుల ఓపెన్ జైలు లో కూడా అంతే . స్టాక్ హోమ్ కి ఉత్తరాన 30 కిమీ దూరంలో ఉంది. లోకల్ ట్రైన్ లో వెళ్లాం. 

ఆస్ట్రాకర్ లో ఉంది.    KVM అనే సంస్థ నడుపుతున్నది. మిస్టర్  డాన్ మమ్మల్ని ఆహ్వానించి సంస్థ ఖైదీల సంస్కరణ, పునరావాసం లక్ష్యంగా పనిచేస్తున్నదని అనేక  విషయాలు చెప్పారు. అంటే ఇక్కడి ఖైదీలు ఓ పక్క శిక్ష అనుభవిస్తూనే పునరావాసం పొందుతారు. నేరస్థుల జీవితాలకు న్యాయం జరగాలని, భవిష్యత్ వెలగాలని వారు చేస్తున్న కృషి అద్భుతంగా ఉంది. 

బహుశా ప్రపంచంలో ఇంకెక్కడా ఇటువంటి జైలు ఉండదేమో !ఈ జైలు శిక్షా సంస్థలాగా లేదు. శిక్షణా సంస్థలా ఉంది.  ఈ జైలులో భద్రత కంటే స్వేచ్ఛ ఎక్కువ కనిపిస్తుంది. 

1983లో ప్రారంభమైన ఈ జైలులో మొదట స్త్రీ, పురుషులు కలిసి ఉండేవారు.  నాలుగేళ్ల తర్వాత స్త్రీ, పురుషుల జైళ్లు వేరయ్యాయి,  45 మంది కోసం కట్టిన ఈ జైలులో 55 మంది  ఖైదీలు ఉన్నారు. అంటే జైళ్ల సామర్ధ్యం కంటే  ఖైదీల సంఖ్య పెరిగింది.  అందుకేకొన్ని గదుల్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ మంది ఖైదీలను ఉంచడం వంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు .  కొత్త జైళ్లను నిర్మిస్తున్నారు.  అయితే అవి అనుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని తెలిసింది. 

మీకు ఇక్కడ ఎలా ఉంది అని ఓ ఖైదీని అడిగినప్పుడు ‘చాలా స్వేచ్ఛగా ఉన్నాను. పనిచేసే అవకాశం ఉంది. కుటుంబంతో గడిపే సౌలభ్యం ఉంది. అంతేకాకుండా చదువుకుంటూ ఉన్నాను. 

 ప్రపంచంలో బ్రిటన్ జైళ్ళంత అధ్వాన్నమయిన జైళ్లు ఉండవు.  ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కాలనీలు ఏర్పరచుకోవడం ద్వారా తమ అధీనంలో పెట్టుకున్నాయి. దోచుకుంటున్నాయి ‘ వ్యాఖ్యానించారు. 

మంచి ఆహారం, ఆరోగ్య సదుపాయాలతో పాటు విద్య సదుపాయాలు కూడా బాగున్నాయి. కొంతమంది క్యాంపస్ లోనే చదువుకుంటున్నారు. ఐదుగురు మాత్రం యూనివర్సిటీ కి వెళ్లి చదువుకుంటున్నారు.  కొందరు దూర విద్యా విధానంలో చదువుతున్నారు. అందరికీ పుస్తకాలు, ఫీజులు ఉచితం. 

ఈ జైలులో కూడా మహిళా జైల్లో ఉన్నట్లే చక్కటి లైబ్రరీ, రకరకాల ఆటవస్తువులు, టీవీ వంటి సదుపాయాలన్నీ ఉన్నాయి. 

వారానికి మూడు సార్లు బయట వాళ్ళు వచ్చి పని ఇస్తారు.  గంటకు 7-9 క్రోనార్లు ఇస్తారు. పని చేయని వారికి నాలుగు క్రోనార్స్ ఇస్తారు.  

50 శాతం ఖైదీలు చదువుకుంటున్నారు.  చదువు ఉచితమే. 

ఇక్కడి జైళ్లన్నీ ఒకే విధంగా లేవు. అదే విధంగా వీరికి ఉండే రక్షణ, శిక్ష కూడా ఒకే విధంగా లేదు. 

స్వీడిష్ జైళ్లలో జరిగిన జరుగుతున్న సంస్కరణలను చూసి జపాన్, కెనడా, స్కాండినేవియన్ దేశాలు ప్రభావితం అయ్యాయి.  తమ జైళ్లలోనూ సంస్కరణలు మొదలుపెట్టాయి. 

ఓపెన్ జైల్లో బయటికి వెళ్లి చదువుకుని వచ్చే కార్యక్రమం ఉంది.  చదువుకోవడానికి బయటకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారు. అయితే వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు తనిఖీ చేస్తారు.   కొన్నిసార్లు రాకపోవచ్చు కూడా.  అయినా దాన్ని నేరంగా చూడరు.  వాళ్ళని తిరిగి జైలు లోకి రానిస్తారు. కానీ వారిని వేరే జైల్లో ఉంచుతారు.  రక్షణ ఉన్న ప్రదేశంలో కొందరు బయటకు వెళ్లి డ్రగ్స్ తీసుకుని వస్తారు.  కొందరు కుటుంబంలో సమస్యలు ఉంటే వాటిని చూసుకొని వస్తారు. ఇవి ఖైదీ ఖైదీకి మారుతూ ఉంటాయి. 

ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వ్యవస్థ ఈ ఓపెన్ జైళ్లలో ఉంది. ఈ వ్యవస్థ ఖైదీలు మరింత స్వేచ్ఛగా ఉండటానికి , సమాజంలో సంబంధాలు కొనసాగించడానికి సహాయపడుతూ ఉన్నది. 

ఖైదీలు తమ దైనందిన జీవితానికి ఎక్కువ బాధ్యత వహిస్తున్నారని అనిపించింది. 

ప్రతి రోజు ఉదయం 8 గంటలకు , సాయంత్రం 7. 45కి  హాజరు తీసుకుంటారు.  మహిళల జైలులో ఉన్నట్లే ఇక్కడ కూడా విజిటర్స్ వచ్చి పోతుంటారు. కాకపోతే ఇంట్లో గడిపినట్లు గడిపే సౌకర్యం లేదు. త్వరలో ఆ పద్దతి ఇక్కడ కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. 

స్వీడన్ లో ఉన్న అన్ని జైళ్లలో కుటుంబంతో గడిపే పద్ధతి లేదు.  కొన్ని జైళ్లలో మాత్రమే ఈ అవకాశం ఉంది. 

కుటుంబ బంధాలు, బాలల హక్కులు, మానవ హక్కులు, నేరస్థుల హక్కులు కాపాడడానికి అక్కడి జైళ్లు చాలా  ప్రాధాన్యం ఇస్తున్నాయి. జైళ్లలో 18 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారు.  జైల్లో ఉన్న వారికి ఓటు వేసే హక్కు మాత్రమే కాదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా ఉంది. అయితే అందుకు కొంత ప్రాసెస్ ఉంది. 

ఈ జైళ్లలో ఉన్నవారు డ్రగ్స్ తో సంబంధం ఉన్నవాళ్లే.  అందుకే వారి ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి చికిత్స చేస్తారు.  .డ్రగ్స్ లోపలికి రానివ్వరు.  జైలు బయట ఉన్న సంస్థలు వచ్చి జైల్లో ఉన్న వారికి మోటివేట్ చేసే కార్యక్రమాలు చేస్తారు. అలాగే శిక్ష ముగించుకుని వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసే పని చేస్తున్నాయి.  ETS  (enhancing Thinking Skills), ART (Aggression Replacement Training) PRISM (program for reducing  individual substance misuse)   రకరకాల శిక్షణతో పాటు తల్లిదండ్రులను చైతన్యం చేయడం, కళలు, వంట, సిరామిక్, వెండి, కలప వస్తువుల తయారీ వంటి  రకరకాల శిక్షణ ఇస్తున్నారు.   

2, 4 శుక్ర వారాలప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వాటిని సేల్ పెట్టి అమ్ముతారు. సేల్ . 

జైలు సిబ్బందిని చైతన్య పరుస్తూ వారిలో స్ఫూర్తి నింపుతూ బాధ్యతలు నిర్వర్తించే విధంగా  శిక్షణ ఉంటుంది. 

ఎవరైనా తప్పు చేస్తే లేదా సరిగ్గా ప్రవర్తించక పోతే ఇతరుల నుంచి వేరు చేస్తారు.  వారి ప్రొబేషనరీ పీరియడ్ పెంచుతారు.  జైలు నుండి బయటకు వెళ్లి ఫిషింగ్ వంటివాటికి వెళ్లాలంటే స్టాఫ్ సహాయం చేస్తారు. తీసుకు వెళ్లారు.  ఈ జైల్లో ఖైదీలు వీలైనన్ని ఎక్కువ సార్లు బయటకు వెళ్ళవచ్చు. ఆలాగే తమ గదుల్లో కూడా తమకోసం వచ్చిన వారిని కలవవచ్చు.  రాత్రి పదిగంటలకు గేట్ తాళం వేస్తారు. ఎవరు బయటకు వెళ్ళరు. లోపలికి రారు.  

ఒక్కొక్క ఖైదీ ప్రభుత్వం చేసే ఖర్చు 1554  స్వీడిష్ క్రోనార్లు. 

ఇంత స్వేచ్ఛగా ఉండే జైళ్లను మనం ఎక్కడైనా చూస్తామా ..? లేదు కదా .. 

ఖైదీలను శిక్షించడం కంటే మంచి పౌరులుగా సంస్కరించడం గొప్ప విషయం కదా.. నిజానికి తాము శిక్ష అనుభవిస్తున్నాం అన్న భావనే ఆ ఖైదీని మూడొంతులు కుంగదీస్తుంది.  వారిలో ఆందోళన పెంచుతుంది. హింస ప్రవృత్తిని ప్రేరేపిస్తుంది .  

వార్డర్ లపై దాడి చేయడం , గాయపరచడం  వంటి చేస్తూ ఉంటారు , పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, శిక్ష అనుభవించిన ఖైదీల్లో దాదాపు రెండొంతులైనా బయటికి వచ్చినాక సమాజంలో ఇమడలేక  తిరిగి నేర ప్రపంచం లోకి వెళ్లడం జరుగుతుంది. ఇది మన దేశంలో సర్వ సామాన్యమే.  

కానీ స్వీడన్ లో వారు తిరిగి నేర ప్రపంచంలోకి జారిపోకుండా ఉండటం కోసం ఖైదీలకు మానసిక చికిత్స చేస్తారు. మనుషులుగా తీర్చిదిద్దుతారు.  అదే కదా సమాజానికి కావలసింది. అదే కదా నేరస్తుడికి కావలసింది. అదే కదా నేరస్థుల కుటుంబానికి కావలసింది.   ఏది అవసరమో, ఏది చేస్తే నేర స్వభావం పోతుందో అదే చేసింది స్వీడన్ జైళ్ల వ్యవస్థ. మానసిక అనారోగ్యం ఉన్న నేరస్థులకు ముందుగా చికిత్సలు ఆరంభించింది.   అనే తత్త్వం ఒంటబట్టించుకుని స్వీడిష్ విధానం గొప్పగా 

మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉన్న సంస్కరణాలయాలు .. 

ఈ దేశంలో మరణ శిక్ష , చిత్రహింసలు , శారీరక దండన వంటి శిక్షలు లేవు. ఖైదీలు తిరిగి సమాజంలో కలవడానికి సహాయపడే చికిత్స పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.  ఈ క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ అక్కడి జైళ్ల ముఖ్య ఉద్దేశ్యం ఖైదీలను తిరిగి సమాజంలోకి కలవడానికి సిద్ధం చేస్తాయి.

బహుశా స్వీడన్ చిన్న దేశం, తక్కువ జనాభా ఉన్న దేశం. వారి జనాభా 90 లక్షలు మాత్రమే.  అందువల్ల నేరాలు తక్కువ. అందువల్ల వాళ్లకు అది సాధ్యమయిందేమో!

ప్రపంచం ఆచరించవలసిన, అనుసరించవలసిన వ్యవస్థ ఇది కదా! 

వి. శాంతి ప్రబోధ 

వి. శాంతి ప్రబోధ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *