ఆత్మదర్శము

Spread the love

హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్  దిగి, టాక్సీ  తీసుకొని ఉదయం  5.45 కల్లా అంధేరి చేరుకొని మాధవ్‌ ఇంటి తలుపు కొట్టాను. నేను వస్తున్నానన్న సంగతి వాడికి ముందే తెలుసు. అందునా చాలా డిసిప్లిన్న్డ్ మనిషి.  పొద్దునే వాకింగ్‌, ప్రాణాయామం. అన్నీ  ఠంచన్‌గా జరగవలసిందే. షార్ట్‌, టీషర్ట్స్‌తో తలుపుతీసాడు.

 “ఏరా ప్రయాణం బాగా జరిగిందా”

“బ్రహ్మండంగా అయిందిగాని! ఏవిటి ఉదయవాహ్యాళికేనా?

“తెలుగులో ఏమంటారోగాని నేను మార్నింగ్‌ వాక్‌ అంటాను. ఏడేళ్ళబట్టి ఉన్న అలవాటు”

సామాను అందుకొని హాల్లో కెడుతూ “నువ్వు కూడా రారాదు” అన్నాడు.

నాకంత ఓపికలేదు కాని న్యూస్ పేపరు కూడా రాని టైములో, వాడి భార్యా, పిల్లలు నిద్ర పోతున్నప్పుడు వాడింట్లో హాల్లో అరగంట చప్పుడు లేకుండా పిల్లిలా కూచోడం కంటే బయటికి పోవడమే బాగనిపించింది. జూన్‌ నెల బాంబే. మంచి ఉక్కగా ఉంది.

“ఏంరా, బాగున్నావా” ఆప్యాయంగా పలకరించాను. 

“ఏం బాగో, ఎంత బాగో ఇవాళ తెలిసిపోతుంది. జెయియి ఎంట్రన్స్‌ రిజల్ట్స్‌ వస్తాయి. తొమ్మిదింటికల్లా. మా వాడికి ఏ రాంకోస్తుందో, ఏ ఐఐటిలో, ఏ సీటోస్తుందో తెలుస్తుంది”

ఓరి భగవంతుడా! ఈ సంగతి ముందే ఎందుకు తెలుసుకోకపోతినా అని గట్టిగా నాలిక్కరుచుకున్నాను. ఈ మధ్య పిల్లలందరూ తెలివయిన వాళ్ళే! అందరికీ ఫస్ట్‌క్లాస్‌, డిస్టింక్షనే. కాని మంచి కాలేజీలో , తక్కువ సీట్లు ఉండటంవల్ల  సహజంగానే  కొంతమందికే సీట్లొస్తున్నాయి . ఈ ఎంట్రన్సు రిజల్ట్స్‌ వచ్చినరోజు ఎవరింట్లో వారు , ఎవరినీ  పలకరించకుండా  గమ్మున కూచోటం ఉత్తమమని నా అభిప్రాయం. సీటంటూ వస్తే, నువ్వు తెలుసుకొని సంతోషిస్తావని తల్లిదండ్రులు భావిస్తే, వాళ్ళబ్బాయికో, అమ్మాయికో సీటు రాగానే వాళ్ళే ఫోన్‌ చేసి చెబుతారు.

నాకున్న ఒక్క పుత్రరత్నం “నాన్న నేను లిటరేచర్‌ చదువుతానంటూ” సియిసిలో జాయినయిపోయి, వొడ్హౌస్  , వర్ట్స్‌వర్త్‌ చదవడంతో నాకు ఈ ఎంట్రన్స్‌ల సంగతి మొదట్లో తెలియలేదు.

మా మరదలి కొడుకు రెండెళ్ళ క్రితం ఎమ్‌సెట్‌ రాశాడు. ఆ రోజుల్లో వాళ్ళింటికి పోయాము నేనూ, మా ఆవిడ.   నేను భోజనం చేసి కూర్చొని, లవంగం నవులుతూ, బాసింపట్టు  అది వేసుకొని

“ఏమోయ్‌ రమేశ్‌! నీ నంబర్‌ చెప్పు! ఎల్లుండి రిజల్ట్‌ నేను కూడా ఇంటర్నెట్‌లో చూస్తా” అన్నాను.

‘మరచిపోయా  పెద్దనాన్న’ అన్నాడు

“మరచిపోవడమేమిటోయ్‌ చూడు హాల్‌టికెట్టులో ఉంటుంది”

“అది వెదకాలండి”

‘మనవేమన్నా భవంతీలా? ప్రాసాదాలా? నలుగురు తల్చుకుంటే ఐదు నిమిషాల్లో హాల్‌టికెట్‌ కళ్ళముందు ఉంటుంది ” ఉత్సాహంగా మా తోడల్లుడి భుజం చరిచాను.

“ఒక్కసారి లోపలకు వస్తారా” నిలబడపోతున్న నన్ను  దాదాపు కాలరు పట్టుకొని ఈడ్చింది మా ఆవిడ సుభద్ర. 

“మీకేమన్నా  బుర్రుందా! వీళ్ళింట్లో అలమార్ల్తు, అటకలు ఎక్కి హాల్‌టికెట్‌ వెదుకుతారా? నంబర్‌ మరచిపోయానంటే మీకు చెప్పటం ఇష్టంలేదనీ, వాడికి వస్తుందన్న గారంటీ లేదని అర్థం.”

ఈ విధంగా ప్రారంభమయిన ఎంట్రన్స్‌ల విషయమై నా  జ్ఞానసముపార్ణన రెండేళ్ళలో ఒక స్థాయిని చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాధవ్‌ కొడుక్కి సీటోస్తే సరేసరి! రాకపోతే వీడేమంటాడో, వీడి భార్య పద్మ ఏమంటుందో?  ఆ పిల్లవాడేమంటాడో ! ఏడుపులు, పెడబొబ్బలు  అవుతుంటే మనం రెండోసారి  కాఫీ అడుగుతే ఏం బాగుంటుంది.

అరగంట వాకింగ్‌ అయి చెమటలు కక్కుతూ ఇద్దరం ఇంటికి చేరాం. పద్మ  అప్పటికే లేచి కాఫీ ఫిల్టర్  వేసింది.

మాధవ్ పెద్దకొడుకు ప్రసాదు సోఫాలో కూర్చొని పేపరు చూస్తున్నాడు.

“బాత్‌రూమ్‌ ఇటు పక్కన ఉందన్నయ్యా! కాఫీ రెడి చేస్తున్నాను. సుభద్ర, బాబు  అంతా బాగున్నారా” ఆప్యాయంగా పలకరించింది పద్మ,

“అంతా క్షేమమేనమ్మా. ఇదుగో ఈ బాంక్‌ కాన్ఫరెన్స్  వల్ల రెండురోజులకు బాంబే  రావడం, వీడిని, మిమ్మల్ని చూడటం కుదిరింది. ఐటీ కంపెనీలో వైస్‌ప్రెసిడెంట్‌గా మీ ఆయన! ఫోను చేయడానికి కూడా  తీరికలేదు వెధవకి”

నేను బాత్‌రూమ్‌లోంచి బయటకు వచ్చేలోగానే గెస్ట్‌ బెడ్‌రూమ్‌లో ఉన్న పి.సి ఆన్‌ చేసి నెట్‌మీద రిజల్టుకోసం వెదుకుతున్నాడు మాధవ్‌.

“ఎనిమిదయినా కానీరా! ఏడింటికి ఇంటర్నెట్ వాళ్ళు  లేవలా వద్దా ” జోకేసి ఊరుకున్నాను.

అన్యమనస్కంగా తింటున్న ఉప్మా, రెండో కాఫీలమధ్య టైము నెమ్మదిగా తొమ్మిదికి  పాకింది. నా కాన్ఫరెన్స్‌ మరుసటి రోజు నుంచి. అది

మొదలయితే అయిపోయే  రోజు వరకు నాకు ఏ మాత్రం తీరికుండదు. అందుకే ఒకరోజు ముందుగా వచ్చాను వీడితో కలిసి నాలుగు మాటలు మాట్లాడినట్లుంటుందని.  కానీ టైమింగే పెద్ద బాగాలేదు. తొమ్మిదికల్లా ఫోన్లు మొదలయినాయి . హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ ఉన్న వాళ్ళు రిజల్ట్స్‌ చూస్తున్నారని, వాళ్ళ రాంకులు ఫలానా అని.  నంబర్‌ కొట్టి ఊపిరి బిగపట్టి కూచున్నాము అందరం. మాధవ్  రెండో కొడుకు  కూడా కాంప్లాన్‌ కప్పుతో వచ్చాడు. ఏ ప్రమేయం లేకపోయినా నేను కూడా కాస్త టెన్షన్‌ ఫీలయిన మాట మాత్రం నిజం.

ఒకటికి, రెండుసార్లు (టై చేశాక వచ్చింది రిజల్ట్‌. ఆలిండియా 2400 రాంకు .  పద్మ ప్రసాదును దగ్గరగా తీసుకొని

“కంగ్రాచ్యులేషన్స్‌ నాన్నా! యూ ఆర్‌ 2400 ఇన్‌ ద కంట్రీ”అన్నది.

పిల్లవాడి మొహంలో, మాధవ్ మొహంలో ఎక్కడ సంతోషపు ఛాయలు కనిపించలేదు నాకు.

“ఏ సీటోస్తుంది” కొంతయినా ఫాక్ట్స్‌ రాబడదామని అడిగాను.

“నీతో పాటు రాసిన నీ  ఫ్రెండ్స్    ఏ ర్యాంకులో ఉన్నారో  చూడు” మాధవ్‌ గొంతు కొంచెం అసహనంగా ధ్వనిస్తోంది .

“ఎస్టాబ్లిష్డ్  ఐఐటిలో ఎమ్‌ఎస్‌సి లాంటి కోర్సు, కొత్తగా వచ్చిన ఐఐటిలో ఇంజనీరింగ్‌ రావచ్చేమో అన్నయ్య” పద్మ జవాబు చెప్పింది.

“అయితే ఇంకేం” దాదాపు హైఫైవ్‌ మూడ్‌ కొచ్చాను నేను.

“కులకర్ణికి 200, ఆకాష్‌కి 4560, శివరామ్‌కు 1230” ప్రసాద్‌ చెప్పాడు.

“ఏం రాసావు? ఏం ర్యాంకు? ఎక్జాములో నెగెటివ్‌ మార్క్స్‌ ఉన్న కొశ్చన్స్  ఒక్కసారి చూసుకోవచ్చు కదా!  నీతో పాటు  నీ కోచింగ్‌ క్లాసులో

చదువున్న నలుగురైదుగురికి  నీకన్న మంచి ర్యాంక్  వచ్చిందా లేదా” మాధవ్ దాదాపు అరుస్తున్నాడు.

క్లాసులో కనీసం యాభయిమందన్న ఉంటారన్న సత్యం అక్కడ ఉన్న అందరికి తెలుసు.

“చిన్నతనం నుంచి విజయవాడలో  తెలుగు మీడియంలో చదివాడు. ఆ శివరామ్‌ కూడా నీకంటే ఎక్కువ రాంకే వచ్చింది”

“శివరామ్‌ ఎవరూ? తెలుగువాడా!” అడిగాను పద్మను.

“శివరామ్‌ తండ్రి రాధాకృష్ణ వీరి ఆఫీసులోనే ఎకౌంట్స్‌ ఆఫీసర్‌’ పద్మ బదులుచెప్పింది.

“చదవలేదని అనడం లేదు. ఎక్స్‌ట్రా మైల్లోనే  ఉంది గెలుపుకు, ఓటమికి తేడా. కారులేదు, స్కూటర్ లేదు,  సింగిల్‌ బెడ్‌ రూమ్‌లో నలుగురుంటున్నారు. బస్సులో తప్ప బయటకురాడు.  బయట ఏమి కొనుక్కో తినే  తాహతు కూడా లేదు. రాత్రి పదకొండయితేనే గాని ఆ చచ్చువెధవ ఎకౌంట్సు క్లోజ్‌ చేసి  కొంపకు పోడు. వాడి కొడుక్కు కూడా నీ కన్నా  మంచి రాంకే వచ్చింది”

ప్రసాద్ ఏమి మాట్లాడటం లేదు

“ఈ పోటీ ప్రపంచంలో ఎవ్వరిని దాటిపైకి పోవాలో వాళ్ళను దాటి పోయితీరాలి. సామ, దాన, భేద, దండోపాయాలలో దేనితోనైనా సరే. ఎన్నిసార్లు చెప్పాను నీకు. శివరామ్‌ వస్తే వాడికి రాని టాపిక్స్‌ను క్లారిఫై చేసి నీ టైమ్‌ వేస్ట్‌ చేసుకోవద్దని.  ఇప్పుడు చూడు! వాడేమో 1200 రాంకులో ఉన్నాడు. నువ్వేమో 2500.”

“వాడు కూడా నాకు రానివి చెప్పేవాడు నాన్నా’ ప్రసాదు గొంతులో జీర.  కందిపోయిన లేతమొహం, బాగా పండిన ద్రాక్షలాగా పట్టుకుంటే  పగిలి నీళ్ళుకారేటట్లున్నాడు.

“అదంతా అనవసరం! జీవితంలో ఏ టైముకు కలిసిరావాలో వాడికి కలిసొచ్చింది. నీకు రాలేదు. మిగతా ఎంట్రన్సులన్నా సరిగ్గా ఏడిశావా! అదీ పదివేల పై రాంకేనా ” మాధవ్‌ కోపం కొంచెం తారాస్థాయినందుతోంది. 

“వీళ్ళంతా ఐఐటికి పోతే నాకు బిట్స్, నిట్లో మంచి కాలేజీలో మంచి  బ్రాంచు వస్తాయి నాన్న”ప్రసాదు కొంచెం సర్దుకుంటున్నాడు

“ఏదో బ్రాంచి, ఏదో ఐఐటిలో కన్నా, ఇంకెక్కడా  ఇంజనీరింగ్‌ చదవకూడదారా! ఐఐటిలో చదివిన వాళ్ళే అన్నీ సాధిస్తున్నారా” పదహారేళ్ళ పసిమనను పడుతున్న క్షోభ తెలియకుండా రంకెలేస్తున్న మావాడిమీద నాక్కొంచెం నిజంగానే మండింది .

“మంచిదా, చెడ్డదా కాదు.  ఆ శివరాంకొచ్చిన సీటు, ఇంత కష్టపడి చదివించినా ఇదిగో మా తేభ్యానికి  రాలేదు. ఇంకా  కొంపలో ఎందుకు. నువ్వు కూడా పదరా. ఏ అపాయింట్‌మెంటు లేదు, ఆఫీసులో మాట్లాడుకుందాం” విసురుగా లేచాడు మాధవ్‌.

ఇంటర్మీడియట్‌ పాసయిన కుర్రవాళ్ళు ఇరవైలక్షలమందికి పైగా దేశంలో ఉన్నప్పుడు అందులో మొదట రెండు వేలమందిలోనే ఉన్న కొడుకును చూసి సంతోషించాలా, వెయ్యిలో లేడని బాధ పడాలా  కూడా నిశ్చయించుకోలేని తల్లితండ్రులు ఈ దేశంలో ఇంకా ఎంతోమంది ఉన్నారో  అనుకుంటూ  నేను కూడా నిట్టూరుస్తూ  లేచాను

***

పదకొండో ఫ్లోర్లో ఆఫీసులో అడుగుపెడుతుండగా లిఫ్ట్‌ దగ్గరే ఎదురయ్యారు మెహతా. రెండు మూడు సార్లు మాధవ్‌ ఆఫీసుకు వచ్చి ఉండటంతో నాకు బాగానే పరిచయం.

“హలో బాగున్నారా!” అడిగాను.

“మీ దయ గురూజీ! మాధవ్‌ బెస్ట్‌విషెస్  ఉంటే మేము బాగుంటాము” నవ్వుతూ కదిలాడు.

“దొంగవెధవ.  హ్యూమన్  రిసోర్సు కంట్రోలు నా దగ్గరుందిగదా. బిజినెస్‌ బాగా ఉంటే వాడి తెలివి. బాగా లేకపోతే నా చేతగానితనం. ఎవడిని  ఎప్పుడు కాకా పట్టాలో అట్లా బ్రహ్మండంగా కాకా పడుతూ పైకొస్తున్నాడు. టెక్నికల్‌ గా సున్న.  తుస్సు , తుస్సని మాట్లాడం, సిఇవోని బుట్టలో వేసుకోవడం.” మాధవ్‌ వాడి వెనకే అక్కసుగా అన్నాడు.

“అవును! మీరిద్దరూ ప్రస్తుతం వైస్  ప్రెసిడెంట్ లేనా  ”

“ఇద్దరం వైస్‌ (పెసిడెంట్స్‌మే. కానీ పెకింగ్‌ ఆర్డర్‌లో నేనే ముందు. ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ చూస్తున్నాడు.”

ఇద్దరం పోయి కాబిన్లో కూచున్నాము. నెమ్మదిగా ప్రసాదు రాంకు బాధలోంచి కొంచెం, కొంచెం బయటకు వస్తున్నాడు మాధవ్‌. మూడు కాన్ఫరెన్స్‌ కాల్స్‌, ఆరు మెయిల్స్‌ లాగా ఉంది వాడి జీవితం. పన్నెండున్నరకు ‘సచిన్‌’లో లంచ్‌కి బయలుదేరాము. సాబ్‌దాన కిచిడి, కొత్తిమీర వడ అంటే నాకిష్టం.  దగ్గర్లోనే ఉన్న సచిన్‌లో రెండు బాగుంటాయని బయల్దేరతీశాడు  నన్ను.

క్యాబిన్నుంచి  బయటకు వస్తుండగా గబగబ వచ్చింది వాడి అసిస్టెంటు అనిత.

“సర్‌! మీరు మొన్న పోయిన గోవా ఆఫ్‌సైట్  ప్రోగ్రాము రిపోర్టు  అందరు  మేనేజర్లకు పంపించమన్నారు సిఇఓ. లంచ్ లోపే  వెళ్ళాలని చెప్పారు. యూనిట్‌హెడ్స్‌తో  సాయంత్రం సిఇవో రివ్యూట.”

 “ఇప్పుడా చెప్పేది.  రాగానే చెప్పచ్చుగా” చిరాకు అణచుకోవడానికి  ప్రయత్నిస్తూ అన్నాడు మాధవ్‌.

“నాకు ఇప్పుడే వచ్చింది సర్‌ కాల్‌.”  ఆ అమ్మాయి ఎదురుగా లంచ్‌బాక్స్‌తో నిలబడి ఉంది.

“ఏవన్నా ఎడిట్‌ చేయాలా సర్‌” మర్యాదగా అడిగింది.

లంచ్‌బాక్స్‌ కేసి, అమ్మాయికేసి ఒకసారి మార్చి మార్చి చూసి “లేదు నేను పంపిస్తాను. నువ్వు లంచ్‌కు వెళ్ళు”మర్యాదగా పంపించాడు అనితని మావాడు.

“పొద్దుననగా బయలుదేరి ఎక్కడెక్కడినుంచో పిల్లలకి పనులు, ఇంటి పనులు చేసుకొని వస్తారు. ఆఫీసుకు వచ్చారంటే  ఏ టైముకు వెళ్తారో కూడా తెలియదు. వాళ్ళకు కాస్త ఊపిరి సలిపి , రిలాక్స్‌ అయ్యేది లంచ్‌టైములోనే”

కంప్యూటర్‌ మీద ఫైళ్ళు ఓపెన్‌ చేసి టైప్‌ చేస్తూ అన్నాడు. మాధవ్‌ మంచితనాన్ని మనసులోమెచ్చుకోకుండా ఉండలేకపోయాను నేను.

ఏదో కాసేపు టైపు చేసి, ‘ఫోటో కూడా పెడితే  బాగుంటుందంటావా’ నన్నడిగాడు .

“నాకేం తెలుసురా మీ కంపెనీల వ్యవహారాలు.  మా దగ్గర సైక్లోస్టయిల్‌ చేసి వచ్చిన కాగితాన్ని నోటిసుబోర్డులో పెట్టడమో, అందరికి చూపించడమో చేస్తారు .”

“ఏదో పెడదాంలే కాస్త ఛేంజ్‌గా ఉంటుంది”. రెండు మూడు చిన్న చిన్న ఫోటోలు చూసి ఒకటి సెలక్ట్‌ చేసుకొని మెయిల్‌ పంపించేసి లేచి నిల్చున్నాడు మాధవ్‌ వెళదాం పద అంటూ

టిఫిన్‌ చేసినంత సేపూ వాడి మనసంతా  రిజల్ట్స్‌ మీదే ఉంది. వేరే పరీక్షలలో మంచి  రాంకు వస్తుందా, రాదా ! ఐఐటిలో ఏ బ్రాంచైనా ఫరవాలేదా! లేక నిట్లో మంచి బ్రాంచ్ ఐతే బెటరా ?” ఇట్లా  నాకు తెలవని ప్రశ్నలన్ని అడుగుతుంటే తెలిసి తెలియని సమాధానాలతో నెట్టుకొచ్చాను నేను.

కారాపి, ఆఫీసులో అడుగుపెడుతుండగానే వీడి కొలిగ్‌ ఎవరోవచ్చి “ఎక్సలెంట్‌ రిపోర్టు మాధవ్‌” అంటూ వీపు చరచి పోయినాడు.

“ఫైన్‌! థాంక్యూ” ముక్తసరిగా నడిచాడు మాధవ్‌.

“గుడ్‌ రిపోర్ట్‌ సర్‌”

“యూ రియల్లీ ఎక్స్‌పోజ్‌డ్‌ ద ఇష్యూస్‌”

మూడు నిమిషాల నడకలో నలుగురు కామెంటు చేసేటప్పటికి మా వాడికి ఏదో అనుమానం వేసింది. క్యాబిన్ ముందు సెక్రటరీ అనిత కూడా మావాణ్ణి  చూడగానే కొంచెం కష్టంతో నవ్వు ఆపుకుంటున్నట్టు అనిపించింది  నాకు.

లోపలకు పోయి కూర్చొని మెయిల్‌ ఓపెన్‌ చేసి చూశాడు మాధవ్‌. భుజం మీదనే వంగి నేను పరీక్షగా చూశాను. . రాసిన, నాలుగు, అయిదు పేరాగ్రాపుల్లో అంత అద్బుతమయిన విషయాలేవి నాకు గాని, వాడికిగాని కనిపించలేదు. చివరి వరకు  పోయాక తెలిసింది. నిజం చెప్పొద్దు నాక్కుడా నవ్వు ఆగలేదు. కొంచెం తమాయించుకున్నాను.

రిపోర్టు చివర “పార్టిసిపెంట్సు” అంటూ టైటిల్‌పెట్టి మావాడు  గ్రూపు ఫోటో బదులు పొరపాటున బీచిలో తాను స్నానం చేస్తున్న ఫోటో పెట్టాడు. రిపోర్టు చివరలో డ్రాయర్‌, కొంచెం బొజ్జ, కాస్త బట్టతలతో మాధవ్‌ ఫోటో ఉంది…

మాధవ్‌ ముఖం జేవురించడం, రంగులు మారడం నాకు కనబడుతూనే ఉంది.

“అనిత  కమాన్‌” దాదాపు అరిచాడు.

“ఎస్‌ సర్‌” ఎదురుగా  నిలబడిందా అమ్మాయి.

‘వాటీజ్‌ సో ఫన్నీ”

“నథింగ్‌ సర్‌”

“మెయిల్‌ ఆపలేకపోయావా ”

“ట్రై చేశాను  సార్‌. లంచ్‌ చేసి వచ్చేటప్పటికి చాలామంది చూసేశారు. నేను రికాల్‌ చేసినా అందరూ అప్పటికే చదివారనుకుంటాను.”

“అయితే నువ్వు కూడా నవ్వుతావా ! ఏ స్థితిలో నీకు ఉద్యోగం ఇచ్చానో, ఎంత ట్రైన్  చేశానో జ్ఞాపకముందా?  బాంబేలో 12 క్లాస్‌ పాసయి, 300 రూపాయలకు డేటా ఎంట్రీ చేస్తున్న నీకు ఉద్యోగమిప్పించి, ట్రైన్  చేసి అసిస్టెంటును చేస్తే ఇదా  నీ బిహేవియర్‌”.

“సారీ సర్‌. బట్  ఇట్టాంటి తప్పులు అప్పుడప్పుడు అందరికి జరుగుతాయి ”

“షటప్‌, యూ పిపుల్  డోన్ట్‌ హేవ్  గ్రాటిట్యూడ్ ” మాధవ్  ఇంగ్లీషుల్లో ఆ అమ్మయిని అదుపు, ఆజ్ఞ లేకుండా, ఆమెను మాట్టాడనీయకుండా,  తిట్టడం మొదలుపెట్టాడు. ఏ మాటా సభ్యత దాటిపోలేదు కాని దాదాపు కత్తితో కుళ్ళపోడుస్తున్నట్టుగా ఉన్నదా అమ్మాయికి.

  “నేను లైబ్రరిలో ఉంటాను “ లేచి బయటకు నడుస్తున్న నాకు అమ్మాయి కళ్ళనిండా నీరు నింపుకోవడం కనిపిస్తునే ఉంది.

అయిదు, అయిదున్నరకల్ల వాడిపోయిన మొహంతో   కొంచెం బాధగా,  కోపంగా చిరాకుగా  బయటకొచ్చాడు మాధవ్. 

 “పద కాసేపు ఏ బార్‌లోనయినా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం.”

 “ఈ మధ్య డ్రింక్స్ కూడా మొదలు పెట్టావా ” అడిగాను నేను.

 “తాగుడు లేదు, పాడు లేదు. . ఈ టైమ్‌లో బార్‌లో రష్‌ ఉండదు. మనం కాస్త ప్రశాంతంగా మాట్టాడుకోవచ్చు ”

ఎయిర్‌పోర్టు దగ్గర లీలా హోటల్‌కి వెళ్ళి పచ్చగా చెట్లు కనపడేటట్టు  కిటికీ దగ్గర  కూర్చున్నాము.

“వన్‌ ఎర్ల్‌గ్రే, నో షుగర్, నో మిల్క్  వన్‌ టానిక్‌ వాటర్‌” ఆర్డరు తీసుకొని వెళ్ళిపోయాడు బేరర్‌.

టానిక్‌ వాటర్‌లో నిమ్మ చక్రాన్ని గిరాగిరా ప్లాస్టిక్‌ పుల్లలో తిప్పుతూ

“ఎందుకింత సంతోషం లేకుండా ఉందిరా జీవితం” మాధవ్‌ అడిగాడు.

“ఏమిటి దుఃఖం? అబ్బాయికి ఐఐటి రాకపోవడమా?  మెయిల్‌లో తప్పు ఫోటో పోవడమా” ప్రశ్నించా నేను.

“అది  కాదు. వెనక్కు తిరిగి ఆలోచించకుంటే ఇవి పెద్ద కష్టాలు కాదని, సర్దుకుపోతామని నాకున్న అనుభవం, పరిజ్ఞానం చెబుతూనే ఉన్నాయి. కాని ఈ విషయాలకు ఇంత మధనపడటానికి  కారణం ఏమిటి ”

“నీకు కారణాలు చెప్పేముందు ప్రసాదు విషయం చిన్నమాట చెప్పనా. నీ దగ్గర అకౌంట్స్లో  పని చేస్తున్నంత మాత్రాన రాధాకృష్ణ నీకన్న తెలివితక్కువ వాడయి ఉంటాడని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావు.  పోని నువ్వు రోజు చూస్తున్న మనిషి తెలివితేటలు అంచనా వేస్తున్నావు కాబట్టి నిజమే అనుకున్నా, తండ్రి కన్నా  కొడుకు తెలివైనవాడో, తెలివితక్కువ వాడో కాకూడదని నువ్వు చదువుకున్న సైన్సు నీకెక్కడన్నా చెప్పిందా?” కఠినంగానే ప్రశ్నించా నేను.

 “కొంచెం ఓవర్‌గా రియాక్ట్‌ అయినానంటావా”  మాధవ్‌ కాస్త తగ్గి అడిగాడు

“కొద్దిగా కాదు.  చాలా! పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. రాధాకృష్ణకు  ఏడాదిలో మొత్తం వచ్చే జీతంకన్నా ఎక్కువ డబ్బు నీకు ఒక్క నెలలో వస్తుంది. తెలివికలవాడివి. కష్టపడుతున్నావు. ఆఫీసులో మంచి పనిమంతుడివి అని పేరు ఉంది. బంగారంలాంటి పిల్లలు.  అర్థం చేసుకునే ఇల్లాలు.  ఇన్ని ఉన్నా సగటు మనిషికి  ఉండవలసిన సంతోషంతో కూడా నువ్వు ఎందుకుండట్లేదో ఎప్పుడయినా ఆలోచించావా”.

“ఎందుకు.” ఆత్రుత మాధవ్  గొంతులో  స్పష్టంగా వినబడుతుంది.

“నాకు తోచింది చెపుతాను.  అది నీకు తెలియదని నేననుకోను. కాని నీ ప్రస్తుత  దృక్పధం  మార్చుకోని సంతోషంగా ఉండగలగడం నీ చేతుల్లోనే ఉంది .”

“సరే చెప్పు”

“మహాభారతం చదివావు కదా! ఇవాళ నీ అనుభవానికి, ప్రవర్తనకి  అందులో ఏ వ్యక్తి నీకు అతి దగ్గరగా ఉన్నాడంటావు.”

మాధవ్‌ మాట్లాడలేదు. కృష్ణుడు,  భీష్ముడు దగ్గర్నుంచి అభిమన్యుడి దాకా వారు ప్రతి వాళ్ళను బేరేజు వేస్తున్నాడని  అర్థమయింది.

“నాకు ఇవాళ నీలో కనిపించింది  దుర్యోధనుడి అంశ. దుర్యోధనుడంటే గదపట్టుకొని క్రూరంగా నవ్వే విలన్‌ అని, తొడగొట్టి ఆడవాళ్ళను రమ్మంటాడని మన అభిప్రాయం. అది ఆ వ్యక్తిలోని పతనానికి పరాకాష్టగా కవి చూపిన  ఉదాహరణ మాత్రమే.  వంద మంది ప్రాణమిచ్చే తమ్ములు,  ప్రేమించే తండ్రి, తనను అమితంగా అభిమానించే గురువు, సద్గుణరాశి, సౌందర్యవతి అయిన భార్య,  దేశంలో  కనీసం సగభాగానికి  రాజు .  అయినా  దుర్యోధనుడు  జీవితంలో ఏ మాత్రం సంతోషం లేదు . ఎంతసేపు, పాండవుల బలం, వారి రాజ్యం, వాళ్ళ భార్య, వారి ఆనందం ,  దీని గురించే  ఆలోచన, దుగ్ధ . అంత పెద్ద రాజు. సభలో పండితులను, జ్యోతిష్యులను, వందిమాగధులని, విదూషకులని పోషించేవాడు.  మహాసభలో నడుస్తూ కాలు జారి పడితే, ఎక్కడో ఎవరో  కాస్త నవ్వితే, తాను నవ్వి ఊరుకోవచ్చు కదా! ఆ నవ్వును అవమానంగా భావించి, ఆమెని, ఆమె భర్తను పరాభవించి, నానా కష్టాలు పెట్టి, తాను పడి,  కుటుంబంతో సహా  సర్వనాశనమయినా దుర్యోధనుడు తన మనసు మార్చుకోలేదు.”

సంభాషణ ఎటువైపు పోతుందో తెలిసినట్టుగా తలవంచుకున్నాడు మాధవ్.

“చిన్నతనంలో చదువుకున్నప్పుడు  నీకు తెలిసినవి నాకు చెప్పకపోయినా  “పూను స్పర్థలు విద్యలందే” అని  నమ్మి ఊరుకున్నాను. నీ దగ్గర పని చేసే అకౌంటెంట్‌ కొడుకు విజయాన్ని నువ్వు జీర్ణించుకోలేక, కొడుకు విజయం సాధించిన సమయంలో తండ్రి చేతగానితనాన్ని, అతని తెలివితేటలను విమర్శించే తీరు నన్ను నిజంగా ఆశ్చర్య పరిచింది.  నీ దృక్పధంలో  నీకన్నా తక్కువ జీతం ఉన్న ఉద్యోగి తరతరాలూ , నీ వారసులకన్నా తక్కువ దశలోనే ఉండాలన్న కోరిక, ఉంచాలన్న ప్రయత్నం స్పష్టంగా కనపడుతున్నాయి.  ఓ సాధారణ వ్యక్తికి కలిగిన మామూలు సంతోషాన్ని కూడా సహించలేని నీ చుప్పనాతితనం, ఆలోచనా విధానం  నుంచి నువ్వు బయటపడాలి.  అదొక ఎత్తైతే, నువ్వు చేసిన పొరపాటుకు అమాయకంగా నవ్విన అమ్మాయిపై నువ్వు అరచిన విధానం నన్ను నిజంగానే భయపెట్టింది. మన చిన్నతనంలో భార్య తిడితే మన లెక్కల టీచర్ మనని కొట్టేవాడని తిట్టుకునేవాళ్ళం. ఒత్తిడిలో హుందాతనం చూపలేదు. పైగా అత్త మీద కోపం దుత్త మీద చూపావు “. 

సమాజంలో, ప్రపంచంలో నీ ఉనికి గురించి నీకున్న అహంభావం నీ పైన నీకు తెలవని ప్రభావాన్ని చూపుతోంది . ఈ ఆఫీసులో ఇవాళ నువ్వు ముఖ్యుడివి. రేపు రిటైర్ అయిన రెండవ క్షణం నువ్వు రిసెప్షన్లో కూర్చుని ఎంట్రీ పాస్ అడగాలి. ఈ ఆఫీసులోనే నీ పరిస్థితి ఇట్లా ఉంటే,  బయట సంఘంలో నీ స్థితి ఏమిటి? ఈ అహంకారం వల్ల నువ్వు చేసే పనులన్నీ చాలా మంచిగా చేస్తున్నానని, ప్రతి ఒక్కరు నిన్ను గౌరవంతో, వీలయితే కాస్త భయంతో చూడాలని అనుకుంటున్నావు.   జీవితంలో హాస్య చతురత పూర్తిగా ఎండిపోయి స్వప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. దీనితో  నిన్ను చూసి ఎవరయినా నవ్వితే కోపంతో ఏడుస్తున్నావు. నిన్ను చూసి ఎవరయినా భయంతో ఏడిస్తే, లోలోపల నవ్వుకుంటున్నావు.  ఈ ఏడుపు, నవ్వుల సంధిగ్ధావస్థ నుంచి నువ్వు ఎంత త్వరగా బయట పడితే అంత మంచిది” .

నేను అన్న  మాట అవసరమయిన దాని కన్నా కాస్త కటువుగానే ఉందని నాకే అనిపించింది . 

“నువ్వు  నాకు ప్రాణమిత్రుడివి. నీ డబ్బు చూసో, పదవి చూసో నీకు గౌరవాన్నిచ్చి , నీలో తప్పులను నీకు చూపనినాడు మనది స్నేహంకాదు. పరస్పరలాభం కోసం చేసే వ్యాపారం. స్నేహితుడి ధర్మం నీ సంతోషంలో పాలుపంచుకోవడం, దుఃఖంలో చేయూత ఇవ్వడమే కాదు, నిన్ను నీకు అద్దంలా  చూపడం కూడా.  నీకు తెలుసా? అద్దానికి తెలుగులో మరోమాట ఆత్మదర్శము. ఆది స్నేహితుడికి నిర్వచనం. జీవితాన్ని దగ్గరగా చూడడమంటే, నిన్ను నువ్వు దూరంనించి చూసుకోవడమే. అప్పుడే  నీ చుట్టూ నువ్వు గీసుకున్న గీత క్రమంగా తన పరిధిని పెంచుతుంది.”

“నేను ముందే చెప్పా! స్నేహితుడిగా కుండను బద్దలు కొట్టినట్టు చెప్పడం నా  ధర్మం. మారడం మాత్రం నువ్వనుకునేంత  కష్టం కాదు. నే చెప్పినంత సులువు కాదు ”.

తిట్ల ప్రవాహమే వస్తుందో, అంతకన్న భయంకరంగా మా స్నేహం మధ్య మౌనం గోడలా లేస్తుందో  అని ఆలోచిస్తూ వెనక్కు  వాలి కూచున్నాను.

నీళ్ళు నిండిన కళ్ళతో తలెత్తి చూసాడు మాధవ్.

బారు శ్రీనివాసరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *