చూపరుల మనసు దోచే ‘బాల్డా’ గుహలు

Spread the love

గుత్తుల పుట్టు సంత గ్రామంతో పాటు పసరు మందు ఇచ్చే గంప రాయి, కీళ్ళ నొప్పులకు, విరిగిన ఎముకలకు పసరు మందు ఇచ్చే జింద గడప, బ్రిటీష్ వారి కాలంలో ఆనాటి బ్రిటీష్ అధికారుల వసతి కోసం నిర్మించిన బంగ్లాలు శిథిల దశలోనైనా ఇంకా మిగిలివున్న గ్రామం అయిన ఎండ్రిక పర్వతం, అరవ కొండ, పెద్ద బయలు గ్రామాల మీదుగా బాల్డా గుహాలకు సాగాము. పెద్ద బయలు గ్రామంలోని ఓ హోటల్ లో భోజనాలు, మంచినీళ్ళ సీసాలు కొని కారులో పెట్టుకున్నాము.


జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత అయిన ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి కొదు జాతి గిరిజనుల జీవితాన్ని గురించి వ్రాసిన నవల ‘అమృత సంతానం’. ఇది 1955లో మొట్ట మొదటి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్న మహత్తర నవల. ఈ నవలను పురిపండా అప్పలస్వామి గారు తెలుగులో అనువదించారు. అంత గొప్ప నవలలో ఈ పెద్ద బయలు గ్రామ ప్రస్థావన మనకు కనబడుతుంది. ఈ రోజు అక్కడ సంత కూడా జరుగుతుంది. మేము సంతలో కొద్ది సేపు తిరిగి చూశాము. నేను, మురళీధర్ గారు ఆ నవలను గురించి చాలాసేపు మాట్లాడుకున్నాము.


భోజనాలు తీసుకుని మరికొంత ముందుకు వెళ్ళిన మేము ఆంధ్ర , ఒడిస్సా రాష్ట్రాలను వేరు చేస్తూ ప్రవహిస్తున్న మత్స్య గెడ్డ మీది బ్రిడ్జ్ మీదుగా ఒడిస్సాలో ప్రవేశించాము. అక్కణ్ణుండి నేరుగా అరడకోట జలపాతం దగ్గరికి చేరుకున్నాం. అది రెండు ఎత్తైన కొండల మధ్యనున్న లోయలో సన్న పాయగా కిందికి దూకుతుంది. కారు వెళ్ళి, మాకు కుడి పక్కనున్న కొండ అంచున ఆగింది. వెంటనే కిందకు దిగిన విధ్యార్ధులు ఆ పక్కనే వున్న సన్నని, ఎగుడు డుగుడు కాలిబాట గుండా కిందకు దిగుదామని బయలు దేరారు. నేనూ వాళ్ళను అనుసరించాను. కానీ, మురళీధర్, అమిత్ గార్లు “అంత రిస్క్ తీసుకుని కిందకు దిగినా, ఎక్కేటప్పుడు మనకు చాలా కష్టం అవుతుంది. వెనక్కి తిరిగి వెళ్ళి దూరం నుండే చూసి వెళ్దాం” అంటూ సూచించారు. ఇహ దాంతో మేము వెనుదిరిగివచ్చి కారెక్కాము. వాళ్ళు చెప్పినట్టే కొంత దూరం వెనక్కి వెళ్ళి జలపాతాన్ని కొంతసేపు చూసి తిరిగి కారెక్కాము.


మధ్యాహ్నం రెండు గంటలకు పడువా గ్రామం చేరుకున్నాం. ఆ రోజక్కడ సంత జరుగుతుంది. నేనీ మధ్యకాలంలో ఇంత పెద్ద సంతను చూడడం ఇదే మొదటిసారి. కాకపోతే అక్కడ కారు దిగి తిరిగి చూడడానికి సమయం లేకపోవడంతో, కారులోనే వుండి మెల్లగా చూసుకుంటూ ముందుకు సాగిపోయాము.
కొంతదూరం వెళ్ళిన తరువాత రోడ్డు పక్కనున్న ఓ పెద్ద పనస చెట్టు కింద కూర్చుని భోజనాలు చేశాము. భోజనాల తరువాత అర గంట పాటు ప్రయాణం చేసి, మేము ఏ గుహాలనైతే చూడాలని వచ్చామో ఆ బాల్డా గుహాల దగ్గరికి చేరుకున్నాము. గుహ చూడడానికి చిన్నగానే వున్నప్పటికీ వీక్షకుల మనసును ఆకట్టుకునేటట్టుగా వుంది. గుహకు ఓ మూలన పైభాగంలో పెద్ద బండి చక్రమంత రంద్రముంది. దానిలో నుండి గుహలోకి మంచి గాలి, వెలుతురు వస్తుంది. గుహలోపల స్థానిక ప్రజలు ‘డోంగర్ దేయ్’ అని పిలుచుకునే రెండున్నర, మూడు అడుగుల ఎత్తున అందంగా అలంకరించబడి వున్న అమ్మవారి విగ్రహం కొలువుదీరి వుంది. గుహ పై భాగానికి వెళ్ళేందుకు బయటి వైపు నుండి మెట్లు కూడా వున్నాయి.


మరొక మాటలో చెప్పాలంటే గుహ కన్నా, గుహ వున్న కొండ కింది దృశ్యాలు మనోజ్ఞంగా కన్పిస్తుంటాయి. అట్లా కొంతసేపు అక్కడ గడిపిన మేము తిరిగి కారెక్కి అంతకన్నా ఎత్తున వున్న నాగేశ్వరీ హిల్ మీదకు వెళ్ళాము. అయితే, అక్కడికి వెళ్ళిన దాకా నాకు తెలియదు. అక్కడ మహాధ్బుతమైన దృశ్యాలున్నాయని. చుట్టూ కనుచూపు ఆనినంత మేర, చంద్ర గ్రహం యొక్క ఉపరితలాన్ని మరిపింపజేస్తూ విశాలమైన సమతల పీఠ భూమి దర్శనమిచ్చింది. ఆ మైదానం అంతటా చంద్ర మండలం మీద ఉన్నట్టుగానే చిన్న చిన్న రాళ్ళున్నాయి. వాటికి అదనంగా ఎండి పోయిన స్వర్ణ వర్ణ ‘చీపురు ముల్లు’ గడ్డి నేత్ర పర్వంగా వుంది. అక్కడ నిలబడి పడమర దిశకు తిరిగి చూస్తే దూరంగా ఎక్కడో నాకు పేరు తెలియని నది ఒకటి పాయలు పాయలుగా చీలి, ఏ దూర తీరాలకో సాగిపోతుంది. ఆ నీటిలో అస్తమించబోతున్న దినకరుడు తన తేజస్సును కోల్పోతూ వెలువరిస్తున్న ముదర పండిన నారింజ పండు వర్ణం ప్రతిబింబిస్తుంది. ఆ దృశ్యం చూడడానికి మన భౌతిక నాయనాల శక్తి సరిపోదు. కానీ, మనో నేత్రాలతో చూడగల శక్తి వున్న చూపరులను అమర లోకాల్లోకి తీసుకుపోతున్న భ్రాంతికి గురి చేస్తుంది.
పశ్చిమాద్రిని నెలకొన్న ఆ నిరుపమాన ప్రాకృతిక సౌందర్యతరంగాలలో కొట్టుకుపోతున్న నన్ను మురళీధర్ గారు తన పిలుపుతో తిరిగి వాస్తవ ప్రపంచంలోకి తీసుకొచ్చారు.


ఆ గిరుల శిరస్సు పైన నెలవై వున్న మైదానాన్ని విభ్రమంగా చూస్తూ తూర్పు దిశగా ముందుకు సాగిన మమ్ములను మరింత మంత్ర ముగ్దులను చేస్తూ ఓ పెద్ద తటాకం కనులకు విందుగా దర్శనమిచ్చింది. అరవిరిసిన పుష్పవనాన్ని గమనించిన తేనెటీగలు పూలలోని మకరందాన్ని గ్రోలడాని ఝం కారం చేస్తూ తోట దిశగా దూసుకుపోయినట్టు మేమంతా కొలను దిశగా పరుగులు తీశాము.


కొలనుకు దక్షిణం ఒడ్డున కూర్చున్న ఓ ఇద్దరు వ్యక్తులు గాలాలతో చేపల వేటను కొనసాగిస్తుండడం చూసిన నేను “ఏమిటిది!? ద్వాపరంలో ‘కురు’ వంశ నాశనానికి కేంద్రబింధు వైన నాటి మయసభ తదనంతర కాలంలో ఈ ఓండ్ర దేశానికి తరలివచ్చి, ఈ నాగేశ్వరీ పర్వతాగ్రాన తిష్ట వేయలేదుకదా!?” అన్న చిత్త భ్రమణానికి లోనయ్యాను.


ఇంతలో త్వరలోనే జీవిత భాగస్వాములు కాబోతున్న ఓ యువ జంట మందీ మార్భలంతో ఇంత పైకి తరలి వచ్చి వివాహానికి ముందు ( ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ పేర) ఆ కొలను చుట్టూ చెట్టా పట్టాలు వేసుకుని, ఒకరి భుజం మీద, ఒకరు మార్చి మార్చి తలలు వాల్చుకుంటూ, ఊసులాడుకుంటూ వయ్యారంగా నడుస్తుంటే ఒడ్డునున్న ఫోటో గ్రాపర్స్, డ్రోన్ సాయంతో ఫోటో షూట్ చేస్తున్నారు. ఆ హంగామా చూస్తుంటే ఆ క్షణంలో అక్కడే, వారి వివాహ తంతు జరుగుతున్నట్టుగా అన్పించ సాగింది.


పడమర గాలికి కొలనులోని తరంగాలు తూర్పు దిశగా సాగిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన నా మనస్సులో ఇది మామూలు కొలను కాదు. భారత్, టిబెట్, చైనా దేశాల ఉమ్మడి సరిహద్దుల్లో నెలకొని వున్న పరిశుద్ధ జలాపూరితమైన ‘మానస సరోవరమా’ అన్న భావన మనసులో మొల్చుకొని వచ్చి క్షణ క్షణానికి ధృడంగా విస్తరించ సాగింది. ప్రతి నిత్యం కలికీ గాంధారి వేళ దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరో భామినులు ఓండ్ర దేశంలోని ఈ కొలనులో స్నానించి వెళతారేమో అనిపించ సాగింది.


ఆ కొలను పరిసరాల్లో అట్లా ఎంతో సేపు కల తిరుగుతూ చిన్న పి‌ల్లల మాదిరిగా గెంతులు వేశాము. మా సందట్లో మేము వుండగానే, వయసుడిగిన కర్మసాక్షి మెల్లగా పడమటి మేఘాల తలుపులు వేసుకుని కనుమరుగవ్వసాగాడు. దాంతో కొండల మీద, చీకటి వలయాలు, వలయాలుగా ముసురుకోసాగింది. ఒక్కసారిగా ఆ మార్పును గమనించిన మేము వెంటనే మా వాహనాన్ని అధిరోహించాము.


పడమర దిశగా కొండ మీదికి ఎక్కిన మా వాహనం తూర్పు దిశగా కిందికి దిగసాగింది. ఆ అసుర సంధ్యవేళ కొండ మీద నుండి కిందకు చూస్తుంటే, సప్తవర్ణ శోభతో భూ మాత అద్వితీయంగా మెరిసిపోతూ దర్శనం ఇవ్వసాగింది. ఆ అమ్మ ఒడిలోకి త్వరగా చేరుకోవాలన్నట్టు మా కారు మరింత వేగాన్ని పుంజుకుంది. కారు నేల మీదికి చేరుకుని ముందుకు సాగుతుండగా వెను దిరిగి ఆ నాగేశ్వరీ కొండకు మనస్సులోనే నమస్కారాలు అందజేసుకున్నాను.
సకాలంలో మజిలీకి చేరాలన్న తలంపుతో తిరుగు ప్రయాణం వేగంగా సాగి సుమారు ఆరు గంటల వేళ మా వాహనం వెళ్ళి మత్స్యలింగేశ్వర ఆలయం ముందర ఆగింది. మేము వెంటనే కారు దిగి గబగబా గుడి దగ్గరికి నడిచాము. అప్పటికే గుడికి తాళాలు వేసి వున్నాయి. ‘అయ్యో’ అనుకున్న మేము వెంటనే మత్స్యగెడ్డ వైపుగా పరుగు తీశాము. గెడ్డను దాటడానికి నిర్మించిన చిన్న వంతెన మీదకు చేరిన వెంటనే గెడ్డకు సంబంధించిన అందమైన దృశ్యాలను ఫోటో తీసుకున్నాము. చీకటి ముదిరి పోవడంతో గెడ్డ నీళ్ళల్లో ఎక్కడా చేపల జాడ కనబడక పోవడంతో నేను మనసులోనే “అయ్యో! ఇంత కష్టపడి వచ్చినా ఫలితం దక్కలేదే?” అనుకున్నాను.


ఇంతలో..
కిందకు వస్తూ వస్తూ దిలీఫ్ గారు, తను కొనుక్కొచ్చిన మరమరాల పొట్లాన్ని విప్పి, అందులో వున్న మరమరాలను నీళ్ళలో వున్న బండల మధ్యలోకి విసరగానే ఒక్కొక్కటిగా చాలా చేపలు నీళ్ళ పైకి దూసుకొచ్చి క్షణాల్లో ఆ మరమరాలను తినేశాయి. అదే సమయంలో రఫీ అనే విధ్యార్ధి ఆ మత్స్య గెడ్డ పౌరాణిక గాధను, ఇటీవల కాలంలో అక్కడ రెండు మతాల మధ్య జరిగిన గొడవనూ క్లుప్తంగా వివరించాడు.
తిరిగి కారెక్కిన మేము 07.00 గం.ల కల్లా పాడేరు బస్టాండ్ లో మురళీధర్ గారిని దించి మిగిలిన వాళ్ళమంతా ఎవరి మజిలీకి వాళ్ళము వెళ్ళిపోయాము.
ఒకే రోజు రెండు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించానన్న సంతోషంతో నేనెంతో పొంగిపోయాను.

సిరంశెట్టి కాంతారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *