గైడెడ్ టూర్ అండర్ ది బ్రిడ్జెస్ ఆఫ్ స్టాక్ హోమ్ సిటీ
నీటి పై తేలియాడే నగరంలా కనిపించే నగరం స్టాక్ హోమ్ అనేక ద్వీపాల సముదాయం. ప్రత్యేకమైన భౌగోళిక నిర్మణంలో ఉన్న ఓ పచ్చని నగరం. ఉత్తరాది వెనిస్ గా ప్రసిద్ధి చెందిన నగరం. గైడెడ్ టూర్ అండర్ ది బ్రిడ్జెస్ ఆఫ్ స్టాక్ హోమ్ సిటీ చేయకపోతే స్టాక్ హోమ్ నగర అద్భుతమైన ప్రకృతిని, అది అందించే సుందర దృశ్యాలనే కాదు ఇంకా చాలా మిస్అం అయినట్లే. అవును, స్టాక్ హోమ్ నగరం సౌందర్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాల సమ్మేళనం.
మేం స్టాక్ హోమ్ చేరకముందే మా ప్రోగ్రాం షెడ్యూల్ అయిపోయింది. ఆ షెడూల్ ప్రకారం ఈ రోజు (2005 అక్టోబర్ 15) వెళ్ళాల్సింది గైడెడ్ టూర్ అండర్ ది బ్రిడ్జెస్ ఆఫ్ స్టాక్ హోమ్ సిటీ మొదలైంది.
ఈ టూర్ కేవలం ఒక పర్యటన కాదు. స్టాక్ హోమ్ జలమార్గాల గుండా, చారిత్రక వంతెనల కిందనుంచి ద్వీపాల మధ్య సాగిన ఒక ఆత్మీయ ప్రయాణం, అద్భుతమైన, ప్రత్యేకమైన అనుభవం.
అనుకున్న ప్రకారం ఆ ఉదయం అందరం గమ్లాస్థాన్ చేరుకున్నాం. గమ్లాస్థాన్ పర్యాటక కార్యాలయంలో టికెట్ తీసుకున్నాం. ఇక్కడ అనేక ప్రైవేట్ పర్యాటక కార్యాలయాలు ఉన్నాయి . రకరకాల టూర్ ప్యాకేజీలతో సాయంత్రం సూర్యాస్తమయం వరకు క్రూయిజ్ లను ఆస్వాదించేలా ఏర్పాట్లు ఉన్నాయి. మేం ఎంచుకున్నది అండర్ ది బ్రిడ్జెస్ ఆఫ్ స్టాక్ హోమ్ సిటీ. ఫెర్రీ లో నగర ద్వీపాలను, చారిత్రక వంతెనలను దాటుతూ స్టాక్ హోమ్ ఆత్మను అనుభవించే గొప్ప అవకాశం.
ఆర్కిపెలాగో (గ్రేటర్ ) స్టాక్ హోమ్ లో మొత్తం 30వేలకు పైగా ఐలాండ్స్ ఉన్నాయి. ప్రధానంగా 14దీవులపై నగర ప్రధాన భాగాలున్నాయి. అవి ఒకదానికొకటి 50 వంతెనలతో అనుసంధానమై ఉన్నాయి. ఫెర్రీ లో మా ప్రయాణం మేలరాన్ సరస్సు నుంచి బాల్టిక్ సముద్రం వరకు, 12 వంతెనల కింద, రెండు లాక్స్ గుండా సాగింది. ( మేలరాన్ సరస్సు బాల్టిక్ సముద్రంలో కలుస్తుంది)
విభిన్న కోణాల్లో కనిపించే స్టాక్ హోమ్ నగరంలోని ప్రధాన జల మార్గాలైన కేంద్ర ప్రాంతం , పాత నగరం గమ్లాస్థాన్, రాయల్ ప్యాలస్, సిటీ హల్, సూదర్ మామ్, లిల్లా , స్టోర ఎస్సింగేన్, హమ్మర్బీ, గ్రీన్ ఐలాండ్ వంటి ప్రదేశాల ఒక రంగుల చిత్రంలా కనువిందు చేశాయి. గైడ్ ఇంగ్లీష్ , స్వీడిష్ , ఫిన్నిష్ భాషలలో చరిత్ర , పురాతన భవనాల , కట్టడాల గురించి వివరించాడు. 1935 లో నిర్మించిన వాస్టర్ బ్రోన్, ట్రానెబెర్గ్స్ బ్రోన్ వంతెనల గురించి అతని కథనం ఆసక్తికరంగా ఆకర్షణీయంగా సాగింది.
బోట్ లో కాఫీ , కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. బోట్ ఓపెన్ బోట్ కాదు, చుట్టూ గ్లాస్ తో కవర్ చేసి, చలికాలంలో హీటర్ తో , ఏడాది పొడవునా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడింది. వీల్ చైర్ కు అనుకూలంగా ఉండటం, రెస్ట్ రూమ్ సౌకర్యం ఉండటం నన్ను ఆశ్చర్యపరిచాయి. ఫెర్రీ లో అటువంటి సౌకర్యం ఉంటుందని నేనెప్పుడూ వినలేదు. నిజానికి జలమార్గాల్లో ప్రయాణం, ఆ ప్రయాణ సాధనాల గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. కారణం నేను నివసించే ప్రాంతంలో ఆ అవసరం లేకపోవడమే.
ప్రకృతి అందాలు వర్ణనాతీతం. ఎటు చూడాలో ఏది కళ్ళ నిండుగా నింపుకోవాలో అర్థం కాదు. ప్రతి దృశ్యం, ప్రతి క్షణం ఆస్వాదించా ల్సిందే. అనుభవించాల్సిందే. మాటలలో పొడగడం కష్టం. సెలయేళ్లు, కొండలపై రంగురంగుల ఆకులతో చెట్లు వాటి మధ్య నుంచి తొంగి చూసే అందమైన భవనాలు.. బహుశా ఆకురాలు కాలం కావచ్చు చెట్ల ఆకులు వివిధ వర్ణాలతో కనువిందు చేస్తూ… ఆ విషయమే పక్కన ఉన్న బిర్గిట్ ని అడిగాను. అవునని చెప్పింది. ఆకురాలు కాలంలో చెట్లు రంగు రూపు మార్చుకుంటాయిట. మరి కొద్ది క్షణాల తర్వాత గైడ్ కూడా అదే విషయం చెప్పాడు.
గమ్లాస్థాన్, రాయల్ ప్యాలెస్, సిటీ హల్, సూదర్ మామ్,వంటి చారిత్రాత్మక భవనాలు రంగురంగుల్లో .. అక్కడక్కడా ఎండ , మేఘాల నీడలు పరుచుకుని ఎండ పడి వింత సోయగాలు పోతున్నాయి.
అడవుల్లా పెరిగిన చెట్ల మధ్య అందమైన భవనాలు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లు. కొన్ని ఏటవాలు పైకప్పుతో ఉన్న ఇళ్లు. స్వచ్ఛమైన నీటిలో షికారుచేసే బోట్ లు . చిన్న చిన్న ఐలాండ్స్. కొండల్ని తొలుచుకుని చేసిన మార్గాల గుండా పరుగులు పెట్టే మెట్రో రైళ్లు . వాటినక్కడ tunalbana అంటారు. వాటిపై నుంచో లేదా పక్కనుంచో బస్సు మార్గాలు. మేము విహరిస్తున్న జలాల కింద ఉన్న టన్నెల్స్ నుంచి దూసుకుపోయే మెట్రో రైళ్లు, బస్సులు, కార్లు వగైరా వగైరా వాహనాలు .
స్టాక్ హోం జనాభా దాదాపు రెండు మిలియన్లు. అంటే మన మాటల్లో చెప్పాలంటే ఇరవై లక్షల జనాభా. మన హైదరాబాదు కంటే చాలా తక్కువ జనాభా ఉన్న నగరం.
సహజ వాతావరణానికి, జీవవైవిధ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చే స్టాక్ హోమ్ నగర వైకింగ్ మూలాలు, మధ్యయుగ చరిత్ర, ఆధునిక సంస్కృతి గురించి గైడ్ పర్యాటకులను ఉద్దేశించి ఓ కథలాగా చెప్పుకుపోయాడు.
గమ్లా స్థాన్ అంటే పాతబస్తీ లోని రాతి రోడ్లు, 17 వ, 18వ శతాబ్దపు పురాతన భవనాలు అంతకు ముందే చూసాను. ఆ రాతి రోడ్లలో తిరిగాను. అయితే చరిత్ర గురించి ఆసక్తికరంగా చెప్పాడు గైడ్ . 13 శతాబ్ది నాటి మధ్యయుగపు వాతావరణం కలిగి ఉంటుంది. స్టాక్ హోమ్ పుట్టిన స్థలం అది. 1252 లో బిర్గర్ జార్ల్ స్టాడ్స్ హోల్మన్ దీవిపై ఉంది. ఇది స్వీడన్ రాజకీయ , వాణిజ్య , సామాజిక కేంద్రం.
గమ్లాస్థాన్ రాతి రోడ్లు , రంగురంగుల భవనాలు , చారిత్రక స్థలాలు , శక్తివంతమైన సాంస్కృతిక జీవనంతో పర్యాటకులను ఆకర్షిస్తుందని గైడ్ చెప్పిన దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇరుకైన వంకరటింకర రాతిరోడ్లు లోపలి కూరుకుపోయినట్లు కనిపించే పురాతన భవనాలను , ఆర్ట్ గ్యాలరీలను , షో అక్కడ చూశాను . ఇక్కడ సాంప్రదాయ స్వీడిష్ చేతి వస్తువులు , స్మారక చిహ్నాలు , యాంటిక్ లు దొరికే దుకాణాలు చాలా ఉన్నాయి . కేఫ్ లు , రెస్టారెంట్లకు లకు కూడా కొదువ లేదు. గమ్లాస్థాన్ స్టాక్హోమ్ నగర హృదయం అనొచ్చు.
రాయల్ ప్యాలస్ : 600 పైగా గదులతో ఇది యూరోప్ లోని అతిపెద్ద ప్యాలెస్ లలో ఒకటి. స్వీడన్ రాజవంశపు అధికారిక నివాసం అయినప్పటికీ రాజు డ్రాటినింగ్ హోల్మ్ ప్యాలెస్ లో నివసిస్తున్నాడు. రాయల్ అపార్టుమెంట్స్ , ట్రెజరీ , మ్యూజియం వంటివి సందర్శించవచ్చు .
ప్రతి రోజు గార్డులు డ్యూటీ మారే సమయం (12. 15) ఒక వేడుకలా ఉంటుందట . అది ఒక ప్రసిద్ధ ఆకర్షణ.
నోబెల్ మ్యూజియం లో నోబెల్ బహుమతి గ్రహీతల చరిత్ర, ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవిత చరిత్ర తెలియజేస్తుంది . చారిత్రక వస్తువులు సందర్శకులను ఆకర్షిస్తాయి
గమ్లాస్థాన్ హృదయంగా భావించే ఒక స్క్వేర్ రంగు రంగుల భవనాలతో అలరిస్తుంది. ఇక్కడ క్రిస్మస్ మర్కెట్స్ , కేఫ్ లు ఆకర్షిస్తాయి. అయితే ఇక్కడ 1520లో స్టాక్ హోమ్ ఊచకోత జరిగింది. 80-90 మంది ఉన్నత స్థాయి వ్యక్తులను డానిష్ రాజు ఊచకోత కోశాడు.
స్టాక్ హోమ్ కేథడ్రాల్ 13 శతాబ్దపు రాజవంశం వారి పట్టాభిషేకాలు, పెళ్లిళ్లకు వేదిక. సెయింట్ జార్జ్ , డ్రాగన్ చెక్క విగ్రహం చారిత్రక కళాఖండాలు అక్కడ ఉన్నాయి.
గమ్లాస్ఠాన్ స్టాక్ హోమ్ చరిత్ర , సంస్కృతి ఆకర్షణలను ఒకే చోట కలిపి చూపిస్తుంది
దాదాపు రెండు గంటలు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంట వరకు నీటిలో మా విహారం అద్భుతంగా సాగింది. మాకు గొప్ప ఆనందాన్నిచ్చిన అనుభవాన్ని ఇచ్చిన ఈ యాత్రను ఏర్పాటు చేసింది మిస్టర్ కై.
నేను, లవణం గారు, సుందర్, బిర్గీట్ , యూహా, అన్నేల్లి, కై మొత్తం ఏడుగురం సెలయేళ్ళలో విహరిస్తూ లాక్స్ ఎత్తిన తర్వాత వెళ్తున్న ఓడను చూశాం. ఆ తర్వాత లాకులు మూసుకోవడం భలే ఉంది. మేం ప్రయాణించిన సెలయేటి కింద నుంచి పరుగులు పెట్టే మెట్రో రైళ్లు , వివిధ వాహనాలు వంటివన్నీ సాంకేతికత ఫలితమే కదా!
మనం కారులోనో , కాలినడకనో , బైక్ పైనో వెళ్తే చూడలేనివి జలమార్గంలో చూడవచ్చు . ఫెర్రీలు పీక్ సీజన్ లో చాలా రద్దీగా ఉంటాయి . వీల్ చైర్ కి అనుకూలంగా ఉండటం చాలా గొప్పగా అనిపించింది.
మా విహారం అంతా నీటిపైనే జరిగినప్పటికీ ఒంటి గంట అయేసరికి మాకు ఆకలి మొదలైంది. మమ్మల్ని మిస్టర్ కై ఓ కొండపైన ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు.
భోజనం చేస్తుండగా కై తన జీవితం గురించి చెప్పాడు. జ్యూయిష్ వ్యక్తిగా, నాన్ క్రిమినల్ గా క్రిస్ లో పనిచేయడం వల్ల ఎదుగుదల లేకుండాపోయిందని వాపోయాడు. అతని మాటల్లో చాలా సార్లు తాను జ్యూయిష్ జాత్యహంకారం కనిపించింది. అకస్మాత్తుగా నా వైపు చూస్తూ మీకు పిల్లలున్నారా అని అడిగాడు. ఇద్దరు పిల్లలు అని చెప్పాను.
ఆ వెంటనే పెళ్లయిందా అని మరో ప్రశ్న.
మామూలుగా అయితే ఇదేం ప్రశ్న అని చెంప చెళ్లుమనిపించేదాన్నేమో .. కానీ పాశ్చాత్య దేశాల సంస్కృతి సంప్రదాయాల గురించి స్పాన్సర్షిప్ ఆఫీసర్ గా పనిచేసిన నాకు బాగా తెలుసు. అందువల్ల ఆ విధంగా స్పందించలేదు. చిన్నగా నవ్వుకుంటూ అయిందని చెప్పాను. ఆ తర్వాత అతనికి అర్థమయ్యే విధంగా పెళ్లి, ఆ తర్వాత పిల్లలు అని మన సంస్కృతి అని వివరించాను.
ఇప్పుడు నన్ను అడిగినట్లు మా దేశంలో అడిగితే చెంప చెళ్లుమనిపిస్తుంది ఏ అమ్మాయయినా అని నిదానంగా చెప్పాను . కై మొఖం ఎర్రగా కందిపోయినట్లుగా కందగడ్డలాగా తయారైంది.
కొన్ని క్షణాల మౌనం తర్వాత, తనకు 56 ఏళ్ళని, భారతీయ యువతిని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉందని చెప్పాడు కై. భారతీయ స్త్రీల వినయం, భర్తను గౌరవించే సంప్రదాయం తనను ఆకర్షించాయని అవి భారతీయ కుటుంబ వ్యవస్థను నిలబెట్టాయని తన అభిప్రాయంగా చెప్పాడు. అందుకే తన జీవిత భాగస్వామిగా భారతీయ మహిళ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
రత్న ఫిన్నిష్ వ్యక్తి పెర్తి ని చేసుకోవడం గురించిన పూర్వాపరాలు వివరించారు లవణం గారు.
భోజనానంతరం విడిపోయాం.
లవణంగారు, బిర్గిట్ శ్రీలంక నుంచి వచ్చిన డెలిగేట్స్ ని కలవడానికి వెళ్లారు. బిర్గిట్ గాంధీయిజం మీద పరిశోధన చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థిని. లవణం గారి అభిమాని.
మధ్యాహ్నం మూడు గంటలకు మార్క్ మమ్మల్ని స్లుసేన్ లో కలిశాడు. సుందర్, యూహ , అన్నేల్లి, నేను వస్తూ వస్తూ ICA స్టోర్ లో కావలసిన వస్తువులు కొనుక్కొని మా బసకు చేరుకున్నాం .
మా యాత్రను శాశ్వతం చేసిన ఫోటోలు ప్రస్తుతం నా దగ్గర లేవు కానీ స్టాక్ హోమ్ నగర అందాలు , చరిత్ర , సంస్కృతి నా హృదయంలో శాశ్వతంగా నిలిచాయి.
కాస్మొనోవా
అక్టోబర్ 16వ తేదీ మేం కాస్మొనోవాకి వెళ్ళాలి. లవణం గారు రానన్నారు. నేను సుందర్, యూహ, అన్నేల్లి తునల్ బనలో (మెట్రో ) లో బయలుదేరాం. దేశంలో పెద్ద కాస్మొనోవా కి తీసుకెళ్తున్నాం అని అన్నేల్లి అన్నప్పుడు అది ఒక ప్లానిటోరియం కావచ్చు అనుకున్నాను. కానీ ఎవరిని అడగలేదు.
తీరా వెళ్లిన తర్వాత చూస్తే స్వీడిష్ నేషనల్ మ్యూజియం బోర్డు కనిపించింది. ఆ తర్వాత తెలిసింది అదే ఆవరణలో IMAX సినిమా డోమ్, ప్లానిటోరియం ఉన్నాయని.
స్టాక్ హోమ్ సిటీకి చాలా దూరంగా స్టాక్ హోమ్ యూనివర్సిటీ కి దగ్గరలో ఉంది ఫ్రెస్కాటివాగెన్ కి రాగానే యూహా మమ్మల్ని అక్కడే ఉండమని చెప్పి పది నిముషాల్లో వచ్చాడు.
మా చేతిలో ఐమాక్స్ లో సినిమా టికెట్స్ చేతిలో పెట్టి అన్నేల్లి, యూహ పని ఉందంటూ బయటికి వెళ్లిపోయారు.
ఐమాక్స్ లో సినిమా కి ఇంకా సమయం ఉంది. ఈ లోగా మ్యూజియం చూశాం. మానవ పరిణామం, మానవ శరీర శాస్త్రం, పక్షులు , జంతువుల పరిణామం , వివిధ రకాల రాళ్లు ఏర్పడటం, వాటి రకాలు , ఖగోళం, వాతావరణం వంటి ఎన్నో విషయాలు సులభంగా అర్థమయ్యేలా సహజంగా ఉండే విధంగా ప్రదర్శించారు.
ఇంగ్లీషు, స్వీడిష్ భాషల్లో వాటి సమాచారం తెలుసుకునే ఏర్పాటు చేశారు.
ఐమాక్స్ లో వైకింగ్స్ సినిమా చూశాం. ఆ సినిమా ద్వారానే మొదటిసారి వైకింగ్స్ అనే సముద్రపు దొంగల గురించి తెలుసుకున్నాను. భారీ తెరపై ఉత్కంఠభరితమైన వైకింగ్స్ చూడడం మర్చిపోలేని అనుభవం.
సినిమా తర్వాత విండో షాపింగ్ చేశాం. ఏ వస్తువు చూసినా చాలా ఖరీదు, మనం కొనే రేంజ్ లో ఒక్కటి కూడా కనిపించలేదు. ఈలోగా అన్నేల్లి, యూహ వచ్చి మమ్మల్ని స్లుస్సెన్ లో వదిలి పని ఉందంటూ వెళ్లిపోయారు.
వెంకట్ గారు వచ్చి మమ్మల్ని భోజనానికి తీసుకెళ్లారు. అప్పటికే సమయం 3. 45 అయింది. లోపల ఆకలి దంచేస్తున్నది. నాన్ వెజ్ తింటారు కదా అని నాన్ వెజ్ రెస్టారెంట్ కి తీసుకెళ్లారు.
ఆ భోజనం ఆ రుచి ఇప్పటికి మరచిపోలేదు. భగభగ మండే నిప్పులు పైన ఇనుపఊచకు గుచ్చిన చికెన్, మటన్ కోన్ ఆకారంలో రెండు గుత్తులుగా వేలాడుతూ. ఆ వేడికి ఉడికి నూనెచుక్కలు కిందకు కారుతూ .. ఆర్డర్ ని బట్టి సర్వ్ చేస్తూ..
దాన్ని షావర్మ అంటారని, మిడిల్ ఈస్ట్ వంటకం అని వెంకట్ గారు చెప్పారు. పొరలు పొరలుగా పేర్చి ఊచకు గుచ్చిన గుత్తినుంచి కత్తిరించి మా ముందు పెట్టారు. నేను చికెన్ తీసుకున్నాను. అసలే ఆకలి మీద ఉన్నానేమో వేడివేడిగా తెచ్చి పెట్టిన ఆ ఫుడ్ ఆవురావురంటూ తినేశా. రుచి నేను ఎప్పుడు ఎరగని రుచి, ఆ కొత్త రుచి నా మనసు దోచింది.
భోజనం ముగించి బయటికి వచ్చేసరికి 5 గంటలు. వెంకట్ గారు మమ్మల్ని మా మకాం కు చేర్చారు.
వైకింగ్స్, షావర్మా నా హృదిలో శాశ్వతంగా నిలిచిపోయాయి.









