21ఏప్రియల్, 2024 యధావిధిగానే మా దంపతులం ఉదయం నాలుగ్గంటలకల్లా లేచి కాలకృత్యాలు, స్నానాదులు పూర్తిచేసుకుని కూర్చున్నాము. మిగతా మిత్రులంతా ఒక్కొక్కరే లేచి మెల మెల్లాగా తయారవ్వసాగారు.
నేను మెల్లగా ఏడు గంటలకు రూమ్ లో నుండి బయటకెళ్ళాను. రుఖేష్ అంతకు ముందే లేచి, బజారు కెళ్లొస్తానంటూ ఎటో వెళ్ళాడట! హోటల్ బైట కెళ్లి చూస్తే రాత్రి మే మొచ్చిన బస్సు స్థానంలో రెండు సెవెన్ సీటార్స్ వాహనాలోచ్చి హోటల్ ముందు ఆగున్నాయి.
సుబ్బారావు గారు వాళ్ళు రుఖేష్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా “దగ్గర్లోనే వున్నాను.
వస్తున్నాను” అంటూ బదులిస్తున్నాడు తప్ప రావడం లేదన్నారు. నేను ఫోన్ చేసినా అతని నుండి అదే సమాధానం రావడంతో చేసేదేమీలేక మెల్లగా నడుచుకుంటూ ఆ చుట్టు పక్కల వీధులను చుట్టి వచ్చాము.
మహా పండితుడు, సాహిత్య జగత్తులో ధ్రువతార, స్వాతంత్ర్య సమరయోధుడు , నిబద్ధత గల కమ్యూనిస్ట్ యోధుడు, ప్రపంచ పర్యాటకుడు అయిన రాహుల్ సాంకృత్యాయన్ భార్య కమలా సాంకృత్యాయన్ ది ఈ ‘కాలింగ్ పాంగ్’ పట్టణమేనన్న ఎరుక వున్న నేను ఆ ఊళ్ళో తిరిగానన్న సంతృప్తికి లోనయ్యాను.
హోటల్లో తాజా పూలతో అలంకరించిన ధ్యాన ముద్రలోవున్న బుద్ధ భగవాన్ ని విగ్రహం పరమ ప్రశాంతంగా దర్శన మివ్వడంతో మేమంతా అక్కడ ఫోటోలు దిగాము. ఫలహారం తయారు కావడానికి మరికాస్త సమయం పడుతుందని హోటల్ వాళ్ళు చెప్పడంతో నేను సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు మరికొందరు మహిళలు హోటల్ వెనుక భాగంలో వున్న గార్డెన్ చూడడానికి వెళ్ళాము.
మేము తోటలో నుండి తిరిగొచ్చేసరికి రుఖేష్ కూడా వచ్చేశాడు. మామంతా వెంటనే కాఫీ, ఫలహారాలు చేసుకుని బయట కొచ్చేసరికి మా లాగేజ్ మొత్తం తీసుకొచ్చి వాహనాల మీద సర్ధి కట్టేశారు.
మరికొద్ది సేపటి తరువాత మమ్ముల్ని ఎక్కించుకున్న వాహనాలు డార్జిలింగ్ బాట పట్టాయి. ఊరు దాటుతూనే రోడ్డుకు రెండు పక్కలా అద్భుతమైన, ముగ్ధత్వంతో కూడిన అడవి. ఆ అడవి సుందరి కప్పుకున్న మేలిమి జలతారు దుపట్టా మాదిరి, స్నిగ్ధ సౌందర్యంతో మెరిసిపోతున్న ధూమ్రవర్ణపు మంచు, తెరలు తెరలుగా నేలకు దిగుతుంది. ఆ మంచుతెరల మధ్య దూరంగా కొండల పైన కొలువుదీరిన చిన్న చిన్న పల్లెలు. కొద్దిపాటి వ్యవసాయ కమతాలు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ నిసర్గ సౌందర్యాన్ని కంటితో చూసి, గుండెల నిండుగా ఆస్వాదించడమే తప్ప దాన్ని అక్షరాల ఆసరాతో మాటలుగా మల్చి వర్ణించలేని అశక్తతతో నేను స్థబ్ధీభూతుణ్ణై మా వాహనంలోనే అలా కూర్చుండి పోయాను. రోడ్డు పొడవునా కొండల మీదుగా కిందికి దుముకుతున్న సన సన్నని జలపాతపు పాయలకు ప్లాస్టిక్ పైపుల్ని తొడిగి, ఆ నీటిని పెద్ద పెద్ద వాటర్ ట్యాంకిల్లోకి నింపుకుపోతున్నారు.

ఆ దృశ్యాన్ని చూడగానే “గత వారం రోజులుగా మేము తాగుతున్న ‘స్ప్రింగ్ వాటర్’ బాటిల్స్ లోని నీరు ఇటు వంటి జలపాతాల నుండి పట్టుకొచ్చి కొద్దిగా శుద్ధి చేసి అమ్ముతున్న నీరన్న మాట!?” నాలో నేను మౌనంగా అనుకోసాగాను.
సుమారు గంట ప్రయాణం తరువాత మాకు కుడి పక్కన గల గలల నాదంతో ‘ తీస్తా నది’ పరుగులు తీస్తూ సిక్కిం దిశగా సాగిపోతుంది. ఆ అందం మనసులో సంతోషం కన్నా, భయాన్ని కలుగ జేస్తుండడం అనుభూతమౌతుంటే తల తిప్పకుండా ఆ నదినే చూస్తున్న మాకు, ఎదురుగా తీరప్రాంతంలోని ఓ గ్రామం మీద నది సాగించిన దాడిని, ఆ దాడిని కూడా తట్టుకుని నిలదొక్కుకోవడమే కాదు. తిరిగి జోరుగా సాగిస్తున్న పునర్నిర్మాణ కార్యక్రమాల్ని చూస్తుంటే మనిషి వ్యక్తిగా ఎంతటి బలహీనుడో? సామూహికంగా అంతటి అజేయశక్తి సంపన్నుడన్న విషయం మెల మెల్లగా నాకు బోధపడసాగింది. మా వాహనాలు ‘తీస్తా నది’ వంతెన దాటి, కుడి పక్కకు తిరిగి డార్జిలింగ్ రోడ్డు పట్టుకుని వేగంగా వెళ్ళసాగాయి. కొంత దూరం వెళ్ళిన తరువాత మాకు ఎడమ పక్కగా ఓ చోట వాహనాలను ఆపిన డ్రైవర్లు “ఇక్కడ తప్పకుండా చూడాల్సిన వ్యూ పాయింట్ వుంది. దిగండి!” అన్నారు.

రోడ్డును ఆనుకునే వున్న కాలి దారి మీదుగా జనం ఓ ఎత్తు గడ్డ మీదికి ఎక్కి, దిగుతుండడం. అక్కడ రక రకాల దుకాణాలతోనూ, సందర్శకులతోనూ రద్దీగా వుంది. ఆ గడ్డ మీద లోయ చివరి అంచున స్టీల్ పైపులు అడ్డంగా ఏర్పాటు చేసివున్నాయి. సందర్శకులంతా ఆ స్టీలు పైపుల దగ్గరికి వెళ్ళి లోయలోకి చూస్తూ, ఫోటోలు దిగుతూ ఎంతో సందడి, సందడిగా కన్పిస్తున్నారు. “ఇంతకూ అక్కడ ఏముందబ్బా?!” అనుకుంటూ మేమంతా లోయ చివరి అంచుకు వెళ్ళి కిందకు చూశాము. ఆకుపచ్చ కొండల నడుమ, పడమర నుండి తూర్పుగా సాగిపోతున్న ఓ పెద్ద నదిలోకి ఉత్తర దిక్కు నుండి వస్తున్న మరో చిన్న నది. ఆ రెండు నదులూ ఒకతావున సంగమించి ఏకమై ముందుకు సాగిపోతున్న దృశ్యం నాయనానందకరంగా దర్శన మిచ్చింది.

తూర్పు పడమరలుగా వచ్చిన నది ‘తీస్తా నది’ అయితే ఉత్తర దక్షిణాలుగా వచ్చే నది, దానికి ఉపనది కూడా అయిన ‘రంగీత్ నది’. ఈ సంగమాన్ని స్థానికులు త్రివేణి సంగమం అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సాధారణంగా మనవాళ్ళు అంటూ వుండే ‘సరస్వతీ నది’ అక్కడ కూడా అంతర్వాహినిగా వుండడం చేత ఆ విధంగా పిలుస్తున్నారేమోలే? అనుకున్నాను. ఆ సంగమానికి ‘ప్రేమికుల సంగమం’ అని కూడా మరో పేరుందట. ఆ విధంగా పిలవడానికి ఒక జానపద గాధ కూడా వుందని చెబుతారు.
వీటిలో “తీస్తా నది” హిమాలయాల్లో పుట్టి మనదేశంలోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోయి, అక్కడ బ్రహ్మపుత్రా నదిలో కలిసిపోతుంది. ఈ నది మనదేశంలో మొత్తం 305 కి.మీ. బంగ్లా దేశ్ లో 109 కి.మీ. వెరసి 414 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. ‘తీస్తా నది’ ని సిక్కిం ‘జీవనాడి’ అంటారు. ఇది ఆకుపచ్చ రంగులో వుంటుంది. ‘తీస్తా నది’ మీద ఆనకట్ట నిర్మించే విషయంలో అక్కడుండే ‘లెప్చా’ మరియు ‘భూటియా’ తెగల మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగాయి.
రంగీత్ నది కాంచన్ జంగా ప్రాంతంలోని ఓ హిమానీనదంలో ఉధ్భవించింది. అక్కణ్ణుండి కిందికి వచ్చేటప్పుడు డార్జ్ లింగ్ జిల్లాలో రమ్మన్ అనే నది, మరికొంత దూరం వచ్చిన తరువాత లిటిల్ రంగీత్ అనే చిన్న నది కూడా దీనిలో కలుస్తుంది. దీని నీరు నీలివర్ణంలో వుంటుంది. ఇక్కడ సాహసవంతులైన యువకులు రాప్టింగ్ చేస్తుంటారు.

ఇక్కడి సాధారణ జన బాహుళ్యంలో విస్తృత ప్రచారంలో వున్న జానపద కథ ప్రకారం రంగీత్ మరియు రోంగ్న్యు సిక్కింలోని నదులు. వీటిలో రంగీత్ నదిని పురుషునిగాను, రోంగ్న్యు నదిని స్త్రీ గాను చెబుతారు. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కొంతకాలం తరువాత వారిరువురూ దూరప్రాంతానికి వెళ్ళి పోదామని నిర్ణయించుకుంటారు. వారిలో రంగీత్ టూట్పో అనే ఒక కొండ పక్షిని, రోంగ్న్యు పారిల్బూ అనే ఓ పామును తమ మార్గ దర్శకులుగా నియమించుకుంటారు. అయితే, ఇక్కడ మనకు తెలిసిన కుందేలు, తాబేలు కథలో మాదిరిగా రంగీత్ మార్గ దర్శి అయిన టూట్పో పక్షి అహంకారంగా ప్రవర్తిస్తూ మధ్య మధ్యలో చెట్ల మీద వాలి వాటి పండ్లు తింటూ వెనుక బడిపోతే రోంగ్న్యు మార్గదర్శిని పారిల్బూ సర్పం ఎక్కడా ఆగకుండా తమ లక్ష్యాన్ని చేరుకుంటుంది. దాంతో రంగీత్ కోపంతో రగిలిపోయి ప్రళయ భీకరంగా వెనుదిరగడంతో ఆ ప్రవాహ ఉధృతికి తీరప్రాంతంలోని సర్వస్వం కొట్టుకు పోతుంటే రోంగ్న్యు అతన్ని బ్రతిమాలుతూ వెంటపడుతుంది. ఆ రెండు నదుల ఉధృతికి అడవులు, కొండలు సమస్తం మునిగిపోతుంటే ప్రజలంతా చేరి వాటిని శాంతించమని కోరుతూ వాటికి ప్రీతిపాత్రమైన వస్తువుల్ని అర్పిస్తారు. దాంతో అవి శాంతించి ఈ సంగమం దగ్గర నెమ్మదిస్తాయి.
ఇప్పటికీ ఆ ప్రాంత లెప్చా జాతి ప్రజలు నూతన వధూవరులను ఆ ప్రేమికుల సంగమం దగ్గరికి తీసుకెళ్లి తమ భావిజీవితాలను సుసంపన్నం చేయమంటూ ప్రార్ధింప జేస్తారు. నదీ ఆత్మలయొక్క ఇంత అద్భుతమైన కథకు కేంద్ర స్థానమైన ఆ సంగమాన్ని ప్రేమికుల సంగమ స్థలం అనడం సముచితమే కదా మరి?. ఆ సంగమం యొక్క నిజమైన అందాలను చూడాలంటే మా మాదిరిగా అలా లోయ అంచుకువెళ్లి పది నిమిషాలు అక్కణ్ణుండి చూసి వస్తే దాని సౌందర్యాన్ని సంపూర్ణంగా దర్శించడం, దాని జానపద కథా నేపథ్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఆక్కడికి వెళ్ళే సందర్శకులు అక్కడ కనీసం రెండు రోజులు ఆగి, స్థానికులతో మమేకమై మాట్లాడితే తప్ప మన ప్రయాణానికి తగిన మూల్యం లభించదు.
కొంతసేపు ఆ సంగమాన్ని చూస్తూ, ఫోటోలు తీసుకుంటూ గడిపిన మేము తిరిగి మా వాహనాల దగ్గరికి చేరుకున్నాము. వాహనాలు మెల మెల్లగా డార్జి లింగ్ ‘టీ’ ఎస్టేట్స్ వైపుగా పరుగందుకున్నాయి.

రోడ్డును కప్పివేస్తూ చిక్కనైన అడవులు, ఆ అడవులను అంటుకుని పై పైకి సాగిపోయిన కొండలు, ఆ కొండల మీద కొద్దిమేర చెట్లలను తొలిగించి ఆకాశవీధుల నుండి, భువి మీది అందమైన మనోహర ప్రకృతి దృశ్యాలను వీక్షించేందుకు దిగివచ్చే దైవీగణాల రాక కోసం ఏర్పాటు చేసిన రహదారులా! అన్నట్టు అనాదిగా మానవులు నడయాడిన కాలిబాటలు దృశ్యాదృశ్యంగా ధవళచ్ఛాయలో దృగ్గోచరమౌతూ పై పైకిసాగిపోతున్న మనోహర దృశ్యం మరుద్దామన్నా మరువలేము.
ఆ రహదారుల సమీపాల్లో రంగు రంగుల పై కప్పుల్తో మెరిసిపోతున్న ఇండ్లు. ఆ ఇండ్ల చుట్టూ తెల్లటి కంఠాభరణాల మాదిరిగా వడి తిరుగుతూ పై పైకి సాగిపోతున్న మేఘ శకలాల్లాంటి ధూమ వలయాలు. ఎటు చూసినా పరిశుద్ధమైన ఆకుపచ్చ వర్ణంతో వర్ణించలేని ఉద్దీపనతో చూసేవారి మనసుల్లో అలౌకికానందం లహరులెత్తిపోతూ ఆ గిరులంతటా వలయాలు వలయాలుగా విస్తరిస్తూ చూపరులను సుతిమెత్తగా స్పర్శిస్తూ గిలిగింతలు పెడుతుంటే సందర్శకులకు తాము వేరేలోకంలో వున్న అనుభూతికి లోనూ చేస్తుంది.
మేమా ప్రకృతి మాయకులోబడి మమ్ముల్ని మేము మర్చిపోయి వుండగానే, రోడ్డు పక్కనున్న ఒక అందమైన చిన్న గ్రామం మధ్యలో మా వాహనాలను ఆపిన డ్రైవర్లు “మీరిక్కడ దిగి ప్లాంటేషన్స్ చూసుకుంటూ ముందుకు రండి!” మేము బండ్లను ఆ చివరన పెట్టి మీకోసం ఎదురు చూస్తుంటాం” అన్నారు. దాంతో మేమంతా వాహనాలను దిగిపోయాయి.
కొండలు, లోయలు, అక్కడక్కడా వున్న చిన్న చిన్న కమతాలు. ఎటు చూసినా వందల, వేల ఎకరాల ఆకుపచ్చ సంద్రమే మా ఎదుట నిలిచి మమ్ములను మరో ప్రపంచంలోకి తీసుకుపోతున్న అనుభూతికి లోనవ్వసాగాము. కనుచూపు ఆనినంత మేర కన్పిస్తున్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా ముందుకు సాగాము. నడుమెత్తున పెరిగిన తేయాకుతోటల్లో ప్రతిమూడు మాసాలకు ఒకసారి తేయాకును కోసి, సస్యరక్షణ పద్ధతులు పాటించడానికి వీలుగా మనుషులు తిరగడానిక వీలుగా పాయలు పాయలుగా దారులు తయారుచేసి వుంటాయి.
కొలింగ్ పాంగ్ నుండి దార్జ్ లింగ్ దాకా ఎటు చూసినా ‘టీ’ ప్లాంటేషన్స్ మాత్రమే కన్పిస్తుంటాయి. మనదేశంలో ఈ ‘టీ’ ప్లాంటేషన్స్ ఎప్పుడు? ఏ విధంగా ప్రారంభ మయ్యాయ్యో ఆలోచిస్తే అవి కేవలం తోటలేకాదు. మనకు చరిత్రను బోధించే పెద్ద బాల శిక్షలు.
‘ఈస్ట్ ఇండియా కంపెనీ ’ అనే ఓ ప్రైవేట్ వ్యాపార కంపెనీ పేరుతో మనదేశంలోకి బ్రిటీష్ వాళ్ళు వలసొచ్చారు. వాళ్ళు తమ వ్యాపార కార్యకలాపాల కేంద్రంగా కలకత్తాలో పాగావేశారు. వాళ్ళు వ్యాపారం చేస్తూనే మనదేశంలో వున్న రాజకీయ వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని మెల మెల్లగా ఇక్కడ రాజకీయ అధికారాన్ని కూడా హస్తగతం చేసుకున్నారు. కొంత కాలం తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చుకున్నారు. అట్లా సుమారు రెండు వందల ఏండ్ల పాటు మన దేశాన్ని పరిపాలించారు. నిజానికి ఆ చరిత్రంతా ఇక్కడ మనకు అప్రస్తుతమేగాని స్వతఃహాగా బ్రిటీష్ వారు తేనీరు ప్రియులు. వారికి కావాల్సిన తేయాకు ఉత్పత్తులను చైనా నుండి తెప్పించుకునే వారు. కొన్నేండ్ల తరువాత భారత దేశంలోనే తేయాకు ఎందుకు పండించగూడదన్న ఆలోచనకొచ్చిన ఆంగ్లేయులు మెల మెల్లగా అందుకు కావాల్సిన ప్రయత్నాలను మొదలుపెట్టారు.
1841లో ఆర్చిబ్లాడ్ కాంప్ బెల్ అనే బ్రిటిష్ అధికారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా మనదేశంలోని కలకత్తా వచ్చాడు. అప్పటికే బ్రిటిష్ వారు, వారి వాణిజ్య, అధికార కేంద్రమైన కలకత్తాకు దగ్గర్లో వున్న డార్జ్ లింగ్ లో తమ బ్రిటీష్ ఉన్నతాధికారుల కోసం అక్కడో హిల్ స్టేషన్ కట్టించారు. ఆ హిల్ స్టేషన్ కొచ్చిన కాంప్ బెల్, కొండ ప్రాంతంలో చిక్కటి అరణ్యాలు, అతి తక్కువ జనసాంద్రత, ఎల్లప్పుడూ మేఘావృతమై వుండే ఆకాశం. నిరంతరం మంచు పడుతుండడం మొదలైన అంశాలను నిశితంగా గమనించాడు. వెంటనే అతను డార్జ్ లింగ్ ప్రాంతంలో తేయాకు పంటకు కావాల్సిన అనుకూల వాతావరణం ఉందని, టీ ప్లాంటేషన్స్ వేస్తే లాభదాయకంగా వుంటుందని తన పై అధికారులకు తెలియజేశాడు. అతని ఆలోచనను అర్ధం చేసుకున్న ఉన్నతాధికారులు అందుకు తగిన ఏర్పాట్లు మొదలుపెట్టారు. కాంప్ బెల్ ఆధ్వర్యంలో బ్రిటిషర్స్ చైనా రకం’ సినెన్సిన్’ తేయాకు మొక్కల్ని సేకరించి ‘షహరాన్ పూర్’ అనే తావున ప్రయోగ పూర్వకంగా బొటానికల్ గార్డెన్స్ పెంచడం మొదలు పెట్టారు.
1846 లో కాంప్ బెల్ ‘లేబాంగ్’ వెళ్ళి అక్కడ కొంత మంది సహాయంతో ‘టీ’ ప్లాన్ టేషన్స్ మొదలి పెట్టించాడు. అందుకు తుక్వర్, స్టెయింతల్, అలుబారి రకాలకు చెందిన రెండు వేల మొక్కల్ని రాబర్ట్ ఫార్ట్యూన్ సంస్థ నుండి సేకరించి ప్లాంటేషన్ వేయించాడు.
1856 నుండి 1866 మధ్య కాలంలో మొకైబారి అనే బ్రిటిష్ సంస్థ సుమారు 39 ‘టీ’ ప్లాన్ టేషన్స్ ను డార్జి లింగ్ ప్రాంతంలో ప్రారంభించగా, క్రమంగా అవి 1870 నాటికి 56 వరకు విస్తరించాయి. మొట్ట మొదటి ‘టీ’ ప్రొసెస్సింగ్ యూనిట్ ని ప్రారంభించింది. గమ్మత్తేమిటంటే!? 1830 లో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో వున్న జనాభా 1885 కల్లా తొంభై ఐదువేల మంది వరకు పెరిగింది.
1866లో సుమారు సుమారు 11 వేల ఎకరాల్లో వాణిజ్య పరంగా డార్జ్ లింగ్ లో తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం మన తేయాకు ఉత్పత్తుల్లో సింహభాగం రష్యా దేశానికి ఎగుమతి జరిగేది.
1953 లో మనదేశంలో ‘టీ’ బోర్డ్ ఏర్పాటు చేయబడింది.
1973 లో ఫారిన్ ఎక్చంజ్ రెగ్యులేషన్ ఆక్ట్ అమల్లోకొచ్చింది.
చైనా రకం తేయాకు మొక్కలు సుమారు తొమ్మిది అడుగుల ఎత్తువరకు చివలు, పలవలుగా పెరుగుతాయి. వాటి ఆకులు అంగుళంన్నర నుండి పది అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి. వాటికి సువాసన గల తెల్లని పువ్వులు పూస్తాయి. ఈ రకం మొక్కలు సుమారు వంద ఏండ్ల వరకు దఫాలు దఫాలుగా ఆర్ధికంగా ఫలసాయాన్నిస్తుంది.
ఇక అస్సామ్ రకం తేయాకు చెట్లు 20 నుండి 60 అడుగుల ఎత్తున ఏకాండిగా పెరుగుతాయి. వీటి ఆకులు పెద్దగా వుంటాయి. ఈ మొక్కలు సుమారు 40 ఏండ్ల పాటు ఆర్ధికంగా ఫలసాయాన్ని ఇస్తాయి.
చల్లని వాతావరణం, కనీస వర్షపాతం, నిరంతరం మేఘావృతమై వుండే ఆకాశం, నీరు నిలువ వుండని వాలుతల భూమి, తగినంత మంది కార్మికులు ఈ తేయాకు తోటలు పెంచడానికి కావల్సిన మౌలిక వసతులు.
ఒక ఎకరా ప్లాంటేషన్ లో సాలున 1650 కి.లో ల తేయాకు దిగుమతి వచ్చేటట్టైతే అందులో ప్రతి రోజూ సగటున ఇద్దరు మనుషులైనా పనిచేయాల్సి వుంటుంది.
‘టీ’ లలో బ్లాక్ ‘టీ’, గ్రీన్ ‘టీ’, వైట్ ‘టీ’, ఒలాంగ్ ‘టీ’ అనే వివిధ రకాల ‘టీ’ లుంటాయి.
మన దేశంలో చాలా ‘టీ’ తోటలు ఆర్గానిక్ , బయోడైనమిక్, ఫైర్ ట్రేడ్, ‘టీ’ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్స్ పొంది అందుకు అనుగుణమైన ఉత్పత్తులను సాధిస్తున్నాయి. ఈ విధంగా మదేశంలోని తేయాకు తోటల చుట్టూ రాజకీయ, సామాజిక, ఆర్ధిక అంశాలు బలంగా పెనవేసుకుని వున్నాయి. తేయాకు తోటల చుట్టూ ఇంకా అనేకమైన అద్భుత విషయాలు ముడిబడి వుండడం విశేషంగా చెప్పుకోవాల్సివుంది.
దాదాపు గంటపాటు ఆ ప్లాంటేషన్స్ లో తిరిగిన మేము వాటి పచ్చ దనాన్ని, రకరకాలుగా ఆకృతులను మార్చుకుంటూ ఆకాశ వీధిలో మౌనంగా ఎచ్చటెచ్చటికో సాగిపోతున్న కరి మబ్బుల సమూహాలను, నింగిలోని ఆ మేఘాలకు, నేల మీది పచ్చదనానికీ మధ్య, పెండ్లి మంటపంలో పెండ్లి పీటల మీద నూతన వధూవరులు మొదటిసారి ఎదురెదురుగా కూర్చున్నప్పుడు వారి మధ్య పట్టే పల్చటి తెరపచ్చడం మాదిరిగా అలుముకున్న మంచుతెర! వాటన్నింటినీ చూస్తూ ఆనందంతో కుప్పిగంతులేస్తూ కాలాన్నే మర్చిపోయాము. ఇంతలో ఆ పక్కనే ఎవరో మహిళా సందర్శకులు కాశ్మీరీ పడతుల వస్త్రధారణతో ఫోటోలు దిగుతూ చేస్తున్న అల్లరితో మేలుకువలోకి వచ్చాము. వెంటనే మేమందరం కలిసి మా వాహనాల దగ్గరికి కదిలాము. పావుగంట. ఇరవై నిమిషాల ప్రయాణం తరువాత మా వాహనాలు వెళ్ళి ‘లామా హాట్టా’ అనే ఆధునిక పోకడలున్న గ్రామం
దగ్గరికి చేరుకున్నాము. డార్జ్ లింగ్ వెళ్ళేటప్పుడు మనకు ఎడమ పక్కగా అద్బుతమైన ‘లామా హట్టా’ ఎకో పార్క్ భీకరమైన దారు వృక్షాల మధ్య అనేక విధాల పూల మొక్కలు. అందమైన లతా కుంజాలు తీర్చిద్దిద్దబడివున్నాయి. వీటన్నింటిని మించి చుక్కలనంటే దారు వృక్షాల తలల మీది నుండి ఎవరో ఆకాశయానం చేస్తున్న దేవాంగన ఒకావిడ తన చీర కొంగున పొగమంచును మూట కట్టుకొని తీసుకొచ్చి ఆ ఉద్యానవనంలోని దేవదారు వృక్షాల మీదుగా ఒక్కసారిగా ఆ మూటను విప్పి, అందులోని మంచు పొగను అలనాడు భగీరధుని కోరిక మేరకు ఆకాశం నుండి నేలకు దుముకుతున్న గంగను శివుడు తన శిరస్సున ధరించినట్టు ‘ఝుప్’ మని వేగంగా కిందికి వస్తున్న మంచును దేవదారు వృక్షాలు తమ శిరస్సులతో అడ్డుకుని మెల మెల్లాగా సందర్శకుల తలల మీద సున్నితంగా వెదజల్లుతున్న దృశ్యాన్ని రోడ్డు మీద నుండి గమనించిన మేం ఆ అద్భుతానికి విచలితులమై పోయాము.
మనిషికి ముప్పై రూపాయాల ప్రవేశ రుసుం టికెట్ కొనుక్కొని ఒకరి వెనుక ఒకరం మెల్లగా పార్క్ లోకి అడుగుపెట్టాము. నిజానికి అది మామూలు మొక్కలతో కూడిన ఉద్యానవనం కాదు. అదో నందనవనం. అందరి విషయమేమో నాకు తెలియదుగాని, ఒక వ్యక్తిగా నేను మాత్రం వయసును మించిన ఉత్సాహంతో మా వాళ్ళ నుండి విడి వడి, వనమంతా వడి వడిగా తిరుగుతూ ఎదురైన ప్రతి సందర్శకుణ్ణీ ఆత్మీయంగాను, హాస్యంగాను పలకరిస్తూ కనిపించిన అందమైన ప్రతి పూవును, ప్రతి మొక్కను, ప్రతి పొదను ఒంటరిగాను, మిత్రులతోను, సందర్శకులను
కలిసి ఫోటోలు, విడియోలూ తీసుకుంటూ పిచ్చి పిచ్చిగా తిరగసాగాను.
మేమున్న ప్రాంతం సముద్ర మట్టం నుండి 5,700 అడుగుల ఎత్తులోవుంది. తంతెలు, తంతెలుగా వున్న ఆ కొండ మీద, బారులు తీరిన సరిహద్దు సైనికుల్లా నిలిచివున్న దేవదారు వృక్షాల వరుసల్ని దాటుకుని కొంతమంది స్థానిక సందర్శకులు కుడి చేతి వాటంగా వున్న కాలిబాట గుండా పైకి వెళుతున్నారు. అలా వెళుతున్న వారిలో ఇద్దరు యువకులను ఆపి “మీరంతా ఎక్కడికెళుతున్నారు?” అంటూ ప్రశ్నించాను.
దానికి వాళ్ళు “ఒక అరగంట ముప్పావు గంట పాటు పైకి ఎక్కితే, అక్కడ అందమైన రెండు కొలనులుంటాయి. ఆ కొలనుల్లో ఈ హిమాలయ సానువుల్లో వుండే రక రకాల పక్షులు విహరిస్తూ కనువిందు చేస్తుంటాయి. కొలనుల చుట్టూ అందమైన రక రకాల పులతోటలుంటాయి. ఆ తోటల నిండా ఝుంకారాలు చేస్తూ రక రకాల కీటకాలు సంచరిస్తుంటాయి. మన అదృష్టం బాగుండి, మంచు తెరలు తొలిగిపోతే అటువైపునుండి మనకు కాంచన్ జంగ్ పర్వత శిఖరాలు మనోహరంగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే లామా హాట్టా పేరుతో రెండు చిన్న చిన్న పల్లెలున్నాయి. ఆ పల్లెవాసులు మీలాటి దురప్రాంత యాత్రీకులను ఒకటి రెండు రోజులు తమ ఇండ్లల్లో (పేయింగ్ గెస్ట్స్ గా) వుంచుకుని ఎంతో మర్యాదగా చూసుకుంటారు” అంటూ మనసును ఉర్రూతలూగించే విషయాలు తెలియజేశారు.
వాళ్ళ మాటలు వినగానే నాదస్వరం విన్న నాగుబాము మాదిరిగా నన్ను నేను మర్చిపోయి వాళ్ళ వెనుకబడి నడుస్తుండగా గమనించిన నా ఇల్లాలు “ఎక్కడికి
పోతున్నావు? పెండ్లి కొడకా! వెనక్కి తిరుగుతావా లేదా?!” అన్నట్టుగా నా వెనుక నుండి “ఏమండీ సార్!” అంటూ గట్టిగా కేక విసింది. అంతే! తెల్ల ఉసిరి వాసన చూసిన కోడెతాచు పడిగే నెలకు వాల్చి, నిల్చి పోయినట్టుగా ఒక్కసారిగా ఆగిపోయిన నేను తల నెలకు వాల్చి ఉస్సూరు మంటూ తన దగ్గరికి చేరుకున్నాను. ఇంతలో జనార్ధన్, అరుణ గార్లు, నాగేశ్వరరావు, సుభద్ర గార్లు, లింగయ్య, రేణుక గార్లు మమ్ముల్ని వెతుక్కుంటూ మా దగ్గరికి వచ్చారు. మేమంతా కలిసి ఎడమ దిక్కుగా తిరిగి దేవదారు వృక్షాల మౌన గంభీర సోయగాలను ముగ్ధులమై చూసుకుంటూ లెక్కకు మిక్కిలి ఛాయా చిత్రాలను తీస్తూ తీస్తూనే.. ఆ స్థితిలో కూడా నేను ఎక్కడికో నా బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను.
చిన్నప్పుడు నేను మా అమ్మ చెప్పినట్టుగా ఉప్పుకో, ఉల్లిపాయలకో మా వీధి చివర్లోవున్న కిరాణా దుకాణానికి వెళ్ళి వాటిని కొన్నుకుని వస్తూ వస్తూ “శేట్! జరంత బెల్లం పెట్టవా?” అంటూ చెయ్యి చాస్తే, అతను విసుక్కుంటూనే అయినా ఇంత జిగట బెల్లాన్ని నా చేతిలో వేసేవాడు. దాన్ని లట్టుక్కున నోట్లో వేసుకుని, మరికాస్త తడిపి బైటికి తీసి, కుడి అర చేతిని వెనక్కి తిప్పి, దాని మట్ట మీద ఆ బెల్లం ముద్దను గుండ్రంగా చేసి, అంటించి ఎంతోసేపు నాక్కుంటూ మురిసిపోయే వాణ్ణి. అదుగో అటువంటి ఆనందం ఇన్నేళ్ళకు మళ్ళీ ఇక్కడ ఈ ‘లామా హట్టా’లోని ఈ వుద్యాన వనంలో పునరావృత్తమయ్యింది.
యథా తధంగా తను నాదగ్గరకొచ్చి హెచ్చరించడంతో నేను నా ఊహా లోకంలో నుండి బయటపడి, ఆవిడతో పాటు కిందకు దిగుతూ మాతోపాటున్న మిత్రులతో కలిసి సరదాగా మరికొన్ని ఫోటోలు తీసుకుంటూ కిందికి దిగసాగాము. ఇక్కడ సుబ్బారావు గారి వాళ్ళు అనుకోకుండా మా నుండి విడిపోయి దూరంగా తిరిగి తిరిగి చివరిలో మళ్ళీ కలుసుకున్నారు. అట్లా మేమంతా కలిసి మెల్లగా మా వాహనాలదగ్గరికి చేరుకున్నాము.
మమ్ముల్ని ఎక్కించుకున్న వాహనాలు తిరిగి డార్జ్ లింగ్ వైపుగా పరుగందుకున్నాయి.
‘లామా హట్టా’ నుండి సుమారు అర గంట ప్రయాణం తరువాత మేము ‘ఘూమ్’ మీటర్ గేజ్ రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నాము. దానిని చూడగానే దాని తాలూకు చరిత్ర అంతా నాకళ్ళముందు నిలిచింది.
ఈ రైల్వే స్టేషన్ ఏర్పడక ముందు డార్జిలింగ్ రావాలంటే రక రకాల ప్రయాణ సాధనాల మీద ఐదారు రోజులు పట్టేది. మరిప్పుడు రైల్ మీద కోల్ కత్తా నుండి న్యూ జల్పైగురికి పదిగంటలు మాత్రమే పడుతుంది. న్యూ జల్పైగురి నుండి రోడ్డు మార్గం గుండా నాలుగు గంటల ప్రయాణం. అదే న్యూ జల్పైగురి నుండి డార్జిలింగ్ కి ట్రైన్ మీద ఏడుగంటలు పడుతుంది. బతసియా నుండి డార్జీలింగ్ అరగంట ప్రయాణం.
మరికాస్త ముందుకెళ్లి డార్జిలింగ్ ను గురించి విచారిస్తే…
1828లో ఈస్టిండియా కంపెనీవారు మొట్ట మొదట్లో ఇక్కడ ఒక సెటిల్మెంట్ కాలనీ లేదా సానిటోరియాన్ని ఏర్పాటు చేశారట.
1835లో అందుకోసంఈ ప్రాంతాన్ని వాళ్ళు సిక్కిం నుండి విడగొట్టారట.
సానిటోరియాన్ని నిర్మిమించేటప్పుడు ఇక్కడ కేవలం వంద మంది మాత్రమే వుండేవారట.
1839లో సిలిగురి నుండి డార్జిలింగ్ కి మొట్టమొదటి సారి రోడ్డు మార్గాన్ని ప్రారంభించారట.
1840లో డార్జిలింగ్ మొత్తం మీద కేవలం 30 బిల్డింగ్స్ మాత్రమే వుండేవట.
1846లో మథర్ తెరిస్సా మొట్టమొదటి సారిగా ఇక్కడ కాన్వెంట్ పాఠశాల నిర్మించారట.
1857లో ఇక్కడికి టీ ప్లాంటేషన్స్ వచ్చాయట.
1879లో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ ప్రారంభించ బడ్డాయి.
చూసుకుంటూ మరికొంచం ముందుకెళితే మాకు ఎడమ చేతి వైపుగా ‘సమ్ టెన్ చోలింగ్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ’ కనిపించింది. దానికి కొంచం ఈవలగా మా వాహనాలను ఆపిన డ్రైవర్లు “కిందకు దిగి పక్కనే వున్న మోనాస్ట్రీని చూసి రండి !” అన్నారు.
దాంతో మేమంతా కిందకి దిగి రోడ్డు పొడవునా వున్న రక రకాల దుకాణాలను ముఖ్యంగా ఉన్ని దుస్తుల దుకాణాలను చూసుకుంటూ మోనాస్ట్రీ వైపు వేగంగా నడిచాము. దాని ప్రధాన ద్వారమైన పెద్ద పెద్ద ఇనుపగేట్ల దగ్గరికి చేరుకున్నాము. ఆ గేట్ల గుండా రోడ్డు కంటే దిగువకున్న మోనాస్ట్రీ ప్రాంగణంలోకి దిగాము. చూడడానికది అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. కానీ లోపాల మాత్రం పెద్ద విగ్రహం కొట్టొచ్చినట్టుగా వుంది. ప్రధాన మందిరానికి ద్వారానికి మధ్యలో వున్న నడవాలో ద్వారానికి రెండు పక్కలా బౌద్ధ మత సంబంధ మైన వస్తువులు, చిన్న చిన్న బుద్ధుని ప్రతిమలు, మహిళలకు సంబంధించిన రక రకాల అలంకరణ సామాగ్రీ అమ్మే దుకాణాలున్నాయి. మా బృందంలోని కొందరు మహిళలు ఏవో చిన్న
చిన్న వస్తువులు కొన్నారు. మాలో ఎక్కువ మందిమి గుడి బైట వున్న క్యాంటీన్లో కాఫీలు తాగాము. రంగారావు, సౌభాగ్య లక్ష్మి గార్ల దంపతులు మాకా పక్కనే వున్న షాప్ లోని కౌబాయి టోపీలను తలోటీ కొనిచ్చారు. మరికొంత సేపు అక్కడ గడిపిన మేము మెల్లగా వెనుదిరిగి మా వాహనాల దగ్గరికి చేరుకున్నాము.
అక్కడ మా మాటలు విన్న ఇద్దరు మహిళలు “మీదేవూరండీ!?” అంటూ ఉత్సాహంగా అడిగారు. అక్కడ! అంత దూరంలో! మన తెలుగు వాళ్ళు కనిపించడం, తెలుగు మాటలు వినిపించడం మాకు, వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపించింది. మరీ ముఖ్యంగా వారిలో ఒకరిది మా పాల్వంచలోని నవభారత్ కాగా, మరొకరిది మణుగూరట. వారిద్దరూ అక్కా చెల్లెళ్ళట. చెల్లెలి అల్లుడు అక్కడ మిలట్రీలో సిపాయిగా ఉన్నాడట. తన పేరు విజయకుమార్, ఆ అమ్మాయి పేరు సౌజన్య. వారికి ఇద్దరు ఆమ్మాయిలు. అట్లా కొంతసేపు మాట్లాడినవారు మెల్లగా మోనాస్ట్రీ వైపుగా సాగిపోయారు. మేము తిరిగి మా వాహనాలెక్కాము.
ఓ పావుగంట, ఇరవై నిమిషాల తరువాత “బతసియా లూప్ వార్ మెమోరియల్” లేదా “బతసియా ఏకో గార్డెన్” దగ్గర ఆగాము. ఇది ఎల్లప్పుడు సందర్శకులతో సందడి సందడిగా వుంటుంది. ఇక్కడ స్వాతంత్ర్యానంతరం దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన ఘూర్ఖా వీర జవాన్ల స్మృత్యర్ధం నిర్మించిన విశాలమైన స్థూపం ఆ జిల్లా పరిపాలనా సంస్థవారిచేత నిర్మించబడిందట. అది సందర్శించడానికి పెద్దవారికి 50, పిల్లలకు 10, విదేశీయులకు 200 రూ.ల టికెట్లు తీసుకోవాల్సి వుంటుంది.
అక్కడి నుండి చూస్తే చుట్టూ కొండచరియాల మీద నిర్మించబడిన అందమైన భవనాలు, ఉద్యాన వనాలు కనుల విందు చేస్తుంటాయి. మమ్ముల్ని అక్కడ వదిలిపెట్టివెళ్ళిన రుఖేష్ మా లంచ్ ఏర్పాట్ల కోసం వెళ్ళాడు. మేమంతా ఆ స్థూపం చుట్టూ తిరిగిచూసి, అలా కూర్చుంటుండగానే భోజనాలకు పిలుపోచ్చింది. ఆ హోటల్ అక్కడికి నడవదగ్గ దూరంలోనే వుండడంతో మేమంతా మెల్లగా హోటల్ ‘మాతాజీ’ కి చేరుకున్నాము. అందెశ్రీ గారు ప్రతియాత్రలో మా అందరికీ ఒకరోజు మధ్యాహ్న భోజనం తినిపించే వాడుక వుంది. అందులో భాగంగా ఈ రోజు వారు మా అందరికీ మధ్యాహ్న భోజనం చేయించారు. భోజనం చేసిన వెంటనే మా వాహనాల దగ్గరకెళ్లిపోయాము.
అక్కణ్ణుండి మా వాహనాలు హోటల్ ‘ముస్కటెల్ రోమా’ దగ్గరికి బయలు దేరాయి. అయితే, ఆరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం హోం మంత్రి అమిత్ షా వచ్చారట. దాంతో మేము వెళుతున్న మార్గమంతా విపరీతమైన జనసందోహంతో కిక్కిరిసి పోతుంది. దాంతో పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేస్తున్నారు. ఆ చక్రవ్యూహాన్ని ఛేదించుకుంటూ వెళ్ళినంత దూరం ముందుకెళ్ళాం. చివరికి ‘ఆల్ ఘూర్ఖా కమ్యూనిటీ హాల్’ దాటి కొంచం ముందుకి వెళ్ళగానే వాహనాలను ఓ పక్కకు తీసి ఆపి ఆపిన డ్రైవర్లు “ఇక ఇంతకన్నా మేము ముందుకు రాలేము. ఇక్కణ్ణుండి ఆ లెఫ్ట్ రోడ్డున ఓ ఫర్లాంగ్ దూరం వెళితే మీ హోటల్ వస్తుంది” అంటూ మొండికేశారు.
వాళ్ళతో ఎంత వాదించినా లాభం లేకపోవడంతో మేమంతా లాగేజ్ ను పట్టుకుని ఒక కూలీ వెనుక బడి హోటల్ ని వెతుక్కుంటూ, చమటల్ని కక్కుకుంటూ, కాళ్ళు ఈడ్చుకుంటూ, నడవలేక నడవలేక నడుస్తూ ఎట్టకేలకు హోటల్ “ముస్కాటెల్” దగ్గరికి చేరుకున్నాము. అయితే, అక్కడ మాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మమ్ముల్ని చూస్తూనే బయటకొచ్చిన ఆ హోటల్ రిసెప్షనిస్ట్ మీరంటున్నట్టు ఇది “ముస్కాటెల్” హోటలే. కాని ఇది మాత్రం మీ కోసం బుక్ చేసిన హోటల్ కాదు. దానిపేరు ‘ముస్కాటెల్ రోమా’. నెమ్మదిగా అక్కడి కెళ్ళండి!” అంటూ మా నెత్తిన చన్నీళ్ళు గుమ్మరించింది.
“అదెక్కడ?” అంటూ అడిగాము.
“మీరింకొంచం ముందుకెళితే నెహ్రూ చౌక్ వస్తుంది. ఆ చౌక్ నుండి ఇదే విధంగా ఓ ఫర్లాంగ్ దూరం వెళ్ళి, లెఫ్ట్ రోడ్డులోకి తిరిగ పైకెళితే ఆ హోటల్ వస్తుంది” అంటూ వెంటనే లోపలికి వెళ్లింది.

ఇక మా బాధ వర్ణనాతీతం. అసలు రుఖేష్ ఎటు వెళ్ళాడాని వాకబ్ చేస్తే డ్రైవర్లకు పేమెంట్ చేయడాని వెళ్ళాడాని తెలిసింది. ఇక ఆ దెబ్బతో మా తలలో పట్టిన చెమట ముచ్చెన గుంటలు దాటి, రెండు గూడల మధ్యగా కిందికి దిగిపోసాగింది. మా మిత్రులంతా ఆ డ్రైవర్లను, రుఖేష్ ను బహుశః అంతర్గతంగా నన్ను కూడా కలిపి శపిస్తుండొచ్చు!? నన్నెందుకంటే ఈ రుఖేష్ అనే వ్యక్తి అనుకోకుండా నాకు, నా ద్వారా మిగతా మిత్రులకు పరిచయం అయ్యాడు కాబట్టి. అయితే, ఇందులో నన్ననడమనేది కేవలం నా ఊహ మాత్రమే. దాదాపు మరో గంటపాటు కాళ్ళు, చేతులు వణుకుతుంటే, కళ్ళు తిరుగుతుంటే, చెమటలతో శరీరాలు తడిసి ముద్దాయి పోతుంటే మెయిన్ రోడ్డు
మీద నుండి పక్క రోడ్డుకి తిరిగాము. ఇక ఆ రోడ్డు పరిస్థితి ఏంటయ్యాంటే!? కాలినడకన తిరుమల కొండ కెక్కే భక్తులకు మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయి నిజంగానే మోకాళ్ళ మీద వంగుని పైకి వెళ్ళినట్టు అంతదూరం నుండి సామాన్లు మోసుకుంటూ వచ్చిన మాకు, అక్కణ్ణుండి ఆ రోడ్డున ముందుకు పోను పోను సుమారు నూరు, నూటా పాతిక అడుగుల ఎత్తుంది. అది చూసిన మావాళ్ళకు ఏడుపు ఒక్కటే తక్కువ. అయితే, మా అందరికన్నా ముందుగా జనార్ధన్ గారు రెండు సూట్ కేసుల్ని లాక్కుంటూ హోటల్ కి చేరుకున్నారు. ఆయన్ని చూసి మరొకరు ఆ మరొకర్ని ఇంకొకరు పౌరుషం తెచ్చుకుని మొత్తం మీద హోటల్ కి చేరుకున్నాము.రుఖేష్ అప్పటికీ ఇంకా హోటల్ కి రాలేదు.
ఒక విధంగా అతను రాకపోవడమే మంచిదైందేమో? ఎందుకంటే!? ఆ మంట మీద ఎవరన్నా రెండు పీకినా ఆశ్చర్యం లేదు కాబట్టి.
మేమంతా కాస్త చల్లబడిన తరువాత రుఖేష్ మెల్లగా చేరవచ్చాడు.
“ఎంటిది? ఏం పద్ధతి?” అంటూ అతణ్ణి చుట్టు ముట్టాము.
ఎంత చుట్టుముట్టినా ఏముంది? బెల్లం కొట్టిన రాయి. అంతే! అప్పటికి సమయం సాయంకాలం నాలుగున్నర కావస్తుంది. చిన్నప్పటి నుండి నాకో కోరిక వుండేది. నేను భవిష్యత్తులో ఎప్పటికైనా డార్జీలింగ్ వెళితే తప్పకుండా రాహుల్ సాంకృత్యాయన్ సమాధి చూడాలని. దానికి తోడు మా యాత్ర ఆరంభంలోనే “మనం డార్జ్ లింగ్ వెళితే తప్పకుండా రాహుల్జీ సమాధిని చూద్దాం” అంటూ అందెశ్రీ గారు కూడా
అనడంతో నా ఆలోచనకు మరింత బలం చేకూరినట్టైయ్యింది. మాకు తోడు ఎలాగూ సుబ్బారావు గారు, జనార్ధన్ గారు, సారంగ పాణి గారు, నాగేశ్వరరావు,లింగయ్య గార్లు కూడా వస్తామంటూ తయారయ్యారు.
ఇక వెంటనే మేమంతా రిసెప్షనిస్ట్ దగ్గరికెళ్ళి “మేము రాహుల్ సాంకృత్యాయన్ సమాధి చూడ్డానికెళ్ళాలి. ఏదైనా టాక్సీని పిలుస్తారా?” అంటూ అడిగాము.
వింటూనే ఆ అమ్మాయి “రాహుల్ సాంకృత్యాయన్ ఎవరు?” అంటూ తెల్ల మొఖం పెట్టింది.
డార్జీలింగ్ లో వుంటూ చదువుకున్న అమ్మాయి అయివుండీ రాహుల్జీ అంటే ఎవరో దెలియదనగామే మేమంతా కూడా తెల్లముఖం వేశాము. ఆ అమ్మాయి వెంటనే టూర్ ఆపరేటర్ ఆఫీస్ కి ఫోన్ చేసింది. పావుగంట తరువాత టూర్ ఆఫీస్ నుండి ఓ
కుర్రడొచ్చాడు. అతను కూడా ఆదేపాట పాడాడు! రాహుల్జీ ఎవరో తెలియడంటూ.
“ఎక్కడో తెలుగురాష్ట్రాల్లో పుట్టి పెరిగిన మేము మహా పండితుడు, ప్రపంచ యాత్రీకుడూ అయిన రాహుల్ సాకృత్యాయన్ సమాధినైనా చూడాలను కుంటుంటే ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి చదువుకుని, నిత్యం టూరిస్ట్ లతో సంబంధం వుండే చోట పనిచేస్తూ కూడా మీకు అసలాయనెవరో తెలియడంటే వినడానికి మాకు సిగ్గేస్తుంది” అంటూ అందెశ్రీ గారు వాళ్ళ మీద కొంచం గరమయ్యాడు.
“ఇలా లాభం లేదు” అనుకున్న మేము వెంటనే గూగుల్ అమ్మనడిగాము. రాహుల్జీ బస్ట్ సైజ్ శిల్పంతో మల్చిన స్థూపం ఎక్కడుందో చూపించింది తప్ప ఆవిడ కూడా సమాధిని చూపించడం లేదు. ఒక పక్క చీకటి ముసురుకొస్తుంది. ఏంచేయాలో
అర్ధం కాక నేను వెంటనే హైదారాబాద్ కి ఫోన్ చేసి పరవస్తు లోకేశ్వర్ గారికి మా పరిస్థితిని వివరించాను.
“నేనెప్పుడో పదేహేనేండ్ల కిందట వెళ్ళినప్పుడే ఆ సమాధిని పట్టుకోడానికి ఓ రోజంతా పట్టింది. ఊరికి పది పన్నెండు కి.మీ. దూరంలో వున్న ఓ పెద్ద స్లమ్ ఏరియాలోని శ్మశానవాటికలో విసిరేసినట్టుగా ఓ మూలకు శిథిల స్థితిలో వుంది. అక్కడికి చేరుకోవాలంటే కొంతదూరం నడిచి వెళ్ళాలి. ఈ సమయంలో మీరు దానిని వెతుక్కుంటూ వెళ్ళడం సాధ్యంకాదు. ఆ ప్రయత్నాన్ని వదిలేయండి!” అంటూ సలహా ఇచ్చారు.
ఇక దాంతో మేమంతా ఉస్సూరుమంటూ మా హోటల్ రూములకే పరిమితమై పోయాము.
“బాల్యం నుండి నేను వెళ్ళాలనుకున్న
డార్జిలింగ్ వెళ్ళనైతే వెళ్ళాను. కానీ, రాహుల్జీ సమాధి మాత్రం చూడలేక పోయాను. అట్లా నా కోరిక తీరీ తీరనట్టు తీరింది కదా?” మనసులోనే అనుకుంటూ మంచం మీద ఒరిగాను.
(ఇంకా వుంది)
