ముఖం మీద ఒక్కసారిగా పడిన ఎండ పొడికి, దన్నున లేసి కూర్చున్నడు రాజయ్య. గాఢ నిద్రంతా గంగల కల్సినట్టైంది. వెలుతురు రాకుండా తలుపులు కిటికీలు అన్ని పెట్టే ఉన్నాయి కదాని మీదికి చూస్తే ఇంటి మీది ఓ రెండు పెంకులు లేవు. వాటి కిందున్న కట్టెల సంధుల నుండి ఎండొస్తుంది.
“ఎవడ్రా పెంకులు తీసింది?” కోపంగా మంచం దిగి ఓ కర్ర పట్టుకోంగనే, తీసిన పెంకుల సంధిల నుండి ఓ కోతి కనవడింది.
“నీ…కోతులు కగ్గితగలా. ఆయ్ య్” కర్రతో కొడ్తా అన్నట్టు గద్రాయించిండు. ఇంకో పెంకు తీసి రాజయ్య నెత్తి కేసి కొట్టి, కోతి పారిపోయింది. పెంకుతో పాటు నెత్తి కూడా పగిలింది. కోపం తో బయటకొచ్చిండు రాజయ్య, చూస్తే ఇంటి సుట్టూ ఓ నలభై యాభై కోతుల గుంపే ఉంది.! దెబ్బకు దడుసుకొని లోపలికొచ్చి తలుపేసుకున్నడు. భయం తో దేవుణ్ణి తల్చుకున్నాడు…ఎదురుగా ఆంజనేయుడి ఫోటో!
కిచ్ కిచ్…హ్కిచ్కిచ్ అంటూ గట్టి గట్టిగా చప్పుడ్లు చేస్తూ గుంపుగుంపంతా ఓ దిక్కు పరిగెడ్తున్నట్టు అర్థమైంది రాజయ్య కు కిటికీ దగ్గర నుండి. “హమ్మయ్య పోయనయి” అని నిమ్మలం అయిండో లేదో పంట యాదికొచ్చింది. కోతులన్ని మక్క చేను దిక్కే పోతున్నాయి. దన్నున తలుపు తీసి గుండెలు బాదుకుంటనే చేను దిక్కు ఉరికిండు. కాసేపటికి చేను దగ్గరికి పోంగనే గుండె ఆగినంత పనైంది, ఐదు ఎకరాల మక్కచేనును యుద్ధ బీభత్సాన్ని సృష్టించాయి.
ఈ ఏడు పంట బాగా పండిందన్న సంబరమంతా ఈ కోతుల్తో మట్టికర్సుకపోయింది. అసలే బ్యాంకుల్లో పాత లోన్ తీరక, తోడుగా రుణ మాఫీలో తన పేరు లేక కొత్తగా అప్పు చేసి మరీ పండించిన పంట అది. కోతలు మొత్తం మక్క కంకుల్ని ఇరగ్గొట్టి…బూరు తీసి ఒక్కో గింజ కొరికేసి పడేసినయి. రాజయ్య కండ్లల్ల నీళ్లతోనే మక్కచేనంత తిరిగితూ, ఓ దగ్గర సెక్కరొచ్చినట్టై దబ్బున కుప్పకూలిపోయాడు.
ఇది రాజయ్య కథే గాదు కోతుల గుంపు వల్ల ఆ ఊరి కథ కూడా. కోతులను తరిమేసుడు ఆళ్ల తరం అయితలేదు. కొందరు ఇంట్లో పాత చీరలు తీసి ఒక్కో కర్రకు చుట్టారు, కొందరు నిరంతరం డప్పులు వాయిస్తూనే ఉన్నారు. కొందరు పొలాల్లో పార్టీ జెండాలు పాతారు. అయినా కోతులేమి భయపడలేదు. జెండాలను పీకి రచ్చ రచ్చ చేసాయి…ప్రతి చేండ్ల తిని పోతున్నాయి…పొలాలు బురద మడుగులవుతున్నాయి… ఏ ఇండ్ల పైకెక్కి చూసిన గూన పెంకులు చిందరవందరిగా ఉన్నాయి, కొన్నైతే నేల మీద గ్లాజుగ్లాసులై పగిలిపోయున్నాయి. జనాలు అదిలించబోతే మీద పడి గోళ్లతో గీకుతున్నాయి. పెద్దలే కాదు చిన్న చిన్న పిల్లల మీద కూడా పడి గీకుతున్నాయి. ఊరంతా తల పట్టుకునే పరిస్థితికొచ్చింది. భయం, ఆందోళన, కన్నీళ్లతో పరిష్కార మార్గం కోసం పంచాయితీ బండ దగ్గర చర్చించుకోడానికి వచ్చారు కొందరు.
ఒక యువకుడు, అభ్యుదయ వాది ‘ కోతులు వూర్లకి రానీకి మనమే కారణం. అడవుల్ని నరకడంతో…‘ అని మొదలెట్టాడు. ‘యే ఆపు‘ మిగితా అందరూ ఒక్కసారిగా చెడామడా తిట్టిపోసారు. ‘నీకు భుములుంటే తెలిసేది. ఎవరో నరికేసి బాగుపడ్తే, అవస్థలు మాత్రం మాకు కదా…‘ అని బుస్ మనడంతో అతను జారుకున్నాడు. సర్పంచ్ జలంధర్ అందరిని మెల్లగా సంజాయించుతూ,
“నేను సుతం బాధితుడినే కదా, నా పదెకరాల పత్తి చేనుని పాడుజేసినయి”,
“అయితిప్పుడు ఏం జేసుడో చెప్పరాదు” గుంపులో ఒకరు
“మీరంతా ఒప్పుకుంటే, పరిస్థితిని మార్వొచ్చు. పంట చేన్లున్న ప్రతి రైతు, ఇండ్లున్న ప్రతోళ్లు… రెండు వేల చొప్పున పైసలు ఇస్తే…” సర్పంచ్
“అందులో ఈడి కమీషనెంతో… ఊర్ల మిగిలిన ఆ గుడిసెలున్నోల్ల కాడనుండి కూడా ఇగ్గనుంటివీ”, గుంపులో సర్పంచ్ వ్యతిరేకుల గుసగుసలు.
“కొందరికి నవ్వులాటలెక్కుంది, గిది సీరియస్ మాటర్. పక్కూరి సర్పంచ్ గిట్లే జేసిండట, ఇయాల పొద్దుగాలనే ఫోన్లో జెప్పిండు. ఆదిలాబాద్ జిల్లా నించి ఒకడ్ని తెప్పిస్తాం, వాడి దగ్గర రెండు కొండెంగలున్నాయిట. మీరంతా సరే అంటే వాన్ని రమ్మంటా” అన్నాడు సర్పంచ్.
“సరేతీ…అట్లే గానిద్దాం” అనొకరు అనగానే మిగితా వాళ్లు తలూపారు.
సర్పంచ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుకుంటూ పక్కకు వెళ్లిండు. వెంటనే గుసగుసలు,
“అవ్…కొండెంగలు సుతం కోతుల్లెక్కనే వుంటాయి కదా, మరి ఆటిని సూత్తే కోతులెందుకు పారిపోతాయి? ” ఒకరి అనుమానం
“అందుకే రామాయణం, భారతం సదవాల్రా. రాముడు చెట్టు సాటి నుండి బాణం ఏసి సంపుతడు కదా! రామాయణ కాలం నించి ఉన్నాయిగా అన్నదమ్ముల పోరు. వాలి, సుగ్రీవుడు తెల్సు కదా. ఆళ్ల కథ వల్ల. అట్లే వానర సైన్యం రాముడి దిక్కు…కొండముచ్చులు రావణాసురుడి దిక్కు కదా…అందుకే కోతులతో పాటు మనకీ శత్రువులే. కొండెంగల ముఖం కూడా సూడద్దంటరు” ఓ ముసలాయన
“ఉడతలకే అనుకున్న కోతులు కొండెంగలకు కూడా రామాయణం కథలు లంకె కట్టుందా?! పాత్రల ద్వారా ఓ జంతువుని దేవుడిలా చూస్తుంనందుకు సరే, మరో జంతువుని రాక్షసుడిలా చూడాలా ? అవే పాత్రలు తారుమారైతే ఈ పాటికి కొండెంగలకి సైతం గుళ్ళుండేవి కదే. అట్ల గాదు గానీ, కోతులకు వాటిలెక్కనే ఉన్నా కూడా కొండెంగలు కాస్త పెద్ద సైజులో ఉన్నాయనీ, తోక పెద్దగా ఉందనీ, పిల్లలను, ఆహారాన్ని తీస్కెళ్తాయని భయం. ఇంకా రకరకాల కారణాలున్నాయి గానీ పుట్టుకతోనే శత్రుత్వమైతే ఉండదు” ఇంకో పెద్దాయన.
సర్పంచ్ ఫోన్ ముగించుకొని, “ఇరవై అయిదు వేలంటా, రేపే రమ్మన్నా. ఇగ ఎవలు కోతుల గురించి ఫికర్ పడకుండ్రి. నేను జగిత్యాల పోయే పనుంది” అనుకుంటా కార్ దగ్గరికి పోయిండు.
“ఇరవై అయిదా…గంతనా…ఎక్కువే” కొందరనుకున్నారు.
“అరేయ్ ఓ పది వేలు ఇత్తే మనమే కొండెంగం వేషం ఏస్కొని తిరిగి తరిమికొడ్తుండే గదరా” అనో నలుగురు నిరుద్యోగులు.
“అసలు కోతి ఈ సర్పంచ్ గాడేరా, ఎంత నొక్కిండో. ఈడ్ని తరిమేసే కొండెంగం కావాలే” ఇంకొకరు.
మల్ల సర్పంచ్ చెవిలో పడ్తే పగవడ్తడనీ అందరూ మెల్లగా మాట్లాడుకుంటూ ఇల్లలకు చేరారు, కోతులకు భయపడుకుంటూనే.
***
రెండు కొండెగుల్ని పట్టుకొని సర్పంచిని కలిసాడు రమావత్.
“ఇదిగో నీ లెక్క ఆల్రెడీ మాట్లాడివెట్టిన, ఇంటికి అయిదొందలని. మొత్తం కోతుల్ని రెండు రోజుల్లో పొలిమేర దాటించాలే” సర్పంచ్.
“గట్లనే బాంచెన్… గుడుంబా తాగక రెండు రోజులైంది. గిప్పడైతే ఓ వెయ్యి రూపాయలు ఇప్పియిండ్రి” రమావత్ చేతులు పిసుక్కుంటూ.
“ఆల్రెడీ తాగినట్టున్నవ్ గదరా, నోట్లకెల్లి వాసన జూడు ఎట్లస్తుందో “, గద్రాయించినట్టు సర్పంచ్.
రమావత్ ఏం మాట్లాడకుండా తను తెచ్చిన ఒక మగ మరొక ఆడ కొండెంగులకు కట్టేసిన గొలుసులను మెల్లగా విప్పుతున్నాడు. పొడువాటి తోకతో, నల్లటి ముఖంతో నిగనిగ మెరిసిపోతున్నాయి అవి.
సర్పంచ్ ఇచ్చిన వెయ్యి రూపాయలు పట్టుకొని ఊరవతలి గుడుంబా గుడిసె దిక్కు ఉరుకిండు. ఆయాసం, దగ్గు ఎక్కువస్తున్నా కూడా పరుగాపకుండా పోయిండు. గుడుంబా అమ్మే ఆవిడ చేతిలో ఓ అయిదొందలు పెట్టిండు. ప్యాకెట్లు పట్టుకొని కాస్త దూరం నడిచి ఓ దగ్గర తాపీగా కూర్చొని పీకలదాకా తాగేసిండు. మత్తులోనే కొండెంగలను ఇడిసిపెట్టి మెల్లగా పక్కకు తూలిపడ్డాడు. ఆ రెండు కొండెంగలు పడిపోయిన రమావత్ చుట్టూ తిరుగుతున్నాయి. లెమ్మన్నట్టుగా ముందుకాళ్లతో గీకి పెడుతున్నాయి. అయినా రమావత్ లేవలేదు.
ఆ మత్తులోనే నాలుక పిడ్సుకకట్టుక పోయింది.
“నీళ్లు…కావాలే…నీళ్లు… నీళ్లు…” అంటూ ఓ అర్థగంట వరకు తండ్లాడుతూ, తండ్లాడుతూ, ములిగి…ములిగి…చివరికి ప్రాణాలు విడిచాడు!
ఆ రెండు కొండెంగలు అచేతనంగా ఉన్న రమావత్ చుట్టూ తిరిగి తిరిగి అరిచి అరిచి అలిసిపోతున్నాయి. దూరం నుండి కొన్ని కోతులు ఈ కొండెంగలని చూసి మెల్లిగా ఊర్లోకి జారుకున్నాయి.
మెల్లగా చీకటి పడింది. అటువైపు నుండి వెళ్తున్న వాళ్లంతా రమావత్ పక్కన గుడుంబా ప్యాకెట్లు చూసి చనిపోయాడని మాత్రం అనుకోట్లేదు. రెండు కొండెంగలు మాత్రం తెల్లారే వరకు యజమాని శవం చుట్టే తిరుగుతున్నాయి.
పొద్దున్నే, రమావత్ శవాన్ని గుర్తుపట్టి కొంత మంది పరుగు పరుగున వెళ్ళి సర్పంచ్ కి చెప్పారు. సర్పంచ్ తలపట్టుకొని పోలీస్ స్టేషన్ కెళ్లి ఎస్.ఐ కి చెప్పాడు. ఊరి వాళ్లెవర్ని అటు వైపు రావద్దంటూ సర్పంచ్ కి చెప్పి, ఎస్.ఐ ఇద్దరు కానిస్టేబుళ్లను తీస్కొని శవం దగ్గరికి వెళ్లాడు.
ఆ రెండు కొండెంగలు శవం దగ్గరికి ఎవరిని రానియ్యట్లేదు. చుట్టూ తిరుగుతూ పోలీస్ లను కరవడానికి మీది మీదికొచ్చినయి. పెద్దపెద్ద లాఠీలతో బెదిరించగానే…దగ్గర్లోని ఓ చెట్టెక్కి కూచున్నాయి.
ఎస్.ఐ పడున్న రమావత్ శవాన్ని చూస్తూ
“ఇప్పుడు వీడి మీద కేస్ ఏం వద్దు గానీ, తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే పిలుపించండి”.
“సార్ వీడు అనాథ అంటా. వీడి డబ్బా ఫోన్లో ఉన్న నాలుగు నెంబర్లకి ఫోన్ చేస్తే ‘మాకు సంబంధం లేదని‘ కాల్ కట్ చేస్తున్నారు సార్” కానిస్టేబుల్.
“ఇప్పుడు వీడిని తగిలేయ్యలంటే మున్సిపాలిటీ వాళ్లు ఇప్పుడైతే రారు సార్, పైగా తర్వాత కూడా ఖర్చుకి మనల్నే డబ్బులు అడుగుతారు. ఇప్పుడు సర్పంచ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్”, ఇంకో కానిస్టేబుల్.
కొండెంగలు చెట్లకొమ్మల మీద ఎగురుతూ పోలీసుల వైపు చూస్తున్నాయి.
“ఓ పని చేయండి, శవాన్ని ఈడ్చుకెళ్లి పక్కకున్న నది అవతల ఒడ్డుకి పడేయ్యండి. అప్పుడది పక్కూరు పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. వాళ్ళు చూసుకుంటారు…”, ఎస్.ఐ కనుబొమ్మలు ఎగిరేస్తూ.
కానిస్టేబుల్స్ ఇద్దరు మొహాలు చూస్కున్నారు. తర్వాత అటీటు ఎవరూ లేరని చూసుకొని ఒకరు కాళ్ళు, మరొకరు భుజాల కింద చేతులేసి శవాన్ని బరబరా ఈడ్చుకెల్లి… అవతల ఒడ్డుకు పడేసారు!
ఓ అరగంట తర్వాత పక్కూరి పోలీస్ స్టేషన్ కి ఫోనొచ్చింది.
“సార్…వాగొడ్డుకి ఎవరిదో శవం పడివుంది” అని.
ఎవరు లేనప్పుడు కొండెంగలు మళ్లీ ఓ ఉదుటున కిందికి దూకి రమావత్ శవం దగ్గరికి వచ్చాయి. మెల్లగా తమ చేతులతో రమావత్ ని లేపాలని ప్రయత్నం చేసాయి. ఒడ్డుకు ఈడ్చుకొచ్చినప్పుడు వీపు కింద బట్టలు చినిగి దుమ్ము అంటుకున్న కూడా రక్తం చిక్కగా కారుతుంది, అది చూసి కొండెంగలు మొహాలు చూస్కొని భయపడ్డాయి. అప్పుడే మరో ఇద్దరు కానిస్టేబుళ్లను వచ్చారు. కొండెంగలు వాళ్ల లాఠీలకు భయపడి చెరో దిక్కు పరుగెత్తాయి. వచ్చిన వాళ్లు శవాన్ని ఈడ్చుకుంటూ మళ్లీ అవతల ఒడ్డు కి పడేసారు.
కొండెంగలకు అర్థం కాక ఓ ఆందోళన తో బిగ్గరగా కిచ్ కిచ్ మంటూ చెట్ల మీది నుండి చెంగున దూకుతూ అరుస్తూ ఉన్నాయి. వాటి కళ్ల నుండి మెల్లగా కారుతున్న కన్నీళ్ల ను ముందు కాళ్లతో తుడుచుకున్నాయి.
ఓ గంటలో మళ్లీ రమావత్ శవం ఈసారి వాగు మధ్యలో పడేసి పోయారు.!
‘ఈ మనుషులు మా యజమానిని ఎందుకలా చేస్తున్నారో‘ అర్థం గాక ఈసారి కొండెంగలు మౌనం గా ఉండిపోయి మెల్లగా కిందికి దిగిపోయాయి. వాగు దగ్గరికి పరిగెత్తగానే నీటి ప్రవాహానికి రమావత్ శవం కొట్టుకుపోతుంది. రెండు కొండెంగలు ముందు నీళ్ల ప్రవాహం చూసి భయపడ్డ, శవం కొట్టుకుపోతున్నప్పుడు మాత్రం గబుక్కున వాగులోకి దూకాయి. నీళ్లలోని బండ పాకురుకు అడుగులు జారుతున్న కూడా రెండు కొండెంగలు రమావత్ ని పట్టుకున్న కూడా అతని బట్టలు నీళ్ల వేగం కి చినిగి పోవడంతో పట్టుతప్పి శవం వేగంగా కొట్టుకుపోయింది. తామింకా అనాథలైనట్టు ఆ రెండు కొండెంగలు బిత్తరపోయి మొఖాలు చూస్కున్నాయి… నీళ్ల కండ్లతో.
అంత నీటి ప్రవాహం లో కూడా ఏదో అలికిడి అర్థమౌతుంది కొండెంగలకు. తొలి తిప్పుకుంటూ ఒడ్డుకొచ్చాయి, దూరం నుండి ఓ పెద్ద కోతుల గుంపు వాగు వైపే వస్తోంది. నిశబ్దంగా అడుగులేస్తున్న, వాళ్ల అరుపులు వినబడుతున్నాయి. కోతుల గుంపు ముందుర ఓ ముసలి కోతి భారంగా అడుగులేస్తోంది. దానికి నడవడమే కష్టంగా ఉంది. దాదాపు యాభై, అరవై కోతులు దాన్ని అనుసరిస్తున్నాయి. చెట్ల పొదల వల్ల కొండెంగలు వాటికి కనబడట్లేవు. ఎక్కడెక్కడో చెట్లలో దాగున్న కోతులు కూడా ఆ అరుపులకు జతగా అరుస్తూ గుంపులో కలుస్తున్నాయి.
వాగు దగ్గరికి చేరుకున్న ముసలి కోతి…తన కాళ్లతో ఇసుకని తవ్వింది. గొయ్యి తవ్విన తర్వాత ఆ ముసలి కోతిని మిగితా కోతులు దగ్గరగా హత్తుకున్నాయి. కన్నీళ్లతో ఆ ముసలి కోతి ఆ గొయ్యి లోకి దిగింది. మిగితా కోతులు అమాయకంగా చూస్తూ, తలా ఇంత ఇసుకపోసాయి. గొయ్యి మొత్తం పూడ్చాక విపారంగా వెనుదిరిగాయి.
మగ కొండెంగం, “ఒక కోతి ముసలయ్యాక, తన చావు తనకు తెలుస్తుందటా. అందుకే ఓ రోజు ముందే సాగనంపుతారు”అని.
“మనుషుల్లాగా కాదన్నమాట!”, ఆడ కొండెంగం.
మళ్లీ తనే, “మన కొండెంగలకూ, కోతులకూ శత్రుత్వం ఉందని ఎందుకనుకుంటారు ఈ మనుషులు ? ఈ కోతులు కూడా ఎందుకు మనల్ని చూసి భయపడ్తాయి,”
“ఇప్పుడు నీకు మనుషులు నమ్మే రామాయణం మొత్తం చెప్పాలి…” అని మొదలెట్టింది మగ కొండెంగం.
“ఏ రామాయణ నాటి విషయాన్ని పట్టుకొని తరతరాలుగా అదే శత్రుత్వమా! నాకైతే ఈ కోతులతో స్నేహం చేయాలని వుంది” చెప్పింది ఆడ కొండెంగం ముచ్చటగా.
“నాక్కూడా…పద”, అంది మగది.
ఎదురుగా వెళ్తున్న కోతుల గుంపుకు చెట్ల పోదలను నుండి దూకుతూ ఎదురుపడ్డాయి కొండెంగలు. అకస్మాత్తుగా అవి అలా దూకేసరికి, పిడుగు పడ్డట్టు భయపడి కోతులన్ని చెల్లాచెదురయ్యాయి. కొండెంగలు రెండు, “అయ్యే ఆగండి, మేం మీతో స్నేహం చేయడానికి వచ్చాం, మేం ఏమనం, భయపడకండి, పారిపోకండి. తప్పు చేస్తే క్షమించండి కానీ అలా పారిపోవద్దు”, ఓ ఆవేదనతో అరిచాయి.
“మమ్మల్ని నమ్మండి…నమ్మండి”, అంటూ పొడువాటి తోకను పైకెత్తి ఆడిస్తూ అంది మగ కొండెంగం. భయంతో కోతులు వాటి మాట నమ్మలేదు. పైగా చెట్టు కొమ్మల మీంచి కోపంగా అరుస్తూ, వీలైతే ఉమ్మడిగా కలిసి కొండెంగలపై దాడి చేయాలని సైగలు చేస్కుంటున్నా యి.
అప్పుడే…
ఓ చిన్న కోతి పిల్ల… గుంపులో వెనకబడిపోయి, కిచ్ కిచ్ మని ఏడుస్తూ చెట్టెక్కడానికి ప్రయత్నిస్తుంది. వేలాడుతున్న ఓ కొమ్మను పట్టుకోగానే, అది ఇరిగిపోయింది. ఆ కోతి పిల్ల దబ్బ్ మని కింద పడి దొర్లుకుంటూ దొర్లుకుంటూ ఆడ కొండెంగం దగ్గరికి చేరింది!
కోతులన్ని హ్రీచ్క్… హ్రీచ్క్…మని అరుస్తున్నాయి. కాపాడడానికి తల్లి కోతి కిందికి దూకింది. పిల్ల కోతి భయం భయంగా చూస్తుందని జాలేసి ఆ ఆడ కొండెంగం దాని తల మీద నిమిరింది. అది చూసి తల్లి కోతి భయం భయంగానే కోపడుతున్నట్టు ముఖం పెట్టి, కొండెంగం వైపు వస్తుంది.
కోతి పిల్ల కొండెంగం నల్లటి ముఖాన్ని చూసి భయపడి, ఇంకా బిగ్గరగా ఏడుస్తుంటే… కొండెంగం మెల్లగా దాన్ని దగ్గరికి తీస్కొని హత్తుకుంది. రొమ్ము తీసి నోట్లో పెట్టింది.
పాలు అందగానే కోతి పిల్ల ఏడ్పు ఆపేసింది. చుట్టున్న కోతులన్ని ఒక్కసారిగా అరవడం ఆపేసాయి. ఆశ్చర్యంగా చూడసాగాయి. తల్లి కోతి ఆనందంగా ఆగిపోయి చూడసాగింది. అప్పుడు కోతులన్ని చెట్ల మీది నుంచి నిదానంగా కిందికి దూకాయి. భయం వీడి కొండెంగలతో కలిసి తిరగడం మొదలెట్టాయి. అది తెలిసిన ఊరి జనమంతా మళ్లీ తలలు పట్టుకొని కూర్చుంటే…మక్క చేను రాజయ్య మాత్రం పిస్తోలు కొనుక్కుని దూరం నుండి గురి పెట్టి కూర్చున్నాడు.
*** అయిపోయింది ***

కె వి మన్ ప్రీతం
01 ఏప్రిల్ 1996లో జగిత్యాల్లో పుట్టి పెరిగారు. బీ.టెక్ చదివి ప్రస్తుతానికి హైద్రబాద్లో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తండ్రి ప్రముఖ రచయిత కె.వి.నరేందర్ గారి ప్రభావం చిన్నప్పటి నుండి ఉంది. కొత్తగా రాయాలి అనే తపనతో ఇప్పటివరకు 20 కి పైగా కథలు రాశారు. పలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. వివిధ కథా సిరీస్లలో వీరి కథలు వెలువడ్డాయి.

కథ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ చదవలేదు. కోతుల ద్వారా ఊర్లు అతలాకుతలం అవుతున్న పరిస్థితి, కొండెంగల మధ్యన వైరం అనుకునే మనం, మనిషి మరణంకి కోతి మరణంకి వాళ్ల మధ్య ఉన్న తేడా అద్భుతంగా చెప్పారు. మీరు మాత్రమే రాయగల కథలు…ఇంకా రాస్తూనే ఉండండి.
– అభిరామ్
కథ చాలా బాగుంది
తెలంగాణలో కోతుల దాడితో నిజంగా చాలా సమస్యలు ఉన్న మీరు ఎంచుకున్న కోణం గొప్పది. చివర్లో ముసలి కోతి చేసింది నిజంగా జరిగేవా కాదా అనేది నా డౌట్. చాలా మంచి కథ.