అచలానందాశ్రమంలో రెండు రోజులు

Spread the love

ఈ కథలో కొన్ని పాత్రలు, సంఘటనలు కల్పితాలు

హరిపురం నుండి మా తాత గారి ఊరు లక్ష్మీపురం వెళ్ళినప్పుడల్లా, కాశీబుగ్గ పెట్రోలు బంకు దగ్గిర పెట్రోలు పోయించుకోడానికి బస్సు ఆగేది. ఆ బస్సు లోంచి ఎడమ వైపు చూస్తే దూరంగా పొలాల్లో ఒక ఆశ్రమం కనపడేది. దాని ముందున్న ఆర్చ్ పై ‘అచలానందాశ్రమం’ అని రాసుండేది. ఇప్పుడైతే ఇళ్లూ, వీధులూ, కొట్లూ వచ్చేసాయి గానీ, ఆ 1960ల ప్రాంతంలో ఆ ఆశ్రమం చుట్టూ పొలాలే వుండేవి – మెయిన్ రోడ్డు నుండి ఆశ్రమానికి పోయే చిన్న రోడ్డు మినహాయించి. అలా బస్సులోంచి చూసినప్పుడల్లా – ఆ ఆశ్రమం బిల్డింగ్ చుట్టూ నల్లటి చల్లటి అరుగులు, వాటిమీద రంగులద్దిన స్తంభాలు, అరుగుల మీద కాషాయ వస్త్ర ధారులైన స్వాములు కూర్చుని కనపడుతుండేవారు. అక్కడో నుయ్యి, దాని ప్రక్కన బారులు బారులుగా రాట్లకి కట్టిన త్రాళ్ల పై ఆరవేసిన కాషాయ వస్త్రాలు కనపడేవి. ఎందుకో చెప్పలేను గానీ, ఎన్నో సార్లు బస్సు దిగిపోయి ఆ ఆశ్రమం వైపు వెళ్ళాలనిపించేది. వెళ్తే ఏ కారణం పెట్టుకుని వెళ్ళాలి అనుకొనేవాడ్ని. ఆశ్రమాలకి సాధారణంగా ఏ కారణం లేకుండానే వెళ్లొచ్చని అపుడు నాకు తెలీదు.

అవి నేను బ్రాహ్మణ తర్లా హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. అది మే నెల మధ్య కాలం. హరిపురం నుండి బస్సులో వెడుతూ ఆశ్రమం వేపు చూసా. అక్కడంతా సందడిగా కనిపించింది. బంతిపూల తోరణాలు కనపడుతున్నాయి. గడపల మీద కూచున్న స్వాములు కనపడ్డారు. ఏదో కార్యక్రమానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయనిపించింది.

లక్ష్మిపురం వెళ్లిన రెండో రోజే వేసవి శలవులు అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది – అచలానందాశ్రమం వెళ్లొచ్చని. ఇంట్లో చెప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆశ్రమానికి వెళతానంటే తిడతారు. లేకపోతే మరలా హరిపురం వెడతానని అబద్ధం చెప్పాలి. అందువల్ల ఆ మర్నాటి వుదయం ఇంట్లో చెప్పకండా, రైలు పట్టాల ప్రక్క బాటలో కాశీబుగ్గ దారి పట్టేను. పెట్రోలు బంకు వద్దకి వచ్చి చూస్తే ఆశ్రమ పరిసరాలు సందడిగా ఉన్నాయి. అప్పటికే మిట్ట మధ్యాహ్నమైంది. బంకు వద్ద రోడ్డు దిగి ఆశ్రమం వైపు నడక మొదలెట్టేను.

ఆశ్రమం లో మొదటి రోజు
ఆశ్రమం మండపం దగ్గరకు వచ్చేసరికి, అక్కడ అందరూ సాధువులే వున్నారు. సాధువులు కాని వారు కొంత మంది వంట దగ్గిరా, వేరే పనులు చేస్తూ కనపడ్డారు. అక్కడ ఉపన్యాసమేదో జరుగుతోంది. నేల మీద మఠం వేసుకుని ఒక సాధువు మాట్లాడుతున్నాడు. శ్రోతల వెనక చేరి కూర్చున్నా.

“జీవి ఆ విధంగా జీవన్ముక్తుడు అవుతాడు. అదే మోక్షం. అదే సచ్చిదానంద స్థితి” అని ఊర్ధ్వముఖుడై, చేతులు మోడ్చి మాటలు ముగించేడు.

అలా ఒకొక్క ఉపన్న్యాసమూ వింటో కూర్చున్నా. ఆ మాటలు, ఇంతకుముందు అనేక సందర్భాలలో నేను విన్నవే. ఆ మాటలు వింటోంటే నాకు గురజాడ కన్యాశుల్కం లో కల్లు పాక లో బైరాగుల చర్చ గుర్తు కొచ్చింది.

తీరిగ్గా పరికించి చూశాను అందర్నీ. ఎవరికి వారు, వారి కరెక్టు వేషధారణ లో ఉన్నారు. దాదాపు అంతమందికి తల జుట్టు జడలు కట్టి వున్నాయి. కొందరు ఆ జడల్ని తలమీదికి నూపురంలా ఎత్తుగా కట్టుకున్నారు. మరికొంతమందికి ఆ జడలు భుజాలమీదికి వ్రేలాడు తున్నాయి. ఒకరిద్దరు ఆడవాళ్లయితే ఆ జడలతో తల పైన ముడిలా వేసుకున్నారు. ఇక మెడలో రుద్రాక్ష దండలు, చేతులకి నూలుతో కట్లు, నుదురు, మొహం, దండలు, చేతులకి విభూది చారలు వున్నాయి. వారెవరూ పెద్ద మఠాల్లో, ఆశ్రమాల్లో వుండే – ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరించి, విలువైన రుద్రాక్ష మాలలు తిప్పే – స్వాములు కారు. వారి శుష్క శరీరాలూ, సాధారణ కాషాయ వస్త్ర ధారణా, పాండిత్య రహిత సంభాషణా – చూస్తే, వీరందరూ మాస్ సాధువులని నాకర్థమైంది. అంచేత, వీరి మాటల్లో గొప్ప గొప్ప ఆధ్థ్యాత్మిక సిద్ధాంత పదాలూ, భగవద్గీతకి రెఫరెన్సులూ వినపడలేదు, ఎవరో ఒకరిద్దరి సాధువుల నుండి తప్పించి. ఐతే, వారిలో కొంతమందికి తామున్న సన్యాసాశ్రమం పట్ల సిన్సియారిటీ ఉన్నదని నాకు అనిపించింది.

క్రమంగా, మధ్యాహ్నపు వేడిగాలులు చల్ల బడ్దాయి. సూర్యుడు అస్తమించేడు. పద్మనాభపురం పొలాల మీంచి వస్తున్న గాలి మట్టి వాసన మోసుకొస్తోంది. దూరంగా పెట్రోలు బంకు వద్ద నుండి ట్రాఫిక్ రొద వినపడుతోంది. సాధువులు ఒకరొకరే మండపం మీదికి చేరుతున్నారు. అక్కడ ఒక బైరాగి చేతిలో తంబూరా తో కూచుని వున్నాడు. సాయంకాల కీర్తనల సమయం మొదలైంది. నేనక్కడికి వెళ్లి కూర్చున్నా. ఆ రోజున ఆ పాటలన్నీ నాకు వేరే లోకం నుండి వినిపిస్తున్నట్టనిపించింది.

‘ఇల్లు ఇల్లని యేవు | ఇల్లు నాదని యేవు
నీ ఇల్లు యెక్కడే చిలుకా | ఊరికీ దూరాన వల్లకాటిల ఉంది చిలుకా
నీదన్న దేహమే నిన్ను కాదని పోవు | నీదనే దేదికా మనసా
నీ ఇల్లు అక్కడే చిలుకా’

అంటో ఆ సాధువు పాడుతున్నాడు. వారక్కడ పాడిన పాటలన్నీ జీవితం యొక్క అశాశ్వతత్వం గురించే. అప్పటికింకా బ్రతుకు తత్వమే అవగాహన కాని నాకు – అవి అర్థం కాక పోయినా, ఆ తత్వాలొక అనిర్వచనీయమైన అనుభవం లోనికి తీసుకెళ్లి పోయేయి. నా మీద ఒక మబ్బు దుప్పటి కప్పినట్టూ, నేను సాయంసంధ్యకి చీకటి కి మధ్య సంచరిస్తున్నట్టూ, ప్రపంచానికి అంచున ఒంటరిగా కూర్చున్నట్టూ – అనిపించింది. ఇప్పటికీ, ఆ పాట – చేతిలో తంబూరతో, సాయంసంధ్యలో అరుగుమీద గోడకి జేరబడి బ్రతుకు తత్వాన్ని నెమరు వేసుకుంటూ పాడుకుంటున్న సాధువుని – నాకు గుర్తుకు తెస్తుంది.

నా భుజాన్నెవరో తడితే తలెత్తి చూశా. రెండు అరటిపళ్లూ, బెల్లంతో కలిపిన సగం నానిన అటుకులు ఉన్న బాదం ఆకుని నా చేతిలో పెట్టేరు.

రాత్రి పదైంది. కీర్తనల కార్యక్రమం పూర్తయింది. సాధువులు నిద్రలకి తయారవుతున్నారు. అక్కడి వాతావరణ మేమిటో, నన్నెవరూ అంతవరకు నీవెవరు, ఎక్కడనుంచి వచ్చేవు అని అడగలేదు. ఆశ్రమంకి రావడానికి పర్మిషన్లు అక్కరలేదేమో. మండపం చివరన మంచం మీద ఓ సాధువు నిద్రకి వుపక్రమిస్తున్నాడు. కాస్త దూరంగా గోడకి ఆనుకుని ఓ పొడవాటి బెంచీ వుంది. ఆ సాధువు నన్ను చూసి –

“నీవా బెంచీ మీద పడుకోరా అయ్య, మరెటూ వెళ్లకు” అన్నాడు.

ఆ తరువాత తెలిసింది అతనే ఆచలానంద అని. అక్కడున్న వారందరికీ ఇలాంటి పేర్లే వున్నాయి. అఖిలానంద, స్వరూపానంద, సిద్ధానంద, చిదానంద, అభేదానంద – మళ్లా ఆ పేర్ల చివర స్వామో, అవధూత అనో వుంటాయి. అన్నింటికీ ఆనందం కామన్. ఈ పేర్లన్నీ ఆ ఆనందంలో రకాల్ని చెప్తున్నవే. ఆనందానికి ఇన్ని వర్ణాలా?

రెండో రోజు
చల్లటి గాలి తెరలు మొహాన్ని తాకుతుంటే నిద్రలోంచి మేలుకున్నాను. ఇంకా సరిగా తెల్లవారనే లేదు. మండపం మీద ఒక్కరు లేరు. అంతా మొక్కల మధ్య పువ్వులేరుతో, నుయ్యి దగ్గిర స్నానాలు చేస్తో, వంటశాల వద్ద పనుల్లో వున్నారు. మండపం దిగి బయటికొచ్చి నిలబడ్డా. వేసవి కాలమైనా, మందార మొక్కల మీద, క్రింద పచ్చిక మీద రాత్రి మంచు పడి నిలిచిన నీటి బిందువులు. ఎదురుగా బాదం చెట్టు మీద కాకుల గోల. ప్రహరీ గోడకి ఆవల పొలాల మీద ఉదయించబోయే సూర్యుని కిరణాలతో తెల్ల బడుతోన్న ఆకాశం.

నూతి దగ్గరకి వచ్చేను. నాలో ఒక సంతోషం, ఒక ఉత్సాహం. వంటకి గంగాళాల్లోకి నీరు తోడుతున్నాడొకతను. అతని చేతిలోంచి చేద తీసుకుని రెండు పెద్ద గంగాళాలు నింపేశాను. తరువాత, చల్లటి నూతి నీళ్ళ తో స్నానం చేసి షర్టు వుతీకి ఆరబెట్టుకున్నాను.

సుమారు పది గంటలయేసరికి సాధువులందరూ అచలానంద స్వామి ఉపన్యాసముందని మండపం మీదికి చేరుతున్నారు. అక్కడ వాళ్ళిచ్చిన ఉపాహారం ఉప్మా తిని, కంచె మీంచి ఆరిన షర్ట్ తీసి వేసుకుని గుంపులో కూర్చున్న. ఎదురుగా జింక చర్మం మీద ఆసీనులై అచలానంద. ఆడియన్స్ సద్దుమణిగాక ఆయనిచ్చిన ఉపన్యాస సారాంశమిదీ.

“జీవాత్మ పరమాత్మలో లయమవడమే మోక్షం. ఈ దేహమే నేను అనుకోవడం మాయ. అజ్ఞానం. ఈ దేహం తో ప్రమేయం లేకుండా జాగ్రత్స్వప్నసుషుప్తావస్థల లోనూ మన లోపల అమేయంగా వెలుగుతుండే సత్యావస్థే జీవాత్మ.

ఈ దేహ వ్యాపారాలవల్ల ఏర్పడిన పంచకోశాలు జీవాత్మని చుట్టి ఉంటాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలే పంచకోశాలు. ఈ దేహమనే ఘటం లోపల జీవాత్మ స్వయం ప్రకాశితం. అచలం. అకారణం. అభేదం. నిర్గుణం. కానీ, ఘటం లో వున్న జీవాత్మ పంచకోశాల ప్రభావం వల్ల – అంటే అజ్ఞానం వలన – మబ్బు కమ్మిన చంద్రుడిలా – బయటపడదు.

జీవుడు ఈ దేహమే నిత్యం, సత్యం అన్నట్టు బతుకుతుంటాడు. ఆ దేహం కల్పించిన లంపటాల్లో చిక్కుకుని, దాన్నే పోషించుకుని, ప్రేమించుకుని జీవిస్తాడు.

ఈ దేహం ఒక కారు లాంటిది. దానిలో డ్రైవరు జీవాత్మ. వాహనమే నేను అనుకోవడం మాయ. ఎందుకంటే, ఈ వాహనం నుండి డ్రైవర్ నిష్క్రమిస్తే, ఆ కారు మరి నడవదు. అలాగే, ప్రాణం నిష్క్రమిస్తే, ఆ దేహం చిలుక వదలిన గూడే. ఆ శరీరం ముందు పరమాన్నం పెట్టినా తినలేదు. పట్టు వస్త్రాలు ఇచ్చినా వేసుకోలేదు. ఇది తెలుసుకోవడమే ఆత్మ-అనాత్మ వివేచన.

ఈ దేహానికి చివరి గమ్యం శ్మశానం. జీవాత్మకి పరమాత్మతో కైవల్యమే తుది లక్ష్యం. ఈ దేహమనే కుండలో ఉన్న ఆకాశం, దాని బయట ఉన్న ఆకాశం రెండూ ఒకటే. దేహం వయోభారం తో నశిస్తే, దానిలో ఉన్న జీవాత్మ పరమాత్మతో లయిస్తుంది. అదే కైవల్యం.

ఇది నిత్య సత్యం. ఈ సత్యం ఎరుకైతే, మరణ భయం ఉండదు, ఎందుకంటే మరణమన్నదే అసత్యమని తెలుస్తుంది గనుక.

ఇలా జీవాత్మే నేను. ఈ దేహం నేను కాదు అని ఎరుక కలగటమే శివోహం అని తెలుసుకోవడం. ఈ దేహం కల్పించిన లంపటాలు మిథ్య అని తెలుసుకోవటమే ‘బ్రహ్మ సత్యం జగత్ మిథ్య’ అని ఎరుక కలగటం. అదే మోక్షం.” అని ముగించేడు.

అతను బ్రహ్మ జ్ఞానానికి మార్గం మా కాంపోజిట్ మ్యాథ్స్ టీచర్ జయశంకర్ కాంప్లెక్స్ ఫార్ములాని విడగొట్టి చెప్పినట్టు కనపడింది. ఆ వయసులో నాకు ఆ మాటలు ఒక సమ్మోహనాస్త్రంలా పని చేసి నన్నొక అధివాస్తవిక స్వప్నావస్థ లోనికి తీసుకెళ్లి పోయేయి. ఉపన్యాసం తరువాత మండపం దిగి బయటికి వచ్చి నుంచున్నాను. నూతికి దూరంగా వంట పాత్రల మీద మెతుకుల కోసం కాకులు దెబ్బలాడుకుంటున్నాయి. వంటశాల నుండి పప్పు చారు వాసనలు గాల్లో తేలుకుంటూ వస్తున్నాయి.

నూతి వద్దకి వచ్చి, ఖాళీ గా కనిపించిన గంగాళాలు మళ్ళా నింపడం మొదలు పెట్టేను.

“తెండు తెండు రా అయ్య! నువ్వు మంచోడివిరా!” అన్నదా పనిమనిషి.

చేద వేసి నీళ్ళు తెండుతో – “ఈ నీళ్లు తెండుతున్నది ఈ దేహం. నేను కాదు. ఆమె ‘నేను మంచి’ అన్న మాట, నా దేహానికే – నాకు అంటే నా జీవాత్మకి అంటదు” అనుకున్నాను.

ఆ మధ్యాహ్నం వేడన్నం లో పప్పు చారు వేసుకుంటో తింటున్నది నేను కాదని గట్టిగా అనిపించింది. కూచున్నా, లేచినా అదే భావం. నాకు నవ్వొచ్చింది. అది భ్రమో, జ్ఞానోదయమో తెలీదు. అచలానంద స్వామి మాటలు ఎక్కడో అథోలోకం లో, అంధకారంలో మ్రోగుతున్న గంటల శబ్దాల్లా వినిపిస్తున్నాయి.

అదే రోజు సాయంకాలం
సూర్యాస్తమయమయింది. రాత్రి తిండి – బెల్లం అటుకులు, అరటిపండ్లు – ఉన్న అరిటాకుని ప్రక్కన పెట్టుకుని తూర్పు వైపు మండపం అంచున కాళ్లు వేళ్ళాడేసుకుని కూర్చున్నా. కాకులు ఎప్పుడో సీన్ నుండి నిష్క్రమించేయి. చంద్రుడు దూరంగా పొలాల మీద నుంచి ఆకాశం మీదకి ప్రాకుతున్నాడు. నక్షత్రాలు ఒకటొకటే బయట పడుతున్నాయి. వెనుక నుండి సాధువుల కీర్తనలు మంద్రంగా వినిపిస్తున్నాయి. ఎక్కడి నుండో కీచురాయి వుండి వుండి గీ పెడుతోంది. అవి తప్ప, చాలా మేరకు నిశ్శబ్దం అలుముకుంది.

రాత్రికి మరలా ఆ గోడ ప్రక్క బెంచీ మీదకి చేరేపోయేను నిద్రకై.

మూడో రోజు ఉదయం
గబుక్కున తెలివొచ్చింది. అప్పటికే బాగా తెల్ల వారి పోయింది. మండపం మీద జనాలు పూర్తి గా పల్చబడి పోయేరు. లేచి నూతి వద్ద స్నానాదికాలు ముగించి, అచలానంద స్వామికి వెళ్లొస్తానని చెప్పి, ‘ఉప్మా తిని పోరా బాబు’ అని పిలుస్తున్నా వినిపించుకోకండా లక్ష్మి పురం దారి పట్టాను.

ఊరు చేరి, మా ఇంటి పెరట్లోకి వచ్చేను. అక్కడ నాన్నమ్మ ప్రత్యక్షం. నన్ను చూడగానే, ముంజూరు కిందకి నా బుర్ర వంచి, ఇంట్లోకి లాగి –

‘ఎక్కడున్నావురా ఈ రెండ్రోజులు? ఎటెళ్లిపోయేవు? హరిపురమూ ఎల్ల లేదు, మరెక్కడికెళ్లావురా?’ అని కోపంగా, ముక్కు బులాకీ ఎగరేస్తో, తిట్ల దండకం మొదలెట్టింది. అలా తిడుతోందే గానీ, ఆమె కళ్ళల్లో నీళ్లు. పాపం ఎంత గాబరా పడిందో! నడకకి కాళ్లు విపరీతంగా పీకటం మొదలెట్టేయి. మరో మాట మాట్లాడకుండా, నడిమింట్లోకి నడిచి, మంచం మీద పడి నిద్రలోకి జారుకున్నా.

బమ్మిడి దేవీ ప్రసాద్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *