జెండర్ ఎథిక్స్

Spread the love

అర్థరాత్రి దగ్గరపడుతోంది.

మూర్తికి నిద్రరావడం లేదు. పక్కన ఆదమరిచి పడుకున్న భార్య. “కేరెక్టర్ లేని స్త్రీ…’ మనసులో మరోసారి ఛీ కొట్టాడు. ఆమె నీతితప్పటం సహించలేక పోతున్నాడు. తనకు ఇష్టంలేని మనిషి. ఏమైతే ఏంటని అనుకోలేకున్నాడు. అది బాధనో లేక స్వాధీనత పోయిన భావనో అతనికి అర్థం కాలేదు. నిజానికది బాధ కాదు. తనదనుకున్న దాంట్లో మరొకరి జాడ కనిపించి సహించక పోవడం. జేబులో డబ్బులు మరెవరికో ఖర్చయినప్పటి ఉక్రోషం.

గదిలో గడియారం జీరోగంటలు కొట్టింది. ఎప్పటిదో పాత కూలర్ శక్తికొద్దీ తిరుగుతున్నా ఉక్కపోతదే ఆధిపత్యం. చాలాసేపటి నుంచి అట్లా బోర్లా పడుకుని అతనికి ఛాతి పట్టేసింది. ఇద్దరికి పూర్తిస్థాయిలో సరిపోని మంచం. కొద్దిగా పొర్లడానికి కూడా లేదు. కారణం.. భార్య నిండు గర్భవతి. ఆమెని పరీక్షగా చూశాడు. పొట్ట ఎత్తుగా. అలసిన ముఖం.పాతనైటీ వేసుకుంది. ఒక స్త్రీని ఏమాత్రం అందంగా చూపలేని డ్రస్. తన సొంతమైన సౌందర్యం ఇప్పుడు వికారంగా అనిపించింది. విసుగు భరించలేక లేచి మెల్లగా బయటికి నడిచాడు.  

“అర్ధరాత్రయింది… ఇంకా నిద్రపోలేదా?” వెనుక నుంచి ప్రశ్న.

అంటే మేలుకునే ఉందన్నమాట. సమాధానం చెప్పాలనిపించలేదు. సిగరెట్ వెలిగించి పొగలో తన అసహనాన్ని కలిపేశాడు.

“ఇప్పుడు కూడా సిగరెట్ లేకుండా ఉండలేరా?”

దీనికీ స్పందించలేదు. పక్కనే ఉన్న కుర్చీ లాక్కొని కూలబడ్డాడు. పక్కవాటా లోంచి చిన్నగా మాటలు. భార్యాభర్తల గొడవ. గొంతు తగ్గించినా బాగానే వినిపిస్తున్నయి. రెండు పొర్షన్ల నడుమ సన్నటి గోడ మాత్రమే అడ్డు. వినకూడనివి కూడా వినకతప్పదు

“ఇంతరాత్రి ఏంటిదే లొల్లి? ఎందుకంత గొడవ జేస్తున్నవు?” అవతలవైపు మొగుడు.   

“ఉన్నమాటంటే గొడవ తీర్గ ఉన్నదా? ఇంట్లో రూపాయి ఇవ్వవుగాని బయట సోయి లేకుండ తాగొస్తవు. అర్ధరాత్రి నిద్రపోతున్న పెండ్లాన్ని లేపి పశువులెక్క మీద పడ్తవు. ఇది గొడవ కాదా?”

“ఏంటిదే నోరు లేస్తుంది? నాలిక చీరేస్తా ఏమనుకున్నవో”

“ఇల్లు పట్టదుగని మగ జులుం మాత్రం చూపిస్తవ్. నాఒంటి మీద గురిజెత్తు బంగారం మిగలకుండ అమ్ముకుంటివి. జీతమంత నీమీదనే పెట్టుకొంటివి. పిల్లల స్కూలు ఫీజులు కట్టకపోతివి. పోరగాండ్లు రోజు మొత్తుకున్నా నీకు వినిపించదాయె. మూడునెల్ల ఇంటి కిరాయ బాకీ పెడ్తివి. ఇంటాయన అడ్డమైన బూతులు తిట్టిపోతుండు. రేపోమాపో సామాన్లన్నీ బయట పారేస్తడు. ఈనెల ఇప్పటికి కిరాణం సరుకులకే పైసలియ్యకపోతివి. ఇల్లెట్ల నడుస్తదనుకున్నవు? రేప్పొద్దున పిల్లల బాక్సుల్లోకి ఏంపెట్టి పంపాలె?”

“ఏహే, ఫాల్తుదానా! హాయిగ సుఖపడే టైముల బేకార్ మాటలెందుకు?”

“నావి బేకార్ మాటలా? అయితే నేను యెళ్లిపోతా”

“యాడికే పోయేది… బొక్కలిరుగుతయి. నోర్మూసుకొని పండుకో” 

కొంతసేపు మాటలు వినిపించక నిశ్శబ్దం. తర్వాత ఆమె చిన్నగా ఏడుస్తున్న చప్పుడు. 

ఏం చేశాడు మొగుడు? కొట్టాడా..? హింసిస్తున్నాడా? 

మూర్తి వాళ్ళ రేపటి ఉదయం గురించి ఆలోచించాడు. ఏంచేస్తుందా ఇల్లాలు? ఎట్లా వండుతుంది? పిల్లలకు ఏం పెట్టి స్కూలుకు పంపుతుంది? మరి తన పిల్లల సంగతేమిటి? వాళ్ళ బాక్సుల్లోకి ఏమైనా ఉన్నదా? రేపు భార్య తనని నిలదీసే మాటలు కూడా అవేనేమో. ఇంటి నుంచి బయటపడి రోడ్డెక్కాడు. అప్పుడే వర్షం కురిసి వెలిసిన మట్టి వాసన. దారిపక్కన చెట్ల కొమ్మల నుంచి ఇంకా జారిపడే నీటిచుక్కలు. రోడ్డుమలుపులో కమ్మటి తేనీటి ఆవిరి అతని శ్వాసలోకి దూరింది. టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగాడు. పక్కనుంచి పేపరు బాయ్ ఒకరు సైకిల్ మీద ఆగకుండా వెళుతూ పత్రికల్ని ఇళ్లలోకి విసిరేస్తున్నాడు. ట్రాఫిక్ లైట్లు ఇంకా నిద్రలోనే ఉన్నా స్ట్రీట్ లైట్లు ఆరిపోయి ముగిసిన రాత్రికి సాక్ష్యం చెపుతున్నయి. సూర్యుడొచ్చేందుకు ఇంకా టైమున్నా దినపత్రికల సాక్షిగా కొత్తరోజు మొదలైంది.

మూర్తి నడుస్తూ ఒకర్ని గుర్తుచేసుకున్నాడు. ఆమె విమల. కోల్పోయినందుకు మరోమారు పశ్చాత్తాపపడ్డాడు. బాల్యం నుంచి కలిసి పెరిగారు. ప్రేమలు పంచుకొని పరిస్థితుల వల్ల ఇద్దరి దారులు వేరైనయి. ఆమె వేరొకరిని చేసుకుంది. తను మరొకర్ని చేసుకున్నాడు. 

ఆమె ఈఊళ్లోనే ఉంటుంది. పరాయిదైనా ఇప్పటికీ సన్నిహితమే. ఇద్దరి మధ్య ఒక రహస్య బంధం.

మూర్తి అడుగుల వేగం పెంచాడు. ముందు పరుగెత్తే నీడలా ఆలోచనలు వొదలటం లేదు. 

ఎదురుగా పెద్ద ప్రచార హోర్డింగ్ అతని దృష్టిని ఆకర్షించింది. ముద్దొచ్చే ఇద్దరు పిల్లలతో ఆనందంగా నిల్చునున్నారు తల్లిదండ్రులు. 

ఇద్దరు పిల్లలు ముద్దు, చిన్న కుటుంబం చింతలు లేనిదన్న పెద్దపెద్ద అక్షరాలు. అందులో నిజం నిజజీవితంలో ఎంత? 

ఇద్దరు పిల్లలైతే సంతోషానికి గ్యారంటీ ఉంటుందా? ప్రేమించడం లాంటిదే ఇదికూడా. ప్రేమించుకుంటే ఒకటై జీవిస్తారని, పెళ్లయినంత మాత్రాన ప్రేమతో ఉంటారన్న భరోసా లేదుకదా?    

మూర్తి తమ ఇంటి వీధిమలుపులోకి తిరిగాడు. అప్పటికి తూర్పుదిశలో సూర్యుడు మెల్లగా కళ్ళు తెరుస్తున్నాడు. నగర కలకలం మొదలైపోయి ఉషోదయాన్ని తాకుతున్నది. మురికి కాలువ ప్రవహించే దారిని, దుర్వాసన వెదజల్లే గాలిని చీల్చుకుంటూ ఇల్లు చేరుకున్నాడు.  

                                                  ***

అప్పటికి ఇంకా నిద్రపోయే పిల్లల్ని భార్య హంటర్ దెబ్బల్లాంటి మాటలతో లేపుతున్నది. కాస్సేపటికి వాళ్లు లేచి హడావిడిగా తయారైపోయి, యే పచ్చడి మెతుకులో తినేసి భుజాన బ్యాగులతో నీడల్లా అదృశ్యమయ్యారు.

“ఇప్పటికి కోతులు వెళ్లిపోయాయి” అన్నదామె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ. అది మామూలు మాటే. కానీ మూర్తి అకారణ కోపం తెచ్చుకున్నాడు. “ఏమిటా మాటలు… కన్నతల్లివేనా నువ్వు? ఒకనాడు వాళ్ళు నిన్నిలాగే అంటే ఏంచేస్తావు?”  

“ఇప్పుడు నేనేమన్నాను… అంత కోపం దేనికి?”

“కోపం కాక మరేంటి? నీ మాట.. అవతారం, అసలు నిన్ను చూస్తేనే కంపరం పుడుతుంది”

“ముగ్గురు పిల్లల తండ్రికి పెళ్ళాం చీదరనిపిస్తే అదేం కొత్త విషయం కాదు” తిప్పికొట్టింది.

అప్పటివరకు బలవంతంగా అణచిపెట్టుకున్న కోపం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రక్తపోటు పెరిగినట్టు చిన్నగా కంపించి పోయాడు. ఆమెమీద ఇంకా గట్టిగా అరవాలనుకున్నాడు. ఈలోగా సంభాషణ పొడిగించడం ఇష్టంలేక తను అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.

అది ఒకే గది పోర్షన్. మధ్యలో అడ్డంగా కట్టిన కర్టెన్ దాన్ని రెండుగా విభజిస్తుంది.

ఆమె మౌనంగా పిల్లల పక్కబట్టలు ఎత్తి మడత పెట్టింది. తర్వాత చీపురుతో ఆ వన్ బై టూ ఇల్లు శుభ్రంగా ఊడ్చింది. ఒక బకెట్లో ఉతకాల్సిన పిల్లల బట్టలు, భర్తవి, తనవి వేసుకొని గచ్చులోకి తీసుకెళ్లింది.

“జాగ్రత్త… మనసెక్కడో పెట్టుకుంటే జారిపడిపొగలవు. నువు కడుపుతో ఉన్నాననే విషయం గుర్తుంచుకుంటే మంచిది” టీవీ సీరియల్సులో తరచుగా కనిపించే మొగుడి మాదిరి డైలాగులు అప్పజెప్పినట్టు అన్నాడు. మరి కాస్సేపటికి ఆమె కూడా పాత సినిమాల్లో సగటు గృహిణిలా కాఫీతో వొచ్చింది.

అందుకుంటూ భార్యవైపు గుచ్చిగుచ్చి చూశాడు. ఆమె వెళిపోతుంటే చెయ్యి పట్టుకున్నాడు.“కట్టుకున్న మొగుడికి చాటుమాటుగా ద్రోహం చేస్తున్న మహా ఇల్లాలివి నువ్వు” అన్నాడు వెటకారంగా. 

ఆమె ఆశ్చర్యపోయి చూసింది.  

“నువు రహస్యంగా దాచుకున్న ఫోటోలు నాకు దొరికాయి” నాటుబాంబు విసిరినట్టు చెప్పాడు.  

ఉలికిపడిందామె. ముఖంలో రంగులు మారినయి. మాట్లాడకుండా తలదించుకున్నది. ‘ఛ… తను వాటిని ఎప్పుడో తగులబెట్టాల్సింది. మర్చిపోయి అట్లాగే ఉంచేసింది. ఇప్పుడవి భర్త స్వాధీనంలోకి వెళ్ళినయి. అతను వాటిని భార్య నైతిక ద్రోహానికి సాక్ష్యాలుగా భావిస్తున్నాడు.తనను వేధించేందుకు అవిప్పుడు ఆయుధాలు. భార్య చెడిపోయిందన్న భావనకు ఆజ్యం పోస్తుంటయి.  

“అతడు మా బావ, మేనత్త కొడుకు…” చిన్నగా ఏదో చెప్పబోయింది. 
“అబద్ధాలొద్దు… ఎవడు వాడు? ఎంతకాలం నుంచి సాగుతుంది ఇది?”

ఆమెకు బాధ, అంతకు మించిన ఆవేశం కలిగాయి. ఈలోగా అతనే అన్నాడు.

“నీ కడుపులో ఉన్నది నా బిడ్డనా, లేక…”

“అట్లా మతిలేకుండా మాట్లాడకండి…” గట్టిగా అరిచింది. ఆమె ముఖంలో అసహ్యం కొరివి అంచున మంటలా ఎగిసింది.
 మూర్తి అదేం పట్టించు కోకుండా “వాడితో సంబంధం ఇంకా సాగుతోందా?” అన్నాడు.

అతనిలో ఉక్రోషం ఊపిరాడకుండా చేస్తోంది. పంజరంలో ఉండాల్సిన చిలుక తన కన్నుగప్పి బయట స్వేచ్ఛగా ఎగిరివస్తుంది.  

ఆమెకు సమాధానం చెప్పాలనిపించ లేదు. భార్య అట్లా తలదించుకోవడం, జవాబు చెప్పక పోవడం మూర్తి సహనాన్ని చంపేసింది.

తనను తాను సంబాళించుకునే క్రమంలో టేబుల్ అంచును గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను ఎన్నో అనాలనుకున్నాడు. 

“ఫరవాలేదు నిజం చెప్పు. పెద్దమనసుతో నేనర్థం చేసుకోగలను” అన్నాడు.

భర్త ఎంత పెద్దమనసుతో అర్థం చేసుకోగలడో గ్రహించిన ఆమె తిరిగి మౌనాన్నే ఆశ్రయించింది.

మూర్తికి ఇంకెలా రియాక్టు కావాలో తోచలేదు. అసలేమీ జరగలేదని మనసుకు సర్దిచెప్పు కోవాలా? ఈ తుఫాను ఏదోలా సర్దుకుంటే చాలనుకోవాలా? లేక భారీ వరదలేవైనా వచ్చి ఆమె కొట్టుకుపోవాలని కోరుకోవాలా?

ఈ మానసిక ఉద్రిక్తతలో అతడో పిచ్చిపని చేశాడు. గబుక్కున గోడమీది దేవుని పటం అందుకొని భార్య చేతిని దానిపై ఉంచి ప్రమాణం చెయ్యమన్నాడు. దీనికామె నివ్వెరపోయింది. వెను వెంటనే ఒక తెగింపు వొచ్చింది. దేనికోసం ప్రమాణం? తనకు శీలపరీక్ష చేస్తున్నాడా? దేవుని మీద ఒట్టేస్తే తన కేరెక్టర్ సరైపోతుందా? ఆ హక్కు భర్తకు మాత్రమే ఉంటదా? నిందలు వెయ్యడం, తీర్పు చెప్పడం అన్నీ అతనివేనా?   

ఈలోగా మూర్తి లేచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు.

                                         ***

తలుపు తెరిచింది విమల. అతన్ని చూడగానే కంగారు పడింది. ఒక్కచూపులో ఆమె మునుపటిలా లేదని గ్రహించాడు. తను రాగానే ఎప్పుడూ కలిగే సంతోషం ఇప్పుడు లేదు.“ఎందుకో నీ మూడ్ బాగున్నట్టు లేదు?” అన్నాడు మూర్తి ఆమెను దగ్గరకు తీసుకుంటూ.

అతని చేతుల్లోంచి దూరం జరుగుతూ “ఇక మనం కలవకూడదు, నువ్విక్కడికి రావొద్దు” అన్నది.

“హఠాత్తుగా ఏమిటీ నిర్ణయం? ఎందుకు?”

“మనం చేస్తున్నది తప్పు”

“ఇంతకాలం తర్వాత గ్రహించావా? లేక హఠాత్తుగా పవిత్రత గుర్తొచ్చిందా?” అన్నాడు కఠినంగా.

“అదంతా వొద్దు. కానీ ఇది ఆగిపోవాల్సిందే.”
 మూర్తి కొద్దిసేపు మౌనంగా ఉండి నిలదీసినట్టు అడిగాడు “ఇదే నీ నిర్ణయమా?”

ఆమె సమాధానం చెప్పకుండా ముఖం చేతుల్లో దాచుకుంది.  

“ఇప్పటివరకు అంతా బాగానే జరుగుతోంది కదా, మరెందుకు?”

“మన బంధం మరొకర్ని బాధించకూడదు కదా” అంది.

“సరే, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు మంచం పైకి రా”

తను రాలేదు. మరింత దూరం జరిగింది. 

“రమ్మంటున్నానా?” అతనిలో అసహనం.

“ప్లీజ్… మన మధ్య యే బంధాలూ వద్దు”  

ఆమె ఏడుస్తున్నట్టు గ్రహించాడు.

“అసలు కారణమేంటో చెపుతావా?”
 విమల చెప్పలేదు, ఏడుపు ఆపలేదు.

“ఏం జరిగిందంటే చెప్పవు. నీ ఏడుపు వినడానికా నేనింత దూరం వొచ్చింది?”
 కాస్సేపటికి సంబాళించుకొని “వద్దు, ఇదిక ఇంతటితో ఆపేద్దాం” ప్రాథేయపడింది.
 “హఠాత్తుగా ఎందుకు”

“క్రితంసారి నువ్వొచ్చినప్పుడు నా భర్త చూశాడు.”

“అదా విషయం. నిన్నేదైనా అన్నాడా? భయపడుతున్నావా?”

విమల మాట్లాడకుండా వచ్చి అతని పక్కనే పడుకుంది. మూర్తి ఆమెను పరీక్షగా చూశాడు. కళ్ళలో అలసట, ముఖంలో ఆందోళన. చిందరవందరైన జుట్టును సవరిస్తూ నెమ్మదిగా చేతిని ఆమె గుండెల మీదకు జరిపాడు.

“వద్దు… వద్దు” కంగారుగా అందామె. చప్పున చెయ్యి తీసేశాడు. ఆ చేతిని అలాగే పట్టుకొని ఆమె పెదాలకు ఆనించుకుంది. 

అతనికి పూర్తి అభిముఖంగా తిరిగింది. ఇద్దరి ముఖాలు చేరువై, చూపులు కాంతిరేఖల్లా కలుసుకొని నిశ్చలమైనయి. 

“ఆయన ఇప్పుడు ఊళ్లోనే ఉన్నాడు” అందామె చిన్నగా.  

ఈమాట పరోక్షంగా తనను హెచ్చరిస్తున్నట్టు మూర్తి భావించుకున్నాడు. ఆమెవంకే చూస్తుండిపోయాడు. ఎక్కడో ఏదో సారూప్యత అతని మెదడు తలుపు తట్టింది. ఆమె ముఖంలో భార్య కనిపించి ఒక్కక్షణం కలవరపాటుకు లోనయ్యాడు. ఇక అక్కడుండలేక బయటకొచ్చి రోడ్డుమీద నడవసాగాడు.

                                  ***

ఒక సాయంత్రం మెట్రో స్టేషనులో కలిసిందామె. సూర్యుడు అప్పుడే పశ్చిమాన దిగిపోతూ ఆకాశానికి బంగారు పూత పూస్తున్నాడు. ముందుగా తనే పలుకరించింది. మూర్తి ఆమెలో మార్పును గమనించాడు. తనకోసం ఆమె కళ్లలో ఇదివరకటి మెరుపు లేదు. పశ్చాత్తాపం కూడా లేదు. తను ఎంచుకున్న దారి సరైందన్న నిశ్చయం, జీవితం కొత్తగా మొదలుపెట్టిన స్థిరత. “మనం మనవైన మార్గాల్లో సంతోషంగా సాగిపోగలమని నమ్ముతున్నా” అన్నది.

“అవును నిజమే… మనవైన మార్గాల్లో” ఒప్పుకుంటూ తలూపాడు. అది రాజీ కాదు, ఒక నిజాన్ని మన్నించడం. అతనికి మనసులో భారం తొలగినట్టయింది. ఇప్పుడామెకి తనో అపరిచితుడు. చాలాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు.

సంధ్యారుణ నారింజ కాంతిలో ఆమె ముఖం పచ్చగా మెరిసిపోవడం చూశాడు. ప్రతి రెండు నిమిషాలకు ఒక ట్రెయిన్ వచ్చి వెళుతోంది. వాళ్ళు ఎక్కాల్సిన రైళ్లు వేరు, గమ్యాలు వేర్వేరు. ఇకపై వాళ్ళ జీవితాలు విడివిడి బంధాల్లో ముడిపడి సాగిపోతయి. ప్రస్తుత ఎడబాటులో పశ్చాత్తాపం లేదు. ప్రేమంటే పంచేది.. స్వాధీనత కాదు.

“ఇంక వెళతాను” అన్నదామె. రైలు స్టేషన్‌లోకి వొచ్చింది.

వాళ్ళ నడుమ గాలి పావురాల గుంపులా చెదరిపోయింది. ట్రెయిన్ డోర్లు తెరుచుకున్నయి. లోనికి వెళ్లేముందు ఓసారి విమల తలతిప్పి చూసింది. ఆచూపులో వ్యామోహం లేదు, కేవలం కృతజ్ఞత. “జాగ్రత్తగా… సంతోషంగా ఉండు” అంది. మూర్తి అప్రయత్నంగా నవ్వి “నువ్వు కూడా” అన్నాడు మనస్ఫూర్తిగా.

ద్వారాలు మూసుకుని ఆమె రూపం కనుమరుగైంది. ప్లాటుఫారం మీద అలాగే నిలబడిపోయాడు. ఒంటరిగా అనిపించలేదు.

కొత్త నేలలో కొత్తగా మొలకెత్తి ఊపిరి పోసుకున్నట్టు. కొన్ని బంధాలు విడిచిపెట్టడం కూడా నేర్పిస్తాయి.

నిజానికి విమల ఎప్పుడూ తనది కాదు. ఆమె ఇప్పుడున్న స్థానంలో సరిగ్గా ఉంది పాత జ్ఞాపకమైపోతూ.

                                           ***

రాత్రి తొమ్మిదవుతుంటే మూర్తి ఇల్లు చేరాడు. తలుపుతీసి మౌనంగా వెనుదిరిగింది భార్య. అతడామెతో మాటలు మానేశాడు.

పిల్లలు నిద్రలో ఉన్నారు. ఆ వన్ బై టూ పోర్షన్లో కర్టెన్ ఇవతలవైపు నిశ్శబ్దమైంది. మూర్తికి భోజనం చెయ్యాలనిపించలేదు. కుర్చీలో కూలబడి అలసటగా కళ్ళు మూసుకున్నాడు. మనసు భార్య ఫోటోల మీదికి పోయింది. ఆమె నవ్వులు, ఆనందం. ద్రోహం చేసిందని భావించాడు. వివరించబోయింది. తను వినలేదు.  

జేబులోంచి ఫోన్ తీసి ఫోటో గ్యాలరీ ఓపెన్ చేశాడు. తను విమలతో కలిసివున్న జ్ఞాపకాలు. సన్నిహితంగా, ఆనందంగా.

బాధగా నిట్టూర్చాడు. భార్యది గతం. విమలతో తన బంధం వర్తమానం, ద్రోహం. భార్యకు గతం తప్పయితే.. భర్తకు వర్తమానం ఉండొచ్చా? కర్టెన్ దాటుకొని లోపలికి వెళ్లాడు. భార్య పడుకొని ఉన్నది. నిలబడి అలాగే తదేకంగా చూశాడు.

కళ్ళు తెరుస్తూ అన్నదామె. “నాతో చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా?”  

ఆమాట కొరడాతో కొట్టినట్టయింది. “నీ మీద నింద వేయడం తొందరపాటు” మెల్లగా అన్నాడు.

ఆమె ఆశ్చర్యపోయి చూసింది.

“ఆ ఫోటోలు నువ్వు దాటివచ్చిన గతం”

“ఇప్పుడదంతా ఎందుకు?”

“కాదు, అవసరం. నిన్ను గౌరవించకుండా ప్రేమించలేనని అర్థమైంది”

ఒక కవరు చేతిలో పెట్టాడు. తెరచిచూసింది. తన ఫోటోలు.

“సాక్ష్యాలు, రుజువులు కోరిన బంధం, నిజంగా బంధమా అనిపిస్తుంది”

ఆశ్చర్యంగానే తలూపింది. వాటిని పడేసి అగ్గిపుల్ల వెలిగించింది. అవి కాలిపోతుంటే కొద్దిసేపు వాటివైపే చూసింది. 

ఆపైన తన గతం గురించి వివరించింది.

“మన పెళ్ళికంటే ముందు మేనత్త కొడుకుతో నాపెళ్లి నిశ్చయించారు. మేమూ ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఒక విషయంలో తలెత్తిన గొడవ మా రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. దాంతో పెళ్లి ఆగిపోయింది. సంబంధాలు పూర్తిగా తెగిపోయినయి. ఆ తర్వాత బావకి పెళ్ళయిందని, పిల్లలున్నారని చాలారోజులకి తెలిసింది. అతడు ఇప్పడు  ఎక్కడున్నాడో తెలియదు. ఎందుకంటే బావకంటే ముందే మన పెళ్లయింది. ఇది మీతో చెప్పాలనుకున్నాను. కానీ కేరెక్టర్ లేనిదాన్నని అప్పటికే నిర్ణయించిన మీరు నమ్మరని తెలిసి మౌనం వహించాను. ఇది కావాలని దాచిన రహస్యం కాదు, జరిగిన తప్పేమీ లేదు. బావతో కలిసి దిగిన ఆ ఫోటోలు అట్లా ఉండిపోయాయి అంతే.  నా జీవితంలో అదో ముగిసిన అధ్యాయం. మీరు దాన్ని ‘ఇప్పటి ద్రోహం’గా తర్జుమా చేసుకున్నారు. అందుకే దేన్నీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదని కూడా నమ్మాను.  

మూర్తి తలదించుకొని ఫోన్ ఓపెన్ చేసి చూపించాడు. విమలతో ఉన్న చాట్,కాల్స్, ఫోటోలు అన్నీ.

“ఇది నా ఇప్పటి ద్రోహం” అన్నాడు. అతని గొంతు వణికింది.

“ఎంతకాలం నుంచి?”

“మనపెళ్లికి ముందే మేం ప్రేమించుకున్నాం. తర్వాత కూడా కొనసాగింది”

ఆమె కళ్లలోకి నీటితెర వచ్చింది.“దీనికి మీరిచ్చుకునే తీర్పు ఏమిటి?” అడిగింది.

తట్టుకోలేని ప్రశ్న. అతనివద్ద సమాధానం లేకపోయింది.   

“దేవుణ్ణి ముందుపెట్టి నన్ను శీలపరీక్ష కోరారు”

“అవును, అప్పుడు కోపంలో, కానీ ఇప్పుడు…” మాట తడబడింది.

మూర్తి తనను శోధించుకున్నాడు. భార్య గతం గురించి తను తీసుకున్న హక్కు, ఆమె నడవడి మీద తీర్పు. మరి తన గతంపై తీర్పు చెప్పే హక్కు ఆమెకు లేదా? చాలాకాలంగా కేరెక్టర్ పరంగా దోషిగానే గడిపాడు. 

“గతం తన స్థానంలో సరిగానే ఉంటుంది. దాన్నక్కడే వదిలేసి ముందుకు సాగిపోతేనే మంచిది” అందామె.

“నిజమే, మనం మన స్థానాల్లో ఉండాలి” మూర్తి అన్నాడు. ఫోన్ తెరచి ఫోటోలు డీలిట్ చేశాడు. సిగరెట్ ప్యాకెట్లోంచి ఒక్కో సిగరెట్‌ తీసి మంటలో వేశాడు. “ఎందుకలా?” వెనక నుంచి అడిగింది.

“పాతవన్నీ కొద్దికొద్దిగా… ఒక్కొక్కటిగా”

ఆమె ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వులో వెక్కిరింపు లేదు.

దూరంగా రైలు బయలుదేరుతున్న శబ్దం. ఆచిన్న గదిలో కొత్త ప్రయాణం నిశ్శబ్దంగా మొదలైంది.

చాలా రోజుల తర్వాత అతడు భార్య పక్కన ప్రశాంతంగా నిద్రపోయాడు.

***

డాక్టర్.ఎ. ఎం. అయోధ్యా రెడ్డి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *