తెలుగు టీచరుకు నేనంటే కోపం

Spread the love

మాఊరి హైస్కూల్. ఎండకాలపు ఒంటిపూట బడి నడుస్తుంది.  

ఇంగ్లీషు పీరియడ్ అప్పుడే ముగిసింది. అలా గంట కొట్టారో లేదో తెలుగు టీచర్ క్లాసులోకి వొచ్చాడు. పొట్టిగా.. లావుగా వడ్లకల్లంలో నింపిపెట్టిన గోనె సంచి మాదిరుంటడు. ముఖం మీద మానిన గాయాల మచ్చలు. వయసును తగ్గించుకునే తాపత్రయంలో షోకులెక్కువ. కోపం కూడా చాలా ఎక్కువే. బూడిద రంగు జీన్ పాంటు మీద తెల్లటి లాల్చీ వేశాడు. ఎడమచేతిలో ఓ రెండు పుస్తకాలు, కుడిచేతిలో బెత్తెం. టెన్త్ క్లాసు పిల్లలకు తెలుగు పాఠం చెప్పే టీచరుకు బెత్తెం ఎందుకో అర్థంగాదు. కానీ చేతిలో బెత్తెం లేకుండా ఆయనెప్పుడూ క్లాసుకు రాడు. ముగ్గురు చొప్పున కూర్చునే బెంచీలు క్లాసురూంలో రెండు వైపులా ఉన్నయి.

కుడివైపు ముందు బెంచీలో నేను కూర్చునున్నాను. టీచర్ క్లాసులోకి రాగానే అంతా లేచి నిలబడ్డారు. అలవాటు ప్రకారం ఆయన “స్టాండప్” అని అరిచి ఓసారి క్లాసంతా చూశాడు. పిల్లలైతే నించున్నారు, కానీ వాళ్ళ గుసగుసలు ఆపలేదు.

అందుకే “సైలెన్స్” అన్నాడు మరోసారి గట్టిగా. దాంతో అందరి నోర్లు టక్కున మూతపడ్డయి.

తెలుగు టీచరంటే పిల్లలకు హడల్. తెలుగే కదా ఏముందని ఒక్కపూట క్లాసెగ్గొట్టినా మర్నాడు ఆ విద్యార్థికి గండమే. కొత్త కొత్త శిక్షలు అమలు చేసి చుక్కలు చూపిస్తడు.   

“స్టాండప్ అంటే నిలబడి ముచ్చట్లు పెట్టుడు కాదు. అంతా సైలెంట్ అయిపోవాలి తెలిసిందా? సరే, ఇంక కూర్చోని చావండి” అన్నాడు.

తర్వాత అటెండెన్స్ రిజిస్టరు చేతిలోకి తీసుకున్న ఆయన చూపులు నామీద పడ్డయి. వెంటనే నొసలు ముడేసి కటువుగా అన్నాడు.

“ఆడపోరీలు ముందు బెంచీల్లో కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాను? వొళ్ళు బలిసింది మీకు. పైగా పెద్దకులం.. చిన్నకులం, ఎక్కువ తక్కువలేం లేవా? ఒకే క్లాసులో చదివినంత మాత్రాన అందరు సమానమనుకుంటే యెట్లా? తక్కువోళ్లు తక్కువోళ్ళే… ఎక్కువోళ్లు ఎక్కువోళ్ళే. వెళ్ళి వెనుక బెంచీల్లో ఏడవండి”

ఆడపిల్లలు అందరు బెదిరిపోయి వెనక్కెళ్లి కూర్చున్నాం. ఆరోజు క్లాసుకు ఎగ్గొట్టిన విద్యార్థుల్ని తిడుతూనే అటెండెన్స్ పూర్తిచేశాడు. తర్వాత చాక్ పీస్ అందుకొని బ్లాకుబోర్డు మీద “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” అని రాసి అండర్ లైన్ చేశాడు. దానికిందే  ‘స్త్రీస్వేచ్ఛ- సాధికారత’ అని కూడా రాశాడు.  

ఆ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా టెన్త్ పిల్లలకు ప్రత్యేకంగా పాఠం చెప్పాలని ఆయన సిద్ధమై వొచ్చినట్టున్నడు.   

“స్త్రీ అంటే ఎవరు?” అని ప్రారంభించాడు. “స్త్రీ అంటే సమస్త సృష్టికి మూలం, స్త్రీ అంటే ఒక మాతృమూర్తి. ఒకరి జీవితంలో వెలుగులు నింపే భాగస్వామి, ఒక సోదరీమణి, ఒక స్నేహితురాలు. వీటన్నిటిని మించి స్త్రీ ఆదిపరాశక్తి. ఈలోకంలో మహిళను మించిన పాఠశాల మరొకటి లేదు. మహిళ ఒక పవిత్ర గ్రంథం. సమస్త మానవాళికి వెన్నెముక. అలాంటి మహోన్నతురాలు నేటి పురుషాధిక్య సమాజంలో అవమానాలకు అణచివేతకు గురికావడం మనం చూస్తున్నాం. పురుషుడు దౌర్జన్యంగా ఆమె ఆశల్ని వమ్ము చేస్తున్నాడు. ఆమెను గౌరవించడం, అన్నిరంగాల్లో  ప్రోత్సహించడం సామాజిక ధర్మం. అప్పుడే లింగవివక్ష లేని సమ సమాజ మేర్పడుతుంది.

ఈ ప్రపంచంలో సహనం, కరుణ, నిజమైన ప్రేమానురాగాలకు నిర్వచనం మహిళ. ఆమె తర్వాత రెండోస్థానం ఎవరంటే మళ్ళీ ఆమెనే. ఇట్లా ఎన్నిసార్లు  ప్రశ్నించుకున్నా సమాధానం స్త్రీనే. ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా మీకో గొప్ప విషయం చెపుతున్నా.  భూమ్మీద పూజకు మొట్టమొదటి అర్హత దేవుడి దనుకుంటే తర్వాత అర్హతలన్నీ మహిళవే…”

ఎంత గొప్పగా చెపుతున్నాడు? వినేవాళ్ళు మంత్రముగ్ధులు కావాల్సిందే. తెలుగు సార్ మంచి మాటకారని తెలుసు. దానికితోడు ఇప్పుడు ఆవేశంతో హావభావాలతో ఊగిపోతున్నాడు. ఎవరికైనా మాటలకూ, చేతలకూ పొంతన అక్కర్లేదనుకుంటే ఎంతైనా చెప్పొచ్చనిపించింది.

ఇంతలో వెనుక బెంచీల్లోంచి ఎవరో విద్యార్థి గట్టిగా అరిచాడు-

“సార్.. శేషుగాడు ఒంటికి పోవాలంట, చాలా అర్జంటు. వెంటనే వాణ్ణి బయటికి పంపండి సార్”

తెలుగు టీచర్ ప్రసంగానికి బ్రేక్ పడింది.

“ఎవడ్రా అది.. బలిసిందా?” అని కోపంగా క్లాసంతా కలియచూశాడు. పిల్లలు తలొంచుకున్నరు. ఆ మాట ఎవరన్నదీ తెలియలేదు.  

“సార్.. శేషుగాడు మూత్రానికి పోవాలి. మిమ్మల్ని అడిగేందుకు భయపడుతుండు. పాపం.. కష్టమ్మీద ఆపుకుంటుండు సార్” మళ్ళీ అన్నారెవరో. క్లాసు ఒక్కసారిగా గొల్లుమంది. పిల్లలు చేతులతో బెంచీలమీద కొడుతూ నవ్వారు.  

“సైలెన్స్…! ఎవడ్రా ఆ అడ్డగాడిద? బొక్కలిరుగుతయి. నోర్మూసుకొని పాఠం వినండి” 

“ప్లీజ్ సార్… శేషుగాణ్ణి వెంటనే పంపించండి. లేదంటే వాడు ఇక్కడే లాగులో పోసుకుంటడు” 

టీచర్ కోపంతో బెత్తెం చేతిలోకి తీసుకున్నాడు. ఎవడి వీపు పగులుతుందోని క్లాసు సైలెంటైపోయింది.

కానీ వెనుక నుంచి అల్లరి విద్యార్థి ఊరుకోలేదు.

“అమ్మతోడు సార్! శేషుగాడు అర్జంటుగా ఒంటికి పోవాలె. పాపం.. ఇప్పటికే వాడి లాగు తడిసింది” 

కోపాన్ని అతి కష్టంమీద అణచుకుంటూ శేషును వెళ్ళమని పర్మిషన్ ఇచ్చాడు.  

“పోరా వెధవా… అయిదు నిమిషాల్లో తిరిగి రాకుంటే వీపు చీరేస్తా” అన్నాడు.   

తను పాఠం చెపుతున్నప్పుడు ఎవరు ఎదడిగినా ఆయనకు చిర్రెత్తుతుంది. ఇలాంటివి అడిగితే ఇంకా కోపం. ఇక అదే ఆడపిల్లలు అడిగితే మరింత రెచ్చిపోతాడు. విద్యార్థినులపై ఎందుకో ఆకారణమైన ద్వేషం. సందు దొరికితే మాటల్తో హింసిస్తాడు. వాళ్లపైన జోకులేయడం, వెటకారంగా మాట్లాడ్డం, అందర్లో అవమానించడం… ఆయనకు అదేదో కసి. వాస్తవానికి తెలుగు టీచరువల్ల అందరికంటే ఎక్కువ అవమానాల పాలైంది నేనే.

ఆయన పాఠం మళ్లా ప్రారంభించాడు. ఈరోజు క్లాసును పూర్తిగా మహిళా దినోత్సవానికే అంకితం చేసినట్టున్నాడు.   

నాకు ఉన్నట్టుండి చిన్నగా పొత్తికడుపులో నొప్పి మొదలైంది. అది అంతకంతకు పెరిగింది.  

అర్జంటుగా మూత్రానికి వెళ్ళిరావాలి. కానీ సాధ్యపడదు. ఇది మామూలు సమస్య కావొచ్చు, కానీ స్కూల్లో ఆడపిల్లలకు అదో తీవ్రమైన సమస్య. నేటి రోజుల్లోనూ ఒక హైస్కూల్లో పిల్లల కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం మరుగుదొడ్లు లేవంటే ఆశ్చర్యమే అయినా ఇది నిజం. పైగా మా క్లాసులో ఇప్పుడున్నది తెలుగు టీచర్. పర్మిషన్ అడిగితే రెచ్చిపోయి తిట్టిపోస్తాడు.  

ఒకవేళ వెళ్ళమని పర్మిషన్ ఇచ్చినా పోలేని పరిస్థితి. ఎంత అవస్థయినా భరిస్తారు కానీ ఆడపిల్లలెవరూ బయటికి వెళ్లరు. బయట ఆవరణంతా ఓపెన్ యేరియానే. టాయిలెట్లు లేవు. అప్పుడెప్పుడో కాంపౌండులో రెండు టాయిలెట్లు కట్టారు. కానీ వాటిల్లో ఒకటి టీచర్లే వాడుకుంటారు. విద్యార్థులు అందులోకి పోకుండా తాళమేసి ఉంచుతారు.

రెండో టాయిలెట్ పూర్తిగా శిథిలావస్థకు చేరి చాన్నాళ్ళయింది. తలుపులు విరిగి, గోడలో అక్కడక్కడ ఇటుకలు ఊడిపోయి పెద్దపెద్ద కన్నాలు పడ్డయి. చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు. అటువైపు వెళ్లాలంటే అమ్మాయిలు భయపడతారు.   

ఈ విషయం హెడ్మాస్టరుతో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫండ్స్ లేవని ఒకేమాట చెపుతాడు.   

ఆడపిల్లలకు ఎదురయ్యే ఈసమస్యను అర్థం చేసుకునేవాళ్లు లేరు. నేను ఈ స్కూల్లో చేరి నాలుగేళ్లయింది. అంతక్రితం నుంచీ ఈ సమస్య ఉందని తెలిసింది. పిల్లలకు కనీస మరుగుదొడ్లు కూడా లేని స్కూళ్ళు నేటికీ ఉండటం చిత్రమనిపిస్తుంది.  

నాకైతే ఈ సమస్య వల్ల ప్రతిరోజూ బడికి ఎగ్గొట్టాలనిపిస్తుంది. కానీ చదువుతున్నది పదో తరగతి. క్లాసులు వినకపోతే కష్టమని రావడం.

ఇది బయటికి చెప్పుకోలేనిది. చెప్పినా తేలిగ్గా తీసుకుంటారు. మా ఇంట్లో చెప్పినప్పుడు అసలిది సమస్యనే కాదని అన్నారు. కానీ అనుభవిస్తున్న మాకు తెలుస్తుంది బాధలేమిటో.

అమ్మాయిల్ని ఈ సమస్య ఎంతగా భయపెడుతుందంటే స్కూలుకి సెలవొస్తే సంబరపడిపోయే పరిస్థితి. నేనైతే చిన్న సాకు దొరికితే  

దాన్ని అడ్డం పెట్టుకొని స్కూలు ఎగ్గొడుతుంటాను. దీనివల్ల చదువులో వెనుకబడ్డాను. అంతేకాదు, ప్రతిరోజు ఈ అవస్థ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నయి. నాకేకాదు, ఇక్కడ చదివే ఆడపిల్ల లందరికి.    

తెలుగు సార్ ప్రవాహంలా పాఠం చెపుతున్నాడు. ఆయన ఆమాటలేవీ చెవులకు ఎక్కడం లేదు. నా ధ్యాసంతా వేరేగా ఉంది.

చెప్పుకోలేని యాతనతో అల్లాడుతున్నాను. అర్జంటుగా బయటికి వెళ్ళాలి. అవస్థ భరించలేను. కానీ..?

టీచరును అడిగితే అందరిలో పరువు తీస్తాడు. క్లాసంతా నన్నే చూస్తుంది. పోనీ అవమానం భరించి బయటకు వెళ్ళినా కూడా ఎక్కడా చోటు లేదు. ఇంటికి వెళ్లలేను, చాలా దూరం. వెళ్ళితే మళ్ళీ రావడం కష్టం. ఇప్పుడేమిటి దిక్కు?

మెదడు పనిచేయట్లేదు. కాలుమీద కాలు మడతేసుకొని ఒక్కొక్క నిమిషం నరకం కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా తరచూ నా ఒంట్లో అలసటగా ఉంటుంది. అప్పుడప్పుడు తల తిరుగుతుంది. కళ్ళు బైర్లు కమ్ముతయి. పొత్తికడుపులో మెలిపెట్టినట్టు నొప్పి వస్తుంటది. రోజూ ఎన్నో గంటలపాటు మూత్రానికి వెళ్ళకుండా ఆపుకోవడం, దానివల్ల ఏవైనా ఇన్ఫెక్షన్లు కారణం కావొచ్చనిపిస్తుంది.  

బెంచీమీద కుదురుగా కూర్చోలేకపోతున్నా. తక్షణం క్లాసులోంచి పారిపోయి బాధ నుంచి విముక్తి పొందాలని ఉంది.

కానీ ఎక్కడికి? బయటంతా బహిరంగమే.

అప్పటికీ స్కూల్లో టాయిలెట్ వొస్తే కష్టమని పొద్దున ఎక్కువ మంచినీళ్లు తాగకుండా జాగ్రత్త పడుతుంటాను. లెక్కలోకి తీసుకోరుగానీ ఎక్కువమంది ఆడపిల్లలు స్కూలు డ్రాపౌట్ కావడానికి ఇదీ ఒక కారణమే. వింటే సమస్య చిన్నదనిపిస్తుంది. కానీ అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది తీవ్రత. నాకు నిప్పుల మీద కూర్చున్నట్టుంది. కాలం తాబేలు మాదిరి నడుస్తోంది. ఒక్కో నిమిషం యుగంలా ఉంది. పదేపదే కూర్చున్న పొజీషన్ మార్చుకుంటూ సతమతమై పోతున్నా.  

హఠాత్తుగా నా వెనుక బెంచీ నుంచి ఒక విద్యార్థి బిగ్గరగా అరిచాడు.

“సార్.. యశోదకు టాయిలెట్ వొస్తోంది. ఆమెని వెంటనే బయటికి పంపించండి… ” 

క్లాసు మళ్ళీ నవ్వులతో మార్మోగింది. తెలుగు సార్ విద్యార్థుల్ని మింగేటట్టు చూశాడు. కానీ ఆ మాటన్నది ఎవరో గుర్తించలేక పోయాడు.   

“యశోద మూత్రానికి పోవాలి సార్..! పర్మిషన్ అడిగేందుకు సిగ్గుపడుతోంది” మళ్ళా అదే గొంతు.

“రాస్కెల్.. ఎవడ్రా అది? అట్లా చెప్పడానికి సిగ్గులేదా”  

“సిగ్గెందుకు సార్? ఆ పిల్ల బెంచీలో సరిగా కూర్చోలేకపోతుంది. వెంటనే పంపించండి”

నా తల వాలిపోయింది. అందరిలో ఎదురైన అవమానానికి ఏడుపొచ్చింది. అయితే అల్లరిగా అయినా ఆ విద్యార్థి వాస్తవం చెప్పాడనిపించింది. అప్పటి నా పరిస్థితి అదే. అర్జంటుగా వెళ్ళాలి. మా క్లాసులో నాతో కలిపి మొత్తం ఐదుగురు ఆడపిల్లలం. నా ఖర్మ ఏంటో ఈ సమస్య నాకే ఎక్కువసార్లు వొస్తుంది.    

“సార్.. యశోదకు అర్జంటు సార్…. పంపించండి ప్లీజ్” వాడు మళ్ళీ అరిచాడు.   

టీచర్ అతన్ని కనిపెట్టాడు. పట్టరాని కోపంతో ఊగిపోయి ఒక్క అంగలో వెళ్ళి వాడి జుట్టు పట్టుకున్నాడు

“నా కొడకా.. నువ్వీరోజు నాచేతిలో అయిపోయావురా. నిన్నిక్కడే చంపేసి బొందపెడతా”

ఆయన భాష అదుపుతప్పింది. తనో ఉపాధ్యాయుడనే సంగతి మరిచి బూతులతో రెచ్చిపోయాడు. విద్యార్థి జుట్టుపట్టుకొని చెంపల మీద పటాపటా కొట్టాడు. రెండు చెవులు గట్టిగా మెలితిప్పాడు. ఇంకా కోపం చల్లారక బెంచెక్కి నిలబడమని ఆదేశించాడు.

ఆ తర్వాత నన్ను కాల్చేసేలా చూస్తూ కరుకుదనం గొంతులోకి తెచ్చుకున్నాడు.

“ఏమే.. ఎద్దులా ఎదిగావు, సిగ్గులేదా? ఆడపిల్లవి కదా.. ఎంత పద్ధతిగా ఉండాలి? మగపోరల మాదిరి నువ్వు కూడా మూత్రానికి పోతానంటే ఎట్లా? స్కూలుకు వొచ్చే ముందే ఇలాంటివి ఇంటివద్ద పూర్తిచేసుకొని రావాలనే సోయి లేదా?”

క్లాసులో అందరి చూపులు నామీదే ఉన్నయి. సిగ్గుతో తక్షణం ఏదైనా బావిలో దూకాలనిపించింది.

“వెళ్లిపోవే దరిద్రురాలా.. ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? త్వరగా పోయి చావు” చీదరింపుగా అన్నాడు.  

అయినా బెంచీలో నుంచి లేవలేదు, కదలకుండా అట్లాగే ఉన్నాను.

తను వెళ్ళకపోవడం చూసి ఆయన ఇంకా ఆగ్రహించాడు. ఆడపిల్లని అనకూడని మరో రెండు మాటలు తిట్టి, అప్పటికీ కోపం తీరక నన్ను కూడా బెంచీ ఎక్కి నిల్చోమన్నాడు. అవమానంతో నా మెదడు మొద్దుబారింది. ఉన్నచోటే భూమిలోకి కుంగిపోవాలని భావించాను.

కష్టంమ్మీద బెంచి ఎక్కి నిలబడ్డాను. నా గుండెలకు ఆనుకునేంతగా తల దించుకున్నా. క్లాసులో దిష్టిబొమ్మలా అలాగే ఉండిపోయాను.

ఇంత జరిగినా టాయిలెట్ కోసం బయటికి వెళ్లలేదు.  

సార్ పాఠం మానేసి నన్ను మాటలతో చిత్రహింస మొదలుపెట్టాడు.  

“కుమారి యశోదగారూ…” అన్నాడు ఎగతాళిగా. “క్లాసులో ఇతర ఆడపిల్లలకు లేని మూత్ర సమస్య పదేపదే నీకే ఎందుకొస్తుందో చెపుతావా? ఇది నీకు సిగ్గనిపించదా? స్కూలు కొచ్చేది చదువుకోడానికా లేక ఇందుకోసమా? అసలు నీలాంటి వాళ్ళకు స్కూలెందుకు? చదువులెందుకు? ఇంటి దగ్గరే ఉంటే హాయిగా ఎప్పుడుపడితే అప్పుడు బాత్రూం పోవచ్చు గదా”

మిగతా అమ్మాయిలు బిక్కుబిక్కుమని చూస్తున్నారు.  

“ఇవాళ మహిళా దినోత్సవం గనుక సహిస్తున్నా. మీరు భావి మహిళామూర్తులుగా ఉత్తమ నడవడి నేర్చుకోండి. ఇలాగైతే సాధికారత ఏం  సాధిస్తారు?” అక్కడ అప్పుడున్న సందర్భానికి, తన మాటలకు ఎలాంటి పొంతన లేకుండా అన్నాడు.     

“సార్..! యశోద నిలబడలేకపోతుంది. ముందు ఆమెను బయటికి పంపించండి” బెంచీ ఎక్కిన విద్యార్థి అల్లరిగా అన్నాడు.

టీచరు విసురుగా వాడి దగ్గరకెళ్ళి బెత్తెంతో ఎడాపెడా బాదాడు. అంతటితో ఆగకుండా నన్ను చూస్తూ “ఏమే సిగ్గులేనిదానా! బయటికి  పొమ్మంటే పోకుండా ఈ నఖరాలేందీ? లేదంటే మీ ఇంటికి వెళ్లిపో. నాకండ్ల ముందు కనిపిస్తే చీరేస్తా” అంటూ బెత్తెంతో నన్నూ కొట్టాడు. పదోక్లాసు బాలికను అట్లా కొట్టడం, ఒకపక్క మహిళా దినోత్సవమని పాఠం చెపుతూ ఆడపిల్లని అంతలా అవమానించడం ఆయనకు ఎందుకో తప్పుగా అనిపించలేదు. నిశ్శబ్దంగా ఆ దెబ్బలు భరించాను. తెలుగు టీచరుకు నేనంటే ప్రత్యేకమైన కోపమని తెలుసు. చిన్న అవకాశం దొరికినా హింసిస్తునే ఉంటాడు.    

“అమ్మాయిలంటే ఎంత హుందాగా ఉండాలి? ఇట్లా సిగ్గులేకుండా ఉంటారా? ఆడపిల్లననే సంగతే మర్చిపోవడం అసహ్యం వేస్తుంది. ఇది చాలా చిన్న సమస్య. కాస్సేపు దీన్నే భరించకుంటే భవిష్యత్తులో ఏం చెయ్యగలవు? ఓపక్క సాధికారత కోరుకుంటరు. అన్నిట్లో పురుషునితో సమానమని చెపుతరు. హక్కులు కావాలంటరు. అసలు ఆడపిల్లలు ఎట్లుండాలి? వినయం విధేయత ఉట్టిపడాలి. ఉండి లేనట్టుగా మసులుకోవాలి” అస్సలు సంబంధం లేకుండా, అసంబద్ధంగా మాట్లాడుతున్న స్పృహలేక రెచ్చిపోతున్న తెలుగు టీచరు  బయట గంట కొట్టడం వినిపించి టక్కున ఆపేశాడు.

ఆయన క్లాసులోంచి వెళుతూ నావైపు కాల్చేసేలా చూశాడు. బెంచీ దిగమని కూడా చెప్పకుండా బయటికి నడిచాడు.  

ఈరోజు నాకు జరిగిన అవమానం బాధించినా ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే స్కూల్లో రోజూ ఏదో క్లాసులో ఈరకం ఘటనలు జరుగుతునే ఉంటయి. తెలుగు టీచరు ధోరణి ఇంకొంచెం అతిగాఉంటుంది. కోపంతో అరిచే ఆయన మచ్చలు పడిన ముఖం గుర్తొచ్చి ఆ స్థితిలోనూ నవ్వొచ్చింది.

ఆ మచ్చల వెనుక చిన్నపాటి కథే ఉంది. అది నాకు మాత్రమే తెలుసు. చాన్నాళ్లక్రితం ఒకసారి ఎవరూలేని సమయంలో లైబ్రరీ గదిలో నన్ను బలవంతం చేశాడు. నేనేం బెదిరిపోలేదు, తిరగబడ్డాను. ముఖం పచ్చడి కింద కొట్టేద్దామనుకుంటే కుదర్లేదు. కానీ చేతులతో రక్కి రక్తసిక్తం చేశాను. దాని ఫలితమే ముఖంపైన మచ్చలు.

బహుశా అప్పట్నుంచే నామీద పగ పెంచుకున్నాడు. నేరుగా ఏంచెయ్యలేక అవకాశం దొరికితే అవమానిస్తాడు.

ఈ రోజు అసభ్యంగా తిట్టి, బెంచీ ఎక్కించి, బెత్తెంతో కొట్టి కొంతవరకు కసి తీర్చుకున్నాడు.

కానీ నాకు అర్థంకానిది ఒక్కటే. ఈ ధోరణితో ఏం సాధిస్తాడు. నామీద కోపం ఉండొచ్చు. కానీ మిగతా అమ్మాయిల మీద ఎందుకు ద్వేషం? వాళ్ళేం చేశారు? స్కూల్లో టాయిలెట్ల సమస్య వాస్తవంగా ఉన్నదే గదా?

భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కావొచ్చు లేదా కాకపోవొచ్చు.

కానీ తెలుగు టీచరుకు నా మీద కోపం ఆయనో, నేనో ఈ స్కూలు నుంచి వెళ్ళిపోయేవరకూ ఉంటుందేమో.

ఏమైనప్పటికీ నేను తెలుగు టీచర్ని క్షమించాలనే నిర్ణయించుకున్నా.  

డాక్టర్.ఎ. ఎం. అయోధ్యా రెడ్డి

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. నలభై యేళ్లుగా హైదరాబాదులో నివాసం. పొలిటికల్ సైన్సులో ఎమ్మె, పిహెచ్.డి చేశారు.1983లో పత్రికా రంగంలో ప్రవేశించారు. ‘ఉదయం’ దినపత్రికలో సబ్ ఎడిటరుగా మొదలైన జర్నలిస్టు ప్రయాణం, మూడున్నర దశాబ్దాలు కొనసాగి ‘దక్కన్ క్రానికల్’ సంస్థలో న్యూస్ ఎడిటరుగా పదవీ విరమణ.
పఠనాభిలాశ తనకు ఆకలి కంటే తీవ్రమైందని చెప్పుకునే వీరు, స్కూలు రోజుల్నుంచీ పుస్తక పఠనం పట్ల ప్రాణంగా ఉన్నారు. సాహిత్యం విస్తృతంగా చదివారు. కాలేజీ రోజుల్లోనే రచన చేపట్టి కథా, అనువాద సృజన చేస్తున్నారు. ఇప్పటివరకు70కి పైగా కథలు, ఒక నవల రాశారు. 50 వరకు వివిధ దేశాల ఉత్తమ కథలను, ఒక ఆఫ్రికన్ నవలను అనువదించారు.
‘సమకాలీన రాజకీయాలు తెలుగు సాహిత్యం’ అనే వ్యాస గ్రంథం; ‘ఆహారయాత్ర’, ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్’, ‘సీతంబాయి పొలం’ అనే మూడు కథా సంపుటాలు తెచ్చారు. సుప్రసిద్ధ ఆఫ్రికన్ రచయిత గుగివా థియాంగో రాసిన ‘వీప్ నాట్ ఛైల్డ్’ నవలను ‘ఏడవకు బిడ్డా’ పేరుతో అనువదించి వెలువరించారు. ప్రపంచ దిగ్గజ రచయితల ఇరవై క్లాసిక్ కథల అనువాద సంపుటి ‘కథాసంగమం’ అన్విక్షికి ప్రచురించింది. అరబిక్ దేశాలకు చెందిన 20 ఉత్తమ కథల అనువాద సంపుటి “అరబ్ షాట్స్” ప్రస్తుతం ప్రచురణ దశలో ఉంది.
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, సాహితిగౌతమి అవార్డు, పాకాల యశోదారెడ్డి, మాడభూషి రంగాచార్య, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ తదితర పురస్కారాలు పొందారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *